Saturday, April 19, 2008

దురాశ+అసంతృప్తి =?

ఈమధ్య ఓసినిమాలో విన్న వ్యాఖ్యః- మనిషి దురాశా జీవి. దురాశ దుఃఖమునకు చేటు అని చిన్నప్పుడు చదువుకున్నాం. అప్పుడు ఏదో వల్లెవేయడమే కానీ అర్ధం అంత తెలియలేదు. ఇలాంటివి అనుభవం మీదే తెలుస్తాయి- కొంతమందికి మాత్రమే అని వేరే చెప్పఖ్ఖర్లేదనుకుంటా. అయితే అనుభవాలని, పరిశీలనలనీ క్రోడీకరించగా తెలిసినదేమిటంటే మన దురాశ వేరే వాళ్ళ దుఃఖానికి చేటు అని. అలాగే వేరే వాళ్ళ దురాశ మన దుఃఖానికి చేటు. దురాశకి లోనవకుండా మనని మనం కాపాడుకోవడమే కాకుండా, ఇతరుల దురాశకి బలైపోకుండా ఆత్మరక్షణ చేసుకోడం చాలా అవసరం. దురాశ పడేవాళ్ళకి ఓ ఉదాహరణ భాగ్యనగర ఆటో డ్రైవర్లు, ప్లంబర్ల వంటి ఇతర పనివారు. పని చేయకుండా (లేదా అతితక్కువ పని చేసి)అధిక మొత్తం అడగడం వీళ్ళకి పరిపాటి. వాళ్ళడిగినదిచ్చాకా కూడా తీసుకున్న సొమ్ముకి తగిన పని చేయాలని రూలేం లేదు.

పోయిన వారం ఒకరోజు గాత్రి 9 గంటలకి బిర్లామందిర్ దగ్గరి కామత్ హోటల్ దగ్గర టైరుపంక్చరయింది. దగ్గర టూల్ బాక్సులేక వేటకి పోయి నాంపల్లి దగ్గరనుండి ఒక కుర్రాడిని పిలుచుకు వచ్చా. 70 రూపాయలడిగాడు. చేసేది లేక ఓకే అన్నా. దార్లో నాంపల్లిలో ఉన్న కామత్ అనుకున్నా ఇక్కడికి తీసుకొచ్చారు అని నసిగాడు. పనయ్యాక 80 ఇచ్చా. ససేమిరా అన్నాడు. 100 ఇచ్చా. కామత్ అన్నారు ఇక్కడికో తీసుకొచ్చారని నిష్ఠురపడ్డాడు. అందుకే 100 ఇచ్చా అని, వెనక్కి ఆటోలో వెళ్ళినా తనడిగిన దానికన్నా ఎక్కువే ముట్టిందని రకరకాలుగా నచ్చచెప్పా. చివరికి బస్సులో వెళ్తా ఇంకో 5 ఇమ్మన్నాడు. టైరు మార్చడానికి అయ్యే కూలీ ప్రయాణించిన దూరాన్ని బట్టి ఉంటుంది కానీ టైరు మార్చడానికి పడ్డ శ్రమని బట్టి కాదన్నమాట. కన్‌వేయన్సు చార్జెస్ ఎక్ష్ట్రా ప్లీజ్జ్...

నిన్న రాత్రి తాజా భేటీ ఒక ఆటో డ్రైవరుతో. రాత్రి 9 గంటలకి నైట్ టైమయిందని ప్రకటించేసాడు. కాస్త నోరు పారేసుకుని కింద పడ్డా మనదే పైచేయన్నట్లు పదిరూపాయలు ఎక్కువకి ఒప్పుకుని (చచ్చినట్లు)ఇంటికి జేరా. ఇంకా గట్టిగా మాట్లాడితే కేసీఆర్ పద్ధతిలో లక్షల్లో ఛార్జి చేస్తాడేమోనని భయమేసింది. అసలు వీళ్ళబోంట్లని చూసే కేసీఆర్ కి ఈకూలీ ఆలోచన వచ్చిందేమో. ఇంకో అడుగేసి తెలంగాణా వస్తే కూలీ రేట్లు ఈ రేంజిలోనే ఉంటాయని ఆయన వాకృచ్చినా ఆశ్చర్యం లేదు.

దురాశ అనగానే నాకు ఈమధ్య చదివిన చందమామ కథలాంటిది ఒకటి గుర్తొస్తుంది. ఒక జాలరివల్లో ఓరోజు బంగారు చేప పడింది. అతను సంతోషిస్తోంటే ఆచేప తనని వదిలేయమని, అందుకు బదులుగా ఏదైనా ఉపకారం చేస్తానని బతిమాలుతుంది. ఆయన బాలిపడి వదిలేసాడు. ఆనక పెళ్ళాం చేత నానా చివాట్లూ తిని, చివరికి ఆవిడ పోరుకిలొంగి చేపని సంపద కోరుకుంటాడు. సంపదొచ్చాక కొన్నాళ్ళకి జాలరి పెళ్ళానికి అసంతృప్తి కలుగుతుంది. మళ్ళీ మొగుడి బుర్ర తిని చేపని పేద్ద భవనం, తోట వగైరాలు, ఆతర్వాత విడతలో పరిచారకులు, రాచరికపు హంగులు తెప్పించుకుంటుంది. అసంతృప్తి ఆగక సూర్యచంద్రులు తనదగ్గరే ఉండేలా చేపని వరం కోరమని మొగుడ్ని పంపిస్తుంది. పాపం జాలరి చేపకి తన జాలిగాధ వినిపించి బాధపడతాడు. చేప నవ్వి అలాగే చేస్తానని ఓదార్చి పంపేస్తుంది. ఇంటికి వచ్చిన జాలరికి తన పాతగుడిసె లో తన పెళ్ళాం కారాలూ, మిరియాలూ నూరుతూ కన్పిస్తుంది. ఇతన్ని చూడగానే విరుచుకు పడుతుంది. అప్పుడు జాలరికి చేప నవ్వు అర్ధమయ్యి పెళ్ళాంతో,"చేప నీకోరిక తీర్చింది చూడు, మన గుడెసెకప్పు లోంచి పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడూ నీదగ్గరే ఉంటా"రని అంటాడు. కధకాబట్టి దురాశకి పనిష్‌మెంటొచ్చింది. నిజజీవితంలో బాగా టైం పట్టచ్చు.

దురాశకి మాతృకా, సోదరీ అసంతృప్తి. కొందరికి బెస్టు ఫలితం వచ్చినా ఇంకా ఏదో వెలితి. బేరాలాడేవాళ్ళకి ఇది తెలిసేఉంటుంది. ఒకాయన గొడుగుకి చేసిన బేరానికి చిరాకెత్తిన షాపతను ఉత్తినే తీసుకు పొమ్మన్నాడట. దానికా పెద్దమనిషి రెండిస్తావా అన్నాడట. ఆమధ్య ఓకథ చదివా. అందులా ఒక నిత్య అసంతృప్తుడి చొక్కాకి బాల్‌పాయింటు పెన్ను ఇంకు అంటుకుంది. తర్వాతి రోజు జరగబోయే ఇంటర్వ్యూకి ఆఅచ్చొచ్చిన చొక్కా వేసుకోవాలని తెగ గొడవ చేసి అందరి బుర్రలూ తింటాడు,. అతని బావగారు తనకితెలిసిన డ్రైక్లీనరు ఆఇంకు మరక పోగొట్టగలడని చెప్తాడు. దానికి ఆ ని.అ.డ్రైక్లీనర్ల అసమర్ధత గురించి, బాల్‌పాయింటు ఇంకు కున్న బంకతనం గురించీ తెగ నిస్పృహ పడిపోతాడు. బావమరిదిని ఉత్సాహపరచాలని, ఆబావగారు తనకి తెలిసిన డ్రైక్లీనరి ప్రతిభని తెగపొగుడుతాడు. ఎలాగైనా బావమరిదిని ఒప్పించి, మెప్పించాలని, అతన్ని సంతృప్తి పరచాలని గాఠ్ఠిగా అనుకుని ఆషర్టుని డ్రైక్లీనరుకిచ్చి, తన పరిస్థితి విన్నవించి ఆచొక్కాని ఉతికించితెస్తాడు. మరక పోయింది అని గర్వంగా బావమరిదికి చూపిస్తే ఆ ని.అ. "చూడండి బావగారూ, ఈమధ్య బాల్‌పాయింటు ఇంకు ఎంత నాసిగా చేస్తున్నారో" అని వాపోయాడు. :)!!??

దురాశ+అసంతృప్తి =అశాంతి(తనకి+చుట్టుపక్కలవారికీ)

Monday, April 07, 2008

ఉగాది శుభాకాంక్షలు

సర్వధారి నామ సంవత్సరం మీఅందరికీ సంతోషాన్నీ, ఆరోగ్యాన్నీ, సంపదల్నీ, బ్లాగులు రాసే బుద్ధినీ, బ్లాగ్వృద్ధినీ ఇవ్వాలనీ నా బ్లాగ్ముఖంగా కోరుకుంటున్నా.
ఈఉగాది తెలుగు బ్లాగరులకి మరిచిపోలేని రోజు. ఒక యుగాది. ప్రవీణ్ ధృఢసంకల్పంతో, దీక్షగా తెలుగుబ్లాగులని ఒక సంకలనంగా తీసుకురావడం తెబ్లా చరిత్రలో ఒక మైలురాయి. రావు గారూ- ప్లీజ్.. నోట్ దిస్పాయింటు. వీవెనుడి ముఖపత్ర వీవింగు నిరాడంబరతలో కూడా సౌందర్యం నింపచ్చని తెలిపింది. ఎంపిక చేసిన టపాలని వివిధ శీర్షికల కింద క్రోడీకరించి పుస్తకాన్ని తీర్చిదిద్దిన ప్రవీణుడి ప్రావీణ్యం మెచ్చుకోదగింది. ఆయనకి అభినందనలు. ఈ పుస్తకం ఇక్కడ ఉంది-- తెలుగు బ్లాగుల సంకలనం.
ఈ పుస్తకాన్ని పదిమందికి పంపించిన రామయ్య గారి బ్లాగుకి విజిటర్ల తాకిడి విపరీతంగా పెరిగింది. సోమయ్యగారి బ్లాగులో అనేకమంది సువ్యాఖ్యలు కుమ్మరించారు. దాంతో వాళ్ళు మహాబ్లాగర్లయిపోయారు. ఇదంతా ట్రాషని కొట్టిపాడేసిన దానయ్యగారి బ్లాగుకి విజిటర్లసలు రాకపోవడంవల్ల విలపిస్తోనే ఉన్నారు. అందుకని మీరు వెంటనే ఓపది మంది తెలుగువాళ్ళకి ఈపుస్తకాన్ని కాని, దాని లింకునికానీ పంపించి మహా బ్లాగర్లయిపోండి.