Saturday, March 01, 2025

అన్నమయ్య పదకవితా సాగరం నుండి నాల్గు బిందువులు

అన్నమయ్య పదకవితా వైభవం
ఆయన కీర్తనా సాగరం నుండి నాల్గు బిందువులు
సత్యసాయి కొవ్వలి
అన్నమయ్య పేరు వినని తెలుగువాడుండడు. చిన్నప్పుడు మనఅమ్మ పాడిన జో అచ్యుతానంద నుండి అదివో అల్లదివో హరివాసమూ అన్న పాటవరకూ, ఏమొకొ చిగురుటధరమున యెడనెడఁ గస్తురి నిండెను భామిని విభుఁనకు వ్రాసిన పత్రిక కాదుగదా అన్న శృంగారకీర్తన నుండి నానాటి బ్రతుకు నాటకమనే ఆధ్యాత్మిక బోధన వరకూ అన్నమయ్య స్పృశించని విషయం లేదు, సామాజిక కోణం లేదు. ఈ 15వ శతాబ్దపు వాగ్గేయకారుడు, 32000 పదాలలో వేంకటేశ్వరుడి మహాత్మ్యాన్ని, వేదాంత తత్వాన్నీ రచించిన పదకవితా పితామహుడు. జానపదుల భాషలో క్లిష్ట భావాలని సులభంగా మనసుకి హత్తుకునేలా వ్రాసిన జానపద కవితా పితామహుడు. అనేకమంది పండితులు, విద్వాంసులు, సంగీతజ్ఞులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సుమారు 14000 (వీరి 2178 ఆధ్యాత్మ, 11526 శృంగార) సంకీర్తనలను వెలికి తీసి, అనేక కీర్తనలను స్వరపరచి, ప్రజల నోట నానేలా చేసారు.  వారి జీవితం ఆధారంగా చలనచిత్రం కూడా నిర్మించడంతో అన్నమయ్య పాట పలకని తెలుగు నోరు లేదేమో.  అంతటి మహామహిమాన్వితుడి పదకవితా వైభవాన్ని 15 నిమిషాల్లో ఆవిష్కరించడం, అందులోనూ ఏఅర్హతా లేని నేను చేయబూనడం దుస్సాహసం. అందుకని, అన్నమయ్య ఆధ్యాత్మ కీర్తనా సాగరం నుండి నాలుగు బిందువులు చూసే ప్రయత్నం చేసా. 
అన్నమయ్య పదాలు దేశిరాగాలలో, సుగ్రహ లయతాళాలలో నిబంధించి, సులభీకరించిన రచనలు. పదాలకు పల్లవి, అనేక చరణాలు అనే రెండు అంగాలుంటాయి. పల్లవి ముఖ్యమైన, కేంద్రీభూతమైన అర్ధాన్ని సూచిస్తే, చరణాలు ఆ అర్ధాన్ని విస్తరిస్తాయి. శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారి మాటల్లో చెప్పాలంటే-

“(ఆ శ్రీనివాసుని) మూర్తినే ఆధిభౌతికమైన, ఆధ్యాత్మికమైన సర్వ ప్రపంచంలోనూ అంతర్యామిగా, బహిర్యామిగా భావించి, పూజించి, ప్రేమించి, కలహించి, ప్రాధేయపడి, ప్రార్ధించి, పొగిడి, తెగిడి, అనుభవించి, ఏకీభవించి జీవితంలోని అంతరంగ బహిరంగ పరమాణువులన్నింటా ఆతని బ్రతుకే బ్రతికినవాడు, ఆ అనుభవాలన్నీ మానసికంగా, కాయికంగా మాత్రమే కాక, వాచికంగా కూడా అనుభవించినవాడు, అన్నమయ్య. ఆవాచికాలే ఆయన పదకవితలు.” 
అందుకే వాటినిండా జీవితకాలపు భావోద్వేగాలూ,  అనుభూతులూ, పాఠాలూ. 
1. మోక్ష బిందువు - వేదాంతం చాలా క్లిష్టమైనది.  పండితులకి కూడా అంతచిక్కనిది, అనుభవంలో రానిది. వేదాంతసారాన్ని అన్నమయ్య చెప్పినంత సరళంగా ఎవరూ చెప్పలేరు. 
అత్మయే సర్వ ప్రకాశము అని తెలుసుకొనుటయే మోక్షము. ఆత్మజ్ఞానం పొందడం, జననమరణ చక్రం నుండి విముక్తి పొందడం మోక్షము. మనం జీవించి ఉండగానే ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని వదిలిపెట్టి, ఇంద్రియ నిగ్రహము సాధించి, రాగద్వేషములను వదిలిపెట్టి, ప్రశాంతంగా జీవించడం మోక్షం. 
హంసనాదం - రూపక
॥పల్లవి॥ తెలిసితే మోక్షము తెలియకున్న బంధము - కలవంటిది బదుకు ఘనునికిని
మన జీవితం ఒక స్వప్నం. ఈవిషయం తెలిస్తే మోక్షం. తెలియకపోతే బంధం. 
॥చ1॥ అనయము సుఖమేడ దవల దుఃఖమేడది తనువుపై నాసలేని తత్త్వమతికిని
పొనిఁగితేఁ బాపమేది పుణ్యమేది కర్మమందు వొనర ఫలమొల్లని యోగికిని
ఈతత్త్వము తెలిసి శరీరంపై ఆస లేని వానికి (అంటే తత్వమతికి) సుఖదుఃఖాలనే ద్వంద్వాలు అంటవు. కర్మఫలాపేక్షలేని యోగికి పుణ్యపాపాలు అంటవు. 
॥చ2॥ తగిన యమృతమేది తలఁపఁగ విషమేది తెగి నిరాహారియైన ధీరునికిని 
పగవారనఁగ వేరి బంధులనఁగ వేరీ వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి
తిండిమీది ధ్యాసవదిలిన వానికి (ధీరునికి) అమృతమూ, విషమూ ఒక్కటే. ఈ వెగటైన ప్రపంచాన్ని విడిచిన వివేకికి బంధువులు, శత్రువులు అన్నభేదము ఉండదు. 
॥చ3॥ వేవేలువిధులందు వెఱుపేది మఱుపేది - దైవము నమ్మినయట్టి ధన్యునికిని
శ్రీవేంకటేశ్వరుఁడు చిత్తములో నున్నఁవాడు -యీవలేది యావలేది యితనిదాసునికి
ఇక్కడ దైవాన్ని నమ్మినవాడు వేలాది విధులను మఱపు, వెఱపు  లేకుండా నిర్వహించగలడని భక్తికి పెద్దపీట వేసాడు. శ్రీనివాసుడే చిత్తములో ఉన్న దాసుడికి ఇహపరాల చింత అవసరంలేదు. 
మోక్ష మార్గాలు
అన్నమయ్య దృష్టిలో మోక్షము కావాలంటే పెద్దగా ఏమీ చేయనక్కరలేదు. ఉత్కృష్టమైన జ్ఞానం సరిపోతుంది. (ఏమియుఁ జేయఁగవద్దు యింతలోనె మోక్షము దీమపువిజ్ఞానమే దివ్వెత్తు ఫలము) 
ఇతర సాధనాలు & సాధనలుః
• పాపచింతన లేకపోవడం, సత్వగుణసాధన (మొనసి సాత్త్వికమున మోక్షము సిద్ధించు)
• కోరికలు జయించడం, 
• బంగారంపై వ్యామోహం లేక పోవడం, 
• స్త్రీలోలత్వం వదిలడం 
• శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం, సేవ, చింతన, సంకీర్తన, హరివాక్యం
• కోపం జయించడం, (మునుకొపముఁ బెడఁబాసిన మతి మోక్షంబునకును నొకతెరువు),   
• దైవస్మరణ (హరిఁదలఁచినమతి), 
• గురుభక్తి, 
2. విద్వత్ బిందువు - పరస్పర విరుద్ధభావాలను ఒకే కీర్తనలో ప్రస్తావించి చివరలో పరిష్కరించడం ఒక వినూత్న ప్రయోగం. ఆయన విద్వత్తుకి తార్కాణం.
అన్నమయ్య విద్వత్తును ఉదాహరణకి రెండు కీర్తనలలో చూద్దాం..  
శృతి, స్మృతి వాక్యాలలో పరస్పరవిరుద్దంగా అనిపించే (seemingly contradictory)  కొన్ని భావాలను ఉదహరించి  అవి అన్నీ శ్రీనివాసుడి మాయలుగా వర్ణించడం ఒక చమత్కారం. క్రింది పల్లవి చూడండి.
కుంతలవరాళి - ఆది
॥పల్లవి॥ పురుషుండని శృతి వొగడీనట ఆ పురుషుఁడు నిరాకారమట 
విరసవాక్యము లొండొంటికి నివి వింటే నసంబద్ధములు
వేదాల్లో వర్ణించబడిన పురుషుడుని నిరాకారుడని చెప్పడం పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని చెప్పి ఇలాంటి ఇంకొన్నిఅసంబద్ధభావాలను చరణాలలో ఉదహరిస్తాడు. 
॥చ1॥ మొగమున బ్రహ్మలు మొలచిరట ఆ మూరితి అవయవరహితుఁడట
తగు బాహువులను రాజులట ఆ తత్వమే యెంచఁగ శూన్యమట
పగటున తొడలను వైశ్యులట ఆ బ్రహ్మము దేహము బయలట
అగపడి పాదాల శూద్రులట ఆతని రూపము లేదట
పురుష సూక్తం లో చెప్పినట్టు బ్రాహ్మణులు నోటినుండి వచ్చారని చెప్పారు కానీ ఆ పురుషుడు అవయవ రహితుడు. అలాగే ఇతర వర్ణాల వారు వేర్వేరు దేహ భాగాల నుండి ఉద్భవించారని చెప్పారు కానీ ఆ పురుషుడు రూపాలే లేని వాడని కూడా చెప్పారు. 
॥చ2॥ తన వందనమునుఁ గలదట దైవము తనుఁ జూడఁ గన్నులు లేవట
తన విన్నపమునుఁ జేయునట ఆతనికిని వీనులు లేవట
తన యిచ్చినదే నైవేద్యంబట దైవము నోరే లేదట
తన యిచ్చేటి ధూపంబును గలదట దైవము ముక్కును లేదట
దైవానికి కళ్ళు లేవు చెవులు లేవు నోరు లేదు ముక్కు లేదు. కానీ మన నమస్కారాన్ని చూస్తాడు, మన విన్నపాన్ని వింటాడు, మనం నివేదించిన పదార్ధాన్ని భుజిస్తాడు, మనం ఇచ్చిన ధూపాన్ని ఘ్రాణిస్తాడు. ఇవి కూడా పరస్పర విరుద్ధభావాలే. 
॥చ3॥ అంతాఁ దానే దైవమటా యజ్ఞము లొరులకుఁ జేయుటట
సంతతమునుఁ దా స్వతంత్రుఁడటా జపముల వరముల చేకొంటట
చింతింపఁ దానే యోగియటా చేరువ మోక్షము లేదట
పంతపు శ్రీవేంకటపతిమాయలు పచారించిన వివియట
దైవం అంతా తానే అయి ఉండి కూడా వేరే దేవతలప్రీతికై  యజ్ఞాలు చేయబడడం, తాను ఎల్లప్పుడు స్వతంత్రుడుగా ఉంటూ కూడా జపాలు, వరాలు చేకొనడం, తాను స్వయంగా యోగి అయినా కూడా మోక్షం దరి లేకపోవడం ఇవన్నీ విరుద్ధంగా అనిపించే శ్రీనివాసుడి మాయలు అని అన్నమయ్య వివరిస్తాడు. ఆ రకంగా పరస్పర విరుద్ధభావాలను అనుసంధానించాడు భక్తి బిందువు - భక్తీ, సంపూర్ణ శరణాగతులే మోక్షసాధనాలు అన్నది అన్నమయ్య సందేశం. ఆయన భక్తికే పెద్ద పీట వేసాడు.
ఇంకొక ఉదాహరణ.
॥పల్లవి॥ ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము - ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు
మనం సరియైన మోక్షమార్గాన్ని ఎన్నుకోవడంలోనూ, ఆమార్గంలో మఱపు, వెఱపు లేకుండా పయనించడంలోనూ జ్ఞానము, వివేకమూ ముఖ్యపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా అజ్ఞానాన్ని గుర్తించడం చాలా ముఖ్యం.  
॥చ1॥ తనుఁ దలచుకొంటేను తక్కిన దేహభోగాలు - పనికిరావు అవి ప్రకృతి గాన
ఘనమైన లోకభోగములతో లోలుఁడైతే - తనుఁ గానరాదుగానరాడు జీవతత్వము గాన
ఆ పరమాత్ముడే ఇచ్చిన దేహభోగాలు మోక్షానికి పనికిరావు.  ఆలోకభోగాలు అనుభవిస్తూ కూర్చొంటే ఆపరమాత్ముడు కనపడడు. 
॥చ2॥ దైవము నెఱిఁగితేను తన కామ్యకర్యములు - భావించి మఱవవలె బంధాలు గాన
కావించేటి తన కామ్యకర్మాలఁ గట్టువడితే - దైవము లోను గాఁడు స్వతంత్రుఁడు గాన
పరమాత్మను తెలుసుకున్న మహాత్ములకి కామ్యకర్మలు బంధాలవుతాయి కాబట్టి వాటిని వదిలేయాలి.  కర్మలకు కట్టుబడి, వాటిని వదలలేని వారికి, భగవంతుడు అందడు. పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నాక కూడా ఈకర్మలను పట్టుకుని వేలాడడం అజ్ఞానం, అవివేకం.  
॥చ3॥ సరిమోక్షము గోరితే స్వర్గము తెరువు గాదు - అరయ స్వర్గము తెరు వల మోక్షానకు
పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశుని - శరణాగతియె సర్వసాధనము గాన
స్వర్గం మోక్షానికి మార్గం కాదు,  కానీ బాగా ఆలోచిస్తే, మోక్షం సాధించాలంటే, స్వర్గాధికారం పొందాలనిపిస్తుంది. వేమన చెప్పినట్లు కామి కాక మోక్షగామి కాడు. అంటే ఏకోరికలూ తీరకుండా నేరుగా మోక్షం పొందడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి, కామ్యాదికర్మలు ఆచరించి సాధనాక్రమంలో ఒక స్థాయికి వచ్చాక మోక్షసాధన వీలవుతుందని భావమనుకుంటా. ఈకీర్తనలో రెండు విభిన్నపోకడలను పక్కపక్కనే ప్రస్తావించి, ఇదా, అదా అన్న ద్వైదీభావం చొప్పించి, చివరలో పరగనలమేల్మంగపతి శ్రీవేంకటేశుని శరణాగతియె సర్వసాధనము గాన అన్న సూక్ష్మాన్ని విప్పారు. ఇది ఒక విలక్షణ ప్రయోగం. ఇటువంటివి ఆయన కీర్తనలలో ఎన్నో. 
3. భక్తి బిందువు - భక్తీ, సంపూర్ణ శరణాగతులే మోక్షసాధనాలు అన్నది అన్నమయ్య సందేశం. ఆయన భక్తికే పెద్ద పీట వేసాడు
అన్నమయ్య భక్తి మార్గాన్నీ, సంపూర్ణశరణాగతినీ తన కీర్తనలలో ప్రస్ఫుటంగా ప్రతిపాదించాడు. శరణాగతి అత్యంత సులభమైన, ఫలదాయకమైన మోక్షమార్గం. భావములో కానీ, బాహ్యములో కానీ గోవిందుడినే తలవమని బోధించినా, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడని వక్కాణించినా, శ్రీవేంకటపతి శరణమే నిత్యౌషధమని భావించినా,  శ్రీవేంకటేశ్వరుజేరి కొలుచుటే ధావతిలేని యట్టి తన జన్మ ఫలము అని మురిసినా, ఈ సృష్టికి హరియే మూలమని ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము అన్న అన్నమయ్య అనుభవమే ప్రమాణం. సుఖదుఃఖములు దైవాధీనాలు. ఎవరూ వాటిని కోరుకోరు, మనం కోరవలసినది హరి శరణాగతి మాత్రమే. ఈ ప్రపంచము, దాని స్వభావము, మోక్షము ఇవన్నీ ఈశ్వరుడిచ్చినవే.  అన్నీ ఆ అంతర్యామి కల్పితాలు. మనం ఆసపడవలసినది కేవలం శ్రీనివాసుని దాసత్వం అని ప్రబోధం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణేతహాసాలు పరబ్రహ్మ, పరాత్పరుడు అని కొనియాడిన వేంకటపతిని కాక అన్యదైవాలను సేవించడం, ఆయన సౌందర్యాన్ని తెలుసుకోకపోవడం అజ్ఞానం, తప్పు, ద్రోహం (పాడైన యెరుకతో బంధమోక్షము లొక్క-గాడిఁ గట్టుట తెలివి గానకే కాదా).
4. జ్ఞాన బిందువు – అన్నమయ్య ఆత్మజ్ఞాని. పరతత్వం గ్రహించినవాడు.
అన్ని జీవులలోనూ ఉండే బ్రహ్మమొక్కటే, అందరిలోనూ ఉండే అంతరాత్మ పరమాత్మ అయిన ఆ శ్రీహరియే అని గ్రహించిన అన్నమయ్య ఆత్మజ్ఞాని. ఎండా-నీడా, రాత్రి-పగలు, నిద్ర, సుఖం, భూమి ఇవన్నీ రాజుకి-బంటుకి, బ్రాహ్మణుడికి -ఛండాలుడికి, జీవులకి -దేవతలకి, కుక్కకీ-ఏనుగుకి,  అందరికీ ఒకే రకంగా వర్తిస్తాయని నొక్కి వక్కాణించాడు.
॥పల్లవి॥ తందనాన భళా తందనాన
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె పరబ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే ॥తంద॥
॥చ1॥ కందువగు హీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మింతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ ॥తంద॥
॥చ6॥ కడగి యేనుఁగుమీఁదఁ గాయు యెండొకటే పుడమి శునకముమీఁదఁ బొలయు నెండొకతే కడుఁబుణ్యులను పాపకర్ములను సరిఁ గావ జడియు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే ॥తంద॥
మనజీవితం ఒక నాటకమని గ్రహించడం మోక్షం. స్వాభావికమైన చావు పుట్టుకల మధ్యకాలం, కూడు గుడ్డల సంపాదనకు పడే పాట్లు నాటకం, పాపపుణ్యాల మధ్య ఊగిసలాట నాటకం. ఈనాటకాలనుండి బయటపడాలంటే కైవల్యసాధనే దారి.  మనం ఈ ప్రపంచంలో ఉంటూ చివరికి చేరుకోవాల్సినది, మనం మంచి చెడులు అనే కర్మల బంధనాలను దాటితే కలిగె స్థితి మోక్షం. శ్రీవేంకటేశ్వరుడి ఏలికలో ఆకాశం మీదుగా ఉన్నవేంకటాద్రియే కైవల్యం. ఇదే పరతత్వము. పరమాత్మ జ్ఞానము.  
॥పల్లవి॥ నానాఁటి బదుకు నాఁటకము -కానక కన్నది కైవల్యము
॥చ1॥ పుట్టుటయు నిజము పోవుటయు నిజము - నట్టనడిమి పని నాఁటకము
యెట్టనెదుటఁ గలదీ ప్రపంచమును - కట్టఁగడపటిది కైవల్యము
॥చ3॥ తెగదు పాపమును తీరదు పుణ్యము -నగినగి కాలము నాఁటకము
యెగువనె శ్రీవేంకటేశ్వరుఁ డేలిక -గగనము మీఁదిది కైవల్యము
చివరగా చినతిరుమలయ్య చెప్పినట్లుగా-
వేదంబులు పౌరాణిక వాదంబులు వరకవిత్వ వాణీ వీణా నాదంబులు, 
కృతసుజనాహ్లాదంబులు తాళ్ళపాక అన్నమయ పదముల్