క్రిందటి వారం 'కొరియా కబుర్లు' చదివి ఇస్మాయిల్ గారు పెట్టుబడి దారీ విధానం ఉన్నా భూసంస్కరణలెలా అమలుచేయగలిగారని అడిగారు. పెట్టుబడిదారీ విధానం ఆర్ధిక వ్యవస్థకి సంబంధించినది. వీరి రాజకీయవ్యవస్థ నిరంకుశ పాలనలో నడిచింది. వీళ్ళకి ప్రజాస్వామ్యం 1987 లో ఉద్యమఫలితంగా వచ్చింది. ఆపాటికే వీళ్ళు అభివృద్ధి సాధించేసారు. అందుకని భూసంస్కరణలు సులువుగా అమలుచేయగలిగారు. ఒక్క కొరియా భూసంస్కరణలు మాత్రమే బలసహాయంతో సాధించినా కూడా ప్రపంచంలోనే విజయవంతమైనవిగా నిలిచాయి. ఇది వీరి ప్రత్యేకత. అంతేకాదు. అమెరికా లాంటి దేశాల్లో పారిశ్రామికాభివృద్ధి ఫలితంగా వ్యవసాయరంగంలో భూకమతాల పరిమాణం పెరిగింది. అక్కడకూడా భారీ యంత్రాలూ, పెట్టుబడీ తయారయ్యి వ్యవసాయరంగం తీరుతెన్నులనే మార్చిపాడేసాయి. కాని కొరియాలో అప్పుడూ, ఇప్పుడూ కూడా చిన్న కమతాలే. చిన్నకారు రైతులే. ఇల్లా చెప్పుకుంటూ పోతే కొరియా చాలా విషయాల్లో ప్రపంచ అంచనాలనే తారుమారు చేసింది. మిగిలిన తూర్పు ఆసియా దేశాలు కూడా కొంతవరకూ ఇంతే. నాకనిపిస్తుందీ, ఈ మంగోలాయిడ్ తెగలోనే మహత్తుందేమోనని. కాని మన ఈశాన్యభారత రాష్ట్రాలని చూడండి. ఎన్ని డబ్బులు అటుప్రవహించినా పానకాలస్వామికి పానకంపోసినట్లే. ఎక్కడికి పోతాయో తెలియదు. కాని అందరికీ తెలుసు. బహిరంగరహస్యం. బహుశ: ఇది క్షేత్ర బీజ సంవాద పరిధిలోకి వస్తుందేమో?
వీళ్ళ విజయాలవెనుక మహత్తులేమీ లేవు. ఒక్క ఆశయసాధన పట్ల అచంచల దీక్ష తప్పించి. వీళ్ళపాలకులు మంచి అవసరమైన సమయంలో దేశంకోసమే నిర్ణయాలు తీసుకొన్నారు. అలాగే వీళ్ళ అధికారవర్గం కూడా దేశక్షేమమేదృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొన్నారు. పద్ధెనిమిది సంవత్సరాలు పాలించిన ప్రెసిడెన్ట్ పార్క్ జంగ్ హీ గ్రామీణప్రాంతాలపై కూడా సమదృష్టి పెట్టి సమతులాభివృద్ధికి కృషిచేసాడు. ఇక్కడా పాకిస్థానులో లాగే ప్రభుత్వాల్ని కూల్చారు, ఉద్యమాలు నడిచాయి, సైనిక నియంతలు పాలించారు, ఎదుర్పలికిన జనాల్ని ఏడిపించారు. కాని దేశప్రగతిని మాత్రం కుంటుపడనీయలేదు. మనకి ప్రజాస్వామ్య మోతాదు ఎక్కువైంది, పాకిస్థానుకి నియంతల మోతాదెక్కువైంది. ఇక్కడ అవే మందుగా పనిచేసాయి. ఈ ప్రజలని మెచ్చుకోవాలి కదా? వీళ్ళ ప్రగతికి నా దృష్టిలోకొన్ని ముఖ్య కారణాలున్నాయి.
౧. వీళ్లలో కుల, మత పిచ్చుల్లేవు. ఏ పనులైనా, ఎవరినా చేస్తారు. ఆడా,మగా తేడాలేకుండా. ఆడవాళ్ళే ఎక్కువ వ్యాపారవ్యవహారాలలో కన్పిస్తారు. 'యత్రనార్యంతు పూజ్యతే' అని ఘనంగా కబుర్లు చెప్పేమనం, అది బడితపూజకి మాత్రమే పరిమితం చేసినట్లున్నాము. చాలా రంగాలలో స్త్రీలు వచ్చినా, వాళ్ళపట్ల గౌరవభావన తక్కువ కనిపిస్తుంది. ఇటువేపు, ఆడవాళ్ళు మగవాళ్ళ టాయిలెట్లు కూడా శుభ్రపరచడనికి ధైర్యంగా వెళ్ళడం నన్ను ఆశ్చర్య పరిచింది. మనవైపు ఆడవాళ్ళు ఉద్యోగానికెడితే చాలామటుకు చులకనే. అల్లాగే, అందరూ అన్నిపనులూ చేయడం, చేస్తున్న పని పట్ల గౌరవం మనకీ జన్మలో వీలుపడదనుకొంటా.
౨. వీళ్లు కన్ఫూసియన్ విలువల్ని పాటిస్తారు. ఇవేమీ మనకి తెలియనివి కాదు. మన దేశంలో కూడా పాటించేవాళ్ళం. దాంతో పెద్దలంటే గౌరవం, నిజాయితీ, ఆదేశాల్ని పాటించడం, మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం లాంటివి వీళ్లు ఇప్పుడుకూడా పాటిస్తారు.
౩. వీళ్లకి తమ ఫిట్‍నెస్ పై శ్రద్ధఎక్కువ. అదీకాక, ఇక్కడ అబ్బాయిలు తప్పనిసరిగా సైన్యంలో సుమారు రెండు సంవత్సరాలు పనిచేయాలి, చివరికి దేశాధ్యక్షుడి కొడుకైనా సరే. దాంతో వీళ్లకి శారీరక దారుఢ్యం కల్గుతోంది. మనదేశంలోలాగా 30 ఏళ్ళకే ముసలివాళ్ళయిపోవటంలేదు.
౪. ఏపనైనా త్వరగా పూర్తిచేయడం, సమయపాలన వీరి సొత్తు. ఇక్కడ కట్టడాలని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కట్టించే కంపెనీ వాళ్ళు రెండేళ్ళు పట్టుతుందని అంచనా వేసిన భవనం ఆర్నెల్లు ముందుగా పూర్తిచేసి, పెద్ద బోర్డు పెట్టుకొంటారు ఈవిషయం చెబుతూ, గర్వంగా. వీళ్ళల్లో క్రిందటి తరంవారు జర్మనీకి నర్సులుగా, వియత్నాం యుద్ధానికి సైనికులుగా, దుబాయ్‍కి కట్టుబడి పనివారుగా వెళ్లారు. దుబాయ్ లో తమకి ఆదివారంకూడా పనిచేసేందుకు వీలుకల్పించమని ఉద్యమించి చరిత్ర సృష్టించారు.
వీళ్ళ భాషలో 'ఫ్పల్లి ఫ్పల్లి' అంటే 'త్వరగా, త్వరగా' అని. వీళ్ళు ఎప్పుడూ హడావిడిగా పరిగెడుతొనే ఉంటారు. అందుకే వీరిని 'ఫ్పల్లి ఫ్పల్లి' సమాజం అంటోంటారు. అందుకేగా, 30 ఏళ్లలో గంజికి కూడా గతిలేని స్థితి నుంచి, హాయిగా పాలుతాగే పరిస్థితికొచ్చారు.
mmm strange! blogger not allowing me to paste my comment after copying it from Lekhini!!
ReplyDelete--prasad
http://blog.charasala.com
అవునా చిన్న చిన్న కమతాలా మరి వ్యవసాయము ఎలా చేశ్తారో వీలుంటే మరింత వివరముగా రాయగలరని ఆశిస్తున్నాను. ఇక్కడ అమెరికాలో అన్నీ పెద్ద పెద్ద యంత్రాలు ఉపయోగించిచేస్తారు. ఈ యంత్రాలు కూడా ఎంత పెద్దవంటే 80 ఎకరాలకంటే తక్కువ భూమి ఉంటే నీటీ పారుదల యంత్రాన్ని అమర్చడము కూడా కొంచెం కష్టమే.
ReplyDeletetoo great.prati yuvakudu sainyam lo paniceyali anedi goppa vishayam.mana desam loa kuda vunte baagundunu
ReplyDeleteస్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అన్నది మనదేశంలో సాధారణంగా బస్సుల్లో రాతలవరకే పరిమితమనిపిస్తుంది. అందరూ అన్నిపనులూ చేయడం, చేస్తున్న పని పట్ల గౌరవం - ఎందుకు మనదేశంలో లేవు, కారణాలేమంటారు? 30 ఏళ్ళకే ముసలివాళ్ళయిపోవటం గురించి బాగా గుర్తుచేశారు :)
ReplyDeleteHi
ReplyDeleteYou have a good telugu blog and great info. Keep it up. I guess you tried to comment in telugu on my website. Just to let you know that my guest book is still not equipped to hadle telugu font.
Any ways thanks for stopping by my small website.
Thanks
Vamsi