ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తోంది. పరీక్షలకీ, కాపీలకీ ఉన్న అవినాభావ సంబంధం అంతా ఇంతా కాదు. ఎవరో మహాత్మాగాంధీ లాంటి వాళ్ళు తప్ప – లాంటి వాళ్ళు కాదు, ఆయనొక్కడేనేమో- వేరే ఎవరూ ఆప్రలోభాన్ని ఆపుకోలేరేమో.
నేను అయిదో క్లాసులో ఉండగా జరిగిందిది. సోషల్ బొత్తిగా ఎక్కేది కాదు. చదువుతోంటే చాలా బాగుండేది. పరీక్షలో రాయాలంటే ఒక్కముక్క వచ్చేదికాదు. అప్పుడే కాదు, ఆతర్వాత తరగతులలో కూడా అదే పరిస్థితి. పదో తరగతిలో అయితే అన్ని సబ్జెక్టుల్లోనూ 80 - 90 దాటి, సోషల్ 56 శాతం. పరీక్ష ముందు ఓరెండురోజులపాటు కూర్చుని చిన్న చీటీలమీద సమాధానాలు రాయడం మొదలెట్టా. ఇంట్లోవాళ్ళందరూ అటూ ఇటూ వస్తూ పోతూ చూసి ‘ఏరా కాపీకొట్టడానికా’ అని పలకరించారు. లోపల ఉద్దేశ్యం అదే అయినా పైకి బింకంగా అబ్బే లేదు. చదవడానికి ఈజీగా ఉంటుందని ఇలా రాసుకుంటున్నా అని చెప్పి నా పని కొనసాగించా. రోజు గడిచేసరికి ఓపది మంది ఇలా అడిగేసరికి, పది సార్లు ఇదే సమాధానం చెప్పా. పదిసార్లు అలా అంతరాత్మని వంచించాక లోపల ఆలోచన మెదలయ్యింది. చివరికి నేను చేయబోతున్న పని నాకే నచ్చక రాసిన చీటీలన్నీఅవతల పడేసా. మరుసటి రోజు పరీక్ష యధాప్రకారం గ్రీకండ్లాటిన్. మా క్లాసుమేటు వాళ్ళన్నయ్య వాళ్ళ తమ్ముడి కోసమో, పక్కనున్న పాలకేంద్రానికొచ్చో మా స్కూలుకొచ్చి నేనేమీ రాయకపోవడం చూసి బోలెడు జాలిపడి వాళ్ళతమ్ముడు రాసేసి అవతల పడేసిన స్లిప్పులు ఏరుకొచ్చి నాకు ఓనాలుగు సమాధానాలు డిక్టేషనిచ్చాడు, మాటీచరు వారిస్తోన్నా వినకుండా. ఆకుర్రాడు మాస్కూలు పూర్వవిద్యార్ధి. ఆతర్వాతి సంవత్సరాలలో ఎలాస్ఠిక్ బాండుల పుణ్యమా అని (చీటీలు కాళ్ళకి కట్టుకున్నది వీటితోనే కదా) టెన్తులో జామ్మని మొదటి ఛాన్సులోనే పాసయిపోయాడు.
కాపీలంటే ఇలా చీటీలే అక్కర్లేదు, వేరేరకంగా కూడా చేయచ్చని నాలుగోక్లాసులోనే తెలుసుకున్నా. మాసారు 1 నుండి 20 వరకు అంకెలకి ఇంగ్లీషు స్పెల్లింగులు బోర్డుమీద రాసి తర్వాతి రోజు అప్పచెప్పమన్నారు. మేం అందరం చదువుకుని వెళ్ళాం. బోర్డుమీద ముందురోజు రాసినవి చెరిపేసాకకూడా లీలగా కనిపిస్తున్నాయి. నావంతు వచ్చినప్పుడు నేను బోర్డు చూసి చెప్పడం మొదలెట్టా. స్పష్టంగా లేకపోవడంతో నట్టుతూ చెప్పా. మాస్టారు నాలాంటి వాళ్లనెంత మందిని చూసుంటారో కదా. నా అతితెలివిని కనిపెట్టి చేతికొచ్చిన డస్టరుతో నన్ను ఓరెండేసి బోర్డుకేసి చూడకుండా చెప్పమన్నారు. ఆదెబ్బలకి కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. బోర్డుకేసి చూడకుండా గడగడా అన్నీ కరెక్టుగా అప్పచెప్పేసా. అప్పుడు మాస్టారు, అన్నీ తెలిసీ కూడా బోర్డుమీద చూసి ఛీటింగు చేయడం ఎందుకూ అని కాస్త గడ్డిపెట్టారు. నాకు కూడా చాలా అవమానంగా అనిపించింది. కరెక్టేకదా, చదవగలిగీ కూడా షార్టుకట్ ఎందుకు అవలంబించాను అని సిగ్గుపడి, శోధించుకుని ఇప్పటివరకూ ఇలాంటి షార్టుకట్ల జోలికి పోలేదు. షార్టుకట్లదారి దూరంగా ఉంటుందని తెలియచెప్పిన ఆమాస్టారికి ఇప్పటికీ, ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటా. కాపీ అన్నది పరీక్షలలో ఐనా, జీవితంలోనైనా మన అభివృద్ధికి ప్రతిబంధకం. కాపీ మాస్ఠర్లు కొంతకాలం ఎలాగో కాస్త పేరు తెచ్చుకుంటారేమోకానీ కాపీ ఎప్పుడైనా కాపీయే.
ఆతర్వాత రోజుల్లో నాకు గుర్తున్నంతవరకూ నానుంచి కాపీ కొట్టిన సంఘటనలే కాని నేను కాపీ చేసిన (పరీక్షలలోనే కాక ఇతర విషయాల్లో కూడా) సంఘటనలు లేవు.
ఇంతకీ ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే, దహనూలో చించనే ఎడ్యుకేషనల్ సంస్థనడుపుతున్న 75 ఏళ్ళ రజనీకాంత్ ష్రాఫ్ అనే ఆయన ఈమధ్య కాపీలు తగ్గించడానికి ఓకొత్త పధ్ధతి ప్రవేశ పెట్టాడు. ఆయన ఏకంగా పిల్లల తల్లిదండ్రులనే పర్యవేక్షకులుగా నియమించాడు. తల్లిదండ్రులముందు కాపీ చేయడానికి సిగ్గుపడతారన్న సిధ్ధాంతం మేరకు ఆయన ఈ పద్ధతి ప్రవేశపెట్టి మంచిఫలితాలని సాధించాడు. దీనిలో పాల్గొన్న తల్లిదండ్రులు తమ సంతృప్తిని వ్యక్తపరిచారు. ఈపెద్దాయన 2001లో అంత్యపరీక్షలకి 4 రకాల పరీక్షా పత్రాలు తయారు చేసి ఎవరికి ఏపేపరొస్తుందో తెలియకుండా చేసాడట. దీనితో కోచింగు సెంటరు వాళ్ళు తయారు చేసే ఎక్స్పెక్టెడ్ (లీక్ డ్ అని చదువుకోండి) పరీక్షాపత్రాల తయారీని ఆపచ్చని ఆయన వాదన. ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కన్విన్స్ చేసి, ఈపద్దతి రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టేలా చేసాడు.
ఈవార్తతోపాటే చదివిన ఇంకోవార్తకూడా పరీక్షలకి సంబంధించినదే. ఒకబ్బాయికి ప్రత్యేకంగా ఏసీ రూములో పరీక్షరాసే సదుపాయం కల్పించారు. ఆఅబ్బాయికి ఉన్న ఒక అరుదైన చర్మవ్యాధివల్ల అతనికి చెమటగ్రంధులు లేవుట. అందుకని చెమట పట్టదుట. చెమట పట్టక పోతే మన శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధమవదట. జ్వరం వస్తే అంతే సంగతులు. మనం ఛీ వెధవ చెమట అని మనం విసుక్కు పోయే చెమట మన శరీరానికి ఎంత అవసరమో కదా. ఈవ్యాధి జన్యుపరంగా వచ్చే Anhidrotic Ectodermal Dysplasia. ఆస్కూలువాళ్ళు చూపించిన ప్రత్యేకశ్రద్ధని నేను మెచ్చుకుంటున్నా.
పరీక్షలు రాస్తున్న, రాయబోతున్న విద్యార్ధినీ, విద్యార్ధులకి నా ప్రత్యేక ఆశీస్సులు.
సత్యసాయి కొవ్వలి