Friday, November 10, 2006

గుర్తింపు -కథ కాని వ్యధ

మనిషికి గుర్తింపు అనేది తిండి, బట్టల్లాగే ఒక కనీసావసరం. అది మన మానసికావసరమే కాకుండా, ఒక సామాజికావసరం కూడా. అందుకే మనకి గుర్తింపుకార్దులిచ్చేది. ఆ మధ్య జరిగిన ఒక పరిశోధన సారంశమేమంటే, కొన్ని కుటుంబాలని ఒకళ్ళకొకళ్ళకి సంబంధంలేకుండా వేర్వేరు ద్వీపాల్లో రాజభోగాల్లో ఉంచితే, అన్నికుటుంబాలూ కూడా ఆ జీవితం దుర్భరమన్నాయిట. ముఖ్యంగా వాళ్ళకి, వారివారి ప్రతిభనీ, వారి పిల్లల ప్రతిభనీ గుర్తించేవాళ్ళ లోటు కొట్టొచ్చినట్లు కనిపించిందట. అదీ గుర్తింపు మహిమ.


ఒక సారి, నేను ఒక లాడ్జ్ లో నా 'స్వంత' (అనుమానం లేదు) భార్యతో ఉండగా, అర్ధరాత్రి పోలీసులు సోదాకొచ్చారు. అప్పుడు నేను ఉద్యోగంలో చేరిన కొత్త రోజులు. అప్పటికి పెళ్ళాం దగ్గరే ఇంకా గుర్తింపు రాలేదు (ఆ మధ్యనే పెళ్ళి అయింది లెండి). ఆఫీస్ వాళ్ళు కూడా అప్పటికి నాకు గుర్తింపు కార్డ్ కానీ, దర్శింపు (visiting) కార్డ్ కానీ ఇవ్వలేదు. పోలీస్ వాళ్ళ తత్వం ఏదేశకాలాల్లోనైనా ఒకటే. అది - in God we trust, all others we suspect. నా అప్పటి పరిస్థితి - గుర్తింపోపద్రవం (ఐడెంటిటీ క్రైసిస్). ఇదీ గుర్తింపు మహిమే!



ఇదిలా ఉంచితే, మనందరికీ కొన్ని గుర్తింపు కార్డ్ లు త(అ)ప్పనిసరిగా ఉంటాయి. అవేంటంటే, ఆఫీస్ వాళ్ళిచ్చిన గుర్తింపు కార్డ్, బ్యాంక్ ATM card, ఏదైనా హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటే వాళ్ళ కార్డ్, లైబ్రరీ కార్డ్(1 లేక అనేకం), మాన్య ప్రభుత్వం వారిచ్చిన ఎలెక్షన్ ఓటర్ కార్డ్ (దాంట్లోవివరాలు, ఫొటో లు పోల్చగలిగితే ఒట్టు). గ్యాస్ డీలర్ ఇచ్చిన కార్డ్ (కనెక్షన్ కి ఒకటి చొప్పున), ఒకటో, పదో క్రెడిట్ కార్డ్ లు (ఫోటో సహిత లేదా రహిత) ....... ఇలా అంతులేనన్ని. ఇవి కాకుండా, PIN లూ (గుర్తింపు నంబర్లు), పాస్‍వర్డు‍లూ కూడా గుర్తింపు కొరకు ఉద్దేశించినవే. వీటిలో ఏఒక్కటి లేకపోయినా జీవితం దుర్భరమైపోతుంది.



ఇండియా లో ఉన్నప్పుడే గుర్తింపు కార్డులు చాలా అయిపోయాయనుకొంటే, కొరియా రావల్సివచ్చింది. ఇక్కడ మనుషులు తక్కువా, ఆర్భాటాలెక్కువ. నేనుండే సతిలేని వసతి గృహం (హాస్టల్ కి ఎమ్వీయెల్ ఇచ్చిన తెలుగు పదం) లోనికి రాత్రి 11 గం. ల తర్వాత కోడ్‍నంబర్ నొక్కితేనే వెళ్ళగలం. మొదటివారంలోనే నాకు ఆ అవసరం వచ్చింది. నంబరు తెలుసు కాని నాకంగారుకి దాని నిదానం మొగుడయింది. తెరుచుకోవటంలేదు. అసలే చలికాలం, తొందరగా రూమ్ లో పడదామంటే, ఈ ద్వారపు రక్షణ ప్యానెల్ నన్ను గుర్తించటం లేదే! ఎదురుగా విద్యార్ధి హాస్టల్స్ ఉంటే వాళ్ళ సహాయం అడుగుదామంటే, వాళ్ళు హాస్టల్ తలుపులు మూసుక్కూర్చున్నారు. అదీకాక వాళ్ళెవరూ నన్ను గుర్తించలేరు. వాళ్ళభాష వాళ్ళదే కాని, ఇంగ్లీష్ రాదు. నా గోల నాదే. మొత్తానికి నామేథోబలమంతా ఉపయోగించి, కొద్దిగా దేవుణ్ణి తలచుకొని లోపలపడ్డా. బ్రతుకు జీవుడా అనుకొంటూంటే, కొద్దికాలంలోనే ఆఫీసులోనూ, హాస్టల్లోనూ రక్షణ వ్యవస్థ మార్చేసి, కార్డ్ సిస్టం పెట్టేరు. దాంతో నాకు లిమ్కా బుక్కులోకి ఎక్కగలిగినన్ని కార్డులొచ్చాయి. పర్సులోనూ, జేబుల్లోనూ పెడితే ఉబ్బెత్తుగావచ్చి చూచేవాళ్ళకి ఎలాఅన్పిస్తున్దో అని భయమేసి, ఒక విజిటింగుకార్డులు పెట్టుకొనే పర్సు (holder) కొనుక్కున్నా. త్వరలోనే రెండవ సంపుటి (volume) కొనాలేమో!



ఇప్పుడు అసలైన ఇబ్బందేమిటంటే, ఎక్కడేకార్డు వాడాలో చూసుకోవాలి. లేకపోతే ఆమెషిన్ మొఖంవాచేలా చివాట్లు పెడ్తుంది. అల్లాగే, కార్డు వాడినతర్వాత, తిరిగితీసుకొని భద్రపరుచుకోవడం తీవ్రసమస్య. లేకపోతే ఐడెన్టిటీ క్రైసిస్ తప్పదు. అందులోనూ ఈమధ్య తెలివైనవాళ్ళకి తెలివెక్కువై, మనబదులు మన గుర్తింపుని వాళ్ళు వాడేసుకొంటున్నారు.


నాకు తెలుసు ఇది చదువుతూ మీలో కొందరు ఏమనుకొంటున్నారో. 'ఓ పదో, ముఫ్ఫైయో కార్డులు, ఓ నలభై నంబర్లు/పాస్‍వర్డ్‍లు రాగానే ఇంత బాధ పడాలా, మేమందరం సమర్ధించుకురావటంలేదూ, బడాయికాకపోతేనూ' అని. అంతేకదా! ఇన్ని కార్డులూ, రహస్య సంకేతాలూ సమర్ధించుకు రావటం ఒక సమస్య అయితే, ఇన్ని ఉన్నా నాకు సమయానికి ఇవేమీ అక్కరకు రాకపోవడమనేది అసలైన బాధా, వ్యధా.



నేను ఒకసారి అఫీసులో గొడుగు మర్చిపోయాను. సగం దూరం వెళ్ళాక, గుర్తొచ్చి, ఆఫీసుకి ఫోనుచేసి, వాచ్‍మేన్‍కి చెప్పా. మీరెవరు మాట్లాడుతున్నారని అడిగాడు. నేను నాపేరు, తండ్రి పేరు, PAN నంబరు, రకరకాల గుర్తులుచెప్పా. ఆఫీసులో నేను కూర్చొనే ప్లేస్ అక్షాంశ, రేఖాంశాలన్నీ చెప్పా. నేనెవరి తో తిరుగుతోంటానో, నా బాసెవరోలాంటి విషయాలు కూడా చెప్పా. అయినా ఆ వాచ్‍మేన్‍ ప్రోసెసర్ 'ID, password do not match' అనే మెస్సేజిస్తోంది. ... .... ..... చివరకి, బాగా ఆలోచించి, ఒక మాట (పాస్‍వర్డు)చెప్పా. వెంటనే, ఆవాచ్‍మేన్‍, 'సార్, మీరా? అల్లాగే సార్, మీగొడుగు జాగ్రత్త చేస్తా, సార్, రేపు తీసుకోండి సార్' అని సగౌరవంగా చెప్పాడు.


ఇంతకీ ఆ పాస్‍వర్డు ఏమిటో తెలుసా? 'ఏమయ్యా, వాచ్‍మేన్‍. నేనయ్యా. గెడ్డపాయన్ని'






ఇది మాఅబ్బాయి వేసిన నాబొమ్మ. నిజానికి, నేనింత అందంగా ఉండననుకోండి.



17 comments:

  1. హాహాహా...బాగుందండి మీ అనుభవం. :)
    ఇన్ని పాస్ వర్డ్స్ గుర్తు పెట్టుకోవడం కష్టమే...

    ReplyDelete
  2. మీ శైలి బాగుందండి. మీకు మంచి sense of humor
    వున్నట్లున్నది.

    ReplyDelete
  3. సత్యసాయి గారూ, బ్రహ్మాండం! కార్డు కష్టాలు కళ్ళక్కట్టాయి. మీ శైలీ, భాషా అలరించాయి. "దర్శింపు కార్డు", "నాకంగారుకి దాని నిదానం మొగుడయింది". "అప్పటికి పెళ్ళాం దగ్గరే ఇంకా గుర్తింపు రాలేదు", "త(అ)ప్పనిసరి"... జాబంతా ఇలాంటి రత్నాలతో తళుకులీనుతోంది. అభినందనలు!

    ReplyDelete
  4. "భావూ" మీ కథనం అద్భుతం! ఎంతో సహజంగా రాసారు...చదువుతుంటే నా గురించే రాసారా అని ఆశ్చర్యం కలిగింది (ఇలా చాలా మందికి అనిపిస్తొంది అని అనుకొంటున్నా). జీవితం కార్డులమయం...చార్డులేని కాలు కదపలేని కాలంలో వున్నాం.

    ReplyDelete
  5. kaarDulaendi kaalu kadapalaeni kaalamloe vunnaam! (civari pankti savaraNa)

    ReplyDelete
  6. mee abbaayi bomma caalaa baagaa vesaadu.meeru caalaa cakkaga rasaru.

    ReplyDelete
  7. PDA లో Roboform లాంటి Password Manager Software load చేసుకొటమే దీనికి సత్వర పరిష్కారం. నాకు 128 Passwords ఉన్నాయి. ఇవన్నీ నేను Roboform సాయం తోనే Manage చేస్తున్నాను. సత్యసాయిగారు ఇలాగే రాస్తూ ఉండండి. మీ బ్లాగు కొత్త పుంతలు తొక్కుతూ.....

    ReplyDelete
  8. మీ చొక్కా మీద ఆ కాలెండరు డిజైన్ బాగుందండి :-)

    ReplyDelete
  9. ప్రొఫెసర్ గారూ,

    మీ శైలి బాగుంది. ఇప్పుడు దక్షిణకొరియా నుంచి కూడా ఓ తెలుగు బ్లాగు...ధన్యవాదాలు.

    ReplyDelete
  10. తెలుగు మిత్రులందరికీ,
    నాకూ ఒక వెన్నుందని ఈమధ్య వెన్నుపోటు వచ్చాక డాక్టర్ ధృవీకరించాడు. ఇప్పుడు, దాన్ని తట్టి ప్రోత్సహించే సహృదయులు ఇంతమంది ఉన్నారని తెలిసాక ఆనందాశ్రువులు 'పెరిగిపోయి సంద్రమే' అయ్యాయి.
    కృతజ్ఞ్తుడ్ని

    ReplyDelete
  11. ఇలాగే దక్షిణ కొరియా అనుభవాల గురించి వ్రాయాలని కోరుకుంటున్నాను. మా ఎదురు అపార్టుమెంటు వారు కూడా అదే దేశానికి చెందిన వారు...

    ReplyDelete
  12. పన్నున్నందుకు పన్నుపోటు, వెన్నున్నందుకు వెన్నుపోటు.. అలాగే పెన్నున్నందుకు పెన్నుపోటు తప్పదు. పెన్నుపోటుకు మందు ఇలాంటి మంచి జాబులే!

    ReplyDelete
  13. బాగుందండీ.. చక్కగా పగలబడి నవ్వుకున్నా..

    ReplyDelete
  14. చాలా బాగుంది.
    ఎన్ని పాస్‌వర్డ్‌లు, కార్డు ముక్కలున్నా సహజమైన మానసిక బందాలే (ఇంతకంటె బాగా ఎలా చెప్పాలో తెలియట్లేదు) చివరికి పనికి వస్తాయని చక్కగా చెప్పారు. నేనయ్యా గడ్డపాయన్ను అని చెప్పేదాకా వాచ్‌మన్ గుర్తించలేదంటే అంతే కదా!

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  15. చరసాలగారు చక్కగా ఏది పట్టాలో దాన్ని పట్టేశారు. ఎంతైనా మనుషులం మనుషులమే, కంప్యూటర్లు కంప్యూటర్లే.

    ReplyDelete
  16. dear sai your blog is wonderful. It is enlightening and ineteesting. continue. i'm proud for all this. uncle

    ReplyDelete
  17. bangaram,

    your blog is very interesting and special. Continue it, to prove your writing skills

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.