Wednesday, October 16, 2024

తెలుగు వాగ్గేయకారుల రచనలలో ప్రబోధాలు

తెలుగు వాగ్గేయకారుల రచనలలో ప్రబోధాలు

సోదాహరణ ప్రసంగం

రచన: సత్యసాయి  కొవ్వలి

తెలుగు వాగ్గేయకారులలో త్యాగరాజు, శ్యామశాస్త్రి, అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య వంటి వారు ముఖ్యులు. వీరిలో చాలామంది కేవలం భక్తి ప్రధానంగా కీర్తనలు రాసి ఆలపించారు. అత్యధిక సంఖ్యలో కీర్తనలు రాసిన త్యాగయ్య, అన్నమయ్యలు వారి భక్తితో పాటు తత్కాలీన సామాజిక రుగ్మతలు, పోకడలు, మానవ సంబంధాలు, వ్యవహారాల పై తమ ఆలోచనలను తమ రచనలలో చూపించారు. వీరి కీర్తనలను ఉదాహరిస్తూ వారు తమ సామాజిక బాధ్యతను ఏ రకంగా తమ రచనలో చూపించారో గమనిద్దాం. సామాజిక బాధ్యత అంటే నా దృష్టిలో సంఘంలో దురాచారాలను ఎత్తిచూపడం, సాటివారికి తన అనుభవాల దృష్ట్యా మార్గ నిర్దేశం చేయడం, తన విద్యని ఇతరులకి నిస్వార్ధంగా నేర్పడం ఇత్యాదులు మాత్రమే కాకుండా ‘సులభముగా కడతేరను సూచనలను తెలియజేయడం’ కూడా.

కాకర్ల త్యాగబ్రహ్మం (త్యాగరాజు)

త్యాగరాజస్వామి వారు 4 మే 1767 -6 జనవరి  1847 మధ్య కాలంలో జీవించారు. నాదోపాసనే  జీవితాశయంగా చేసుకుని  తన 80 సంవత్సరాల సుదీర్ఘ జీవిత ప్రయాణంలో కొన్ని వేల కీర్తనలు రచించారు. సంగీత త్రిమూర్తులలో ప్రముఖులైన ఈయన తన జీవితాన్ని రాముని సేవకై అంకితం  చేసి కేవలం ఊంఛవృత్తి తో జీవనం గడిపారు. ఆ విధంగా భక్తికి, వైరాగ్యానికి, నాదోపాసనకి, నిర్మోహత్వానికి ప్రతీకగా జీవించి తన జీవితమే ఒక ప్రబోధముగా నిరూపించిన మహనీయుడు ఆయన.

త్యాగరాజ స్వామి వారు తమ అనేక రచనలలో మనసుని సంబోధిస్తూ ఆత్మ ప్రబోధానికి ఎక్కువ విలువ ఇచ్చారు. ఈ ధోరణిలో ఇతరులకి బుద్ధి చెప్పడం కేవలం ఎవరిని నొప్పించకుండా వారిని సంస్కరించడానికి ప్రయత్నించడం అని అనిపిస్తుంది. ‘మనసా ఎటు లోర్తునే[1],  నిధి చాలా సుఖమా[2], సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా[3] అని తనని తాను ప్రశ్నించుకున్నా అవన్నీ మనకు ఇచ్చిన  సందేశాలే. వాటిలో ముఖ్యమైనవి  నాదోపాసన చేయమని, భక్తి కలిగి ఉండమని.  నాదలోలుడై బ్రహ్మానందమందవే[4], ‘ప్రాణానల సంయోగము వల్లా ప్రణవనాద సప్తస్వరములే బరగా- మోక్షము కలదా[5],  అని చెప్పినా, ‘భజన చేయరాదా[6] అని సలహా ఇచ్చినా,  భజనపరులకేల దండపాణి భయము[7] అని ధైర్యం చెప్పినా  మనకి ఆయన ఉపదేశించదలచినది భక్తి మరియు సంగీత జ్ఞానం అలవర్చుకోమని. అందరికీ సంగీత జ్ఞానం అలవర్చుకోవడం సాధ్యం కాదు అని తెలిసి దయతో అందరూ పాడుకోగల ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, భజన సాంప్రదాయ పద్ధతిలో కీర్తనలు ఆయన స్వరపరిచారు.

త్యాగరాజ స్వామి వారు ఆ రోజుల్లోనే మన ఈనాటి పరిభాషలో చెప్పాలంటే గొప్ప యాక్టివిస్ట్. ‘యజ్ఞాదులు సుఖమనువారికి  సములజ్ఞానులు కలరా?[8] అని ప్రశ్నించి యజ్ఞాలు చాలా ముఖ్యము అనుకునే ఆ రోజుల్లోనే తన తిరుగుబాటు ధోరణి ప్రదర్శించారు. జన్మవాసనలు, విషయాసక్తి లో తగిలి శ్రీరాముని తెలియక యజ్ఞ్యాదులు సుఖం అనుకోవడం అజ్ఞానమని ఆయన అభిప్రాయం. సుజ్ఞానం కావాలంటే మనమేం చేయాలో తత్వముపదేశించిన మహర్షి ఆయన. అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు, [9] అని ఒక చోట చెప్తే శాంతము లేక సౌఖ్యం లేదని [10] ఇంకో కృతిలో  చెప్పారు.

మనసు స్వాధీనమైన ఆ ఘనునికి మరి మంత్ర తంత్రము లేల?[11] అని చెప్పిన స్వామి వారు ‘మనసు నిలప శక్తి లేకపోతే మధుర ఘంట విరుల పూజేమిసేయును[12] అని మనస్సును అదుపులో పెట్టుకో లేకపోతే మన నిత్య పూజలు నిరర్థకమని తెగేసి చెప్పారు. ఘన దుర్మదుడు చేసే పుణ్య నదీ స్నానం, సోమిదమ్మ సొగసుకాండ్రను కోరితే సోమయాజి  స్వర్గార్హుడవడని,  కామ క్రోధాలు వదలకుండా చేసిన తపస్సు దండగని ఆయన ఈ కీర్తనలో విశదీకరించారు.

ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారలైనా కాంతదాసులే[13] అని మానవ బలహీనతని ఎత్తి చూపిన కీర్తన ఈ రోజుకీ వర్తిస్తుంది. అందులో పరహింస, పరభామ, పరధనాల పట్ల అనురక్తి, పరమానవాపవాదం, పరజీవనం, వీటి కోసం అబద్ధం ఆడటం వంటి బలహీనతలను త్యాగరాజ స్వామి వారు ఉటంకిస్తారు. నిరసిస్తారు. శివ శివ శివ యనరాదా[14] అన్న కృతిలో కామాదుల తెగఁ గోయమని కామవర్ధని రాగంలో చెప్పడం ఆయన చమత్కారం. వీటినుండి విముక్తి ఏదయ్యా అంటే, సంతతంబు శ్రీకాంత స్వాంతసిద్ధాంతమైన మార్గ చింత చేయడం. అలాగే ఎన్ని విద్యలు నేర్చినా పెద్దల సుద్దులు వినకపోతే బుద్ధి రాదు బుద్ధి రాదు[15] అని కూడా చెప్పారు. బుద్ధి తెచ్చుకోవాలంటే ధర్మం చేయడం కన్నా అనన్య చిత్తభక్తుల వాగమృత పానము, పురాణ పఠనం కన్నా మానుషావతార చరిత మర్మజ్ఞుల జతగూడటం, యోగాభ్యాసం కన్నారామదాసుల చెలిమి చేయడం మిన్నయని అని ఉద్బోధించారు.

ఆడంబరాలు, డాంబికాలను త్యాగరాజు ఇష్టపడలేదు. బయట ఒకటి లోపల ఒకటి ఉండకూడదని, గొప్పతనముకై ఆస, కుత్సిత విషయ పిపాసలు వదలక, మెప్పులకై భజన చేసే పద్ధతిని విమర్శిస్తూ ‘అది కాదు భజన, మనసా[16] అని వివరించారు. అలాగే తెలియలేరు రామ భక్తి మార్గమును[17] అనే కీర్తనలో భక్తి లేకుండా హడావిడి చేస్తూ, తమ వేష భాషలతో పైకి గౌరవనీయులుగా చలామణి అవుతూ డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న వారి గురించి జాలి పడతారు.

తనకి ఉన్న విద్వత్తుతో, రాజుల ఆదరణతో త్యాగరాజ స్వామి తలుచుకుంటే అత్యంత ధనవంతుడై ప్రాపంచిక సుఖాలను అనుభవించి ఉండేవారు. కానీ నిధి సుఖమేకాదని రాముని సన్నిధిని మాత్రమే ఆయనవలె కోరుకోవడం మానవమాత్రులు చేయలేని పని. నాదుపై పలికేరు నరులు[18] అన్న కీర్తనలో జానెడు ఉదరమునింప నొరుల పొగడితినాఅని నిలదీస్తారు. ఇదే భావం దుర్మార్గ చరాధముల దొర అనజాలరా[19] అని రంజనిలో రంజకంగా చెప్పారు. ఆ కృతిలో సరస్వతిని అమ్మనని, ఖలుల నెచట పొగడను అని వక్కాణించారు.

ఈరోజు మనం చూస్తున్న మత భేదాల లాగే ఆ రోజుల్లో కూడా ద్వైత అద్వైతాల మధ్య, శివ కేశవుల మధ్య భేదాలు ఎంచి కత్తులు నూరుకునేవారని  మనం విన్నాం. త్యాగరాజ స్వామి వారు తమ కీర్తనల్లో వీటిని చర్చించారు. ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా[20] అని తీవ్రంగా ప్రశ్నించారు. ఎవరని నిర్ణయించిరిరా, నిన్నెట్లు ఆరాధించితిరా -శివుడనో, మాధవుడనో, కమలభవుడనో, పరబ్రహ్మమనో[21] అని ప్రశ్నించడంలోనే అందరూ సమానం అనే భావన కలిగించడం ఒక విశేషం. త్యాగరాజస్వామి గారు శివకేశవులను సమానంగా భావించే వారిని గౌరవించారు.

ఈ విధంగా త్యాగరాజు వారి భోధనలు ఉన్నత మానవతా విలువలు నెలకొల్పడానికి పనికొస్తాయి. ప్రస్తుతం జాతకాలు గ్రహశాంతుల పేరిట ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో మనకు తెలుసు. గ్రహబలమేమి శ్రీరామానుగ్రహబలమే బలము[22] అని జాతకాల వంటిని నమ్ముకోవడం అనవసరమని ఆనాడే బోధించారు.

త్యాగరాజ స్వామివారి కృతులన్నీ ఒక యెత్తు, వారి పంచరత్న కీర్తనలు ఒక యెత్తు.  వాటిలో ఒకటి దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోతురా[23]. కడు దుర్విషయా కృష్ణుడై గడియ గడియకు నిండారు దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఆయన కీర్తనలన్నిటిలోనూ ఉన్న ప్రబోధాల సారాంశం ఈకీర్తన అని చెప్పచ్చు.

తాళ్ళపాక అన్నమయ్య

భక్తి, శృంగారము, ఆధ్యాత్మికత వంటి భావాలతో పుంఖానుపుంఖలుగా సుమారు 32 వేల కీర్తనలు తెలుగు, సంస్కృతాలలో రాసిన గొప్ప వాగ్గేయకారుడు, తాళ్ళపాక అన్నమయ్య.  తన కీర్తనలలో సమాజంలోని చెడుని ఎత్తి చూపించిన మొదటి వాగ్గేయకారుడు ఆయన. సుమారు 95 సంవత్సరములు (22 మే 1408 – 4 ఏప్రిల్ 1503) జీవించిన ఆయన భక్తుడు, మహర్షి, వాగ్గేయకారుడు, సామాజికోద్ధారకుడు.  పదకవితా పితామహుడు.

అన్నమయ్య సామాజిక సమానత్వాన్ని అత్యున్నతంగా నిరూపించిన కీర్తన బహుశః తందనానాపురే తందనానా అహే... బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే[24] అన్నది. ఈ కీర్తనలో అన్నమయ్య హీనాధిక భేదాలు లేకుండా అందరిలోనూ ఉండే అంతరాత్మ పరమాత్మ అయిన ఆ శ్రీహరియే అని నిరూపించాడు.  ఎండా-నీడా, రాత్రి-పగలు, నిద్ర, సుఖం, భూమి ఇవన్నీ రాజుకి-బంటుకి, బ్రాహ్మణుడికి -ఛండాలుడికి, జీవులకి -దేవతలకి, కుక్కకీ-ఏనుగుకి,  అందరికీ ఒకే రకంగా వర్తిస్తాయని నొక్కి వక్కాణించాడు. అనేక కీర్తనలు జానపద శైలిలో వ్రాసిన ఆయన జానపదకవితా పితామహుడు కూడా. అందుకే ఆయన కీర్తనలు జనబాహళ్యం లోకి బాగా చొచ్చుకు పోయాయి.

అన్నమయ్య కూడా, త్యాగయ్య లాగ, నరస్తుతి చేయడానికి నిరాకరించాడు. అందువల్ల చెరసాల పాలయ్యాడు కూడా. హరినామము కడు నానందకరము[25] అని హరినామ విశేషాన్ని, బంధవిముక్తి మార్గాన్ని తెలిపారు. అప్పులేని సంసారమైన పాటే చాలు - తప్పులేని జీతం ఒక్క తారమైన చాలు[26] అన్న పాటలో మనిషి ఎంత నిరాడంబరంగా ఉండొచ్చో నిరూపిస్తాడు. ఇంకొక కీర్తన, వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు[27], లో ఈ సంసారబంధంలో మనిషి ఎలా కూరుకుని పోతాడో కళ్ళకి కట్టినట్లు చూపిస్తాడు. అలాగే చావు, పుట్టుక, పుణ్యం, పాపము వంటి వాటి మధ్య జీవితం ఎంతటి నాటకమో నానాటి బతుకు నాటకం[28] అని ఎరుకబరుస్తాడు. మోహము విడుచుటె మోక్షమది దేహమెరుగుటే తెలివీనదే[29] అన్న కీర్తనలో మోక్షము, తెలివి, పరమము, కలిమి, కులహీనత,  మలినము, నరకము, సుకృతములను సులభముగా నిర్వచిస్తూ ఆత్మవిద్య బోధిస్తాడు.  భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను- తీరని చేదేకాక తీయనుండేనా[30] అన్నఇంకో కీర్తనలో కుక్కతోక వంకర తీయలేమని, తేలుని ఎంత ప్రేమతో కోకలో పెట్టుకున్నా కుట్టక మానదని, ఘోరమైన ఆసలు కూడా ఎంత వేంకట విభుని కృప ఉన్నా ఒక పట్టాన పోవని చెప్పాడు.

త్యాగరాజు వలె అన్నమయ్య కూడా పరనింద, పరభామల వలపు, జీవహింస, దారాసుత సేవలో సమయము వృధా చేసుకోవడం  వంటి వాటిని తన కీర్తనలలో నిరసించాడు. కులప్రమేయం లేకుండా ఎవ్వరైనా హరిని తెలుసుకోవచ్చని ఏ కులజుఁడేమి యెవ్వఁడైననేమి[31] అన్న కీర్తనలో పరనింద చేయకుండుట, భూతదయ, ఆత్మతత్వాన్ని ఎరుగుట, హరినెరిగిన వారి లక్షణాలు యని వివరించాడు.  

పరమాత్మ తత్వాన్ని అత్యంత మనోహరంగా చిత్రించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఎవ్వరు ఎలా భావిస్తే అలాగే పరమాత్మ ఆవిష్కరించబడతాడని ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు[32] అని భగవంతుని తత్వాన్ని గొప్పగా చెప్పాడు. పురుషోత్తముడ నీవు, పురుషాధముడ నేను[33] వంటి కీర్తనలలో దోషాలు తనకే ఆపాదించుకుని, తనని తాను తక్కువ చేసుకుని సుగుణాలన్నీ శ్రీనివాసుడికి అన్వయించి ఆయన్నిఅధికుడిని చేయడం భక్తిలో ఒక నైపుణ్యం. ఒక లౌక్యం. ఒక విశేషం.

ఇలా చెప్పుకుంటూ పోతే త్యాగరాజు, అన్నమయ్యల జీవితమే ఒక బోధన. వారి కలం నుండి వచ్చిన ప్రతి మాట ఒక బాట. ప్రతిపాట ఒక పాఠం. వినయం ప్రతిబింబించే త్యాగయ్య గారి మాటల్లోనే చెప్పాలంటే ఎందరో మహానుభావులు- అందరికీ వందనములు.


 

ఈ వ్యాసంలో ఉదహరించిన కీర్తనల పూర్తి పాఠం



[1] మనసా ఎటు లోర్తునే- మలయమారుతము – రూపకము

పల్లవి: మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే ఓ ॥మ

అను పల్లవి: దినకరకుల భూషణుని -దీనుఁడవై భజనఁజేసి
దినముఁ గడుపమనిన నీవు -వినవదేల గుణవిహీన ॥మ

చరణము: కలిలో రాజస తామస గుణములు - గలవారి చెలిమి
కలిసిమెలసి తిఱుగుచు మఱి - కాలము గడపకనే
సులభముగాఁ గడతేరను - సూచనలను దెలియఁజేయు
ఇలను త్యాగరాజుమాట - వినవదేల గుణవిహీన ॥మ॥

[2] నిధి చాలా సుఖమా -కల్యాణి - త్రిపుట ( - చాపు)

పల్లవి: నిధిచాల సుఖమో రాముని సన్నిధిసేవ సుఖమో నిజముగఁ బల్కు మనస ॥ని॥

అను పల్లవి: దధి నవనీత క్షీరములు రుచో దాశరథీ ధ్యానభజన సుధారసము రుచో ॥ని॥

చరణము(లు):

శమ దమ మను గంగాస్నానము సుఖమో కర్దమ దుర్విషయ కూపస్నానము సుఖమో
మమత బంధవయుత నరస్తుతి సుఖమో సుమతి త్యాగ రాజనుతుని కీర్తన సుఖమో ॥ని

[3] సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే -ధన్యాసి - దేశాది

పల్లవి: సంగీతజ్ఞానము భక్తివినా సన్మార్గము గలదె మనసా ॥సం॥

అను పల్లవి: భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదు లుపాసించే ॥సం॥

చరణము(లు):

న్యాయాన్యాయము దెలుసును జగములు - మాయామయమనె దెలుసును దుర్గుణ
కాయజాది షడ్రిపుల జయించే - కార్యము దెలుసును త్యాగరాజునికే ॥సం॥

[4] నాదలోలుడై బ్రహ్మానందమందవే మనసా’ -కల్యాణ వసంత - రూపక

పల్లవి: నాదలోలుఁడై బ్రహ్మానందమందవే మనసా ॥నా॥..

అను పల్లవి: స్వాదుఫలప్రద సప్తస్వరరాగనిచయసహిత ॥నా॥..

చరణము(లు):

హరిహరాత్మ భూ సురపతి శరజన్మ గణేశాది
వరమౌను లుపాసించరే ధర త్యాగరాజు తెలియు ॥నా॥.

[5] మోక్షము కలదా -సారమతి - దేశాది

పల్లవి: మోక్షముగలదా భువిలో జీవ - న్ముక్తులు గానివారలకు ॥మో॥

అను పల్లవి: సాక్షాత్కార నీసద్భక్తి - సంగీతజ్ఞానవిహీనులకు ॥మో॥

చరణము(లు):

ప్రాణానల సంయోగము వల్ల ప్రణవనాదము సప్తస్వరములై బరగ
వీణావాదనలోలుఁడౌ శివమనోవిధ మెఱుఁగరు త్యాగరాజ వినుత ॥మో॥

[6] భజన చేయరాదా -అఠాణ - రూపకం

పల్లవి: భజన సేయరాదా? రామ ॥భజన॥

అను పల్లవి: అజ రుద్రాదులకు సతత మాత్మ మంత్రమైన రామ ॥భజన॥

చరణము(లు):

కరకు బంగారు వల్వ కటి నెంతో మెరయగ
చిరు నవ్వులు గల మొగమును చింతించి చింతించి ॥భజన॥

అరుణాధరమున సురుచిర దంతావళిని
మెరయు కపోల యుగమును నిరతమునను దలచిదలచి ॥భజన॥

బాగుగ మానస భవ సాగరమునను తరింప
త్యాగరాజు మనవిని విని తారకమగు రామనామ ॥భజన॥

[7] భజనపరులకేల దండపాణి భయము-సురటి - రూపకము

పల్లవి: భజనపరులకేల దండ - పాణి భయము మనసా! రామ॥భ॥

అను పల్లవి: అజ రుద్ర సురేశుల - కాస్థానమొసంగు రామ ॥భ॥

చరణము(లు):

అండకోట్ల నిండిన కో - దండిపాణి ముఖమును హృత్‌
పుండరీకమునఁజూచి - పూజ సల్పుచు
నిండుప్రేమతోఁ గరంగు - నిష్కాములకు వరవే
దండ పాలు దాసుఁడైన - త్యాగరాజుసేయు నామ ॥భ॥

[8] యజ్ఞాదులు సుఖమనువారికి  సములు అజ్ఞానులు కలరా? -జయమనోహరి – ఆది

పల్లవి:యజ్ఞాదులు సుఖమను వారికి సమ
మజ్ఞానులు గలరా? ఓమనసా ॥యజ్ఞాదులు

అను పల్లవి:సుజ్ఞాన దరిద్ర పరంపరుల
సురచిత్తులు జీవాత్మ హింసగల ॥యజ్ఞాదులు

చరణము(లు):బహు జన్మంబుల వాసన యుతులై
అహి విష సమ విషయాకృష్టులై
బహిరాననులై త్యాగరాజు
భజియించు శ్రీరామునికిఁ దెలియక ॥యజ్ఞాదులు॥

[9] అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు -సరస్వతి - రూపకం

పల్లవి: అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు అ..

అను పల్లవి: ఘనులైన యంతర్జ్ఞానుల కెఱుకేగాని అ..

చరణము(లు):

వగవగగా భుజియించువారికి తృప్తియౌరీతి
సగుణధ్యానముపైని సౌఖ్యము త్యాగరాజనుత అ..

[10] శాంతము లేక సౌఖ్యము లేదు- సామ - ఆది

పల్లవి: శాంతములేక సౌఖ్యములేదు - సారసదళనయన ॥శాం॥

అను పల్లవి: దాంతునికైన వే - దాంతునికైన ॥శాం॥

చరణము(లు):

దారసుతులు ధన ధాన్యము లుండిన -సారెకు జప తప సంపదగల్గిన ॥శాం॥

యాగాదికర్మము లన్నియుఁజేసిన -బాగుగ సకలహృద్భావముఁ దెలిసిన ॥శాం॥

ఆగమశాస్త్రము లన్నియు జదివిన -భాగవతులనుచు బాగుగఁ బేరైన ॥శాం॥

రాజాధిరాజ శ్రీరాఘవ త్యాగ -రాజవినుత సాధురక్షక తనకుప ॥శాం॥

[11] మనసు స్వాధీనమైన ఆ ఘనునికి మరి మంత్ర తంత్రము లేల? -శంకరాభరణము - రూపకము

పల్లవి: మనసు స్వాధీనమైన యా ఘనునికి మఱి మంత్రతంత్రము లేల ॥మ॥

అను పల్లవి: తనువు తానుగాదని యెంచువానికి తపసు చేయనేల దశరథబాల ॥మ॥

చరణము(లు):

అన్ని నీవనుచు యెంచినవానికి యాశ్రమ భేదములేల
కన్నుగట్టు మాయలని యెంచువానికి కాంతల భ్రమలేల దశరథబాల ॥మ॥

ఆజన్మము దుర్విషయ రహితునికి గతాగత మికనేల
రాజరాజేశ నిరంజన నిరుపమ రాజవదన త్యాగరాజ వినుత ॥మ॥

[12] మనసు నిలప శక్తి లేకపోతే మధుర ఘంట విరుల పూజేమిసేయును -ఆభోగి - ఆది

పల్లవి: మనసునిల్ప శక్తిలేకపోతే మధురఘంటవిరుల పూజేమి జేయును? మ..

అను పల్లవి: ఘనదుర్మదుఁడై తా మునిగితే కావేరి మందాకిని యెటు బ్రోచును? మ..

చరణము(లు):

సోమిదమ్మ సొగసుగాండ్రఁ గోరితే సోమయాజి స్వర్గార్హుఁడౌనో?
కామక్రోధుఁడు తపంబొనర్చితే గాచి రక్షించునో? త్యాగరాజనుత! మ..

[13] ఎంతనేర్చిన ఎంతజూచిన -సింధుధన్యాసి - దేశాది (ఉదయరవిచంద్రిక - దేశాది)

పల్లవి: ఎంతనేర్చిన ఎంతజూచిన
ఎంతవారలైన కాంతదాసులే ॥ఎం॥

అను పల్లవి:సంతతంబు శ్రీకాంతస్వాంత సిద్ధాంతమైన మార్గ చింతలేని వా ॥రెం॥

చరణము(లు):

పరహింస పరభామాన్యధన పరమానవాపవాద
పరజీవనమ్ముల కనృతమే భాషించేరయ్య త్యాగరాజ నుత ॥ఎం॥

[14] శివ శివ శివ యనరాదా -పంతువరాళి - ఆది

పల్లవి: శివశివ యనరాదా ఓరీ శివ..

అను పల్లవి: భవభయబాధల నణచుకోరాదా శివ..

చరణము(లు):

కామాదుల దెగకోసి పరభామల పరుల ధనముల రోసి
పామరత్వము నెడబాసి అతినీమముతో బిల్వార్చన జేసి శివ..

సజ్జనగణముల గాంచి ఓరి ముజ్జగదీశ్వరులని మతి నెంచి
లజ్జాదుల దొలగించి తన హృజ్జలజమునను తా పూజించి శివ..

ఆగమముల నుతియించి బహు బాగులేని భాషలు చాలించి
భాగవతులతో పోషించి ఓరి త్యాగరాజ సన్నుతుడని యెంచి శివ..

[15] బుద్ధిరాదు బుద్ధిరాదు  -శంకరాభరణం - చాపు

పల్లవి: బుద్ధిరాదు బుద్ధిరాదు పెద్దల సుద్దులు వినక ॥బుద్ధి॥

అను పల్లవి: బుద్ధిరాదు బుద్ధిరాదు భూరి విద్యల నేర్చిన ॥బుద్ధి॥

చరణము(లు):

ధాన్యధనములచేత ధర్మమెంతయుఁ జేసిన యనన్య చిత్తభక్తుల వాగమృతపానము సేయక ॥బుద్ధి॥

మానక భాగవతాది రామాయణములు చదివిన మానుషావతారచరిత మర్మజ్ఞుల జతఁ గూడక ॥బుద్ధి॥

యోగము లభ్యసించిన భోగములెంతో కల్గిన త్యాగరాజనుతుఁడౌ రామ దాసుల చెలిమి సేయక ॥బుద్ధి॥

[16] అది కాదు భజన, మనసా -యదుకుల కాంభోజి – ఆది

పల్లవి:అది కాదు భజన మనసా! ॥అది

అను పల్లవి:ఎదలో నెంచు టొకటి ప - య్యెద గల్గినచో నొకటి ॥అది

చరణము:

గొప్ప తనముకై యాస కుచ్చిత విషయ పిపాస
మెప్పులకై బహు వేస మిడి ఉప్ప తిల్లెదరు; త్యాగరాజ వినుత! ॥అది॥

[17] తెలియలేరు రామ భక్తి మార్గమును’ -ధేనుక - దేశాది

పల్లవి: తెలియలేరు రామ భక్తిమార్గమును ॥తె॥

అను పల్లవి: ఇల నంతట తిరుగుచుఁ గలువరించేరేగాని ॥తె॥

చరణము(లు):

వేగలేచి నీట మునిఁగి భూతిబూసి వేళ్లనెంచి వెలికి శ్లాఘనీయులై
బాగపైక మార్జన లోలులై రేగాని త్యాగరాజవినుత ॥తె॥

[18] నాదుపైఁ బలికేరు నరులు - మధ్యమావతి - జంప

పల్లవి: నాదుపైఁ బలికేరు నరులు
అను పల్లవి: వేదసన్నుత భవము వేఱు జేసితి ననుచు ॥నా॥

చరణము(లు):

పంచశరజనక ప్రపంచమునఁ గల సుఖము -మంచువలె ననుచు మది నెంచితిగాని
పంచుకొని ధనము లార్జించుకొని సరియెవ్వ - రంచు మఱి గతియు లేదంచుఁ బల్కితినా ॥నా॥

దినము నిత్యోత్సవమ్మున కాసఁ జెందితినా - మనసునను నిల్లు యొకటని యుంటిగాని
అనుదినము యొరులమేలును జూచి తాళలే - కను రెండు సేయవలె ననుచుఁ బల్కితినా ॥నా॥

ప్రాణమేపాటి యని మానమే మేలంటి - గాని శ్రీరామ పరమానంద జలధి
శ్రీనాథకులములో లేనిదారిని బట్టి - జానెఁడుదరము నింప నొరులఁ బొగడితినా ॥నా॥

ఆజానుబాహుయుగ శ్రీజానకీపతి ప - యోజాక్ష శ్రీత్యాగరాజనుత చరణ
ఈ జగతిలో నిన్నుఁ బూజించువారి న - వ్యాజమునఁ బ్రోచే సురాజ నీవాఁడైన ॥నా॥

[19] దుర్మార్గచరాధములను - రంజని - రూపక

పల్లవి: దుర్మార్గచరాధములను దొరనీవనజాలరా దు..

అను పల్లవి: ధర్మాత్మక ధనధాన్యము దైవము నీవై యుండగ ॥దు॥

చరణము(లు):

పలుకుబోటిని సభలోన పతితమానవులకొసఁగే
ఖలుల నెచ్చట పొగడని శ్రీకర త్యాగరాజ వినుత ॥దు॥

[20] ద్వైతము సుఖమా -రీతిగౌళ - ఆది

పల్లవి: ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా ద్వై

అను పల్లవి: చైతన్యమా విను సర్వసాక్షీ వి
స్తారముగాను దెల్పుము నాతో ద్వై

చరణము(లు):

గగన పవన తపన భువనాద్యవనిలో
నగధరాజ శివేంద్రాది సురలలో
భగవద్భక్తవరాగ్రేసరులలో
బాగ రమించే త్యాగరాజార్చిత ద్వై

[21] ఎవరని నిర్ణయించిరిరా - దేవామృతవర్షిణి - దేశాది (ఖరహరప్రియ - ఆది)

పల్లవి:ఎవరని నిర్ణయించిరిరా ని
న్నెట్లారాధించిరిరా నర వరు ॥లె॥

అను పల్లవి:శివుఁడనో మాధవుడనో కమల
భవుఁడనో పరబ్రహ్మమనో ॥ఎ॥

చరణము(లు):

శివమంత్రమునకు మా జీవము మా
ధవమంత్రమునకు రాజీవము ఈ
వివరముఁ దెలిసిన ఘనులకు మ్రొక్కెద
వితరణగుణ త్యాగరాజ వినుత ని ॥న్నె॥

[22] గ్రహబలమేమి -రేవగుప్తి - దేశాది

పల్లవి: గ్రహబలమేమి శ్రీరామానుగ్రహబలమే బలము ॥గ్రహ॥

అను పల్లవి: గ్రహబలమేమి తేజోమయ విగ్రహమును ధ్యానించు వారికి నవ ॥గ్రహ॥

చరణము(లు):

గ్రహపీడల పంచపాపముల నాగ్రహములు గల కామాదిరిపుల నిగ్రహము జేయు హరిని భజించు త్యాగరాజునికి రసికా గ్రేసరులకు ॥గ్రహ॥

[23] దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో - గౌళ - ఆది

దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో |

కడు దుర్విషయా కృష్ణుడై గడియ గడియకు నిండారు ||దుడుకు||

శ్రీ వనితా హృత్కుముదాబ్జా వాజ్మానస గోచర ||దుడుకు||

సకల భూతముల యందు నీవై యుండగ మదిలేక పోయిన ||దుడుకు||

చిరుత ప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన ||దుడుకు||

పర ధనముల కొరకు పరుల మది కరగ-బలికి కడుపు నింప దిరిగినట్టి ||దుడుకు||

తన మదిని భువిని సౌఖ్యపు జీవనమే యనుచు సదా దినములు గడిపిన ||దుడుకు||

తెలియని నటవిట క్షుద్రుల వనితలు స్వవశమౌట కుపదేశించి సంతసిల్లి స్వరలయంబు లెరుంగకని శిలాత్ముడై సుభక్తులకు సమానమను ||దుడుకు||

దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను దేవది దేవ నెర నమ్మితిని గాకను పదాబ్జ భజనంబు మరచిన

||దుడుకు||

చక్కని ముఖ కమలంబును సదా నా మిదిలో స్మరణ లేకనే దుర్మదాంధ- జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ దురాశలను రోయలేక సతత మపరాధినై చపల చిత్తుడనైన ||దుడుకు||

మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మందలేక మద మత్సర కామ లోభ మోహులకు దాసుడై మోసబోతి గాక మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటినిగాక నరాధములను చేరి సారహీన మతములను సాధింప దారుమారు ||దుడుకు||

సతులకై కొన్నాళ్ళాస్థికై సుతులకై కొన్నాళ్ళు ధన తతులకై తిరిగితి నయ్య త్యాగరాజాప్త ఇటువంటి ||దుడుకు||

[24] తందనాన ఆహి తందనాన పురె

తందనాన భళా తందనాన              పల్లవి॥

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె పరబ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే        తంద॥

కందువగు హీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మింతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ  తంద॥

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే అండనే బంటునిద్రదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే ఛండాలుడుండేటి సరిభూమి యొకటే తంద॥

అనుగుదేవతలకును అలకామసుఖ మొకటే ఘనకీటపశువులకు కామసుఖ మొకటే
దిన మహోరాత్రములు తెగి ధనాఢ్యున కొకటే వొనర నిరుఁబేదకును వొక్కటే అవియు       తంద॥

కొరలి శిష్టాన్నములు గొను నాఁకలొకటే తిరుగు దుష్టాన్నములు దిను నాఁకలొకటే
పరగ దుర్గంధములపై వయువు నొకటే వరుసఁ బరిమళముపై వాయువు నొకటే       తంద॥

కడగి యేనుఁగుమీఁదఁ గాయు యెండొకటే పుడమి శునకముమీఁదఁ బొలయు నెండొకతే
కడుఁబుణ్యులను పాపకర్ములను సరిఁ గావ జడియు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే           తంద॥

[25] హరినామము కడు నానందకరము

హరినామము కడు నానందకరము

మరుగవో మరుగవో మరుగవో మనసా               ॥పల్లవి॥

నలినాక్షుని శ్రీ నామము -కలి దోష హరము కైవల్యము

ఫలసారము బహుబంధ మోచనము -తలఁచవో తలఁచవో తలఁచవో మనసా             ॥హరి॥

నగధరు నామము నరక హరణము -జగదేక హితము సమ్మతము

సగుణ నిర్గుణము సాక్షాత్కారము -పొగడవో పొగడవో పొగడవో మనసా              ॥హరి॥

కడఁగి శ్రీ వేంకటపతి నామము -బడిబడినే సంవత్కరము

అడియాలంబిల నతి సుఖ మూలము -తడవవో తడవవో తడవవో మనసా               ॥హరి॥

[26] అప్పులేని సంసార మైన పాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైనఁ జాలు          అప్పులేని॥

కంతలేని గుడిశొక్క గంపంతయినఁ జాలు చింతలేని యంబలొక్క చేరెఁడే చాలు
జంతగాని తరుణి యేజాతైన నదె చాలు వింతలేని సంపదొక్క వీసమే చాలు                                              అప్పులేని॥

తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదె చాలు ముట్టులేని కూడొక్క ముద్దెఁడే చాలు
గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైనఁ జాలు వట్టి జాలిఁ బడుకంటే వచ్చినంతే చాలు                                              అప్పులేని॥

లంపటపడని మేలు లవలేశమే చాలు రొంపి కంబమౌకంటే రోయుటే చాలు
రంపపుఁ గోరిక కంటే రతి వేంకటపతి పంపున నాతనిఁ జేరే భవమే చాలు                                              అప్పులేని॥

[27] వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు

వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు
బట్టబయలు యీసంసారంబని గుట్టు దెలియలేవు ప్రాణీ                                                     వట్టి॥

చాల నమ్మి యీ సంసారమునకు సోలి సోలి తిరిగేవు
బాలయవ్వనప్రౌఢల భ్రమఁబడి లోలుఁడవై తిరిగేవు
మేలుదెలియ కతికాముకుండవై మీఁదెఱఁగక తిరిగేవు
మాలెమీఁద పరు వెందాఁకా నీ మచ్చిక విడువఁగ లేవు                                                     వట్టి॥

మానితముగ దురన్నపానముల మత్తుఁడవై వుండేవు
నానావిధముల దుష్కర్మంబులు నానాటికి నాటించేవు
మేనిలోని యేగురు నార్గురును మిత్రులనుచు నమ్మేవు
ఆనందంబున నాకర్మమునకు అధిపతులని తెలియఁగ లేవు                                                     వట్టి॥

పామరివై దుర్వ్యాపారమునకు పలుమారునుఁ బొయ్యేవు
వేమరు దుర్జనసంగాతంబులు విశ్రామమనుచు నుండేవు
ప్రేమముతో హరిదాసులపై సంప్రీతి నిలుపఁగా లేవు
తామసమతివయి వేంకటనాథుని తత్వ మెఱఁగఁగా లేవు                                                     వట్టి॥

[28] నానాఁటి బదుకు నాఁటకము

నానాఁటి బదుకు నాఁటకము - కానక కన్నది కైవల్యముపల్లవి

పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాఁటకము
యెట్టనెదుటఁ గలదీ ప్రపంచమును కట్టఁగడపటిది కైవల్యమునానాఁ

కుడిచే దన్నము కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాఁటకము
వొడిఁ గట్టుకొనిన వుభయకర్మములు గడి దాఁటినపుడే కైవల్యమునానాఁ

తెగదు పాపమును తీరదు పుణ్యము నగినగి కాలము నాఁటకము
యెగువనె శ్రీవేంకటేశ్వరుఁ డేలిక గగనము మీఁదిది కైవల్యమునానాఁ॥

[29] మోహము విడుచుటే మోక్షమది

మోహము విడుచుటే మోక్షమది

దేహ మెఱుఁగుటే తెలివీ నదే                                             మోహము॥

ననిచిన తన జన్మముఁ గర్మముఁ దనపనియు నెఱుగుటే పరమ మది
తనకు విధినిషేధములుఁ బుణ్యముల ఘనత యెఱుగుటే కలిమి యది                                             మోహము॥

తఱిఁ దఱిఁ బ్రేమపు తల్లిదండ్రులను యెఱఁగనిదే కులహీన తది
చఱులఁ బొరలి యాచారధర్మములు మఱచినదే తన మలిన మది                                             మోహము॥

కమ్మరఁ గమ్మరఁ గామభోగములు నమ్మి తిరుగుటే నరక మది
నెమ్మది వేంకటనిలయుని దాసుల సొమ్మయి నిలుచుట సుకృత మది                 మోహము॥

[30] భారమైన వేఁపమాను పాలువోసి పెంచినాను

భారమైన వేఁపమాను పాలువోసి పెంచినాను

తీరని చేఁదే కాక తియ్యనుండీనా       భారమైన॥

పాయఁదీసి కుక్కతోఁక బద్దలువెట్టి బిగిసి చాయ కెంత గట్టిగాను చక్కనుండీనా
కాయపు వికారమిది కలకాలముఁ జెప్పినా పోయిన పోకలేకాక బుద్ది వినీనా                 భారమైన॥

ముంచి ముంచి నీటిలోన మూల నానఁ బెట్టుకొన్నామించిన గొడ్డలి నేఁడు మెత్తనయ్యీనా
పంచమహాపాతకాలబారిఁ బడ్డ చిత్తమిది దంచి దంచి చెప్పినాను తాఁకి వంగీనా                                               భారమైన॥

కూరిమితోఁ దేలుఁదెచ్చి కోకలోన బెట్టుకొన్నా సారె సారెఁ గుట్టుగాక చక్కనుండీనా
వేరులేని మహిమల వేంకటవిభుని కృప ఘోరమైన ఆస మేలుకోర సోఁకీనా                                               భారమైన॥

[31] ఏ కులజుఁడేమి యెవ్వఁడైననేమి

ఏ కులజుఁడేమి యెవ్వఁడైననేమి ఆ కడ నాఁతడె హరి నెఱిగినవాఁడు                                                          ఏ కులజు॥

పరగిన సత్యసంపన్నుఁడైనవాఁడే పరనింద సేయఁ దత్పరుఁడు గానివాఁడు
అరుదైన భూతదయానిధియగువాఁడే పరులు దానేయని భావించువాఁడు                                                          ఏ కులజు॥

నిర్మలుఁడై యాత్మనియతి గలుగువాఁడే ధర్మతత్పరబుధ్ధిఁ దగిలినవాఁడు
కర్మమార్గములు గడవనివాఁడే మర్మమై హరిభక్తి మఱవనివాఁడు                                                          ఏ కులజు॥

జగతిపై హితముగాఁ జరియించువాఁడే పగలేక మతిలోన బ్రతికినవాఁడు
తెగి సకలము నాత్మ దెలిసినవాఁడే తగిలి వేంకటేశుదాసుఁ డయినవాఁడు             ఏ కులజు॥

[32] ఎంత మాత్రమున ఎవ్వరు దలఁచిన అంతమాత్రమే నీవు

ఎంత మాత్రమున ఎవ్వరు దలఁచిన అంతమాత్రమే నీవు

అంతరాంతరములెంచి చూడఁ బిండంతే నిప్పటి యన్నట్లు                                                   పల్లవి॥

కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుఁడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలఁతురు మిము శైవులు తగిన భక్తులును శివుఁడనుఁచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుఁడనుచు                                                    ఎంత॥

సరి నెన్నుదురు(???) శాక్తేయులు శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానావిధులను తలఁపుల కొలఁదుల భజింతురు
సిరుల మిమ్మునే యల్పబుద్ధిఁ దలచినవారికి నల్పంబవుదువు
గరిమల మిమునే ఘనమని తలఁచిన ఘనబుద్ధులకు ఘనుఁడవు                                                    ఎంత॥

నీవలనఁ గొరతే లేదు మరి నీరుకొలఁది తామెరవు
ఆవల భాగీరథి దరిబావుల ఆజలమే వూరినయట్లు
శ్రీవేంకటపతి నీవైతే మముఁ జేకొనివున్న దైవమని
యీవల నే నీ శరణనియెదను యిదియే పరతత్త్వము నాకు                                                    ఎంత॥

[33] పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను

పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను

ధరలో నాయందు మంచితన మేది పురుషో

అనంతాపరాధములు అటు నేము సేసేవి - అనంతమయినదయ అది నీది

నిను నెఱగకుండేటినీచగుణము నాది - నను నెడయకుండేగుణము నీది పురుషో

సకలయాచకమే సరుస నాకు బని -సకలరక్షకత్వము సరి నీపని

ప్రకటించి నిన్ను దూరేపలుకే నా కెప్పుడూను - వెకలివై ననుగాచేవిధము నీది పురుషో

నేర మింతయును నాది నేరు పింతయును నీది -సారెకు నజ్ఞాని నేను జ్ఞానిని నీవు

యీరీతి శ్రీ వేంకటేశ యిట్టే నన్ను నేలితివి - ధారుణిలో నిండెను ప్రతాపము నీది  పురుషో