Friday, March 30, 2007

శ్రీరాముని దయచేతను......

మొన్న రామనవమికి మా ఊళ్ళో (సోల్‍లో) మనవాళ్ళు ఒక సత్సంగం ఏర్పాటు చేసారు. ఆ సందర్భంగా విష్ణుసహస్రనామస్తోత్రం చదివాం. అంటే, సుబ్బులక్ష్మి గారితో కాస్తంత గొంతూ, పెదాలూ కలిపాం. ఆవిడతో గొంతుకలపడం కూడా అదృష్టమేనంటాను. ఎందుకంటే, ఆవిడ గొంతు వింటేకానీ ఆశ్రీనివాసుడు నిద్ర కూడా లేవడు. ఇతర కార్యక్రమాలు కూడా అయిపోయాక ముగ్గురు చెప్పిన మూడు ముక్కలుః
1.విష్ణుసహస్రనామస్తోత్రం (వేయి నామాలు) చదవడం వల్ల వచ్చే ఫలితం ఒక్క రామనామంతో వస్తుంది.
2.రామనామస్మరణకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ పధకం ఉంది. దాని ప్రకారం రామభక్తులకి ఆంజనేయుడు కూడా వశమైఉంటాడు.
3.రాముడికీ తెలుగువాళ్ళకీ తరతరాల ప్రత్యేక అనుబంధం ఉందీ అనిపిస్తుంది. ఆయన పుట్టిందీ,పెరిగిందీ ఉత్తరాదిలోనైనా, ఆయనని కీర్తించి, స్తుతించి, ఆయన నామాన్నీ, ఖ్యాతినీ చిరస్థాయిగావించిన ముఖ్య కవులూ,గాయకులూ, వాగ్గేయకారులూ తెలుగు వారే. కృష్ణుడనగానే మనకి సూరదాసు, మీరాబాయ్ లాంటి తెలుగేతరులు గుర్తొస్తారు కానీ, రాముడనగానే రామదాసు, త్యాగయ్య, మైసూరు వాసుదేవాచార్యులు, మొల్ల, విశ్వనాథ లాంటి తెలుగు వాళ్ళే ఎక్కువ గుర్తుకు రావడం విశేషం. ఈమధ్యన ఎవరో అన్నట్లు, రాముడ్ని నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు, చివరకి ముప్పాళ్ళ రంగనాయకమ్మతో సహా.
ఆ సందర్భంలో గుర్తుకు తెచ్చుకొన్న కీ.శే.దేవులపల్లి వారి పాట ఈక్రింద ఇస్తున్నా. దీన్ని పాలగుమ్మి విశ్వనాథంగారు స్వరపరచారు. ఆవరుస ఎలా ఉంటుందో వినాలని ఉంటే ఈ లంకెని నొక్కండి.
ఎన్నిసారులు అన్ననూ...

పల్లవి
ఎన్నిసారులు అన్ననూ ఎన్నెన్ని తీరులు విన్ననూ
అన్నకొలదీ విన్నకొలదీ అమృతభరితము రామచరితము ..ఎన్ని..

చ1
కలముపట్టి కవివరేణ్యులు - గళమువిప్పి గాయకులు
నీమధురగానము కొలువగా - మైమరచి నిను ధ్యానించగా
వెలసెనెన్నో పాటలు -నిను చేరుటకు విరిబాటలు ..ఎన్ని..

చ2
బ్రతుకు బరువై సుఖము కరువై
అలసిసొలసిన వేళలా
ఏదారి లేని ఎడారిలో....ఏదారి లేని ఎడారిలో
ఆధారమైనది నీదు నామము ..ఎన్ని..

Thursday, March 15, 2007

కొరియా కబుర్లు: తిండీ, తిప్పలు – 2

మనకి కొరియన్లు, చైనావాళ్ళు, జపాను వాళ్ళు, ఇతర తూర్పు ఆసియా దేశస్థులు ఒక్కలాగే అనిపిస్తారు. మనకి చైనా వాళ్ళనగానే వానపాములు, పాములతో సహా ఏజీవినైనా తినేసేవాళ్ళే కనిపిస్తారు. అలాగే మిగిలిన దేశాలవాళ్ళు కూడా. కానీ, కొరియన్ల ఆహారపుటలవాట్లు చూడసొంపుగానే ఉంటాయి, ఒక్క బ్రతికి ఉన్న ఆక్టోపస్ ని తినడం తప్పించి. మానవ పిండాల్నీ, అప్పుడే కొబ్బరి బొండాం చెక్కినట్లు చెక్కిన కోతి తలలోంచి మెదడునీ పచ్చిగా జుర్రే చైనావాళ్ళ తోటి, ఇంకో రెండు రోజుల్లో పిల్లవచ్చే అవకాశం ఉన్నకోడి గుడ్డుని వేడి పెనంమీద పగలగొట్టి, ఆ పిల్ల ప్రాణంకోసం పరిగెడుతూ,పరిగెడుతూ ఆమ్లెట్టయిపోతే, ఆపరుగులాటవల్లే అంతటేస్టనుకంటూ, లొట్టలేసుకంటూ తినే కాంబోడియన్లతోనూ అయితే వీళ్ళకి పోలికే లేదు.
వీళ్ళు సాథారణంగా ఎక్కువ సార్లు హోటలులోనే తినేస్తారు. ఇంట్లో చేసుకుని తినడం ఒకరకంగా శ్రమతో కూడిన వ్యవహారం. వీళ్ళు తినే ముఖ్య పదార్ధం (మెయిన్ డిష్) కన్నా ఇతర పదార్దాలు లెఖ్ఖకు మించి ఉంటాయి. మరి ఇంట్లో ఇన్ని ఏర్పాట్లు చేసి ఆనక అన్ని చిప్పలూ కడుక్కోవాలంటే ఒళ్ళు హూనమౌతుంది. వీళ్ళు పార్టీ చేసుకొన్నప్పుడు చూడాలి, కనీసం 50 రకాల పదార్ధాలు బల్ల మీదకొస్తాయి. వీళ్ళు పార్టీ ప్రియులు. రోజూ మందు (సోజూ) ఉండాల్సిందే.

వీళ్ళ సైడ్ డిష్ లలో అతి ముఖ్యమయినది కిమ్చీ. ఇది మన ఊరగాయ లాంటిది. ఎటొచ్చీ వాళ్ళు దానిలో వెనిగర్ వేసి పులియబెడ్తారు. కిమ్చీ వాళ్ళ సంస్కృతిలో ఒక భాగం. చలికాలం ముందు దీన్ని తయారుచేసుకొంటారు. దీనికోసం పెద్ద జాడీలు ఉంటాయి. ప్రపంచంలో 10 ఉత్తమ ఆరోగ్యకరమైన ఆహారాల్లో కిమ్చీది 5వ స్థానం. మన దేశంనుండి అపరాలు (పప్పుధాన్యాలు) ఈ పదిలో ఉన్నాయి. కిమ్చీని కేబేజ్,ముల్లంగి, కీరా కాయలు, కొన్ని ఆకుకూరలతోటి చేస్తారు. ఎండు మిర్చి కారం ముఖ్యపదార్ధం. కారం ఎక్కువగానే వాడతారు. కిమ్చీకోసం ఒక పరిశోధనా సంస్థ కూడా ఉంది. దాని వల్ల వచ్చే ప్రయోజనాలగురించి టీవీ కార్యక్రమాల్లో కూడాతెగ చెప్తోంటారు. ఫోటో తీసేవాళ్ళు say cheese అన్నట్లు, వీళ్ళు 'కిమ్చీ' అంటారు.

కిమ్చీకి వీళ్ళిచ్చే ప్రాముఖ్యత చూస్తే, నాకైతే మన ఊరగాయలు గుర్తొచ్చి చాలా బాధవేస్తుంది. ఊరగాయలు మన తెలుగు సంస్కృతికి చిహ్నాలు. మా చిన్నప్పుడు ఊరగాయల కాలం ఒక పండగలాగా ఉండేది. అది ఒక సశాస్త్రీయ ప్రక్రియ. కారం, ఆవుపిండి కొట్టించడం, మాగాయ ముక్కలు ఎండబెట్టడం, ఒకటేమిటి, ఎన్నెన్నో పనులు-పిల్లలకీ, పెద్దలకీ కూడా- ఉంటోండేవి. మనకే కాకుండా చుట్టాలకీ, పక్కాలకీ కూడా పెట్టాల్సి వచ్చేది. మాయింట్లో కనీసం 400 కాయల ఆవకాయ పెట్టేవాళ్ళం. మాగాయ, తొక్కుడుపచ్చడి లాంటివి సరే సరి. అలాంటిది, క్రిందటేడు నాభార్య ఈఏడాది మనింట్లో ఊరగాయలు పెట్టలేదు అని చెప్పగానే నాకు కల్గిన కల్చురల్ షాక్ అంతా ఇంతా కాదు. అసలు మన ఊరగాయ సంస్కృతి అధోపాతాళానికి జేరుకోవడానికి కారణం విదేశీయులు చెప్పినదే వేదమని మనమీదరుద్దే మన డాక్టర్లు (ఇస్మైల్ గారూ, కాసేపు ఫేసు అటు టర్నింగవ్వండి). ఈవిదేశీయులకి మన ఊరగాయ సొగసేమి తెలుస్తుంది చెప్పండి. వాళ్ళు తింటే అంతే సంగతులు. కానీ మనం తినక పోతే 'కన్నతల్లిని దూషించినంత పాపం, ద్వేషించినంత నేరం' కాదా? కొరివి కారం తినలేని గుంటూరు వాడ్ని, ఆంధ్రమాత అంటే తెలియని తెలుగు వాడ్ని మనం కనీసం ఊహించగలమా? డాక్టరు దగ్గరకి ఏసమస్యతో వెళ్ళినా సరే మొదట చెప్పేది ఊరగాయలు మానెయ్యమనే. వాళ్ళిచ్చే మందులవల్ల చెడు ఫలితాలంటాయని తెలసీ టన్నులకొద్దీ మనచేత మింగిస్తూ, ఎటువంటి శాస్త్రీయాధారమూ లేకపోయినా అభం శుభం తెలియని మన వారసత్వాన్ని అన్ని ఆరోగ్యసమస్యలకీ మూలమనడం వింటే కడుపు మంట రాదా? ఇది ఎవరైనా డాక్టరు వింటే ఊరగాయలవల్లే ఈ మంట అనగలడు.

వీళ్ళ ఆహారపుటలవాట్లు చూస్తే, మనం వాడే చాలా దినుసులు వీళ్ళు కూడా వాడటం విశేషం. అల్లం, వెల్లుల్లి వాడకం విపరీతం. దాల్చినచెక్క, జాపత్రి, ఎండుకారం మామూలే. మనం గొప్పలకి పోయి హీనమనుకొనే రాగులు, జొన్నలు, ఇతర తృణధాన్యాలూ ఇక్కడ విలువైనవి, అన్ని కొట్లలోనూ దొరికేవీని. వింతేమిటంటే, ఇక్కడ దొరికే కూరల్లో మూడైతే, రూపలావణ్యాలకి కాక, రుచిలో మన
బీర, ఆనప, దోస కాయలని సరిపోలతాయి. గుమ్మడి కాయలు అచ్చం మనవైపు దొరికేవే. అన్నిటికన్నా చెప్పాల్సినది, వీళ్ళు కూడా మనలాగే బియ్యం తినడం. కాకపోతే, ఈబియ్యంతో వండితే అన్నం ముద్దగా అయ్యి, అంటుకొంటుంది (జపానికా రకాలు). పదునుగా వండితే బాగానే ఉంటుంది. కానీ, చాలా రుచిగా ఉంటుంది. నేనైతే పూర్తిగా ఇక్కడి బియ్యమే వాడతా. అన్నట్లు చెప్పడం మరచా, వీళ్ళ అంగళ్ళలో కూడా మిరపకాయ బజ్జీలు దొరుకుతాయి.

ఈపాటికి చాలామందికి అనపించి ఉండచ్చు, మన దేశం నుండి ఈదేశానికి చాలా తిండి పదార్ధాలు ఎగుమతి చేయవచ్చు కదా అని. అవును. చాలా వస్తువుల ధరలు మనదేశంకన్నా 6-10 రెట్లుండచ్చు. కానీ వీళ్ళకి నాణ్యత కావాలి. పాతకాలంలో ఒకసారి కిమ్చీ కోసం ఎండుమిర్చి, వేరే దిక్కులేక ఇండియానుంచి దిగుమతి చేసుకొన్నారట. దెబ్బతో మనసరుకంటే ఇప్పటికీ భయం పోలేదంటారు. మన దేశం వాళ్ళు చాలామందే ఉన్నా కూడా, మనం పాకిస్తాన్, బాంగ్లాదేశ్ ల పాటికూడా వ్యాపారం చేయలేకపోవడం శోచనీయం.

Thursday, March 08, 2007

తిండీ తిప్పలు -1: ప్రతిస్పందన


రాధిక, సుధాకర్(శోధన), నాగరాజు పప్పు, సిబీరావు, వల్లూరి, నాగరాజా, 'తెలుగోడు' గార్లు నా తిండీ తిప్పల మీద (బ్లాగు టపా మీద అని భావం) వ్యాఖ్యలు వ్రాసారు. మీ అందరి సుస్పందనకి కృతజ్ఞతలు. అక్కడే నా ప్రతిస్పందన ఇరికించి వ్రాయడం ఎందుకో ఇష్టంలేక పోయింది. అందుకే ఇక్కడ వ్రాస్తున్నాను.
చైనా, కొరియా లాంటి వాళ్ళ వంటల్లో వెనిగర్ బాగా వాడతారు. నువ్వుల నూనె అయితే సరేసరి. అందులోనూ ముడి నువ్వుల నూనె బాగా వాసన వస్తుంది. వీళ్ళకి నూపప్పు అంటే మనకి జీడి పప్పులా అన్న మాట. అపురూపం, మహా ప్రియం (ఖరీదు). వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతుల మీది ఆంక్షలు తొలగించక ముందు వీళ్లు చైనా నుండి నూపప్పుని దొంగ రవాణా చేసుకొనేవారట. వీళ్ళ అన్ని వంటకాల మీదా కొద్దిగా నూపప్పు జల్లడం సర్వసాధారణం.

నేను బరహా యూనికోడ్ వాడుతున్నాను. నా క్కూడా మం(గుం)టనక్క లో సమస్య వస్తోంది. ఎవరైనా 'స్వే' (SWE) లు సలహా చెప్పండి దయచేసి. ఇప్పుడు తెలుగు పెళ్ళి మార్కెట్లో SWE అనే గుజ్జునామం
software engineer కి చాలా సామాన్యంగా వాడుతున్నారు. ఈ అర్ధసంవత్సర సెలవల్లో నా మేనకోడలి కోసం సంబంధాలు వెతకడంలో నాకు పెళ్ళిసంతల పడికట్టు పదాలు, విఫణి (మార్కెట్) తీరుతెన్నులు, ధరవరలు బాగానే పట్టుబడ్డాయి. రోగి బతక్కపోయినా వైద్యుడికి అనుభవం వచ్చినట్లైంది.
రాధికగారూ. రాగిముద్ద మీద చిన్న నక్షత్రం గుర్తు చూసారా. నిబంధనలు వర్తిస్తాయి. హా హా హా...
అన్యోని ఘేసియో (గూడ్ బై)

Wednesday, March 07, 2007

కొరియా కబుర్లు: తిండీ తిప్పలు -1 (ఇది చదివిన వాళ్లకి రాగిముద్ద పూర్తిగా ఉచితం*)

ఈ మధ్య నేను తపాలేసి చాలా రోజులయ్యిందని గమనించాను. అర్ధ సంవత్సర సెలవలకి దేశంవెళ్ళడం, తిరిగి రావడంలో కొద్దిగా అంతరాయం కలిగినట్లుంది. అంతే కానీ టాపిక్లు అయిపోయి కాదని తెలిసింది. ఎందుకంటే ఈ మధ్య కొన్ని బ్లాగులు చదువుతోంటే నాకు తోచిన విషయాలు వ్రాయాలని చేతులు దురదపెట్టాయి. ఇవి కాక నేను దేశంలో గడిపిన రోజుల విశేషాలు చాలా ఉన్నాయి. కానీ ఈ మధ్య ఏమీ వ్రాయలేకపోయా. వెరసి poverty in plenty. ఈ వాక్యాన్ని తెలుగులో వ్రాద్దామనుకొంటే ఎలా వ్రాయొచ్చో? ఇక విషయానికొస్తే......

తిండీ తిప్పలు అని ద్వంద్వంగా వాడడంలో ఉద్దేశ్యం తిండికోసం తిప్పలు తప్పవనేమో. మమూలుగా తిండి కోసం తిప్పలు పడడం మాటేమో కానీ, భారతీయులు మాత్రం బయట దేశాల్లో ఆయా దేశాల వాళ్ళ తిండి తినలేక తిప్పలు పడడం సామాన్యమైన విషయం. ఇన్నాళ్ళూ మనం గల్ఫ్, యూరోప్, అమెరికాలే ఎక్కువ వెళ్ళడంతో ఆయా ప్రాంతాల్లో మనకు కావలసిన ఆహారపదార్ధాలు బాగానే దొరుకుతున్నాయి. కానీ, కొరియా, జపాను లాంటి దేశాలకు ఇద్దరూ లేక ముగ్గురు పద్ధతిలో జనాలు వెళ్ళడం వల్ల ఈ దేశాల్లో మన తిండి అవసరాలు తీర్చుకోవడం కొద్దిగా కష్టమే. మన దేశంలో మాంసాహారం తినేవాళ్ళు కూడా ఇక్కడి పదార్ధాలు తినలేరు. శాకాహారుల సమస్య ఇంక చెప్పేదేముంది. అసలు వీళ్ళకి శాకాహారం అంటే ఒక పట్టాన అర్ధంకాదు. వీళ్ళ బుద్ధ దేవాలయాల్లోని సన్యాసులు తీసుకొనే ఆహారం శాకాహారమే అయినా మన పద్ధతిలో ఉండదు కదా. మా సారు ఒకరు నేను వచ్చిన కొత్తల్లో నన్ను ఒక సారి రెస్టారెంటుకి లంచికి పిలిచాడు. రాననడం మర్యాద కాదు. అందులోనూ ఆయన కొరియాలో నా బాగోగులు కనిపెట్టుకొని ఉండే పెద్ద మనసున్న మనిషి. ఆయన పేరు కిమ్ యంగ్ చల్. కిమ్ ఇక్కడి సర్వసాధారణ మైన ఇంటిపేరు. సుమారు 50% కి ఉంటుంది. ఈయన మనదేశంలో సుమారు 6 యేళ్ళున్నాడు. ఈయన చాలా విలక్షణమైన మహామనీషి. ఈయన గురించి తర్వాత వేరే తపాలో. ఆయన రెస్టరెంటుకు వెళ్ళగానే కొరియన్ భాష(హంగుమల్ అంటారు)లో ఆర్డరిచ్చేసాడు. తీరా నాప్లేటు చూస్తే రొయ్యల ఫ్రైడ్ రైస్. సార్. నేను ఇది తినలేనంటే, రొయ్యలు వెజిటరియనే కదా అంటాడు. హోటలమ్మకేదో చెప్పాడు. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలియదు, మళ్లీ ఒక ప్లేటులో ఫ్రైడ్ రైస్ పట్తుకొచ్చింది. బహుశ: రొయ్యలేరేసి పట్టుకొచ్చిందేమో. ఫ్రెష్ గా నాకోసం చేసుకొచ్చిందని నమ్మి తిన్నా. తింటున్నానే కానీ దాంట్లో ఏరుచీ లేదు. సారుతో చెప్పి మిరియాల పొడి తెప్పించుకొని మధ్య మధ్యలో కాస్త నాలిక కారం చేసుకొన్నా. తర్వాతెవరో చెప్పారు ఇది కొరియన్ల కనుగుణంగా చేసినదని. ఆతర్వాతి కాలంలో చైనీస్ రెస్టరెంటులోనే వాళ్ళ పద్ధతిలోనే చేసిన ఫ్రైడ్ రైస్ తిన్నా. ఇంతకు ముందుకన్నా నయం. కానీ నోరు చి (త్రివిక్రముడి బావా .. ఛీ లాగా). ఇదే చైనీస్ ఫ్రైడ్ రైస్ ఇండియాలో ఎంత రుచిగా చేస్తారో కదా! అసలు వాడికన్నా కాపీ చేసినవాడే బాగా చేయగలడన్నమాట.
కొరియా వాళ్ళు భోజనప్రియులు. ఎల్ల కాల సర్వావస్థలలోనూ తింటూనే కన్పిస్తారు. కానీ వాళ్ళ శరీరంలోఎక్కడా ఒక గ్రాము కొవ్వు గానీ, కండకానీ ఉండకూడని చోట కన్పించదు. అన్ని వయస్సుల వాళ్ళూ నడక, వ్యాయామం చేస్తూ కనిపిస్తారు, ఆందుకేనేమో బలే సన్నగా, ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఇప్పుడు హైస్కూల్ కెళ్ళే వయసు వాళ్ళల్లో మాత్రం చాలామందికి ' అన్నీ ఎక్కువే'. మరి పిజ్జాలూ, గిజ్జాలూ ఎక్కువ లాగిస్తోంటే లావవ్వరా? కొంత అదృష్టంకూడా అనుకొంటా. ఇక్కడ ఒక అగ్రగామి మోడల్ ఒక అమ్మాయి ఉంది. బకాసురుడి చెల్లెల్లా లాగిస్తుందట. పత్రికల వాళ్ళు ఆవిడ తిండి పుష్టిగురించి వ్రాస్తోనే ఉంటారట. కానీ తిన్న తిండి ఎక్కడికిపోతుందో తెలియదు, ఒంట్లో ఎక్కడా కాస్త కూడా కొవ్వు ఉండకూడని చోట ఉండదుట. ఈ జీన్సుని మన హీరోయిన్లకి అమ్మితే బలే వ్యాపారమవుతుంది. పాపం నయనతార, త్రిషల్లాంటి వాళ్ళు తెగ ఖర్చుపెట్టి విదేశాలకి పోయి లిపోసక్షన్ చేయించుకొని తెగ కష్టపడుతున్నారు.

వీళ్ళ దూరదర్శన్ సీరియళ్ళలో కూడా తిండి దృశ్యాలకి తెగ ప్రాధాన్యతనిస్తారు. ఎపిసోడుకి కనీసం ఒక తిండిసీను. ఇక్కడి బజార్లలో అయితే రెస్తారెంట్ల జోరు చెప్పనఖ్ఖర్లేదు. సాయంత్రం సమయంలో వెళ్తే రకరకాల లైటింగులూ, మ్యూజిక్కులూ, లోపలికి ఆహ్వానిస్తూ అరిచే అరుపులూ- ఆ హడావిడే వేరు. వీళ్ళు మధ్యాహ్నం 12, సాయంత్రం 6 గంటలకి తినేయకపొతే తల్లడిల్లిపోతారు. ఇంట్లో చేసుకోవడం కన్నా హోటల్నించి తెప్పించుకోవడమే ఎక్కువ చేస్తారు. మనం ఎదైనా ఆర్డరిస్తే ఒక 10-15 నిమిషాలలో వేడివేడిగా మనకి తిండి వచ్చేస్తుంది. విపరీతమైన పోటీ వల్ల మంచి సేవ, సరసమైన ధరలకి దొరుకుతుంది. తిండిని ఉష్ణవాహకంకాని పెద్ద బాక్సుల్లో మన బజాజ్ పాల బండ్లు (ఈ మోడల్ పూనాలో ఎక్కువ వాడేవారు కాబట్టి పూనా బళ్ళు అనేవారు) లాంటి స్కూటర్ల మీద రై.. రై.. మని తీసుకువచ్చి సప్లై చేస్తారు. బహుశ: వేడి తగ్గకుండా వేగంగా చేర్చడనికనుకొంటా, వీటిని చాలా వేగంగా నడుపుతోంటారు. చాలా సార్లు ఇవి నడుస్తోన్న మాపక్కనించే దూసుకుపోయి మా గుండెలదరగొట్టేయడంతో వీళ్ళని యమదూతలని వ్యవహరిస్తోంటాం. $4-5 లో లంచి, $10 లోపు 'సోజూ' సహిత డిన్నర్ దొరుకుతుంది. సోజూ (సుర నుండి వచ్చిందంటారా?) వీళ్ళ దేశీ మద్యం. చిన్నాపెద్దా, ఆడామగా, బీదాబిక్కీ తేడాల్లేకుండా తాగే పానీయం. ఒక బాటిల్ ఒక డాలరుంటుంది. మన ఊళ్ళల్లో మనకి కనిపించే దృశ్యాలు- తాగేసి తూలేవాళ్ళు, పడిపోయిన వాళ్ళు, వాళ్ళని లేపి తీసుకొని పోయే వాళ్ళూ, ఇత్యాదులు - ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తోంటాయి. అప్పుడప్పుడు అమ్మాయిల్ని వీపుమీద వేసుకొని మోసుకొని పోయే అబ్బాయిలు కన్పిస్తోనే ఉంటారు. మళ్ళీ తెల్లారేసరికి పన్లోకి ఠంచనుగా వచ్చేస్తారు. తాగితే తప్పేముంది, తాగని నాకొడుకెవ్వడు ఈలోకంలో.. అన్న మన తెలుగు పాటల పదాలు నాకైతే నోట్లో ఆడుతోంటాయి వీళ్ళని చూస్తోంటే.

వీళ్ళ తిండికి ఒక విలక్షణమైన వాసన ఉంటుంది. సముద్రంలో దొరికే పదార్ధాలు తినడం, నువ్వులనూనె వాడడంవల్ల అనుకొంటాను. నేనిక్కడకి వచ్చిన మొదటి వారంలో అయితే బజార్లలో వెళ్తోంటే వికారం వచ్చేది. ఆ తర్వాత ఆ వాసనే తెలియట్లేదు, అలవాటయిపోయి. ఇంకొన్నాళ్ళు పోతే ఆ వాసనలేకపోతే వికారం వస్తుందేమో. ఈ అలవాట్ల మీద ఒక చిన్న పిట్టకథ. ఎప్పుడో ఒక తెలుగు పత్రికలో చదివా. ఒక సినిమా హీరో ని ఒకామ్మాయి పెళ్ళిచేసుకొంటుంది. మొదటి రాత్రి ఆ హీరో ఉలకడూ, పలకడు. తెరమీద అంత శృంగారమొలకపోసే హీరో ఇలా జీరో అయిపొయ్యాడేంటా అని ఆహీరోయిన్ తల్లడిల్లిపోయింది. అసలు ఆహీరోగారి తెరమీది రసికత చూసేకదా నేను ముచ్చటపడి పెళ్ళిచేసుకొన్నది అని తెగ బెంగపడి ఒక డాక్టరుగారిని కలిసింది. ఆరోజు రాత్రి డాక్టర్ చెప్పినట్లే పడగ్గదిలో ఒక టేపురికార్డరు పెట్టి హీరోగారు ప్రవేశించగానే ఆన్ చేసింది. అంతే మన హీరోగారు తన శృంగారనైపుణ్యాన్నంతా రుచిచూపించేసారు. ఇంతకీ రహస్యం తెలిసిందా? ఏంలేదు. టేపురికార్డరు ఆన్ చేయగానే లైట్సాన్, కేమెరా, ఏక్షన్ అన్న మాటలు వచ్చాయి. అవి వినిపించగానే అలవాటుగా మన హీరోగారు తన కర్తవ్యం నిర్వహించేసారు.
మెల్లమెల్లగా నేను కొద్దిగా కాలూ ఏయీ కూడదీసుకొని, ఒక రైస్ కుక్కరు, తర్వాత ఒక మైక్రోవేవు కొనుక్కుని నా వంట నేను చేసుకొని తింటున్నా. నా తిప్పలు నేను పడుతున్నా. అన్నట్లు నాకు వంట చేయడం చాలా ఇష్టం, ఒక అభిరుచి. ఎటొచ్చీ షడ్రుచుల జ్యోతిగారిలాంటి పద్ధతిగా వండే విధానం చెప్పేవారు, అలా వండేవారు నేను వంట చేయడం చూస్తే ముక్కుమీద, తర్వాత తినగలమోలేదో అన్న భయంతో నోటిమీదా వేలేసుకొంటారు. కానీ ఎవరూ భయపడక్కర్లే. ఇక్కడ ఒక తెలుగు కుర్రాడు బయోటెక్నాలజీలో పరిశోధన చేస్తూ, నావంట గత రెండు సంవత్సరాలుగా తరచూ తింటూ కూడా ఈమధ్యనే పి.హెచ్.డి. పట్టా తెచ్చుకొన్నాడు. నేను వంట చేసే విధానం ఆర్ధికశాస్త్ర సుత్రాలని అనుసరించి ఉంటుంది. ఆర్ధిక శాస్త్రంలో ఒక సూత్రం ఉంది. మనం పెట్టే ఖర్చులో వృద్ధి (increment) కన్నా, మనకి వచ్చే ఆదాయంలో వృద్ధి ఎక్కువ లేదా కనీసం సమానంగా ఉంటేనే మనం ఖర్చుపెట్టాలి. ఇక్కడ వంటలో మనం వంటలో గడిపే సమయం విలువలో వృద్ధి, రుచిలో వచ్చే వృద్ధితో సరిచూసి, కొద్దిగా రుచి తగ్గినా బాగా తక్కువ సమయంలో వంట అయిపోతే ఆ పద్ధతిని అనుసరించమని నా సూత్రం. నేను పాటించే పద్ధతిని పైన చెప్పిన తెలుగు కుర్రాడు, 'single step protocol' వర్ణిస్తాడు. సైంటిస్టుకదా, వాళ్ళ భాషలో చెప్పాడు. ఏక మెట్టు పద్ధతి అని తెలుగులో అనొచ్చా?
(సశేషం)


*నిబంధనలు వర్తిస్తాయి