దేశాభిమానం
మన స్వాతంత్ర్యసమరం అన గానే గుర్తుకొచ్చేది బోసినవ్వుల గాంధీ. కేవలం మన రూపాయి నోట్లమీద మాత్రమే మిగిలిపోయిన మహాత్ముడు. ఆయన మీద చాలామంది బురద జల్లి మన సంస్కృతి మీద మనకే రోత కల్పించే కార్యక్రమం చేసారు, చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా గాంధీ గాంధీయే. ఆయన రచనలు పుంఖాను పుంఖలు. వాటిలో ఆయన స్పృశించని విషయాలు లేవు.
జెజూ ద్వీపం (కొరియా) లో టెడ్డీ బేర్ మ్యూజియం లో గాంధీ బొమ్మ వాళ్ళ చారిత్రక పురుషుల సరసన పెట్టడం చూసి చాలా గర్వంగా అనిపించింది (క్రింది ఫోటో చూడండి). ఇండియా అనగానే అక్కడి వాళ్ళు గాంధీ గురించి చదువుకున్నాం అని చెప్తారు.
గాంధీగారు వాడిన 5 వస్తువులని (కంచం, కప్పు, కళ్ళద్దాలు, వాచీ, చెప్పులు) వాటి హక్కుదారుడు జేమ్స్ ఓటిస్ ఈమధ్య వేలం వేసాడు. అవి ఎవరో కొనేస్తే మన సంస్కృతిని ఎలా కాపాడుకోవాలోనని ఏలినవారితో సహా చాలామంది ఆదుర్దా చెందారు. వాటిని మన విజయ మాల్యా గారు 1.8 మిలియన్ డాలర్లు పెట్టి వేలంలో కొని కథ సుఖాంతం చేసారు. నాకైతే ఈవస్తువులు ఓటిస్ చేతికెలా వెళ్ళాయో, ఇన్నాళ్ళూ ఎవరూ వెనక్కి తేవాలని ఎందుకు పూనుకోలేదో తెలియదు. ఈవిషయం గురించి తెబ్లాలెవరూ స్పందించినట్లు లేదు. ఎందుకో మరి.
మన సంస్కృతి శాఖ మంత్రి అంబికా సోనీ ప్రకారం ఏలినవారే మాల్యా ద్వారా కొనిపించాం అని చెప్పారు. దానికోసం డబ్బులు అమెరికాలో ఉన్న భారతరాయబారి కార్యాలయం ద్వారా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తనంతట తానుగా కొన్నానని, ఎవరి పనుపునా కాదని, రాయబారి కార్యాలయం నుండి డబ్బుల గురించి సమాచారమేమీ రాలేదని విజయ మాల్యా నొక్కి మరీ చెప్పారు (ఇంకెవరైనా ఇంకేమైనా నొక్కాసారేమో తెలియదు. పాపం శమించు గాక). ఇంతకు ముందు కూడా టిప్పు సుల్తాను కత్తిని వేలంలో కొని మన దేశానికి తిరిగి తీసుకొచ్చానని కూడా ఆయన గుర్తు చేసారు. మన ప్రభుత్వం ఓటిస్ తో మంతనాలు జరిపిన మాట నిజమే. కానీ ఓటిస్ కొన్ని షరతులు విధించాడు. అవేమిటంటే- మన ప్రభుత్వం ఆరోగ్యానికి కోటాయింపులు పెంచాలి లేదా గాంధేయ విలువలని ప్రపంచానికి మన రాయబారి కార్యాలయాల ద్వారా వ్యాప్తి చేయాలి. ఇవి మన దేశ సార్వభౌమాధికారానికి దెబ్బ అని ఒప్పుకోలేమని విదేశాంగ మంత్రి ఆనంద శర్మ అన్నారు. మనం గాంధీని మరిచి పోవడం అనే మన సార్వభౌమాధికారాన్ని బయటి వాళ్ళు గుర్తు చేయడం తప్పనా. మొదటి షరతు ఓకే కానీ రెండోది ఏరకంగా దెబ్బో నాకు తెలియలేదు. అయినా షరతులు పెట్టిన వాడు ఒప్పుదలయ్యే షరతులు, ఉదా. గాంధీ అని ఇంటి పేరున్న వాళ్ళే ప్రధాన పదవులు చేపట్టాలనో లాంటివి, ప్రజా నాయకులకి గాంధీ అలవెన్సివ్వాలనో పెట్టాలి కానీ పేచీకోరు షరతులేంటి.
ఇదిలా ఉండగా, ఓటిస్ దగ్గర గాంధీగారి చితాభస్మం, కాల్చబడిన చోటునుండి తీసిన రక్తం ఉన్నాయిట. అవి కూడా త్వరలో అమ్మచ్చుట. ఇంతేకాదు, ఇలాంటి జ్ఞాపకాలు, వేరే నాయకులవీ, మన ఇటీవలి చరిత్రకి సంబంధించినవి చాలా ఉండచ్చు. వీటన్నిటినీ సేకరించి, భద్ర పరచి భావితరానికి అందించేందుకు చేయాల్సిన కృషిని ఈ గాంధీ గారి వస్తువుల వేలం మనకి గుర్తుకు చేస్తోంది.
పుల్లలు, చెక్కగోళీ తో నేను చేసిన 8 అంగుళాల గాంధీ తాత – మూడు పార్శ్వాలు.
సత్యసాయి గారు,
ReplyDeleteమీ టపా ఆలస్యంగా చూస్తున్నాను, క్షమించాలి.
"అయినా షరతులు పెట్టిన వాడు ఒప్పుదలయ్యే షరతులు, ఉదా. గాంధీ అని ఇంటి పేరున్న వాళ్ళే ప్రధాన పదవులు చేపట్టాలనో లాంటివి, ప్రజా నాయకులకి గాంధీ అలవెన్సివ్వాలనో పెట్టాలి కానీ పేచీకోరు షరతులేంటి. ..
బాగా చెప్పారు. ఇక్కడ ఎలాంటి షరతులు అమలవుతాయో ఓటిస్ కేమి తెలుసు పాపం? అయినా ఇదంతా ఎన్నికల స్టంటు, మాల్యా గారి IPL స్టంటూ తప్ప మరేమీ కాదనిపిస్తోంది నాకు.
గాంధీ బొమ్మ చాలా బాగుంది!
ReplyDelete