Saturday, December 09, 2006

కొరియా కబుర్లు: పురోగతీ - వివాహనాశాయ

కొరియాలో పెళ్ళిళ్ళలో ఊరేగింపులుంటాయా అని నాగరాజాగారు అడిగారు. అయ్యా! అసలు పెళ్ళిళ్ళే అవడంలేదు ఇక్కడ. ఇంక ఊరేగింపుల మాటేమిటి చెప్పమంటారు. ఇక్కడి సాంప్రదాయపు పెళ్ళి చాలా అచార వ్యవహారాలతో కూడి ఉంటుంది. పెళ్లి పందిర్లూ (మంటపాలు), పెళ్ళి బాసలూ ఉంటాయి. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ క్రింది లంకె చూడండి. http://www.geocities.com/korea_traditional_wedding/
ఈ మధ్యన జరిగే పెళ్ళిళ్ళు మాత్రం పశ్చిమ దేశాల పద్ధతిలో జరుగుతున్నాయి. పెళ్ళి కోసం కల్యాణ వేదికలు (హాళ్ళు) మన వేపులాగానే అద్దెకి దొరుకుతాయి. అబ్బాయీ, అమ్మాయీ ఉంగరాలు మార్చుకొంటారు. ఈ మధ్యన క్రీస్టియను ప్రభావం ఎక్కువవడం వల్ల ఆ పద్ధతులు కూడా తరచు చూడచ్చు.
ఇక్కడి యుక్తవయస్కుల్లో, ముఖ్యంగా అమ్మాయిల్లో, పెళ్ళిపట్ల ఆసక్తి తగ్గిపోయింది. ఈ మధ్యన జరిపిన సర్వేలో ప్రతి పదిమంది ఆడవాళ్లలో ఏడుగురు పెళ్లివల్ల తమ కెరీర్ పాడయిపోతుందన్న కారణంగా పెళ్ళివద్దనేసారు. అదీకాక, పెళ్ళిఅనేది ఒక బాదరబందీ తో కూడిన నిబద్ధత (కమిట్‍మెంట్) అని తేల్చిపారేసారు. ఇక్కడ పెళ్ళిళ్ళు చాలా ఆలశ్యంగా జరుగుతున్నాయి. దానికి కారణం మగపిల్లలు ఉద్యోగం తెచ్చుకొని, ఒక ఇల్లూవాకిలి ఏర్పరచుకొనేసరికి సగం జీవితం అయ్యిపోతోంది. ఇక్కడి ఆడపిల్లలు చాలా నిక్కచ్చైన వాళ్ళు. రెండేళ్లు ప్రేమించుకొన్నాక కూడా అబ్బాయి ప్రవర్తన నచ్చకపోయినా, ఉద్యోగం తెచ్చుకోలేకపోయినా, ఇంకా ఇతరకారణాలేమైనా వచ్చినా, తలాఖ్. పల్లెటూర్లలో సంగతి కాసెపు అలా ఉంచితే, సౌల్ (Seoul) ‍లో మాత్రం జంటలు చాలా కన్పిస్తాయి. కాని ఎప్పటికో పెళ్ళిళ్ళవుతాయి, అయితేగియితే. పెళ్ళిళ్ళే ఇంత కష్టంగా అవుతోంటే, పెటాకుల సంఖ్య పెరిగిపోతోంటే వీళ్ళసమస్య ఎంత జఠిలమైపోయిందో ఊహించండి. ఈమధ్య కాలంలో ఇక్కడా తల్లో, తండ్రో మాత్రమే ఉన్న కుటుంబాల సంఖ్యఎక్కువైపోవడం ఇక్కడి వారిని కలవరపరుస్తోంది.


పెళ్లిళ్లంటేనే మొహమ్మొత్తిన వీళ్ళకి పిల్లలంటే మోజుంటుందా? ఉండదుకదా? అందుకే ఇక్కడ శిశుజననాలు చాలా తక్కువ. ఎంత తక్కువంటే జనాభాని తక్కువచేసేటంత. అబ్బ. మనదేశంలోఎప్పటికైనా ఇల్లాంటి పరిస్థితి వస్తుందా? అయితే ఇక్కడ కొన్ని గ్రామాల్లో కొన్ని దశాబ్దాలుగా శిశుజనన్నాలేవుట. అవును మరి ఉన్న వాళ్ళందరూ గ్రామాలు విడిచిపొతే జనాభా ఎలాపెరుగుతుంది? ఇప్పుడు గ్రామాల్లో ఉన్న వాళ్లు చాలా మంది వయసు మీద పడిన వాళ్ళే. అందువల్ల, ఏవూరులోనైనా పిల్లలు పుడ్తే పక్క గ్రామాల వాళ్ళు పిక్నిక్ లాగా వెళ్ళి వాళ్లని చూసి, వాళ్ళ ఏడుపు విని వస్తార్ట. వీళ్లని మనదేశానికి టూరుకి తీసుకెళ్తే భలే ఆదాయమేమో. అడుగడుక్కీ టూరిష్టు ఎట్రాక్షనే, చెత్తకుండీలతో సహితంగా.


ఇక్కడి ప్రభుత్వం జనాభా ఎలా పెంచాలా అని బుర్రలు బద్దలు కొట్టుకొంటోంది. రకారకాల రాయితీలు, పధకాలు ప్రవేశ పెడుతోంది. వీళ్ళకి ఐడియాలు సరిగ్గా రావట్లేదు. లేకపోతే జనాభా పెంచాలంటే అదిచేతవచ్చిన మనలాంటి వాళ్లని సలహాలు అడగాలి. నన్నడిగితే, లాలు దంపతుల్లాంటి ఆది దంపతులని వాళ్ళ గేదెలతో సహా దిగుమతి చేసు కొంటే జనాలే జనాలు. లేకపోతే, BPO (birth process outsourcing) ఎలాగూ ఉంది. మన దేశంలో అద్దెకి గర్భసంచులు విరివిగా దొరుకుతున్నాయని మీరు వినే ఉంటారు.


ఇది ఇలా వుంటే, గ్రామాల్లో కొంతమంది వ్యవసాయం చేసుకొంటున్నారు కదా. వాళ్ళల్లో చాలామందికి 40 ఏళ్లొచ్చినా పెళ్లిళ్ళవట్లేదు. గ్రామాల్లో సరిపడ అమ్మాయిలు దొరకట్లేదు. సరిపడా అంటే సంఖ్యలో. గ్రామాల్లోని అమ్మాయిలు పట్నాలకి పోయి చదువుకొని ఇక్కడ పేడ పిసుక్కోవడం ఇష్టంలేక పల్లెటూరి అబ్బాయిలని చేసుకోవడం లేదు. ఇక పట్నం అమ్మాయిల గురించి చెప్పాలా? దీనికి పరిష్కారం ఒకటి కనిపెట్టారు, ఇక్కడి గ్రామీణులు. అదేంటంటే, బయటిదేశాలవాళ్ళని పెళ్ళిచేసుకోవడం. ఇది మన అరబ్బు షేకుల లాగా విలాసానికి కాదు. అవసరానికి. వీళ్ళకి డబ్బులున్నాయి. ఆస్తులున్నాయి. దాంతో మన హైదరాబాదులో లాగానే బ్రోకర్లు తయారయ్యారు. వీళ్ళ ఆహారపు అలవాట్లకీ, రూపురేఖలకీ దగ్గరగా ఉండే వియత్నాం, ఫిలిప్పైన్స్ లాంటి దేశాలనుండి ఆడపిల్లల్ని తెచ్చుకొంటున్నారు.
అక్కడిదాకా బాగానే ఉంది. కాని అసలు చిక్కేమిటంటే కొరియన్లలో పెద్దా, చిన్నా భేదాలూ (వయస్సులో), పట్టింపులూ చాలా ఎక్కువ. మనదేశంలో ఇవన్నీ పోయాయి. ఇక్కడ ఇంకా బతికే ఉన్నాయి. అత్తల అజమాయిషీకూడా ఎక్కువే. బయటినుండి వచ్చినవాళ్ళకి వీళ్ళ సంస్కృతి అంతా గందరగోళంగా ఉంటుంది. అదీకాక అలా వచ్చిన అమ్మాయిలు సాధారణంగా లేని కుటుంబాలనుండే కావడంతో ఇంకొంత అయోమయం సహజం.
ఇలాంటి పెళ్ళిళ్ళు ఈ మధ్య బాగానే జరుగుతున్నాయి. ఈ విషయంపై ఒక పత్రిక వారు ఒక సర్వే జరిపి వ్యాసం రాసారు. దాని కోసమని అనువాదకులని కూడా తీసుకొని వెళ్ళారు. అమ్మాయిలతో మాట్లాడాలి కదా! అలాంటి ఒక జంటని కలిసి ముచ్చటించారు. అమ్మాయి వియత్నాము నుంచి. అబ్బాయి నడిగితే, 'నాకు పొలం, పుట్రా చూసుకోగలిగిన పిల్ల కావాలని అడిగితే బ్రోకరు ఈపిల్లని చూపించాడ'ని చెప్పాడు. ఆ అమ్మాయి మాత్రం, 'ఇక్కడికొచ్చి ఈ పొలం పనులు చేయాల్సి ఉంటుందని తెలిస్తే ఈ పెళ్ళికొప్పుకొనేదాన్ని కాద'ని చెప్పింది, తన భాషలో. ఇదేమిట్రా మొగుడూ పెళ్ళాల మధ్య ఈ వైరుధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? అసలు కీలకం ఎక్కడుందంటే, బ్రోకర్ దగ్గర. కొరియా నుంచి అబ్బాయిల్ని వియత్నాం తీసుకెళ్ళి పిల్లల్ని చూపించారు. నచ్చిన వాళ్ళని ఎన్నుకొన్నాక, వాళ్ళమధ్య ఇంటర్వ్యూ ఏర్పాటు చేసారు. అబ్బాయి తనకి పొలంపనులకి సాయపడగల్గిన పిల్లకావాలని చెప్పాడు. అనువాదకుడు ఆ అమ్మాయికి, 'అబ్బాయి ఉద్యోగస్థుడు, ఇష్టమేనా' అని అడిగాడట. ఆ అమ్మయి ఎగిరి గెంతేసి ఒప్పుకొంది. ఆ అమ్మాయి వియత్నాం లో ఎవరింట్లోనో పనిమనిషిగా పనిచేస్తోందిట. మొదట్లో పెళ్ళిచేసుకొని వేరే దేశం వెళ్ళడం ఇష్టం లేకపోయినా, తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఒప్పుకొందిట.
ఎలాగైతేనేం పెళ్ళి అయిపోయింది. వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలంటారు కదా? ఎవరు ఆడాలో చెప్పలేదు కదా? అంటే ఎవరైనా ఆడొచ్చు. ఇక్కడ బ్రోకరు అనువాదకుడి ద్వారా చిన్న అబద్ధం ఆడాడంతే. కాబట్టి తప్పులేదు. అందులోనూ ఒక బ్రహ్మచారిని 'బ్రహ్మ చెర' నుండి తప్పించడం కోసం ఆడాడు కాబట్టి, ఓకే. ఈధర్మసూక్ష్మం ఎక్కడో మన పురాణాల్లో ఉండే ఉంటుంది. ఎందులో ఉందో గిరిశాన్నడిగితే చెబుతాడు. సదరు పత్రికా విలేఖరి ఆ అమ్మాయిని 'ఎలా ఉంది నీ వైవాహిక జీవితం' అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి పెళ్లైన కొత్తల్లో మొగుడూ, అత్తా వల్ల కొద్దిగా ఇబ్బంది పడినా, తను గర్భవతయ్యింతర్వాత వాళ్ళు చాలా ప్రేమగా, ఆదరంగా చూసుకొంటున్నారని చెప్పింది.
చివరిగా ఆ ఆమ్మాయి ఆ అనువాదకుడికి ఒక చిన్న విన్నపం చేసుకోంది. అది చదివాకా, నాకు అసలు మజా వచ్చింది. ఆమె ఆ అనువాదకుడిని, తన భర్త తనని పుట్టింటికి ఎప్పుడు పంపిస్తాడో అడగమంది. దానికి ఆ భర్త 'పిల్లాడు పుట్టాక' అని చెప్పాడు. దీంట్లో మజా ఏముందంటారా? ఆ పత్రిక వాళ్ళ ధర్మమా అని పెళ్ళైన రెండేళ్ళకి తన భర్తతో మొదటిసారి (అర్ధవంతంగా) ముచ్చటించింది మరి.
ఆహా! ప్రేమే కాదు, పెళ్ళి కూడా మూగది, గుడ్డిది, చెవిటిది, భాష అవసరం లేనిది అన్న మాట.

6 comments:

  1. వియత్నాం అమ్మాయిలు...ఇంత...మెతగ్గా ఉంటారా...? ఐతే...వియత్నాం అమ్మాయినే చేసుకోవాలి.... మన ఆంధ్ర అమ్మాయిలు...అమ్మో!!!

    ReplyDelete
  2. సత్యసాయి గారూ, బ్రహ్మాండంగా రాసారు. వాళ్ళ పెళ్ళి పాట్లను బాగా వర్ణించారు. BPO - అదిరింది. విషయాన్ని చక్కగా వివరించడం, అందునా ఇంత చక్కటి హాస్య ధోరణిలో వివరించడం ఎంతో బాగుంది. మీరీ వ్యాసాన్ని మన పత్రికలకు పంపండి. కొరియా కబుర్లు పేరిట ఓ శీర్షికే రాయొచ్చు మీరు.

    ReplyDelete
  3. ముందుందిలే మనకీ ముసళ్ళ పండగ ! ఆడవాళ్ళకి మితిమీరిన స్వేచ్ఛ రావడం అనేక దేశాల్లో వివాహ వ్యవస్థని దెబ్బ తీసింది.కొరియా అందుకు మినహాయింపు కాదు.ఇండియా మినహాయింపు కాబోదు.ఆడవాళ్ళ హక్కుల పేరుతో మగవాణ్ణి అమానుషమైన చట్టాల సంకెళ్ళలో బంధించాలనుకునే ఆడవాళ్ళ మూలంగా భవిష్యత్తులో మగజాతే పెళ్ళి వొద్దనుకునే పరిస్థితి రాబోతోందనుకుంటున్నాను. అప్పుడు పెళ్ళి చేసుకుంటాననేవాణ్ణి ఒక పిచ్చి వెధవని చూసినట్లు చూస్తారు, ఆడవాళ్ళు కూడా !

    ReplyDelete
  4. "మనసు మూగది. మాటలు రానిది. మమత ఒకటే అది నేర్చినది. భాష రానిది. బంధమున్నది. వారిద్దరినీ జత కూర్చినది." - సంతోషం. బిడ్డ కడుపులో పడ్డాక మమతలు కలగడం, సర్వేపత్రిక పుణ్యాన ఆవిడ పుట్టింటికెపుడెళ్తుందో తెలుసుకోవడం... ఔరా !!(నా ముక్కుమీద వేలు కనిపిస్తోందా, గురువుగారూ!?)
    శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదేగాబోలు!

    ReplyDelete
  5. అన్నట్టు ఈ టపాకు మీరు పెట్టిన శీర్షిక భలే కుదిరింది.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.