Tuesday, August 19, 2025

నా జీవితం గురించి ... కొన్ని ప్రశ్నలకి సమాధానాలు

 ప్రఖ్యాత ప్రముఖ గౌరవనీయులు వంశీ గారు వారి facebook గోడమీద కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటికి నా సమాధానాలు.  చాలామటుకు నా అనుభవాలని బట్టి బదులిచ్చా. ఆయన ప్రశ్నలు నాఅనుభవాలను నెమరు వేసుకొనేలా చేయడంతో కొంత పేద్ద సమాధానాలు ఇచ్చా. కొంత స్వోత్కర్ష అయింది. ఇష్టంలేక పోతే సమాధానాలు చదవద్దు. ఆనక స్వంత డబ్బా అని బాధపడద్దు.

 

గ్రామ గవర్నమెంటు హైస్కూల్ లో చదువుకొని గొప్పస్థాయి అందుకొన్న మీరు మీ పిల్లలను ఈ రెండిట్లో ఏదో ఒక దాన్లో మాత్రమే చదివించాలి అంటే మీరు ఏది ఎంచుకుంటారు? ఎందుకు? (టీచింగ్ బాగోగులు అనే రొడ్డకొట్టుడు మాటలు అవీ వదిలిపెట్టి) - పోలవరం గవర్నమెంట్ హైస్కూల్, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్

పోలవరం గవర్నమెంటు స్కూలు.  అక్కడ దొరికిన వాతావరణం, స్వేచ్ఛ, టీచర్లు మనపై చూపించే వ్యక్తిగత శ్రద్ధ, సహజత్వంగా ఉండగలగడం, అన్నిటినీ మించి గోదావరి. అందరూ మెరిట్ విద్యార్ధులున్న బళ్ళో పోటీ, బడాయీ ఎక్కువ.  పోలవరం లాంటి ఊళ్ళల్లో మనమానాన మనం చదువుకోవచ్చు. రేంకులూ, ఉరుకులూ, పరుగులూ ఉండవు. 

కొసరు మాట- గొప్ప స్థాయి అందుకోవడం అంటూ ఏమీ లేదు. మామూలుగా చేతికి చిక్కిన పనిని వీలయినంత మంచిగా చేసుకుంటూ పోవడం. మిగిలినది దైవాధీనం. నాకు అన్ని దశలలోనూ దొరికిన అవకాశాలు, తిండికి ఢోకాలేని ఆర్ధిక పరిస్థితి నన్ను అల్లుల్లో మల్లుని చేసాయి.

స్వయంగా ఆచార్యులైన మీరు మీ పిల్లలకు బోధించిన విలువలు ఏమిటి? ప్రస్తుత తరానికి బోధించాలంటే ఏమని బోధిస్తారు (పాటిస్తారా లేదా అన్నది తర్వాతి విషయం)

నేను పెద్దగా ఏమీ బోధించలేదు. చూసి నేర్చుకుంటారు కానీ చెప్పితే (బోధిస్తే) పని జరగదు అని గ్రహించి, నేను నమ్మినవి వీలయినంత ఆచరించి బతకడానికి ప్రయత్నించా.  మా నాన్నగారి పద్ధతి అది.  బహిరంగంగా చెప్పినివి కొన్ని 1. మార్కుల గురించి కాకుండా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అందుకని, వాళ్ళ స్కూలుకి మార్కుల షీటు మీద సంతకానికి ఎప్పుడూ నన్నే తీసికెళ్ళేవాడు మా అబ్బాయి. 2. దగ్గర దార్లు వెతకద్దు. కాస్త కష్టమైనా రహదారే పట్టండి. త్యాగరాజ స్వామి చెప్పనే చెప్పారుగాచక్కని రాజమార్గమే ఉండగా, సందుల దూరనేల  అని. 3. ఏది ఏమైనా ఒరిజినాలిటీ ముఖ్యం

ఎవరికైనా ఇవే చెప్తానేమో.

మీ పిల్లలు మీ మాట వినకుండా దుర్యోధనుడిలా, శూర్పనఖలా తయారై ఉంటే దేనిని నిందిస్తారు? కర్మనా? మిమ్మల్ని మీరేనా? ఇంకేదన్నానా?

పిల్లలు 5 ఏళ్ళు వచ్చే సరికే వాళ్లు మన మాట వినే వారు కాదు అని అర్ధమయింది. మన మాటవినాల్సిన అవసరం కూడా లేదన్న వివేకం వచ్చింది. నా దృష్టిలో వాళ్ళు ఈప్రపంచంలోకి వచ్చిన స్వతంత్ర ఆత్మలు.  కేవలం కర్మబంధాల వల్ల నేను మాధ్యమంగా ఉన్నానన్న స్పృహకలిగి  వారికి నేను తీర్చగలిగిన అవసరాలు తీర్చడం, వీలైనంత ప్రశాంత వాతావరణం కలిగించడం, నేనున్నానన్న ధైర్యం ఇవ్వడం, వీలైనంత సమయం గడపడం, నేను ప్రయత్నించిన విషయాలు. ఈప్రయాణంలో వాళ్ళ దగ్గరి నుండి చాలా జీవితపాఠాలు నేర్చుకున్నా. మా అబ్బాయి నుండి టెక్నాలజీ, ప్రేమించడం నేర్చుకుంటే, మా అమ్మాయి  నుండి సంగీతం, విజ్ఞానం, లాంటివి నేర్చుకున్నా. పైగా శ్రావ్య నా అంతరాత్మ ప్రబోధిని. నేను ఏమైనా పొరపాట్లు చేస్తే నిర్మొహమాటంగా మొట్టికాయ మొట్టే బొట్టి.  కానీ ఈమధ్య కొంతమందిని చూసాకా నేను తండ్రిగా అంతగా వారిని తీర్చి దిద్దలేదేమో అనిపించింది. కానీ నేను వాళ్ల విషయంలో నా అభిప్రాయాలూ, అభిరుచులూ ప్రాథమికం అనుకోలేదు కాబట్టి, వాళ్ళు స్వయంనిర్ణయ సామర్ధ్యం సంపాదించుకున్నారు కాబట్టి అంత చింత లేదు.  అదీకాక, నేను ఈపంథాని, ఐచ్ఛికంగా పాటించాను కాబట్టి  దిగులు లేదు. అంతా ఈశ్వరేచ్ఛ.  

నాఅదృష్టం కొద్దీ పిల్లలదగ్గర మంచి రేటింగే వచ్చింది. 

సౌమ్యంగా ఉండటం ఎలా అలవాటు అయ్యింది? పుట్టుకతో వచ్చిన గుణమా? ఎవరినన్నా చూసి నేర్చుకున్న విధమా? బాగా తన్నులు తిని ఎరిగిన నిజమా?

మామూలుగా పుట్టుకతో వచ్చినది, అమ్మా నాన్నలు, వాళ్ళ తల్లి దండ్రులు అందరూ శాంతంగానే ఉండేవారు. ఇంట్లో ఉగ్రం లేదు. నాకు కాస్త యవ్వనమదం ఉండేది. అది అమ్మా, అన్నల సలహాల వల్ల కొంత తగ్గితే, మన మదానికి బయట మార్కెట్ లేదని, ఒకవేళ మనం ఎవరికైనా మన తాపం ఇస్తే వాళ్ళు వడ్డీతో సహా వాళ్ళ ప్రతాపం చూపిస్తారని అర్ధమయ్యాక మిగిలిన మదం పోయింది.  జీవితం అన్నాక కొన్నైనా తన్నులు తగలకుండా ఎలా ఉంటుంది. క్రమంగా మంచైవారైనా, చెడ్డవారైనా మనకి మనుషులు కావాలని అర్ధమయి, గివ్వండుటేకు పద్ధతి పాటిస్తున్నా.  ఇంకాస్త అనుభవంతో ఎవ్వరూ మంచీ కాదూ, చెడ్డా కాదూ, పరిస్థితులే మనని మంచిగానో చెడ్డగానో నిలబెడతాయి అని అర్ధమయి, జనాలమీద కోపంరావడం, వాళ్ళ పనుల వల్ల బాధపడడం తగ్గింది.  ఆలీజ్ వెల్.

పై దానికి వ్యతిరేకంగా కొంత మాట్లాడుకుందాం - మీ ఆవిడ ఒక వారం రోజుల పాటు మీకు ఇష్టం లేని వంటకాలు వండిపెడితే ఏం చేస్తారు? (నాకు అన్నీ ఇష్టమే, మా ఆవిడ బంగారం అందుకని అలాటి పరిస్థితి రాలేదు, రాదు అని కాకుండా) - గుడ్లల్లో నీరు కుక్కుకొని తినేస్తారా? లోపల శాపనార్థాలు పెట్టుతారా? బయటికి తిట్టుతారా? బెల్టు తిరగేస్తారా (మీ మీద మీరే కానీ, మీ ఆవిడ మీద కానీ)? ఇంకేదన్నానా?

ఎవరికైనా ఇలాంటి పరిస్ధితి సాధారణంగా వస్తుంది. ఎవరూ రోజూ ఒకేరకంగా, రుచిగా వండలేరుగా. స్వాభావికంగా కామెంట్లు చేయకండా నోట్లో ముద్దలు కుక్కుకుని తినేస్తా. అదీ కాక, నాకు వంటచేయడం ఇష్టం కాబట్టి అడపాదడపా గరిట తిప్పి తింటా, తినిపిస్తా. ఒక 40 ఏళ్ళ కితం మనిషిని అయితే కాస్త సెల్ఫ్ పిటీ పడి మా ఆవిడని సాధించే వాడినే.  కానీ పెళ్ళికాక ముందు, మా తమ్ముడు ఇచ్చిన ఒక ఉపదేశంతో ఆపద్ధతినుండి విముక్తి పొందా.    

నాబార్డులో కొన్ని విధానాలను మార్చాలి అనిపించి మీరు దానికోసం ప్రయత్నించిన సందర్భాలు ఎన్ని? మారినవి ఎన్ని? మారనివి ఎన్ని?

30 ఏళ్ళ సర్వీసులో చాలా సందర్భాలు వచ్చాయి. నాపరిధిలో వీలైనన్ని మార్పులు తేగలిగా.  నేను ఆర్ధికశాస్త్రి గా చేరాను కానీ డిపార్టుమెంటు లో పరిశోధన, ప్రచురణ పనులు నేతిబీరకాయలో నేయిలా ఉండేవి. అవడానికి మావిధుల్లో ఈపనులు ఉన్నా కూడా,  ఎవరూ అడిగే వాళ్ళు లేక, జిరాక్సులు తీసుకుంటూ, ఉత్తరాలు, ప్రత్యుత్తరాల తో కాలంగడిపేవారు. ఎవరైనా ఏదైనా ప్రచురించినా, జర్నళ్ళు చదివినా మెమోలు, చివాట్లు, వేరే వాళ్ళు చేసిన పని తమ పేరు మీద ప్రకటించుకోవడం జరిగేది. జేరిన రెండవ యేటనుండి నాసహోద్యోగితో కలిసి డిపార్టుమెంటుని నేతిగిన్నెలా మార్చేప్రక్రియ మొదలెట్టా. కేవలం అప్పుడు ఉన్న పరిస్థితులమీద చిరాకు, మనం జేయల్సిన పనికాక జిరాక్సులు తీసుకుంటూ, టైపింగు చేసుకోవడమేమిటి అన్న బాధతో. స్వార్ధంతో.   కాన్ఫరెన్సుల్లో, జర్నళ్ళలో 4 ఏళ్ళలో 15 ప్రచురణలతో డిపార్టుమెంటుని బయట ప్రపంచానికి పరిచయం చేయగలిగాం. ఢిల్లీ ప్రొఫెసరు ఒకాయన మా చైర్మన్ దగ్గర  మా డిపార్టుమెంటు గురించి  ఈవిషయం గొప్పగా చెప్పాడు.  అదృష్టం కొద్దీ మా పేర్లు చెప్పలేదు.   

నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, చిన్న నిర్ణయాలకి పేద్ద వాళ్ల దగ్గరకెళ్ళడం నాకు నచ్చక, క్రమంగా చిన్నచిన్న నిర్ణయాలు తీసుకోవడం,  చేస్తున్న పనులలో నాణ్యత పెంచడం మీద దృష్టి పెట్టగా, చాలా పనులు చేసిన కొద్దీ వచ్చి పడేవి. వాటి వల్ల మేం చాలా నేర్చుకునే అవకాశం కలిగింది. మేనేజ్మెంటూ, వేరే డిపార్టుమెంటులనుండికూడా పనులొచ్చేవి. అధికార కేంద్రీకరణ, కింది ఉద్యోగుల పట్ల బాధ్యత లేకపోవడం, క్లయింట్ల పట్ల అమర్యాద పట్ల అసంతృప్తి ఉండేది. క్రమశః వాటి విషయాలలలో కూడ కొంత మార్పు తెచ్చే అవకాశం కలిగింది. చివరి 2 సంవత్సరాలలో అదే డిపార్టుమెంటుకి అధిపతినవడంతో మరికొన్ని మార్పులకు అవకాశం కలిగింది. 2 ఏళ్ళలో సుమారు 60 ప్రచురణలు, డిపార్టుమెంటు పట్ల మరింత గుడ్విల్, టెక్నాలజీ చేపట్టి, రమారమి కాయితరహిత కార్యకలాపాల పద్ధతి తీసుకురావడం సాధ్యమయింది. మేమిచ్చే రిసెర్చ్ ఫండింగు కి మొత్తం కార్యకలాపాలని ఆన్లైను లో జరపడానికి పోర్టలు తేవడం చాలా వరకు అయినా నా కాలమితిలో అవలేదు. 30 ఏళ్ళలో నా పనితీరులో  నాణ్యత, సాంకేతికతను వాడుకోవడం, ఉత్పాదకత,  భాగస్వామ్యం,  న్యాయబద్ధతలు ప్రాధమిక ఉద్దేశ్యాలు.  

మీ కింద పని చేస్తున్న, చేసిన వాళ్ళు మిమ్మల్ని ఎదిరించి మీరు చెప్పిన పని చెయ్యకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పని పూర్తి చేస్తే మీరు వేసే శిక్ష ఏమిటి? (పని మంచిదైతే శభాష్ అంటా, చెడ్డదైతే కుళ్ళబొడుస్తా వంటి అతిసాధారణ లౌక్య సమాధానం కాక, ఆచార్యులు కనక కొత్త విధంగా చెప్పవలె)

నాకు నా బాసులు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. పని ఏమిటో చెప్పేవారు, ఎలా చేయాలో నేను చూసుకునే వాడిని.  నాకింది వాళ్లకి కూడా అదే స్వేచ్ఛ ఇచ్చా. కానీ అందరూ ఒకలాగా ఉండరు కాబట్టి మనిషిని బట్టి పద్ధతి మారుతోండేది.  శిక్షవేస్తే సహించే రోజులు లేవు.  వీలైనంత స్నేహతత్వంతోనే పనికానిచ్చా. అదీ కాక, నేను కూడా వాళ్ళతో సమానంగా కష్టపడడం, అన్ని వేళలా అందుబాటులో ఉండడం, పని మీద కాక మనుషులమీద శ్రద్ధ పెట్టడం, లాంటివి మా బంధాన్ని గట్టి చేసి, కలిసి పనిచేసే ఉత్సాహాన్ని పంచాయి.   వొత్తిడి ఎప్పుడూ పెట్టలేదు. కానీ చాలా పనులయ్యేవి.   ఎందుకూ పనికి రాడని ముద్ర వేయించుకున్నవాడు కూడా నా హయాంలో వారికి చేతనైన పని ఇష్టంగా చేసి ఆనందపడిన సందర్భాలు ఉన్నాయి.  నాకు కాస్త నమ్మకమివ్వు కొండల్ని పిండి చేస్తా అన్న వాక్యం స్ఫూర్తితో నమ్మకం ఇవ్వడానికి ప్రయత్నించడం దీనికి కారణం అనుకుంటా.  

సియోల్ లో కాలం గడిపారు. మీ దృష్టిలో అక్కడ తెలుగు (మీ ఎరికలో వారెవరన్నా ఉంటే) వారి నడత విధానాలు తెలుగు వాళ్ళలానే గోరోజనంగా ఉండేవా? కుక్కిన పేనులా ఉండేవా? ఏది? ఎందుకు?

అక్కడ తెలుగు వాళ్ళు కొంత మంది ఉండేవారు. కానీ వాళ్ళకి తెలుగు గోరోజనం ఏమీ కనిపించలేదు. బహుశః వారికి మెరికలకొచ్చేంత జీతాలు లేక అంత గొప్పలు లేవేమో.  వాళ్ళకి అప్పటికింకా డాలరు తలకెక్కలేదు.

సియోలు లో వందలాది కోట్లు సంపాదించుకున్నారు (అనుకుందాం).

అవును వాళ్ళ వాన్లలో మరీ వందలాది కాదు కానీ, కొన్ని కోట్లు సంపాదించా.  కానీ పెళ్ళాం, బిడ్డలని తీసికెళ్ళి చదువుసంధ్యలు చెప్పించాలంటే ఇండియాలో ఉన్నట్లే.  ఆరోజుల్లో నా అక్కడి సంపాదన ఇక్కడికి 8 రెట్లు. బియ్యం (ద్రవ్యమార్పిడి గురించి ఐడియా రావడం కోసం) ఖరీదు 8 రెట్లు. ఇంగ్లీషు చదువులు చెప్పించాలంటే పార్టు టైం కన్నాలేసుకోవడమే.

భారతదేశానికి మళ్ళీ వచ్చెయ్యటానికి మీ ప్రధాన కారణం (ఒకటే) ఏమిటి? బంధువులా, వాతావరణమా, పెద్దవాళ్ళా, నాబార్డు మీద ప్రేమా, షో ఆఫ్ ఆ, ఇంకేదన్నానా?

కుటుంబానికి ఎక్కువ కాలం దూరం ఉండడం ఇష్టం లేక. ఆరోజుల్లో అక్కడ కొనసాగడం డబ్బుల పరంగా చాలా లూక్రేటివ్ గా ఉండేది (ఒక్కడినే ఉంటే మాత్రమే).  Even good things should end.

సియోల్ లో యూనివర్సిటీకి, మీరు చదివిన బాపట్ల (ఇది రంగా యూనివర్సిటీనా, నాగార్జున యూనివర్సిటీనా నాకు తెలియదు – రంగా యూనివర్సిటీ) కాలేజీలకు ప్రధాన తేడా ఏమిటి? విద్యార్థులలో మీరు చూసిన గుణాలు ఏమిటి? మనవాళ్ళు అక్కడ నుంచి నేర్చుకోవల్సిన "మంచి" ఏదన్నా ఉందా? వాళ్ళే మనవాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన "మంచి" ఏదన్నా ఉందా?

With out malice, మన యూనివర్శిటీలు ఉన్నాయి కాబట్టి నడుపుతున్నారు. ఒక దార్శనికత, ఒక ఆదర్శం ఏమీ లేవు.  Just passive existence. కేవలం డిగ్రీలు ఇచ్చే యంత్రాంగం.  అక్కడి యూనివర్శిటీలలో మంచి రేంకులో ఉండాలి, మునపటికన్నా మెరుగ్గా తయారవాలి అన్న తపన ఉంది. సాంకేతికతకి పెద్ద పీట. 20 ఏళ్ళ క్రితమే అక్కడ ఆన్లైను విద్యాబోధన మొదలెట్టారు. 4 ఏళ్ళ డిగ్రీ, ఎటువంటి కోర్సైనా చదివే స్వేచ్ఛ సౌకర్యం, అన్నీ అమెరికా పద్ధతిలో ఉండేది.  ఇక్కడి కొత్త విద్యావిధానంలో కొన్ని మార్పులు సూచించినా, మోడీ ద్వేషం వల్ల జనాలు ఎంతవరకూ దాన్ని పాటిస్తారో చూడాలి.  

ఈశాన్య రాష్ట్ర ప్రాంతాల వాళ్ళు మీకు చాలా మంది మిత్రులు. వారిలో మీరు చూసిన మంచి గుణాలు ఏమిటి? చెడ్డ గుణాలు ఏమిటి? (చెడ్డ గుణాలు లేకుండా ఉండవు - మీరు లౌక్యం మానేసి చెప్పవలె)

మణిపూర్ తో, అక్కడి మనుషులతో నేను బాగా కనెక్టయ్యా.  అనేక సమస్యలతో, అంతులేని తీవ్రవాదంతో సహజీవనం చేస్తూ కూడా గొప్పగా, ఉన్నంతలో ఆనందంగా బతకడం నచ్చింది.  వాళ్ళలో ఉన్న ఐకమత్యం, బంధుబలగంతో కలిసి ఉండడం నచ్చింది. వ్యాపారనైపుణ్యం, తెలివితేటలు నచ్చాయి. అన్నిటికన్నా తమ సంస్కృతి పట్ల మక్కువ నచ్చింది. వాళ్ళు తమ పూర్వీకుల ఆచార వ్యవహారాలు పాటించడం, హిందువులైతే మిగిలిన దేశంలోని హిందువులు సిగ్గుపడే విధంగా ఇప్పటికీ ఉగాది, మహాలయపక్షాలు, లాంటి పండగలు శ్రధ్ధగా చేయడం గొప్పగా అనిపించింది. రాసలీల (డాన్స్) చూసి తరించాల్సిందే. పంగ్ చోలోమ్ (డ్రమ్ డాన్స్) మరో లోకానికి తీసుకెళ్తుంది.    వాళ్లకి చదువు మీద ఉన్న శ్రద్ధ తెలుగువాళ్ళకు తీసిపోదు. వాళ్ళలో చాలామంది ఆంధ్రాలో చదువు(కున్నారు) కుంటున్నారు.  పోరాటపటిమ, ముఖ్యంగా ఆడవారిలో ఎక్కువే.

నచ్చనివి.. చాలా భావోద్రాకాలున్నవారు (ఎమోషనల్). వాళ్ళలో వాళ్ళే కానీ బయటి ప్రపంచంతో ఎక్కువ రాసుకోవడం పూసుకోవడం ఇష్టం ఉండదు అనిపిస్తుంది.  అందుకనే చాలా వనరులున్నాఆరాష్ట్రం ఉండాల్సిన స్థాయిలో లేదు. అక్కడ చాలామంది దేశంలో అత్యున్నత విద్యాలయాలలో పెద్ద చదువులు చదివి కూడా చిన్న ఉద్యోగాలతో మణిపూర్ లోనే ఉండడానికి ఇష్టపడతారు.   

నాబార్డు లో ఒక రోజు మీరు ఏది చెపితే అది జరుగుతుందనే అవకాశం వస్తే, అక్కడి వ్యవస్థను మార్చటానికి మీరు తీసుకునే చర్యలు ఏమిటి?

చాలా ఉన్నాయి. మొదటగా ప్రక్షాళన. నాబార్డులో ఉన్నవాళ్ళు లేక బయట ప్రపంచం నుండి ఒక 50 మంది ప్రొఫెషనల్సుని ఎంపిక చేసి వాళ్ళ టీంలని ఏర్పరుచుకోమని చెప్తా.  వీలైనంత త్వరగా నాణ్యమైన సేవలు  అందించడం ముఖ్య మంత్రంగా ఉండేలా చూడమని చెప్తా. ధ్యేయం నాబార్డు ప్రపంచబ్యాంకు స్థాయిలో ఉండాలి.

సాంకేతికత పూర్తిస్థాయిలో అమలుచేయడం, ప్రతి స్థాయిలోను నిబద్ధతకి పెద్దపీట వేయడం మరికొన్ని అడుగులు.

సంగీత ప్రపంచంలోకి దూకేసి మీరు అంతలా కచేరీలు చేస్తూ ఆవేశపడటానికి కారణమేమిటి? మీ పిల్లల ప్రావీణ్యాన్ని చూసి రగిలిన నిప్పా? వత్తిడి ని పాటల మీద, శ్రోతల మీద తీర్చుకుందామన్న కసి యా? నిజమైన ప్రేమ యా? ఇంకేదన్నానా?

చిన్నప్పటినుండి ఉన్న ఇష్టం వల్ల. పిల్లల ప్రావీణ్యం వల్ల మరికొంత నేర్చుకోగలిగా. శ్రావ్య ఇంట్లో గురువు. మా కామాక్షీ మామీ కృపవల్ల కాస్త పద్ధతిగా నేర్చుకున్నా- షణ్ముఖానంద సంగీత కళాశాల వారి వార్షిక పోటీల్లో ముసలి వర్గంలో ప్రథమ బహుమతి తెచ్చుకునేంత. ఇక్కడ మా కాలనీలో సీనియర్ సిటిజన్ల సభలో వచ్చిన ప్రోత్సాహం విజృంభణకి కారణం.  సంగీతం అంటే మక్కువ. ఇప్పటికీ పాడడం కన్నా అనుభవించడమే ఎక్కువ ఇష్టం.

మీకు బాపట్ల కాలేజీలో కానీ, పోలవరంలో కానీ మీ ఆవిడకు తప్ప ఎవరికన్నా చెప్పని ప్రేమాయణాలు ఏవన్నా ఉన్నవా? లేకపోతే ఎందుకు లేవు?

హార్మోనుల హడావిడికి వచ్చిన ఒకటి రెండు ఏకపక్ష పిల్లతెరలు తప్ప పెద్ద సీను లేదు. కారణం ఆర్ధికం. ప్రేమ లాంటి బాధ్యతలకి ఇది వయసు కాదన్న భావన, అవగాహన.

పజిల్స్ మీద పుస్తకాలు వేసేంత ఆసక్తి కలగటానికి ప్రధాన కారణమేమిటి? ఇష్టమా? టైం-పాస్ ఆ? ఆ తెలుగు పుస్తకాల ప్రపంచపరిధిలో పజిల్స్ లేక ఓటి పోయిన దాన్ని చూసి కలిగిన సంతాపమా? ఇంకేదన్నానా?

చిన్నప్పటినుండి అన్నిరకాల పజిళ్ళు తెగ ఇష్టం. ఖాళీ ఉంటే పజిళ్ళు నింపడమే పని. పత్రికల్లో వచ్చే గడి నుడి లాంటి పజిళ్ళను ఇంటిల్లిపాదిమి మా అమ్మతో పాటు చేయడం, ఆ అలవాటుతో పొద్దు పత్రికలోని గడిని సత్వరం పూరిస్తోంటే వాళ్లు నిర్వహణబాధ్యత ఇవ్వడం తర్వాత మాలిక లో నిర్వహించడం, పుస్తక ప్రచురణదాకా తీసుకెళ్ళాయి.

ఒకప్పటి సినిమా విలన్ మోహనబాబు వచ్చి మీ ఇంటిని కాకుండా మీరు పార్కింగ్ కి కేటాయించుకున్న స్పాట్లనన్నిటినీ పోలీసులు కూడా ఏమీ చెయ్యలేని విధంగా తన బళ్ళతో ఆక్రమిస్తే మీరు ఏం చేస్తారు? మీ బళ్ళను ఊరి బయట పార్కు చేసుకుంటారా? మీ బళ్ళను అమ్మేస్తారా? మోహనబాబుతో బళ్ళను బద్దలుకొట్టి చివరివరకూ ఫైట్ చేస్తారా? ఇంకేదన్నానా?

నేను సాధారణ మనుషులతో మాత్రమే డీల్ చేయగలను. నాకు నాబార్డులో ఇలాంటి అనుభవం అయింది. ఒక సీనియర్ ఖాళీ చేసిన పార్కింగులో వాచ్ మేన్ తో రూఢీ చేసుకుని నాకారు పెట్టా. ఆసీనియర్ కి తన కొత్త పార్కింగు నచ్చక నేను ఆఫీసునుండి వచ్చేలోపల నాప్లేసులో కారు పెట్టించాడు. వాచ్ మేన్ తో కబురు పెడితే వాళ్ళ ఆవిడ కాస్త దురుసుగా మాట్లాడిందట. నేను జూనియర్ ని, వాళ్ళ ఆయన సీనియర్ అన్న అహం అయుండచ్చు. ఒకటి రెండు రోజుల పాటు ఈ తంతు జరిగాక వాచ్ మేన్ సాయంతో ఇంకో స్థలం వెతుక్కుని పెట్టుకున్నా. ప్రశాంతత తెచ్చుకున్నా. నేను ఆయన స్థానంలో ఉంటే కలిసి నాబాధ చెప్పుకుని నా స్థలం మర్యాదగా  వెనక్కి తీసుకుని ఉండేవాడిని.  

నాబార్డు అనేది గ్రామీణాభివృద్ధికి క్రెడిట్, మద్దతు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ - మీకు ఉన్న కష్టాలు, అంటే - క్రెడిట్ ఫ్రాగ్మెంటేషన్ కానీ, రైతులకు గ్రామీణులకు బీమా లేకపోవడం కానీ వంటి సవాళ్ళను ఎదుర్కోటానికి నాబార్డులో ఒక చీఫ్ జనరల్ మేనేజరుగా పనిచేసిన మీరు- భారతదేశ రైతులకు, ప్రత్యేకించి తెలుగు రైతులకు ఇచ్చే సలహా, వాళ్ళ జీవితాలను సులభంగా బాగుపరచే ముఖ్యమైన సలహా ఏమిటి?

నా ఉద్దేశ్యంలో రైతుల కష్టాలకు కారణం వారిని వ్యవస్థలో భాగంలా కాక ప్రత్యేకంగా చూడాలనుకోవడం కారణం. ఉదా. వ్యవసాయధరలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్పత్తుల సరఫరా, డిమాండులని బట్టి నిర్ణయించబడతాయి. మద్దతు ధరలని ప్రకటించాక, మార్కెట్ ధరలని బట్టే వ్యాపారులు కొంటారు కానీ వేరే విధంగా అవదు. అందుకే అతి స్వల్పశాతం రైతులకి అదీనీ వరి గోధుమ పండించే వారికి మాత్రమే మద్దతు ధరలు దొరుకుతాయి.  వ్యాపారులని మద్దతు ధరలకి కొనాలని బలవంతపెడితే మొత్తం మార్కెట్టే కూలిపోతుంది. రైతులకి మేలు కలగాలంటే వ్యాపారులకు కూడా గిట్టుబాటవాలి. ప్రభుత్వం మొత్తం ధాన్యం కొని రైతులకి మేలు చేయాలని, మద్దతు ధరలని చట్టబద్ధం చేయాలని చాలామంది కోరుతున్నారు. అది కేవలం భావోద్రేకమే కానీ ఆర్ధికంగా అమలుచేయలేం. రైతులకి మేలుచేయాలని (కేవలం వాళ్ళ ఓట్లకోసమే, నిజమైన ప్రేమ ఎవరికీ లేదు) తెచ్చిన ప్రభుత్వ పథకాలు వారికి కీడే ఎక్కువ చేస్తున్నాయి అనిపిస్తుంది.  ఇంకో ఉదా. ఋణమాఫీ అని రైతులని ఉద్ధరిస్తున్నామని అనుకుని రైతులకి అప్పు పుట్టకుండా చేసారు. సరిగా ఋణాలు తిరిగిచ్చిన రైతులను కూడా బ్యాంకులు నమ్మని పరిస్థితి. గ్రామీణులలో రైతులలో సహజంగా ఉండే నిబద్ధతని కలుషితం చేసి కేవలం రాయితీల కోసం దేబెరించే స్థితికి తీసుకొచ్చారు.   రైతుల పట్ల ముసలి కన్నీరే కానీ, వారికి గౌరవం ఇచ్చేదెవరు  

కర్నాట సంగీతంలో మీకు అత్యంత ఇష్టుడైన వాగ్గేయకారుడు ఎవరు? ఎందుకు?

త్యాగరాజు, అన్నమయ్యలు. వారి సరళ రచనలో చిన్ని పదాలలో అధిక భావనలు, అనేక విషయాలను స్పృశించిన వైవిధ్య కృతులు. భక్తి, వైరాగ్యం.

కర్నాట సంగీతంలో మరుగేలరా ఓ రఘవా పాటను మైకెల్ జాక్సన్ "థ్రిల్లర్" లా పాడమని మిమ్మల్ని సంగీత దర్శకుడు తమన్ వచ్చి వత్తిడి చేస్తే ఛాలెంజుగా తీసుకొని చేస్తారా? ఛీ కొడతారా? నాకెందుకొచ్చింది ఇంకోణ్ణి చూసుకోండి అని సౌమ్యంగా చెపుతారా?

నాగాత్ర ధర్మానికి అది సరిపోదు. కాబట్టి నేను పాడలేను అని చెప్తా.  వీలైనంత సౌమ్యంగానే. చెప్పాగా నా మదానికి బయట డిమాండులేదని.

మీకు ఇష్టమైన తెలుగు పుస్తకాలు ఒక అయిదు చెప్పండి (పురాణాలు, భారతం, భాగవతం, రామాయణం వంటివి కాక)

గణపతి, కాంతం కథలు, వేయిపడగలు, బారిష్టరు పార్వతీశం, సాక్షి వ్యాసాలు, అనేక మంది నవలలు

 

పజిల్స్ చేసిన మీరు తెలుగు సాహిత్యం ఏ స్థితిలో ఉంది అనుకుంటున్నారు? పరిష్కరించలేని పజిల్ లా ఉన్నదా? పరిష్కారం తెలిసి అమలు చెయ్యలేని స్థితిలో ఉందా? ఎవడి సాహిత్యకర్మ వాడు అనుభవించే స్థితిలో ఉందా? ఇంకేదన్నానా?

ప్రతీకాలంలోనూ ఈరకమైన భావనలు, భయాలూ ఉంటాయనుకుంటా. సాహిత్యం పరిస్థితి బాగానే ఉంది. మన పిల్లల తరంలో తెలుగు చదవడం రాని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి చదివేవాళ్ళు ఉండరు, వినే వాళ్ళు ఎక్కువవచ్చు (దాసుభాషితం మోడల్ ఎక్కువ రావచ్చు). పరిష్కారం, ఉప్పూ, పప్పూ ఏమీ అవసరం లేదనుకుంటా. అది సదా పరివర్తనం చెందుతూనే ఉంటుంది.

మీ ఆవిడకు మీరు సర్ప్రైజుగా కొనిపెట్టిన అత్యంత ఖరీదైన వస్తువు ఏమిటి? అది చూసి ఆవిడ ఏమన్నారు? కొనిపెట్టకపోతే ఎందుకు కొనలేదు?

పెద్దగా ఏమీలేవు. కొరియానుండి వస్తూ బ్యాంకాకు లో బంగారు నగ కొన్నా. బంగారు నగలు కొనడం ఇష్టంలేని నేను కొనడం సర్ప్రైజేనేమో. నచ్చుకున్నారు.

 

Saturday, March 08, 2025

తరాంతరంగం

 

మా ఆనంద్ నగర్ కాలనీ ముసలాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు. రకరకాల వ్యాపకాలు పెట్టుకుంటారు. అలాంటి ఒక వ్యాపకం ఆనందవాణి గృహపత్రిక. కొన్నాళ్ళుగా మూతపడింది. ఈమద్య మళ్ళీ పునరుద్ధరిద్దామని సంకల్పించారు. ముఖ్య సంపాదకులు శ్రీ చోడవరపు సీతా రామ శర్మ గారు నన్ను కూడా ఒకవ్యాసం రాయమని, విషయంకూడా సూచించారు. ఆయనకి నా ధన్యవాదాలు. నావ్యాసం ఇదిగో ఇల్లిక్కడ.... 

రాలమధ్య అంతరాలు మానవ, కుటుంబ సంబంధాలని కుదిపేస్తున్నాయి. ఒకరంటే ఒకరికి పడకుండా చేసి, ఇంట్లోనూ, కార్యాలయాలలోనూ కూడా బంధాలనీ, అనుబంధాలనీ విషమయం చేస్తున్నాయి. గతకాలము మేలు వచ్చుకాలముకంటే, ఈకాలం పిల్లలు ఎలా ఉన్నారంటే, మనకాలంలో మనం ఎలా ఉండేవాళ్లం, పిదపకాలం బుద్ధులు  ...ఇలాంటి వ్యాఖ్యలూ, వ్యాఖ్యానాలూ మనం తరచూ వింటూనే ఉంటాము.  ఇవి ఒక తరం వాళ్ళు తర్వాతి తరంవాళ్ళని ఉద్దేశించి చేసినవే.  అలాగే, ఈ పెద్దవాళ్ళున్నారే, వయసులో పెద్దయితే ఏమిటంటా, పెద్దవాళ్ళు ఏమి అన్నా పడాలా?’, అబ్బ, ఈముసలాళ్ళ ఛాదస్తం భరించలేక పోతున్నాం’. ‘అర్ధం చేసుకోరూ..’, ఇవి పడుచువాళ్ళ ఆక్రోశాలు. ఆవ్యాఖ్యానాలూ, ఈఆక్రోశాలూ తరతరాలుగా ఉంటూనే ఉన్నాయి. ఇవేతరాల అంతరాలు. ఇక్కడ వింత ఏమిటంటే, ఒకప్పుడు ఆక్రోశించిన వాళ్లే ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు.

కొంతమంది పెద్దవాళ్ళు తమ పిల్లల మీద ఉన్న ప్రేమ వల్ల తాము పడ్డ కష్టాలూ, క్లేశాలూ తమపిల్లలు అనుభవించరాదన్న స్వార్ధంతో పిల్లలు ఏమిచేయాలో, ఏమిచేయకూడదో తమతమ అనుభవాల దృష్ట్యా వాళ్ళే నిర్ణయించి పిల్లలకి నిర్దేశాలిస్తారు. బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ లా అన్నమాట.  కొంతమంది తాము వయసులో ఉన్నప్పుడు తీరని కోరికలు వాళ్ల పిల్లలద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉదా. డాక్టరు అవలేని తండ్రి కొడుకుని డాక్టరు చేయడానికి ప్రయత్నించడం లాగా.  కొంతమంది కేవలం తాము చెప్పినట్లు పిల్లలు నడుచుకోవడం క్రమశిక్షణగా, స్వీయ ప్రతిభగా భావిస్తారు. తద్వారా మన పిల్లలకి స్వయం నిర్ణయ సామర్ధ్యం  అలవడదు. 

అటుపక్క ఈతరం కృత్రిమ మేథస్సుది. వారికి ముందటి తరపు భావాలూ, ఆలోచనలూ వెనకబడినవిగా కనపడడంలో ఆశ్చర్యం లేదు. అదీకాక, శంకరాభరణంలో దాసు చెప్పినట్లు పాతతరం పడవలది, ఇప్పటి తరం జెట్లు, రాకెట్లది. ఇంకా చెప్పాలంటే చంద్రయాన్, మంగళయాన్లది. అలా అని ఇప్పటి తరం చేసేవి అన్నీసమర్ధనీయం కాదు. కానీ వారికి ఉన్న ఒత్తిళ్ళు పాతతరం ఎదురుకొన్న వాటికన్నా భిన్నంగానూ, క్లిష్టంగానూ ఉన్నాయనడం అతిశయోక్తి కాదు. వారికి వాటిని ఎదుర్కొనే మానసిక స్థైర్యం ముందుతరానికన్నాతక్కువ. ఉమ్మడి కుటుంబవ్యవస్థ పోవడం, ఏకైకసంతానం కావడం, తల్లిదండ్రులిద్దరూ సంపాదనా పరులవడం వల్ల ఆర్ధికక్రమశిక్షణ లోపించడం, వారికి పిల్లలతో మాట్లాడే సమయం లేకపోవడం వల్ల  పిల్లల్లో పెరిగిన అభద్రతాభావము, దుస్సావాసాలు, వాటి వల్ల వచ్చిన అనేక సామాజిక, మానసిక సమస్యలు దీనికి కొన్ని కారణాలు.

ఇలాగే తరాల అంతరాలతో బతకాలా అంటే అవసరంలేదంటాను. ఇరుపక్షాలూ పరస్పరావగాహన పెంచుకుంటే సరిపోతుంది.  ముఖ్యంగా పెద్దవారే ముందడుగు వేయాలి. మన ఆలోచనే సరైనది, మనకి అన్నీ తెలుసు అన్నభావన పక్కకి పెట్టి పిల్లల మనసు లోని మాట తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వారి అభిరుచికి తగిన రంగంలో వారిని ప్రోత్సహించడం, భయం లేకుండా మనతో అన్ని విషయాలూ చర్చించగలిగే వాతావరణం కల్పించడం, ముఖ్యంగా వారు ఓడిపోయి, అలసిపోయినప్పుడు మేమున్నామన్న ధీమా ఇవ్వగలగడం  తల్లిదండ్రుల బాధ్యత. తరాల మధ్య ఉండే 99 శాతం ఒరిపిడులూ, భేదాభిప్రాయాలూ పరస్పరగౌరవం, అవగాహనా లేకపోవడం అనిపిస్తుంది.  మనం వారికి ఉదాహరణగా నిలవగలిగతే వారికి మనమీద గురికుదిరి మన మాట అర్ధంచేసుకో గలరు.  కార్యాలయాలలో ఉన్నతాధికారులు తమ హోదా, అనుభవాలను ప్రదర్శించి తమమాట నెగ్గించుకోవాలని అనుకుంటే, కుర్రవాళ్లు తమ కున్న ఆధునిక పరిజ్ఞానం, ఉత్సాహం, శక్తి యుక్తులని వాడి సంస్థలో ఎదగాలనుకుంటారు. వారిద్దరూ తమసామర్ధ్యాలను సమీకరించుకుని కలిసి పనిచేయగలిగితే సంస్థ ఎంత ముందుకు వెళ్తుందో కదా.  కుటుంబం, సమాజం కూడా అంతే.

కేవలం భౌతికఅవసరాలు తీర్చడమే కాక, వారి ఆత్మవికాసానికి కూడా దోహదం చేయడం మన కర్తవ్యం. వారి జీవితాలను వారే నిర్దేశించుకోవాలి. మనం కేవలం వారు పూర్ణప్రజ్ఞావంతులై, సంపూర్ణ మానవులుగా ఎదిగడంలో మనపాత్ర వహించగలం. మనకి ఈక్రమంలో కావల్సినది కేవలం అవగాహన.  తరాలఅంతరాలని అధిగమింపచేయగలది అది మాత్రమే.

Saturday, March 01, 2025

అన్నమయ్య పదకవితా సాగరం నుండి నాల్గు బిందువులు

అన్నమయ్య పదకవితా వైభవం
ఆయన కీర్తనా సాగరం నుండి నాల్గు బిందువులు
సత్యసాయి కొవ్వలి
అన్నమయ్య పేరు వినని తెలుగువాడుండడు. చిన్నప్పుడు మనఅమ్మ పాడిన జో అచ్యుతానంద నుండి అదివో అల్లదివో హరివాసమూ అన్న పాటవరకూ, ఏమొకొ చిగురుటధరమున యెడనెడఁ గస్తురి నిండెను భామిని విభుఁనకు వ్రాసిన పత్రిక కాదుగదా అన్న శృంగారకీర్తన నుండి నానాటి బ్రతుకు నాటకమనే ఆధ్యాత్మిక బోధన వరకూ అన్నమయ్య స్పృశించని విషయం లేదు, సామాజిక కోణం లేదు. ఈ 15వ శతాబ్దపు వాగ్గేయకారుడు, 32000 పదాలలో వేంకటేశ్వరుడి మహాత్మ్యాన్ని, వేదాంత తత్వాన్నీ రచించిన పదకవితా పితామహుడు. జానపదుల భాషలో క్లిష్ట భావాలని సులభంగా మనసుకి హత్తుకునేలా వ్రాసిన జానపద కవితా పితామహుడు. అనేకమంది పండితులు, విద్వాంసులు, సంగీతజ్ఞులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సుమారు 14000 (వీరి 2178 ఆధ్యాత్మ, 11526 శృంగార) సంకీర్తనలను వెలికి తీసి, అనేక కీర్తనలను స్వరపరచి, ప్రజల నోట నానేలా చేసారు.  వారి జీవితం ఆధారంగా చలనచిత్రం కూడా నిర్మించడంతో అన్నమయ్య పాట పలకని తెలుగు నోరు లేదేమో.  అంతటి మహామహిమాన్వితుడి పదకవితా వైభవాన్ని 15 నిమిషాల్లో ఆవిష్కరించడం, అందులోనూ ఏఅర్హతా లేని నేను చేయబూనడం దుస్సాహసం. అందుకని, అన్నమయ్య ఆధ్యాత్మ కీర్తనా సాగరం నుండి నాలుగు బిందువులు చూసే ప్రయత్నం చేసా. 
అన్నమయ్య పదాలు దేశిరాగాలలో, సుగ్రహ లయతాళాలలో నిబంధించి, సులభీకరించిన రచనలు. పదాలకు పల్లవి, అనేక చరణాలు అనే రెండు అంగాలుంటాయి. పల్లవి ముఖ్యమైన, కేంద్రీభూతమైన అర్ధాన్ని సూచిస్తే, చరణాలు ఆ అర్ధాన్ని విస్తరిస్తాయి. శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారి మాటల్లో చెప్పాలంటే-

“(ఆ శ్రీనివాసుని) మూర్తినే ఆధిభౌతికమైన, ఆధ్యాత్మికమైన సర్వ ప్రపంచంలోనూ అంతర్యామిగా, బహిర్యామిగా భావించి, పూజించి, ప్రేమించి, కలహించి, ప్రాధేయపడి, ప్రార్ధించి, పొగిడి, తెగిడి, అనుభవించి, ఏకీభవించి జీవితంలోని అంతరంగ బహిరంగ పరమాణువులన్నింటా ఆతని బ్రతుకే బ్రతికినవాడు, ఆ అనుభవాలన్నీ మానసికంగా, కాయికంగా మాత్రమే కాక, వాచికంగా కూడా అనుభవించినవాడు, అన్నమయ్య. ఆవాచికాలే ఆయన పదకవితలు.” 
అందుకే వాటినిండా జీవితకాలపు భావోద్వేగాలూ,  అనుభూతులూ, పాఠాలూ. 
1. మోక్ష బిందువు - వేదాంతం చాలా క్లిష్టమైనది.  పండితులకి కూడా అంతచిక్కనిది, అనుభవంలో రానిది. వేదాంతసారాన్ని అన్నమయ్య చెప్పినంత సరళంగా ఎవరూ చెప్పలేరు. 
అత్మయే సర్వ ప్రకాశము అని తెలుసుకొనుటయే మోక్షము. ఆత్మజ్ఞానం పొందడం, జననమరణ చక్రం నుండి విముక్తి పొందడం మోక్షము. మనం జీవించి ఉండగానే ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని వదిలిపెట్టి, ఇంద్రియ నిగ్రహము సాధించి, రాగద్వేషములను వదిలిపెట్టి, ప్రశాంతంగా జీవించడం మోక్షం. 
హంసనాదం - రూపక
॥పల్లవి॥ తెలిసితే మోక్షము తెలియకున్న బంధము - కలవంటిది బదుకు ఘనునికిని
మన జీవితం ఒక స్వప్నం. ఈవిషయం తెలిస్తే మోక్షం. తెలియకపోతే బంధం. 
॥చ1॥ అనయము సుఖమేడ దవల దుఃఖమేడది తనువుపై నాసలేని తత్త్వమతికిని
పొనిఁగితేఁ బాపమేది పుణ్యమేది కర్మమందు వొనర ఫలమొల్లని యోగికిని
ఈతత్త్వము తెలిసి శరీరంపై ఆస లేని వానికి (అంటే తత్వమతికి) సుఖదుఃఖాలనే ద్వంద్వాలు అంటవు. కర్మఫలాపేక్షలేని యోగికి పుణ్యపాపాలు అంటవు. 
॥చ2॥ తగిన యమృతమేది తలఁపఁగ విషమేది తెగి నిరాహారియైన ధీరునికిని 
పగవారనఁగ వేరి బంధులనఁగ వేరీ వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి
తిండిమీది ధ్యాసవదిలిన వానికి (ధీరునికి) అమృతమూ, విషమూ ఒక్కటే. ఈ వెగటైన ప్రపంచాన్ని విడిచిన వివేకికి బంధువులు, శత్రువులు అన్నభేదము ఉండదు. 
॥చ3॥ వేవేలువిధులందు వెఱుపేది మఱుపేది - దైవము నమ్మినయట్టి ధన్యునికిని
శ్రీవేంకటేశ్వరుఁడు చిత్తములో నున్నఁవాడు -యీవలేది యావలేది యితనిదాసునికి
ఇక్కడ దైవాన్ని నమ్మినవాడు వేలాది విధులను మఱపు, వెఱపు  లేకుండా నిర్వహించగలడని భక్తికి పెద్దపీట వేసాడు. శ్రీనివాసుడే చిత్తములో ఉన్న దాసుడికి ఇహపరాల చింత అవసరంలేదు. 
మోక్ష మార్గాలు
అన్నమయ్య దృష్టిలో మోక్షము కావాలంటే పెద్దగా ఏమీ చేయనక్కరలేదు. ఉత్కృష్టమైన జ్ఞానం సరిపోతుంది. (ఏమియుఁ జేయఁగవద్దు యింతలోనె మోక్షము దీమపువిజ్ఞానమే దివ్వెత్తు ఫలము) 
ఇతర సాధనాలు & సాధనలుః
• పాపచింతన లేకపోవడం, సత్వగుణసాధన (మొనసి సాత్త్వికమున మోక్షము సిద్ధించు)
• కోరికలు జయించడం, 
• బంగారంపై వ్యామోహం లేక పోవడం, 
• స్త్రీలోలత్వం వదిలడం 
• శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం, సేవ, చింతన, సంకీర్తన, హరివాక్యం
• కోపం జయించడం, (మునుకొపముఁ బెడఁబాసిన మతి మోక్షంబునకును నొకతెరువు),   
• దైవస్మరణ (హరిఁదలఁచినమతి), 
• గురుభక్తి, 
2. విద్వత్ బిందువు - పరస్పర విరుద్ధభావాలను ఒకే కీర్తనలో ప్రస్తావించి చివరలో పరిష్కరించడం ఒక వినూత్న ప్రయోగం. ఆయన విద్వత్తుకి తార్కాణం.
అన్నమయ్య విద్వత్తును ఉదాహరణకి రెండు కీర్తనలలో చూద్దాం..  
శృతి, స్మృతి వాక్యాలలో పరస్పరవిరుద్దంగా అనిపించే (seemingly contradictory)  కొన్ని భావాలను ఉదహరించి  అవి అన్నీ శ్రీనివాసుడి మాయలుగా వర్ణించడం ఒక చమత్కారం. క్రింది పల్లవి చూడండి.
కుంతలవరాళి - ఆది
॥పల్లవి॥ పురుషుండని శృతి వొగడీనట ఆ పురుషుఁడు నిరాకారమట 
విరసవాక్యము లొండొంటికి నివి వింటే నసంబద్ధములు
వేదాల్లో వర్ణించబడిన పురుషుడుని నిరాకారుడని చెప్పడం పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని చెప్పి ఇలాంటి ఇంకొన్నిఅసంబద్ధభావాలను చరణాలలో ఉదహరిస్తాడు. 
॥చ1॥ మొగమున బ్రహ్మలు మొలచిరట ఆ మూరితి అవయవరహితుఁడట
తగు బాహువులను రాజులట ఆ తత్వమే యెంచఁగ శూన్యమట
పగటున తొడలను వైశ్యులట ఆ బ్రహ్మము దేహము బయలట
అగపడి పాదాల శూద్రులట ఆతని రూపము లేదట
పురుష సూక్తం లో చెప్పినట్టు బ్రాహ్మణులు నోటినుండి వచ్చారని చెప్పారు కానీ ఆ పురుషుడు అవయవ రహితుడు. అలాగే ఇతర వర్ణాల వారు వేర్వేరు దేహ భాగాల నుండి ఉద్భవించారని చెప్పారు కానీ ఆ పురుషుడు రూపాలే లేని వాడని కూడా చెప్పారు. 
॥చ2॥ తన వందనమునుఁ గలదట దైవము తనుఁ జూడఁ గన్నులు లేవట
తన విన్నపమునుఁ జేయునట ఆతనికిని వీనులు లేవట
తన యిచ్చినదే నైవేద్యంబట దైవము నోరే లేదట
తన యిచ్చేటి ధూపంబును గలదట దైవము ముక్కును లేదట
దైవానికి కళ్ళు లేవు చెవులు లేవు నోరు లేదు ముక్కు లేదు. కానీ మన నమస్కారాన్ని చూస్తాడు, మన విన్నపాన్ని వింటాడు, మనం నివేదించిన పదార్ధాన్ని భుజిస్తాడు, మనం ఇచ్చిన ధూపాన్ని ఘ్రాణిస్తాడు. ఇవి కూడా పరస్పర విరుద్ధభావాలే. 
॥చ3॥ అంతాఁ దానే దైవమటా యజ్ఞము లొరులకుఁ జేయుటట
సంతతమునుఁ దా స్వతంత్రుఁడటా జపముల వరముల చేకొంటట
చింతింపఁ దానే యోగియటా చేరువ మోక్షము లేదట
పంతపు శ్రీవేంకటపతిమాయలు పచారించిన వివియట
దైవం అంతా తానే అయి ఉండి కూడా వేరే దేవతలప్రీతికై  యజ్ఞాలు చేయబడడం, తాను ఎల్లప్పుడు స్వతంత్రుడుగా ఉంటూ కూడా జపాలు, వరాలు చేకొనడం, తాను స్వయంగా యోగి అయినా కూడా మోక్షం దరి లేకపోవడం ఇవన్నీ విరుద్ధంగా అనిపించే శ్రీనివాసుడి మాయలు అని అన్నమయ్య వివరిస్తాడు. ఆ రకంగా పరస్పర విరుద్ధభావాలను అనుసంధానించాడు భక్తి బిందువు - భక్తీ, సంపూర్ణ శరణాగతులే మోక్షసాధనాలు అన్నది అన్నమయ్య సందేశం. ఆయన భక్తికే పెద్ద పీట వేసాడు.
ఇంకొక ఉదాహరణ.
॥పల్లవి॥ ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము - ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు
మనం సరియైన మోక్షమార్గాన్ని ఎన్నుకోవడంలోనూ, ఆమార్గంలో మఱపు, వెఱపు లేకుండా పయనించడంలోనూ జ్ఞానము, వివేకమూ ముఖ్యపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా అజ్ఞానాన్ని గుర్తించడం చాలా ముఖ్యం.  
॥చ1॥ తనుఁ దలచుకొంటేను తక్కిన దేహభోగాలు - పనికిరావు అవి ప్రకృతి గాన
ఘనమైన లోకభోగములతో లోలుఁడైతే - తనుఁ గానరాదుగానరాడు జీవతత్వము గాన
ఆ పరమాత్ముడే ఇచ్చిన దేహభోగాలు మోక్షానికి పనికిరావు.  ఆలోకభోగాలు అనుభవిస్తూ కూర్చొంటే ఆపరమాత్ముడు కనపడడు. 
॥చ2॥ దైవము నెఱిఁగితేను తన కామ్యకర్యములు - భావించి మఱవవలె బంధాలు గాన
కావించేటి తన కామ్యకర్మాలఁ గట్టువడితే - దైవము లోను గాఁడు స్వతంత్రుఁడు గాన
పరమాత్మను తెలుసుకున్న మహాత్ములకి కామ్యకర్మలు బంధాలవుతాయి కాబట్టి వాటిని వదిలేయాలి.  కర్మలకు కట్టుబడి, వాటిని వదలలేని వారికి, భగవంతుడు అందడు. పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నాక కూడా ఈకర్మలను పట్టుకుని వేలాడడం అజ్ఞానం, అవివేకం.  
॥చ3॥ సరిమోక్షము గోరితే స్వర్గము తెరువు గాదు - అరయ స్వర్గము తెరు వల మోక్షానకు
పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశుని - శరణాగతియె సర్వసాధనము గాన
స్వర్గం మోక్షానికి మార్గం కాదు,  కానీ బాగా ఆలోచిస్తే, మోక్షం సాధించాలంటే, స్వర్గాధికారం పొందాలనిపిస్తుంది. వేమన చెప్పినట్లు కామి కాక మోక్షగామి కాడు. అంటే ఏకోరికలూ తీరకుండా నేరుగా మోక్షం పొందడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి, కామ్యాదికర్మలు ఆచరించి సాధనాక్రమంలో ఒక స్థాయికి వచ్చాక మోక్షసాధన వీలవుతుందని భావమనుకుంటా. ఈకీర్తనలో రెండు విభిన్నపోకడలను పక్కపక్కనే ప్రస్తావించి, ఇదా, అదా అన్న ద్వైదీభావం చొప్పించి, చివరలో పరగనలమేల్మంగపతి శ్రీవేంకటేశుని శరణాగతియె సర్వసాధనము గాన అన్న సూక్ష్మాన్ని విప్పారు. ఇది ఒక విలక్షణ ప్రయోగం. ఇటువంటివి ఆయన కీర్తనలలో ఎన్నో. 
3. భక్తి బిందువు - భక్తీ, సంపూర్ణ శరణాగతులే మోక్షసాధనాలు అన్నది అన్నమయ్య సందేశం. ఆయన భక్తికే పెద్ద పీట వేసాడు
అన్నమయ్య భక్తి మార్గాన్నీ, సంపూర్ణశరణాగతినీ తన కీర్తనలలో ప్రస్ఫుటంగా ప్రతిపాదించాడు. శరణాగతి అత్యంత సులభమైన, ఫలదాయకమైన మోక్షమార్గం. భావములో కానీ, బాహ్యములో కానీ గోవిందుడినే తలవమని బోధించినా, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడని వక్కాణించినా, శ్రీవేంకటపతి శరణమే నిత్యౌషధమని భావించినా,  శ్రీవేంకటేశ్వరుజేరి కొలుచుటే ధావతిలేని యట్టి తన జన్మ ఫలము అని మురిసినా, ఈ సృష్టికి హరియే మూలమని ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము అన్న అన్నమయ్య అనుభవమే ప్రమాణం. సుఖదుఃఖములు దైవాధీనాలు. ఎవరూ వాటిని కోరుకోరు, మనం కోరవలసినది హరి శరణాగతి మాత్రమే. ఈ ప్రపంచము, దాని స్వభావము, మోక్షము ఇవన్నీ ఈశ్వరుడిచ్చినవే.  అన్నీ ఆ అంతర్యామి కల్పితాలు. మనం ఆసపడవలసినది కేవలం శ్రీనివాసుని దాసత్వం అని ప్రబోధం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణేతహాసాలు పరబ్రహ్మ, పరాత్పరుడు అని కొనియాడిన వేంకటపతిని కాక అన్యదైవాలను సేవించడం, ఆయన సౌందర్యాన్ని తెలుసుకోకపోవడం అజ్ఞానం, తప్పు, ద్రోహం (పాడైన యెరుకతో బంధమోక్షము లొక్క-గాడిఁ గట్టుట తెలివి గానకే కాదా).
4. జ్ఞాన బిందువు – అన్నమయ్య ఆత్మజ్ఞాని. పరతత్వం గ్రహించినవాడు.
అన్ని జీవులలోనూ ఉండే బ్రహ్మమొక్కటే, అందరిలోనూ ఉండే అంతరాత్మ పరమాత్మ అయిన ఆ శ్రీహరియే అని గ్రహించిన అన్నమయ్య ఆత్మజ్ఞాని. ఎండా-నీడా, రాత్రి-పగలు, నిద్ర, సుఖం, భూమి ఇవన్నీ రాజుకి-బంటుకి, బ్రాహ్మణుడికి -ఛండాలుడికి, జీవులకి -దేవతలకి, కుక్కకీ-ఏనుగుకి,  అందరికీ ఒకే రకంగా వర్తిస్తాయని నొక్కి వక్కాణించాడు.
॥పల్లవి॥ తందనాన భళా తందనాన
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె పరబ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే ॥తంద॥
॥చ1॥ కందువగు హీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మింతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ ॥తంద॥
॥చ6॥ కడగి యేనుఁగుమీఁదఁ గాయు యెండొకటే పుడమి శునకముమీఁదఁ బొలయు నెండొకతే కడుఁబుణ్యులను పాపకర్ములను సరిఁ గావ జడియు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే ॥తంద॥
మనజీవితం ఒక నాటకమని గ్రహించడం మోక్షం. స్వాభావికమైన చావు పుట్టుకల మధ్యకాలం, కూడు గుడ్డల సంపాదనకు పడే పాట్లు నాటకం, పాపపుణ్యాల మధ్య ఊగిసలాట నాటకం. ఈనాటకాలనుండి బయటపడాలంటే కైవల్యసాధనే దారి.  మనం ఈ ప్రపంచంలో ఉంటూ చివరికి చేరుకోవాల్సినది, మనం మంచి చెడులు అనే కర్మల బంధనాలను దాటితే కలిగె స్థితి మోక్షం. శ్రీవేంకటేశ్వరుడి ఏలికలో ఆకాశం మీదుగా ఉన్నవేంకటాద్రియే కైవల్యం. ఇదే పరతత్వము. పరమాత్మ జ్ఞానము.  
॥పల్లవి॥ నానాఁటి బదుకు నాఁటకము -కానక కన్నది కైవల్యము
॥చ1॥ పుట్టుటయు నిజము పోవుటయు నిజము - నట్టనడిమి పని నాఁటకము
యెట్టనెదుటఁ గలదీ ప్రపంచమును - కట్టఁగడపటిది కైవల్యము
॥చ3॥ తెగదు పాపమును తీరదు పుణ్యము -నగినగి కాలము నాఁటకము
యెగువనె శ్రీవేంకటేశ్వరుఁ డేలిక -గగనము మీఁదిది కైవల్యము
చివరగా చినతిరుమలయ్య చెప్పినట్లుగా-
వేదంబులు పౌరాణిక వాదంబులు వరకవిత్వ వాణీ వీణా నాదంబులు, 
కృతసుజనాహ్లాదంబులు తాళ్ళపాక అన్నమయ పదముల్

Wednesday, October 16, 2024

తెలుగు వాగ్గేయకారుల రచనలలో ప్రబోధాలు

తెలుగు వాగ్గేయకారుల రచనలలో ప్రబోధాలు

సోదాహరణ ప్రసంగం

రచన: సత్యసాయి  కొవ్వలి

తెలుగు వాగ్గేయకారులలో త్యాగరాజు, శ్యామశాస్త్రి, అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య వంటి వారు ముఖ్యులు. వీరిలో చాలామంది కేవలం భక్తి ప్రధానంగా కీర్తనలు రాసి ఆలపించారు. అత్యధిక సంఖ్యలో కీర్తనలు రాసిన త్యాగయ్య, అన్నమయ్యలు వారి భక్తితో పాటు తత్కాలీన సామాజిక రుగ్మతలు, పోకడలు, మానవ సంబంధాలు, వ్యవహారాల పై తమ ఆలోచనలను తమ రచనలలో చూపించారు. వీరి కీర్తనలను ఉదాహరిస్తూ వారు తమ సామాజిక బాధ్యతను ఏ రకంగా తమ రచనలో చూపించారో గమనిద్దాం. సామాజిక బాధ్యత అంటే నా దృష్టిలో సంఘంలో దురాచారాలను ఎత్తిచూపడం, సాటివారికి తన అనుభవాల దృష్ట్యా మార్గ నిర్దేశం చేయడం, తన విద్యని ఇతరులకి నిస్వార్ధంగా నేర్పడం ఇత్యాదులు మాత్రమే కాకుండా ‘సులభముగా కడతేరను సూచనలను తెలియజేయడం’ కూడా.

కాకర్ల త్యాగబ్రహ్మం (త్యాగరాజు)

త్యాగరాజస్వామి వారు 4 మే 1767 -6 జనవరి  1847 మధ్య కాలంలో జీవించారు. నాదోపాసనే  జీవితాశయంగా చేసుకుని  తన 80 సంవత్సరాల సుదీర్ఘ జీవిత ప్రయాణంలో కొన్ని వేల కీర్తనలు రచించారు. సంగీత త్రిమూర్తులలో ప్రముఖులైన ఈయన తన జీవితాన్ని రాముని సేవకై అంకితం  చేసి కేవలం ఊంఛవృత్తి తో జీవనం గడిపారు. ఆ విధంగా భక్తికి, వైరాగ్యానికి, నాదోపాసనకి, నిర్మోహత్వానికి ప్రతీకగా జీవించి తన జీవితమే ఒక ప్రబోధముగా నిరూపించిన మహనీయుడు ఆయన.

త్యాగరాజ స్వామి వారు తమ అనేక రచనలలో మనసుని సంబోధిస్తూ ఆత్మ ప్రబోధానికి ఎక్కువ విలువ ఇచ్చారు. ఈ ధోరణిలో ఇతరులకి బుద్ధి చెప్పడం కేవలం ఎవరిని నొప్పించకుండా వారిని సంస్కరించడానికి ప్రయత్నించడం అని అనిపిస్తుంది. ‘మనసా ఎటు లోర్తునే[1],  నిధి చాలా సుఖమా[2], సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా[3] అని తనని తాను ప్రశ్నించుకున్నా అవన్నీ మనకు ఇచ్చిన  సందేశాలే. వాటిలో ముఖ్యమైనవి  నాదోపాసన చేయమని, భక్తి కలిగి ఉండమని.  నాదలోలుడై బ్రహ్మానందమందవే[4], ‘ప్రాణానల సంయోగము వల్లా ప్రణవనాద సప్తస్వరములే బరగా- మోక్షము కలదా[5],  అని చెప్పినా, ‘భజన చేయరాదా[6] అని సలహా ఇచ్చినా,  భజనపరులకేల దండపాణి భయము[7] అని ధైర్యం చెప్పినా  మనకి ఆయన ఉపదేశించదలచినది భక్తి మరియు సంగీత జ్ఞానం అలవర్చుకోమని. అందరికీ సంగీత జ్ఞానం అలవర్చుకోవడం సాధ్యం కాదు అని తెలిసి దయతో అందరూ పాడుకోగల ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, భజన సాంప్రదాయ పద్ధతిలో కీర్తనలు ఆయన స్వరపరిచారు.

త్యాగరాజ స్వామి వారు ఆ రోజుల్లోనే మన ఈనాటి పరిభాషలో చెప్పాలంటే గొప్ప యాక్టివిస్ట్. ‘యజ్ఞాదులు సుఖమనువారికి  సములజ్ఞానులు కలరా?[8] అని ప్రశ్నించి యజ్ఞాలు చాలా ముఖ్యము అనుకునే ఆ రోజుల్లోనే తన తిరుగుబాటు ధోరణి ప్రదర్శించారు. జన్మవాసనలు, విషయాసక్తి లో తగిలి శ్రీరాముని తెలియక యజ్ఞ్యాదులు సుఖం అనుకోవడం అజ్ఞానమని ఆయన అభిప్రాయం. సుజ్ఞానం కావాలంటే మనమేం చేయాలో తత్వముపదేశించిన మహర్షి ఆయన. అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు, [9] అని ఒక చోట చెప్తే శాంతము లేక సౌఖ్యం లేదని [10] ఇంకో కృతిలో  చెప్పారు.

మనసు స్వాధీనమైన ఆ ఘనునికి మరి మంత్ర తంత్రము లేల?[11] అని చెప్పిన స్వామి వారు ‘మనసు నిలప శక్తి లేకపోతే మధుర ఘంట విరుల పూజేమిసేయును[12] అని మనస్సును అదుపులో పెట్టుకో లేకపోతే మన నిత్య పూజలు నిరర్థకమని తెగేసి చెప్పారు. ఘన దుర్మదుడు చేసే పుణ్య నదీ స్నానం, సోమిదమ్మ సొగసుకాండ్రను కోరితే సోమయాజి  స్వర్గార్హుడవడని,  కామ క్రోధాలు వదలకుండా చేసిన తపస్సు దండగని ఆయన ఈ కీర్తనలో విశదీకరించారు.

ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారలైనా కాంతదాసులే[13] అని మానవ బలహీనతని ఎత్తి చూపిన కీర్తన ఈ రోజుకీ వర్తిస్తుంది. అందులో పరహింస, పరభామ, పరధనాల పట్ల అనురక్తి, పరమానవాపవాదం, పరజీవనం, వీటి కోసం అబద్ధం ఆడటం వంటి బలహీనతలను త్యాగరాజ స్వామి వారు ఉటంకిస్తారు. నిరసిస్తారు. శివ శివ శివ యనరాదా[14] అన్న కృతిలో కామాదుల తెగఁ గోయమని కామవర్ధని రాగంలో చెప్పడం ఆయన చమత్కారం. వీటినుండి విముక్తి ఏదయ్యా అంటే, సంతతంబు శ్రీకాంత స్వాంతసిద్ధాంతమైన మార్గ చింత చేయడం. అలాగే ఎన్ని విద్యలు నేర్చినా పెద్దల సుద్దులు వినకపోతే బుద్ధి రాదు బుద్ధి రాదు[15] అని కూడా చెప్పారు. బుద్ధి తెచ్చుకోవాలంటే ధర్మం చేయడం కన్నా అనన్య చిత్తభక్తుల వాగమృత పానము, పురాణ పఠనం కన్నా మానుషావతార చరిత మర్మజ్ఞుల జతగూడటం, యోగాభ్యాసం కన్నారామదాసుల చెలిమి చేయడం మిన్నయని అని ఉద్బోధించారు.

ఆడంబరాలు, డాంబికాలను త్యాగరాజు ఇష్టపడలేదు. బయట ఒకటి లోపల ఒకటి ఉండకూడదని, గొప్పతనముకై ఆస, కుత్సిత విషయ పిపాసలు వదలక, మెప్పులకై భజన చేసే పద్ధతిని విమర్శిస్తూ ‘అది కాదు భజన, మనసా[16] అని వివరించారు. అలాగే తెలియలేరు రామ భక్తి మార్గమును[17] అనే కీర్తనలో భక్తి లేకుండా హడావిడి చేస్తూ, తమ వేష భాషలతో పైకి గౌరవనీయులుగా చలామణి అవుతూ డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న వారి గురించి జాలి పడతారు.

తనకి ఉన్న విద్వత్తుతో, రాజుల ఆదరణతో త్యాగరాజ స్వామి తలుచుకుంటే అత్యంత ధనవంతుడై ప్రాపంచిక సుఖాలను అనుభవించి ఉండేవారు. కానీ నిధి సుఖమేకాదని రాముని సన్నిధిని మాత్రమే ఆయనవలె కోరుకోవడం మానవమాత్రులు చేయలేని పని. నాదుపై పలికేరు నరులు[18] అన్న కీర్తనలో జానెడు ఉదరమునింప నొరుల పొగడితినాఅని నిలదీస్తారు. ఇదే భావం దుర్మార్గ చరాధముల దొర అనజాలరా[19] అని రంజనిలో రంజకంగా చెప్పారు. ఆ కృతిలో సరస్వతిని అమ్మనని, ఖలుల నెచట పొగడను అని వక్కాణించారు.

ఈరోజు మనం చూస్తున్న మత భేదాల లాగే ఆ రోజుల్లో కూడా ద్వైత అద్వైతాల మధ్య, శివ కేశవుల మధ్య భేదాలు ఎంచి కత్తులు నూరుకునేవారని  మనం విన్నాం. త్యాగరాజ స్వామి వారు తమ కీర్తనల్లో వీటిని చర్చించారు. ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా[20] అని తీవ్రంగా ప్రశ్నించారు. ఎవరని నిర్ణయించిరిరా, నిన్నెట్లు ఆరాధించితిరా -శివుడనో, మాధవుడనో, కమలభవుడనో, పరబ్రహ్మమనో[21] అని ప్రశ్నించడంలోనే అందరూ సమానం అనే భావన కలిగించడం ఒక విశేషం. త్యాగరాజస్వామి గారు శివకేశవులను సమానంగా భావించే వారిని గౌరవించారు.

ఈ విధంగా త్యాగరాజు వారి భోధనలు ఉన్నత మానవతా విలువలు నెలకొల్పడానికి పనికొస్తాయి. ప్రస్తుతం జాతకాలు గ్రహశాంతుల పేరిట ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో మనకు తెలుసు. గ్రహబలమేమి శ్రీరామానుగ్రహబలమే బలము[22] అని జాతకాల వంటిని నమ్ముకోవడం అనవసరమని ఆనాడే బోధించారు.

త్యాగరాజ స్వామివారి కృతులన్నీ ఒక యెత్తు, వారి పంచరత్న కీర్తనలు ఒక యెత్తు.  వాటిలో ఒకటి దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోతురా[23]. కడు దుర్విషయా కృష్ణుడై గడియ గడియకు నిండారు దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఆయన కీర్తనలన్నిటిలోనూ ఉన్న ప్రబోధాల సారాంశం ఈకీర్తన అని చెప్పచ్చు.

తాళ్ళపాక అన్నమయ్య

భక్తి, శృంగారము, ఆధ్యాత్మికత వంటి భావాలతో పుంఖానుపుంఖలుగా సుమారు 32 వేల కీర్తనలు తెలుగు, సంస్కృతాలలో రాసిన గొప్ప వాగ్గేయకారుడు, తాళ్ళపాక అన్నమయ్య.  తన కీర్తనలలో సమాజంలోని చెడుని ఎత్తి చూపించిన మొదటి వాగ్గేయకారుడు ఆయన. సుమారు 95 సంవత్సరములు (22 మే 1408 – 4 ఏప్రిల్ 1503) జీవించిన ఆయన భక్తుడు, మహర్షి, వాగ్గేయకారుడు, సామాజికోద్ధారకుడు.  పదకవితా పితామహుడు.

అన్నమయ్య సామాజిక సమానత్వాన్ని అత్యున్నతంగా నిరూపించిన కీర్తన బహుశః తందనానాపురే తందనానా అహే... బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే[24] అన్నది. ఈ కీర్తనలో అన్నమయ్య హీనాధిక భేదాలు లేకుండా అందరిలోనూ ఉండే అంతరాత్మ పరమాత్మ అయిన ఆ శ్రీహరియే అని నిరూపించాడు.  ఎండా-నీడా, రాత్రి-పగలు, నిద్ర, సుఖం, భూమి ఇవన్నీ రాజుకి-బంటుకి, బ్రాహ్మణుడికి -ఛండాలుడికి, జీవులకి -దేవతలకి, కుక్కకీ-ఏనుగుకి,  అందరికీ ఒకే రకంగా వర్తిస్తాయని నొక్కి వక్కాణించాడు. అనేక కీర్తనలు జానపద శైలిలో వ్రాసిన ఆయన జానపదకవితా పితామహుడు కూడా. అందుకే ఆయన కీర్తనలు జనబాహళ్యం లోకి బాగా చొచ్చుకు పోయాయి.

అన్నమయ్య కూడా, త్యాగయ్య లాగ, నరస్తుతి చేయడానికి నిరాకరించాడు. అందువల్ల చెరసాల పాలయ్యాడు కూడా. హరినామము కడు నానందకరము[25] అని హరినామ విశేషాన్ని, బంధవిముక్తి మార్గాన్ని తెలిపారు. అప్పులేని సంసారమైన పాటే చాలు - తప్పులేని జీతం ఒక్క తారమైన చాలు[26] అన్న పాటలో మనిషి ఎంత నిరాడంబరంగా ఉండొచ్చో నిరూపిస్తాడు. ఇంకొక కీర్తన, వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు[27], లో ఈ సంసారబంధంలో మనిషి ఎలా కూరుకుని పోతాడో కళ్ళకి కట్టినట్లు చూపిస్తాడు. అలాగే చావు, పుట్టుక, పుణ్యం, పాపము వంటి వాటి మధ్య జీవితం ఎంతటి నాటకమో నానాటి బతుకు నాటకం[28] అని ఎరుకబరుస్తాడు. మోహము విడుచుటె మోక్షమది దేహమెరుగుటే తెలివీనదే[29] అన్న కీర్తనలో మోక్షము, తెలివి, పరమము, కలిమి, కులహీనత,  మలినము, నరకము, సుకృతములను సులభముగా నిర్వచిస్తూ ఆత్మవిద్య బోధిస్తాడు.  భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను- తీరని చేదేకాక తీయనుండేనా[30] అన్నఇంకో కీర్తనలో కుక్కతోక వంకర తీయలేమని, తేలుని ఎంత ప్రేమతో కోకలో పెట్టుకున్నా కుట్టక మానదని, ఘోరమైన ఆసలు కూడా ఎంత వేంకట విభుని కృప ఉన్నా ఒక పట్టాన పోవని చెప్పాడు.

త్యాగరాజు వలె అన్నమయ్య కూడా పరనింద, పరభామల వలపు, జీవహింస, దారాసుత సేవలో సమయము వృధా చేసుకోవడం  వంటి వాటిని తన కీర్తనలలో నిరసించాడు. కులప్రమేయం లేకుండా ఎవ్వరైనా హరిని తెలుసుకోవచ్చని ఏ కులజుఁడేమి యెవ్వఁడైననేమి[31] అన్న కీర్తనలో పరనింద చేయకుండుట, భూతదయ, ఆత్మతత్వాన్ని ఎరుగుట, హరినెరిగిన వారి లక్షణాలు యని వివరించాడు.  

పరమాత్మ తత్వాన్ని అత్యంత మనోహరంగా చిత్రించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఎవ్వరు ఎలా భావిస్తే అలాగే పరమాత్మ ఆవిష్కరించబడతాడని ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు[32] అని భగవంతుని తత్వాన్ని గొప్పగా చెప్పాడు. పురుషోత్తముడ నీవు, పురుషాధముడ నేను[33] వంటి కీర్తనలలో దోషాలు తనకే ఆపాదించుకుని, తనని తాను తక్కువ చేసుకుని సుగుణాలన్నీ శ్రీనివాసుడికి అన్వయించి ఆయన్నిఅధికుడిని చేయడం భక్తిలో ఒక నైపుణ్యం. ఒక లౌక్యం. ఒక విశేషం.

ఇలా చెప్పుకుంటూ పోతే త్యాగరాజు, అన్నమయ్యల జీవితమే ఒక బోధన. వారి కలం నుండి వచ్చిన ప్రతి మాట ఒక బాట. ప్రతిపాట ఒక పాఠం. వినయం ప్రతిబింబించే త్యాగయ్య గారి మాటల్లోనే చెప్పాలంటే ఎందరో మహానుభావులు- అందరికీ వందనములు.


 

ఈ వ్యాసంలో ఉదహరించిన కీర్తనల పూర్తి పాఠం



[1] మనసా ఎటు లోర్తునే- మలయమారుతము – రూపకము

పల్లవి: మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే ఓ ॥మ

అను పల్లవి: దినకరకుల భూషణుని -దీనుఁడవై భజనఁజేసి
దినముఁ గడుపమనిన నీవు -వినవదేల గుణవిహీన ॥మ

చరణము: కలిలో రాజస తామస గుణములు - గలవారి చెలిమి
కలిసిమెలసి తిఱుగుచు మఱి - కాలము గడపకనే
సులభముగాఁ గడతేరను - సూచనలను దెలియఁజేయు
ఇలను త్యాగరాజుమాట - వినవదేల గుణవిహీన ॥మ॥

[2] నిధి చాలా సుఖమా -కల్యాణి - త్రిపుట ( - చాపు)

పల్లవి: నిధిచాల సుఖమో రాముని సన్నిధిసేవ సుఖమో నిజముగఁ బల్కు మనస ॥ని॥

అను పల్లవి: దధి నవనీత క్షీరములు రుచో దాశరథీ ధ్యానభజన సుధారసము రుచో ॥ని॥

చరణము(లు):

శమ దమ మను గంగాస్నానము సుఖమో కర్దమ దుర్విషయ కూపస్నానము సుఖమో
మమత బంధవయుత నరస్తుతి సుఖమో సుమతి త్యాగ రాజనుతుని కీర్తన సుఖమో ॥ని

[3] సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే -ధన్యాసి - దేశాది

పల్లవి: సంగీతజ్ఞానము భక్తివినా సన్మార్గము గలదె మనసా ॥సం॥

అను పల్లవి: భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదు లుపాసించే ॥సం॥

చరణము(లు):

న్యాయాన్యాయము దెలుసును జగములు - మాయామయమనె దెలుసును దుర్గుణ
కాయజాది షడ్రిపుల జయించే - కార్యము దెలుసును త్యాగరాజునికే ॥సం॥

[4] నాదలోలుడై బ్రహ్మానందమందవే మనసా’ -కల్యాణ వసంత - రూపక

పల్లవి: నాదలోలుఁడై బ్రహ్మానందమందవే మనసా ॥నా॥..

అను పల్లవి: స్వాదుఫలప్రద సప్తస్వరరాగనిచయసహిత ॥నా॥..

చరణము(లు):

హరిహరాత్మ భూ సురపతి శరజన్మ గణేశాది
వరమౌను లుపాసించరే ధర త్యాగరాజు తెలియు ॥నా॥.

[5] మోక్షము కలదా -సారమతి - దేశాది

పల్లవి: మోక్షముగలదా భువిలో జీవ - న్ముక్తులు గానివారలకు ॥మో॥

అను పల్లవి: సాక్షాత్కార నీసద్భక్తి - సంగీతజ్ఞానవిహీనులకు ॥మో॥

చరణము(లు):

ప్రాణానల సంయోగము వల్ల ప్రణవనాదము సప్తస్వరములై బరగ
వీణావాదనలోలుఁడౌ శివమనోవిధ మెఱుఁగరు త్యాగరాజ వినుత ॥మో॥

[6] భజన చేయరాదా -అఠాణ - రూపకం

పల్లవి: భజన సేయరాదా? రామ ॥భజన॥

అను పల్లవి: అజ రుద్రాదులకు సతత మాత్మ మంత్రమైన రామ ॥భజన॥

చరణము(లు):

కరకు బంగారు వల్వ కటి నెంతో మెరయగ
చిరు నవ్వులు గల మొగమును చింతించి చింతించి ॥భజన॥

అరుణాధరమున సురుచిర దంతావళిని
మెరయు కపోల యుగమును నిరతమునను దలచిదలచి ॥భజన॥

బాగుగ మానస భవ సాగరమునను తరింప
త్యాగరాజు మనవిని విని తారకమగు రామనామ ॥భజన॥

[7] భజనపరులకేల దండపాణి భయము-సురటి - రూపకము

పల్లవి: భజనపరులకేల దండ - పాణి భయము మనసా! రామ॥భ॥

అను పల్లవి: అజ రుద్ర సురేశుల - కాస్థానమొసంగు రామ ॥భ॥

చరణము(లు):

అండకోట్ల నిండిన కో - దండిపాణి ముఖమును హృత్‌
పుండరీకమునఁజూచి - పూజ సల్పుచు
నిండుప్రేమతోఁ గరంగు - నిష్కాములకు వరవే
దండ పాలు దాసుఁడైన - త్యాగరాజుసేయు నామ ॥భ॥

[8] యజ్ఞాదులు సుఖమనువారికి  సములు అజ్ఞానులు కలరా? -జయమనోహరి – ఆది

పల్లవి:యజ్ఞాదులు సుఖమను వారికి సమ
మజ్ఞానులు గలరా? ఓమనసా ॥యజ్ఞాదులు

అను పల్లవి:సుజ్ఞాన దరిద్ర పరంపరుల
సురచిత్తులు జీవాత్మ హింసగల ॥యజ్ఞాదులు

చరణము(లు):బహు జన్మంబుల వాసన యుతులై
అహి విష సమ విషయాకృష్టులై
బహిరాననులై త్యాగరాజు
భజియించు శ్రీరామునికిఁ దెలియక ॥యజ్ఞాదులు॥

[9] అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు -సరస్వతి - రూపకం

పల్లవి: అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు అ..

అను పల్లవి: ఘనులైన యంతర్జ్ఞానుల కెఱుకేగాని అ..

చరణము(లు):

వగవగగా భుజియించువారికి తృప్తియౌరీతి
సగుణధ్యానముపైని సౌఖ్యము త్యాగరాజనుత అ..

[10] శాంతము లేక సౌఖ్యము లేదు- సామ - ఆది

పల్లవి: శాంతములేక సౌఖ్యములేదు - సారసదళనయన ॥శాం॥

అను పల్లవి: దాంతునికైన వే - దాంతునికైన ॥శాం॥

చరణము(లు):

దారసుతులు ధన ధాన్యము లుండిన -సారెకు జప తప సంపదగల్గిన ॥శాం॥

యాగాదికర్మము లన్నియుఁజేసిన -బాగుగ సకలహృద్భావముఁ దెలిసిన ॥శాం॥

ఆగమశాస్త్రము లన్నియు జదివిన -భాగవతులనుచు బాగుగఁ బేరైన ॥శాం॥

రాజాధిరాజ శ్రీరాఘవ త్యాగ -రాజవినుత సాధురక్షక తనకుప ॥శాం॥

[11] మనసు స్వాధీనమైన ఆ ఘనునికి మరి మంత్ర తంత్రము లేల? -శంకరాభరణము - రూపకము

పల్లవి: మనసు స్వాధీనమైన యా ఘనునికి మఱి మంత్రతంత్రము లేల ॥మ॥

అను పల్లవి: తనువు తానుగాదని యెంచువానికి తపసు చేయనేల దశరథబాల ॥మ॥

చరణము(లు):

అన్ని నీవనుచు యెంచినవానికి యాశ్రమ భేదములేల
కన్నుగట్టు మాయలని యెంచువానికి కాంతల భ్రమలేల దశరథబాల ॥మ॥

ఆజన్మము దుర్విషయ రహితునికి గతాగత మికనేల
రాజరాజేశ నిరంజన నిరుపమ రాజవదన త్యాగరాజ వినుత ॥మ॥

[12] మనసు నిలప శక్తి లేకపోతే మధుర ఘంట విరుల పూజేమిసేయును -ఆభోగి - ఆది

పల్లవి: మనసునిల్ప శక్తిలేకపోతే మధురఘంటవిరుల పూజేమి జేయును? మ..

అను పల్లవి: ఘనదుర్మదుఁడై తా మునిగితే కావేరి మందాకిని యెటు బ్రోచును? మ..

చరణము(లు):

సోమిదమ్మ సొగసుగాండ్రఁ గోరితే సోమయాజి స్వర్గార్హుఁడౌనో?
కామక్రోధుఁడు తపంబొనర్చితే గాచి రక్షించునో? త్యాగరాజనుత! మ..

[13] ఎంతనేర్చిన ఎంతజూచిన -సింధుధన్యాసి - దేశాది (ఉదయరవిచంద్రిక - దేశాది)

పల్లవి: ఎంతనేర్చిన ఎంతజూచిన
ఎంతవారలైన కాంతదాసులే ॥ఎం॥

అను పల్లవి:సంతతంబు శ్రీకాంతస్వాంత సిద్ధాంతమైన మార్గ చింతలేని వా ॥రెం॥

చరణము(లు):

పరహింస పరభామాన్యధన పరమానవాపవాద
పరజీవనమ్ముల కనృతమే భాషించేరయ్య త్యాగరాజ నుత ॥ఎం॥

[14] శివ శివ శివ యనరాదా -పంతువరాళి - ఆది

పల్లవి: శివశివ యనరాదా ఓరీ శివ..

అను పల్లవి: భవభయబాధల నణచుకోరాదా శివ..

చరణము(లు):

కామాదుల దెగకోసి పరభామల పరుల ధనముల రోసి
పామరత్వము నెడబాసి అతినీమముతో బిల్వార్చన జేసి శివ..

సజ్జనగణముల గాంచి ఓరి ముజ్జగదీశ్వరులని మతి నెంచి
లజ్జాదుల దొలగించి తన హృజ్జలజమునను తా పూజించి శివ..

ఆగమముల నుతియించి బహు బాగులేని భాషలు చాలించి
భాగవతులతో పోషించి ఓరి త్యాగరాజ సన్నుతుడని యెంచి శివ..

[15] బుద్ధిరాదు బుద్ధిరాదు  -శంకరాభరణం - చాపు

పల్లవి: బుద్ధిరాదు బుద్ధిరాదు పెద్దల సుద్దులు వినక ॥బుద్ధి॥

అను పల్లవి: బుద్ధిరాదు బుద్ధిరాదు భూరి విద్యల నేర్చిన ॥బుద్ధి॥

చరణము(లు):

ధాన్యధనములచేత ధర్మమెంతయుఁ జేసిన యనన్య చిత్తభక్తుల వాగమృతపానము సేయక ॥బుద్ధి॥

మానక భాగవతాది రామాయణములు చదివిన మానుషావతారచరిత మర్మజ్ఞుల జతఁ గూడక ॥బుద్ధి॥

యోగము లభ్యసించిన భోగములెంతో కల్గిన త్యాగరాజనుతుఁడౌ రామ దాసుల చెలిమి సేయక ॥బుద్ధి॥

[16] అది కాదు భజన, మనసా -యదుకుల కాంభోజి – ఆది

పల్లవి:అది కాదు భజన మనసా! ॥అది

అను పల్లవి:ఎదలో నెంచు టొకటి ప - య్యెద గల్గినచో నొకటి ॥అది

చరణము:

గొప్ప తనముకై యాస కుచ్చిత విషయ పిపాస
మెప్పులకై బహు వేస మిడి ఉప్ప తిల్లెదరు; త్యాగరాజ వినుత! ॥అది॥

[17] తెలియలేరు రామ భక్తి మార్గమును’ -ధేనుక - దేశాది

పల్లవి: తెలియలేరు రామ భక్తిమార్గమును ॥తె॥

అను పల్లవి: ఇల నంతట తిరుగుచుఁ గలువరించేరేగాని ॥తె॥

చరణము(లు):

వేగలేచి నీట మునిఁగి భూతిబూసి వేళ్లనెంచి వెలికి శ్లాఘనీయులై
బాగపైక మార్జన లోలులై రేగాని త్యాగరాజవినుత ॥తె॥

[18] నాదుపైఁ బలికేరు నరులు - మధ్యమావతి - జంప

పల్లవి: నాదుపైఁ బలికేరు నరులు
అను పల్లవి: వేదసన్నుత భవము వేఱు జేసితి ననుచు ॥నా॥

చరణము(లు):

పంచశరజనక ప్రపంచమునఁ గల సుఖము -మంచువలె ననుచు మది నెంచితిగాని
పంచుకొని ధనము లార్జించుకొని సరియెవ్వ - రంచు మఱి గతియు లేదంచుఁ బల్కితినా ॥నా॥

దినము నిత్యోత్సవమ్మున కాసఁ జెందితినా - మనసునను నిల్లు యొకటని యుంటిగాని
అనుదినము యొరులమేలును జూచి తాళలే - కను రెండు సేయవలె ననుచుఁ బల్కితినా ॥నా॥

ప్రాణమేపాటి యని మానమే మేలంటి - గాని శ్రీరామ పరమానంద జలధి
శ్రీనాథకులములో లేనిదారిని బట్టి - జానెఁడుదరము నింప నొరులఁ బొగడితినా ॥నా॥

ఆజానుబాహుయుగ శ్రీజానకీపతి ప - యోజాక్ష శ్రీత్యాగరాజనుత చరణ
ఈ జగతిలో నిన్నుఁ బూజించువారి న - వ్యాజమునఁ బ్రోచే సురాజ నీవాఁడైన ॥నా॥

[19] దుర్మార్గచరాధములను - రంజని - రూపక

పల్లవి: దుర్మార్గచరాధములను దొరనీవనజాలరా దు..

అను పల్లవి: ధర్మాత్మక ధనధాన్యము దైవము నీవై యుండగ ॥దు॥

చరణము(లు):

పలుకుబోటిని సభలోన పతితమానవులకొసఁగే
ఖలుల నెచ్చట పొగడని శ్రీకర త్యాగరాజ వినుత ॥దు॥

[20] ద్వైతము సుఖమా -రీతిగౌళ - ఆది

పల్లవి: ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా ద్వై

అను పల్లవి: చైతన్యమా విను సర్వసాక్షీ వి
స్తారముగాను దెల్పుము నాతో ద్వై

చరణము(లు):

గగన పవన తపన భువనాద్యవనిలో
నగధరాజ శివేంద్రాది సురలలో
భగవద్భక్తవరాగ్రేసరులలో
బాగ రమించే త్యాగరాజార్చిత ద్వై

[21] ఎవరని నిర్ణయించిరిరా - దేవామృతవర్షిణి - దేశాది (ఖరహరప్రియ - ఆది)

పల్లవి:ఎవరని నిర్ణయించిరిరా ని
న్నెట్లారాధించిరిరా నర వరు ॥లె॥

అను పల్లవి:శివుఁడనో మాధవుడనో కమల
భవుఁడనో పరబ్రహ్మమనో ॥ఎ॥

చరణము(లు):

శివమంత్రమునకు మా జీవము మా
ధవమంత్రమునకు రాజీవము ఈ
వివరముఁ దెలిసిన ఘనులకు మ్రొక్కెద
వితరణగుణ త్యాగరాజ వినుత ని ॥న్నె॥

[22] గ్రహబలమేమి -రేవగుప్తి - దేశాది

పల్లవి: గ్రహబలమేమి శ్రీరామానుగ్రహబలమే బలము ॥గ్రహ॥

అను పల్లవి: గ్రహబలమేమి తేజోమయ విగ్రహమును ధ్యానించు వారికి నవ ॥గ్రహ॥

చరణము(లు):

గ్రహపీడల పంచపాపముల నాగ్రహములు గల కామాదిరిపుల నిగ్రహము జేయు హరిని భజించు త్యాగరాజునికి రసికా గ్రేసరులకు ॥గ్రహ॥

[23] దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో - గౌళ - ఆది

దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో |

కడు దుర్విషయా కృష్ణుడై గడియ గడియకు నిండారు ||దుడుకు||

శ్రీ వనితా హృత్కుముదాబ్జా వాజ్మానస గోచర ||దుడుకు||

సకల భూతముల యందు నీవై యుండగ మదిలేక పోయిన ||దుడుకు||

చిరుత ప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన ||దుడుకు||

పర ధనముల కొరకు పరుల మది కరగ-బలికి కడుపు నింప దిరిగినట్టి ||దుడుకు||

తన మదిని భువిని సౌఖ్యపు జీవనమే యనుచు సదా దినములు గడిపిన ||దుడుకు||

తెలియని నటవిట క్షుద్రుల వనితలు స్వవశమౌట కుపదేశించి సంతసిల్లి స్వరలయంబు లెరుంగకని శిలాత్ముడై సుభక్తులకు సమానమను ||దుడుకు||

దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను దేవది దేవ నెర నమ్మితిని గాకను పదాబ్జ భజనంబు మరచిన

||దుడుకు||

చక్కని ముఖ కమలంబును సదా నా మిదిలో స్మరణ లేకనే దుర్మదాంధ- జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ దురాశలను రోయలేక సతత మపరాధినై చపల చిత్తుడనైన ||దుడుకు||

మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మందలేక మద మత్సర కామ లోభ మోహులకు దాసుడై మోసబోతి గాక మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటినిగాక నరాధములను చేరి సారహీన మతములను సాధింప దారుమారు ||దుడుకు||

సతులకై కొన్నాళ్ళాస్థికై సుతులకై కొన్నాళ్ళు ధన తతులకై తిరిగితి నయ్య త్యాగరాజాప్త ఇటువంటి ||దుడుకు||

[24] తందనాన ఆహి తందనాన పురె

తందనాన భళా తందనాన              పల్లవి॥

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె పరబ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే        తంద॥

కందువగు హీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మింతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ  తంద॥

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే అండనే బంటునిద్రదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే ఛండాలుడుండేటి సరిభూమి యొకటే తంద॥

అనుగుదేవతలకును అలకామసుఖ మొకటే ఘనకీటపశువులకు కామసుఖ మొకటే
దిన మహోరాత్రములు తెగి ధనాఢ్యున కొకటే వొనర నిరుఁబేదకును వొక్కటే అవియు       తంద॥

కొరలి శిష్టాన్నములు గొను నాఁకలొకటే తిరుగు దుష్టాన్నములు దిను నాఁకలొకటే
పరగ దుర్గంధములపై వయువు నొకటే వరుసఁ బరిమళముపై వాయువు నొకటే       తంద॥

కడగి యేనుఁగుమీఁదఁ గాయు యెండొకటే పుడమి శునకముమీఁదఁ బొలయు నెండొకతే
కడుఁబుణ్యులను పాపకర్ములను సరిఁ గావ జడియు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే           తంద॥

[25] హరినామము కడు నానందకరము

హరినామము కడు నానందకరము

మరుగవో మరుగవో మరుగవో మనసా               ॥పల్లవి॥

నలినాక్షుని శ్రీ నామము -కలి దోష హరము కైవల్యము

ఫలసారము బహుబంధ మోచనము -తలఁచవో తలఁచవో తలఁచవో మనసా             ॥హరి॥

నగధరు నామము నరక హరణము -జగదేక హితము సమ్మతము

సగుణ నిర్గుణము సాక్షాత్కారము -పొగడవో పొగడవో పొగడవో మనసా              ॥హరి॥

కడఁగి శ్రీ వేంకటపతి నామము -బడిబడినే సంవత్కరము

అడియాలంబిల నతి సుఖ మూలము -తడవవో తడవవో తడవవో మనసా               ॥హరి॥

[26] అప్పులేని సంసార మైన పాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైనఁ జాలు          అప్పులేని॥

కంతలేని గుడిశొక్క గంపంతయినఁ జాలు చింతలేని యంబలొక్క చేరెఁడే చాలు
జంతగాని తరుణి యేజాతైన నదె చాలు వింతలేని సంపదొక్క వీసమే చాలు                                              అప్పులేని॥

తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదె చాలు ముట్టులేని కూడొక్క ముద్దెఁడే చాలు
గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైనఁ జాలు వట్టి జాలిఁ బడుకంటే వచ్చినంతే చాలు                                              అప్పులేని॥

లంపటపడని మేలు లవలేశమే చాలు రొంపి కంబమౌకంటే రోయుటే చాలు
రంపపుఁ గోరిక కంటే రతి వేంకటపతి పంపున నాతనిఁ జేరే భవమే చాలు                                              అప్పులేని॥

[27] వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు

వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు
బట్టబయలు యీసంసారంబని గుట్టు దెలియలేవు ప్రాణీ                                                     వట్టి॥

చాల నమ్మి యీ సంసారమునకు సోలి సోలి తిరిగేవు
బాలయవ్వనప్రౌఢల భ్రమఁబడి లోలుఁడవై తిరిగేవు
మేలుదెలియ కతికాముకుండవై మీఁదెఱఁగక తిరిగేవు
మాలెమీఁద పరు వెందాఁకా నీ మచ్చిక విడువఁగ లేవు                                                     వట్టి॥

మానితముగ దురన్నపానముల మత్తుఁడవై వుండేవు
నానావిధముల దుష్కర్మంబులు నానాటికి నాటించేవు
మేనిలోని యేగురు నార్గురును మిత్రులనుచు నమ్మేవు
ఆనందంబున నాకర్మమునకు అధిపతులని తెలియఁగ లేవు                                                     వట్టి॥

పామరివై దుర్వ్యాపారమునకు పలుమారునుఁ బొయ్యేవు
వేమరు దుర్జనసంగాతంబులు విశ్రామమనుచు నుండేవు
ప్రేమముతో హరిదాసులపై సంప్రీతి నిలుపఁగా లేవు
తామసమతివయి వేంకటనాథుని తత్వ మెఱఁగఁగా లేవు                                                     వట్టి॥

[28] నానాఁటి బదుకు నాఁటకము

నానాఁటి బదుకు నాఁటకము - కానక కన్నది కైవల్యముపల్లవి

పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాఁటకము
యెట్టనెదుటఁ గలదీ ప్రపంచమును కట్టఁగడపటిది కైవల్యమునానాఁ

కుడిచే దన్నము కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాఁటకము
వొడిఁ గట్టుకొనిన వుభయకర్మములు గడి దాఁటినపుడే కైవల్యమునానాఁ

తెగదు పాపమును తీరదు పుణ్యము నగినగి కాలము నాఁటకము
యెగువనె శ్రీవేంకటేశ్వరుఁ డేలిక గగనము మీఁదిది కైవల్యమునానాఁ॥

[29] మోహము విడుచుటే మోక్షమది

మోహము విడుచుటే మోక్షమది

దేహ మెఱుఁగుటే తెలివీ నదే                                             మోహము॥

ననిచిన తన జన్మముఁ గర్మముఁ దనపనియు నెఱుగుటే పరమ మది
తనకు విధినిషేధములుఁ బుణ్యముల ఘనత యెఱుగుటే కలిమి యది                                             మోహము॥

తఱిఁ దఱిఁ బ్రేమపు తల్లిదండ్రులను యెఱఁగనిదే కులహీన తది
చఱులఁ బొరలి యాచారధర్మములు మఱచినదే తన మలిన మది                                             మోహము॥

కమ్మరఁ గమ్మరఁ గామభోగములు నమ్మి తిరుగుటే నరక మది
నెమ్మది వేంకటనిలయుని దాసుల సొమ్మయి నిలుచుట సుకృత మది                 మోహము॥

[30] భారమైన వేఁపమాను పాలువోసి పెంచినాను

భారమైన వేఁపమాను పాలువోసి పెంచినాను

తీరని చేఁదే కాక తియ్యనుండీనా       భారమైన॥

పాయఁదీసి కుక్కతోఁక బద్దలువెట్టి బిగిసి చాయ కెంత గట్టిగాను చక్కనుండీనా
కాయపు వికారమిది కలకాలముఁ జెప్పినా పోయిన పోకలేకాక బుద్ది వినీనా                 భారమైన॥

ముంచి ముంచి నీటిలోన మూల నానఁ బెట్టుకొన్నామించిన గొడ్డలి నేఁడు మెత్తనయ్యీనా
పంచమహాపాతకాలబారిఁ బడ్డ చిత్తమిది దంచి దంచి చెప్పినాను తాఁకి వంగీనా                                               భారమైన॥

కూరిమితోఁ దేలుఁదెచ్చి కోకలోన బెట్టుకొన్నా సారె సారెఁ గుట్టుగాక చక్కనుండీనా
వేరులేని మహిమల వేంకటవిభుని కృప ఘోరమైన ఆస మేలుకోర సోఁకీనా                                               భారమైన॥

[31] ఏ కులజుఁడేమి యెవ్వఁడైననేమి

ఏ కులజుఁడేమి యెవ్వఁడైననేమి ఆ కడ నాఁతడె హరి నెఱిగినవాఁడు                                                          ఏ కులజు॥

పరగిన సత్యసంపన్నుఁడైనవాఁడే పరనింద సేయఁ దత్పరుఁడు గానివాఁడు
అరుదైన భూతదయానిధియగువాఁడే పరులు దానేయని భావించువాఁడు                                                          ఏ కులజు॥

నిర్మలుఁడై యాత్మనియతి గలుగువాఁడే ధర్మతత్పరబుధ్ధిఁ దగిలినవాఁడు
కర్మమార్గములు గడవనివాఁడే మర్మమై హరిభక్తి మఱవనివాఁడు                                                          ఏ కులజు॥

జగతిపై హితముగాఁ జరియించువాఁడే పగలేక మతిలోన బ్రతికినవాఁడు
తెగి సకలము నాత్మ దెలిసినవాఁడే తగిలి వేంకటేశుదాసుఁ డయినవాఁడు             ఏ కులజు॥

[32] ఎంత మాత్రమున ఎవ్వరు దలఁచిన అంతమాత్రమే నీవు

ఎంత మాత్రమున ఎవ్వరు దలఁచిన అంతమాత్రమే నీవు

అంతరాంతరములెంచి చూడఁ బిండంతే నిప్పటి యన్నట్లు                                                   పల్లవి॥

కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుఁడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలఁతురు మిము శైవులు తగిన భక్తులును శివుఁడనుఁచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుఁడనుచు                                                    ఎంత॥

సరి నెన్నుదురు(???) శాక్తేయులు శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానావిధులను తలఁపుల కొలఁదుల భజింతురు
సిరుల మిమ్మునే యల్పబుద్ధిఁ దలచినవారికి నల్పంబవుదువు
గరిమల మిమునే ఘనమని తలఁచిన ఘనబుద్ధులకు ఘనుఁడవు                                                    ఎంత॥

నీవలనఁ గొరతే లేదు మరి నీరుకొలఁది తామెరవు
ఆవల భాగీరథి దరిబావుల ఆజలమే వూరినయట్లు
శ్రీవేంకటపతి నీవైతే మముఁ జేకొనివున్న దైవమని
యీవల నే నీ శరణనియెదను యిదియే పరతత్త్వము నాకు                                                    ఎంత॥

[33] పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను

పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను

ధరలో నాయందు మంచితన మేది పురుషో

అనంతాపరాధములు అటు నేము సేసేవి - అనంతమయినదయ అది నీది

నిను నెఱగకుండేటినీచగుణము నాది - నను నెడయకుండేగుణము నీది పురుషో

సకలయాచకమే సరుస నాకు బని -సకలరక్షకత్వము సరి నీపని

ప్రకటించి నిన్ను దూరేపలుకే నా కెప్పుడూను - వెకలివై ననుగాచేవిధము నీది పురుషో

నేర మింతయును నాది నేరు పింతయును నీది -సారెకు నజ్ఞాని నేను జ్ఞానిని నీవు

యీరీతి శ్రీ వేంకటేశ యిట్టే నన్ను నేలితివి - ధారుణిలో నిండెను ప్రతాపము నీది  పురుషో