Saturday, October 03, 2009

సత్యశోధన అవసరమా?

(ఈటపా ఎప్పుడో రాసినది .. అయినా సత్యశోధనకి సమయం మించిపోవడం ఉండదుకదా అని పోస్ఠ్ చేస్తున్నా.)

ఈమధ్యలోఎదుటి మనిషిచేత నిజం చెప్పించాలని ఓ టీవీ కార్యక్రమం కంకణం కట్టుకొంది.  స్టార్ ప్లస్ లో వస్తున్న సచ్ కా సామనా చూసే ఉంటారు.  మా పిల్లలు చెప్తే ఒక ఎపిసోడ్ చూసా.  తర్వాత మరొకటి. ఇందులో 21 ప్రశ్నలకి నిజం చెప్పగలిగితే కోటి రూపాయలు వస్తాయి.

మొదట చూసిన ఎపిసోడ్ లో ఒకావిడని (స్మిత అనుకుంటా) రాజీవ్ ఖండేల్వాలా (పృచ్ఛకుడు) ప్రశ్నలడుగుతూ పోయాడు.  ఆవిడ ఒక స్థాయికి వచ్చేసరికి, ఇబ్బందికరమైన ప్రశ్నలడగడం మొదలెట్టాడు. ఇది ఆయన స్ట్రాటజీ. ఒకస్థాయినుండి ఇంకో దానికి వెళ్ళేముందు షోనుండి వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తారు.  ఇంకా ముందుకెళ్తుందనుకున్నఆవిడని అడిగిన ప్రశ్న.. మీపతికి ఎప్పటికీ తెలియదని మీకు నమ్మకంగా తెలిస్తే మీరు వేరేమగవాడితో పడుకుంటారా? ఆడమగ సంబంధాలలో ఎన్ని రకాల శృతులూ, అపశృతులూ ఉంటాయో అవగాహన ఉన్నా, ఈప్రశ్న అడగడం ఎబ్బెట్టుగా అనిపించింది. దీనికి ఆవిడ నో అన్నా, పోలీగ్రాఫ్ ఒప్పుకోలేదు. అప్పటి ఆవిడ పరిస్థితి ఎంత దుర్భరమో ఊహించండి. అందులోనూ ఆవిడమొగుడు అక్కడే ఉన్నాడు.  

నే చూసిన రెండో ఎపిసోడ్లో పాల్గొన్నాయన చాలా  ఓపెన్గా ఉన్నాడు. తీరా ముందుకు వెళ్తున్న సమయంలో, మీరు విదేశం వెళ్ళినప్పుడు అక్కడ వేశ్య…  అని ప్రశ్న మొదలెట్టగానే వాళ్ళావిడ బజ్జర్ నొక్కి ఆప్రశ్నపట్ల తన వ్యతిరేకత తెలియచెప్పింది (షోలో కూడా వచ్చిన వారికి తమ అభ్యంతరం షోలో ఒక్కసారి చెప్పే అవకాశం ఇస్తారు).   వెంటనే పృచ్ఛకుడు ప్రశ్నమార్చి మీరెప్పుడైనా మీభార్యని మోసం (పరాయసంబంధాలు పెట్టుకోవడం ద్వారా) చేసారా అని  ప్రశ్నించాడు.  దీనికి ఆయన పెళ్ళాం ఎదురుగా  ఏంచెప్పాలో తికమక పడి లేదన్నాడు. పోలీగ్రాఫ్ పరీక్షప్పుడు ఎస్సని ఇప్పుడు నో అనేసరికి ఆమానవుడు షోనుండి వెనుదిరగాల్సొచ్చింది.  తర్వాత అక్కడికక్కడే తన భార్యముందు చాలా ఇబ్బంది పడ్డాడు.

అసలు ఈపోలీగ్రాఫ్ ఏంటయ్యా అంటే మనం సమాధానాలు చెప్పినప్పుడు మన శరీరంలో జరిగే మార్పులని, రక్తపీడనాన్ని బట్టి మనం చెప్తున్నది నిజమా, అబద్ధమా అన్నది నిర్ధారిస్తుంది. అది ఎంత ఖచ్చితంగా నిర్ధారించగలదూ అన్న విషయం పక్కనపెడితే, అసలు ఇంత కష్టపడీ, పెట్టీ  నిజం చెప్పించడం, షోకోసమైనా సరే, అవసరమా? 

అవసరమైనప్పుడు అంటే ప్రాణమానవిత్తభంగములందు అబద్ధమాడచ్చునన్నది ఆర్యవాక్యం. ఇవన్నీ భంగమైనా సరే నిజం చెప్పించడం మాత్రమే మన టీఆర్పీ రేటింగ్‌కి అవసరం అన్నది వ్యాపార సూత్రం అనుకుంటా.

ఎంత అబద్ధాల కోరైనా ఆవిషయం ఒప్పుకోడు. తనంత సత్యసంధుడు ఎవరూ లేరనే అనుకుంటాడు.  సత్యం శివం సుందరం అన్న భావనలో ఇది ఒక కోణం అని ఒకాయన సెలవిచ్చాడు. అలాగే ఎవరినైనా నిజం చెప్పు… నిజం చెప్పని రాపాడిస్తే వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు.  ఇంకా ఘోరం ఏంటంటే నిజంగా నిజం చెప్తున్న వ్యక్తిని నిజం చెప్పు అని నిలదీస్తూ పోవడం. అప్పుడావ్యక్తికి కలిగే మానసిక వేదన అంతా ఇంతా కాదు.   ఇలాంటి సందర్భం మొగుడూ పెళ్ళాల మధ్య వస్తే ఇంక చెప్పక్కరలేదు.

సాధ్యమైనంత వరకూ నిజాయితీగా, సత్యవాదిగా ఉండడం ఆదర్శప్రాయంగానూ, అత్యుత్తమ జీవన విధానంగానూ ఒప్పినా చాలాసందర్భాల్లో, అబద్ధం చెప్తున్నారని తెలిసినా కూడా ఎదుటివారికి ఎంతో కొంత వెసులుబాటు వదలడం విజ్ఞత.

8 comments:

 1. సత్యసాయిగారు,ఈషోలో యాంకర్ అడిగే ప్రశ్నలకు వాళ్లు ముందే తయారుగా ఉంటారు. ఎందుకంటే దానికోసం గెలిచినా, గెలవకపోయినా డబ్బులు బానే ముడతాయి కాబట్టి.టీవీ షూటింగ్ అఫ్పుడు ఏమీ తెలియనట్టు డ్రామాలు. మనం అమాయకంగా అది నమ్మేసి బాధపడిపోతుంటాము.ఇది కూడా WWF ఫైటింగ్ లాంటిదే. :)జనాలను తలతిక్క, పిచ్చి ఐడియాలతో ఆడించి, పాపులర్ ఐపోయి,స్పాన్సర్లు, ప్రేక్షకులను పెంచుకోవడమే ముఖ్యం వాళ్లకి అంతే..

  ReplyDelete
 2. 1)polygraph test అంత correct కాదని అదంతా మొదట్లో అడిగే సులభమైన ప్రశ్నల ("మీ పేరేమిటి" వగైరా) సందర్భంగా record అయ్యే impulse pattern ని ఆధారం చేసుకొని తరువాత record అయ్యే patterns ఏ మాత్రం deviate అవుతున్నాయి అన్నదాన్నిబట్టి ఆ చెప్పేది అబధ్ధమా లేక నిజమా అని నిర్ధారిస్తారు(ట). కాబట్టి ఆ rudementary questions వేసే time లోనే erreneous patterns generate చేసి (may be just by clenching the muscles or something like that) pattern pridictability ని దెబ్బ తీయగలిగితే serious questions అడిగే time లో machine ని confuse చెయ్యవచ్చు(ట). అలాంటప్పుడు ఆ సో కాల్డ్ pattern match అవ్వలేదుకాబట్టి నువ్వు చెప్పేది అబద్ధం అనడం నాకు అర్ధవంతమనిపించట్లేదు. మరి మీకో?

  2)జ్యోతి గారభిప్రాయపడ్డట్లు ".టీవీ షూటింగ్ అఫ్పుడు ఏమీ తెలియనట్టు డ్రామాలు. మనం అమాయకంగా అది నమ్మేసి బాధపడిపోతుంటాము" అన్నది చాలావరకు నిజం.

  3)ఒక వేళ పై వేమీ కాకపోతే మాత్రం నాకిలా అనిపిస్తుంది "అత్యుత్తమ సంస్కృతి మనది అని గర్వించే మనం ఇకపై ఆ పనిచెయ్యటం మానుకుంటే మంచిది. ఎందుకంటే మన గొప్ప సంస్కృతి ప్రవచనాలకే పరిమితమై ఆచరణలో విఫలమైనదిగా పరిగణించాల్సి వస్తుంది కాబట్టి".

  ReplyDelete
 3. ఇదీ మన సమాజానికి పట్టిన దుర్గతి. నిజ్జంగా ఈ ప్రొగ్రాం చూసి నేను ఎంతో బాధ పడ్డాను. మన హిందు కుటుంబ వ్యవస్థ మీద జరుగుతున్న దాడి లా కనపడుతోంది నా కళ్ళకి ఈ ప్రొగ్రాం. మన కుటుంబ వ్యవస్థలో ఏ నిజం ఏ ఒక్క వ్యక్తి జీవితాన్నొ మాత్రమే శాసించదు. మనం ఈ సమాజంలో, ఒక కుటుంబంలో ఎన్నొ పాత్రలు పోషిస్తాము. ఉదాహరణకు: భర్య/తల్లి/కూతురు/కోదలు/సోదరి, భర్త/తండ్రి/కొడుకు/సోదరుడు. మరి ఇలాంటి ఒక వ్యక్తి తనకి మాత్రమె సంబంధించిన నిజాలంటూ రొడ్డుకెక్కి, వెల్లడించె నీచమైన నిజాలను చూసిన ప్రజలు, (చుట్టు పక్కవారు / బంధు మిత్రులు / భార్య లేక భర్త ఆఫీస్ లో పని చెసే వారు) రేపు ఆ కుటుంబ సభ్యులను ఎన్నిరకాలుగా అవహేళన చెస్తారో ఆలొచించక్కరలేదా అక్కడికి వెళ్ళే సత్య హరిశ్చంద్రులు. మన వ్యవస్థలో ఏ వ్యక్తి జీవితం తన సొంతం కాదు. అదీకాక వయసొచ్చిన కూతురు/కొడుకు ముందు అలాంటి చీకటి కోణాలు విప్పితే, ఆ ప్రభవంతో పిల్లలు తప్పుదారి పడే అవకాసం ఎంతైనా ఉంది. అమ్మే/నన్నే చెయ్యగా లేనిది మనం చేస్తే తప్పా అని పసి మనసులు ఆలోచిస్తే ఆ తప్పెవరిది.

  అయినా సగటు మనిషిలోని బలహీనత (డబ్బు సంపాదించాలి, కష్తపడకుండా) ని సొమ్ము చేసుకునేందుకు టీవీ చాన్నెళ్ళ వాళ్ళు చెస్తున్న మోసం ఇది. ఎంత తొందరగా మనిషి ఈ మాయాజాలంలోంచి బయటపడితే అంత మంచిది.

  ReplyDelete
 4. ....3)ఒక వేళ పై వేమీ కాకపోతే మాత్రం నాకిలా అనిపిస్తుంది "అత్యుత్తమ సంస్కృతి మనది అని గర్వించే మనం ఇకపై ఆ పనిచెయ్యటం మానుకుంటే మంచిది. ఎందుకంటే మన గొప్ప సంస్కృతి ప్రవచనాలకే పరిమితమై ఆచరణలో విఫలమైనదిగా పరిగణించాల్సి వస్తుంది కాబట్టి"....

  సారీ ! నేను ఏకీభవించడంలేదు. కొద్దిమంది బలిసిన కేటగరీ మాత్రమే దేశీయ సంస్కృతి పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారు. కుక్కని మనిషి కఱవడంలా అలాంటి వైపరీత్యాలకి పబ్లిసిటీ ఎక్కువ లభిస్తుంది. పతివ్రతలకీ, ఏకపత్నీవ్రతులకీ ఏ విధమైన పబ్లిసిటీ లభించదు. అంతమాత్రాన సమాజంలో అందఱూ కుక్కల్ని కఱిచేవాళ్ళే ఉన్నారని చెప్పడం అసంబద్ధం. భారతీయ సంస్కృతి విలువలు పాటిస్తున్నవాళ్ళే మనలో ఇప్పటికీ ఎక్కువగా ఉన్నారు. It is still a vibrant, living culture.

  ReplyDelete
 5. >>>>>
  గెలిచినా, గెలవకపోయినా డబ్బులు బానే ముడతాయి కాబట్టి.టీవీ షూటింగ్ అఫ్పుడు ఏమీ తెలియనట్టు డ్రామాలు. మనం అమాయకంగా అది నమ్మేసి బాధపడిపోతుంటాము.ఇది కూడా WWF ఫైటింగ్ లాంటిదే.
  >>>>>
  డబ్బులు విషయంలో మనిషికి వైరుధ్యాలు గుర్తుకి రావు అన్న ద్వా.నా.శాస్త్రి గారి కోట్ గుర్తుకి వస్తోంది.

  ReplyDelete
 6. ఈ విషయంలో భారతీయ సంస్కృతి అంటూ ఏమీ లేదు. నాకు తెలిసినంతలో అమెరికాలోనూ ఇది సంస్కృతి కాదు. టీవీలో చూపించే వైపరీత్యాలు ఏ సభ్య సమాజంలోనైనా వైపరీత్యాలే.

  ReplyDelete
 7. I echo the words of Kottapali garu

  ReplyDelete
 8. నేను కూడా కొత్త పాళి గారితో 100% ఏకీభవిస్తున్నా..

  ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.