జ్యోతి వలబోజు గారు రాసిన వ్యాసానికి నాకవిత్వం జతచేస్తే వచ్చినదిది. దీని పిడిఎఫ్ ఇక్కడ.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు
పదిహేనుకోట్లమందికి పైగా మాట్లాడే భాష తెలుగు. కాని నేడు మాట నేర్చినది మొదలు
మాతృభాష కన్నా ఆంగ్లమే ముద్దుగా మారింది.. మీకు నచ్చిన పుస్తకం ఏదని అడిగితే
ఎక్కువ శాతం ఇంగ్లీషు నవలల గురించే మాట్లాడుతున్నారు. ఇంగ్లీషులో చదవడం, మాట్లాడడం అలవాటైన తెలుగువారు ఇది మన భాష అని గర్వంగా చెప్పుకోవడం లేదు.
ఈ తరం యువతకు తెలుగులో మాట్లాడడం వచ్చినా చదవడం , రాయడం కష్టం అంటున్నారు. అది విని మనసు కలుక్కుమంటుంది. రాబోయే తరం వారు
తెలుగు అంటే ఏంటి? ఎలా ఉంటుంది? జిలేబిల్లా ఉంటుంది అదేనా ? అని
అడుగుతారో అని సందేహం కలగక మానదు. సర్వం ఇంగ్లీషుమయమైన ఆధునిక కాలంలో తెలుగు
మరుగునపడిపోతుందని అందరూ దాదాపు ఖరారు చేసిన తరుణంలో అంతర్జాలంలో తెలుగు
ఆవిర్భవించింది. అది కూడా యువతరం వల్ల.
అంతర్జాలం (ఇంటర్నెట్) ప్రపంచాన్ని ఒక
కుగ్రామంగా మార్చేసింది.ఇంతవరకు ఆ కుగ్రామంలో ఏ పని చేయాలన్నా ఇంగ్లీషు మాత్రమే
ఉపయోగింపబడేది. కాని ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇంటర్నేట్‌లో తెలుగు విస్తృతంగా
వ్యాపించింది అని గర్వంగా చెప్పుకోగలం. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించింది అని
మురిసిపోయాం, గర్వపడ్డాం. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం
త్వరితగతిని అభివృద్ధి చెందుతున్న కారణంగా తెలుగుకు ఆధునిక హోదా లభించింది అని
ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. ఎటువంటి ఉద్యమాలు, నినాదాలు లేకుండానే నేడు వెబ్ ప్రపంచంలో తెలుగు వెలిగిపోతోంది.
పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు మాత్రమే కంప్యూటర్ అవసరం అనే రోజులు పోయాయి.
స్కూలు పిల్లలకు కూడా కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్
తప్పనిసరి అవసరమై పోయింది. ఈ కంప్యూటర్, అంతర్జాలం
కేవలం ఇంగ్లీషు వచ్చినవాళ్లకు , సాంకేతిక నిపుణులకు
మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే. ఇప్పుడు కంప్యూటర్లో చాలా సులువుగా,
ఎటువంటి ఖర్చు లేకుండా తెలుగు చదవవచ్చు, రాయవచ్చు. ఉత్తరాలు కూడా తెలుగులోనే రాసి పంపుకోవచ్చు. తెలుగు భాష మీద
అభిమానం, నేర్చుకోవాలనే ఆసక్తి, రాయాలనే తపన ఉంటే చాలు. కొన్నేళ్లక్రితం వరకు ఇంటర్నెట్ ఇంగ్లీషులోనే
ఉండేది. తెలుగు రాయాలన్నా, చదవాలన్నా కష్టంగా
ఉండేది. తెలుగులో రాయడానికి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కొనాల్సి వచ్చేది. ఇంటర్నెట్
లో తెలుగు వాడకం 90వ దశకం నుండి చివరినుండి మొదలై గత
నాలుగేళ్లుగా అతి వేగంగా వ్యాప్తి చెందింది. మాతృభాష మీది అభిమానంతో ఎందరో సాఫ్ట్‌వేర్
నిపుణులు కృషి చేసి కంప్యూటర్లో తెలుగు చదవడం, రాయడం సులభతరం చేసారు. ఇంటర్నెట్ వాడకం ప్రతి ఇంటిలో తప్పనిసరిగా మారిన
క్రమంలో తెలుగుబాషా వ్యాప్తి కూడా చాలా వేగంగా జరుగుతుంది. దీనివల్ల
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్న తెలుగువారు దగ్గరయ్యారు. ఎంచక్కా తమ
మాతృభాషలోనే పరస్పర సంభాషణలు, ముచ్చట్లు ,
రచనలు చేస్తున్నారు.అంతేకాక ప్రింట్ లో ఉన్న
పత్రికలన్నీ ప్రపంచం మారుమూలలకు చేరుతున్నాయి. ప్రతీరోజు ఈ పత్రికలను నెట్ లో
పెడుతున్నారు ఆయా పత్రికాధిపతులు. దీనివల్ల తెలుగువారు ఎక్కడున్నా తమ మాతృదేశానికి
సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోగలుగుతున్నారు.
వృత్తి, ప్రవృత్తిరీత్యా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగువారు
ఈనాడు అంతర్జాలంలో ఒక ప్రపంచం సృష్టించుకున్నారు. ఎన్నో బ్లాగులు, వెబ్ సైట్లు, వెబ్ పత్రికలు
అచ్చమైన తెలుగుభాషలో ప్రచురించబడుతున్నాయి. వీటన్నింటికీ విషయసూచికలా పనిచేస్తూ, జాలంలో
ప్రచురించీ ప్రచురించగానే పాఠకులకి తెలిపేందుకు కూడలిf, హారం, మాలిక, జల్లెడ లాంటి వెబ్సైట్లు పనిచేస్తున్నాయి. సందేహనివృత్తికీ, వాదప్రతివాదాలకీ
వీలుకల్పిస్తూ వివిధ విషయాలపై చర్చావేదికలు నడుస్తున్నాయి. వీటివల్ల ఔత్సాహికులైన
వారు రచయితలుగా వృద్ధి చెందుతున్నారు. . గృహిణులు, విశ్రాంత పండితులు, రిటైరైనవారు సైతం
కంప్యూటర్ మరియూ అంతర్జాలాలను
విరివిగా ఉపయోగిస్తున్నారు. పండితులైనవారు తమ వద్ద ఉన్న అపురూపమైన రచనలను బ్లాగులు,
వెబ్ సైట్లు, పత్రికల ద్వారా అందుబాటులో ఉంచుతున్నారు. అంతే కాక ఎన్నో పురాణ గ్రంధాలు,
ప్రబంధాలు కూడా అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి.
భవిష్యత్తులో తెలుగు సాహిత్యాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి ముందు తరాలవారికి
అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. పాత
ఆకాశవాణి శీర్షికలూ, నాటకాలూ, పాటలూ పద్యాలు ఇంకా ఇతర గుప్తనిధులని మాగంటి వారి
వెబ్ సైటు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల
ప్రపంచంవ్యాప్తంగా అపార సంస్కృతీ సంపద అందుబాటులో ఉంటుంది. వికీపీడియా అనే అంతర్జాలంలో ఉన్న ఉచిత
విజ్ఞానకోశంలోని తెలుగు విభాగంలో ఆంగ్లం తర్వాత అత్యధికసంఖ్యలో వ్యాసాలు కూర్చి,
తెలుగులో విజ్ఞానాన్ని జనబాహళ్యానికి అందించిన
ఘనత మనతెలుగువారిదే అని ఇక్కడ సగర్వంగా చెప్పుకోవాలి.
పొద్దు, ఈమాట, మాలిక, కౌముది మొదలైన సాహితీ పత్రికలు జాలంలో తెలుగు సాహిత్య
ఔన్నత్యానికి ఎనలేని సేవలందిస్తున్నాయి.
కొత్త తరం రచయితలతో పాటు వసుంధర, గొల్లపూడి, మల్లాది వంటి చేయితిరిగిన రచయితలు
కూడా అంతర్జాల పత్రికలలో తమ రచనలను ప్రచురించడం గమనార్హం. సాహితీవైద్యులైన వసుంధర గారు అంతర్జాలంలో కూడా
తమ బ్లాగు ద్వారా వైద్యాన్ని కొనసాగిస్తూ అనేకమంది వర్ధమాన రచయితలకు భౌగోళిక
హద్దులతో నిమిత్తం లేకుండా ప్రోత్సాహమందిస్తున్నారు. బ్లాగులు, జాల పత్రికలు, చర్చావేదికలు, వెబ్
సైట్లు వంటి వివిధ మాధ్యమాలద్వారా తెలుగు సాహిత్యంలో అనేక శతాబ్దాలుగా
ఆవిష్కరింపబడిన అన్ని రకాల ప్రక్రియలనూ తెలుగువారు కేవలం కొన్నిసంవత్సరాలలోనే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాటి తెలుగు వారితో దాదాపు ఉచితంగా పంచుకొంటున్నారు. పిల్లల సాహిత్యం, పద్యసాహిత్యం, గద్యసాహిత్యం,
కథలు, కథానికలు, పాటలు, సంగీతం, సమస్యాపూరణం, హాస్యం, వ్యంగ్యం, పేరడీ, గళ్ళ
నుడికట్టుx – ఇలా తెలుగువారికి సంబంధించిన
ఏప్రక్రియైనా సరే, అంతర్జాలంలో క్షణాల్లో ప్రత్యక్షం. అదీకూడా, ముఖ్యపదాలు అందిస్తే చాలు కంప్యూటరు
దాని పిలక పుచ్చుకుని మీముందుంచుతుంది.
అది కేవలం ఒక ఇంద్రజాలంలా అనిపిస్తుంది.
అంతేకాక, అనేక కొత్తపదాలను కనిపెట్టి వీరతాళ్ళు వేయించుకున్నారు మన తెలుగు
సోదరులు. పొద్దు పత్రిక వారు ఉగాది, దసరా వంటి సందర్భాలలో కవిసమ్మేళనాలు
నిర్వహించడం, వాటిలో వివిధ ప్రాంతాల్లో ఉండే కవులు (ఎక్కువ మంది ఈతరం వాళ్ళే)
చాటింగు ప్రక్రియ ద్వారా పాల్గొనడంతో పాటు, ప్రేక్షకులు కూడా పాల్గొనగల్గడంతో
కవిసమ్మేళనాలకే ఒక ప్రామాణికత తీసుకొచ్చాయనడం అతిశయోక్తి కాదు. అంతేకాదు, తెలుగువారికి మాత్రమే సొత్తైన అవధాన
ప్రక్రియని కూడా అంతర్జాలంలో నిర్వహించి తమప్రత్యేకతను తమదైన రీతిలో చాటుకున్న
తెలుగువారికి, వారి సాహితీసేవకి మనందరం జేజేలు చెప్పాలి.
తెలుగువారు కంప్యూటర్ రంగంలో ముందంజవేసి
తమ వైశిష్ట్యాన్ని చాటుకోవడంతో పాటు, ఆసాంకేతికనైపుణ్యాన్ని తమ తెలుగుసంసృతిని
తమదైన శైలిలో నలుగురితో పంచుకోవడం కోసం వాడుకోవడం ఆదర్శప్రాయం. మన సాంకేతిక నిపుణులు తెలుగుబాషాభివృద్ధికి తమ
వంతు కృషి చేసారు, చేస్తూ ఉన్నారు. అది కూడా నిస్వార్ధంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా. అంతేకాక,
జాలంలో సాహిత్యకృషిచేస్తున్న వారిలో అధికతములు పిన్నవయస్కులవడం, పెద్దలూ, పిన్నలూ
ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకుసాగడం గమనించవలసిన విషయం.
పాశ్చాత్యపు పెనుతుఫానుకు రెపరెపలాడి, మాయమయిపోతుందనుకున్న తెలుగు, ఆ పాశ్చాత్య సాంకేతికాభివృద్ధినే ఆలంబనగా చేసుకుని వటుడింతై, ఇంతింతై అన్నట్లుగా అంతర్జాతీయస్థాయిలో భాసిల్లడానికి కారణం ..ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు.
f
తెలుగుని ఆంగ్లలిపిలో రాస్తే తెలుగులోకనిపించేలా
చేసే లేఖిని అనే ఉపకరణాన్ని కనిపెట్టిన వీవెన్ దీన్ని ప్రారంభించారు. అంతకూ ముందూ,
తర్వాతా ఇటువంటి ఉపకరణాలు వచ్చినా దీనికి అధిక ప్రాచుర్యం వచ్చింది. బరాహా కూడా
తెలుగువ్రాయడానికి చాలా ఉపయోగకరమైన ఉపకరణమైంది. తర్వాతికాలంలో ఇన్ స్క్రిప్టు
పద్ధతివచ్చి తెలుగుని వ్రాయడాన్నిపూర్తిగా సులభతరం చేసింది.
x
పొద్దు పత్రిక జాలచరిత్రలోనే అపురూపమైన విధంగా
అక్కడికక్కడే జాలంలోనే గడినింపే వీలుగా ‘గడి’ నిర్వహించి చరిత్రకెక్కింది.
నిజమేనండి. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteఅంతర్జాలం లో తెలుగు వెలుగు కోసం శ్రమించే అందరికి వేన వేల వందనాలు. ధన్యవాదములు.
ReplyDeleteతెలుగు ఉనికి , గొప్పదనం చిరస్థాయిగా నిలుపుకుంటాం అనుటలో ఎట్టి సందేహం లేదు.