ఈపళంగా మనదేశం (ఏదేశంపోయినా ఓ.కే.) పోయి ఒక సర్వే చేసి ఈ క్రింది ప్రశ్నలడగండి.
౧. మీరు వాడే టీ.వీ. ఏ కంపెనీది?
౨. మీరు వాడే కంప్యూటర్ మానిటర్ ఏ కంపెనీది?
౩. మీ కారు ఏ మోడలండీ?
౪. మీ సెల్ ఫోను ఏ కంపెనీది?
౫. ప్రపంచంలో నాణ్యమైన ఉక్కు తయారీలో ఘనత వహించిన సంస్థల్లో 3వ స్థానం లో ఉన్నది ఏది?
౬. మీ మైక్రోవేవ్ ఏ కంపెనీది?
వీటికి సమాధానం మీకు LG, Samsung, Hundai (Santro, Sonata), POSCO చాలా ఎక్కువ సార్లు వస్తాయి. ఈ కంపెనీలన్నీ కొరియావి. మన దేశంలో చాలామందికి కొరియా అంటే పెద్దగా తెలియదు. ఆ మాటకొస్తే నాక్కూడా ఇక్కడకొచ్చాకా బాగా తెలిసింది. మునుపు Economics పుస్తకాల్లో కొరియా అభివృద్ధి గురించి కొద్దిగా చదివా, అంతే. ఈదేశం గురించి తెలియక పోవడంవల్ల, మనకి తరతరాలుగా ఎలెక్ట్రానిక్స్ అంటే జపాన్ అని మాత్రమే భావం ఉండడంవల్ల కొరియా ఉత్పత్తులని కూడా చాలామంది జపానువే అనుకొంటున్నారు. నేను కొరియాలో ఉన్నానని చెపితే అది ఎక్కడుందని అడగడం సాధారణమైపోయింది. కాని చాలా మందికి రెండు కొరియాలున్నాయని తెలుసు. తమ ఉత్పత్తులతో జనబాహుళ్యానికి ఇంతదగ్గరైన కొరియా దక్షిణ కొరియా. ఈ మధ్య అణుపరీక్షతో అందరినీ అదిరించిన కొరియా ఉత్తర కొరియా. దక్షిణకొరియా ని సాధరణంగా కొరియా అని పిలుస్తారు. వాళ్ళ సంవిధానం ప్రకారం దీని పేరు 'రెపబ్లిక్ ఆఫ్ కొరియా'. వాళ్ళ భాషలో ' దేహన్ మిన్గుక్'. ఉత్తర కొరియా పేరు 'డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా' అంటారు. ఆ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం కన్నా మన నేతి బీరకాయలోనే నెయ్యి ఎక్కువుంటుంది.
ఒక్కటిగా ఉన్న కొరియాని 1945 లో రెండుగా చీల్చారు. వాటి మధ్యలో ఉన్న సరిహద్దుని 38th parallel అని అంటారు. భారతదేశం, పాకిస్తాన్ లు చీలిపోవడానికి రెండుమతాల మధ్య సమస్య కారణం. కాని కొరియా రెండుగా చీలిపోవటానికి జపాను రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోవడం కారణం. ఆ సమయంలో కొరియా జపాను వలస పాలనలో ఉంది. జపాను కొరియాని 1910-45 మధ్య తన పాలనలో ఉంచుకొంది. యుద్ధంలో ఓడిపోకపోతే అది ఇంకా కొనసాగేదేమో? ఏమైతేనే 1945 లో స్వాతంత్ర్యం పొందిందీదేశం. అత్త సొమ్ము అల్లుడు ధారబోసినట్లు, జపాను ఓడిపోయి కొరియాని శత్రుపక్షానికి ధారాదత్తం చేసింది. శత్రుపక్షంలో అమెరికా, దాని మిత్రపక్షాలూ ఇంకా రష్యా, దాని మిత్ర పక్షాలూ దొంగలూ, దొంగలూ ఊళ్ళు పంచుకొన్నట్లుగా కొరియాని రెండుముక్కలుగా చేసి దక్షిణకొరియాని అమెరికా, ఉత్తర కొరియాని రష్యా తమ తమ వర్గాల్లో చేర్చుకొన్నాయి. అప్పటినుండీ (దక్షిణ) కొరియాలో పెట్టుబడిదారీ విధానం, ఉత్తర కొరియాలో కమ్యూనిజం అమలులోకి వచ్చాయి. అలా విడిపోయిన వీళ్ళు, ఎలాగైనా, ఎప్పుడైనా తిరిగి కలుసుకోవాలనీ, కలిసిపోవాలనీ తెగ ఆరాటపడ్తారు. దాని కోసం కొరియా ప్రభుత్వంలో Unification Ministry ఒకటి ఉంది. వీళ్ళ సాహిత్యంలో కూడా దీనిమీద చాలా కథలూ, కవితలూ వచ్చాయి. ఈ రెండుదేశాలమధ్య DMZ (De-militarized Zone) ఉంది. ఇది సుమారు 3 కిలోమీటర్ల వెడల్పున్న నిర్జన సరిహద్దు ప్రదేశం. జర్మనీ గోడ కూలిపోవడం ఇక్కడ కూడా చాలా ఆశలు రేకెత్తించింది.
అసలే అర్భకం అందులో వేవిళ్ళన్నట్లు, జపాను పాలన, రెండో ప్రపంచయుద్ధాలతో అంతంతమాత్రంగా ఉన్న దేశపరిస్థితి, 1950-53 మధ్య ఉత్తరకొరియాదాడితో మరీ అధ్వానమైపోయింది. అప్పుడు ఎక్కడచూసినా దారిద్ర్యం, ఆకలి. అప్పుడు వాళ్ళ తలసరి ఆదాయం సుమారు 50 డాలర్లు. అప్పటి మనదేశపు ఆదాయం కంటే తక్కువ! వ్యవసాయం ప్రధాన వృత్తి. వ్యవసాయ భూమి కేవలం కొద్దిమంది భూస్వాములచేతిలోనే ఉంది. పరిశ్రమలేమీ లేవు. ఉన్నవన్నీ ఉత్తర కొరియాకి పోయాయి. అల్లాంటి పరిస్థితినుండి అతి త్వరగా అభివృద్ధి చెంది 1995 నాటికి, అంటే స్వాతంత్ర్యం వచ్చిన 50 సంవత్సరాలలో, OECD లో సభ్యత్వం పొందగలిగిందీ దేశం.
ప్రణాళికాబద్ధంగా, ఒక నిబద్ధతతో ప్రగతిని సాధించి, సంకల్పం గట్టిగా ఉంటే ఏమైనా సాధించవచ్చని కొరియన్లు నిరూపించారు. మొదటగా, భూసంస్కరణలని అమలుపరచారు. ఎవరికీ 3 హెక్టారుల కన్న ఎక్కువ భూమిలేకుండా చట్టం చేసి, మిగులు భూమిని పంచేసారు. అదీ ఉత్తినే కాకుండా, రైతులకి అమ్మారు. ఆభూమి ధర వాయిదాలలో పంటద్వారా చెల్లించగల్గే ఏర్పాటు చేసారు. దీంతో 76 శాతం రైతులకు లాభం కలిగింది.
మిగిలిన అభివృద్ధిచెందిన దేశాల లాగే కొరియాకూడా పరిశ్రమాభివృద్ధి ద్వారానే ఆర్ధికాభివృద్ధి సాధించింది. ఈ దేశానికి వనరులు అతి తక్కువ. ఖనిజాలు శూన్యం. సాగు చేయగల వీలైన భూమి, కేవలం 20 శాతం. ఎక్కువ భూభాగం కొండలూ, గుట్టలే. కాని, ప్రభుత్వం ధీమాగా ఎగుమతులపై దృష్టి పెట్టి, రాయితీలు కల్పించింది. మొదట దిగుమతి చేసుకోంటున్న వస్తువులని స్వంతంగా ఉత్పత్తి చేయడానికి ప్రొత్సాహం ఇచ్చిన ప్రభుత్వం, అది లాభంలేదని ఒక దశాబ్దంలోపే గ్రహించి, ఎగుమతులనే ప్రోత్సహించింది. ఆతర్వాత దశాబ్దాలలో అధిక పెట్టుబడీ, సాంకేతిక పరిజ్ఞానం కావాల్సిన పరిశ్రమలని ప్రొత్సహించి, తమకంటూ ఒక ప్రత్యేకగుర్తింపుండేలా కృషి చేసింది. 1980వ దశకానికే అధిక తలసరి ఆదాయం కల్గిన దేశంగా తన స్థానాన్ని నమోదు చేసుకొన్న ఘనత ఈదేశానిది.
కొరియాతో పాటు తైవాన్, సింగపూరు, హాంగ్‍కాంగ్ లు కూడా అతి త్వరలో అభివృద్ధి చెందిన దేశాలే. ఇక జపాను సంగతి వేరే చెప్పఖ్ఖర్లేదు. వీటన్నిటికీ తలమానికం. ఈ ఐదు దేశాలు తమదైన శైలిలో అతి త్వరలో, అంటే ఒక 30 - 40 ఏళ్ళలో, అభివృద్ధి చెంది ప్రపంచానికి ఒక అద్భుతాన్ని చూపించాయి. అమెరికా, యూరోప్ దేశాలు కూడా అభివృద్ధి చెందాయి. కాని వాటి అభివృద్ధి ప్రయాణం 200 ఏళ్ళ పాటు సాగింది. అందులోనూ ఎన్నో దేశాలని కొల్లగొట్టడం ద్వారా సాధించారు. అంతే కాక, వారివారి దేశాల్లో పారిశ్రామిక అభివృద్ధివల్ల గ్రామీణప్రాంతాలలో త్తీవ్ర అశాంతి చెలరేగడం ఒక విషాద పరిణామంగా మిగిలిపోయింది. కాని తూర్పు ఆసియా దేశాల్లో (సింగపూరు, హాంగ్‍కాంగ్‍లలో గ్రామీణప్రాంతాలే లేవు) గ్రామీణాభివృద్ధిని కూడా తగు విధంగా సమతుల్యతతో సాధించడంవల్ల, వాటి అభివృద్ధి పధం ఆదర్శ్హవంతంగా మిగిలిపోయింది.
ఇదీ కొరియా అభివృద్ధి కథ. ఇంతా చేస్తే ఈ దేశం ఎంతుంటుందో తెలుసా? మనదేశంలో 33వ వంతు. వైశాల్యం గీచి, గీచి లెఖ్ఖపెట్టినా 98480 చదరపు కిలోమీటర్లు. మన తెలంగాణా మైనస్ ఒక రెండు పెద్ద జిల్లాలు. మరి జనాలో పట్టుమని 5 కోట్లు కూడా లేరు.
ఇప్పుడు ఈబ్లాగు శీర్షిక ఈరకంగా చదివితే బాగుండదూ? పిట్ట కొంచెం, కూత ఘనం
అసలు కిటుకు ఏంటంటే, కొరియా మ్యాప్ చూస్తే పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్న కుందేలులా అన్పిస్తుంది. అందుకే అనుకొంటా, వీళ్ళు ఇంత త్వరగా అభివృద్ధి సాధించారు. వీళ్ళ కరెన్సీని WON అంటారు. ఆంగ్లంలో దాని అర్ధం గెలుపు. ఇక్కడి కొరియన్ స్నేహితుడు ఎప్పుడూ ఈవిషయం సరదాగా చెబుతూంటాడు. అవునేమో.
తర్వాతి వారాల్లో, ఈ దేశపు చరిత్ర, మనుష్యులు, మమతలూ, ఇంకా సరదా విషయాలూ.....