Sunday, February 10, 2008

ఏ నరునకు విత్తముగల దానరుడు....

ఈ టపా ఎప్పుడో మొదలు పెట్టా. ఈలోపే వేరే బ్లాగర్ అదే విషయం మీద రాయడం వల్ల పెట్టెలో పెట్టా. ఈవేళ ఓ టీవీ ప్రకటన వినగానే మీఅందరితో నా ఆనందం (??) పంచుకోవాలనిపించి రాసినదీ టపా. ఏంటీ టీవీ సంభాషణల్లా నాన్పుడేమిటీ అంటారా? ఈవార్త టీవీకి సంబంధించిందే.

ఆల్రౌండరు సుమన్ ఓసీరియల్లో ఒక విలక్షణమైన అతిధి పాత్రలో నటించబోతున్నారట.

ఆయన ఇప్పటికే ఒక టెలీసీరియల్లో కృష్ణుడిగా నటించి సంచలనం సృష్టించాడని కూడా సదరు ప్రకటనల్లో హోరెత్తించేసారు. మీరు ఈప్రకటన ఇప్పటిదాకా వినక పోతే నిరాశపడకండి. ఈటీవీలో కార్యక్రమాలని ఈప్రకటనకి షార్ట్ బ్రేకులుగా వేస్తున్నారు. మిస్సయ్యే ఛాన్సు లేదు.

ఈయన గురించి ఆంధ్రదేశంలో తెలియని వారుండరు. ఈయనకి లేని కళ లేదు. ఆయన సీరియళ్ళలో ఈయన పేరు పైన అన్నీ ఉండేవి- రచన, బొమ్మలు, పాటలు, మాటలు, దర్శకత్వం, సంగీత దర్శకత్వం ....వగైరాలు. ఇప్పుడు నటన కూడా కలుస్తుంది. ఆనక ప్రేక్షకుడు అని కూడా కలిసి ఆయన ప్రతిభ ఆయనే చూసుకుని మురిసిపోయే రోజొస్తుందని దీవిద్దాం.

సుమన్ ఒక సంచలనం (sic). హీ ఈజే ఫినామినాన్. కాకపోతే ఆయనమీద ఇంతమంది బ్లాగర్లు టపాలు రాసేంత స్పూర్తి పొందగలరా? ఈమధ్య వచ్చిన చావా కవితలో మీ బ్లాగునకు మీరే సు మన్! ఆయన పేరు ప్రతిధ్వనించింది.

అభిరామ్ .. అంతా సుమన్ మయం…

సోది - ఓ జోకు ఈటీవీ-సుమన్ నందు ఓ ప్రకటన

నాలోనేను - విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నట సామ్రాట్, నట రత్న(మెగా స్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, రెబెల్ స్టార్, రైజింగ్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్..!) సుమన్

చదువరి - నా గోడు

ఇవి కొన్ని మచ్చు తునకలు.

మీకో అనుమానం రావచ్చు- పేరొందిన వారందరూ కాస్తో కూస్తో చిన్న వయసునుండీ ప్రతిభ చూపించుకున్న వాళ్లే. అకస్మాత్తుగా బహుముఖ ప్రజ్ఞావంతులయిపోవడం అరుదు. కానీ దీనికి సమాధానం భర్తృహరి తన అర్ధ పద్ధతి లో ఎప్పుడో సెలవిచ్చాడు.

యస్యాస్తి విత్తం స నరః కులీన స పణ్డితస్య శృతవాన్ గుణఙ్ఞః స

ఏవ వక్తా స చ దర్శనీయః సర్వేగుణాః కాఞ్చనమాశ్రయన్తి

దీనిని తెలుగులో ఏనుగు లక్ష్మణకవి ఇలా చెప్పాడు.

ఏ నరునకు విత్తముగల
దానరుడు కులీనుడధికుడార్యుడతండే
ధీనిధి ధన్యుడు నేర్పరి
నానాగుణగణము కాంచనంబున నిలుచున్

తాత్పర్యం:
ఎవరికి ధనముగలదో వాడే గొప్పకులమువాడు, గొప్పవాడు, బుద్ధిశాలి, కృతార్థుడు, నిపుణుడు కాన అన్ని గుణములును బంగారము (డబ్బు అనచ్చు) నందే నిలచియున్నవి.

ఏంటీ కాళిదాసు సడెన్గా మహాకవయిపోలేదా అంటారా?

అలా అయితే ఓకే.

5 comments:

  1. అతికినట్టుగా సరిపోయే అర్ధవంతమైన పద్యంతో చాలా చక్కగా సెలవిచ్చారు. అభినందనలు.

    ముఖ్యంగా ఈ టపాలో నాకు బాగా నచ్చిన విషయం ... మీరు చెప్పాలి అనుకున్న నాలుగు ముక్కలు చెప్పి ఊరుకోకుండా అదే విషయానికి సంబంధించి ఇంతకు ముందు వచ్చియున్న టపాలను పరిచయం చేయటం, పాతవై/మరుగున పడిపోయిన వాటికి మరొక్కసారి వెలుగులోకి తీసుకు వచ్చిన మీ ప్రయత్నం/కష్టం బహుధా ప్రశంసనీయం...అందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు మరియు మరొక్కసారి అభినందనలు.

    ReplyDelete
  2. సుమన్ నటుడైతే, మరి భటుడు ప్రభాకర్ దర్శకత్వం దగ్గర్లోనే ఉండిఉంటుంది... అప్పుడు గానీ రోగం కుదరదు, వాళ్ళకీ, మనకీ. అయినా ఈటీవీ కిప్పుడంత సీన్లేదనుకుంటా. మా ఇంటికి ఆ మధ్యేదో కార్యక్రమం చూస్తున్నారా అంటే, ఈటీవీ చూడట్లేదన్నారు. చాలా ఆశ్చర్యమేసింది.

    ReplyDelete
  3. సూపరు. మొత్తనికి ఎకానమిక్సు మేస్టారిననిపించారు.
    నేనుకూడా ఒకేకనామిక్సు పాఠం చెబుతా ..
    గంగి గోవు పాలు గరిటెడైనను చాలు ..

    ReplyDelete
  4. ఈటీవీలో కార్యక్రమాలని ఈప్రకటనకి షార్ట్ బ్రేకులుగా వేస్తున్నారు.

    హహహ...

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.