Sunday, August 08, 2010

ముంబై ముచ్చట్లు: వానా వానా ... వెంగళప్పా

వానా వానా వల్లప్పా.. అని మనం చిన్నప్పుడు వానొస్తే చాలు  అనందంగా గెంతులేసేవాళ్ళం.  ముఖ్యంగా కాస్త గట్టిగా కురిస్తే స్కూలుకి సెలవుండేది కాబట్టి మహా ఆనందం గా ఉండేది.  పెద్దయ్యాక వానకి, సెలవుకి సంబంధం తెగిపోయి ఎంత వానకురిసినా చిన్నప్పటి ఆనందం లేదుకానీ, తాగడానికి నీళ్ళు దొరుకుతాయన్న ఒకే ఒక కారణం సంతోషం కలిగిస్తోంది.

వానపాటలు, వాన మీదే ఆధారపడిన సినిమాలూ, తడి బట్టల హీరోయిన్లు… ఇవ్నన్నీ వర్షం మీద రోమాంటిక్ భావం కలిగిస్తే, వాన రాజకీయాలు రోతభావాలు కలిగిస్తాయి.

ముంబైలో మేమున్న 12 సంవత్సరాలలో ముందటేడు తాగడానికి కూడా నీళ్లు కరువైయ్యాయి. ఏలినవారు ఎలాగో అలా కోతలతో గండం గట్టెక్కించారు. ముంబై వర్షాలు ఇంతకు ముందుదాకా చాలా ఆనందంగా ఉండేవి.  గత కొన్ని సంవత్సరాలుగా సముద్రపు ఆటుపోటులు, భారీ వర్షాలు  కలిసి వస్తాయేమోనని భయపడుతూనే ఉన్నారు ముంబైవాసులు.. ముఖ్యంగా 26/7 వరదల తర్వాత.  ఆసందర్భంలో ముంబైవాసులు అనేక ఇక్కట్లకి గురయ్యారని మనం చాలా విన్నాం, చదివాం.  ఆతర్వాత ప్రభుత్వం మీద ప్రతిసంవత్సరం తగు ఏర్పాట్లు తీసుకోమని వత్తిడి వస్తోనే ఉంది. ప్రతి సంవత్సరం ఏలినవారు వుయార్ ఫుల్లీ ప్రిపేర్డ్ అని చెప్తోనే ఉన్నారు, ప్రజల ఇక్కట్లు మామూలే.  రోడ్లు … అంటే ఏమిటో మర్చి పోయాం మేము.  రైలు పట్టాలు పర్వాలేదు అనుకుంటే  కాస్త వర్షానికి కొన్ని చోట్ల పట్టాలు మునిగి పోయి మొన్నో రోజు 60 కిమీలు 5 గంటలలో చేర్చి, కొండోకచో అస్సలు చేర్చ లేక అవీ ఉపయోగకరం కాదని తెల్సింది.  

మనది పుణ్యభూమి అవడం వల్ల వరదలు రాలేదు. యజ్ఞాలు చేసి ప్రజలని రక్షించవచ్చని ఏలిన వారికి తట్టలేదు కాని లేకపోతే అవి కూడా చేయించేసి మరి కొన్ని డబ్బులు చేసుకోరా?   అన్నట్లు మా మేయరు గారు అన్నిటికీ పైవాడిదే భారం అని ఆత్మజ్ఞానం తెచ్చుకున్నదై 1200 మందితో తిరుపతి ప్రయాణమయ్యారు. అది తెలియని  ప్రతిపక్షాలవాళ్ళూ, గిట్టనివాళ్ళూ  తెగ ఆడిపోసుకుంటున్నారు. ధర్మభూమిలో ఇంత అధర్మపుటాలోచనలా. 

వానాకాలపు ఇక్కట్లు తప్పింటడానికి ఖర్చంటారా, పెడుతోనే ఉన్నారు. జనాలకే సుఖం లేదు.  వానలవల్ల ఆనందపడిన వాళ్లు  వానా వానా వల్లప్పా అని పాడుకున్నట్లే, వాటి ధర్మమా అని బాగు పడినవాళ్లు వానావానా వెంగళప్పలూ (పౌరులనుద్దేశించి అని వేరే చెప్పనఖ్ఖర్లేదుగా) అని పాడుకుంటున్నారు.

బహుకాల బ్లాగడం

ఈమధ్య బ్లాగులు చదువుతున్నా కానీ వ్రాయడం లేదు. కారణం పెద్దగా ఏం లేదు. బద్ధకం. అదీకాక అందరూ అన్నిటిమీదా తెగ బ్లాగేస్తూంటే ఏం రాయాలో తట్టట్లేదు. కుక్కపిల్లా, అగ్గి పుల్లా అని ఎన్నిసార్లు పునశ్చరణ చేసినా వ్రాతకి స్పూర్తి కలగట్లేదు. ఈలోపు మా స్నేహితుడికి మిత్రత్వదినం సందర్భంగా ఫోన్ చేస్తే ఎందుకు రాయడం లేదని అడిగాడు. తను రెండు మూడుసార్లు సత్యశోధనకి వెడితే కొత్త టపాలు లేవని, ఇలా గేపిస్తే ఇంక నా బ్లాగు ముఖం ఎవరూ చూడరని చెప్పాడు.  బ్లాగు రాస్తే స్నేహం కట్ అనే పరిస్తితుల్లో, రాయక పోతే బాధపడిన వాడే నిజమైన స్నేహితుడని సెంటిమెంటలయి పోయి మళ్ళీ రాద్దామని నిర్ణయించేసుకున్నా. అలా అని రోజూ రాసేయను అని హామీఇస్తున్నా.

భవదీయుడు

సత్యసాయి