(ఈటపాలో మత సంబంధ విషయాలు, ఇతర ఆక్షేపణీయ అంశాలు ఉండచ్చు. చెట్ల ఆకులు ఆకుపచ్చగా ఉండడం లాంటి తీవ్ర విషయాలకి మనోభావాలు దెబ్బతినిపించుకోగల సున్నిత మనస్కులూ, అప్రాచ్యులదే శాస్త్రీయ విజ్ఞానం, ప్రాచ్యుల నమ్మకాలు మూర్ఖత్వం అనుకునే పురోగమనులూ చదవకుంటే మేలు).
ఈరోజు గురుపౌర్ణిమ. చాలా మహత్తరమైన రోజు. మనకి ఎనలేని వేద,భారత, భాగవత, పురాణాది వాంఙ్మయ సంపదనందించిన వ్యాసుడి జన్మదినాన్ని గురుపౌర్ణిమగా జరుపుకుంటున్నాం. అందుకే దీన్ని వ్యాసపౌర్ణిమని కూడా వ్యవహరిస్తున్నాం. మన సాంప్రదాయంలో గురువుకి ఉన్నత స్థానమిచ్చారు. చైనా, కొరియా లాంటి ప్రాచ్య దేశాల్లో కూడా గురువుకి చాలా విలువిస్తారు. ఈనాటికీ కొరియాలో టీచర్స్ డే క్రమం తప్పక చేస్తారు. గురువు నీడని కూడా తాకలేనంత దూరం లో భక్తితో మెలగాలని అక్కడి పాతకాలం నాటి నియమంట. మనదేశంలో సిఖ్ఖులు, సింధీల గురుభక్తి వేరే చెప్పనక్కరలేదు. మహారాష్ట్రీయులు కూడా ఈవిషయంలో ముందే ఉన్నారు.
వ్యాసుడి పరంగా వచ్చినా, ప్రస్తుతం గురుపౌర్ణిమ రోజున దత్తాత్రేయుడినే ఎక్కువ పూజించడం, తర్వాత సమర్ధ సద్గురవు గా పేరొందిన షిర్డీ సాయిని కొలవడం ఆచారమయిపోయింది. ముంబైలో అయితే ఈరోజున వీరి మందిరాలు కిటకిటలాడిపోతాయి. షిర్డీలో సరేసరి. ఈగురుతత్వం, మహిమ తెలియాలంటే గురుచరిత్ర అనే గ్రంధం చదవాలి. ఇది గంగాధర సరస్వతి మొదట వ్రాసారు. తర్వాత వాసుదేవానంద సరస్వతి వ్రాసారు. తెలుగులో కీశే. ఎక్కిరాల భరద్వాజ గారు వ్రాసిన పుస్తకం ప్రాచుర్యం పొందింది.
దత్తాత్రేయుని కలియుగావతారాలైన శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీనృసింహ సరస్వతి స్వాముల(ఈయననే శ్రీగురుడని వ్యవహరిస్తారు) జీవిత చరిత్రే ఈ గురు చరిత్ర. దీనిలో నామధారకుడనే కష్టజీవికీ, సిద్ధుడనే శ్రీగురుభక్తునికీ జరిగిన సంభాషణ ఉంటుంది. . ఇందులో మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు పిఠాపురంలో జన్మించి, తర్వాత సన్యసించి ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కురువపురం వద్ద కొన్నాళ్ళు ఆశ్రమ వాసిగా ఉండి, అవతారం చాలించి శ్రీగురునిగా మహారాష్ట్ర లో కరంజిలో అవతరించాడు. పిఠాపురం వాళ్ళకీవిషయం వాసుదేవానంద సరస్వతి స్వామి 19వ శతాబ్దపు చివరలో ఈఊరెళ్ళి చెప్పేదాకా తెలియదు. మొన్నమొన్నటిదాకా, నాకు తెలిసిన పిఠాపురం వాళ్ళకి కూడా వాళ్ళ ఊరు ఘనత తెలియదు. ఈమధ్య మహారాష్ట్రీయులు, కన్నడిగులూ అక్కడ ట్రస్టూ, వసతీ ఏర్పాటుచేసి, మైసూరు గణపతి సచ్చిదానంద స్వామి ఒక కనువిందు చేసే అందమైన మందిరం కట్టించేదాకా ఈఊరికి పెద్ద గుర్తింపు రాలేదు. ఈమధ్య పిఠాపురం సంస్థానం వారు మల్లాది వంశీయుల నుండి లభించిన శ్రీపాదుల చరిత్ర ప్రకటించారు. దీనిగురించిన టపా తాడేపల్లి వారి బ్లాగులో చూడవచ్చు (600 ఏళ్ళ నాటి తెలుగు పుస్తకం). దీనిలో పిఠాపురవాస్తవ్యులు శ్రీపాదులవారిని, వారి కుటుంబాన్నీ ఎలా ఇక్కట్ల పాలు చేసారో చదవచ్చు. తెలుగువాళ్ళు అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్నారన్న మాట. మన వాళ్ళొ ట్టి వెధవాయిలోయనుకుంటూ, బయటివాళ్ళు పొగిడితే వాడు మావాడేనని చంకలు గుద్దుకుంటూ, ఆంధ్రా మిల్టననో, ఆంధ్రా హోమరనో ఓబిరుదిచ్చి వాళ్ళకి స్వంత ప్రతిభలేదని నర్మగర్భంగా ప్రకటించేస్తారు.
ఈగురుచరిత్రలో కధలూ, సందర్భాలూ హిందూ మతపరంగా అనిపించినా, సూక్ష్మంగా చూస్తే వాటిలోని బోధలు దేశ,కాల, మతాదులకి అతీతంగాఅనిపిస్తాయి. మొత్తం గురుచరిత్రంతా తిరగేస్తే ఒకే ఒక్క విషయం కనిపిస్తుంది - గురువుని నమ్మిన వాడు పైకొస్తాడని. దీంట్లో మతలబేమీ లేదు. తెలిసినవాడిని ఆశ్రయించి, తెలుసుకొమ్మని. మీదగ్గరకి ఎవరైనా జూనియరొచ్చి అన్నీ తెలిసినట్లుగా పోజిచ్చి, ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే మీరు నేర్పగలరా? (లేరని భావం). ఏదైనా విద్య తెలిసినవాడి దగ్గరకి పోయి నేర్చుకుంటే, ఆయనకి నేర్చుకోవడానికి పట్టిన సమయంకన్నా తక్కువ సమయంలోనే మనం నేర్చుకోవచ్చు. ఆయన అనుభవం మనకి చాలా ఉపయాగపడుతుంది. కానీ ఆయన మీద విశ్వాసం, నమ్మకం చాలా ముఖ్యం. సంశయాత్మా వినశ్యతి అన్న గీతావాక్యాన్ని మర్చిపోవద్దు. నిప్పుని పట్టుకుంటే కాలుతుందన్న జ్ఞానం, అనుభవంమీద నేర్చుకున్నాయన ద్వారా కాల్చుకోకుండానే నేర్చుకోవచ్చు- ఆయనమీద నమ్మకం ఉంటే. ఈయన చెప్పినది నమ్మచ్చా అని సందేహపడితే చేయి కాల్చుకుని కూడా తెలుసుకోవచ్చు!!!
గురువుని గౌరవించని సమాజం ముందుకి వెళ్ళలేదని నిన్న ఒకాయన చెప్తూ, మన దేశ ప్రస్తుత దుస్థితికిదే కారణమని వాపోయాడు. అవుననే అంటా. గురువుని సరిగా గౌరవించని వాడు, ఆయనని ధిక్కరించేవాడు నష్టపోతాడని గురుచరిత్ర ప్రమాణం. నేను ప్రత్యక్షంగా ఒకే సమయంలో ముగ్గురు పిహెచ్ డీ కుర్రాళ్ళవిషయంలో ఈసూత్రం పనిచేయడం చూసా. గురువుని నమ్మిన వాడు పైకెళ్ళాడు, ఆయన మీద కోపం పెంచుకున్నవాడు నష్టపోయాడు. మొదట్లో అన్నిటికీ ఆయనని విమర్శించి, నాసలహామీద ఆయనమీద కొంతభరోసా పెంచుకున్నవాడు మధ్యేమార్గంగా బాగుపడ్డాడు. దీని వెనకాల పెద్ద మతాలూ, మహిమలూ, మట్టిగడ్డలూ లేవు. వీళ్ళకి వాళ్ళ గైడ్ల మీద ఉన్న అనుకూల, ప్రతికూల భావాలు వాళ్ళు చేసే ప్రతిపనిలోనూ వెన్నంటే ఉండి, గైడు మాటలని, చేతలని, సలహాలనీ వాళ్ళ భావాలని బట్టి సరిగానో, వక్రంగానో గ్రహించి, దాన్ని బట్టే ఫలితాలని పొందారు. ఉదాహరణకి గైడు ఒకపని చెప్తే నమ్మకం ఉన్నాయన తూచాతప్పకుండా చేసేవాడు. అందుకని ఆయనలో ఇంటర్నల్ కాంట్రడిక్షన్ లేదుకాబట్టి పూర్తిగా మనసుని లగ్నం చేసి పనిచేయగలిగేవాడు. నమ్మీనమ్మని ఆయనయితే ఇలాగే ఎందుకు చేయాలి తర్జనభర్జనలు పడి, పని చేసేవాడు. అలాచేస్తే మనసుపూర్తిగా లగ్నంకాదుకదా. చాలా ఎమోషనల్ ఎనర్జీ వేస్టవుతుంది కదా. మూడోఆయన మాగైడుకేమీ రాదు, వాడో దరిద్రుడు అని నా దగ్గరే తిడుతుండేవాడు. అన్నీ వచ్చు, వచ్చని డబ్బాలు కొట్టుకుని పని చేస్తే సరైన రిజల్టు రాక పిహచ్ డీ చాలా ఏళ్ళు పట్టింది. విశేషం ఏమిటంటే ఆయన వేరే లేబ్లో 2 ఏళ్ళు రిసెర్చి చేసాక ఇదేకాంప్లెక్సువల్ల బయటికి రావల్సివచ్చి, వేరే చోట (ఖండాంతరాల్లో) జేరాల్సి వచ్చింది. మొదటాయన 4 ఏళ్ళలో డిగ్రీ తెచ్చుకుని వెంటనే అక్కడే ప్రొఫెసరయ్యాడు, గైడు రికమెండేషనుతో. మూడోఆయన ఇంకా స్ట్రగులవుతున్నాడు. మన జీవితగమనం కేవలం మన ఆలోచనల ప్రతిఫలమే.
గురువంటే ఆరడుగుల మనిషేఅవనక్కరలేదు. అవధూతోపాఖ్యానంలో చెప్పినట్లు, చీమ నుండీ బ్రహ్మం వరకూ -దేనిదగ్గరైనా శిష్యరికం చేయచ్చు. ఈరోజు గురుపౌర్ణిమ సందర్భంగా నాకు ఒక ఉనికిని ప్రసాదించిన వారిని ఒక సారి స్మరించుకున్నా. ఆవిశేషం ....
(సశేషం)
This comment has been removed by the author.
ReplyDeleteగురు-ఆశీర్వాదాలు మహిమా ? కాదా ? అంటే చప్పున చెప్పడం కష్టం. అయితే "అంతా మన మనోభావాలే తప్ప మఱింకేమీ కా"దనే అభిప్రాయాన్ని కూడా సమర్థించలేం. అంతా మన మనోబావాల ఫలితమే అయితే ఈ ప్రపంచం ఎప్పుడో బాగుపడిపోయేది.
ReplyDeleteమహిమలంటే ప్రకృతి విరుద్ధంగా జరగడమనే అభిప్రాయమెలా ప్రచారంలోకి వచ్చిందో తెలియదు. అలాగని మనం ప్రకృతిపరంగా భాష్యం చెప్పుకున్నంతమాత్రాన ఒక దృగ్విషయం మహిమ ఎందుకు కాకుండా పోతుందో కూడా నాకు తెలియదు.
నా దృష్టిలో వాన పడ్డం మహిమే. పంటలు పండడం మహిమే. పిల్లలు పుట్టడం మహిమే. ఇవి సహజంగా జరక్కుండా పోయినరోజు తెలుస్తుంది మనిషికి ఇవి ఎంత గొప్ప మహిమలో ! అలాగే గురు-ఆశీర్వాదాల్ని పోగిట్టుకున్న తరువాత గానీ వాటి విలువ మనిషికి తెలియదు.
గురువంటే కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు. ఈ సంకుచితార్థం అనంతరకాలంలో ఏర్పడినటువంటిది. గురువంటే "పెద్ద" అని అర్థం. ఆ గురుస్థానీయుడైన వ్యక్తికి అసంతృప్తి కలిగిస్తే ఆయన పైకి ఏమీ అనకపోయినా అది మనిషి జీవితానికి గొప్ప శాపంగా, అతని అభివృద్ధికి అవరోధంగా తయారవుతుంది. పరిణమిస్తుంది. ఇది తప్పదు. ఆ గురుస్థానీయుడు/స్థానీయురాలు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నయ్య కావచ్చు, మామయ్య కావచ్చు. భర్త కావచ్చు.
నాకీ సందర్భంలో బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తున్నది :
బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సుప్రసిద్ధ కవి, పండితుడు. గొప్ప యోగి కూడా. ఆయన దగ్గరికి ఒకసారి ఒక యువకుడు వచ్చి "అయ్యా ! నాకు గత కొద్ది సంవత్సరాలుగా బ్రహ్మచెవుడు పట్టుకుంది. కానీ నేను పుట్టుకతో చెవిటివాణ్ణి కాను. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా నా పరిస్థితి ఇలాగే ఉంది" అని చెప్పి దు:ఖించాడు.
అప్పుడు శాస్త్రిగారు అతని చెవుల్ని తన చేతులతో ముట్టుకుని "ఇప్పుడు వినపడుతోందా ?" అన్నారు. అతను అద్భుతపడిపోయి "అయ్యా ! మీరు నన్ను ముట్టుకోగానే నాకు వినపడ్డం మొదలుపెట్టింది. మీరు మనిషా ? దేవుడా ?" అంటూ ఆయన పాదాలమీద పడ్డాడు. శాస్త్రిగారు నవ్వి, "అయ్యో అమాయకుడా ! నేనూ నీలాగే మామూలు మనిషినే. దేవుణ్ణి కాను. ఇప్పుడు నేను నీకు కలిగించిన వినికిడిశక్తి తాత్కాలికం. నువ్విక్కణ్ణుంచి వెళ్ళిపోగానే మళ్ళీ నీకు బ్రహ్మచెవుడొస్తుంది" అన్నారు.
అతను నిరాశ చెంది,"అంతేనా శాస్త్రిగారూ ! నా గతి ఇంక ఇంతేనా ?" అని దీనంగా అడిగాడు.
"తొందఱపడకు. ముందు నాకొక విషయం స్పష్టంగా చెప్పు. నువ్వు ఇదివఱకు ఎవరైనా పూజ్యుల మాట వినకుండా ఉద్దేశపూర్వకంగా పెడచెవిన పెట్టావా ? గుర్తుతెచ్చుకో" అన్నారు శాస్త్రిగారు.
అప్పుడతను, "ఔను స్వామీ ! చిన్నతనంలోనే మా అమ్మానాన్నా చనిపోతే మా మావయ్య నన్ను ప్రేమగా పెంచాడు. నేను పెరిగి పెద్దవాణ్ణై బాగా చదువుకున్నాక తన కూతురిని చేసుకోమని అడిగాడు. నాకామె నచ్చక బయటి సంబంధం చేసుకున్నాను. ఆయన పైకేమీ అనలేదు కానీ మనసులోనే బాధపడ్డాడు. ఆయన కూతురు ఇప్పటికీ పెళ్ళి కాకుండానే మిగిలిపోయింది. అప్పట్నుంచి నాకీ చెవుడు సంప్రాప్తమైంది" అని వాపోయాడు.
అప్పుడు శాస్త్రిగారతనితో "అలా అయితే నువ్విప్పుడే మీ మావయ్య దగ్గరికెళ్ళి క్షమించమని మన:స్ఫూర్తిగా ఆయన కాళ్ళు పట్టుకుని ప్రార్థించు. ఆయన క్షమించిన మరుక్షణం నీకీ చెవుడు శాశ్వతంగా వదిలిపోతుంది." అని చెప్పి పంపారు.
ఆ వ్యక్తి 'సరే'నని వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళి "మావయ్యా ! నేను ద్రోహిని. పాపిని. నీ యింట్లో పెరిగి నీ మాట వినలేదు. నీ కూతురు నా మూలంగానే పెళ్ళి కాకుండా మిగిలిపోయింది. నా పాపానికి నేను ్ృదయపూర్వకంగా పశ్చాత్తాపపడుతున్నాను. నన్ను క్షమించు" అని కాళ్ళు పట్టుకున్నాడు.
వాళ్ళ మావయ్య అతన్ని లేవదీసి "దానిదేముందిలేరా ! నువ్వూ నా కొడుకులాంటివాడివే." అన్నాడు.
అప్పుడు, ఎన్నో సంవత్సరాల తరువాత అతని చెవులు మళ్ళీ మామూలుగా పనిచెయ్యడం మొదలై "నువ్వూ నా కొడుకులాంటివాడివే." అనే మాట వినపడింది. అప్పుడు తన గురుద్రోహం పరిహారమైందని అతను గ్రహించాడు.
చాలా కాలం తర్వాత కనిపించారుగా - చాలా సంతోషం. మీ టపా చదువుతుంటే, ఎప్పుడో చదివిన వాక్యం ఒకటి గుర్తొచ్చింది:
ReplyDeleteif you want to be a real student, try and find a real teacher. if you want a real teacher, try and become a real student.
మీ టపా, దానికి తాడేపల్లి వారి వ్యాఖ్యా - విషయ ప్రాశస్త్యానికి వన్నె తెచ్చేయి. అభినందనలు. మహాత్మ్య వివరణ అద్భుతం. నిజానికి నాస్తికులెవరూ వుండరట. న+అస్తి. ఉన్నా, లేదనడం - మూర్ఖత్వం కాదూ. గురువుని ఎత్తిపొడవడనికి, తరచూ ద్రోణుడి మీద ఎక్కు పెడుతుంటారు. ద్రోణుడే గనక పూనుకోకపోతే, ఏకలవ్యుడి కీర్తి ఆచంద్రతారార్కం వెలుగుతుండేదా? వేటూరి సుందర రామమూర్తి (సత్య చిత్రా వారి అడవి రాముడు) చిత్రం లో అలా పాట రాసి వుండకూడదేమో!
ReplyDeleteనేనొక సారి మా తెలుగు అయ్యవారి దగ్గర ఈ విషయం గురించి వాపోతే, వారు దాన్ని ఈ విధంగా సరిదిద్దేరు. "బొటన వేలివ్వమనె అపటి (కపటి కాదు) ఆ ద్రోణుడు, వల్లె యనే శిష్యుడు...."
""చెట్ల ఆకులు ఆకుపచ్చగా ఉండడం లాంటి తీవ్ర విషయాలకి మనోభావాలు దెబ్బతినిపించుకోగల సున్నిత మనస్కులూ, "
ReplyDelete"మన వాళ్ళొ ట్టి వెధవాయిలోయనుకుంటూ, బయటివాళ్ళు పొగిడితే వాడు మావాడేనని చంకలు గుద్దుకుంటూ, ఆంధ్రా మిల్టననో, ఆంధ్రా హోమరనో ఓబిరుదిచ్చి వాళ్ళకి స్వంత ప్రతిభలేదని నర్మగర్భంగా ప్రకటించేస్తారు."
"సందేహపడితే చేయి కాల్చుకుని కూడా తెలుసుకోవచ్చు!!!"
భలే చెప్పారు. :)
"గురువు నీడని కూడా తాకలేనంత దూరం లో భక్తితో మెలగాలని అక్కడి పాతకాలం నాటి నియమంట."
దూరం విషయంలో మాత్రం మన "ఉపనిషత్తు"లు దానికి వ్యతిరేకం!
నాగరాజు గారు కోట్ చేసిన వాక్యం గుర్తుంచుకోదగ్గది.
చిన్నమయ్య గారు,
ReplyDeleteఏకలవ్యుడు కీర్తిని కోరాడా లేక గొప్ప వీరుడు కావాలనుకున్నాడా చెప్పండి. దాన్ని బట్టి ద్రోణుడు చేసింది తప్పో ఒప్పో తేలుతుంది. మొండి వేలితో కూడా యుద్ధం చేశాడు కానీ అతడు అప్పుడు అరివీరభయంకరుడు కాడు. పూర్తి సామర్థ్యంతో యుద్ధం చేసినట్లైతే అతడి కీర్తికి వచ్చే లోటేమిటో నాకు అర్థం కాలేదు.
Dear telugu blogger,
ReplyDeleteWe are from enewss and aggregate indian blogs. Please visit us at http://www.enewss.com and submit your blog rss/atom feeds.
Best regards
sridhar