Sunday, December 17, 2006

ముగ్గొలకపోసారు

దేవతలు కూడా పొరపాట్లు చేస్తోంటారు. అప్పుడెప్పుడో దేవతలు ఆకాశంలో ఒక కుండలో అమృతం తీసుకెళ్తోంటే కొన్ని చుక్కలు భూమిపై ఒలికాయట. వాటినుంచి అమరజా అనే నది పుట్టిందని గురుచరిత్రలో ఉంది. కాని ఒక విషయం. ఆర్యవ్యవహారమున 'దుష్టంబ' గ్రాహ్యంబన్నట్లుగా, దేవతలు పొరపాటు చేసినా అందమే, ఆనందమే. మా ఊళ్ళో నిన్న జరిగిన ఇలాంటి పొరపాటు గురించే ఈ రోజు బ్లాగు.

సంక్రాంతి రోజులు కదాని ఇంద్రుడు దేవతలని ముగ్గు తెమ్మన్నాడట. తెచ్చేవాళ్ళు తెస్తున్నారు. ముగ్గుపెట్టేవాళ్ళు పెడుతున్నారు. మనలాగా ఒక ఇల్లూ, ఒక వాకిలీ కాదు కదా. విశ్వమంతా పెట్టాలి కదా! ముగ్గు పెట్టే వాళ్ళు ఎన్నో యుగాలుగా, ఎంత నడుం నెప్పెట్టేలా పెడ్తున్నా, ఇంకా చుక్కలు పెట్టడమే పూర్తికాలేదు. ఇంకా ఎప్పుడు కలుపుతారో ఆ చుక్కల్ని. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కొత్త చుక్కలు పెడుతోంటే, పాత చుక్కల్ని మనూళ్ళో జులాయిగాళ్ళ లాంటి రసహీన నల్ల కన్నాలు చెరిపేస్తున్నాయిట. అయితే, ముగ్గు తెచ్చే దేవతల మీద ఇద్దరు 'సూపర్వైజర్ల' ని పెట్టాడు ఇంద్రుడు. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు. అయితే, సూర్యుడు ఓకే. కాని ఆయన దక్షిణమండలానికి ఆఫీసు పని మీద టూరుకెళ్ళాడు. చంద్రుడేమో కాపలాలో కాస్త నాసి. ఆయన చూపు ఒక పక్షం తగ్గుతూ, ఒక పక్షం పెరుగుతో ఉంటుంది. నెలలో ఒకరోజు పూర్తి గుడ్డి, ఒక రోజు మాత్రం ఆకాశమంతా కళ్ళే. ఈదృష్టిలోపానికి సాయం, తారతో ఆయన వ్యవహారం 'తారాశశాంకీయం' పుణ్యమా అని మనందరికీ తెలిసిందే కదా. దానితో పాపం ఆయనకి కాపలాకి తీరికేది? కాపలా ఇలా ఉంటే దేవతలు పని ఎంత నిఖార్సుగా ఉంటుందో చెప్పలేమా? మన ఆఫీసుల్లో బాస్ లేకపోతే ఆటవిడుపే కదా! నిన్న రాత్రి వాళ్ళు ముగ్గు తీసుకెళ్తూ ఒలకపోసేసారు. మాకెలా తెలిసిందా, అది మాఊరు మీదే కదా పడింది. ఎన్ని ముగ్గులు పెట్టినా తరగనంత ముగ్గు. కాని దేవతలే కాని మనం పెట్టలేము ఆముగ్గుతో. మనం ముట్టుకొంటే నీరైపోతుందా ముగ్గు. ఇల్లూ,వాడా, చెట్టూ, చేమా, అన్నీ ఏకమయిపోయాయి. మళ్ళీ సూర్యుడొచ్చి గదమాయిస్తే కాని వాళ్ళు ఎత్తరు. కాని ఎత్తకపొతేనే మంచిది. కాసేపు ఆ దృశ్యాన్ని చూసి ఆనందించ వచ్చు. ఇదంతా గ్యాసనుకొంటున్నారా? ఊహించాను. అందుకే ఫోటోలు తీసాను. చూడండి, నా మాట అబద్ధమైతే.
6 comments:

 1. ఓహో అదన్నమాట మ్యాటరు :)

  ReplyDelete
 2. abba..bhale vundandi.manchu kurinsindi ani enta baaga cepparu.mauurilo eppudu olakapostaro devatalu muggu?

  ReplyDelete
 3. పిండారబోసినట్లు వెన్నెల అని చదివాం.. ముగ్గొలకబోసినట్లు మంచు ani ippuDu !!
  బాగుంది.

  ReplyDelete
 4. మా బా సెప్పారు !! ఆయ్ !!

  ReplyDelete
 5. సంక్రాంతి రోజులు...ఓహ్! ధనుర్మాసం వచ్చేసింది కదా? ఈ చలిరోజుల్లో ఎన్ని వెచ్చటి గిలిగింతలో?

  నేల మీది మంచుకు, నింగిలోని చుక్కలకు ఎంతచక్కగా ముడిపెట్టారండీ! రసహీన నల్లకన్నాలు! (Black holes!!) అతికినట్లు కుదిరిన పోలికలతో, అచ్చెరువొందించే మీ పాళీవిన్యాసంతో మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా రాశారు. :)

  ReplyDelete
 6. మంచు ముగ్గు గురించి చాలా బాగా చెప్పారండి.

  ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.