తెలుగు బ్లాగుల దినోత్సవం
ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
ఈరోజు తెలుగుబ్లాగుల దినోత్సవం జరుపుకోవడం, ఆసందర్భంగా అంతర్జాతీయంగా బ్లాగర్లు సమావేశాలు జరుపుకోవాలనుకోవడం రెండేళ్ళ తెలుగు బ్లాగరుగా నాకు సంతోషం కలిగించిన విషయాలు. సుమారు రెండేళ్ళకితం నవంబరులో నేను నా సత్యశోధన బ్లాగుతో మొదలెట్టి చిత్రవిచిత్రాలు ఫొటో బ్లాగు, లలితగీతాల బ్లాగు మొదలెట్టా. కానీ, సత్యశోధన తోనే కాలం గడిచిపోతోంది. అదికూడా అడపా దడపా వ్యవహారంగా అయిపోయింది. నేను మొదటితరం తెలుగుబ్లాగరును కాదు కానీ మొదటితరం బ్లాగరుల ప్రోత్సాహక మార్గదర్శక పంధావల్ల లాభపడి బ్లాగడంలోని ఆనందాన్ని అనుభవించినవాడ్ని. పేరుపేరునా నాకు స్ఫూర్తినిచ్చిన, ప్రోత్సహించిన బ్లాగరులని వారిని ఈసందర్భంగా తలుచుకుంటున్నా. వారి పేర్లు ఇక్కడ ఇవ్వడంలేదు. అసలే ఈమధ్య బ్లాగ్లోకంలో కలకలంగా ఉంది. ఎవరిపేరైనా మరచినా, ఎవరికైనా నచ్చని పేరిచ్చినా హిట్లూ, తిట్లూ తప్పవు. కానీ ఈసందర్భంగా కొన్ని అనుభవాలని తలుచుకోదలిచా.
తెలుగు గుంపు
ఈ గూగులు గుంపు లో చర్చలు కొన్ని సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడ్డాయి. ఇక్కడ ఓజాబు పడేయగానే సలహాలు వచ్చేవి. ఇక్కడ తెలుగులో వ్రాయడం ఎలా లాంటివి నిత్యోపయోగ విషయాలు. ఇక్కడ చర్చలు రసవత్తరంగా ఉండి తెలుగు గుంపు నిర్వహణకి, కూడలిని మెరుగుపెట్టడానికీ, తెలుగువ్యాప్తికీ దోహదంచేసాయనడంలో సందేహం లేదు.
సమావేశాలు
ఇవి క్రమంతప్పకుండా హైదరాబాదులో జరుగుతుంటాయి. తర్వాత బెంగళూరు బ్లాగరులు కూడా మొదలెట్టారు. ఇవి ఎక్కడ జరిగినా మొత్తం తెలుగు బ్లాగ్లాకానికి తెలిసేట్టు సమావేశవివరాలు చిత్రాలతో పాటు బ్లాగేవారు. నేను హైదరాబాదు సమావేశాలకి వెళ్ళిన సందర్భాలు బహు తక్కువైనా సాటిబ్లాగరులు నాకిచ్చిన గౌరవం, కలిగించిన ఉత్సాహం చెప్పుకోతగ్గవి. వాళ్ళు తెలుగు వ్యాప్తికి, బ్లాగుల వ్యాప్తికి చేసిన నిస్వార్ధ, నిరాపేక్ష సేవ, వెచ్చించిన సమయం నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగించేవి- ఇంత చిన్నవయసు వాళ్ళలో తెలుగంటే ఇంత కమిట్మెంటా అని. తర్వాతరోజుల్లో వయసొచ్చిన వాళ్ళ కమిట్మెంటు చూసి ఈవయసులో ఇంత ఓపికా అని కాస్త సిగ్గేసేది. మొత్తమ్మీద ఆంధ్రులందు బ్లాగర్లు వేరయా అనిపించేలా ఉండేది తెలుగు బ్లాగరుల వ్యవహారశైలి.
ఈనేపధ్యంలో ఆరోజుల్లో ఓ ఎనక్డోట్ కూడా రాద్దామనుకున్నా. ఆ కధా విశేషం ఇదిగో కనండి -
ఓపీతల వ్యాపారి పీతలని మూతల్లేని డబ్బాల్లో ఎగుమతి చేసేవాడట. అది చూసి ఆశ్చర్య పోయి ఒకాయన అడిగితే ఆవ్యాపారి ఇవన్నీ భారతీయ పీతలు ఒకరెవరైనా బయట పడదామని ప్రయత్నిస్తే వేరేవి వెనక్కి దిగలాగేస్తాయని చూపించి మరీ విశ్మయం కలిగించాడట.
ఓస్ .. ఇది మాకూ తెలుసంటారా ? ఇంకాస్త చదవండి ...
ఈవిషయం గొలుసు మెయిళ్ళ ద్వారా పాకింది. మేనేజ్మెంటు పాఠాల్లోకి వెళ్ళింది. అలాంటి పాఠాలు బట్టీకొట్టిన ఓఅబ్బాయిని పనిలో పెట్టుకున్నాడీ పీతలవ్యాపారి. కొన్ని డబ్బాలకి మూతలుంచి ఎగుమతి చేస్తోండడం చూసి ఆఅబ్బాయి తను నేర్చుకున్న పాఠాలు వాడి అన్ని డబ్బాలకీ మూతలు పీకించేసాడు. ఖర్చు తగ్గింది. కానీ దిగుమతి దారుల నుండి పీతలు మిస్సంగని ఫిర్యాదుల మీద ఫిర్యాదులొచ్చేవి. ఠావుల్తప్పిన ఆవ్యాపారి ఆరా తీసి నిలదీస్తే ఆఅబ్బాయి తను చేసిన పని చెప్పి తేడా ఎక్కడొచ్చిందో తెలియక తికమక పడుతున్నానని బాధపడ్డాడు. ఆవ్యాపారి ‘బాబూ నువ్వు నేర్చుకున్న పాఠాలు, చేసిన పని సరైనవే కానీ, నువ్వు మూతలు తీసేసిన డబ్బాల్లోవి తెలుగుబ్లాగరు పీతలు. దే ఆర్ డిఫ్ఫెరెంటు యూనో’ అని బోధించాడు.
అప్పుడెప్పుడో రాసుంటే మామూలుగా ఇక్కడితో ఆపేయాల్సినదే. కానీ ఇప్పుడు రాస్తున్నా కాబట్టి ...
(ఇంకొద్దిగా ఉంది)
:)మిగతాది ఎప్పుడో మరి!
ReplyDeleteఆ మిగతా కొద్దిగా కూడా చెప్పెయ్యండి...
ReplyDeleteవ్రాయండి వ్రాయండి!
ReplyDelete