Monday, November 20, 2006

'గుండె పగిలేంత.... ' హరికథ

పాత కాలంలో హరికథలుండేవి. ఇప్పుడు అంతగా ఉన్నట్లులేవు. హరికథ అనగానే నాకు గుర్తుకొచ్చేవారు మునికుట్ల సదాశివశాస్త్రి గారు. ఆయన చెప్పిన త్యాగరాజు హరికథ గ్రామఫోను రికార్డుగా వచ్చింది. హరికథ లో అసలుకథ మెల్లగా నడుస్తోంటుంది. కాని పిట్టకథలు కోకొల్లలుగా వస్తోఉంటాయి. ఒక్కోసారి అసలు హరిదాసుగారి అసలు కథ ఏమిటో అంతుచిక్కడం కష్టమే, ఈబ్లాగులో ఏమి వ్రాస్తున్నానో మీకు అంతుచిక్కనట్లే.

అసలుకథ:

నేను బ్లాగులు చూడడం మొదలుపెట్టి కొద్దికాలమే అయింది. నాకు కొన్ని బ్లాగులు చాల నచ్చాయి. నాగరాజా, చదువరి,రాధిక, సుధాకర్, కొండూరి, రెనారె, కామేష్.......... ఇల్లా చాలామందివి. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో శైలి, ఒక్కో వస్తువు. కొన్నికొన్ని బ్లాగుల్లోని తపాలు, కొన్ని కొన్ని జ్ఞాపకాలు బయటికి తీస్తూంటాయి. ఉదాహరణకి, రెనారె గారి బ్లాగ్ చదివినప్పుడు, నాకు శ్రీ నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గుర్తొచ్చారు.

పిట్టకథ 1:

శ్రీ నామిని సుబ్రహ్మణ్యం నాయుడు రాయలసీమ మాండలికంలో (చిత్తూరు జిల్లా) వ్రాసారు. వ్రాయడానికి పెద్దపెద్ద విషయాలే అవసరం లేదు, మనకి తెలిసిన ఏవిషయంపైనైనా వ్రాయవచ్చని తన 'పచ్చనా సాక్షిగా' (ఉదయంలో వచ్చాయి) శీర్షికతో, 'సినబ్బ కతల' (ఆంధ్రజ్యోతిలో వచ్చాయనుకొంటా) లో తనకు అనుభవమైన విషయాలే వ్రాసారు. అందరికీ తెలిసిన విషయం 'అమ్మ' కాబట్టి, దాని గురించే వ్రాస్తే పోలే అని తను వ్రాయడమే కాకుండా, బాపు, రమణ ల తోటే కాకుండా, చంద్రబాబు నాయుడు లాంటి 'రాయని భాస్కరుల' చేత కూడా వారి వారి అమ్మల గురించి రాపించి ప్రచురించిన ఘనుడూ, ధన్యుడూ, శ్రీ నామిని. తర్వాత, చిత్తూరు జిల్లాలోని ఒక రైతు ఆశ, అడియాసల కథ 'మునికన్నడి సేద్యం' నవల లో వ్రాసారు. ఆ నవల నాకు బాగా నచ్చింది. నేను వ్యవసాయ శాస్త్రంలో (బాపట్ల కాలేజీ లో M.Sc(Ag), తర్వాత, ఢిల్లీ I.A.R.I. లో ఆర్ధిక శాస్త్రంలో Ph.D.) పట్టభద్రుడ్ని. నా థీసిస్ కోసం వ్యవసాయ బావులు, చెరువుల మీద సర్వే కోసం రాయలసీమ (అనంతపురం జిల్లా) గ్రామాల్లో పర్యటించా. రైతులు నీటికోసం పడే పాట్లు, వాళ్ళ అగచాట్లు, గ్రామాల్లో ఉండే అసమానతలూ, నీళ్ళ రాజకీయాలూ/మార్కెట్లు, ఇత్యాది విషయాలపై అయనా వ్రాసారు, నేను, నాబోంట్లూ వ్రాసాము. మేము వ్రాసింది భద్రంగా బీర్వాల్లోనూ, ఆంగ్ల జర్నళ్ళలోనూ ఉంది. ఆయన వ్రాసినది జనాల గుండెల్లోకి పోయింది. విధాననిర్ణయాలు చేసేవారి చెవుల్లోకైనా పోయిందో లేదో? అదృష్టవశాత్తు, నేను ఆనవలని చదవడం నా అవగాహనికీ, వ్రాతకోతల్లోనూ చాలా ఉపయోగపడింది. ఇది పిట్టకథలో పిట్టకథ.

పిట్ట కథ 2:

నేను బ్లాగుల గురించి తెలుసుకొన్నదే ఈమధ్యనని చెప్పాను కదా. అంటే వ్రాయడం మొదలుపెట్టి ఇంకా తక్కువ రోజులే అయివుంటుంది కదా. కాని, బ్లాగ్సోదరుల ప్రోత్సాహం వల్ల నామీద నాకు నమ్మకం కలగడం మొదలుపెట్టింది. ఈ నమ్మకం అన్నది ఒక పెట్టుబడి. అది లేకుంటే ఎవరూ ఏదీ సాధించలేరు. 'నాక్కొంచెం నమ్మకమివ్వు, కొండల్ని పిండిచేస్తా' అన్న కవివాక్యం అక్షరసత్యం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండింటినించీ పెట్టుబడులొస్తే కాని అభివృద్ధి కలగనట్లే, తనమీద తనకీ, తన చుట్టూఉన్నవారికీ కూడా నమ్మకం కలిగితే కానీ ఏ వ్యక్తీ ఏమీ సాధించలేడు.


పిట్ట కథ ౩:

నామిని సిన్నబ్బ కతలు ప్రింటు చేసినప్పుడు, బాపూని ఒక్కముఖచిత్రం వేయమని కోరాడు. బాపూనే ఎందుకంటే, నామిని బాపూ అభిమానికాబట్టి. అసలు ఆయనకి అభిమాని కానివాడెవ్వడు? వేస్తాడో, వేయడో అని అనుకొంటూండగా, బాపూగారు, ముఖచిత్రమే కాకుండా, కథలకి కూడా విడివిడిగా బొమ్మలు వేసి పంపించాడు. అంతే అయితే, ఓకే. ఉత్తరంలో మీ 'వీరాభిమాని బాపు' అని సంతకం చేసాడట. అది చూసి నామిని పడిన సంబరం ఆయనే ఒక వ్యాసంలో ఆయన శైలిలోనే వ్రాసుకొన్నాడు.

అసలైన కథ:

మళ్ళీ అసలుకథకొస్తే, చాలామంది ప్రోత్సహిస్తున్నారని చెప్పా కదా. అందరికీ బ్లాగ్ముఖంగా కృతజ్ఞతలు. నేను ఈమధ్య వ్రాసిన ' బోరట్' పార్వతీశం చదివి రెనారెగారు స్పందిస్తూ, 'మీ బ్లాగునింక వదలన'న్నారు. 'ముక్కు పగిలేదాకా ముక్కుసూటిగా' చెప్పడం ఆయన పద్ధతే, కాని ఇక్కడ, ఆయన అభిమానానికి ఆనందంతో గుండె పగిలినంత పనయ్యిందని తెలుసుకోవద్దా? అప్పటి నామిని పరిస్తితే ఇప్పటి నాదీని. అయితే అక్కడ ఒక్కడే బాపు, ఇక్కడ చాలామంది.

8 comments:

  1. nenu eppudu puurtigaa vinaledandi harikadha ni.nidrocheseadi.kaani asalu kadha kanna pitta kadhale baagumtaayi naaku.ee post lo kuda pitta kadhalu super.

    ReplyDelete
  2. హరి కథలనీ
    పిట్ట కథలనీ బాగా గుర్తు చేశారు. మీరెన్ని చెప్పినా చివర్లో మీరు ఇచ్చిన ముగింపు ద్వారా మీరు చెప్పదల్చుకున్నదేమిటో అరటి పండు ఒలిచిపెట్టినంత సులభంగా అర్థమయింది. మీరు చెప్పాక నాయిని వారి 'మునికన్నడి సేద్యం' చదవాలనిపిస్తోంది.

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  3. మొన్నటిదాకా, ఎవరైనా చనిపోతే పదకొండోరోజున పిండంపెట్టిన పిదప ఆ రాత్రి హరిదాసును పిలిపించి హరికథ చెప్పించేవారు. తర్వాత ఈ స్థానంలో టీవీ వచ్చింది. ఇప్పుడు అందరిళ్లలోనూ టీవీలుండడం చేతనున్నూ, ప్రతిఒకరూ సంతత ధారావాహికా వీక్షణాబాధ్యతలను మోస్తున్నవారగుటచేతనున్నూ అదీ మాయమైంది.
    నాకు గుర్తున్న ఒకే ఒక కళాకారిణి (ఆకాశవాణి కడప ద్వారా) గరిమెళ్ల సత్యవతి.

    ఆ(చా)ర్యా, తమవంటి పెద్దలు నాబోంట్ల అభిమానానికి సంబరపడి మరీ మెచ్చుకొంటున్నారు, ధన్యోస్మి. ఈ మెచ్చుకోలు తర్వాత నేనిందుకు తగుదునా అని చిన్న భయం. రానారె "గారు" అనకండి మాస్టారు, మీతో పోలిస్తే నేనన్నివిధాలా చాలా చిన్నవాణ్ణి.

    ReplyDelete
  4. బాపు అంతటి వాడు వీరాభిమానిని అని చెప్పుకోడంతో "మొగలాయీ"గా అనిపించిందని నామిని రాసినట్లు గుర్తు.

    ReplyDelete
  5. Enduko inkaa ardham kaaledu kaanee, Mee blog, daani venuka Comments, Chadivina tarvaata...Naa kallalo neellu tirigaayi

    ReplyDelete
  6. పిట్ట కథల్ని కొట్టొచ్చినట్లు చెప్పారు మాష్టారు!
    రానారె గారన్నట్లు మీ బ్లాగును చదివాక ఎవరూ వదలరు, వదిలించుకోవాలన్న కుదరదు...కొన్ని శోధనల్ని జయించకపోవడమే మేలు...అందులో "సత్యశోధన" ఒకటి!

    ReplyDelete
  7. మీరు చెప్పే విధానము (శైలి) బాగుంటుంది.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.