తొలికాన్పప్పుడు నొప్పులు పడే అమ్మాయికీ, ఆమెభర్తకీ కూడా, 'అయింది చాలు, ఇంకో బిడ్డ ఊసే తలపెట్టద్దు' అనిపిస్తుంది. చాలా ధృఢంగా అనుకుంటారు. ఓఏడాది తిరిగే లోపు మళ్ళీ ఇంకో పిల్లో, పిల్లాడో తయారు. ఇది ప్రసూతివైరాగ్యం.
ఎవరైనా పోయినప్పుడు, 'ఛీ ఎంత స్వల్పంఈప్రాణం, బుడగలాంటిజీవితం' వగైరా ఆలోచనలు వస్తాయి. స్మశానంకి పోతే ఇంక వేరే చెప్పఖ్ఖర్లేదు. అక్కడ ఉన్నంత సేపు మనలో కలిగే వైరాగ్య భావనలు లెక్కలేనన్ని. ఇంటికొచ్చి స్నానం చేయగానే అవన్నీ నీళ్ళతో కొట్టుకుపోవడం తథ్యం. దీన్ని స్మశానవైరాగ్యం అంటారు.
తిరుపతి పోయినప్పుడు, అక్కడ మకాం కోసం, దర్శనం కోసం, అర్చన లేదా సేవ టిక్కెట్ కోసం చేయాల్సిన సర్కస్ విన్యాసాలు, వీఐపిల ఉత్తరాలు సంపాదించి ప్రత్యేక (ప్ర)దర్శనాలు చేయడంకోసం కేంపాఫీసులు, ఎమ్బీసీ 26, ఏటీసీ115, విజయాబ్యాంకు కౌంటర్ల చుట్టూ చేసే గానుగెద్దు ప్రదక్షిణాలు, ఇవన్నీ చేసి ఆనక విజయోత్సాహంతో పొంగిపోవడం లేదా ఆశాభంగంతో క్రుంగిపోవడం మనలో చాలామందికి అనుభవమే. తీరా దర్శనం క్యూలో నుంచుని కాసేపు నత్తలా, కాసేపు పాములా, మరికాసేపు వానపాములా, ఎక్కువ సేపు అచలంగా - చివరికి గర్భగుడిదాకా చేరతాం. ఈలోపు నదిలో ఉపనదులు కలిసినట్లు రకరకాల క్యూలు అక్కడక్కడ కలుస్తూంటాయి. గర్భగుడి దగ్గర సర్వదర్శనం క్యూకూడాకలవడం, అప్పటిదాకా విసిగి ఉన్న జనాలు ఒక్కసారిగా విరగబడ్డం సాధారణం. మళ్లీ బయటికి ప్రాణాలతో రాగలమా అన్న లెవెల్లో లోపల తొక్కిసలాటలు, కుమ్ములాటలు, తోపుళ్ళు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడాలు, వీటి మధ్యలో ఒక క్షణం పాటు ఆశ్రీనివాసుడి దర్శనం,ఆఆనందం ఆస్వాదించేలోపే అక్కడి వాలంటీర్లు చేయి చేసుకోవడంతో మన యాత్ర దాదాపు ముగుస్తుంది. ఇన్ని అనుభవాల తర్వాత ప్రతిసారీ ఇంకెప్పడూ తిరుపతి గాకూడదని గాఠ్ఠి నిర్ణయం తీసుకోవడం, మళ్ళీ ఆబుద్ధి బుధవారంలోపే మారిపోయి తిరుపతికి రిజర్వేషన్ చేసుకోవడానికి సిధ్ధపడి పోవడం మామూలే. ఇది తిరు వైరాగ్యం.
నాకైతే దర్శనంతర్వాత ప్రసాదంగా ఇచ్చే దద్దోజనమో, పొంగలో బలే రుచిగా అనిపిస్తుంది. అప్పటిదాకా మనకి కలిగిన ఇబ్బందులకి శ్రీనివాసుడు మనకి ఓదార్పుగా ఇచ్చే తాయిలంలా అనిపిస్తుంది. అందుకేనేమో నేను ఆప్రసాదం కోసం ఆత్రంగా ఎదురుచూస్తా.
కొసమెరుపు
జంటిల్ మ్యాను అనే సాక్షి వ్యాసంలో పానుగంటివారు ఒక రాజుగారిని దర్శించుకోవడానికి పిల్లల కోసం ఆటవస్తువులు, బొమ్మలు అమ్ముకొనే వ్యక్తి తనని తాను 'Well, I am a Gentleman' అని పరిచయం చేసుకోవడంతో తెల్లబోయిన వ్యాఖ్యాత ద్వారా కొన్ని వ్యాఖ్యలు చేయిస్తాడు. చదవండి....
"మీరెవ్వరనగ నేను పరమహంసనని చెప్పుకొనినవాడున్నాడు. [బ్లాగరునని చెప్పుకొనువాడున్నాడు :)))]. ..... నేను సంధానకర్తనని చెప్పుకొనువాడున్నాడు. కాని నేను Gentleman అని చెప్పుకొనువారినెవ్వరిని నిదివరకు చూడలేదు. .....జగత్తులో Gentleman యెంత చవుకయైపోయినారు. జట్కాబండి యెక్కినవాడెల్ల జంటిలుమనే. సిగరెట్లు నోటబెట్టినవాడెల్ల జెంటిల్ మనే. .....అటులైన నింక పెద్దమనుష్యులకు ప్రపంచమున లోపమేమున్నది? పశువుల సంతలలో పెద్దమనుషులు, భోగమువీధులలో పెద్దమనుషులు, కల్లుపాకలలో పెద్దమనుషులు, కన్నకాండ్రలో పెద్దమనుషులు,నెత్తికోతలవాండ్రలో పెద్దమనుషులు- ఇంక భూలోకమే వైకుంఠము." (కవిశేఖర పానుగంటి లక్ష్మీనరసింహారావు,సాక్షి,రెండవ భాగం, అభినందన పబ్లిషర్సు, విజయవాడ, పు.237)
దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో, ఎంతమంది వీఐపిలున్నారో లెక్క తెలియాలంటే తిరుపతిలో సర్వే చేస్తే సరిపోతుంది. ఎంతమంది వీఐపి ఉత్తరాలతో అక్కడ గుమిగూడతారో! నాకు తిరుపతివెళ్ళిన ప్పుడల్లా వీళ్ళని చూడగానే సాక్షి జంటిలుమనులే గుర్తొస్తారు. అన్నట్లు నేను కూడా జంటిల్ మను లాగా మెన్ననే తిరుపతెళ్ళి వచ్చా.
అయ్యా .. చేసిన పాపం చెబితే పోతుందంటారు .. నేనూ ఆ ముసుగు కింద స్వామివారి దర్శనానికి జొరబడిన వాణ్ణే..
ReplyDeleteనే గూడా మా మాఁవ గారి పరపతితో జెంటిల్లుగ వెడలితిని.
ReplyDeleteఈ తిరు వైరాగ్యం మీకూ ఉందన్నమాట. తిరుపతి వెళ్ళిన ప్రతి సారి నేనూ ఇంకెప్పడూ తిరుపతి రాకూడదని గాఠ్ఠి నిర్ణయం తీసేసుకుంటుంటాను :))
ReplyDeleteఒకప్పుడు నేనూ అలాగే అనుకునేదాన్ని కానీ ఒరిస్సా లోని పూరీ వెళ్ళాక తిరుపతి దాని కన్నా కోటి రెట్లు మేలనిపించింది!
ReplyDeleteకొన్ని సార్లు కొన్ని పనులు అవ్వాలంటే ముసుగులు తప్పవు.మనకి వుండేదే 2 రోజుల సమయం.అంతలోనే అన్నీ అవ్వాలంటే....తప్పుకాదనిపిస్తుంది.
ReplyDeleteటపా బావుంది కానీ నండీ, "శ్మశాన" మేమో కదా. కాస్త గమనించండి. నొచ్చుకోరనుకుంటాను.
ReplyDelete