Saturday, April 19, 2008

దురాశ+అసంతృప్తి =?

ఈమధ్య ఓసినిమాలో విన్న వ్యాఖ్యః- మనిషి దురాశా జీవి. దురాశ దుఃఖమునకు చేటు అని చిన్నప్పుడు చదువుకున్నాం. అప్పుడు ఏదో వల్లెవేయడమే కానీ అర్ధం అంత తెలియలేదు. ఇలాంటివి అనుభవం మీదే తెలుస్తాయి- కొంతమందికి మాత్రమే అని వేరే చెప్పఖ్ఖర్లేదనుకుంటా. అయితే అనుభవాలని, పరిశీలనలనీ క్రోడీకరించగా తెలిసినదేమిటంటే మన దురాశ వేరే వాళ్ళ దుఃఖానికి చేటు అని. అలాగే వేరే వాళ్ళ దురాశ మన దుఃఖానికి చేటు. దురాశకి లోనవకుండా మనని మనం కాపాడుకోవడమే కాకుండా, ఇతరుల దురాశకి బలైపోకుండా ఆత్మరక్షణ చేసుకోడం చాలా అవసరం. దురాశ పడేవాళ్ళకి ఓ ఉదాహరణ భాగ్యనగర ఆటో డ్రైవర్లు, ప్లంబర్ల వంటి ఇతర పనివారు. పని చేయకుండా (లేదా అతితక్కువ పని చేసి)అధిక మొత్తం అడగడం వీళ్ళకి పరిపాటి. వాళ్ళడిగినదిచ్చాకా కూడా తీసుకున్న సొమ్ముకి తగిన పని చేయాలని రూలేం లేదు.

పోయిన వారం ఒకరోజు గాత్రి 9 గంటలకి బిర్లామందిర్ దగ్గరి కామత్ హోటల్ దగ్గర టైరుపంక్చరయింది. దగ్గర టూల్ బాక్సులేక వేటకి పోయి నాంపల్లి దగ్గరనుండి ఒక కుర్రాడిని పిలుచుకు వచ్చా. 70 రూపాయలడిగాడు. చేసేది లేక ఓకే అన్నా. దార్లో నాంపల్లిలో ఉన్న కామత్ అనుకున్నా ఇక్కడికి తీసుకొచ్చారు అని నసిగాడు. పనయ్యాక 80 ఇచ్చా. ససేమిరా అన్నాడు. 100 ఇచ్చా. కామత్ అన్నారు ఇక్కడికో తీసుకొచ్చారని నిష్ఠురపడ్డాడు. అందుకే 100 ఇచ్చా అని, వెనక్కి ఆటోలో వెళ్ళినా తనడిగిన దానికన్నా ఎక్కువే ముట్టిందని రకరకాలుగా నచ్చచెప్పా. చివరికి బస్సులో వెళ్తా ఇంకో 5 ఇమ్మన్నాడు. టైరు మార్చడానికి అయ్యే కూలీ ప్రయాణించిన దూరాన్ని బట్టి ఉంటుంది కానీ టైరు మార్చడానికి పడ్డ శ్రమని బట్టి కాదన్నమాట. కన్‌వేయన్సు చార్జెస్ ఎక్ష్ట్రా ప్లీజ్జ్...

నిన్న రాత్రి తాజా భేటీ ఒక ఆటో డ్రైవరుతో. రాత్రి 9 గంటలకి నైట్ టైమయిందని ప్రకటించేసాడు. కాస్త నోరు పారేసుకుని కింద పడ్డా మనదే పైచేయన్నట్లు పదిరూపాయలు ఎక్కువకి ఒప్పుకుని (చచ్చినట్లు)ఇంటికి జేరా. ఇంకా గట్టిగా మాట్లాడితే కేసీఆర్ పద్ధతిలో లక్షల్లో ఛార్జి చేస్తాడేమోనని భయమేసింది. అసలు వీళ్ళబోంట్లని చూసే కేసీఆర్ కి ఈకూలీ ఆలోచన వచ్చిందేమో. ఇంకో అడుగేసి తెలంగాణా వస్తే కూలీ రేట్లు ఈ రేంజిలోనే ఉంటాయని ఆయన వాకృచ్చినా ఆశ్చర్యం లేదు.

దురాశ అనగానే నాకు ఈమధ్య చదివిన చందమామ కథలాంటిది ఒకటి గుర్తొస్తుంది. ఒక జాలరివల్లో ఓరోజు బంగారు చేప పడింది. అతను సంతోషిస్తోంటే ఆచేప తనని వదిలేయమని, అందుకు బదులుగా ఏదైనా ఉపకారం చేస్తానని బతిమాలుతుంది. ఆయన బాలిపడి వదిలేసాడు. ఆనక పెళ్ళాం చేత నానా చివాట్లూ తిని, చివరికి ఆవిడ పోరుకిలొంగి చేపని సంపద కోరుకుంటాడు. సంపదొచ్చాక కొన్నాళ్ళకి జాలరి పెళ్ళానికి అసంతృప్తి కలుగుతుంది. మళ్ళీ మొగుడి బుర్ర తిని చేపని పేద్ద భవనం, తోట వగైరాలు, ఆతర్వాత విడతలో పరిచారకులు, రాచరికపు హంగులు తెప్పించుకుంటుంది. అసంతృప్తి ఆగక సూర్యచంద్రులు తనదగ్గరే ఉండేలా చేపని వరం కోరమని మొగుడ్ని పంపిస్తుంది. పాపం జాలరి చేపకి తన జాలిగాధ వినిపించి బాధపడతాడు. చేప నవ్వి అలాగే చేస్తానని ఓదార్చి పంపేస్తుంది. ఇంటికి వచ్చిన జాలరికి తన పాతగుడిసె లో తన పెళ్ళాం కారాలూ, మిరియాలూ నూరుతూ కన్పిస్తుంది. ఇతన్ని చూడగానే విరుచుకు పడుతుంది. అప్పుడు జాలరికి చేప నవ్వు అర్ధమయ్యి పెళ్ళాంతో,"చేప నీకోరిక తీర్చింది చూడు, మన గుడెసెకప్పు లోంచి పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడూ నీదగ్గరే ఉంటా"రని అంటాడు. కధకాబట్టి దురాశకి పనిష్‌మెంటొచ్చింది. నిజజీవితంలో బాగా టైం పట్టచ్చు.

దురాశకి మాతృకా, సోదరీ అసంతృప్తి. కొందరికి బెస్టు ఫలితం వచ్చినా ఇంకా ఏదో వెలితి. బేరాలాడేవాళ్ళకి ఇది తెలిసేఉంటుంది. ఒకాయన గొడుగుకి చేసిన బేరానికి చిరాకెత్తిన షాపతను ఉత్తినే తీసుకు పొమ్మన్నాడట. దానికా పెద్దమనిషి రెండిస్తావా అన్నాడట. ఆమధ్య ఓకథ చదివా. అందులా ఒక నిత్య అసంతృప్తుడి చొక్కాకి బాల్‌పాయింటు పెన్ను ఇంకు అంటుకుంది. తర్వాతి రోజు జరగబోయే ఇంటర్వ్యూకి ఆఅచ్చొచ్చిన చొక్కా వేసుకోవాలని తెగ గొడవ చేసి అందరి బుర్రలూ తింటాడు,. అతని బావగారు తనకితెలిసిన డ్రైక్లీనరు ఆఇంకు మరక పోగొట్టగలడని చెప్తాడు. దానికి ఆ ని.అ.డ్రైక్లీనర్ల అసమర్ధత గురించి, బాల్‌పాయింటు ఇంకు కున్న బంకతనం గురించీ తెగ నిస్పృహ పడిపోతాడు. బావమరిదిని ఉత్సాహపరచాలని, ఆబావగారు తనకి తెలిసిన డ్రైక్లీనరి ప్రతిభని తెగపొగుడుతాడు. ఎలాగైనా బావమరిదిని ఒప్పించి, మెప్పించాలని, అతన్ని సంతృప్తి పరచాలని గాఠ్ఠిగా అనుకుని ఆషర్టుని డ్రైక్లీనరుకిచ్చి, తన పరిస్థితి విన్నవించి ఆచొక్కాని ఉతికించితెస్తాడు. మరక పోయింది అని గర్వంగా బావమరిదికి చూపిస్తే ఆ ని.అ. "చూడండి బావగారూ, ఈమధ్య బాల్‌పాయింటు ఇంకు ఎంత నాసిగా చేస్తున్నారో" అని వాపోయాడు. :)!!??

దురాశ+అసంతృప్తి =అశాంతి(తనకి+చుట్టుపక్కలవారికీ)

13 comments:

  1. ఇలాంటి అనుభవమే అయిందండీ. మొన్న సెలవల్లో హైదరాబాదు వచ్చినప్పుడు క్ష్ నుంచి య్ కి ఒక ఆటో (డిజిటల్ మీటరే) 150/- అయింది. మళ్ళీ మరుసటి రోజే అదే ప్రయణం మరో ఆటోలో చేస్తే 100/- కూడా కాలేదు.

    మన ఖర్మనుకోవటం తప్ప వాళ్ళ నోట్లో నోరు పెట్టి గెలవలేము.

    ReplyDelete
  2. దురాశ+అసంతృప్తి =అశాంతి(తనకి+చుట్టుపక్కలవారికీ), నిజం చెప్పారు.
    భాగ్యనగర ఆటో డ్రైవర్లు అలా లేకపోతేనే మనం ఆశ్చర్యపోవాలి...

    ReplyDelete
  3. "దురాశకి మాతృకా, సోదరీ అసంతృప్తి." అన్నారు. వీటి నుండి జన్మించునది అశాంతి. మనుషులకు సంబంధించినంతవరకూ అశాంతి అక్రమసంతానమన్నామట! :)

    ReplyDelete
  4. మీరు చెప్పినదానితో 100% ఏకీభవిస్తాను.

    ReplyDelete
  5. "...ఇతరుల దురాశకి బలైపోకుండా ఆత్మరక్షణ చేసుకోడం చాలా అవసరం" నాకు చాలా నచ్చిందీ వాక్యం. కథ నిజంలా ఉంది.

    ఈ లెఖ్ఖన విదేశీ డ్రైవర్లు, పనివారు ఎంతో నిజాయితీ పరులు అని అనడం ఆశ్చర్యకరమైన విషయం కాదేమో!

    ReplyDelete
  6. ఇలాంటి అనుభవాలు సాధారణమే అయినా, నాకు అసాధారణ అనుభవాలూ కొన్ని ఉన్నాయి.
    ఉదాహరణకు పోయిన సారి హైదరాబాదుకి వెళ్ళినప్పుడు మా అత్తగారింటి నుంచి మా నాన్న దగ్గరికి వెళ్ళడానికి ఆటో ఎక్కాను. సగం దూరంలో చూస్తే మీటరు కదలట్లేదు. ఏంటయ్యా, మీటరు పాడయ్యిందా అంటే అవునన్నాడు కాని అసలు పట్టినట్లే లేడు. ఇక దిగాక అలవాటైన దూరం కనుక ఎంతౌతుందో అంతా ఇచ్చేశాను. అతను ప్రశ్నించకుండా తీసుకున్నాడు.
    ఉద్యోగం చేసేటప్పుడు నాక్కావల్సిన బస్సు వచ్చే చోటకి కాలినడకన 20 నిముషాలు నడవాల్సి ఉండేది. తరచూ పొద్దున పూట ఆ దూరం ఆటొలో వెళ్ళే దాన్ని. మా ఇంటి దగ్గర ఆటో వాళ్ళకి నా రొటీను తెలిసిపోయింది. ఒక వేళ త్వరగా బయల్దేరి నడుచుకుంటూ వెళ్తున్నా, ఆటో కావాలా అని అడిగే వారు. కొంతమంది నేను తొందరలో ఉన్నానేమో అనుకుని మీటరు రేటుకంటే ఎక్కువ అడిగే వాళ్ళు. ఒకతను మాత్రం "మీరు ఎక్కితే ఆ రోజు నాకు కలిసొస్తుందమ్మా" అని మంచి మాటలతో పలకరించేవాడు. టైమున్నా ఆటొలో వెళ్ళాలనిపించేది అలాంటప్పుడు.

    ReplyDelete
  7. "దురాశ దు:ఖానికి చోటు" సరైనదని మాబడి పుస్తకంలో చదివినట్టు గుర్తు.

    ఇంతకు ఏది సరైనది?

    ReplyDelete
  8. చేటు అనే గుర్తు. చేటు అంటే హాని అని అర్ధం. ఈ సామెత అర్ధంలో ఏరకంగా ఇముడుతుందో మరి. ఈ కింది లంకెలో కూడా చేటు అనే రేసారు.
    http://www.telugudanam.com/saahityam/sameta_ta_na.htm

    ReplyDelete
  9. "దురాశ దు:ఖానికి చేటు" సరయినది.

    ReplyDelete
  10. అన్ని పుస్తకాలలో ఉండేది "దురాశ దు:ఖానికి చేటు" అనే. 'మాబడి' పుస్తకంలో ఏమని వ్రాసుందంటే, చరిత్రలో ఎక్కడో పొరపాటు జరిగి "చోటు" కాస్త "చేటు"గా మారిందని వ్రాసుంది. ఈ రెండు సామెతల్లో ఏది సరైన అర్థం ఇస్తుందని అడిగానన్న మాట.

    ReplyDelete
  11. Hi....
    Mee blog chalabagundandi.Meeku Telusa
    www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
    ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
    www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

    ReplyDelete
  12. మానవుడి అవసరమే ఈ రోజుల్లో చాలా మంది తోటి మానవులకి క్యాష్ చేసుకోవడానికి దోహదపడుతుంది. అయితే చాలా మంది ఈ విధంగా దురాశ తో లాభం పొందినవాళ్ళు దానిని దురాశ అని , అవినీతి అని అక్రమం అని అనుకోరు. ముఖ్యంగా చాల మంది వ్యాపారస్తులు ఇలా వచ్చిన దానిని పెట్టుబడి కి తెలివైన లాభమనే అనుకుంటున్నారు తప్పా.. ఇతరులను మోసం చేస్త్తున్నాం అనుకోకపోవడం ..నిజంగా వినియోగదారుల దురదృష్టమే..

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.