Thursday, February 08, 2007

ధర్మసందేహం - హైదరాబాదు ఎవరిది?

ఈవేళ టీవీ చూస్తోంటే తెలంగాణా ఉద్యోగులనాయకుడెవరో మాట్లాడుతూ హైదరాబాదులోపనిచేస్తున్న నాన్-లోకల్ ఉద్యోగులను వెంటనే పంపించేసి తెలంగాణా వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేసాడు. నాకో ధర్మసందేహం వచ్చింది. నాకు హైదరాబాదులో ఉన్న ప్రభుత్వోద్యోగాలను వివిధ ప్రాంతాల వారికి ఏరకంగా పంచుతారో తెలియదు. ఏదైనా నిష్పత్తి ఉందా? అలాంటిదేమైనా ఉంటే నాయకుల డిమాండు 'అధికంగా ఉన్న నాన్-లోకల్స్' ను పంపేయండి అని కదా ఉండాలి. అలా కాని పక్షంలో చాలా అపార్థాలకి, అనర్ధాలకీ దాయితీయవా ఇలాంటి డిమాండులు? సదరు నాయకుడు 'హైదరాబాదు ను తెలంగాణా నుండి విడదీసే ప్రయత్నాలను సహించమని' కూడా అన్నాడు. దీన్ని బట్టి నాకు అర్ధమయిందేమిటంటే, ఆ నాయకుడు మొత్తం నాన్-లోకల్స్ని బయటికి పంపాలనే ఉద్దేశ్యంలోనే ఉన్నాడని. ఇక్కడ రెండు విషయాలలో తెలంగాణా నాయకుల ధోరణి నాకు అసమంజసం అనిపిస్తోంది. ౧. కష్టమో, నష్టమో అ న్నిప్రాంతాల వాళ్ళం ఇప్పటిదాకా కలిసే ఉన్నాము. కలిసే ముఖ్యపట్టణాన్ని అభివృద్ధి చేసాము. ఉమ్మడికుటుంబాల్లో లాగానే ఏ ప్రాంతాలవాళ్ళు ఎంత చేసారో చెప్పడం, ఎవరు ఎక్కువ చేసారో విశ్లేషించడం అనవసరం, అధర్మం. ఉమ్మడి కుటుంబం విడిపోయినప్పుడు ఆ సమయంలో ఉన్న ఉమ్మడి ఆస్తులని పంచుకోవడం రివాజు. కాని హైదరాబాదు ఉమ్మడి ఆస్తికాదన్నట్లుగా తెలంగాణా వాదులు మాట్లాడడం ఎక్కడి న్యాయమో తెలియదు. ౨. విడిపోదల్చుకొన్న వాళ్ళు కాస్త డిగ్నిటీ గా విడిపోతే చరిత్రలో మన వేర్పాటు కాస్త గౌరవంగా వ్రాయబడుతుంది. అలాకాకుండా అనవసర ఆరోపణలూ, అభియోగాలూ చేసి వేరే ప్రాంతపు తెలుగు వాళ్ళు మోసగాళ్ళు, వంచకులూ అంటూ ప్రజలమధ్య ద్వేషం రగల్చడం ఎంతవరకూ న్యాయం? తెలుగువాళ్ళు, తమలో తామే ఇలా కొట్లాడుకొంటూంటే మిగిలినా వారూ నేర్చుకోంటారు. బొంబాయి నాయకులు 'అమ్చీ ముంబై' అని లేవనెత్తి ఎంత అసహనం రగిల్చారో తెలియదా? బీహారు నుండి రైల్వే ఉద్యోగాలకోసం వచ్చిన అభ్యర్ధులని తన్ని ఊళ్ళోకి ప్రవేశించనీయలేదు. మన దేశం, మనదేశం అని చంకలు గుద్దుకోవడమే కానీ నిజంగా ఇన్ని ముక్కలు చేసుకోంటూంటే ఇంకా భారతదేశం అనే కాన్సెప్ట్ ఏమైనా మిగిలిందా? ఆంధ్రా నుంచి చదువుకో, ఉద్యోగానికో వెడితే ఢిల్లీ (వేరే ప్రాంతం వాళ్ళు) వాళ్ళు ఏడుస్తారు. శ్రీకాకుళం నుండి మన ఉమ్మడి రాజధానికొస్తేనే సహించలేకపోతున్నామే, ఇంక ఢిల్లీ వాళ్ళు సహిస్తారా? ఇల్లా ప్రాంతీయ తత్వంతో కుంచించుకు పోతూంటే, ప్రపంచీకరణ కి అర్ధమేమిటి? విదేశీయులొస్తారు, పెట్టుబడులు పెడ్తారు, మన ఆర్ధిక వ్యవస్థని చేజిక్కించుకోంటారు. మనం మాత్రం, కులమనో, ప్రాంతమనో, కొట్టుకొందాం. . మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు మనని కబళించిన నాటి పరిస్తితులని సంతోషంగా కల్పిద్దాం. ఎలాగూ మనకి బానిస మనస్తత్వం పోలేదు కదా. ఎక్కువ కష్టపడఖ్ఖర్లేదు. విదేశీయుడు బాగుపడినా పర్వాలేదు మన శత్రు కులం వాడో, ప్రాంతం వాడో బాగుపడలేదు, హమ్మయ్య అని సంబరపడిపోదాం.

తమసోమా జ్యోతిర్గమయ

2 comments:

  1. ఎక్కడి నుంచో కోక్, పెప్సీ లు వచ్చి మన రక్తం పీల్చేసి ఎరువుల మందులు తయారు చేసినా పర్వాలేదు.ప్రతి రోజూ తాగేస్తాం.కానీ తోటి తెలుగోడు బాగుపడిపోకూడదు. అసలు ఏ ప్రాంతానికయినా ఒకరు ప్రాంతీయులు అనేటప్పుడు సాపేక్షత అడ్డు వస్తుంది. నిజాం కాలంలో హైదరాబాదులో తెలుగు మాట్లాడే వారు ఎవరు? అప్పుడు హైదరాబాదు ఎలా ఉండేది? కె.సి.ఆర్ ఈ మధ్య చాలా హాస్యాస్పదమైన మాటలన్నారు. చార్మినార్ వీళ్ళు కట్టిండ్రా ! అసెంబ్లీ హాలు వీళ్ళు కట్టిండ్రా అని. అసలు ఈ "వీళ్ళు" ఎవరు? యావత్తాంధ్ర ప్రదేశ్ జనాభా కట్టిన పన్నులుతోనే ఈ రాష్ట్రంలో మెట్రోలు అభివృద్ధి చేస్తున్నారు. ఇంత మాట్లాడె వారు ఒక్క సారి చార్మినార్, గోల్కొండ దుస్ఠుతి చూస్తే మంచిది. మన వారసత్వ సంపద మీద మనకు ఎంత ప్రేమో తెలుస్తుంది. రోడ్డు జంక్షన్ లో ఉన్న పెద్దమ్మ గుడి మీద ఉన్న ప్రేమ అద్భుత వారసత్వ కట్టడాలపై ఉంటే ఎంతో బాగుండును.

    ReplyDelete
  2. ఈ మూర్కుల మాటలు పట్టించుకోనవసరం లేదు

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.