Monday, June 22, 2020

నేను, మా నాన్న


నేను, మా నాన్న
ఈవేళ పితృదినోత్సవం, సంగీతదినోత్సవం, యోగా దినం కలిసివచ్చాయట. ఫేస్బుక్ లో కొన్ని పోస్టులు చదివేసరికి మానాన్నగారు గుర్తొచ్చారు. ఇక్కడ గారు అని వ్రాసా కాని, ఆయనని నాన్నా అని పిలిచేవాడిని, నువ్వు అని సంబోధించేవాడిని, మాఅక్కా వాళ్ళు వారించినా కూడా.  మన నాన్నే కదా నువ్వు అంటే దూరంఅనిపిస్తుంది అని లాజిక్ చెప్పేవాడిని.  వాళ్ళు మాత్రం గౌరవవాచకాలు వాడేవారు.  మానాన్న చాలా తక్కువ మాట్లాడేవాడు. ఆకాలంలో పద్ధతి బట్టి  నాన్నలు గంభీరంగా ఉండేవారు.  మేం కాస్త పెద్దయ్యాక మా మధ్య సంభాషణలు కాస్త బాగానే జరిగేవి.
అప్పటికీ, ఇప్పటికీ మానాన్న నాకుఆదర్శమే. మాకు ఆయన హితబోధలు, ఉపదేశాలు చేసినట్లు అస్సలు గుర్తులేదు. నోరు తెరచి ఇలా చేయండి అని చెప్పినట్లు కూడా గుర్తులేదు. దండించి, ఉతికి భయపెట్టలేదు. గట్టిగా చదవమని చెప్పిన దాఖలాలు కూడా ఏమీలేవు. మమ్మల్ని దండించినది మొదటిసారీ, చివరిసారీ నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు.  తర్వాత ఒకసారి దండించే అవకాశాలు వచ్చాయి. మామూలుగా నాన్నలు కొట్టేసందర్భాలే. కానీ మా నాన్న తీరు వేరు. ఒకసారి నేను టార్చిలైటుతో ఆటలాడి, బల్బు విరక్కొట్టా. ఏమీతెలియనట్లు నటించినా, మాఅమ్మ కనిపెట్టి, నాన్నరాగానే చెప్పింది. మానాన్నదగ్గర డబ్బుల సమస్య చాలా ఉండేది. నిత్యావసరవస్తువులకే ఇబ్బందిగా ఉండేది.  అప్పడు బల్బు 75 పైసలు ఉండేది. కరువులో అధికమాసమే. కరంటు ఎప్పుడూ ఉండేది కాదు. కాబట్టి బల్బుకొనకా తప్పదు. ఆర్ధిక ఇబ్బందులున్నప్పుడు, ఇలాంటి పరిస్థితిలో మగాడు ఇంటికిరాగానే పెళ్ళం ఇలాంటి సమాచారం ఇస్తే విచారణకూడా లేకుండా వీపు విమానంమోత అయ్యుండేది. నేనుకూడా మానసికంగా రెడీ అయిపోయా.  మా నాన్న మాత్రం శాంతంగా జేబులో డబ్బులుంటాయి, తీసుకేళ్ళి బల్బు వేయించుకురా అనిమాత్రం అన్నారు. అంతే. కేవలం అంత మాత్రమే. నాలో మథనం, బాధ. నాన్న ఆర్ధికపరిస్థితి తెలుసు. ఆయన మనసులో కలిగిన భావనలు బయటికి తెలియవు. ఆయన ప్రవర్తించిన వైనం వల్ల నాలో కలిగిన పశ్చాత్తాపం, ఆయన కొట్టిఉంటే వచ్చిఉండేది కాదు. ఎప్పటికీ మర్చిపోలేని శిక్ష(ణ). మా అమ్మ ఎప్పుడైనా సరిగా చదవడంలేదు అని కంప్లైంట్  చేస్తే వాడి బాధ్యత వాడికి తెలుసు అని మాత్రం అనేవారు.  ఆమాటతో నామీద ఆయనకున్న నమ్మకాన్ని ఆయనతెలియజేస్తే, దాన్ని నిలుపుకోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చేది.
ఏదీ చెప్పకుండా కేవలం తన ప్రవర్తన ద్వారా మమ్మల్ని తీర్చిదిద్దిన ఘనత ఆయనది. ఒకసారి ఒక్క పైసా కూడా లేని స్థితిలో, ఒక్క సిగరెట్టుకూడా లేకుండాఉన్న పరిస్థితి.  ఆసమయంలో ఆయన బావమరిది మా ఇంటికి వచ్చారు.  ఆయన సిగరెట్టు ఆఫరు చేస్తే, సిగరెట్టు మానేసా అని చెప్పారే కానీ ఆయన దగ్గర మాత్రం తీసుకోలేదు.  పక్కనే ఉన్న నేను పొద్దుటినుండి డబ్బులు లేక సిగరెట్టుకాల్చలేదు కదా, ఇప్పుడు ఊరికే వస్తుంటే తీసుకోకపోగా మానేసా అని అబద్ధం చెప్పారేంటా అని అనుకున్నా. తర్వాత అర్ధమైంది. ఎట్టి పరిస్థితులలో అయినా సరే, మన ఆత్మ గౌరవం ఉంచుకోవడం చాలా అవసరం అని. ఎన్నో ఇలాంటి సంఘటనలు నాకు చాలా విషయాలని తెలియచెప్పాయి. ఒకసారి మాత్రం ఒకవిషయం డైరెక్టుగా చెప్పారు, పీ జీ తర్వాత నేను ఢిల్లీకి ఒక చిన్న ఉద్యోగానికి వెళ్తోంటే. చేరేది చిన్న ఉద్యోగమైనా, పెద్దగా ఎదగచ్చు, మీమామయ్య అలాగే ఎదిగాడు అని ఆయన చెప్పిన మాటలు ఎప్పుడూ గుర్తొస్తూ ఉండేవి.  ముఖ్యంగా ఎవరైనా నాది చిన్న ఉద్యోగమని భావన కలిగించడానికి  ప్రయత్నించినప్పుడు.
ఆయన చివరి రోజుల్లో ఆయనకి ఆనందం కలిగించాలని ఒక చిన్న టేపురికార్డు కొన్నాం. ఆయనకి టేపురికార్డరు, డైనింగు టేబుల్ లాంటి చిన్న కోర్కెలు ఉండేవి. తణుకులో స్థిరపడాలని కూడా ఉండేది.  ఒక జత బట్టలు నా పుట్టిన రోజని చెప్పి బహుకరిస్తే, చాలా సంతోషపడి అందరికీ చెప్పుకున్నారని తెలిసింది. ఆచివరి రోజుల్లో తెలిసినదేమిటంటే ఆయనకి హిందీ సినిమాల పరిజ్ఞానం చాలాఉందని. ఆయన చదువుకునే రోజుల్లోని సినిమాల గురించిన విశేషాలు చెప్తుంటే ఆశ్చర్యపోవడం నావంతైంది.  మన అమ్మ, నాన్నలకేం తెలుసో, ఎంత తెలుసో మనకే తెలియక పోవడం ఏం బాగాలేదుకదా.
మా నాన్న కి సంగీతం అంటే ఇష్టం. అప్పుడప్పుడు ఆయన మమ్మలని పక్కన పడుకో పెట్టుకుని చక్కగా పాడేవారు కూడా.  శేషశైలావాసా పాటలో చిరునవ్వులొలుకుచూ నిదురించు నీమోము అని పాడకుండా చిగురించు నీమోము అని పాడడం, మా అమ్మ అలా కాదని అని చెప్పడం, ఆయన కాదని అలాగే పాడడం, ఇప్పటికీ గుర్తుంది.  ఆయన తప్పు పాడడం కూడా మంచిదే అయింది.
నాన్న అనగానే నాకు గుర్తొచ్చేవి ఇంకా రెండున్నాయి. ఆయన నిబ్బరం.  దేనికీ చలించేవారు కాదు ఆయన. దేవుడిపై ఉన్న నమ్మకం వల్ల అంత ధైర్యం అనుకుంటా. రెండోది, ధనాశ లేక పోవడం.  ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, లెక్కలు, ఇంగ్లీషు చెప్తూ చాలా డబ్బులు సంపాదించగలిగినా కూడా, ఇచ్చుకోలేని వాళ్ళకి ఉచితంగా ప్రైవేటు చెప్తూ, ఇవ్వగలిగీ ఎగ్గొట్టిన వాళ్ళని కూడా ఏమీ అనకుండా ఉండేవారు.
నాన్నచాలా కష్టపడి చదువుకున్నాడట. మమ్మల్ని చాలా కష్టపడి చదివించాడు. ఈరోజు  మేం పిల్లాపాపలతో సరిపడా సంపాదనలతో సంతోషంగా ఉన్నామంటే, నాన్న కష్టం, నిస్వార్థం, కలలు ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా నాన్నలాంటి నాన్నని కాగలనాఅని డౌటు.
ఎప్పటికీ అర్ధం కాని విషయం ఏమిటంటే, నాన్న పోయిన మూడున్నర దశాబ్దలలో చాలాసార్లు ఆయన బతికే ఉన్నట్లు కలొచ్చేది. కలేమిటీ, నిజమే కదా. మాజ్ఞాపకాలలో ఆయన చిరంజీవే కదా.   
(నాన్న పేరు కొవ్వలి రమేష్ చంద్రబాబు. కొవ్వలి పద్మనాభరావు, లక్ష్మీకాంతం గార్ల రెండో కొడుకు. ఇరగవరం, తణుకు జిల్లా పరిషత్ హై స్కూళ్ళలో, ఇచ్చాపురం జూనియర్ కాలేజి, పెంటపాడు కాలేజీలలోపనిచేసి, తాడేపల్లిగూడెం కాలేజీలో పనిచేస్తూ జీవితవిరమణ చేసారు. )  

6 comments:

 1. చాలా చక్కగా, రాశారు సాయి...

  ReplyDelete
 2. చాలా బాగా వ్రాశారు సత్యసాయి గారూ.

  ReplyDelete
 3. నాన్నల గొప్పతనమే అదండీ...నోరు విప్పి చెప్పకుండానే అన్నీ నేర్పించడం. మన తరాలకి నాన్న అంటే ఓ గంభీరం, నాన్న అంటే ఓ మౌనం, నాన్న అంటే ఓ బాధ్యత, నాన్న అంటే ఓ పద్దతి, నాన్న అంటే ఓ నమ్మకం.

  ReplyDelete
 4. చాలా తియ్యగా ఉందండి చదవడానికి!

  ReplyDelete
 5. సాయి గారు నాన్న గురించి అద్భుతంగా రాశారు. మనం చదువుకునే రోజుల్లో అప్పుడప్పుడూ మీ ఇంటికి వచ్చే వాడిని.నాన్న గారి తో అంత సాన్నిహిత్యం లేకపోయినా ఆయనంటే ఒక భయంతో కూడిన గౌరవం. అలాగని ఎప్పుడూ నన్ను ఏమీ అనలేదు సుమా. నాన్న గారి పట్ల మీకు ఉన్న ప్రేమ, ఆప్యాయత, చనువు మీ రాతల్లో స్పష్టమైంది మిత్రమా. ����������������

  ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.