Tuesday, December 06, 2011

నా కన్నీళ్ళు పాడై పోయింది.. పీడాపోయింది

tears
ఆమధ్యన కొన్నాళ్ళు విండోస్ మొబైలు (ఆసూస్ పి 527) వాడాను. సుమారు ఓఏడాది పాటు. ఆఏడాదంతా నాకు ఏడుపే ఏడుపు. అవడానికి దానిలో చాలా ఫీచర్లున్నాయి, విజిటింగు కార్డ్ రీడరు తో సహా. ఇంకా చాలా ప్రోగ్రాములు దింపుకోవచ్చు.  అయితే ఒకటికి ఇంకో ప్రోగ్రాము ఎక్కిస్తే  మొబైలు సుషుప్తిలోకి జారుకునేది.  ఎవరికైనా ఫోను చేస్తే కట్‌చేసినా కూడా పల్సు రేటు దాటిపోయి నాకు ఇంకో కాలు పోయేదాకా ఆగేది కాదు. కొండొకచో,ఆసూస్ కీ, ఓడఫోను వాడికీ ఏదైనా మోసపూరిత బాంధవ్యమేదైనా ఉందేమోనన్న అనుమానం కూడా వచ్చేది.
అన్నట్లు ఓడఫోనుతో కష్టాలు ఇన్నీ అన్నీ కావు.  అవసరమైనప్పుడు తప్ప ఇతర సందర్భాలలో నిండుగా సిగ్నలుండేది. ఆఫీసులో కూర్చుని మాట్లాడితే, కాస్త అటూ ఇటూ తల కదిపితే సిగ్నలౌట్.  దాంతో మాఆవిడకి (బహుశః వేరేవారికికూడా) కావాలనే కట్చేస్తున్నానేమోనని అనుమానం వచ్చేది. దెబ్బకి తలకి చెక్క ఫ్రేములు బిగించి నట్లు కూర్చుని మాట్లాడాల్సి వచ్చేది. అయినా సమస్యతీరలేదు.  దాంతో వేరే కంపెనీకి మారా.  కానీ హేండ్ సెట్ పారే(డే)యడం అంత సులభం కాదు కదా.. 15 వేలు పెట్టి కొనుక్కున్న తర్వాత. 
అసలు నాకు ఖరీదైన సెల్ ఫోనులు అచ్చిరాలేదేమో అనిపించింది. మా సారొకాయన కూడా అదే అన్నాడు.  నా జీవితంలో మొదటిసారి కొన్నది సామ్సంగ్ ఫోను. బాగానే పనిచేసింది. దాని సిగ్నల్ నీరసపడ్డాక, నోకియా మడత ఫోను కొన్నా.  దాన్లో నాకు నచ్చిన విషయం తెలుగులో వ్రాయగలగడం.  తీరా కొన్ని రోజులు వాడేనే లేదో, కొరియా వెళ్ళాల్సి వచ్చి మా ఆవిడకిచ్చేసా. వెనక్కి వచ్చాక మోటరోలా రాకర్ కొన్నా.  చాలా బాగుంది. ముఖ్యంగా సంగీతంవినడానికి.  కానీ తెలుగు కనిపించేది కాదు.  ఓరెండేళ్ళు వాడానేమో ఎక్కడో పడి పోయింది.  ఆపోవడం కూడా విచిత్రంగా పోయింది. ఇంటినుండి బయలు దేరినప్పుడు ఉంది. ఆఫీసుకి చేరినప్పటికి లేదు. మధ్యలో ఒకచోట  కన్నీళ్ళు (టియర్సు – కళ్ళలో వేసుకునే చుక్కలమందు) కొందామని మందులషాపుదగ్గర కారు దిగా, అక్కడే పడిపోయుంటుంది.  ఆఫోను ఎంత గొప్పదంటే ఒకసారి నిండా వర్షం నీళ్ళలో మునిగిపోయినా కూడా ఎండలో ఎండబెట్టగానే మళ్ళీ పనిచేయడం మొదలెట్టింది.
అదేం విచిత్రమో, నా సెల్ఫోను, కెమేరా ఒకే రకంగా దూరమయాయి.  తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది.  నా కెమేరా ప్యాంటు జేబులో పెట్టుకుని ఒక నదిలో రేఫ్టింగుకి వెళ్ళా. పాపం అది నీళ్ళలో మునకేయడంవల్ల ఎల్సీడీకి జలుబుచేసింది. ఎండపెట్టాక మళ్ళీ పనిచేయడం మొదలెట్టింది. కట్ చేస్తే .. కేదార్ నాధ్ వెళ్తోంటే ఆ కెమేరా తెలియకుండానే చేతిలోంచి జారి కిందపడిపోయింది.  ఎవరో తీసుకుపోయారు.  కొన్నాళ్ళకి సెల్ఫోను కూడా అదే క్రమంలో ముందు తడిసిముద్దయ్యి, తర్వాత జారిపడి ‘పోయింది’.  
రెండ్రోజులపాటు వైరాగ్యం వెలగబెట్టాక, మా ఆవిడ ప్రోద్బలంతో (అంటే ఆవిడిచ్చిన డబ్బులతో అని కూడా అర్ధం) ఈసారి విండోస్ ఫోను Asus P527 కొన్నా. కొద్దిగా బండగా ఉన్నాకూడా, రఫ్ఫండ్టఫ్ గా వాడినా పరవాలేదని చెప్పి ఆ ఫోను కొన్నా.  ఇంతకు ముందు చెప్పినట్లు ఆఫోనుతో ఏడాది పాటు అనుభవించా.  ఈపాటికే గ్రహించి ఉంటారు .. నాఎలక్ట్రానికోపకరణాలకి జలగండం ఉందని.  ఆసూస్ ఫోనుకి కూడా గండం తప్పలేదు.  ముల్లు, అరిటాకు సామెతని నిజం చేస్తూ, పాపం ఆఫోను నీళ్ళల్లో పడడం వల్లకాక, నీళ్ళే దానిమీద పడడం వల్ల తన మాన ప్రాణాలు పోగొట్టుకుంది. అంతకీ దాన్నికూడా ఎండలో పెట్టా.  రాజుగారు, ఏడు చేపల కధలోలా, మూడు ఉపకరణాలు ఎండబెడితే, రెండే ఎండాయి.  ఆసూస్ ఫోనెండలేదు.  నాల్రోజులు వైరాగ్యం.  ఆఫోను పెట్టిన ఇబ్బందులవల్ల కాస్త ఊరట. కేవలం 1500 రూపాయలఫోనే కొనాలని నిర్ణయించుకుని బజారుకెళ్ళి కేవలం 11000 రూపాయలకే సామ్సంగ్ గేలాక్సీ ఫిట్ ఏండ్రాయిడ్ ఫోను కొనుక్కునొచ్చా. ఈసారి మా అబ్బాయి ప్రోత్సాహంతో.  దాంతో నా అనుభవం మొదట్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఆనందదాయకంగానే ఉందని చెప్పాలి. ఆవిశేషాలు ఇంకోసారి. 
మొత్తం మీద నాకు ఆసూస్ ఫోనుతో కన్నీళ్ళెందుకొచ్చాయా అని ఆలోచిస్తే, ఆసూఁ అంటే కన్నీళ్లని స్ఫురించి జ్ఞానోదయం అయింది. ఇప్పుడు ఈటపా శీర్షిక అవగతం అయిఉంటుంది !!!

2 comments:

  1. నేను PALM TREO PRO Windows mobile 6.1 ఫోన్ తీసుకున్నాను. అది పాతిక వేలు పెట్టి. గత ముడేల్లగా నానా బాధలు పడుతున్నాను. చివరికి టచ్ కుడా పోయింది దానికి. దరిద్రం ఏమిటంటే. విండోస్ ఫోన్ విండోస్ 7 లో recognize అవటలేదు.

    విండోస్ మొబైల్ అంతా దరిద్రం ఉన్కొకటి లేదు.

    ReplyDelete
  2. asuse meaning brahmaandam gaa telisindippudu...nice post

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.