మనకి కొరియన్లు, చైనావాళ్ళు, జపాను వాళ్ళు, ఇతర తూర్పు ఆసియా దేశస్థులు ఒక్కలాగే అనిపిస్తారు. మనకి చైనా వాళ్ళనగానే వానపాములు, పాములతో సహా ఏజీవినైనా తినేసేవాళ్ళే కనిపిస్తారు. అలాగే మిగిలిన దేశాలవాళ్ళు కూడా. కానీ, కొరియన్ల ఆహారపుటలవాట్లు చూడసొంపుగానే ఉంటాయి, ఒక్క బ్రతికి ఉన్న ఆక్టోపస్ ని తినడం తప్పించి. మానవ పిండాల్నీ, అప్పుడే కొబ్బరి బొండాం చెక్కినట్లు చెక్కిన కోతి తలలోంచి మెదడునీ పచ్చిగా జుర్రే చైనావాళ్ళ తోటి, ఇంకో రెండు రోజుల్లో పిల్లవచ్చే అవకాశం ఉన్నకోడి గుడ్డుని వేడి పెనంమీద పగలగొట్టి, ఆ పిల్ల ప్రాణంకోసం పరిగెడుతూ,పరిగెడుతూ ఆమ్లెట్టయిపోతే, ఆపరుగులాటవల్లే అంతటేస్టనుకంటూ, లొట్టలేసుకంటూ తినే కాంబోడియన్లతోనూ అయితే వీళ్ళకి పోలికే లేదు.
వీళ్ళు సాథారణంగా ఎక్కువ సార్లు హోటలులోనే తినేస్తారు. ఇంట్లో చేసుకుని తినడం ఒకరకంగా శ్రమతో కూడిన వ్యవహారం. వీళ్ళు తినే ముఖ్య పదార్ధం (మెయిన్ డిష్) కన్నా ఇతర పదార్దాలు లెఖ్ఖకు మించి ఉంటాయి. మరి ఇంట్లో ఇన్ని ఏర్పాట్లు చేసి ఆనక అన్ని చిప్పలూ కడుక్కోవాలంటే ఒళ్ళు హూనమౌతుంది. వీళ్ళు పార్టీ చేసుకొన్నప్పుడు చూడాలి, కనీసం 50 రకాల పదార్ధాలు బల్ల మీదకొస్తాయి. వీళ్ళు పార్టీ ప్రియులు. రోజూ మందు (సోజూ) ఉండాల్సిందే.
వీళ్ళ సైడ్ డిష్ లలో అతి ముఖ్యమయినది కిమ్చీ. ఇది మన ఊరగాయ లాంటిది. ఎటొచ్చీ వాళ్ళు దానిలో వెనిగర్ వేసి పులియబెడ్తారు. కిమ్చీ వాళ్ళ సంస్కృతిలో ఒక భాగం. చలికాలం ముందు దీన్ని తయారుచేసుకొంటారు. దీనికోసం పెద్ద జాడీలు ఉంటాయి. ప్రపంచంలో 10 ఉత్తమ ఆరోగ్యకరమైన ఆహారాల్లో కిమ్చీది 5వ స్థానం. మన దేశంనుండి అపరాలు (పప్పుధాన్యాలు) ఈ పదిలో ఉన్నాయి. కిమ్చీని కేబేజ్,ముల్లంగి, కీరా కాయలు, కొన్ని ఆకుకూరలతోటి చేస్తారు. ఎండు మిర్చి కారం ముఖ్యపదార్ధం. కారం ఎక్కువగానే వాడతారు. కిమ్చీకోసం ఒక పరిశోధనా సంస్థ కూడా ఉంది. దాని వల్ల వచ్చే ప్రయోజనాలగురించి టీవీ కార్యక్రమాల్లో కూడాతెగ చెప్తోంటారు. ఫోటో తీసేవాళ్ళు say cheese అన్నట్లు, వీళ్ళు 'కిమ్చీ' అంటారు.
కిమ్చీకి వీళ్ళిచ్చే ప్రాముఖ్యత చూస్తే, నాకైతే మన ఊరగాయలు గుర్తొచ్చి చాలా బాధవేస్తుంది. ఊరగాయలు మన తెలుగు సంస్కృతికి చిహ్నాలు. మా చిన్నప్పుడు ఊరగాయల కాలం ఒక పండగలాగా ఉండేది. అది ఒక సశాస్త్రీయ ప్రక్రియ. కారం, ఆవుపిండి కొట్టించడం, మాగాయ ముక్కలు ఎండబెట్టడం, ఒకటేమిటి, ఎన్నెన్నో పనులు-పిల్లలకీ, పెద్దలకీ కూడా- ఉంటోండేవి. మనకే కాకుండా చుట్టాలకీ, పక్కాలకీ కూడా పెట్టాల్సి వచ్చేది. మాయింట్లో కనీసం 400 కాయల ఆవకాయ పెట్టేవాళ్ళం. మాగాయ, తొక్కుడుపచ్చడి లాంటివి సరే సరి. అలాంటిది, క్రిందటేడు నాభార్య ఈఏడాది మనింట్లో ఊరగాయలు పెట్టలేదు అని చెప్పగానే నాకు కల్గిన కల్చురల్ షాక్ అంతా ఇంతా కాదు. అసలు మన ఊరగాయ సంస్కృతి అధోపాతాళానికి జేరుకోవడానికి కారణం విదేశీయులు చెప్పినదే వేదమని మనమీదరుద్దే మన డాక్టర్లు (ఇస్మైల్ గారూ, కాసేపు ఫేసు అటు టర్నింగవ్వండి). ఈవిదేశీయులకి మన ఊరగాయ సొగసేమి తెలుస్తుంది చెప్పండి. వాళ్ళు తింటే అంతే సంగతులు. కానీ మనం తినక పోతే 'కన్నతల్లిని దూషించినంత పాపం, ద్వేషించినంత నేరం' కాదా? కొరివి కారం తినలేని గుంటూరు వాడ్ని, ఆంధ్రమాత అంటే తెలియని తెలుగు వాడ్ని మనం కనీసం ఊహించగలమా? డాక్టరు దగ్గరకి ఏసమస్యతో వెళ్ళినా సరే మొదట చెప్పేది ఊరగాయలు మానెయ్యమనే. వాళ్ళిచ్చే మందులవల్ల చెడు ఫలితాలంటాయని తెలసీ టన్నులకొద్దీ మనచేత మింగిస్తూ, ఎటువంటి శాస్త్రీయాధారమూ లేకపోయినా అభం శుభం తెలియని మన వారసత్వాన్ని అన్ని ఆరోగ్యసమస్యలకీ మూలమనడం వింటే కడుపు మంట రాదా? ఇది ఎవరైనా డాక్టరు వింటే ఊరగాయలవల్లే ఈ మంట అనగలడు.
వీళ్ళ ఆహారపుటలవాట్లు చూస్తే, మనం వాడే చాలా దినుసులు వీళ్ళు కూడా వాడటం విశేషం. అల్లం, వెల్లుల్లి వాడకం విపరీతం. దాల్చినచెక్క, జాపత్రి, ఎండుకారం మామూలే. మనం గొప్పలకి పోయి హీనమనుకొనే రాగులు, జొన్నలు, ఇతర తృణధాన్యాలూ ఇక్కడ విలువైనవి, అన్ని కొట్లలోనూ దొరికేవీని. వింతేమిటంటే, ఇక్కడ దొరికే కూరల్లో మూడైతే, రూపలావణ్యాలకి కాక, రుచిలో మన
బీర, ఆనప, దోస కాయలని సరిపోలతాయి. గుమ్మడి కాయలు అచ్చం మనవైపు దొరికేవే. అన్నిటికన్నా చెప్పాల్సినది, వీళ్ళు కూడా మనలాగే బియ్యం తినడం. కాకపోతే, ఈబియ్యంతో వండితే అన్నం ముద్దగా అయ్యి, అంటుకొంటుంది (జపానికా రకాలు). పదునుగా వండితే బాగానే ఉంటుంది. కానీ, చాలా రుచిగా ఉంటుంది. నేనైతే పూర్తిగా ఇక్కడి బియ్యమే వాడతా. అన్నట్లు చెప్పడం మరచా, వీళ్ళ అంగళ్ళలో కూడా మిరపకాయ బజ్జీలు దొరుకుతాయి.
ఈపాటికి చాలామందికి అనపించి ఉండచ్చు, మన దేశం నుండి ఈదేశానికి చాలా తిండి పదార్ధాలు ఎగుమతి చేయవచ్చు కదా అని. అవును. చాలా వస్తువుల ధరలు మనదేశంకన్నా 6-10 రెట్లుండచ్చు. కానీ వీళ్ళకి నాణ్యత కావాలి. పాతకాలంలో ఒకసారి కిమ్చీ కోసం ఎండుమిర్చి, వేరే దిక్కులేక ఇండియానుంచి దిగుమతి చేసుకొన్నారట. దెబ్బతో మనసరుకంటే ఇప్పటికీ భయం పోలేదంటారు. మన దేశం వాళ్ళు చాలామందే ఉన్నా కూడా, మనం పాకిస్తాన్, బాంగ్లాదేశ్ ల పాటికూడా వ్యాపారం చేయలేకపోవడం శోచనీయం.
మీ టపా వివరణాత్మకంగా బావుంది - మధ్యలో మన ఊరగాయల్ని తల్చుకుని ఆవేశంలో కొంచెం పక్కదారి పట్టారు గానీ. నా అమెరికా జీవితంలో ఒకానొక సుగుణం అనేక ప్రపంచ దేశాల రుచులు ఇక్కడే చూడగలగటం. అఫ్కోర్సు, అమెరికన్ల నాలికలకి అనుగుణంగా కొంత మార్పు ఉంటుందనుకోండి. నేను చాన్నాళ్ళు నివసించిన ఏనార్బర్ నగరంలో మంచి కొరియన్ వంటలు తిన్నాను. తిండి పదార్థాల నాణ్యత విషయంలో వీళ్ళది భల్లూకప్పట్టు అని ఈ మధ్యనే రేడియోలో విన్నాను. Mad cow disease వచ్చి పోయిన తరువాత అమెరికను గొడ్డు మాంసం ప్రపంచమంతటా మళ్ళీ అమ్ముడవుతున్నా కొరియా మాత్రం అనుమతించలేదట ఇంకా!
ReplyDeleteమీకు ఇక్కడి ఆహారపు విషయాల గురించి అంత వివరం గా ఎలా తెలుస్తున్నాయండి.ఏమి తింటారో చెప్పడం వేరు..ఎలా చేసుకుని తింటారో చెప్పడం వేరు.చాలా పరిసోధనే చేసి వుంటారు.ఇంత వివరం గా టపాలు అందిస్తున్నందుకు థాంక్స్.అన్నట్టు అడగడం మరిచా అక్కడ వంటకు ఏ నూనె వాడతారు?
ReplyDeleteఊరగాయలు మన తెలుగు సంస్కృతికి చిహ్నాలు అయితే, పిజ్జా బర్గర్లు మన విదేశి నాగరికతకి చిహ్నాలు. మన సంస్కృతికిని అటకేక్కించి, పరాయి నాగరికతకిని భుజాలకేత్తుకున్నాము. ఇక మనకుమిగిలింది nostalgia మాత్రమే. ప్చ్!
ReplyDeleteతిండి గురించి కాదు కానీ నాకు చైనా, జపాన్, కొరియా, అన్ని దేశాల వారూ ఒకే లా కనిపిస్తారు.
ReplyDeleteవాళ్ళ తిండీ తిప్పల విశేషాలు బాగున్నాయి.
మీరు వంట వడుతారా ? అదేంటో నండీ అందరికీ వంటొచ్చు నాకు మాత్రం నేర్చుకోవాలనే కోరికే కలగదు ఎందుకో.
సిడ్నీకి వచ్చిన కొత్తలో నేనొక కొరియన్ తో పనిచేయాల్సి వచ్చింది. వాళ్ళకి fishing చాలా ఇష్టం ,నా కష్టమంతా తనకి దగ్గరగా వుండి మాట్లాటడం.
ReplyDeleteఅతను పచ్చిచేప తిని వచ్చేవాడు brush చేసుకొనే అలవాటు కూడ లేదట.. ఎప్పుడు మూడు అడుగుల దూరం వుంటే గాని తనతో మాట్లాడటం కష్టమయ్యేది.
కోతి తల కొబ్బరిబోండాంలా చెక్కి మెదడు తినడం, బతికివున్న చేపల పులుసు తింటుంటే ఒక్కోసారి నోట్లోంచికూడా ఆ చేపపిల్లలు ఎగిరి దూకడం గురించి ఇంతకు ముందు నాకు తెలిసిన ఓ తమిళ ప్రొఫెసరు చెబుతూంటే ఆయన్ని అనుమానంగా చూశాను. అయితే చైనీయుల ఇలాంటి తిండి నిజమేనంటారా?
ReplyDeleteకడుపులో దేవుతోంది!
--ప్రసాద్
http://blog.charasala.com