Saturday, December 28, 2013

మొగుడు లేదా పెళ్ళాంతో ఆటలాడుకోండి

ధనుర్మాసం సందర్భంగా జయా టీవీలో ఈనెలంతా సంగీతమే సంగీతం. ఈరోజు నైవేలీ సంతానగోపాలన్ గారి కచ్చేరి. ఆయన పాడేవిధం నాకు నచ్చుతుంది. ఈవేళ మొదటిసారిగా విననాసకొని యున్నానురా అని ప్రతాపవరాళిలో త్యాగరాజస్వామివారి కృతి ఆయననోట విన్నా. దీని పూర్తిపాఠం గూగులమ్మనడిగితే ఇచ్చింది. సాహిత్యం, అర్ధం http://www.gaanapriya.in వద్ద దొరికాయి.
పల్లవి:    విననాసకొనియున్నానురా విశ్వ రూపుడ నే 
అనుపల్లవి: మనసారగ వీనుల విందుగ మధురమైన పలుకుల  ||విననా||

చరణం: సీతా రమణితోనోమన-గుంటలాడి గెలుచుట 
          చేతనొకరికొకరు జూచియా భావమెరిగి 
         సాకేతాధిప నిజమగు ప్రేమతో బల్కుకొన్న ముచ్చట 
         వాతాత్మజ భరతులు విన్నటుల త్యాగరాజ సన్నుత ||విననా||


సీతమ్మతో వామనగుంటలాడి గెలిచాక సీతమ్మవారితో ఆడిన ప్రేమపూరితమాటలు, హనుమంతుడు, భరతుడు విన్నట్లు తనుకూడా వినాలని ఆశ పడి న వైనం ఈపాటలో చెప్పుకున్నారు త్యాగరాజస్వామివారు. పాపం ఆయనవన్నీ చిన్నచిన్న కోరికలే.
అదలా ఉంచితే, ఎంతటి మహారాజైనా ఎపుడో ఏకాంతంలో ఎంతోకొంతతనకాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రమైతే, ఎంతటి రాముడైనా సీతమ్మతో వామనగుంటలాడడానికి సమయంవెచ్చించడం మనందరం గమనించిపాటించడం మంచిదేమో.  అసలు ఆటలాడుకోవడం వల్ల మనుషులమధ్య సయోధ్య పెరుగుతుందనీ, ఆరోగ్యకర సంబంధాలు పెంపొందుతాయనీ మనందరికీ తెలుగు వ్యాసాలు రాయడం వచ్చిన దగ్గరనుంచీ తెలిసిన విషయమే.  అసలు మన పెళ్ళిలో పూబంతాట, బిందీ-ఉంగరం, వంటా వార్పూ లాంటి ఆటలు నూతన దంపతుల మధ్య మంచుముక్కలవడానికి (ఐస్ బ్రేకింగన్న మాట) పనికొస్తుందని మనకి తెలిసిన విషయమే. తలంబ్రాలేసుకోవడం కూడాఒకరకమైన ఆటలా సాగడం గమనార్హం. తర్వాతరోజుల్లో మొగుడూ పెళ్ళాల మధ్య ఎన్నిరకాల గేమ్సు నడుస్తాయో మీలాంటి అనుభవజ్ఞులకి వేరే నేచెప్పడమేమిటి, నా ఛాదస్తం కాకపోతే.
అన్నట్లు ఈమధ్య ఓ తెలిసిన ముసలాయనింటికెళ్తే, కాస్త లేటుగా బయటికొచ్చాడు. విషయమేమిటంటే ముసలావిడతో చదరంగమాడుతున్నాడుట. ఎదురెట్టి కాదునుకుంటా లెండి :). చాలా ముచ్చటేసింది. పెళ్ళైన కొత్తలో నేనూ మాఆవిడ  చదరంగం, పేక ఆడేవాళ్ళం (పోట్లాటలు లేనప్పుడు కాలక్షేపం ఉండాలిగా మరి). అదేమిటో పెళ్ళికి ముందు చదరంగమాడితే మాఅవిడ గెలిచేది. పెళ్లయాకా ఎప్పడూ నేనేగెలవడంవల్లనో, సంసారసాగరంలో నిమగ్నమయిపోవడంవల్లనో మా ఆటలు ఎక్కువకాలం సాగలేదు.
కట్ చేసి మళ్ళీ రాముడిదగ్గరకెళ్తే, ఆయన సీతతో ఆడిన వామనగుంటలాట మేం చిన్నప్పుడెప్పుడో ఆడిన గుర్తు. దీనిమీద వికీపీడియా చర్చకి లంకె ఇక్కడ ఇచ్చా. పైనిచ్చిన పాఠం అక్కడిదే.  ఈమధ్య మంకాలా అనే ఆట  మా తమ్ముడూ, మరదలూ యూఎస్ నుండి పట్టుకొచ్చారు. చూస్తే అది వామనగుంటలాటే. అంటే అది ఇంటర్నేషనల్ గేమన్నమాట. అంటే రాముడు అంతర్జాతీయ ఖిలాడీ అన్నమాటేగా (శ్రీలంక టూరెళ్ళాడుగా).
అదలాఉంచితే, ఒకవేళ సాకేతాధిపుడు ఆటలో ఓడి ఉంటే కూడా ప్రేమతో బల్కుకున్న ముచ్చట ఉండేదా అని నాకో డౌటు. ఇదేంటీ, మరీ పెమినిష్టుడౌటులొచ్చేస్తున్నాయనుకుంటున్నారా.
ఈశషభిషలు పక్కన పెట్టి మన పెళ్ళాం లేదా మొగుడుతో ఎఁవేఁవాటలాడుకోవచ్చో ఆలోచించుకొంటే బెటరు.
సర్వేజనా సుఖినోభవంతు.

Sunday, December 15, 2013

ఈ టపా ‘గరికపాటి’ చేయదా?

తెలుగు బ్లాగాభిమానులకు నమస్కారాలు. బ్లాగ్దినోత్సవ శుభాకాంక్షలు (డిసెంబరు 9). ఈ మధ్యన ముఖపుస్తకంలో కామెంటుతూ  కృష్ణ దేవరాయలు పెనుకొండ ఇస్మాయిల్ గారు గడిచిన బ్లాగు కాలాన్ని గుర్తు కి తెచ్చారు.  సరే ఓ టపా కడదామని అనిపించింది. ఈలోపు చదువరి గారు గరికపాటి వారు తమ గుండె తెరిచి ఆర్కే ముందు ఆరేసుకున్నారని మీటిన ట్వీటు చదివి, ఆనక ఆ దృశ్యమాలిక చూశాక నచ్చి మీతో ఇలా పంచుకుంటే బాగుంటుందనిపించింది.రెండు భాగాలుగా దిగుమతి చేసుకున్న వీడియోలు ఆద్యంతమూ (హాస్య)రస భరితంగా ఉన్నాయి. వీటిని యూ ట్యూబు ఇక్కడ (భాగం 1, భాగం 2) లో చూడొచ్చు.  మహావధాని గరికపాటి నరసింహారావుగారిని గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఒకవేళ ఎవరన్నా అడిగినా కూడా, ఆయనని పరిచయం చేయగల సత్తా లేదుకాక లేదు. అందుకని ఆపని పెట్టుకోను. సదరు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ హార్టు విత్ ఆర్కే (ముఖాముఖి) లో గరికపాటివారు చెప్పిన విశేషాలన్నీ చెప్పను. రాలిన ఆణిముత్యాలలో కొన్ని ఇక్కడ రాస్తున్నా.
ఒక సందర్భంలో మనకి చర్చలే కానీ చర్యలుండవు అని గొప్ప సత్యం నాకు చాలా నచ్చింది. ఆయన నాస్తికత్వాన్నించి ఆస్తికత్వం వైపు మళ్ళడం, పిల్లల పేర్లు శ్రీశ్రీ, గురజాడ అని పెట్టడం, అవధానాల్లో కొన్నిసార్లు చుక్కెదురవడం వంటి ఘట్టాలను చెప్పేడప్పుడు ఆయన నిజాయితీ కనిపిస్తుంది.  ఆద్యంతమూ ఆయన నిర్మొహమాటం, మాట నిక్కచ్చితనం, మాటకారి తనం అబ్బుర పరుస్తాయి. ఆర్కే గారిని పొగిడినప్పుడు కాస్త మొహమాటపడ్డారేమో అనిపించింది. ఆయన ధారణ అనితరసాధ్యం అని మనకనిపించినా, ఎవరైనా సాధించచ్చు అని ఆయన సూచించారు.  రెండురెళ్ళెంత అంటే కనీసం కేలుక్యులేటరు ఉంటే కానీ చేయలేకపోతున్నజనాలకి  ఆయన నిత్యజీవితంలో అవధానం ఎలా పనికొస్తుందో చెప్పినది చాలా ఉత్తేజకరంగా ఉండచ్చు. అవధానం అనేది పాండిత్యప్రకర్ష, అవధాని గొప్ప ప్రకటించడం కోసం కాక రోజువారి జీవితంలో ఉపయోగించు కోవచ్చన్నది ఆయన ఉదాహరణలతో చెప్పారు.  ఆయన ఇంట్లో సరుకుల లిస్టు ఒకసారి చూసుకుని బజారుకెళ్ళి ఏవీ వదలకుండా అన్నీ తెస్తారటఆయనకి తరచూ అవసరమయ్యే 50 ఫోను నంబర్లు గుర్తుంచుకుంటారట.
ఒక సందర్భంలో కోరికలేనివాడికి జీవితం గరికపాటి అని తనఇంటిపేరుతో ఒకఛలోక్తి విసిరి తన మాటకారితన్నాన్ని ప్రదర్శిస్తారు. అవధానాల్లో ఎదురైన సవాళ్లు చెప్తూ 10 శాతం వరకూ ప్రతీ అవధానీ అంత సంతృప్తిగా చేయలేని అంశాలుంటాయని నిజాయితీగా చెప్పడంతో పాటు, సచిన్, గంగూలీ, షెహవాగు, ద్రావిడుల పేర్లు వచ్చేలా, తెలుగు గొప్పదనం చెప్పేలా పద్యం చెప్పమని ఇచ్చిన దత్తపదిని ఈ కింది విధంగా పూరించిన విధం ఆయన పట్ల మనకి గౌరవం పెంచేస్తాయి.
బాస చిన్మయముద్రయౌ భాష తెలుగు
పలకగన్ గూలియైనను కుల్కులొలుకు
వస్తనుండెహె కూసెహె వాగకనిననను
ముద్దులొలుకును తనదైన ముద్రవిడదు
గొప్ప పూరణయని చెప్పడం పద్యమంటే తెలియని నాకు దుస్సాహసం.
ఇంకో సందర్భంలో మనవాళ్ళు జ్ఞానానికన్నా, స్నానానికి ప్రాధాన్యత ఇస్తున్నారని నదిలో ఫలానా రోజుని స్నానం చేస్తే పాపాలు పోతాయని చెప్పి జనాలని మోసం చేసేవారిని ఎండగట్టడం ఆనందకరం. ఈమధ్య జనాలు హాస్యాన్ని ఆస్వాదించలేకపోవడం గురించి ఆయనతో పాటు మనంకూడా బాధపడాల్సిందే. ఒకసారి అవధానంలో అప్రస్తుత ప్రసంగంలో ఆరాముడు ఏకపత్నీవ్రతుడు, ఈరాముడు (ఎన్టీ ఆర్) లక్ష్మీపార్వతిని చేసుకోవడమేమిటని అడిగారట. దానికీయన ఈయన ఏన్టీ రాముడు అని, ఆయన ఏకపత్నీవ్రతుడు, ఈయన లోకపత్నీ వ్రతుడు అని చెప్పారట. 
రాష్ట్ర్రం విడిపోవడంపై ఆయన ఓ పద్యం చెప్తూ, ప్రాంతాలు విడిపోవచ్చుకానీ స్వాంతాలు విడిపోకూడదంటారు. లెస్స, లెస్స.
విడదీయగానౌనె వేయేండ్ల పద్యసుగంధమ్ము నన్నయ్య బంధమిపుడు
పంచి ఈయంగనౌనె పశులకాపరికైన పాడనేర్పిన మనభాగవతము
పగులగొట్టగనౌనె భండనమ్మున భద్రకాళిక రుద్రమ్మ కత్తి, ఢాలు
పాయ చీల్చగనౌనె బంగారుతోటలో ఘంటసాలగ పారు గానఝరిని
ప్రాంతములు వేరుపడినను బాధలేదు
స్వాంతములు వేరుపడకున్న చాలునదియె
తెలుగు విడిపోదు చెడిపోదు తెలుగు వెలుగు
రెండుకన్నులతొ ఇకనుండి వెలుగు
గరికపాటి వారు ఉపన్యాసాలని అమ్మ ప్రార్ధనతో మొదలెట్టి, మళ్ళీ కలిసేంత వరకూ తెలుగులో మాట్లాడుకుందాం అని ముగిస్తారట.
మళ్ళీ నేనింకో బ్లాగు టపా రాసేంత వరకూ తెలుగులో మాట్లాడుకుందాం అని నేనంటే నాభాషాసేవ గరికపాటి చేయదా!