Sunday, October 15, 2023

పెద్దలకి మాత్రమే ...., ఏడాదికోసారి

 ఈమధ్య మా పనిమనిషి ఓ రోజు మధ్యాహ్నం పనికి రానంది.  ఏమిటీ విశేషం అంటే వాళ్ళ పెద్దలకి పెట్టుకోవాలని చెప్పింది. నడుస్తున్నవి పితృపక్షం రోజులు కదా. మొన్న అంటే అమావాస్య ముందు రోజు పక్కనున్న చింతల్ బస్తి కూరగాయాల కోసం వెళ్ళా.  కొంతమంది కలగూరకాయలు (assorted vegetables) కొంటున్నారు. ఆర్ధమయింది. పక్క రోజు అమావాశ్య నాడు బ్రాహ్మలకి  స్వయంపాకం (పొత్తర్లు) ఇవ్వడానికి కొంటున్నారని. తర్వాతి రోజు సాయి  బాబా గుళ్ళో పూజారికి కొంతమంది దానం ఇచ్చారు. నాకళ్ళముందే కొంతమంది ఇచ్చారు. సాయంత్రం ఇంకో గుళ్ళో పూజారికి ఒకరు స్వయంపాకం దానమివ్వడం చూసి వెళ్ళి ఏమిటి ఇది అని అడిగాను, ఏమీ  తెలియనట్లుగా.  గతించిన పెద్దలకోసం ఇలా దానం ఇస్తున్నట్లు, ప్రతీ ఏటా ఈ రకంగా ఇస్తున్నట్లు చెప్పారు.  నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. మన దృష్టిలో పెద్ద చదువు సంస్కృతి లేవను కున్న వర్గాల లో కూడా పెద్దల పేరు మీద  ఏడాది కోసారి  ఒక ధర్మ కార్యం చేయడం అది కూడా ఒక శ్రద్ధ తో చేయడం ఒక గొప్ప సంస్కృతి అని అనుకుంటున్నా. మనకి ముందు వెనుకా ఎవరు లేరు మేమే తోపులం అనుకోకుండా  మనకున్నది మన వారసత్వం గా వచ్చినదే, సంపదై నా, సంస్కృతయినా అన్న భావన ఆరోగ్యకరం అని నా భావన. కొన్ని వర్గాలలో ఏటా తద్దినాలు పేరు పేరునా పెట్టడం ఆనవాయితీ. ఆయితే అది కూడా ఒక తప్పనిసరి తద్దినంలాగా శ్రద్ధ లేకుండా ఏదో మఠంలో పెట్టేయడం అవుతోంది.  మా చిన్నప్పుడు నెలకోసారి ఎవరిదో ఒకరిది తద్దినం రావడం, దానికి చుట్టాలందరూ రావడం, పెద్దలకి ఒక తద్దినం లాగానూ (డబ్బులనీ, మనుషులనీ సమర్దించాలంటే మాటలా), పిల్లలకి సంబరంగాను ఉండేది.  పిల్లికి చలగాటం, ఎలక్కి ప్రాణసంకటం అంటే ఇదే మరి. 

పితృపక్షం అంటే హిందుత్వ  ఎజెండా అనో, బ్రాహ్మల  ఆధిపత్యమనో, మనువు చేసిన దుర్మార్గమనో అని నిర్ధారించకండి.   ఈ రకమైన పెద్దలని గౌరవం గా తలుచుకోవడం వేరే దేశాలలో కూడా ఉంది. దక్షిణ కొరియా లో  దీన్ని Chuseok  అనే పేరుతో ప్రతి ఏటా ఘనం గా పండగ లా జరుపుతారు.  ఇది వారికి ఏటా వచ్చే పెద్ద పండుగ. మూడు రోజులు దేశమంతా సెలవుంటుంది.  ఈ పండగ సందర్భంగా బంధుమిత్రులు కలుసుకుంటారు. కానుకలిచ్చి పుచ్చుకుంటారు. పోయిన వారి సమాధుల దగ్గర తినుబండారాలు ఉంచడం రివాజు. ఈ సందర్భంగా దేశమంతా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఎకానమీ అంతా ఒక్కసారిగా  శక్తి పుంజుకుంటుంది. బహుశః  చైనా, జపాను లాంటి దేశాలలో కూడా ఇలాంటి ఆచారాలుంటాయనుకుంటా.  

వీళ్లందరినీ చూసి నేను కూడా కూరలు, పప్పు, బియ్యం లాంటివి మా సాయి బాబా గుడి పూజారి గారికి ఇచ్చి వచ్చా. పితృ పక్షాలలో ఇలాంటి పని చేయడం మొదటి సారేమో.  చాలా సంతోషం కలిగింది, ఇంతమందితో పాటు నేను కూడా 'నేను సైతం' అంటూ  మా పెద్దల్ని తలుచుకుని నా కృతజ్ణత తెలుపుకోగలిగినందుకు.  

నేను మణిపూర్ లో ప్రవాసం లో ఉన్నప్పుడు, అక్కడి వారికి తమ సంస్కృతి, వారసత్వాల పట్ల ఉన్న శ్రద్ధకి చాలా   ఆశ్చర్యపోయా.  వీరు Langban Heisoi Thaba అనే తర్పొణ కార్యక్రమం పితృ పక్షం లో జరుపుకుంటారు అత్యంత శ్రద్ధగా.  కమ్యూనిటీ పక్షాన వారి పాత తరం వీరుల కు తర్పణాలు ఇస్తారు. ఈ సంవత్సరం ఈమధ్య కాలంలో మాతృ భూమికోసం ప్రాణాలని అర్పించిన వారికి తర్పణాలు ఇవ్వాలని ఒక సంస్థ పిలుపిచ్చింది. వీరి ప్రకారం వారికి  ఏడుగురు మూల పురుషులున్నారు. సూచనగా వారి జండాలోనూ, కండువాల్లోనూ, ఇతరత్రా ఏడు రంగులు ఉంటాయి. మన సప్త ఋషులకి, వీరి ఏడుగురు మూలపురుషులకి ఏమైనా సంబంధం ఉందా?  భారతకాలంలో అర్జునుడికి మణిపూర్, ఇతర ఈశాన్య రాష్ట్రాలతో వైవాహిక సంబంధాలున్నాయి.  ఆప్పుడు భారత దేశపు అంతర్భాగం గా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు వేరే దేశాలేమో అనిపించేంత దూరం ఎందుకు  జరిగాయో.  అలాగే ప్రసార మాధ్యమాలు, సాధనాలు ఇప్పుడున్నంత  గొప్పగా లేకపోయినా, ఆసేతు హిమచాల పర్యంతమూ  మన సంస్కృతి, ఆచారాలు, నమ్మకాలు వ్యాపింప చేయగల సత్తా మన పెద్దలు చూపించారంటే నోట మాట రావట్లేదు. ఏది ఏమైనా, ఇది మన పెద్దలకి మాత్రమే తెలిసిన విద్య.   

1 comment:

  1. మీరు అనేక ప్రాంతాలు దేశాలు తిరుగుతూ అక్కడి ప్రజల జీవన విధానాల గురించి రాస్తున్న పోస్టులు ఆసక్తికరంగా ఉన్నాయి.

    అయితే ఒక చిన్న విషయం:
    >>భారతకాలంలో అర్జునుడికి మణిపూర్, ఇతర ఈశాన్య రాష్ట్రాలతో వైవాహిక సంబంధాలున్నాయి. ఆప్పుడు భారత దేశపు అంతర్భాగం గా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు వేరే దేశాలేమో అనిపించేంత దూరం ఎందుకు జరిగాయో.<<

    అప్పుడు భారతదేశపు అంతర్భాగం అని ఎలా నిర్ణయించారు? అక్కడ ప్రధానంగా ఉండే భాషలు టిబెటో-బర్మన్ భాషాకుటుంబానికి చెందినవి. జన్యుశాస్త్ర పరంగా అక్కడ ఉండే జనాభా బర్మా, దక్షిణ చైనా మొదలైన జనాభాల జన్యువులకు దగ్గరిగా కనిపిస్తారు. అక్కడ హిందువుల మొట్టమొదటి గుడి 15వ శతాబ్దంలో మాత్రమే కట్టారు. ఇప్పటికీ హిందూ దేవాలయాలు చాలా తక్కువ. అంతకు ముందు భారతీయ సంస్కృతి ప్రభావం తక్కువేనని చెప్పక తప్పదు. బ్రిటిష్ ఇండియా కాలం వరకూ ఆ ప్రాంతాన్ని మెక్లే అనే అన్నారు (బ్రిటిష్ ఇండియా వారి మొదటి ఒప్పందంలో కూడా మెక్లే అనే రాసి ఉంది). 1825 తరువాత జరిగిన సంస్కృతీకరణ (Sanskritization) వల్ల పేరు మార్చి మణిపూర్ అని పిలవడం మొదలైంది.

    వాస్తవానికి, మహాభారతంలో పేర్కొన్న మణిపుర రాజ్యాన్ని ఈశాన్య రాష్ట్రమైన మణిపురిగా గుర్తించడాన్ని చాలామంది చరిత్రకారులు, పండితులు ఆమోదించరు. మహాభారతంలోని ఆది పర్వంలోని 217వ అధ్యాయం అయిన "అర్జున-వనవాస పర్వ"లో మణిపుర రాజ్యం ఆనవాళ్లను వివరిస్తూ అది కళింగ రాజ్యం దగ్గర (ప్రస్తుత ఒడిశా), మహేంద్ర పర్వతాల (తూర్పు కనుమలు) సమీపంలో తీరప్రాంతాల్లో ఉన్న రాజ్యం అని చెబుతుంది.

    ఈ ప్రాంతం ప్రస్తుత ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్ అయితే, ఈశాన్య భారతదేశానికి వెళ్లే మార్గంలో ఉన్నందున వంగ రాజ్యాన్ని మహాభారతం కచ్చితంగా ప్రస్తావించాలి. కానీ మహాభారతంలోని అర్జునుడు "మణిపురానికి" చేసిన ప్రయాణం గురించి విపులంగా ఉన్న వర్ణనలో వంగరాజ్య ప్రస్తావన లేదు.

    నిజానికి ప్రస్తుత ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో గోబారి నదికి సమీపంలో ఉన్న "మణిపురా" అనే పేరుగల ప్రదేశం ఉంది. ఆ నది జలాలు నేరుగా బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ ప్రాంతం పూర్తిగా మహాభారతంలోని వర్ణనకు సరిపోతుంది కాబట్టి ఇదే మహాభారతం మాట్లాడుతున్న మణిపురం కావచ్చని అనేక చరిత్రకారుల అభిప్రాయం.

    మీ సత్యశోధనకు ఉపయోగపడే కొన్ని ఆకరాలు:

    https://en.wikipedia.org/wiki/Manipura_(Mahabharata)

    https://academic.oup.com/book/27482

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.