Monday, December 25, 2006
దొంగా? దొరా?
ఉదాహరణ ఇవ్వగలరా? జవాబు ............................... (పూరించండి)
ఇంకో రకం దొంగలున్నారు. వాళ్ళు వాళ్ళ దొంగతనాలని కప్పి పుచ్చేందుకు, వేరే వాళ్ళ దొంగతనాల్ని బయట పెట్టడానికి ఏదో మంత్రాంగం చేస్తోఉంటారు. కొండొకచో, వాళ్ళు చేసిన ఏదో చిల్లర దొంగతనాన్ని ఒప్పేసుకొని, వేరే దొంగలు కూడా బయట పడాలనీ గొడవ చేస్తో ఉంటారు. దీనికి కూడా ఉదాహరణలు కోకొల్లలు. జవాబు................
మూడోరకం దొంగలు. వీళ్ళు ప్రస్తుతం చిల్లర దొంగలు. భవిష్యత్తులో గజదొంగతనం చేయడానికి తయారయ్యేవాళ్ళు. పాపం, ఇప్పటిదాకా సరైన అవకాశాలు రాక, పతివ్రతల్లాగా మిగిలిపోయారు. వీళ్ళు జనాలని మిగిలిన వాళ్ళని (తస్మదీయుల్ని) బూచుల్లాగా చూపించి, తమ ప్రాబల్యం పెంచుకోవడానికి ఎలాంటి అబద్ధమైనా అడేయగలరు. ఇలాంటి ఒక దళిత నాయకుడు, ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు. ఇంతలో బయట ఎక్కడో దీపావళి టపాకాయలు పేలాయి. వెంటనే, ఆ నాయకుడు, 'చూసారా! ఈ కాంగ్రేసు వాళ్ళు. దళితుల నోరు నొక్కడనికి బాంబులు పెట్టారు' అని అన్నాడు. పాపం, సభకి వచ్చినవాళ్ళు ప్రాణభీతితో కకావికలం అవడంవల్ల, కొంతమంది తొక్కిసలాటలో చనిపోయారు. ఎవరి ప్ర్రాణమైనాసరే చాలా విలువైనది. ఇలాంటి వాళ్ళ చర్యలని ఎవరూ ఖండించలేదు, ఖండించరు. ఒక మనిషిగా పుట్టినందుకు, ఇలాంటి వాళ్ళని, మన స్వంత వాళ్లయినా సరే, ఖండించండి. మీచుట్టూ ఉన్న ప్రజలు ఇలాంటి వాళ్ళని విని మోసపోకుండా చైతన్య వంతుల్ని చేయండి. లేకపోతే ఎవరి కోసమైతే తాము పాటుపడుతున్నామని చెబుతున్నారో, ఆ జాతికే ముప్పు తేగల ధీమంతులు ఇలాటి నాయకులు. కొంతమంది తెరాస నాయకులు, దళిత వాదులు, స్త్రీవాదులు కూడా బాధిత ప్రజల్ని చైతన్య వంతులుగా చేసి వారి హక్కులని సాధించుకొనే దిశలో కాక, వారికి బాధ్యతరాహిత్యాన్ని, ఉద్రేకాన్ని నేర్పి, తమ నాయకత్వం కోసమే పాటుపడుతున్నారు. సరైన ఆలోచన, స్వయంప్రతిపత్తి, సాధికరత దిశగా వీళ్ళని నడపటంలేదు. జవాబు...................
ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది, ఈ బ్లాగు, మన రాష్త్ర రాజకీయుల్ని, రామోజీ రావుని ఉద్దేశించి వ్రాసినది అని. ఇప్పుడు ఖాళీలని సులభంగా పూర్తిచేయచ్చు. ఎందుకంటే ఉదాహరణలు కోకొల్లలు.
ము.మం., రా.రా. ల వివాదం గురించి పత్రికల వాళ్ళు, రాజకీయులూ తెగ వ్రాస్తున్నారు. మన బ్లాగర్లు కూడా కొంతమంది బ్లాగులు వ్రాసారు. మరికొంత అనేకమంది చదివారు. అందులో కొంతమంది చర్చించారు. మొత్తం మీద ఈమధ్యకాలంలో రసవత్తరమైన నాటకీయ పరిణామం ఈ వివాదం. ఇందులో ప్రజలు (పట్టించుకొన్నవాళ్ళు) రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం ఈనాడును, రామోజీ రావును సమర్ధిస్తే, ఇంకొక వర్గం ముఖ్యమంత్రి వర్గాన్ని సమర్ధించింది. పాపం, కాంగ్రేసు వాళ్ళు మిగిలిన పార్టిలవారికీ, కొన్ని పత్రికల వారికీ శత్రువర్గంలో ఉన్నారు. కాబట్టి, వాళ్ల చర్యల్లోని మంచివి కూడా మసగేసిపోయాయి. అసలుకి, మన రాజకీయుల్లో కాంగ్రేసు రక్తం లేనివాళ్ళు ఎవరైనాఉన్నారా? 'జనని కాంగిరేసు సకల పార్టీలకును' అన్న ఆర్యోక్తి మనం మరచిపోకూడదు. డి.ఎన్.ఏ. పరీక్షలు చేసుకోండి, కావాలంటే. కాబట్టి, ఏపార్టీ వాళ్ళు చెప్పినా వినండి, ఆలోచించండి వాళ్ళ మాటలు, చేష్టల వెనుక రహస్య ఉద్దేశ్యం ఏమిటో. వేరేవాళ్ళకి తెలపండి. అది చాలా పుణ్య కార్యం.
రా.రా.- ము.మం. వివాదం లో మూడు పక్షాలున్నాయి. అందరూ రెండు పక్షాల్లో సర్దుకొన్నారు. మూడవ పక్షం ఖాళీగ ఉంది. అదే సత్య(నిజం) పక్షం. ఎవరిది తప్పుఅని అలోచించేకన్నా, ఏమిటి తప్పు అని అలోచించడం మంచిది కదా. మార్గదర్శి విషయం తీసుకోండి. అవతలి పక్షం కాంగ్రేసుకదా అని రారా ని సమర్ధించకండి. ఒక నిమిషం అలోచించండి. చార్మినార్ బ్యాంక్, కృషి బ్యాంకులు మార్గదర్శి చేసిన లాంటి లావాదేవీలవల్లే ఎంతమంది జీవితాలని తారుమారు చేసాయో. పైగా, ఇన్ని వ్యాపార లావాదేవీలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఈనాడు గ్రూపుకి ఇంత చిన్న లా పాయింటు తెలియకపోవడం నేరం కాదూ? ఎన్ని చిట్‍ఫండు కంపేనీలు దివాలా తీసి ప్రజల్ని ఇక్కట్ల పాలు చేయలేదు? మన దేశంలో బ్యాంకింగు కాని ఇతర ఆర్ధికరంగ చట్టాలు కాని పొదుపు దారుల ను కాపాడడమే ముఖ్యోద్దేశముగా రూపొందించబడ్డాయి. ఇది ఇంటర్మీడియేట్ చదివినవాళ్ళక్కూడా తెలుసు. ఘనత వహించిన ఈనాడు గ్రూపుకు తెలియదా? సంస్థలు తమ లావాదేవీలు అబాధ్యతగా నిర్వహించకుండా చట్టం కొన్ని నిబంధనలు విధించింది. చమత్కరం చూడండి. రిజర్వ్ బ్యాంకు రంగం లోకి వచ్చి, మార్గదర్శి చేసినది తప్పు అని చెబితే, కొంత మంది విజ్ఞులు ఇప్పటిదాకా ఏంచేస్తోందీ రిజర్వుబ్యాంకంటూ నిప్పులు చెరగుతున్నారు. అయ్యా, విజ్ఞులారా. 'దొంగతనం చేసినవాడిది తప్పుకాదు, వాడిని పట్టుకోని వాడిదే' అని ముచ్చటగా వాదిస్తున్నారు. మన చదువులు, తెలివితేటలు మన ఆత్మవంచనకా? 'లావాదేవీలు చట్టపరంగా చేయవయ్యా, లేక పోతే ప్రజలు కష్టపడతారు. నీవంటి దిగ్గజం రూల్సు తెలియవే అంటే ఎలా? మన రాష్ట్రం లోని వ్యాపారవేత్తలకి ఆదర్శంగా నిలవాలి కాని' అని దూరదృష్టితో చిన్న సలహా చెబితే సొగసుగా ఉండదూ? మన విజ్ఞానానికి వన్నె రాదూ?
నా దృష్టిలో రారా తప్పు రూల్సు పాటించడం, పాటించకపోవడం కాదు. ఈనాటి ఈ సమస్య, ఇప్పటిది కాదు. చాలా దశాబ్దాలనుండి ఈనాడు, ప్రభుత్వ పార్టీ (ఆరొజుల్లో కాంగ్రేసే) మధ్య సమస్యలు తెలిసినవే. పత్రిక లో ప్రభుత్వ వ్యతిరేకత చూపడం వల్ల ప్రభుత్వ ప్రకటనలు ఈనాడు కి ఇవ్వకపోవడం మామూలయ్యింది. తర్వాత రామారావు కాలంలో ఈనాడు ప్రభుత్వ బాకా పత్రిక అయిపోయింది. విలువలకోసం ప్రభుత్వవ్యతిరేకత చూపుతోంది అనుకొన్న చాలామందిమి ఏవిలువలకోసం అన్న మీమాంసలో పడిపోయాం. అతి బాకా వల్ల ఒక దశలో ఈనాడు సర్కులేషను చాలా పడిపోయింది. దాంతో, కొంత ధోరణి మార్చుకొని ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా కొద్దిగా చేసేది, వ్యాపార దృష్టితో మాత్రమే సుమా!
ఒక వార్తా పత్రిక అనేది, మిగిలిన వ్యాపారాల్లాంటిదేనా? మనకి నచ్చిన వాళ్ళని మంచిగానూ, కిట్టని వాళ్లని చెత్తగానూ చూపించి 'కింగ్‍మేకర్' గా వ్యవహరించడం సబబా? వార్తా పత్రిక ప్రజలకి అభిప్రాయాలను ఏర్పారచుకోవడానికి సహాయపడే వార్తలందించాలా, లేక పత్రికాధిపతి ఇష్టాఇష్టాలే ప్రజలమీదికి తిమ్మిని బమ్మి చేసైనా సరే రుద్దాలా?
నా దృష్ట్లిలో పత్రికలు, అధికార యంత్రాంగం ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తేనే వాళ్ళ ఉనికికి సార్ధకత, వాళ్ళమీద ప్రజలు పెట్టుకొన్న నమ్మకానికి నీరాజనం. అది వాళ్ళ కనీస బాధ్యత. అది విస్మరిస్తే, వారికి శత్రువులు చాలామంది తయారవుతారు. ప్రజల శాపాలు తగులుతాయి.
ఈనాడు చేస్తున్న మంచిపని నిష్పక్షపాతంగా కొనసాగించాలి. ఎన్నో స్కాములు, అన్యాయాలు వెలికితీసి ప్రజల్ని కాపాడుతోంది. ఈనాడు తెలుగు ప్రజలకి చేసిన అత్యత్తమ సేవ చెప్పమంటే, పత్రిక మొదలుపెట్టిన తొలి రోజుల్లోనే, చాలా ధైర్యంతో సెక్సుసైన్సు మీద సమరం గారిచే ప్రత్యేకంగా వ్యాసాలు వ్రాయించి ప్రజలని విద్యావంతుల్ని చేయడం అని చెబుతాను. కాని ఈనాడు తన గ్రూపు ప్రయోజనాలు మాత్రమే కాకుండా తనని నమ్ముకొన్న తెలుగు ప్రజల ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకొని నడిపితే, జనాల చేతుల్లోనే కాకుండా హృదయాలలో కూడా ఉంటుంది. లేక పోతే నిజం చెప్పినా కూడా, పక్షపాత పత్రికలే అలాగే వ్రాస్తారు అని అనుమానిస్తారు. 'ది హిందూ' ఎప్పుడైనా పక్షపాతం గా వ్రాయడం చూసారా? దానిలో వార్తలు, వార్తలు గానూ, అభిప్రాయాలు, అభిప్రాయాలు గానూ వ్రాస్తారు. పత్రికాధిపతులు పాఠకుల నెత్తిమీద కూర్చొని బ్రైన్వాష్ చేయరు. అందుకే ఆ పత్రిక పేరు చెబితే ఒక రకమైన గౌరవం కలుగుతుంది.
ఇక రెండో పక్షం. ఎన్నికలయ్యాకా ముఖ్యమంత్రి పదవికోసం కాంగీయులు పోటీ పడినప్పుడు, ప్రజలందరూ కూడా న్యాయంగా రా.రె. అవ్వాలని భావించారు. అంత ఆశలు కల్పించారూ, డిగ్నిటీ ప్రదర్శించారూ ఆయన. గిల్లికజ్జాలు, కీచులాటలూ కాకుండా, మన రాష్ట్రం ముందుకుపోవడానికి వేరే ఏదైనా చేయాలని ఎప్పటికైనా ఆయనకి తోచాలని ప్రార్ధిస్తున్నాను. ప్రజలు చూస్తున్నారు, మనం అనుకొన్నంత తెలివితక్కువ వాళ్ళు కారని రాజకీయులందరూ తొందరగా తెలుసుకొనే రోజు తొందరగా వస్తుందని ఆశ. పార్టీలకి కాక వ్యక్తులకి ఓటు వేస్తే బహుశ: మనకి విముక్తేమో?
సర్వేజనా: సుఖినోభవన్తు
Sunday, December 17, 2006
ముగ్గొలకపోసారు
సంక్రాంతి రోజులు కదాని ఇంద్రుడు దేవతలని ముగ్గు తెమ్మన్నాడట. తెచ్చేవాళ్ళు తెస్తున్నారు. ముగ్గుపెట్టేవాళ్ళు పెడుతున్నారు. మనలాగా ఒక ఇల్లూ, ఒక వాకిలీ కాదు కదా. విశ్వమంతా పెట్టాలి కదా! ముగ్గు పెట్టే వాళ్ళు ఎన్నో యుగాలుగా, ఎంత నడుం నెప్పెట్టేలా పెడ్తున్నా, ఇంకా చుక్కలు పెట్టడమే పూర్తికాలేదు. ఇంకా ఎప్పుడు కలుపుతారో ఆ చుక్కల్ని. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కొత్త చుక్కలు పెడుతోంటే, పాత చుక్కల్ని మనూళ్ళో జులాయిగాళ్ళ లాంటి రసహీన నల్ల కన్నాలు చెరిపేస్తున్నాయిట. అయితే, ముగ్గు తెచ్చే దేవతల మీద ఇద్దరు 'సూపర్వైజర్ల' ని పెట్టాడు ఇంద్రుడు. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు. అయితే, సూర్యుడు ఓకే. కాని ఆయన దక్షిణమండలానికి ఆఫీసు పని మీద టూరుకెళ్ళాడు. చంద్రుడేమో కాపలాలో కాస్త నాసి. ఆయన చూపు ఒక పక్షం తగ్గుతూ, ఒక పక్షం పెరుగుతో ఉంటుంది. నెలలో ఒకరోజు పూర్తి గుడ్డి, ఒక రోజు మాత్రం ఆకాశమంతా కళ్ళే. ఈదృష్టిలోపానికి సాయం, తారతో ఆయన వ్యవహారం 'తారాశశాంకీయం' పుణ్యమా అని మనందరికీ తెలిసిందే కదా. దానితో పాపం ఆయనకి కాపలాకి తీరికేది? కాపలా ఇలా ఉంటే దేవతలు పని ఎంత నిఖార్సుగా ఉంటుందో చెప్పలేమా? మన ఆఫీసుల్లో బాస్ లేకపోతే ఆటవిడుపే కదా! నిన్న రాత్రి వాళ్ళు ముగ్గు తీసుకెళ్తూ ఒలకపోసేసారు. మాకెలా తెలిసిందా, అది మాఊరు మీదే కదా పడింది. ఎన్ని ముగ్గులు పెట్టినా తరగనంత ముగ్గు. కాని దేవతలే కాని మనం పెట్టలేము ఆముగ్గుతో. మనం ముట్టుకొంటే నీరైపోతుందా ముగ్గు. ఇల్లూ,వాడా, చెట్టూ, చేమా, అన్నీ ఏకమయిపోయాయి. మళ్ళీ సూర్యుడొచ్చి గదమాయిస్తే కాని వాళ్ళు ఎత్తరు. కాని ఎత్తకపొతేనే మంచిది. కాసేపు ఆ దృశ్యాన్ని చూసి ఆనందించ వచ్చు. ఇదంతా గ్యాసనుకొంటున్నారా? ఊహించాను. అందుకే ఫోటోలు తీసాను. చూడండి, నా మాట అబద్ధమైతే.
Friday, December 15, 2006
తెలుగు జాకెట్టు గుడ్డ పథకం
ఆపథకం పేరులో ముందు తెలుగు అని ఉంది. 'తెలుగు వారుణి వాహినీ పథకం'. రామారావు గారికి సంస్కృతసమాసాలూ, అచ్చతెలుగు పేర్లు చాలా ఇష్టమనుకొంటా. పౌరాణికసినిమాల అనుభవం మరి. అలాగే హంద్రీనీవా ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషన్) పథకానికి 'హంద్రీనీవా సజల జల స్రవంతి' అని అనుకొంటా పేరు పెట్టాడు. గ్రామాల్లో ఆడవారికి టాయిలెట్ల కోసమని ఒక పథకం పెట్టాడు. దాని పేరు కూడా స్వచ్చమైన తెలుగే. 'తెలుగు మహిళా మరుగు పథకం' అనో 'తెలుగు మహిళా బహిర్భూమి పథకం' అనో ఉండాలి. ఆరోజుల్లో ఢిల్లీలో ఉండేవాడిని. స్లీవెలెస్ల బాధ భరించలేక, అదే రామారావయితే ఏం పథకం పెట్టేవాడు అని అలోచించా. బహుశ: 'తెలుగుబిడ్డ- జానెడు జాకెట్టు గుడ్డ' పథకం పెట్టేవాడేమో! క్షమించాలి. జాకెట్టు ఆంగ్ల పదమని ఇప్పుడే ప్రసాద్‍గారు చెప్పారు. పథకం పేరు మర్చేస్తున్నా- 'తెలుగుబిడ్డ- జానెడు రవికె గుడ్డ.' ఇంకా తెలుగులో చెప్పాలంటే, 'తెలుగుబిడ్డ- జానెడు కంచుకం గుడ్డ పథకం.' జాకెట్టును కంచుకం అని కూడా అంటారని విన్నాను. నిజంగా పెట్టేవాడేమో? కాని ఈలోపునే లక్ష్మీపార్వతితో బిజీ అయిపోవడం వల్ల ఆడబిడ్డలకి టైమ్ కేటయించలేక పోయాడు, పాపం.
Saturday, December 09, 2006
కొరియా కబుర్లు: పురోగతీ - వివాహనాశాయ
పెళ్లిళ్లంటేనే మొహమ్మొత్తిన వీళ్ళకి పిల్లలంటే మోజుంటుందా? ఉండదుకదా? అందుకే ఇక్కడ శిశుజననాలు చాలా తక్కువ. ఎంత తక్కువంటే జనాభాని తక్కువచేసేటంత. అబ్బ. మనదేశంలోఎప్పటికైనా ఇల్లాంటి పరిస్థితి వస్తుందా? అయితే ఇక్కడ కొన్ని గ్రామాల్లో కొన్ని దశాబ్దాలుగా శిశుజనన్నాలేవుట. అవును మరి ఉన్న వాళ్ళందరూ గ్రామాలు విడిచిపొతే జనాభా ఎలాపెరుగుతుంది? ఇప్పుడు గ్రామాల్లో ఉన్న వాళ్లు చాలా మంది వయసు మీద పడిన వాళ్ళే. అందువల్ల, ఏవూరులోనైనా పిల్లలు పుడ్తే పక్క గ్రామాల వాళ్ళు పిక్నిక్ లాగా వెళ్ళి వాళ్లని చూసి, వాళ్ళ ఏడుపు విని వస్తార్ట. వీళ్లని మనదేశానికి టూరుకి తీసుకెళ్తే భలే ఆదాయమేమో. అడుగడుక్కీ టూరిష్టు ఎట్రాక్షనే, చెత్తకుండీలతో సహితంగా.
ఇక్కడి ప్రభుత్వం జనాభా ఎలా పెంచాలా అని బుర్రలు బద్దలు కొట్టుకొంటోంది. రకారకాల రాయితీలు, పధకాలు ప్రవేశ పెడుతోంది. వీళ్ళకి ఐడియాలు సరిగ్గా రావట్లేదు. లేకపోతే జనాభా పెంచాలంటే అదిచేతవచ్చిన మనలాంటి వాళ్లని సలహాలు అడగాలి. నన్నడిగితే, లాలు దంపతుల్లాంటి ఆది దంపతులని వాళ్ళ గేదెలతో సహా దిగుమతి చేసు కొంటే జనాలే జనాలు. లేకపోతే, BPO (birth process outsourcing) ఎలాగూ ఉంది. మన దేశంలో అద్దెకి గర్భసంచులు విరివిగా దొరుకుతున్నాయని మీరు వినే ఉంటారు.
ఇది ఇలా వుంటే, గ్రామాల్లో కొంతమంది వ్యవసాయం చేసుకొంటున్నారు కదా. వాళ్ళల్లో చాలామందికి 40 ఏళ్లొచ్చినా పెళ్లిళ్ళవట్లేదు. గ్రామాల్లో సరిపడ అమ్మాయిలు దొరకట్లేదు. సరిపడా అంటే సంఖ్యలో. గ్రామాల్లోని అమ్మాయిలు పట్నాలకి పోయి చదువుకొని ఇక్కడ పేడ పిసుక్కోవడం ఇష్టంలేక పల్లెటూరి అబ్బాయిలని చేసుకోవడం లేదు. ఇక పట్నం అమ్మాయిల గురించి చెప్పాలా? దీనికి పరిష్కారం ఒకటి కనిపెట్టారు, ఇక్కడి గ్రామీణులు. అదేంటంటే, బయటిదేశాలవాళ్ళని పెళ్ళిచేసుకోవడం. ఇది మన అరబ్బు షేకుల లాగా విలాసానికి కాదు. అవసరానికి. వీళ్ళకి డబ్బులున్నాయి. ఆస్తులున్నాయి. దాంతో మన హైదరాబాదులో లాగానే బ్రోకర్లు తయారయ్యారు. వీళ్ళ ఆహారపు అలవాట్లకీ, రూపురేఖలకీ దగ్గరగా ఉండే వియత్నాం, ఫిలిప్పైన్స్ లాంటి దేశాలనుండి ఆడపిల్లల్ని తెచ్చుకొంటున్నారు.
Friday, December 01, 2006
కొరియా కబుర్లు: 'ఫ్పల్లి ఫ్పల్లి'
Sunday, November 26, 2006
కొరియా కబుర్లు: -- కొంచెం -- ఘనం
౧. మీరు వాడే టీ.వీ. ఏ కంపెనీది?
౨. మీరు వాడే కంప్యూటర్ మానిటర్ ఏ కంపెనీది?
౩. మీ కారు ఏ మోడలండీ?
౪. మీ సెల్ ఫోను ఏ కంపెనీది?
౫. ప్రపంచంలో నాణ్యమైన ఉక్కు తయారీలో ఘనత వహించిన సంస్థల్లో 3వ స్థానం లో ఉన్నది ఏది?
౬. మీ మైక్రోవేవ్ ఏ కంపెనీది?
వీటికి సమాధానం మీకు LG, Samsung, Hundai (Santro, Sonata), POSCO చాలా ఎక్కువ సార్లు వస్తాయి. ఈ కంపెనీలన్నీ కొరియావి. మన దేశంలో చాలామందికి కొరియా అంటే పెద్దగా తెలియదు. ఆ మాటకొస్తే నాక్కూడా ఇక్కడకొచ్చాకా బాగా తెలిసింది. మునుపు Economics పుస్తకాల్లో కొరియా అభివృద్ధి గురించి కొద్దిగా చదివా, అంతే. ఈదేశం గురించి తెలియక పోవడంవల్ల, మనకి తరతరాలుగా ఎలెక్ట్రానిక్స్ అంటే జపాన్ అని మాత్రమే భావం ఉండడంవల్ల కొరియా ఉత్పత్తులని కూడా చాలామంది జపానువే అనుకొంటున్నారు. నేను కొరియాలో ఉన్నానని చెపితే అది ఎక్కడుందని అడగడం సాధారణమైపోయింది. కాని చాలా మందికి రెండు కొరియాలున్నాయని తెలుసు. తమ ఉత్పత్తులతో జనబాహుళ్యానికి ఇంతదగ్గరైన కొరియా దక్షిణ కొరియా. ఈ మధ్య అణుపరీక్షతో అందరినీ అదిరించిన కొరియా ఉత్తర కొరియా. దక్షిణకొరియా ని సాధరణంగా కొరియా అని పిలుస్తారు. వాళ్ళ సంవిధానం ప్రకారం దీని పేరు 'రెపబ్లిక్ ఆఫ్ కొరియా'. వాళ్ళ భాషలో ' దేహన్ మిన్గుక్'. ఉత్తర కొరియా పేరు 'డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా' అంటారు. ఆ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం కన్నా మన నేతి బీరకాయలోనే నెయ్యి ఎక్కువుంటుంది.
ఒక్కటిగా ఉన్న కొరియాని 1945 లో రెండుగా చీల్చారు. వాటి మధ్యలో ఉన్న సరిహద్దుని 38th parallel అని అంటారు. భారతదేశం, పాకిస్తాన్ లు చీలిపోవడానికి రెండుమతాల మధ్య సమస్య కారణం. కాని కొరియా రెండుగా చీలిపోవటానికి జపాను రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోవడం కారణం. ఆ సమయంలో కొరియా జపాను వలస పాలనలో ఉంది. జపాను కొరియాని 1910-45 మధ్య తన పాలనలో ఉంచుకొంది. యుద్ధంలో ఓడిపోకపోతే అది ఇంకా కొనసాగేదేమో? ఏమైతేనే 1945 లో స్వాతంత్ర్యం పొందిందీదేశం. అత్త సొమ్ము అల్లుడు ధారబోసినట్లు, జపాను ఓడిపోయి కొరియాని శత్రుపక్షానికి ధారాదత్తం చేసింది. శత్రుపక్షంలో అమెరికా, దాని మిత్రపక్షాలూ ఇంకా రష్యా, దాని మిత్ర పక్షాలూ దొంగలూ, దొంగలూ ఊళ్ళు పంచుకొన్నట్లుగా కొరియాని రెండుముక్కలుగా చేసి దక్షిణకొరియాని అమెరికా, ఉత్తర కొరియాని రష్యా తమ తమ వర్గాల్లో చేర్చుకొన్నాయి. అప్పటినుండీ (దక్షిణ) కొరియాలో పెట్టుబడిదారీ విధానం, ఉత్తర కొరియాలో కమ్యూనిజం అమలులోకి వచ్చాయి. అలా విడిపోయిన వీళ్ళు, ఎలాగైనా, ఎప్పుడైనా తిరిగి కలుసుకోవాలనీ, కలిసిపోవాలనీ తెగ ఆరాటపడ్తారు. దాని కోసం కొరియా ప్రభుత్వంలో Unification Ministry ఒకటి ఉంది. వీళ్ళ సాహిత్యంలో కూడా దీనిమీద చాలా కథలూ, కవితలూ వచ్చాయి. ఈ రెండుదేశాలమధ్య DMZ (De-militarized Zone) ఉంది. ఇది సుమారు 3 కిలోమీటర్ల వెడల్పున్న నిర్జన సరిహద్దు ప్రదేశం. జర్మనీ గోడ కూలిపోవడం ఇక్కడ కూడా చాలా ఆశలు రేకెత్తించింది.
ఇదీ కొరియా అభివృద్ధి కథ. ఇంతా చేస్తే ఈ దేశం ఎంతుంటుందో తెలుసా? మనదేశంలో 33వ వంతు. వైశాల్యం గీచి, గీచి లెఖ్ఖపెట్టినా 98480 చదరపు కిలోమీటర్లు. మన తెలంగాణా మైనస్ ఒక రెండు పెద్ద జిల్లాలు. మరి జనాలో పట్టుమని 5 కోట్లు కూడా లేరు.
Monday, November 20, 2006
'గుండె పగిలేంత.... ' హరికథ
అసలుకథ:
నేను బ్లాగులు చూడడం మొదలుపెట్టి కొద్దికాలమే అయింది. నాకు కొన్ని బ్లాగులు చాల నచ్చాయి. నాగరాజా, చదువరి,రాధిక, సుధాకర్, కొండూరి, రెనారె, కామేష్.......... ఇల్లా చాలామందివి. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో శైలి, ఒక్కో వస్తువు. కొన్నికొన్ని బ్లాగుల్లోని తపాలు, కొన్ని కొన్ని జ్ఞాపకాలు బయటికి తీస్తూంటాయి. ఉదాహరణకి, రెనారె గారి బ్లాగ్ చదివినప్పుడు, నాకు శ్రీ నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గుర్తొచ్చారు.
పిట్టకథ 1:
శ్రీ నామిని సుబ్రహ్మణ్యం నాయుడు రాయలసీమ మాండలికంలో (చిత్తూరు జిల్లా) వ్రాసారు. వ్రాయడానికి పెద్దపెద్ద విషయాలే అవసరం లేదు, మనకి తెలిసిన ఏవిషయంపైనైనా వ్రాయవచ్చని తన 'పచ్చనా సాక్షిగా' (ఉదయంలో వచ్చాయి) శీర్షికతో, 'సినబ్బ కతల' (ఆంధ్రజ్యోతిలో వచ్చాయనుకొంటా) లో తనకు అనుభవమైన విషయాలే వ్రాసారు. అందరికీ తెలిసిన విషయం 'అమ్మ' కాబట్టి, దాని గురించే వ్రాస్తే పోలే అని తను వ్రాయడమే కాకుండా, బాపు, రమణ ల తోటే కాకుండా, చంద్రబాబు నాయుడు లాంటి 'రాయని భాస్కరుల' చేత కూడా వారి వారి అమ్మల గురించి రాపించి ప్రచురించిన ఘనుడూ, ధన్యుడూ, శ్రీ నామిని. తర్వాత, చిత్తూరు జిల్లాలోని ఒక రైతు ఆశ, అడియాసల కథ 'మునికన్నడి సేద్యం' నవల లో వ్రాసారు. ఆ నవల నాకు బాగా నచ్చింది. నేను వ్యవసాయ శాస్త్రంలో (బాపట్ల కాలేజీ లో M.Sc(Ag), తర్వాత, ఢిల్లీ I.A.R.I. లో ఆర్ధిక శాస్త్రంలో Ph.D.) పట్టభద్రుడ్ని. నా థీసిస్ కోసం వ్యవసాయ బావులు, చెరువుల మీద సర్వే కోసం రాయలసీమ (అనంతపురం జిల్లా) గ్రామాల్లో పర్యటించా. రైతులు నీటికోసం పడే పాట్లు, వాళ్ళ అగచాట్లు, గ్రామాల్లో ఉండే అసమానతలూ, నీళ్ళ రాజకీయాలూ/మార్కెట్లు, ఇత్యాది విషయాలపై అయనా వ్రాసారు, నేను, నాబోంట్లూ వ్రాసాము. మేము వ్రాసింది భద్రంగా బీర్వాల్లోనూ, ఆంగ్ల జర్నళ్ళలోనూ ఉంది. ఆయన వ్రాసినది జనాల గుండెల్లోకి పోయింది. విధాననిర్ణయాలు చేసేవారి చెవుల్లోకైనా పోయిందో లేదో? అదృష్టవశాత్తు, నేను ఆనవలని చదవడం నా అవగాహనికీ, వ్రాతకోతల్లోనూ చాలా ఉపయోగపడింది. ఇది పిట్టకథలో పిట్టకథ.
పిట్ట కథ 2:
నేను బ్లాగుల గురించి తెలుసుకొన్నదే ఈమధ్యనని చెప్పాను కదా. అంటే వ్రాయడం మొదలుపెట్టి ఇంకా తక్కువ రోజులే అయివుంటుంది కదా. కాని, బ్లాగ్సోదరుల ప్రోత్సాహం వల్ల నామీద నాకు నమ్మకం కలగడం మొదలుపెట్టింది. ఈ నమ్మకం అన్నది ఒక పెట్టుబడి. అది లేకుంటే ఎవరూ ఏదీ సాధించలేరు. 'నాక్కొంచెం నమ్మకమివ్వు, కొండల్ని పిండిచేస్తా' అన్న కవివాక్యం అక్షరసత్యం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండింటినించీ పెట్టుబడులొస్తే కాని అభివృద్ధి కలగనట్లే, తనమీద తనకీ, తన చుట్టూఉన్నవారికీ కూడా నమ్మకం కలిగితే కానీ ఏ వ్యక్తీ ఏమీ సాధించలేడు.
పిట్ట కథ ౩:
నామిని సిన్నబ్బ కతలు ప్రింటు చేసినప్పుడు, బాపూని ఒక్కముఖచిత్రం వేయమని కోరాడు. బాపూనే ఎందుకంటే, నామిని బాపూ అభిమానికాబట్టి. అసలు ఆయనకి అభిమాని కానివాడెవ్వడు? వేస్తాడో, వేయడో అని అనుకొంటూండగా, బాపూగారు, ముఖచిత్రమే కాకుండా, కథలకి కూడా విడివిడిగా బొమ్మలు వేసి పంపించాడు. అంతే అయితే, ఓకే. ఉత్తరంలో మీ 'వీరాభిమాని బాపు' అని సంతకం చేసాడట. అది చూసి నామిని పడిన సంబరం ఆయనే ఒక వ్యాసంలో ఆయన శైలిలోనే వ్రాసుకొన్నాడు.
అసలైన కథ:
మళ్ళీ అసలుకథకొస్తే, చాలామంది ప్రోత్సహిస్తున్నారని చెప్పా కదా. అందరికీ బ్లాగ్ముఖంగా కృతజ్ఞతలు. నేను ఈమధ్య వ్రాసిన ' బోరట్' పార్వతీశం చదివి రెనారెగారు స్పందిస్తూ, 'మీ బ్లాగునింక వదలన'న్నారు. 'ముక్కు పగిలేదాకా ముక్కుసూటిగా' చెప్పడం ఆయన పద్ధతే, కాని ఇక్కడ, ఆయన అభిమానానికి ఆనందంతో గుండె పగిలినంత పనయ్యిందని తెలుసుకోవద్దా? అప్పటి నామిని పరిస్తితే ఇప్పటి నాదీని. అయితే అక్కడ ఒక్కడే బాపు, ఇక్కడ చాలామంది.
Monday, November 13, 2006
కొరియా కబుర్లు: 'బోరట్' పార్వతీశం
పరీక్షల్లో గాంధీని గురించి వ్రాయమన్నా, చదివింది ఒక్క ఆవు వ్యాసమే కాబట్టి , ' గాంధీ గొప్పవాడు. ఆయనకి ఒక ఆవు ఉండేది. ఆవు సాధు జంతువు.........' అని అక్కడి నుంచి ఆవు గురించి వ్రాసిపాడేసాడట వెనకటికి, నాలాటి వాడే. వచ్చేవారానికి బాగా బట్టీ పట్టి కొరియా వ్యాసం వ్రాస్తా. అప్పటిదాకా ఇది చదివండి.
కొరియా ఒక దేశము. అక్కడ టీవీలుండును. అందులో చాలా ఛానెళ్ళు వచ్చును. అందులో AFN ఒకటి..........
క్రితం వారం AFN Korea ఛానెల్లో Tonight Show with Mr.Jay తో కోహెన్ (Cohen) తో ఇంటర్వ్యూ చూసాను. ఈ ఛానెల్ కొరియా లో ఉన్న అమెరికా మిలిటరీ వాళ్ళకోసం రక రకాల టీ.వీ. ఛానెళ్ళలోనుండి ప్రాచుర్యం పొందిన కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. రాత్రి మాకు Tonight show, Late show, Late Late night show లు వస్తూంటాయి. విషయానికి వస్తే, కోహెన్ 'Borat: Cultural Learnings of America for Make Benefit Glorious Nation of Kazakhstan' సినిమా లో హీరోగా వేసాడు. ఆయన చేసిన డా ఆలీ జీ షో బ్రిటన్ లో విజయవంతమయిందని విన్నాను. బోరాట్ సినిమా విజయం తథ్యమని చాలా మంది ఊహాగానాలు చేస్తున్నరని వార్త.
ఆ ప్రోగ్రాం లో ఆ సినిమా ల్ని ఒక సన్నివేశాన్ని చూపించారు. ఆ సన్నివేశంలో హీరో ఒక హోటలు కెళ్తాడు. హోటలు అటెండెంట్ బొరాట్‍ని రూమ్‍కి తీసుకు పోవటానికి లిఫ్ట్ లోకి తీసుకెళ్తాడు. మన హీరో అదే రూమనుకొని బ్యాగ్ తెరచి బట్టలు సర్దటం మొదలెడ్తాడు. అటెండెంట్ ఇది కాదు నీ రూమని చెబుతోంటే, బోరట్, ' ఈ రూమ్ చాలా బాగుంది. ఇంత కన్నా చిన్న రూమైతే నేనొప్పుకో'నంటాడు. ఈ సన్నివేశం లో హాస్యం బాగా పండింది. సరిగ్గా ఇలాంటి సీనే 'బారిష్టరు పార్వతీశం' లో కన్పిస్తుంది.
ఈ నవల 1925 ప్రాంతంలో ఆంధ్రదేశంలో హాస్యపువెల్లువల్లేపిందని విన్నాం. ఇప్పుడు చదివినా కూడా గిలిగింతలు పెట్టడం ఆ నవల గొప్పదనం. ఆ రోజుల్లో తెలుగు హాస్య సాహిత్యాన్నేలిన మూడు 'సింహా'ల్లో ఒకరైన మొక్కపాటి నరసింహంగారి నవల ఇది. మిగిలిన ఇద్దరు సింహాలు మీకు తెలుసనుకొంటా. పానుగంటి మరియు చిలకమర్తి నరసింహం గార్లు. వాళ్ళ గురించి ఇంకోసారి సందర్భమొచ్చినప్పుడు మాట్లాడుకొందాం.
ఈ సీను గుర్తుకు రాగానే చాలా సంబరపడిపోయి, బోరట్ గురించి గూగ్లింగ్ మొదలెట్టా. ఏతావాతా, ఈ ఒక్క సీను తప్పించి భూతద్దంలో వెదకినా పార్వతీశానికీ, బోరట్‍కీ లంకే లేదని తేలింది. బోరట్ విడియోలు చిన్నా, చితకా అన్నీ చూసి పాడేసా. చూసినవి బోరట్ వీడియోలే కాని, పడేసినవి మాత్రం నేను వాంతులు చేసుకొన్న బ్యాగ్‍లు. ఛీ... థూ.. ఇది హాస్యమా? కానే కాదు. 1000......000% అపహాస్యం. అంత అసభ్యకరమైన, అసంగతమైన హాస్యాన్ని ఈ మధ్య ఒచ్చిన తెలుగు సినిమాల్లో కూడా చూడలేదు. హాస్యం చూడలంటే ఒక రేలంగి సినిమాయో, ఒక రమణారెడ్డి సినిమాయో చూడండి. ఒక శాయి నవల చదవండి, లేకపోతే ఒక ఆదివిష్ణుని చదవండి, ఒక బాపూ గీతని గుర్తు తెచ్చుకోండి. అంతే కాని బోరట్ సీను ఒక్కటికూడా చూడసాహసించకండి.
ఉదాహరణకి ఒక సీను కనండి. బోరట్ తనవాళ్ళని పరిచయం చేస్తూ, తన పెళ్ళాలని మామూలుగా పరిచయం చేస్తాడు. తర్వత, ఒకామెని చూసి గాఠ్ఠిగా ఎంగిలి ముద్దెట్టుకొంటాడు - ఒక నిమిషంపాటు. ఆనక, 'ఈమె నా సోదరి-కజగస్తాన్‍లోని అగ్రగామి వేశ్యల్లో ఈమెది 4 వ స్థానం' అని చాల గర్వంగా పరిచయం చేస్తాడు. నేను చూసిన ఒక వీడియోలో చివర్లో బై బై చెబుతూ 'I like sex' అని ముగిస్తాడు. ఇంకా ఘోరం. ఆయన తండ్రి, ఆయనకి తాత - అందులోనూ అమ్మతండ్రి - అవుతాడట!?,>౨౩౦+. ఇది చదివి మీరు కూడా ఈమాత్రం గందరగోళం పడిఉండాలే! ఇలాంటి ఛండాలాన్ని కామెడీ అని ముద్ర వేయడాన్ని బట్టి కామెడీ స్థాయి వోఢ్ హౌస్ దేశంలో ఏ స్థాయికి పడిపోయిందో చూడండి.
బొరాట్ కజఖ్‍స్తాన్ కి చెందిన జర్నలిస్టు. ఆయన బయటిదేశాలు పర్యటించి తయారుచేసిన రిపోర్టులు ఈ వీడియోలూ, సినిమాలూ. కజఖ్‍స్తాన్ ను ఒక అనాగరిక దేశంలాగా, పేద దేశంలాగా చిత్రీకరించారు, ఈ వీడియోల్లో. నిజానికి కజఖ్‍స్తాన్ రష్యా నుండి విడిపోయిన ఒక దేశం. ఇప్పుడు వైశాల్యంలో ప్రపంచంలో ఆరవది. చమురు నిల్వలు పుష్కలంగా ఉండి అమెరికా వాళ్ళచే వాణిజ్యానికి అనువైన దేశంగా కొనియాడబడింది. అంతేకాదు, చమురు వర్తకంవల్ల ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్న విదేశీమారకద్రవ్యాన్ని అతిసమర్ధవంతంగా ఉపయోగించుకొంటున్న దేశంగా ఉదహరణీయంగా నిలిచింది. ఏదైనా దేశానికి ఒక రంగం వల్ల (ఇప్పుడు కజఖ్‍స్తాన్‍కి చమురు రంగంలాగ) విపరీతమైన విదేశీమారకద్రవ్యం వచ్చిపడితే, దేశీయ ద్రవ్యం విలువ పెరుగుతుంది (దీన్నే ఆంగ్లంలో appreciation of currency అంటాం). ఇందువల్ల, దేశంలోని మిగతా రంగాల ఉత్పాదనలు బయటిదేశాలవారికి ప్రియమవుతాయి (ఖరీదనిపిస్తాయి). అందువల్ల దేశ ఎగుమతులు తగ్గిపోతాయి. ఇది ఇలాగే కొనసాగితే ఆయా రంగాలు దెబ్బతింటాయి. ఈరకమైన సంఘటనలూ, ఫలితాలూ మొదట 1950ల్లో హాలెండ్లో గమనించారు. అందుకే దీన్ని Dutch disease అంటారు. ఇటువంటి పరిస్థితి రాకుండా కజఖ్‍స్తాన్ ప్రభుత్వం, వస్తూన్న మారకద్రవ్యాన్ని కొనేసి బయటి దేశాల్లో దీర్ఘకాలికనిధులలో పెట్టుబడి పెడుతోంది. ఇలాటి దేశం పేరును ఇంత చెత్త కామెడీకి వాడుకోవడం చాలా హీనమైన చర్య అంటాను. ఏదైనా ఊహాత్మకమైన దేశం పేరు వాడొచ్చుగా?
చివర్లో ముగించే ముందు ఒక చిన్న వార్త మీతో పంచుకొంటే బలే మజా వస్తుంది. బోరట్ పదిరోజుల క్రిందట NBC ఛానెల్లో Saturday Live కార్యక్రమంలో పాల్గొని సాటి నటి తో వెడుతూ ఒక అమెరికన్‍ను కెలికాడట. 'నీ బట్టలు బాగున్నాయి. నేను కొంటాను. వాటితో రమించాలని ఉంది' అని. అంతే. మొహం ఫట్.. ఫట్... ఫటాఫట్..ఫట్‍ఫటా.. అయ్యింది. ఈ కింద ఆ వార్తని పొందు పరుస్తున్నాను. నా ఆనందాన్ని పంచుకోండి.
Baron Cohen Attacked
Comedian Sacha Baron Cohen was attacked in New York City last week after playing a prank on a passerby while in character as Kazakh journalist Borat.
The star was on his way to a dinner date with his actor friend Hugh Laurie, after they had both appeared on NBC's "Saturday Night Live."
Cohen approached the man and asked, "I like your clothings. Are nice. Please may I buying? I want have sex with it."
The man responded by punching Cohen in the face repeatedly.
Laurie was forced to step in and push the man away, so Cohen could escape.
A source tells British newspaper The Sun, "Sacha is very lucky he didn't get a much worse beating."
Link: http://www.sfgate.com/cgi-bin/blogs/sfgate/detail?blogid=7&entry_id=10918
ఈ లంకె చూస్తే ఎంతమంది ఈసంఘటనకి సంతోషించారో అర్ధమవుతుంది.
ఈ బ్లాగులో బొరట్ కి, పార్వతీశానికీ లంకెపెట్టి పాపం చేసాను. ఎంత ఎక్కువ మంది దీన్ని చదివి పార్వతీశాన్నిగుర్తుకు చేసుకొంటే, అంత మేరకు నాపాపం ప్రక్షాళనమౌతుందని మనవి.
Friday, November 10, 2006
గుర్తింపు -కథ కాని వ్యధ
ఒక సారి, నేను ఒక లాడ్జ్ లో నా 'స్వంత' (అనుమానం లేదు) భార్యతో ఉండగా, అర్ధరాత్రి పోలీసులు సోదాకొచ్చారు. అప్పుడు నేను ఉద్యోగంలో చేరిన కొత్త రోజులు. అప్పటికి పెళ్ళాం దగ్గరే ఇంకా గుర్తింపు రాలేదు (ఆ మధ్యనే పెళ్ళి అయింది లెండి). ఆఫీస్ వాళ్ళు కూడా అప్పటికి నాకు గుర్తింపు కార్డ్ కానీ, దర్శింపు (visiting) కార్డ్ కానీ ఇవ్వలేదు. పోలీస్ వాళ్ళ తత్వం ఏదేశకాలాల్లోనైనా ఒకటే. అది - in God we trust, all others we suspect. నా అప్పటి పరిస్థితి - గుర్తింపోపద్రవం (ఐడెంటిటీ క్రైసిస్). ఇదీ గుర్తింపు మహిమే!
ఇదిలా ఉంచితే, మనందరికీ కొన్ని గుర్తింపు కార్డ్ లు త(అ)ప్పనిసరిగా ఉంటాయి. అవేంటంటే, ఆఫీస్ వాళ్ళిచ్చిన గుర్తింపు కార్డ్, బ్యాంక్ ATM card, ఏదైనా హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటే వాళ్ళ కార్డ్, లైబ్రరీ కార్డ్(1 లేక అనేకం), మాన్య ప్రభుత్వం వారిచ్చిన ఎలెక్షన్ ఓటర్ కార్డ్ (దాంట్లోవివరాలు, ఫొటో లు పోల్చగలిగితే ఒట్టు). గ్యాస్ డీలర్ ఇచ్చిన కార్డ్ (కనెక్షన్ కి ఒకటి చొప్పున), ఒకటో, పదో క్రెడిట్ కార్డ్ లు (ఫోటో సహిత లేదా రహిత) ....... ఇలా అంతులేనన్ని. ఇవి కాకుండా, PIN లూ (గుర్తింపు నంబర్లు), పాస్‍వర్డులూ కూడా గుర్తింపు కొరకు ఉద్దేశించినవే. వీటిలో ఏఒక్కటి లేకపోయినా జీవితం దుర్భరమైపోతుంది.
ఇండియా లో ఉన్నప్పుడే గుర్తింపు కార్డులు చాలా అయిపోయాయనుకొంటే, కొరియా రావల్సివచ్చింది. ఇక్కడ మనుషులు తక్కువా, ఆర్భాటాలెక్కువ. నేనుండే సతిలేని వసతి గృహం (హాస్టల్ కి ఎమ్వీయెల్ ఇచ్చిన తెలుగు పదం) లోనికి రాత్రి 11 గం. ల తర్వాత కోడ్‍నంబర్ నొక్కితేనే వెళ్ళగలం. మొదటివారంలోనే నాకు ఆ అవసరం వచ్చింది. నంబరు తెలుసు కాని నాకంగారుకి దాని నిదానం మొగుడయింది. తెరుచుకోవటంలేదు. అసలే చలికాలం, తొందరగా రూమ్ లో పడదామంటే, ఈ ద్వారపు రక్షణ ప్యానెల్ నన్ను గుర్తించటం లేదే! ఎదురుగా విద్యార్ధి హాస్టల్స్ ఉంటే వాళ్ళ సహాయం అడుగుదామంటే, వాళ్ళు హాస్టల్ తలుపులు మూసుక్కూర్చున్నారు. అదీకాక వాళ్ళెవరూ నన్ను గుర్తించలేరు. వాళ్ళభాష వాళ్ళదే కాని, ఇంగ్లీష్ రాదు. నా గోల నాదే. మొత్తానికి నామేథోబలమంతా ఉపయోగించి, కొద్దిగా దేవుణ్ణి తలచుకొని లోపలపడ్డా. బ్రతుకు జీవుడా అనుకొంటూంటే, కొద్దికాలంలోనే ఆఫీసులోనూ, హాస్టల్లోనూ రక్షణ వ్యవస్థ మార్చేసి, కార్డ్ సిస్టం పెట్టేరు. దాంతో నాకు లిమ్కా బుక్కులోకి ఎక్కగలిగినన్ని కార్డులొచ్చాయి. పర్సులోనూ, జేబుల్లోనూ పెడితే ఉబ్బెత్తుగావచ్చి చూచేవాళ్ళకి ఎలాఅన్పిస్తున్దో అని భయమేసి, ఒక విజిటింగుకార్డులు పెట్టుకొనే పర్సు (holder) కొనుక్కున్నా. త్వరలోనే రెండవ సంపుటి (volume) కొనాలేమో!
ఇప్పుడు అసలైన ఇబ్బందేమిటంటే, ఎక్కడేకార్డు వాడాలో చూసుకోవాలి. లేకపోతే ఆమెషిన్ మొఖంవాచేలా చివాట్లు పెడ్తుంది. అల్లాగే, కార్డు వాడినతర్వాత, తిరిగితీసుకొని భద్రపరుచుకోవడం తీవ్రసమస్య. లేకపోతే ఐడెన్టిటీ క్రైసిస్ తప్పదు. అందులోనూ ఈమధ్య తెలివైనవాళ్ళకి తెలివెక్కువై, మనబదులు మన గుర్తింపుని వాళ్ళు వాడేసుకొంటున్నారు.
నాకు తెలుసు ఇది చదువుతూ మీలో కొందరు ఏమనుకొంటున్నారో. 'ఓ పదో, ముఫ్ఫైయో కార్డులు, ఓ నలభై నంబర్లు/పాస్‍వర్డ్‍లు రాగానే ఇంత బాధ పడాలా, మేమందరం సమర్ధించుకురావటంలేదూ, బడాయికాకపోతేనూ' అని. అంతేకదా! ఇన్ని కార్డులూ, రహస్య సంకేతాలూ సమర్ధించుకు రావటం ఒక సమస్య అయితే, ఇన్ని ఉన్నా నాకు సమయానికి ఇవేమీ అక్కరకు రాకపోవడమనేది అసలైన బాధా, వ్యధా.
నేను ఒకసారి అఫీసులో గొడుగు మర్చిపోయాను. సగం దూరం వెళ్ళాక, గుర్తొచ్చి, ఆఫీసుకి ఫోనుచేసి, వాచ్‍మేన్‍కి చెప్పా. మీరెవరు మాట్లాడుతున్నారని అడిగాడు. నేను నాపేరు, తండ్రి పేరు, PAN నంబరు, రకరకాల గుర్తులుచెప్పా. ఆఫీసులో నేను కూర్చొనే ప్లేస్ అక్షాంశ, రేఖాంశాలన్నీ చెప్పా. నేనెవరి తో తిరుగుతోంటానో, నా బాసెవరోలాంటి విషయాలు కూడా చెప్పా. అయినా ఆ వాచ్‍మేన్ ప్రోసెసర్ 'ID, password do not match' అనే మెస్సేజిస్తోంది. ... .... ..... చివరకి, బాగా ఆలోచించి, ఒక మాట (పాస్‍వర్డు)చెప్పా. వెంటనే, ఆవాచ్‍మేన్, 'సార్, మీరా? అల్లాగే సార్, మీగొడుగు జాగ్రత్త చేస్తా, సార్, రేపు తీసుకోండి సార్' అని సగౌరవంగా చెప్పాడు.
ఇంతకీ ఆ పాస్‍వర్డు ఏమిటో తెలుసా? 'ఏమయ్యా, వాచ్‍మేన్. నేనయ్యా. గెడ్డపాయన్ని'
ఇది మాఅబ్బాయి వేసిన నాబొమ్మ. నిజానికి, నేనింత అందంగా ఉండననుకోండి.
Sunday, November 05, 2006
నా మొదటి బ్లాగు
సత్యసాయి కొవ్వలి