Thursday, December 06, 2007

కేవలం యాదృచ్ఛికం అనలేని ఘటనలు

నా కూతురి (బ్లాగు) మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన వారందరికీ నాకృతజ్ఞతలు - జ్యోతక్క 'దీవెన'లకి ప్రత్యేకంగా. అవడానికి 54 టపాలున్నా 10 ముసాయిదాలుగానే ఉండిపోయాయి. ఇక్కడో గమ్మత్తు జరిగింది. నవంబరు 2006 (20 కి నాకు 44 నిండాయి- ఈరోజుల్లో మగాడి వయస్సు, ఆడవాళ్ళ జీతం అడగ కూడదని శాస్త్రం- అయినా నా వయస్సు చెప్పేసా) లో మొదలెట్టిన బ్లాగు లో నవంబరు 2007 నాటికి అనుకోకుండా, నాప్రమేయం లేకుండా నావయసుకి సమానంగా టపాలు వచ్చాయి.


ఇలా అప్పుడప్పుడు తేదీలకి మన జీవితంలో కొన్ని ఘటనలకి అనుకోకుండా లంకె కుదరడం కేవలం యాదృచ్ఛికం అనుకోలేం. అలాంటి ఒక లంకె మానాన్నగారి జీవితంలోని ముఖ్య తేదీలకి మాముగ్గురి అన్నదమ్ముల జన్మదినాలకీ ఉండడం నాకెప్పుడూ విచిత్రంగా తోస్తుంది. మానాన్నగారి పుట్టిన రోజునాడే ఆయన పెద్దకొడుకు (అంటే మా అన్నయ్య) పుట్టాడు. మా తమ్ముడి పుట్టిన రోజునాడు ఆయన పోవడం, నా పుట్టిన రోజు నాడే ఆయనకి కొద్ది రోజులే మిగిలున్నాయని వైద్యులు ధృవీకరించడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇదిలా ఉంచితే, ఓ వారం క్రితం ఓకలొచ్చింది. అందులో ఒక సాధువు నన్ను ప్రవచనం ఇవ్వమన్నాడు. నేను శక్తి అన్నవిషయం మీద మాట్లాడా. అంతా అయిపోయాక అయ్యో .. శక్తి నిత్యత్వ సూత్రం (శక్తి సృష్టించబడదు, నశించదు, కేవలం ఒక రూపం నుండి వేరొక రూపం లోకి మారగలదు) గురించి చెప్పడం మరచానే అనుకుంటుంటే మా ఆవిడ లేపడం వల్లననుకుంటా కల చెదిరిపోయింది. మర్నాడు ఆఫీసులో హలో మాత్రపు పరిచయం ఉన్నాయన లంచి టైం లోకలిసాడు. ఆ వేళ పొద్దున్నే మా స్నేహితులిద్దరు ఆయన సదా ఆనందంగా ఉండగలడని చెప్పిన విషయం ఆయనకి చెప్పా. ఆమీదట ఆయన ఆవిషయం మీద ఏదో చెబుతూ అలా అలా మాట్లాడుతూ చివరికి శక్తి నిత్యత్వ సూత్రం గురించి చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈలోగా మా లంచిమితృడొచ్చి నన్నక్కడినుంచి లాక్కు పోయాడు (కలలో మాఆవిడ అంతరాయం కలిగించినట్లే). మరుసటి రోజు వెళ్ళి ఆయనకి నాకల గురించి చెప్పా.

ఆయన తో నాకు కలిగిన ఇలాంటిదే ఇంకో అనుభవం కూడా చెప్పా. అది నేను ఢిల్లీలోని AIIMS కి మా నాన్న గారి మెడికల్ బిల్ ( ఆయన అక్క డ కొన్నాళ్ళు వైద్యం చేయించుకున్నారు) మీద సంతకం కోసం వెళ్ళినప్పుడు జరిగింది. ఆఫీసులో బిల్లిస్తే ఓగంట కూర్చోపెట్టి ప్రతి బిల్లుమీదా సూపర్నెంటు సంతకాలు పెట్టించి ఇచ్చారు. తీరా ఇంటికొచ్చాకా చూస్తే కూడిక తప్పైందని తెలిసింది. వామ్మో అని ఓరెండుమూడు రోజులు కూడిక తప్పు కాకుంటే బాగుండునన్న అత్యాశతో మళ్ళీ మళ్లీ కూడి ఒకరిద్దరితో కూడించి ఇంక లాభంలేదని చెప్పి మళ్ళీ వెళ్ళక తప్పదన్న నిర్ణయానికి వచ్చా. మళ్ళీ ఇంకెంత ప్రొసీజరో ఏంటోనని కొన్ని రోజులు మధనపడడం ఇంకా గుర్తుంది. అక్కడికి వెళ్దామనుకున్న ముందు రోజు ఓకల. అందులో నేను సూపర్నెంటు ఆఫీసుకు పోయా. అక్కడున్న పంజాబీ ఆంటీ తో నా ముచ్చట ఇలా సాగింది.

నేను - చిరునవ్వు - కీ హాల్ హై (ఎలా ఉన్నారు)
ఆంటీ - ప్రతినవ్వు - క్యా బాత్ హై( విషయం ఏమిటి)

నేను - some problem
ఆంటీ - totalling error

నేను - yes (కాయితాలిచ్చా)
ఆంటీ - తన రిజిస్టర్ లో మొత్తాన్ని సరిచేసి -అక్కడో పొట్టి సంతకం చేసి కాయితాలు వెనక్కిచ్చింది.

నేను - వెయిట్ కరూ (వేచి ఉండనా)
ఆంటీ - నా.. హో గయా ( అక్కర్లేదు .. పని అయిపోయింది)

పని అతి సులభంగా పని అయిపోయింది అని సంతోష పడేలోగా కల కరిగి పోయి ఇంకా వాళ్ళ ఆఫీసుకి వెళ్ళలేదన్న నిజం సాక్షిగా కళ్ళు తెరిచి తయారై AIIMS కెళ్ళా. నమ్మండి ... నమ్మకపోండి మా సంభాషణ ఆసాంతం పై మాదిరిగానే జరిగింది. నా సంభాషణలు నాకు తెలుసు. కానీ ఆంటీ కి తన పోర్షనెలా లీకయిందో తెలియదు.

ఈ అనుభవాలు రెండూ విని ఆయన మన ఆలోచనలు, వాటి తీవ్రతని బట్టి, వేరేవాళ్ళలో సారూప్య ఆలోచనలను కలిగించచ్చని విశ్లేషించాడు. మరి మీరేమంటారో?

6 comments:

  1. ముందుగా Belated Happy Birthday. ఇక మీరు ఈ విషయం ఆరోజే చెప్పనందుకు జరిమానా కట్టాల్సిందే. ఆదివారం బ్లాగర్ల సమావేశానికి కేకు తీసుకురండి. ఓకే.
    హన్నా! ఎంత ధైర్యంగా మీ వయసు చెప్పారండి. ఇందుకు నేను మీకు తప్పకుండా బహుమతి ఇస్తాను . ఒకేనా???

    ReplyDelete
  2. ఇలాంటి అనుభవాలన్నీ మీరు ఎన్.ఆర్.నంది రాసిన "కాంచన గంగ" నవలలో చూడవచ్చు. ఇలా ఎంతో మందికి కలిగిన అనుభవాలను నంది గుదిగుచ్చి, ఆ నవలలో అడుగుమాట(ఫుట్ నోట్స్)గా ఇచ్చాడు. ఇలాంటి అనుభవాలు ఎక్కువగా కవులు,కళాకరులు, సృజనాత్మక ఆలోచనాపరులకు కలుగుతాయని, సతార్కికంగా వాదిస్తాడు. ఆ పుస్తకం కోసం ఇప్పుడు నేను వెదుకుతున్నాను. మీకు దొరికితే చదవండి.
    నెనర్లతో బాలవాక్కు

    ReplyDelete
  3. నేను కాంచన గంగ ఒక్కటే చెప్పాను. కాని, ఈ రోజే ఇంకో రచన చదివాను. తిరుమల తిరుపతి దేవస్థానాలకు కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు నాహం కర్తా హరిః కర్తా సర్వ సంభవాం అనే పేరుతో తన అనుభవాలు రాశారు. మనం సాధారణ హేతువులతో నమ్మలేని నిజాలెన్నో వివరణాత్మకంగా రాశారు. వీలయితే చదవండి.

    ReplyDelete
  4. నాకు ఇలాంటివి ఖచ్చితంగా అనుభవమే. ఒక్కోసారి నిజ జీవితములో జరుగుతున్న సంఘటనని చూస్తూ ఇదేంటి జరిగిందే జరుగుతోంది అనిపిస్తుంది. కానీ ఒక్క మెలికేమంటే, నిజ జీవితములో ఘటన జరిగుతుండగా మాత్రమే తరువాతే ఈ జ్ఞాపకాలు బయటికి వస్తాయి. ఆ ఘటనే లేకపోతే, ఆ జ్ఞాపకాలు కూడా బయటికి రావు, కనీసం నా వరకూ.

    ReplyDelete
  5. నాకు ఇలాంటివి ఖచ్చితంగా అనుభవమే. ఒక్కోసారి నిజ జీవితములో జరుగుతున్న సంఘటనని చూస్తూ ఇదేంటి జరిగిందే జరుగుతోంది అనిపిస్తుంది. కానీ ఒక్క మెలికేమంటే, నిజ జీవితములో ఘటన జరిగుతుండగా మాత్రమే తరువాతే ఈ జ్ఞాపకాలు బయటికి వస్తాయి. ఆ ఘటనే లేకపోతే, ఆ జ్ఞాపకాలు కూడా బయటికి రావు, కనీసం నా వరకూ.

    ReplyDelete
  6. నాకు కూడా ఇలాంటివి జరుగుతాయి.కలలోనే కాకుండా నిజంగా కూడా కొన్ని విషయాలు మనసు లో పదేపదే అనిపించిందే తరువాత నిజంగా జరిగాయి.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.