Monday, April 23, 2007

నాది జ్ఞానమా? అజ్ఞానమా?

కొన్నిరోజులక్రితం ఆంధ్రజ్యోతిలో ఒక ఫోటో, దానిక్రింద దాని వివరం చూసా. ఆవివరం లో నాగార్జునకొండకెళ్ళడానికి లాంచి ఎక్కుతున్న ప్రధాని కుమార్తె ఉపేంద్ర సింగు అని రాసి ఉంది. ఇది మీరూ చదివి ఉంటారు. దీంట్లో విశేషం ఏముందీ పెద్ద, బ్లాగులో వ్రాయడానికి, అదీ 'ఆర్నెల్ల' తర్వాత అంటారా? మామూలుగా చూస్తే అంతే. కానీ ఆవార్త చదివాకా నాలో కల్గిన భావపరంపరనుబట్టి చూస్తే విశేషం ఉందని మీరుకూడా ఒప్పుకోవచ్చు.
ఒకసారి ఫోటోచూసి వివరం చదివాను. ఆవ్యక్తి ఎవరో ఆవార్త ఎందుకు వేసారో అర్ధం కాక మరొక్కసారి చదివా. ప్రధాని కూతురట, ఏదేశ ప్రధాని కూతురయ్యుండొచ్చు? సింగు అని ఉందికాబట్టి నేపాలు ప్రధానేమో. అయినా ఈ పత్రికల వాళ్ళ బుర్రలిట్టా ఏడిసాయి. సరిగ్గా వివరాలు వ్రాసి తగలడచ్చు కదా. ఇలా బ్రెయిన్ టీజర్లిచ్చి అఘోరించకపోతే. బ్రౌజర్ మూసేసా. మర్నాడెప్పుడో అకస్మాత్తుగా బల్బు వెలిగింది. అవునూ, మన ప్రధాని మన్మోహన్ సింగు కదా, ఆయన కూతురన్న మాట ఈవిడ అని.
జనరల్ నాలెడ్జిలో ఉద్దండ పిండాన్ని కాను కాని, మరీ మన ప్రధాని ఎవరూ అని అంత మీమాంసలో ఎలా పడిపోయానో కదా.
ఇంతకీ నాది జ్ఞానమా? అజ్ఞానమా?

5 comments:

  1. ప్రొఫెసర్లు అంతేలెండి. :)

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  2. బహుశా మీరు కూడా నా లా ప్రధాని చివర గాంధీ ఉండాలనుకుంటున్నారేమో, సడంగా సింగ్ చూసి కంఫూజ్ అయి ఉంటారు, కదా!

    ReplyDelete
  3. అయ్యో అంత క్రిప్టిక్ గా రాస్తే ఎవరికి మాత్రం అర్థమవుతుంది ?

    ReplyDelete
  4. నేను ఒక్కొసారి ప్రధాని అంటే సోనియా గాంధి అనేసుకుంటాను.ఆ వుద్దేస్యం లోనే మీకు మన సింగ్ గారు గుర్తురాలేదేమొ.అయినా ప్రసాదుగారన్నట్టు ప్రొఫెసర్లు అంతేనేమో.

    ReplyDelete
  5. ప్రసాద్ గారూ. నేనూ మీలాగే అనుకొని ఇన్నేళ్ళూ బయటికి చెప్పలేదు (మునుపు చెరోకాలికి వేర్వేరు చెప్పులేసుకెళ్ళి రోజంతా తిరిగిన ఘనత ఉందిలెండి). కానీ ఇన్నాళ్ళూ ఆలోచించితే అర్ధమయ్యింది, ఒరెమూనా, రాధికగార్లు చెప్పిన కారణాలవల్ల ఇలా జరిగింది అని. ప్రవీణ్గారూ, క్రిప్టిక్ పత్రికవాళ్ళదనేనా మీఅభిప్రాయం? అసలు సమస్య, ఘనమైన దేశానికి ప్రధాన మంత్రి ఒక ఆఫీసర్ మాదిరి పనిచేయడం. అలవాటు పడిన ప్రాణం మరి. బహుశ: జ్యోతి వానికి కూడా సందేహమొచ్చుంటుంది- అందుకే 'భారత' అని గాని, 'మన' అని గాని ప్రధాన మంత్రి అన్న పదం ముందు తగిలించలేదు.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.