కొన్నిరోజులక్రితం ఆంధ్రజ్యోతిలో ఒక ఫోటో, దానిక్రింద దాని వివరం చూసా. ఆవివరం లో నాగార్జునకొండకెళ్ళడానికి లాంచి ఎక్కుతున్న ప్రధాని కుమార్తె ఉపేంద్ర సింగు అని రాసి ఉంది. ఇది మీరూ చదివి ఉంటారు. దీంట్లో విశేషం ఏముందీ పెద్ద, బ్లాగులో వ్రాయడానికి, అదీ 'ఆర్నెల్ల' తర్వాత అంటారా? మామూలుగా చూస్తే అంతే. కానీ ఆవార్త చదివాకా నాలో కల్గిన భావపరంపరనుబట్టి చూస్తే విశేషం ఉందని మీరుకూడా ఒప్పుకోవచ్చు.
ఒకసారి ఫోటోచూసి వివరం చదివాను. ఆవ్యక్తి ఎవరో ఆవార్త ఎందుకు వేసారో అర్ధం కాక మరొక్కసారి చదివా. ప్రధాని కూతురట, ఏదేశ ప్రధాని కూతురయ్యుండొచ్చు? సింగు అని ఉందికాబట్టి నేపాలు ప్రధానేమో. అయినా ఈ పత్రికల వాళ్ళ బుర్రలిట్టా ఏడిసాయి. సరిగ్గా వివరాలు వ్రాసి తగలడచ్చు కదా. ఇలా బ్రెయిన్ టీజర్లిచ్చి అఘోరించకపోతే. బ్రౌజర్ మూసేసా. మర్నాడెప్పుడో అకస్మాత్తుగా బల్బు వెలిగింది. అవునూ, మన ప్రధాని మన్మోహన్ సింగు కదా, ఆయన కూతురన్న మాట ఈవిడ అని.
జనరల్ నాలెడ్జిలో ఉద్దండ పిండాన్ని కాను కాని, మరీ మన ప్రధాని ఎవరూ అని అంత మీమాంసలో ఎలా పడిపోయానో కదా.
ఇంతకీ నాది జ్ఞానమా? అజ్ఞానమా?