Tuesday, February 06, 2007

కొరియా కబుర్లు: అతిథి దేవోభవ

అతిథి దేవోభవ అన్న్దది మన సంస్కృతి. ఈ రోజుల్లో దీన్ని మన దేశంలో ఎంత బాగా (ఘోరంగా) అమలుచేస్తున్నామో మనందరికీ తెలుసు. ఏకంగా అతిథిని దేవుడిని చేసే సంస్కృతిని అమలుచేసేస్తున్నాము. దేవుడు చాలా మంచివాడు. మనం చిన్న పండు పెట్టినా ఏమనడు. మా చిన్నప్పుడు గుళ్ళోకెళ్ళాలంటే దేవుడరటి పళ్ళు తెమ్మని పురమాయించేవాళ్ళు. అసలు దేవుడరటి పళ్ళు అంటే మనం తినలేని అతి చిన్న అరటి పళ్ళని అర్ధం. దేవుడిని ఇంచక్కా మోసం చేయవచ్చు. ఏమీ మాట్లాడలేడు. పాపం అతిథులు మాట్లాడగల్గినా ఏమీ అనలేరు.

అతిథి అంటే తిథి లేకుండా వచ్చేవాడు అని అర్ధం. అంటే వేళా పాళా లేకుండా వచ్చేవాడని అర్హం. మా చిన్నప్పుడు మా ఇంటికి చుట్టాలూ, పక్కాలూ వస్తోండేవారు. అందులో మా ఊరు తాలూకా ముఖ్యపట్టణం కావడంతో అతిథుల తాకిడి కాస్త ఎక్కువే ఉండేది. ఒకరిద్దరైతే మరీ అతిథుల్లాగే వచ్చేవారు. రాత్రి అందరి భోజనాలైపోయాక అతిథులొస్తే బొగ్గుకుంపట్లూ, కిరోసిన్ స్తౌవ్‍లతో కుస్తీ మళ్ళీమొదలయ్యేది. కాని ఇంట్లో ఆడవాళ్ళు ఈవిషయమై రాధ్ధాంతాలూ, సిధ్ధాంతాలూ చేసినట్లు మా ఎవ్వరి దృష్ఠికీ రాలేదు. అతిథులు రావడం, వాళ్ళకి సదుపాయాలు చూడడం, వాళ్ళ పడక ఏర్పాట్లలో భాగంగా మేం ఇరుక్కుని పడుకోవడం - ఇత్యాదులన్నీ సహజంగా అనిపించేవి. అందుకని ఇబ్బందన్న భావం ఎప్పుడూ కలగలేదు. పెద్దవాళ్ళు మాత్రం డబ్బుకి ఇబ్బంది పడేవారని మాకు కొద్ది కొద్దిగా అర్ధమయ్యేది. పైపెచ్చు సాంప్రదాయాలు పాటించాలని అప్పుచేసైనా సరే పండగలూ, పబ్బాలూ, పురుళ్ళూ, పుణ్యాలూ జరిపిస్తోండేవారు. మాకు అవగాహన వచ్చే వయస్సులో ఇవన్నీ ఎందుకన్న భావాలొస్తోండేవి. కాని బయటకి చెప్తే పెద్దవాళ్ళు కోప్పడేవారు. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, మనకున్నా లేకున్నా మన వాళ్ళకి కాస్తో కూస్తో మేలుచేయడం, వాళ్ళతో కలిసి పండగలూ, పబ్బాలూ జరుపుకోవడం, డబ్బు నిలవేయడం కన్నా, మన స్వంతంకోసమే ఖర్చు చేయడం కన్నా ఎక్కువ ఆనందం ఇవ్వగలవని. మనతో రక్త సంబంధం ఉన్నవాళ్ళకోసంకూడా మనం ఏమీ చేయలేకపోతే రక్తసంబంధం అన్న పదానికి విలువేమిటి? అర్జున్ సినిమాలో మహేష్‍బాబు వాళ్ళ నాన్న, అత్తయ్య వ్రాసిన ఉత్తరం చదువనుకూడా చదవలేదని తెలిసి తెగ బాధపడ్తాడు. ఆ సినిమా చూసాకా నా ఈ భావనల్లో లోపంలేదని అనిపించింది. కాని మా చిన్నప్పటికీ, ఇప్పటికీ మన ప్రాధాన్యతల్లో చాలా తేడా వచ్చింది. అప్పుడు డబ్బులుండేవి కాదు. అయినా కొంతమంది అప్పుచేసి మరీ ఆదుకొనేవారు. ఇప్పుడు మనం ఎవరికైనా సహాయంచేయాలంటే డబ్బులేమి కారణం అవట్లేదు. రామ్‍దేవ్‍ మహరాజు గారు చెప్పినట్లు ఈకాలంలో మనుష్యులకి పొట్టపెద్దదీ, గుండె చిన్నదీ అయిపొయ్యాయి.

సూక్ష్మంగా ఆలోచిస్తే, మన పాతకాలపు ఇళ్ళకుండే అరుగులూ, దీపపు గూళ్ళూ అతిథులు, బాటసారులకోసమే అని అర్ధమవుతుంది. అలాగే పాలకులు సత్రాలు కట్టించి అతిథులని ఆదరించేవారు. వేరే ఊళ్ళనుండి వచ్చిన వాళ్ళని అందరూ ఆదరించేవాళ్ళు. ఈ కాలంలో మన ఇంటికీ, ఊరుకీ, రాష్ట్రానికీ, దేశానికీ వచ్చిన వాళ్ళని ఏరకంగా ఆదరిస్తున్నామో ఒక్కసారి పరిశీలించుకొంటే మనం మన సాంప్రదాయాల్నిఎంత గౌరవిస్తున్నమో తెలిసి బాధ కల్గుతుంది.

ఈ విషయంలో కొరియా ప్రజలు, విదేశీయుల పట్ల వారు చూపే ఆదరాభిమానాలతో మమ్మల్ని ఆకట్టుకొన్నారు. మనమే కాకుండా అనేక దేశాలనుండి వచ్చిన విదేశీయులు కొరియాలో ఉంటున్నారు. ఒక అమెరికన్ నల్లజాతి మహిళ (మా సహోద్యోగురాలు) ఒక సందర్భంలో తనకి వేరే విదేశీయుల్తో కన్నా, కొరియన్ల తో ఉన్నప్పుడే ఎక్కువ భద్రతా భావం కల్గుతోందని చెప్పింది. మేము బయటికి వెళ్తే విదేశంలో ఉన్న భావంకానీ, భయం కానీ కల్గదు. ఎవ్వరూ వ్యతిరేక ప్రవర్తన చూపించలేదు. ఈ విషయంలో సోల్ లో ఉన్న వాళ్ళూ, చిన్న పల్లెల్లో ఉన్నవాళ్ళూ ఒకే రకంగా ప్రవర్తించారు. పైపెచ్చు, విదేశీయులనగానే ప్రత్యేకంగా గౌరవిస్తారు. మేము ఒక దివికెళ్ళాం. అక్కడ అన్నీ దూరాలే. భాష కూడా ఒక సమస్యే. అయినా మేము ఎవరినైనా సహాయం అడిగినదే తడవుగా, పాపం నిఘంటువులు తిరగేసి చాలా కష్టపడి మాకు దారి చెప్పడమే కాకుండా, షాపులవాళ్ళైతే ఒక చోట అయిస్ క్రీము, ఒకరైతే కమలా ఫలం మాపిల్లలకి ఇచ్చారు. ఇంకొకాయనైతే మమ్మల్ని మేం వెళ్ళాల్సిన చోట దింపేసి అక్కడ ఉన్న ఒక షాపమ్మాయితో మాపనవ్వగానే మాకోసం కాల్ టేక్సీ పిలిపించమని అప్పగింతలు పెట్టి మరీ వెళ్ళాడు. అక్కడి మ్యూజియంలూ, ఎక్జిబిషన్ల ప్రవేశ రుసుములో విదేశీయులకి 20-25 శాతం రాయితీ ఉంటుంది.

ఆన్నిటికన్నా ముఖ్యమైనది, అక్కడి టేక్సీ వాళ్ళ ప్రవర్తన. మామూలుగానే వినమ్రంగానే ఉంటారు. విదేశీయులంటే మరీనీ. మేము లగేజీతో వెళ్తే, లోపల పెట్టడం, బయటకి తీయడం వాళ్ళే. విమానాశ్రయం నడిపే లిమోసిన్ బస్సుల్లో కూడా వాళ్ళేర్పాటు చేసిన పోర్టరు లేకపోతే బస్సు డ్రైవర్ మా లగేజీ పెట్టడం, తీయడం చేసేవారు. ఎక్కడా మమ్మల్ని ఏవిషయంలోనూ ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడి ఆటో, టక్సీ వాళ్ళ ప్రవర్తన దీంతో పోల్చగలమా? ప్రీపెయిడ్ ఆటో, టాక్సీలవాళ్ళు కూడా మోసాలూ, దుష్ప్రవర్తనతో విసుగెత్తిపోతున్నాము. ఢిల్లీలో అయితే, ప్రీపెయిడ్ టాక్సీ డ్రైవరు దిగాల్సిన చోట దింపేసి, 'సార్ మీసంతోష'మంటాడు. ప్రీపెయిడ్ చార్జీ రెట్టింపు చెల్లించాకా ఇంకా సంతోషమెక్కడుంటుంది!

ఈ మధ్యన పిల్లలతో సాలార్ జంగు మ్యూజియానికెళ్ళాం. అక్కడికి విదేశీయులూ, వేరే రాష్ఠ్రాలవాళ్ళూ చాలామంది వస్తున్నారు. కానీ మ్యూజియం సాయంత్రం 5 గంటలకి మూసేస్తారు. చార్మినార్ కెళ్తే, అది కూడా 5 గంటలకే మూసేస్తారు. రెండు, మూడు రోజులకొచ్చే వాళ్ళు ఈ రకంగా ఆఫీసు సమయాలు పాటిస్తే ఏం చూడగలరు? ఇది ఇలాఉంటే, మ్యూజియం టిక్కెట్ భారతీయులకి ౧౦ రూపాయలు. విదేశీయులకి 150 రూపాయలు! అంతే కాకుండా, ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఫోటోగ్రఫీ మీద ఆంక్షలు, కెమేరాకి ప్రత్యేక రుసుములూ ఒక్క మన దేశంలోనే కనిపిస్తాయనుకొంటా. బహుశ: మన నాసిరకం, పాతకాలపు పద్దతులూ, యజమాన్యం ప్రపంచానికి తెలియకూడదనేమో?

ఒకసారి ఢిల్లీలో ఒక అమెరికన్ ఫ్రెండుతో ఒక పుస్తకాల షాపుకెళ్ళాను. పుస్తకాల షాపువాళ్ళు కొంత శాతం రాయితీ ఇస్తోండేవారు. మా ఫ్రెండు కొన్ని పుస్తకాలు కొన్నాక బిల్ వేసే సమయంలో షాపు యజమానితో 'రాయితీ యిస్తున్నారు కదా' అని గుర్తుచేసాను. అసలే విదేశీయుడికి రాయితీ ఇవ్వలేకా, మానలేకా మథనపడుతోన్న ఆ యజమాని నామీద ఒంటికాలుమీద లేచాడు. విదేశాలనుండి వచ్చిన మనవారిదగ్గరకూడా డాక్టర్లూ, బార్బర్లూ కూడా ఎక్కువ చార్జీని వసూలు చేయడం నాకు తెలుసు.

అతిథి దేవో భవ అని మన ప్రభుత్వం వారు నినాదాలిచ్చినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు. మనందరి ప్రవర్తనా మారితేనే ఏమైనా జరుగుతుంది. మనమందరమూ మన ప్రవర్తనలని నిరంతరం సరిదిద్దుకొంటూ, సాటి మనిషి సౌఖ్యానికి సాయపడగల్గి, సాదరంగా చూడగల్గే మన సాంప్రదాయాన్ని తిరిగి పాటించగల్గితేనే ఏమైనా మార్పు కల్గుతుంది.

6 comments:

 1. అదేం ఖర్మో గానీ సూక్తి మనది, పాటించేది ఇంకొకరు.
  --ప్రసాద్
  http://blog.charasala.com

  ReplyDelete
 2. మనలో మొదటి దుర్గుణం ఇంతదాన్ని కొండంత చేసి చెప్పుకోవడం. ఉదాహరణకు మన సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకోవడమేగాక ఇతరుల సంస్కృతిని కించపరిచే విధంగా మాట్లాడుకొంటుంటాం.సంస్కృతి ప్రవర్తనాధారితమని ఎన్నడు తెలుసుకొంటామో? మంచి విషయాన్ని ముందుకు తెచ్చారు.

  ReplyDelete
 3. విదేశాల్లో వున్నంత కాలం బుద్ది గా శుభత్ర పాటించే వాళ్ళు మన దేశలో అడుగుపెట్టగానే ఏదో పరాయి పాలననుండి స్వాతంత్ర్యం వచ్చినట్టు ఫీల్ అయిపోయి చెత్త ఎక్కడ పడీతే అక్కడ పారేయడం కూడా మనకే సాధ్యమేమో.

  ఇక టాక్సీ ల గొడవ తలుచుకొవడము తేళ్ళు జర్రులుతొ పాకించుకోవడమూ రెండూ ఒకటే.

  ఒక మంచి విషయాన్ని చెప్పారు.

  విహారి
  http://vihaari.blogspot.com

  ReplyDelete
 4. విదేశీయులు అనగానే మనకి ఎక్కువ డబ్బులు ఎలా రాబట్టు కోవాలనే ఆలోచనే మొదట కలుగుతుంది.మేము కేరళ వెళ్ళినప్పుడు లోకల్ లొ టాక్సి కి మా దగ్గర 150 తీసుకుంటే విదేశీయుల దగ్గర 550 తీసుకున్నారు.అలాంటి విషయాలు చూడడం అదే మొదటిసారి నాకు.చాలా ఆస్చర్య పోయాను.

  ReplyDelete
 5. సాయి గారూ...కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాలి అనిపించింది. మీతో వాదించడానికి మాత్రం కాదు.
  దేవుడి అరటిపళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. అవి చిన్నవి అని ఇవ్వడం కాదు. పెద్దవి, రుచికరంగా ఉండేవి అయిన అమృతపాణి,చక్కెరకేళి వంటి వాట్లలో కణుపులు ఉంటాయి అని, అవి నివేదన చెయ్యకూడదని ఒక సిధ్ధాంతం. అందుకే ఈ చిన్న రకం నివేదిస్తారు....అవి రుచిగానే ఉంటాయి.

  అతిథి దేవోభవ...కాదనను. కానీ మంచి తనాన్ని చేతకాని తనంగా భావించే విదేశీయులతో కొంత జాగ్రత్తగానే ఉండాలని నా అభిప్రాయం. అందులోనూ మన దేశానికున్న అనుభవాలు కూడా అలాంటివే.

  ReplyDelete
 6. అతిధి దేవో భవ అని ఎందుకొచ్చిందంటే మన పూజలలో చాలమటుకు దేవునికి ఆతిధ్యము ఇవ్వటమే..ఆహ్వానించటం, ఆసనమివ్వటం, తాగడానికి నీల్లివ్వటం, తిండి పెట్టడం, స్నానం చేయించటం వగైరా..అలా అతిధి, దేవుడు ఒకటేనని హిందూ సాంప్రదాయం..ఇది మిగిలిన మతాలకంటే ఎలా భిన్నమో చూడండి..క్రైస్తవులు దేవుని దగ్గరకి పశ్చాత్తాపపడుతున్న పాపిలాగా, ముస్లింలు నమ్మకమైన సేవకునిలా వెళతారు..హిందువులు దేవునికి అతిధిలా సపర్యలు చేస్తారు.

  ఇలా విదేశీయుల దగ్గర డబ్బులు దండుకొనే సంస్కృతి ఇంకా ఎన్నాళ్లో పనిచేయదు..పర్యటనా రంగములో కూడా అంతర్జాతీయ సంస్థలొస్తే నాణ్యమైన సేవలు తక్కువ ధరలో అందుతాయి..(దీనిలో భాగంగా ఇప్పుడు డబ్బులు దండుకొంటున్న టాక్షీవాళ్లు, గైడ్లు.. అయ్యో భారతదేశం మరోసారి విదేశీయుల చేతుల్లోకిపోతోందని గొడవ చేస్తారనుకోండి)

  ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.