Wednesday, February 20, 2008

ఈమధ్య నాకు బాగా తెలుగు చేసింది

ఇదేంటి తెలుగు చేయడమేంటి అనుకుంటున్నారా? ఈ మధ్య జలుబు చేసినట్లే తెలుగు చేసింది. జలుబు లక్షణాలు మనందరికీ తెలుసు. ముక్కులోంచి నీరుకారడం, తుమ్ములు... ఇలాంటివి. కానీ తెలుగు చేస్తే వ్యాధి లక్షణాలు మనని కలిసిన వాళ్ళలో కనిపిస్తాయి. వ్యాధి లక్షణాల తీవ్రత ఆయా వ్యక్తులు మనతో ఎంతసేపు మాట్లాడారు, ఎంత మొహమాటస్తులు అనే వాటికి అనులోమానుపాతంలో ఉంటుంది. అలాగే వారికీ మనకీ ఉన్న సంబంధబాంధవ్యాలని బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకి మనం వాళ్ళకి అప్పున్నా లేక వాళ్ళు మనకి అప్పున్నా వాళ్ళు మన మాటని అంత నిష్కర్షగా తోసిపాడేయలేరు. అయినా నాపిచ్చిగానీ ఈమధ్య ఎవరూ ఎవరిదగ్గరా అప్పులు ఇచ్చిపుచ్చుకోవట్లేదు. ఏవన్నాఅవసరపడితే బ్యాంకుల్లోనో, అప్పుచీటీ (క్రెడిట్ కార్డు) ఉపయోగించో డబ్బులు తీసుకోవడం పరిపాటైపోయింది. ఈ పద్ధతిలో అయితే అప్పు ఎగ్గొట్టే సౌకర్యంకూడా ఉంది కదా.

కానీ వ్యాధి దశ, కారకాన్ని బట్టి మనలో కూడా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి లక్షణాలలో కొన్నిఏమిటంటే - 1) ఎవరైనా పెల్లి, మల్లీ, బర్త, బార్య ఇలా వత్తుల్లేకుండా మాట్లాడుతుంటే కడుపులో కెలికినట్లుండడం, ఎక్కడో కాలినట్లు మండడం, 2) కూడలిలో తప్పిపోయి ముఖ్యమైన తేదీలని, పనులని మర్చిపోవడం, 3) ఏం చేసినా, రాసినా తెలుగులో చేయాలనిపించడం, 4) పిల్లలని తెలుగులో చదువు, రాయి అని సతాయించి వాళ్లు అలాచేయకపోతే ఎసిడిటీ తెచ్చుకోవడం, 5) బ్లాగులో టపా రాసేయగానే హిట్లు లెక్కెట్టుకోవడం, ఉండొచ్చు. ఇతర రకాలైన లక్షణాలు కూడా కనిపించే అవకాశం లేకపోలేదు.

ఇంతకీ నాకు తెలుగు చేయడం విషయానికొస్తే, ఆఫీస్ ఎవరైనా నా సీటుకొస్తే మటాష్. ఏదో అడుగుతారు, సంభాషణ ఎటునుంచి ఎటో పోయి చివరికి తెలుగు దగ్గరకి వస్తుంది. వెంటనే ఆవు వ్యాసం మూసలో నా ధోరణిలోకి వచ్చేసి తెలుగుభాష, ఇంటర్నెట్ లో తెలుగు, గూగుల్లో తెలుగు, కంప్యూటర్ నిపుణులు, ఔత్సాహికులు ఇంటర్నెట్ లో తెలుగుని ఎంతగా వ్యాప్తి చేస్తున్నారు, కూడలి, కంప్యూటర్ లో తెలుగు రాయడం వంటి విషయాల విషయాలపై సైద్ధాంతిక చర్చ, ఆవెంటనే ఓ డెమో చకచక జరిగపోతాయి. మొత్తానికి ఓ ఇన్సూరెన్స్ ఏజెంటు లాగా అయిపోయా. ఈమధ్య ఇంటర్నెట్టులో తెలుగు వెలుగులు అని వ్యాసంవచ్చిన ఈనాడు ఆదివారం పుస్తకం నాబ్యాగులో ముఖ్యభాగం అయిపోయింది అని వేరే చెప్పఖ్ఖర్లేదనుకుంటా. ఆమధ్య నాదగ్గరకి ఒక కుర్రాడొచ్చాడు. సంగీతం నేర్చకున్నాడట, సంస్కృతంలో రిసెర్చ్ చేస్తున్నాడట. పాపం తను వేరే పని మీదొస్తే, అది అవ్వదని ఒక్కముక్కలో తేల్చేసి ఓ అరగంట తెలుగుగురించీ, బ్లాగులగురించీ అతనుబ్లాగు చేయాల్సిన అవసరం గురించీ నొక్కి వక్కాణించేసా. పైగా మీరేదో పని మీదొస్తే మీ టైం తినేస్తున్నానా అని సన్నాయినొక్కులు కూడా నొక్కా. మా అన్నయ్య కూతురు తన చిన్నప్పుడు (3 ఏళ్ళ లోపు వయస్సులో) ఎడతెరిపిలేకుండా బాగా కబుర్లు చెప్పేది. ఒకసారి అలాంటి ఘట్టంలో బాబయ్యా, నేనిలా మాట్లాడుతుంటే నీకు నోరునొప్పెడుతోందా (తల నెప్పెడుతోందా అని భావం) అని అడిగింది. నేను పైన చెప్పినట్లుగా సన్నాయినొక్కులు నొక్కుతున్నప్పుడు ఆఅమ్మాయి డైలాగే గుర్తొచ్చి నవ్వొస్తుంది.

నాకు తెలుగు పట్టిన లక్షణాలు మీలో పొడచూపక ముందే ఓ రెండు ముక్కలు చెప్పిముగిస్తా. రెండు ముక్కలంటే మా చిన్నప్పటి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాలు గుర్తొస్తాడు. ఆయన ఉపన్యాస ప్రియుడు. అన్ని సభల్లోనూ ఆయన మాట్లాడవలసినదే. పాపం ఆయన ఎప్పుడూ రెండుముక్కలు చెప్పి ముగిస్తా అని మొదలెట్టి మధ్యమధ్యలో ఆమాటకి పునరంకితమవుతూ అవుతూ ఓగంట పైగా మాట్లాడి మాబుర్రకాయల్ని వేయి ముక్కలు చేసేవాడు. నేనలా చెయనని నా హామీ.

మొదటిముక్క. ఈమధ్య వెనుకబడిన జిల్లాలకి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోమని పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ కొన్ని నిధులిచ్చింది. సాయం చేయమని కొన్ని జిల్లాలబాధ్యత మాకప్పగించింది. అలాంటి జిల్లాల్లో కరీంనగరొకటి. ఈమధ్య జరిగిన సమావేశంలో నేనొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (తెలుగులో ఏమంటారో) తెలుగులో తయారు చేసా. ఎవరైనా సరదా పడితే ఈక్రింది లంకె ద్వారా చూడొచ్చు.
సహస్రాబ్ది లక్ష్యాల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ప్రణాళిక
బలే సంతృప్తిగా అనిపించింది. చివర ధేంక్స్ స్లైడులో నెనర్లు అని రాసా. అంటే ఏంటని అడిగిన మా సారుకి దానర్ధంచెప్పి బోలెడానందపడిపోయా.

రెండో ముక్క. మాఅమ్మాయి చిన్నప్పుడు తనని పడుకోబెట్టడానికి తెలుగు పద్యాలూ, పాటలూ రాత్రి పూట రోజూ పాడుతోంటే తనకి అలవాటైపోయాయి. ఆవయసులో వచ్చే బాబా బ్లేక్షిప్పులూ, జింగిల్ బెల్లులూ నేర్పించలా (నాకు రావు కదా- మాదంతా ఉప్పుకప్పురం, వంకరటింకర ఓ చదువులాయే). చివరాఖరుకి నాన్నా అని తప్పించి డాడీ అని కూడా పిలిపించుకోలేకపోయా. హైదరాబాదు మాఅత్తగారింట్లో పనిపిల్ల కొడుకు వాడి అమ్మా నాన్నల్ని మమ్మీ డాడీ అని పిలుస్తోంటే కాస్త చిన్నతనం ఫీలవ్వాల్సిందేమో, అదికూడా చేతకాలే. ఆనక హైదరాబాదు వచ్చాకా మాపిల్లలు తెలుగు రాయను చదువనూ నేర్చుకున్నారు. పైన చెప్పిన ఏసందర్భాల్లోనూ కలగని ఆనందం మా పిల్లలు మాగంటి.ఆర్గ్ వారి పిలుపు మేరకి, నా అభ్యర్ధన మన్నించి తెలుగులో చెరియొక వ్యాసం రాసి ఆయనకి పంపించడం, దాన్ని వారి వెబ్ పుటలో చూసుకోవడం ద్వారా కలిగింది. ఇకముందు కూడా వాళ్ళు తాము నేర్చుకున్న తెలుగును మర్చి పోకుండా, తృణీకరించకుండా ఉండాలని ఆశిస్తున్నా.
కొసరు మాట- తెలుగు వ్యాధికి మందు వాలైనంత మందికి దాన్ని అంటగట్టడమేనేమో!!! :)))

16 comments:

  1. మువెంర "డబ్బు చేసింది" లాగా.. మీ "తెలుగు చేసింది" బాగుంది. మీ అన్నయ్య గారి అమ్మాయి "చతురత" మరీ బాగుంది. మీ పిల్లలిద్దరికీ మరోసారి నా ఆశీస్సులు, అభినందనలు.

    మీ ప్రదర్శనలో సహజమైన భాష వాడారు. ("ఎందుకు?" అని కాకుండా "దేనికి?" అని వాడటం నన్ను బాగా ఆకట్టుకుంది) నిర్మూలించాలి, ఎక్కడుంది, పెంపొందించాలి, తగ్గించాలి, చేసుకోవడం లాంటి మాట్లాడుకునే భాషను వాడారు. మామూలుగా ఆయా సందర్భాల్లో మనవాళ్ళు నిర్మూలించవలెను, ఎక్కడ ఉన్నది, పెంపొందించుకొనవలెను, తగ్గించవలెను, చేసుకొనుట లాంటి అర్ధ గ్రాంధికాలు వాడతారు. మీరు వాటి జోలికి పోకపోవడంతో ప్రదర్శన ముచ్చటగా ఉంది.

    మీకీపాటికి ఇలాంటి పనులు మరిన్ని వచ్చే ఉండాలే!

    ReplyDelete
  2. మీకు పట్టాల్సిన జబ్బే పట్టింది. అది తొందర్లో వదలకూడదని కోరుకుంటున్నాను.
    అలాగే అది అంటు వ్యాధి అయితే మరీ మంచిది :)

    ReplyDelete
  3. నాకూ అప్పుడెప్పుడో తెలుగు చేసింది. ఆ చేయడం చేయడం ఇప్పటికీ వదల్లా. ఆ మధ్య ఓ నాలుగేళ్ల క్రితం మా పాప 'అభినయని' "డాడీ సిరంజీవి (చిరంజీవి అన్నమాట) యాక్సన్ బలే జేత్తాడుగదా?" అంటే హతవిధీ! "నాకా యిటువంటి పుత్రిక. . .ఈ ఉచ్ఛారణ?" అనుకుని సరిజేసి చెప్పాను. ఇప్పటికీ ఆ మాటతో తనని ఏడిపిస్తుంటాను. గనుక తెలుగుజేసినోళ్ళందరూ జలుబు చేసినోళ్ళకన్నా బాధలు పడక తప్పుదు.

    ReplyDelete
  4. తెలుగులో ప్రెజెంటేషన్ యిద్దామన్న ఆలోచన రావటం నిజంగా అభిలషణీయం, అభినందనీయం, ఆచరణీయం. మీబోటివారి పిల్లలకి తెలుగు నిలబెట్టుకోవటమెలానో, కాదు కాదు, నిలబెట్టడమెలానో మళ్ళీ ప్రత్యేకంగా నేర్పవలసిన అవసరముండదని నా నమ్మకం. మీకు మీ తనూభవులకు అభినందనలు.

    ReplyDelete
  5. ప్రజెంటేషన్ చాలా బాగుంది. అయితే జిల్లా కార్యాలయాల్లో ఇన్నాళ్లూ ఇలాంటివి ఇంగ్లీషులోనే వుండేవన్నమాట!

    "నేను మాట్లాడుతూంటే మీ నోరు నొప్పెడుతోందా" - మూడేళ్లపిల్ల ఇలాంటి ముచ్చటైన మాట చెబితే మరిచిపోగలమా!

    "తెలుగువాళ్లందరికీ తెలుగుచేయుగాక!" అని ఎవరైనా ఒక మహాముని శపించేస్తే బాగుండును. :)

    ReplyDelete
  6. ముందుగా మీ పిల్లలికి అభినందనలు. మీ పాప బ్లాగు ఎప్పుడెప్పుడు మొదలుపెడుతుందా అని ఎదురు చూస్తున్నాను. మీ ప్రజెంటేషన్ కూడా బాగుంది.

    ఎవరైనా పిల్లలు మమ్మీ డాడీ అని పిలవటం విన్నప్పుడల్లా మా పిల్లలు అమ్మా నాన్నా అంటున్నందుకు నాకెంత గర్వంగా ఉంటుందో!!

    ReplyDelete
  7. ఐ కంగ్రాచులేట్ యువర్ టెల్గూ లాయల్టీ ..

    అబ్బే ఊరికినే, సరదాగా. :-)

    నేను రాద్దామనుకున్న వ్యాఖ్య ప్రవీణ్ రాసేశాడు. రానారె కోరిక కూడ సముచితంగానే ఉంది.
    మీ తెలుగు ప్రెజెంటేషను బ్రహ్మాండం.
    పాత కాలపు వాడుకలో వాళ్ళు తెలుగు మీరి పోయారు అంటు వుంటారు, ఎవరన్నా విన్నారా? కొన్నాళ్ళ క్రితం రచ్చబండలో పేద్ధ చర్చ కూడ జరిగింది.

    ReplyDelete
  8. సాయి గారు,సిరిసిరి మువ్వగారు,నాబాధ ఎవరితో చెప్పుకోవాలో మరి.మా పిల్లలు మాఆవిడను అమ్మా అని నన్ను డాడీ అంటున్నారు,నాన్న అనండ్రా అంటే నువ్వే మమ్ముల్ని నాన్నా అంటున్నావుగా అని సమాధానం మరి నాకేది దారి?

    ReplyDelete
  9. మీ ప్రదర్శనలో సహజమైన భాష వాడారు. ("ఎందుకు?" అని కాకుండా "దేనికి?" అని వాడటం నన్ను బాగా ఆకట్టుకుంది) నిర్మూలించాలి, ఎక్కడుంది, పెంపొందించాలి, తగ్గించాలి, చేసుకోవడం లాంటి మాట్లాడుకునే భాషను వాడారు. మామూలుగా ఆయా సందర్భాల్లో మనవాళ్ళు నిర్మూలించవలెను, ఎక్కడ ఉన్నది, పెంపొందించుకొనవలెను, తగ్గించవలెను, చేసుకొనుట లాంటి అర్ధ గ్రాంధికాలు వాడతారు. మీరు వాటి జోలికి పోకపోవడంతో ప్రదర్శన ముచ్చటగా ఉంది.

    ReplyDelete
  10. ఆచార్యులవారికి అభివాదములు.మీకు చేసిన తెలుగు మీచేత ఇన్నాళ్లకి టపాకట్టించిందన్నమాట.రొంబ సంతోసం.

    ReplyDelete
  11. ఎక్కడ టపా కట్టినా ఈ కార్డుల గోల మాత్రం రాకుండా ఉండదన్న మాట :)

    అన్నటు ఈ తెలుగు చేయడం "జబ్బా?", "వ్యసనమా?", "మంచి అలవాటా?", "పిచ్చా" అని నేన్ కూడా చాలా మార్లు ఆలోచించి ఉంటిని.

    ReplyDelete
  12. సత్యసాయిగారు,
    నిజమేనండి అందరికి ఈ బ్లాగుల పుణ్యమా అని తెలుగు చేసింది. ఎవరన్నా తెలుగును ఇంగ్లీషులో రాస్తే చదవడానికి చిరాగ్గా ఉంది(ఎరా చాట్ రూమ్‍లో) ముందు వారిని తెలుగులో రాయడం నేర్చుకోమంటున్నాను. .కాని కలిసిన వారందరికి మాత్రం చెప్పడం లేదండీ.. కాని మీకు వచ్చిన తెలుగు అలాగే ఉండాలని, ఇంకా ఎక్కువ కావాలని, ఎక్కువమందికి అంటించాలని (అలాగే వాళ్ళూ తన్నకుండా కూడా) కోరుకుంటున్నాను.

    ReplyDelete
  13. ఈమధ్యీమధ్యే తెలుగుచేసినవాళ్ళకే ఇలా ఉంటే పుట్టినప్పటినుంచీ తెలుగుచేసినవాడి పరిస్థితేంటని ఎవరైనా ఆలోచిస్తున్నారా ?

    ReplyDelete
  14. సార్ మీకు తెలుగు చేసి ఇలా ప్రజెంటేష్న్‌ చేస్తే నాక్కూడా తెలుగు చేసి తెలుగు సంఘాల్లో పని చేశా ఇంకా ఎక్కువ తెలుగు చేసుకోవచ్చని. అందుకు సార్ నాకు సార్ బీ.పి. సార్, షుగర్ సార్,జుట్టు రాలుడు సార్ వెరసి వయసులో పదేళ్ళు తక్కువయింది సార్. మరీ ఎక్కువ చేసుకోకండి సార్. అందుకనే అప్పుడప్పుడూ మాత్రమే తెలుగు చేసుకోండి సార్. తెలుగు టి.వి. మాత్రం చస్తే చూడకుండా జానా రెడ్డిలా "షాయ షక్తులా" కృషి చేయండి సార్. లేక పోతే బీ.పి. చేసుకోవాల్సి వస్తుంది సార్. ఇంకా మీరు తెలుగు చేసుకుంటానంతే సార్ అప్పుడు సార్ ఇక అంతే సార్...డాక్టర్ సార్ చేస్తాడు సార్.


    -- సార్ విహారి

    ReplyDelete
  15. అయ్యబాబోయ్ ! నవ్వించేవాళ్ళు కూడా ఇలా మమ్మల్నిభయపెడితే ఎలా సార్ ? పుట్టినప్పటినుంచే తెలుగుచేసినవాణ్ణి నేను. నాకు ఏ బీపీలూ లేవు కదా !

    ReplyDelete
  16. నాక్కూడా ఇప్పుడిప్పుడే తెలుగు చేస్తున్నట్లుగా అనుమాన వేస్తోంది.రాన్రాను ఇదేదో తెగులు లోకి దించుతుందో ఏమో తెలియట్లేదు.అంతా మన మంచికే అనుకుంటే పోలా--

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.