తెలుగు బ్లాగాభిమానులకు నమస్కారాలు.
బ్లాగ్దినోత్సవ శుభాకాంక్షలు (డిసెంబరు 9). ఈ మధ్యన ముఖపుస్తకంలో కామెంటుతూ కృష్ణ దేవరాయలు పెనుకొండ ఇస్మాయిల్ గారు గడిచిన బ్లాగు కాలాన్ని
గుర్తు కి తెచ్చారు. సరే ఓ టపా కడదామని
అనిపించింది. ఈలోపు చదువరి గారు గరికపాటి వారు తమ గుండె తెరిచి ఆర్కే ముందు
ఆరేసుకున్నారని మీటిన ట్వీటు చదివి, ఆనక ఆ దృశ్యమాలిక చూశాక నచ్చి మీతో ఇలా పంచుకుంటే
బాగుంటుందనిపించింది.రెండు భాగాలుగా దిగుమతి చేసుకున్న వీడియోలు ఆద్యంతమూ (హాస్య)రస భరితంగా ఉన్నాయి. వీటిని యూ ట్యూబు ఇక్కడ (భాగం 1, భాగం 2) లో చూడొచ్చు. మహావధాని గరికపాటి నరసింహారావుగారిని గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఒకవేళ ఎవరన్నా అడిగినా కూడా, ఆయనని పరిచయం చేయగల సత్తా లేదుకాక లేదు. అందుకని ఆపని పెట్టుకోను. సదరు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ హార్టు విత్ ఆర్కే (ముఖాముఖి) లో గరికపాటివారు చెప్పిన విశేషాలన్నీ చెప్పను. రాలిన ఆణిముత్యాలలో కొన్ని ఇక్కడ రాస్తున్నా.
ఒక సందర్భంలో మనకి చర్చలే కానీ
చర్యలుండవు అని గొప్ప సత్యం నాకు చాలా నచ్చింది. ఆయన నాస్తికత్వాన్నించి
ఆస్తికత్వం వైపు మళ్ళడం, పిల్లల పేర్లు శ్రీశ్రీ, గురజాడ అని పెట్టడం, అవధానాల్లో
కొన్నిసార్లు చుక్కెదురవడం వంటి ఘట్టాలను చెప్పేడప్పుడు ఆయన నిజాయితీ కనిపిస్తుంది. ఆద్యంతమూ ఆయన నిర్మొహమాటం, మాట నిక్కచ్చితనం,
మాటకారి తనం అబ్బుర పరుస్తాయి. ఆర్కే గారిని పొగిడినప్పుడు కాస్త మొహమాటపడ్డారేమో
అనిపించింది. ఆయన ధారణ అనితరసాధ్యం అని మనకనిపించినా, ఎవరైనా సాధించచ్చు అని ఆయన
సూచించారు. రెండురెళ్ళెంత అంటే కనీసం
కేలుక్యులేటరు ఉంటే కానీ చేయలేకపోతున్నజనాలకి ఆయన నిత్యజీవితంలో అవధానం ఎలా పనికొస్తుందో చెప్పినది
చాలా ఉత్తేజకరంగా ఉండచ్చు. అవధానం అనేది పాండిత్యప్రకర్ష, అవధాని గొప్ప ప్రకటించడం
కోసం కాక రోజువారి జీవితంలో ఉపయోగించు కోవచ్చన్నది ఆయన ఉదాహరణలతో చెప్పారు. ఆయన ఇంట్లో సరుకుల లిస్టు ఒకసారి చూసుకుని
బజారుకెళ్ళి ఏవీ వదలకుండా అన్నీ తెస్తారట! ఆయనకి తరచూ అవసరమయ్యే 50 ఫోను నంబర్లు గుర్తుంచుకుంటారట.
ఒక సందర్భంలో కోరికలేనివాడికి జీవితం గరికపాటి అని తనఇంటిపేరుతో
ఒకఛలోక్తి విసిరి తన మాటకారితన్నాన్ని ప్రదర్శిస్తారు. అవధానాల్లో ఎదురైన సవాళ్లు
చెప్తూ 10 శాతం వరకూ ప్రతీ అవధానీ అంత సంతృప్తిగా చేయలేని అంశాలుంటాయని నిజాయితీగా
చెప్పడంతో పాటు, సచిన్, గంగూలీ, షెహవాగు, ద్రావిడుల పేర్లు వచ్చేలా, తెలుగు
గొప్పదనం చెప్పేలా పద్యం చెప్పమని ఇచ్చిన దత్తపదిని ఈ కింది విధంగా పూరించిన విధం
ఆయన పట్ల మనకి గౌరవం పెంచేస్తాయి.
బాస చిన్మయముద్రయౌ భాష తెలుగు
పలకగన్ గూలియైనను కుల్కులొలుకు
వస్తనుండెహె కూసెహె వాగకనిననను
ముద్దులొలుకును తనదైన ముద్రవిడదు
పలకగన్ గూలియైనను కుల్కులొలుకు
వస్తనుండెహె కూసెహె వాగకనిననను
ముద్దులొలుకును తనదైన ముద్రవిడదు
గొప్ప పూరణయని చెప్పడం పద్యమంటే తెలియని నాకు దుస్సాహసం.
ఇంకో సందర్భంలో మనవాళ్ళు జ్ఞానానికన్నా, స్నానానికి ప్రాధాన్యత
ఇస్తున్నారని నదిలో ఫలానా రోజుని స్నానం చేస్తే పాపాలు పోతాయని చెప్పి జనాలని మోసం
చేసేవారిని ఎండగట్టడం ఆనందకరం. ఈమధ్య జనాలు హాస్యాన్ని ఆస్వాదించలేకపోవడం గురించి
ఆయనతో పాటు మనంకూడా బాధపడాల్సిందే. ఒకసారి అవధానంలో అప్రస్తుత ప్రసంగంలో ఆరాముడు
ఏకపత్నీవ్రతుడు, ఈరాముడు (ఎన్టీ ఆర్) లక్ష్మీపార్వతిని చేసుకోవడమేమిటని అడిగారట.
దానికీయన ఈయన ఏన్టీ రాముడు అని, ఆయన ఏకపత్నీవ్రతుడు, ఈయన లోకపత్నీ వ్రతుడు అని
చెప్పారట.
రాష్ట్ర్రం విడిపోవడంపై ఆయన ఓ పద్యం చెప్తూ, ప్రాంతాలు
విడిపోవచ్చుకానీ స్వాంతాలు విడిపోకూడదంటారు. లెస్స, లెస్స.
విడదీయగానౌనె వేయేండ్ల పద్యసుగంధమ్ము నన్నయ్య బంధమిపుడు
పంచి ఈయంగనౌనె పశులకాపరికైన పాడనేర్పిన మనభాగవతము
పగులగొట్టగనౌనె భండనమ్మున భద్రకాళిక రుద్రమ్మ కత్తి, ఢాలు
పాయ చీల్చగనౌనె బంగారుతోటలో ఘంటసాలగ పారు గానఝరిని
పంచి ఈయంగనౌనె పశులకాపరికైన పాడనేర్పిన మనభాగవతము
పగులగొట్టగనౌనె భండనమ్మున భద్రకాళిక రుద్రమ్మ కత్తి, ఢాలు
పాయ చీల్చగనౌనె బంగారుతోటలో ఘంటసాలగ పారు గానఝరిని
ప్రాంతములు వేరుపడినను బాధలేదు
స్వాంతములు వేరుపడకున్న చాలునదియె
తెలుగు విడిపోదు చెడిపోదు తెలుగు వెలుగు
రెండుకన్నులతొ ఇకనుండి వెలుగు
స్వాంతములు వేరుపడకున్న చాలునదియె
తెలుగు విడిపోదు చెడిపోదు తెలుగు వెలుగు
రెండుకన్నులతొ ఇకనుండి వెలుగు
గరికపాటి వారు ఉపన్యాసాలని అమ్మ ప్రార్ధనతో మొదలెట్టి, మళ్ళీ కలిసేంత
వరకూ తెలుగులో మాట్లాడుకుందాం అని ముగిస్తారట.
మళ్ళీ నేనింకో బ్లాగు టపా రాసేంత వరకూ తెలుగులో మాట్లాడుకుందాం అని
నేనంటే నాభాషాసేవ గరికపాటి చేయదా!
సత్యసాయి గారు,
ReplyDeleteయాదృచ్చికమో అదృష్టమో గానీ నేను నిన్న గరికపాటి Open Heart with RK చూసి ముగ్దున్ని అయిపోయా! నేను ఆస్థికున్ని కాకున్నా ఆయన చెప్పిన విధానం నాకు తెగ నచ్చింది. మరీ ముఖ్యంగా ప్రాంతాలు విడిపోయినా స్వాంతాలు విడిపోకూడాదనీ "పంచి ఈయంగనౌనె పశులకాపరికైన పాడనేర్పిన మనభాగవతము" అనగానే నా కళ్ళ్నీళ్ళు జలజలా రాలాయి.
ఈ ద్వేషాల్లో, పౌరుషాల్లో ఇప్పుడు మనక్కావాల్సిన వాక్కు ఇది అనిపించింది. ఈ గొంతు, మరిన్ని గొంతులై తెలుగునాట (సీమాద్ర & తెలంగాణ) నాట్యమాడాలనిపించింది.
ఈ ఒక్క గరికపాటి గారి పద్యం దెబ్బతో నిన్నటినుండీ యుట్యూబు నిండా వున్న ఆయన వాఖ్యానాలూ, ఉపన్యాసాలే వింటున్నాను.
రెండూ ను. నెనర్లు
ReplyDeletethe otherday on 16.12.2013 the Astavadhanam by Brahmasri Garikipati varu at
ReplyDeletethe RV Dental College Auditorium at JP Nagar Bangalore was excellent.
Also the "the Bhuvana Vijayam" by all the Great Scholars of Telugu at the
Indian Institute of Scienece Centre at Yeshwantpur is very great and excellent
This comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDelete