Monday, April 23, 2007

నాది జ్ఞానమా? అజ్ఞానమా?

కొన్నిరోజులక్రితం ఆంధ్రజ్యోతిలో ఒక ఫోటో, దానిక్రింద దాని వివరం చూసా. ఆవివరం లో నాగార్జునకొండకెళ్ళడానికి లాంచి ఎక్కుతున్న ప్రధాని కుమార్తె ఉపేంద్ర సింగు అని రాసి ఉంది. ఇది మీరూ చదివి ఉంటారు. దీంట్లో విశేషం ఏముందీ పెద్ద, బ్లాగులో వ్రాయడానికి, అదీ 'ఆర్నెల్ల' తర్వాత అంటారా? మామూలుగా చూస్తే అంతే. కానీ ఆవార్త చదివాకా నాలో కల్గిన భావపరంపరనుబట్టి చూస్తే విశేషం ఉందని మీరుకూడా ఒప్పుకోవచ్చు.
ఒకసారి ఫోటోచూసి వివరం చదివాను. ఆవ్యక్తి ఎవరో ఆవార్త ఎందుకు వేసారో అర్ధం కాక మరొక్కసారి చదివా. ప్రధాని కూతురట, ఏదేశ ప్రధాని కూతురయ్యుండొచ్చు? సింగు అని ఉందికాబట్టి నేపాలు ప్రధానేమో. అయినా ఈ పత్రికల వాళ్ళ బుర్రలిట్టా ఏడిసాయి. సరిగ్గా వివరాలు వ్రాసి తగలడచ్చు కదా. ఇలా బ్రెయిన్ టీజర్లిచ్చి అఘోరించకపోతే. బ్రౌజర్ మూసేసా. మర్నాడెప్పుడో అకస్మాత్తుగా బల్బు వెలిగింది. అవునూ, మన ప్రధాని మన్మోహన్ సింగు కదా, ఆయన కూతురన్న మాట ఈవిడ అని.
జనరల్ నాలెడ్జిలో ఉద్దండ పిండాన్ని కాను కాని, మరీ మన ప్రధాని ఎవరూ అని అంత మీమాంసలో ఎలా పడిపోయానో కదా.
ఇంతకీ నాది జ్ఞానమా? అజ్ఞానమా?

Tuesday, April 17, 2007

పొద్దులో బ్లాగులపై పేరడీ - నేడే చదవండి

ఈవేళ బ్లాగులు చూస్తోంటే, పొద్దులో బ్లాగులపైన పేరడీ కనబడింది. మొదలెట్టగానే చివరివరకూ చదివించింది. పేరడీ అంటే ఇలా ఉండాలి. చదువుతోంటే, ఆయా బ్లాగర్లే వ్రాసారా అన్న అనుమానం వచ్చింది. మంచి ప్రయోగం. మిగిలిన బ్లాగర్లకి కూడా తొందరగా చీమలు కుట్టేస్టే బాగుండును. కానీ పేరడీ ఎవరు వ్రాసారో వ్రాయలేదు.
ఈ అజ్ఞాత వాసులతో చాలా సమస్యగా ఉందండీ బాబోయ్. ఈవేళ కొన్ని బ్లాగులు చూస్తోంటే, అది వ్రాసిన వాళ్ళను తెలుసుకోవాలని కుతూహలం కలిగింది- చాలామంది అజ్ఞాతవాసులే. ఇక్కడికొస్తే పేరడీ కర్త అజ్ఞాత వ్యక్తి. ఈమధ్య బ్లాగులు చదువుతోంటే, పత్రికల్లో వార్తలు వ్రాసే విధానం గుర్తుకొచ్చింది. ఎవరింటిలోనో దొంగతనం జరుగుతుంది. ఆ వార్తని ఇలా వ్రాస్తారు.

"ఈవేళ తెల్లవారుజామున సుమారు మూడు గంటలకి నగర శివార్లలో ఒక యింట్లో గుర్తుతెలియని అజ్ఞాత వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డట్టు తెలిసింది. ఆయింటి యజమాని, తాము మంచినిద్రలో ఉండడంవల్ల దొంగలను చూడలేదని చెప్పారు. ఈసంఘటనపై స్పందిస్తూ, స్తానిక ఎస్.ఐ. (తమ పేరు బయట పెట్టద్దని కోరారు) వెంటనే దొంగలని పట్టుకోంటామని హామీ ఇచ్చారు. సంఘటన జరిగిన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు"

ఎంత విషయ సంపత్తి?

చావాకిరణ్ గారైతే ఇలా కూడా వ్రాసేవారేమో?

'అనుకున్నంతా అయిపోయింది. దద్దురే మిగిలింది. ఇక గోలపెట్టడమే మనం చేయగలిగింది'

ఆతర్వాత మనమంతా అడుగుతాం- వ్యాఖ్యలద్వారా- దీనిభావమేమి తిరుమలేశా అని. ఆనక ఆయన చిద్విలాసంగా మరి కాస్త వివరిస్తారు. :)

ఆయన స్టైలే వేరు. బ్లాగ్మూల పురుషుడు కదా!

Friday, April 13, 2007

అంతా వేదాల్లో ఉందష...

ఈ వాక్యం చాలా వ్యంగ్యాత్మకం. వేదం అంటే ఒకటో రెండో పుస్తకాలనుకోవడం వల్లా, మన పెద్దలకు తెలిసిన విజ్ఞానం పనికిమాలినదన్న మిడిమిడి జ్ఞానపు (పాశ్చాత్య) ప్రచారం వల్లా, అన్నిటికన్నా ముఖ్యంగా వేదాలు బ్రాహ్మల సృష్ఠి అన్న దురూహ, తద్వారా వచ్చిన వైముఖ్యత, వల్ల ఈ వాక్యానికి చాలా ప్రాచుర్యం వచ్చింది. వేదమంటే సమాజంలో పోగుపడిన జ్ఞానం. మనకున్న జ్ఞానసంపద మనకు గర్వకారణం కాదగినది. ఈవాక్యం వ్యంగ్యంగా అన్నా ....


......నిజమే అంటోంది ఈ దృశ్యమాల.

A vast number of statements and materials presented in the ancient Vedic literatures can be shown to agree with modern scientific findings ... all » and they also reveal a highly developed scientific content in these literatures. The great cultural wealth of this knowledge is highly relevant in the modern world. Techniques used to show this agreement include: - Marine Archaeology of underwater sites (such as Dvaraka) - Satellite imagery of the Indus-Sarasvata River system - Carbon and Thermoluminiscence Dating of archaeological artifacts - Scientific Verification of Scriptural statements - Linguistic analysis of scripts found on archaeological artifacts - A Study of cultural continuity in all these categories.

Wednesday, April 04, 2007

మత్తు వదలనూ - నిద్దుర మత్తు వదలనూ..ఎందుకొదలాలిబే?

మీలో చాలామంది 'మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా' అన్న పాటని వినీ, చూసీ ఉంటారు. పాండవులు లక్క ఇంట్లో ఉన్నప్పుడు, కాపలాగా, అప్రమత్తంగా ఉండాల్సిన భీముడు మత్తుగా నిద్ర పోతోంటే కృష్ణుడు ముసలి వాని రూపంలో వచ్చి కర్తవ్యం బోధిస్తాడు. భీముడు - అంత లావుండీ కూడా- ఒక ముసలివాడు చెప్పిన మాట విని బంగారం లాంటి నిద్ర పాడుచేసుకొన్నాడు. అయినా అన్నదమ్ములందరూ హాయిగా ముసుగెట్టి బజ్జుంటే నాకేంటీ ఈ కాపలా అని కాని, నీకేంటీ దురద అని గాని నిలదీయలేకపోయాడు. మరి శేషశాయని పేరొందిన వాడు వేరేవాళ్లని పడుకోవద్దంటే రోషం రావద్దూ? మరి ఒక వేళ నిలదీసినా న్యూస్ కవర్ చేసిన రిపోర్టర్ (వ్యాస్, వేద)మనకి అలా అచ్చెయ్యలేదేమో? అదే ఈ నాటి రిపోర్టర్లైతే, అప్పట్లో మన ప్రధానైన శ్రీమాన్ దేవగౌడ గారి కునుకుపాట్లను సచిత్రంగా అచ్చేసేసారు. ఆయన తెగ ఉడుక్కున్నాడు కూడా. ఇంకో ప్రధాని కీ.శే.పి.వి. గారు ఎప్పుడూ పడుకొన్నట్లే ఉండేవారు, కాని నిత్య జాగృతులని తర్వాత తేలింది. ఒక విషయం నాకర్ధమైందేమిటంటే, ముఖ్య, ప్రధాన మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు వాళ్లు పొద్దున్నే 'బ్రహ్మ' లేదా 'జెహోవా(?)' ముహోర్తంలో లేచేస్తామని, దేశం లేదా రాష్ట్రాన్ని దొబ్బడం (సారీ తప్పుగా అనుకోకండి, దొబ్బడం అంటే తొయ్యడం, ముందుకి తోయడం) గురించి తెగ ఆలోచిస్తామని తప్పనిసరిగా రాయించుకొంటారు. కాని, కీ.శే.అంజయ్య లాంటి అమాయకులు (నిజంగా)ఈ విషయం తెలుసుకోక తాము లేటుగా లేస్తామన్న సంగతి కూడా దాచుకోకుండా పోయిన దశాబ్దాల తర్వాత కూడా చంద్రబాబు లాంటి 'కృష్ణుల' చేత చెప్పించుకొంటారు. అయినా ఒక రకంగా చూస్తే అంజయ్య గారు చాలా అదృష్టవంతులు. ఆయన మీద వాలే ఈగల్ని తోలడానికి తెలంగాణా అ(ఉ)గ్ర నాయకత్వం సిద్ధంగా ఉంది (నాయకుడుంటే మిగిలిన వాళ్ళున్నట్లేకదా?). పి.జె.ఆర్. స్పందించాడు కానీ, అంత గొప్పగాలేదు. ఆయనేమన్నడు- తెలంగాణా ప్రజల్ని ....... అనడంభాభవ్యంకాదు, నిన్ను పైకి తీసుకొచ్చిన అంజయ్యనే విమర్సిస్తావా, ... ఇల్లాంటిఏమిటేమిటో చెప్పాడు. కేసీఆర్ అన్న మాత్రం బలే రిటార్టిచ్చాడు. 'మాయిష్టం పడుకొమ్టే పడుకొంటాం. అసలు లేవనే లేవం. ఏంటంటా? ఆయినా నీలా పొద్దుగాక ముందే లేచి గోతులు తవ్వం' అని మళ్ళీ ఎవరూ నోరెత్తకుండా చేశాడు. నాకైతే కేసీఆర్ పిచ్చపిచ్చగా నచ్చేసాడు. ఇప్పుడు హాయిగా మనం ఎంత సేపు పడుకొన్నాఅడిగేవాడు లేడు. అయినా తెలంగాణా ప్రజలు పడుకోబట్టే కదా నాయకులు ఇంతకాలం హ్యాపీగా పండుగ చేసుకొన్నారు. వాళ్లు నిద్ర మత్తులో ఉంటేనే కదా ఎవరేం చెప్పినా చెల్లేది. ఇపుడు వాళ్లు లేస్తే ఎన్ని సమస్యలు?