Friday, February 16, 2007

e-బ్లాగర్ 'సమ'ఆవేశం

మన ఈ తెలుగు సమావేశానికి హాజరవడం ఈ నెలలో నేను సాధించిన ఘనకార్యం (achievments of the month) ఏదైనా ఉంటే ఇదేనేమో! క్రితంనెల సమావేశానికి వైరస్ వల్ల వేళ్ళలేకపోయాను. ఇప్పటిదాకా కనిపించకుండా చదివిస్తున్నహేమాహేమీలయిన బ్లాగ్వరులందరినీ కలవడం చాలా ఆనందం కలగచేసింది. ముఖ్యంగా అందరికన్నా అతి 'పిన్న' బ్లాగ్భీష్ముడు మన 'దీప్తిధార'కుడు శ్రీ రావు గారిని కలవడం. సమావేశం చాలా సరసంగా, ప్రయోజనకరంగా నడచింది. సుమారు మూడు గంటల తర్వాత సభ్యులు ఒకరొకరే బయలుదేరుతోంటే అప్పుడేనా, ఇంకాసేపు కూర్చొంటే బాగుంటుందనిపించింది. కానీ ఎంత మంచి అనుభూతికైనా ముక్తాయింపు తప్పదుగా! చదువరిగారు, తన బ్లాగులంతకాక పోయినా, రుచిగానే ఉన్న మిఠాయిలు తినిపించారు. 'వీవెన్' గారు తినలేదని ఇందుమూలంగా ధ్రువీకరించడమైనది. ఇప్పుడు, సమావేశంలో నే చూసిన బ్లాగర్ల బ్లాగులు చదువుతోంటే వాళ్ళగొంతుకల్లో వింటున్న భావన కలుగుతోంది.

మా చిన్నప్పటినుండీ బీమా ఏజెంటంటే జనాలు భయపడడం తెలుసు. నేను కూడా ఒకసారి ఒక ఏజెంట్ బారి నుండి తప్పించుకోవడానికి తెగ ప్రయత్నంచేయడం మరచిపోలేను. ఇప్పుడు నా బారినుండి తప్పించుకోవడానికి జనాలు తెగ ప్రయత్నిస్తున్నారని నా అంచనా. కనిపిస్తే చాలు తెలుగు బ్లాగులగురించీ, అంతర్జాలంలో తెలుగు గురించీ,తెలుగులో బ్లాగులు వ్రాయడం లోని ఆనందంగురించీ ఏకరువు పెడ్తోంటే ఆమాత్రం ప్రయత్నించడం సహజమేనేమో?

లోగోగురించికూడా కొద్దిగా చర్చజరిగింది. బహుశ: ఈసంఘంవాళ్ళు లోగోల కోసం ఒక ప్రకటన అన్ని తెలుగు ఆన్లైన్ పత్రికల్లోనూ విడుదలచేస్తే కొన్ని ఎక్కువ ఎంట్రీలొస్తాయేమో. మనం సంఘం రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాం కాబట్టి ఈ దిశగా కూడా ఒక అడుగు వేస్తే బాగుంటుంది. లోగోని కూడా రిజిష్టర్ చేయాల్సి ఉంటుందా?

చివరాఖరుగా, రావుగారి బ్లాగు చదివాను. సమావేశంలో నా హాజరీ గురించి, నాబ్లాగు గురించి 'ధారా'ళంగా వ్రాసినందుకు ధన్యవాదాలు. చిన్న వాడికి పెద్ద పరిచయం చేయడం బ్లాగ్సోదరుల పెద్దమనసుకి నిదర్శనం.

Thursday, February 08, 2007

ధర్మసందేహం - హైదరాబాదు ఎవరిది?

ఈవేళ టీవీ చూస్తోంటే తెలంగాణా ఉద్యోగులనాయకుడెవరో మాట్లాడుతూ హైదరాబాదులోపనిచేస్తున్న నాన్-లోకల్ ఉద్యోగులను వెంటనే పంపించేసి తెలంగాణా వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేసాడు. నాకో ధర్మసందేహం వచ్చింది. నాకు హైదరాబాదులో ఉన్న ప్రభుత్వోద్యోగాలను వివిధ ప్రాంతాల వారికి ఏరకంగా పంచుతారో తెలియదు. ఏదైనా నిష్పత్తి ఉందా? అలాంటిదేమైనా ఉంటే నాయకుల డిమాండు 'అధికంగా ఉన్న నాన్-లోకల్స్' ను పంపేయండి అని కదా ఉండాలి. అలా కాని పక్షంలో చాలా అపార్థాలకి, అనర్ధాలకీ దాయితీయవా ఇలాంటి డిమాండులు? సదరు నాయకుడు 'హైదరాబాదు ను తెలంగాణా నుండి విడదీసే ప్రయత్నాలను సహించమని' కూడా అన్నాడు. దీన్ని బట్టి నాకు అర్ధమయిందేమిటంటే, ఆ నాయకుడు మొత్తం నాన్-లోకల్స్ని బయటికి పంపాలనే ఉద్దేశ్యంలోనే ఉన్నాడని. ఇక్కడ రెండు విషయాలలో తెలంగాణా నాయకుల ధోరణి నాకు అసమంజసం అనిపిస్తోంది. ౧. కష్టమో, నష్టమో అ న్నిప్రాంతాల వాళ్ళం ఇప్పటిదాకా కలిసే ఉన్నాము. కలిసే ముఖ్యపట్టణాన్ని అభివృద్ధి చేసాము. ఉమ్మడికుటుంబాల్లో లాగానే ఏ ప్రాంతాలవాళ్ళు ఎంత చేసారో చెప్పడం, ఎవరు ఎక్కువ చేసారో విశ్లేషించడం అనవసరం, అధర్మం. ఉమ్మడి కుటుంబం విడిపోయినప్పుడు ఆ సమయంలో ఉన్న ఉమ్మడి ఆస్తులని పంచుకోవడం రివాజు. కాని హైదరాబాదు ఉమ్మడి ఆస్తికాదన్నట్లుగా తెలంగాణా వాదులు మాట్లాడడం ఎక్కడి న్యాయమో తెలియదు. ౨. విడిపోదల్చుకొన్న వాళ్ళు కాస్త డిగ్నిటీ గా విడిపోతే చరిత్రలో మన వేర్పాటు కాస్త గౌరవంగా వ్రాయబడుతుంది. అలాకాకుండా అనవసర ఆరోపణలూ, అభియోగాలూ చేసి వేరే ప్రాంతపు తెలుగు వాళ్ళు మోసగాళ్ళు, వంచకులూ అంటూ ప్రజలమధ్య ద్వేషం రగల్చడం ఎంతవరకూ న్యాయం? తెలుగువాళ్ళు, తమలో తామే ఇలా కొట్లాడుకొంటూంటే మిగిలినా వారూ నేర్చుకోంటారు. బొంబాయి నాయకులు 'అమ్చీ ముంబై' అని లేవనెత్తి ఎంత అసహనం రగిల్చారో తెలియదా? బీహారు నుండి రైల్వే ఉద్యోగాలకోసం వచ్చిన అభ్యర్ధులని తన్ని ఊళ్ళోకి ప్రవేశించనీయలేదు. మన దేశం, మనదేశం అని చంకలు గుద్దుకోవడమే కానీ నిజంగా ఇన్ని ముక్కలు చేసుకోంటూంటే ఇంకా భారతదేశం అనే కాన్సెప్ట్ ఏమైనా మిగిలిందా? ఆంధ్రా నుంచి చదువుకో, ఉద్యోగానికో వెడితే ఢిల్లీ (వేరే ప్రాంతం వాళ్ళు) వాళ్ళు ఏడుస్తారు. శ్రీకాకుళం నుండి మన ఉమ్మడి రాజధానికొస్తేనే సహించలేకపోతున్నామే, ఇంక ఢిల్లీ వాళ్ళు సహిస్తారా? ఇల్లా ప్రాంతీయ తత్వంతో కుంచించుకు పోతూంటే, ప్రపంచీకరణ కి అర్ధమేమిటి? విదేశీయులొస్తారు, పెట్టుబడులు పెడ్తారు, మన ఆర్ధిక వ్యవస్థని చేజిక్కించుకోంటారు. మనం మాత్రం, కులమనో, ప్రాంతమనో, కొట్టుకొందాం. . మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు మనని కబళించిన నాటి పరిస్తితులని సంతోషంగా కల్పిద్దాం. ఎలాగూ మనకి బానిస మనస్తత్వం పోలేదు కదా. ఎక్కువ కష్టపడఖ్ఖర్లేదు. విదేశీయుడు బాగుపడినా పర్వాలేదు మన శత్రు కులం వాడో, ప్రాంతం వాడో బాగుపడలేదు, హమ్మయ్య అని సంబరపడిపోదాం.

తమసోమా జ్యోతిర్గమయ

Tuesday, February 06, 2007

కొరియా కబుర్లు: అతిథి దేవోభవ

అతిథి దేవోభవ అన్న్దది మన సంస్కృతి. ఈ రోజుల్లో దీన్ని మన దేశంలో ఎంత బాగా (ఘోరంగా) అమలుచేస్తున్నామో మనందరికీ తెలుసు. ఏకంగా అతిథిని దేవుడిని చేసే సంస్కృతిని అమలుచేసేస్తున్నాము. దేవుడు చాలా మంచివాడు. మనం చిన్న పండు పెట్టినా ఏమనడు. మా చిన్నప్పుడు గుళ్ళోకెళ్ళాలంటే దేవుడరటి పళ్ళు తెమ్మని పురమాయించేవాళ్ళు. అసలు దేవుడరటి పళ్ళు అంటే మనం తినలేని అతి చిన్న అరటి పళ్ళని అర్ధం. దేవుడిని ఇంచక్కా మోసం చేయవచ్చు. ఏమీ మాట్లాడలేడు. పాపం అతిథులు మాట్లాడగల్గినా ఏమీ అనలేరు.

అతిథి అంటే తిథి లేకుండా వచ్చేవాడు అని అర్ధం. అంటే వేళా పాళా లేకుండా వచ్చేవాడని అర్హం. మా చిన్నప్పుడు మా ఇంటికి చుట్టాలూ, పక్కాలూ వస్తోండేవారు. అందులో మా ఊరు తాలూకా ముఖ్యపట్టణం కావడంతో అతిథుల తాకిడి కాస్త ఎక్కువే ఉండేది. ఒకరిద్దరైతే మరీ అతిథుల్లాగే వచ్చేవారు. రాత్రి అందరి భోజనాలైపోయాక అతిథులొస్తే బొగ్గుకుంపట్లూ, కిరోసిన్ స్తౌవ్‍లతో కుస్తీ మళ్ళీమొదలయ్యేది. కాని ఇంట్లో ఆడవాళ్ళు ఈవిషయమై రాధ్ధాంతాలూ, సిధ్ధాంతాలూ చేసినట్లు మా ఎవ్వరి దృష్ఠికీ రాలేదు. అతిథులు రావడం, వాళ్ళకి సదుపాయాలు చూడడం, వాళ్ళ పడక ఏర్పాట్లలో భాగంగా మేం ఇరుక్కుని పడుకోవడం - ఇత్యాదులన్నీ సహజంగా అనిపించేవి. అందుకని ఇబ్బందన్న భావం ఎప్పుడూ కలగలేదు. పెద్దవాళ్ళు మాత్రం డబ్బుకి ఇబ్బంది పడేవారని మాకు కొద్ది కొద్దిగా అర్ధమయ్యేది. పైపెచ్చు సాంప్రదాయాలు పాటించాలని అప్పుచేసైనా సరే పండగలూ, పబ్బాలూ, పురుళ్ళూ, పుణ్యాలూ జరిపిస్తోండేవారు. మాకు అవగాహన వచ్చే వయస్సులో ఇవన్నీ ఎందుకన్న భావాలొస్తోండేవి. కాని బయటకి చెప్తే పెద్దవాళ్ళు కోప్పడేవారు. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, మనకున్నా లేకున్నా మన వాళ్ళకి కాస్తో కూస్తో మేలుచేయడం, వాళ్ళతో కలిసి పండగలూ, పబ్బాలూ జరుపుకోవడం, డబ్బు నిలవేయడం కన్నా, మన స్వంతంకోసమే ఖర్చు చేయడం కన్నా ఎక్కువ ఆనందం ఇవ్వగలవని. మనతో రక్త సంబంధం ఉన్నవాళ్ళకోసంకూడా మనం ఏమీ చేయలేకపోతే రక్తసంబంధం అన్న పదానికి విలువేమిటి? అర్జున్ సినిమాలో మహేష్‍బాబు వాళ్ళ నాన్న, అత్తయ్య వ్రాసిన ఉత్తరం చదువనుకూడా చదవలేదని తెలిసి తెగ బాధపడ్తాడు. ఆ సినిమా చూసాకా నా ఈ భావనల్లో లోపంలేదని అనిపించింది. కాని మా చిన్నప్పటికీ, ఇప్పటికీ మన ప్రాధాన్యతల్లో చాలా తేడా వచ్చింది. అప్పుడు డబ్బులుండేవి కాదు. అయినా కొంతమంది అప్పుచేసి మరీ ఆదుకొనేవారు. ఇప్పుడు మనం ఎవరికైనా సహాయంచేయాలంటే డబ్బులేమి కారణం అవట్లేదు. రామ్‍దేవ్‍ మహరాజు గారు చెప్పినట్లు ఈకాలంలో మనుష్యులకి పొట్టపెద్దదీ, గుండె చిన్నదీ అయిపొయ్యాయి.

సూక్ష్మంగా ఆలోచిస్తే, మన పాతకాలపు ఇళ్ళకుండే అరుగులూ, దీపపు గూళ్ళూ అతిథులు, బాటసారులకోసమే అని అర్ధమవుతుంది. అలాగే పాలకులు సత్రాలు కట్టించి అతిథులని ఆదరించేవారు. వేరే ఊళ్ళనుండి వచ్చిన వాళ్ళని అందరూ ఆదరించేవాళ్ళు. ఈ కాలంలో మన ఇంటికీ, ఊరుకీ, రాష్ట్రానికీ, దేశానికీ వచ్చిన వాళ్ళని ఏరకంగా ఆదరిస్తున్నామో ఒక్కసారి పరిశీలించుకొంటే మనం మన సాంప్రదాయాల్నిఎంత గౌరవిస్తున్నమో తెలిసి బాధ కల్గుతుంది.

ఈ విషయంలో కొరియా ప్రజలు, విదేశీయుల పట్ల వారు చూపే ఆదరాభిమానాలతో మమ్మల్ని ఆకట్టుకొన్నారు. మనమే కాకుండా అనేక దేశాలనుండి వచ్చిన విదేశీయులు కొరియాలో ఉంటున్నారు. ఒక అమెరికన్ నల్లజాతి మహిళ (మా సహోద్యోగురాలు) ఒక సందర్భంలో తనకి వేరే విదేశీయుల్తో కన్నా, కొరియన్ల తో ఉన్నప్పుడే ఎక్కువ భద్రతా భావం కల్గుతోందని చెప్పింది. మేము బయటికి వెళ్తే విదేశంలో ఉన్న భావంకానీ, భయం కానీ కల్గదు. ఎవ్వరూ వ్యతిరేక ప్రవర్తన చూపించలేదు. ఈ విషయంలో సోల్ లో ఉన్న వాళ్ళూ, చిన్న పల్లెల్లో ఉన్నవాళ్ళూ ఒకే రకంగా ప్రవర్తించారు. పైపెచ్చు, విదేశీయులనగానే ప్రత్యేకంగా గౌరవిస్తారు. మేము ఒక దివికెళ్ళాం. అక్కడ అన్నీ దూరాలే. భాష కూడా ఒక సమస్యే. అయినా మేము ఎవరినైనా సహాయం అడిగినదే తడవుగా, పాపం నిఘంటువులు తిరగేసి చాలా కష్టపడి మాకు దారి చెప్పడమే కాకుండా, షాపులవాళ్ళైతే ఒక చోట అయిస్ క్రీము, ఒకరైతే కమలా ఫలం మాపిల్లలకి ఇచ్చారు. ఇంకొకాయనైతే మమ్మల్ని మేం వెళ్ళాల్సిన చోట దింపేసి అక్కడ ఉన్న ఒక షాపమ్మాయితో మాపనవ్వగానే మాకోసం కాల్ టేక్సీ పిలిపించమని అప్పగింతలు పెట్టి మరీ వెళ్ళాడు. అక్కడి మ్యూజియంలూ, ఎక్జిబిషన్ల ప్రవేశ రుసుములో విదేశీయులకి 20-25 శాతం రాయితీ ఉంటుంది.

ఆన్నిటికన్నా ముఖ్యమైనది, అక్కడి టేక్సీ వాళ్ళ ప్రవర్తన. మామూలుగానే వినమ్రంగానే ఉంటారు. విదేశీయులంటే మరీనీ. మేము లగేజీతో వెళ్తే, లోపల పెట్టడం, బయటకి తీయడం వాళ్ళే. విమానాశ్రయం నడిపే లిమోసిన్ బస్సుల్లో కూడా వాళ్ళేర్పాటు చేసిన పోర్టరు లేకపోతే బస్సు డ్రైవర్ మా లగేజీ పెట్టడం, తీయడం చేసేవారు. ఎక్కడా మమ్మల్ని ఏవిషయంలోనూ ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడి ఆటో, టక్సీ వాళ్ళ ప్రవర్తన దీంతో పోల్చగలమా? ప్రీపెయిడ్ ఆటో, టాక్సీలవాళ్ళు కూడా మోసాలూ, దుష్ప్రవర్తనతో విసుగెత్తిపోతున్నాము. ఢిల్లీలో అయితే, ప్రీపెయిడ్ టాక్సీ డ్రైవరు దిగాల్సిన చోట దింపేసి, 'సార్ మీసంతోష'మంటాడు. ప్రీపెయిడ్ చార్జీ రెట్టింపు చెల్లించాకా ఇంకా సంతోషమెక్కడుంటుంది!

ఈ మధ్యన పిల్లలతో సాలార్ జంగు మ్యూజియానికెళ్ళాం. అక్కడికి విదేశీయులూ, వేరే రాష్ఠ్రాలవాళ్ళూ చాలామంది వస్తున్నారు. కానీ మ్యూజియం సాయంత్రం 5 గంటలకి మూసేస్తారు. చార్మినార్ కెళ్తే, అది కూడా 5 గంటలకే మూసేస్తారు. రెండు, మూడు రోజులకొచ్చే వాళ్ళు ఈ రకంగా ఆఫీసు సమయాలు పాటిస్తే ఏం చూడగలరు? ఇది ఇలాఉంటే, మ్యూజియం టిక్కెట్ భారతీయులకి ౧౦ రూపాయలు. విదేశీయులకి 150 రూపాయలు! అంతే కాకుండా, ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఫోటోగ్రఫీ మీద ఆంక్షలు, కెమేరాకి ప్రత్యేక రుసుములూ ఒక్క మన దేశంలోనే కనిపిస్తాయనుకొంటా. బహుశ: మన నాసిరకం, పాతకాలపు పద్దతులూ, యజమాన్యం ప్రపంచానికి తెలియకూడదనేమో?

ఒకసారి ఢిల్లీలో ఒక అమెరికన్ ఫ్రెండుతో ఒక పుస్తకాల షాపుకెళ్ళాను. పుస్తకాల షాపువాళ్ళు కొంత శాతం రాయితీ ఇస్తోండేవారు. మా ఫ్రెండు కొన్ని పుస్తకాలు కొన్నాక బిల్ వేసే సమయంలో షాపు యజమానితో 'రాయితీ యిస్తున్నారు కదా' అని గుర్తుచేసాను. అసలే విదేశీయుడికి రాయితీ ఇవ్వలేకా, మానలేకా మథనపడుతోన్న ఆ యజమాని నామీద ఒంటికాలుమీద లేచాడు. విదేశాలనుండి వచ్చిన మనవారిదగ్గరకూడా డాక్టర్లూ, బార్బర్లూ కూడా ఎక్కువ చార్జీని వసూలు చేయడం నాకు తెలుసు.

అతిథి దేవో భవ అని మన ప్రభుత్వం వారు నినాదాలిచ్చినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు. మనందరి ప్రవర్తనా మారితేనే ఏమైనా జరుగుతుంది. మనమందరమూ మన ప్రవర్తనలని నిరంతరం సరిదిద్దుకొంటూ, సాటి మనిషి సౌఖ్యానికి సాయపడగల్గి, సాదరంగా చూడగల్గే మన సాంప్రదాయాన్ని తిరిగి పాటించగల్గితేనే ఏమైనా మార్పు కల్గుతుంది.