Sunday, January 14, 2007

సంక్రాంతి సంబరాలు


కొన్నితెలుగు బ్లాగులు సంక్రాంతి సందర్భంగా శోభాయమానంగా వెలిగిపోయాయి. వాటిని చూసి మహానందమయింది. తెలుగు వారికి తెలుగంటేనూ, తెలుగు పండగలంటేనూ అభిమానం పోలేదని తెలిసి చాలా సంతోషమయింది. దాంతో, ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది మనసు.

మా చిన్నప్పుడు పండగలంటే ఒక రకమైన మోజుండేది. పండగలంటే పిండివంటలు, కొత్తబట్టలు, మనం చుట్టాలవడమో, లేకపోతే మనకే చుట్టాలురావడమో జరిగేది. రోజువారి జీవితానికి భిన్నంగా ఉండేదే పండగన్న భావం కలిగేది. ఆభిన్నత్వాన్ని అనుభవించడనికి సెలవు సహకరించేది. సూక్ష్మంగా అలోచిస్తే మన పండగలన్నీ కూడా కొన్ని మైలురాళ్ళకీ, కొన్ని సంఘటనలకీ లంకె ఉన్నవే అనిపిస్తాయి. ఒక పండగ సూర్యుడి గమనానికి సంబంధించయితే, ఒక పండగ పంట నాటడానికీ, ఇంకోటి కోతలకీ సంబంధించినది. మన పాత తరానికి జీవితాన్ని అనుభవించడం బాగా తెలుసని మన పండగలు తెలియచెబుతాయి. అల్లాగే మన జీవవ్యాపారాలకి సంబంధించిన మైలురాళ్ళకి కూడా కొన్ని సంబరాలు లంకె పెట్టి జీవితాల్ని సారవంతం చేసుకొని అనుభవించారు. బారసాల, అన్న ప్రాసన, పెళ్ళి, పేరంటం, షష్ఠిపూర్తి - ఇలాంటివి ఒక ఉత్సవం లాగా చేసుకోంటూ తమ జీవితాలకి రసపూర్తి కల్గించుకొన్నారు. యాంత్రికతను తొలగించుకొన్నారు.

మా అదృష్టంకొద్దీ మా చిన్నప్పుడు పండగలని పండగల్లాగా అనుభవించాం. మా పిల్లల్ని చూస్తే వాళ్ళు చాలా కోల్పోతున్నారనిపిస్తుంది. వాళ్ళకి ఆ కోల్పోయిన ఫీలింగు కలగక పోవడం వాళ్ళ దురదృష్టం. మా అబ్బాయయితే మీది పాతకాలం అని నాతోటీ, మా అమ్మతోటీ అనేసాడు కూడా. కొత్తకాలం అంటే ప్రస్తుత కొలమానం ప్రకారం కొళాయి తిప్పగానే నీళ్ళురావాలి, స్విచ్చి నొక్కాగానే గాలీ, వెలుతురూ రావాలి, కాళ్ళు కదపకుండా దూరాలు వెళ్ళాలి. శరీరాల్ని కాస్తైనా కష్టపెట్టకుండా పనులన్నీ జరిగిపోవాలి. ప్రస్తుత సామాజిక వాతావరణం కూడా ఇలాంటి సుఖాలకే పెద్దపీట వేస్తోంది. ఇప్పుడు పండగంటే సెలవు మాత్రమే! అంటే పండగరోజు ఆలశ్యంగా నిద్రలేవాలి. అది రూలూ. అన్ని పనులూ ఆలశ్యం చేసుకోవాలి. ఆనక మొద్దు పెట్టి (idiot box) ముందు గంటలతరబడి కూర్చొని కాలం గడిపెయ్యాలి. ఒక ఇరుగూ పొరుగూ, ఒక అచ్చటా ముచ్చటా ఏమీ ఉండవు. ఆనక దెబ్బలాటలూ మామూలే. ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కొత్త బట్టలు కొనేయడం, ఏ పిండివంటలు తినాలన్నా 'స్వగృహా' అన బడే పరగృహాలకి పోయి కొనుక్కొని తినేయడంతో పండగంటే ఏ ప్రత్యేకతా లేకుండా పోయింది.

మా చిన్నప్పుడు పండగంటే కొన్ని రోజుల ముందునుంచీ హడావడి మొదలు. అందులో సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళకి పెద్ద పండగ. మాకు అర్ధసంవత్సర పరీక్షలయ్యాక సంక్రాంతి కలిసేలా సుమారు రెండు వారాలకి తగ్గకుండా సెలవలిచ్చేవారు. ఇప్పుడు ఆంధ్రదేశంలో చాలా మటుకు స్కూళ్ళకి క్రిస్మస్ సెలవలిస్తున్నారు. సంక్రాంతికి రెండు, మూడు రోజుల్తో సరిపెట్టేస్తున్నారు. చివరికి భారతీయ విద్యాభవన్ లాంటి అచ్చమైన దేశవాళీ పేరు పెట్టుకొన్నస్కూళ్ళది కూడా ఇదే పద్ధతి. ఇంటికి సున్నాలెయ్యడం, పాతసామానులు, చెత్తాచెదారం తీసి ఇల్లూ వాకిలీ శుభ్రం చేయడం, కడగడం, వీటితో ఒక వారం పైన పట్టేది. పెద్దవాళ్లకి ఒళ్ళు హూనమయ్యేది, కానీ మాకు చాలా సంబరంగా ఉండేది. మేం చేయగల పనులు మా చేత చేయిస్తో ఉండేవారు. తర్వాత, నిలవ ఉండి, నలుగురికీ పంచడానికి పనికి వచ్చే తీపీ, కారం పిండి వంటలు తయారు చేసేవారు. చిట్టిగార్లు లాంటివి చేస్తోంటే మేమందరం ఇత్తడి చెంబులు తీసుకొని కూర్చొనే వాళ్ళం, ఉండల్ని మొత్తడానికీ, ఆపైన వేపినవి వేపినట్లే రుచి చూసేయడానికి. అలా చేసిన చిట్టిగార్లలో మాశ్రమా, ఉత్సాహాలు మరింత రుచిని చేర్చేవి. ఆరోజుల్లో కాస్తంత భారీ పిండివంటయితే ఇరుగు పొరుగులు ఒకరికొకరు సహాయపడేవారు. అందుకని, చివరలో కొంత మేరకి ఇరుక్కీ, పొరుక్కీ పంచిపెట్టేవారు. ఆ పంచుకోవడంవల్ల కూడ ఒక రుచి వచ్చేది. ఇప్పుటి స్వగృహా వంటకాల్లో అసలైన రుచి లాభాలు మాత్రమే. ఎవరికైనా పెట్టినా, రూపాయలు వారి దోసిళ్ళలో పోస్తున్న అనుభూతి మాత్రమే కలుగుతోంది.

ఏపండగైనా సరే పొద్దున్నే4.30 ప్రాంతాల్లో లేపేసే వాళ్ళు. సంక్రాంతి అయితే పొద్దున్నే లేవగానే వేడినీళ్ళపొయ్యి దగ్గర చతికిలబడిపోయేవాళ్ళం. తలంటుకోసం రమ్మంటే 'పహలే ఆప్' అంటూ సహోదరులకి తెగ మర్యాద చేసేవాళ్ళం. మొత్తం మీద తప్పనిసరి కుంకుడుకాయల తలంటు కానిచ్చి మళ్ళీ పొయ్యి దగ్గర చేరేవాళ్ళం. మా అమ్మ అందరికీ తలంటి, తనుకూడా కానిచ్చేసి వంటపనికి దూకేసేది. మళ్ళీ 10, 11 గంటలకల్లా భోజనాలు తయారైపోయేవి. చేతుల్లో యంత్రాలేమైనా పెట్టుకొని పనిచేసేవారేమో అని పిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే. ఆతర్వాత పెద్దవాళ్ళ భోజనాలు. కాసేపు ఆటల తర్వాత మధ్యాహ్నం 3 ప్రాంతాల్లో మొహాలు కడుక్కొని కొత్తబట్టలిమ్మని వేధించేవాళ్ళం. ఎంత లేటు చేస్తే బట్టలకి అంత మేలని కాస్త లేటు చేసేవారు పెద్దవాళ్ళు. మేమూరుకొంటామా, పక్కవాళ్ళపిల్లలు వేసేసుకొన్నారని చెప్పి తొందరచేసేవాళ్ళం. మా తమ్ముడు కాస్తంత ఉత్సాహవంతుడు. అందుకని వాడిని నక్షత్రకుడ్ని చేసి ముందుకు తోస్తో ఉండేవాళ్ళం. కొత్త బట్టలు వేసుకొన్నప్పట్నించి అవి మాసిపోతాయని రంథి. మా అన్నయ్య, తమ్ముడు అయితే అంత పట్టించుకొనే వాళ్ళు కాదు. కొత్తబట్టలు కట్టుకొన్న ఉత్సాహంలో మరి కాస్త విజృంభించి అవి మాసి పోయేదాకా ఆడేవారు. అన్నిటికన్నా నాకు ఇప్పటికీ నచ్చిన విషయమేమిటంటే పండగ రోజు దెబ్బలాడుకోవద్దని చెప్పేవాళ్ళు. మేము కూడా చాలా సీరియస్ గా తీసుకొనే వాళ్ళం ఆ మాటని. ఆ రకంగా కూడా పండగకి ఒక ప్రత్యేకత ఉండేది.

సంక్రాంతి అంటే గుర్తొచ్చేవిషయం ఇంకోటుంది. అది ముగ్గుల పర్వం. ధనుర్మాసాన్ని స్వాగతించడంతో మొదలైన ముగ్గుల హడావిడి ముక్కనుము తో రథం ముగ్గుతో ముగుస్తుంది. రకరకాలైన ముగ్గులు సేకరించి రోజుకొక ముగ్గు ముంగిట వేయడం ఒక ముచ్చటైన సంస్కృతి. మా అక్క ముగ్గులు పెడుతోంటే మేమందరం సహాయం చేస్తోండేవాళ్ళం. పత్రికల్లో వచ్చే ముగ్గులు చూసి చుక్కలు లెక్కపెట్టడంలో సాయంచేయడం, ఎలా వేయాలోతర్జన భర్జనలు చేయడం మాపని. మానాన్నగారు లెక్కల మాస్తారు. ఆయన ముగ్గులని జామెట్రీ దృష్టితో చూసి సలహాలు చెప్తోంటే మా అక్క ఇరకాటం పడ్తో ఉండేది. అన్నీ అయ్యేసరికి వీధిలో వేరే వాళ్ళు ఆ ముగ్గు కాస్తా పెట్టేస్టే కాస్త నిరుత్సాహంగా అనిపించేది. ఈ ముగ్గులేయడంలో చుట్టు పక్కల ఆడపిల్లల్లో పోటీ ఉండేది. ఏముగ్గు పెట్టబోతున్నారో వేరేవాళ్ళకి తెలియకుండా చివరిదాకా జాగ్రత్త పడేవాళ్ళు. వేరే వాళ్ళ ముగ్గు వివరాలు అడగడానికి అభిమానం అడ్డొచ్చి నడి రాత్రి వెళ్ళిచుక్కలు లెక్క పెట్టి ముగ్గు నేర్చుకోవడానికి తెగ ప్రయత్నిస్తోండేవాళ్ళు. సాయంత్రమో, తెలవారగట్లో చలిలో చుక్కలు పెట్టి ముగ్గు కలుపుతోంటే మా అక్కకి మేము సాయం కూర్చొనేవాళ్ళం. చుక్కలు పెట్టడం, వాటిని కలపడం బాగా రాకపోతే చెరిపి మళ్ళీవేయడం, పక్క వాళ్ళముగ్గుతో పోల్చుకోవడం మామూలే. నచ్చకపోతే బాధ పడడం, మేమందరం ఓదార్చడం ఇవన్నీ మధురమైన స్మృతులు. పనిలోపనిగా నా క్కూడా కాగితం మీద ముగ్గులుపెట్టడం వచ్చేసింది.

మా ఈ ముగ్గుల సరదా అపార్ట్ మెంట్ ల నివాసంతో భంగపడింది. ఈ మధ్యన మా అమ్మాయి స్కూల్లో ముగ్గుల పోటీలో పేరిచ్చివస్తే మా ఇంట్లో ఉత్సాహం మళ్ళీ వచ్చింది. అందరం ముగ్గు కొని, రంగులు కొని తను ప్రాక్టీస్ చేస్తోంటే సంతోషపడిపోయాం. చివరికి తనకో ప్రైజొస్తే హమ్మయ్య ముగ్గుల సంస్కృతి అంతరించిపొలేదని హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. ‍చివరగా ఈ బ్లాగు మొదట్లో ఇచ్చిన రథం ముగ్గు మా అమ్మాయి వేసినది. దీనికి టెక్నికల్ సలహాదార్లు: నేను, మా అబ్బాయీని.
5 comments:

 1. మీరు ఆంధ్రా వారా?నాకు తెలిసి అంధ్ర లొ మత్రమే సంక్రంతి పెద్ద పండుగ.మా ఊరిలో సంక్రంతి చాలా బాగ జరుపుకునే వాల్లం.హైదరాబాదు వచ్చాకా సంక్రంతి కి పెద్దగ హడావుడి వుండేది కాదు.ఇక అమెరికా వచ్చాకా ఎదో మొక్కుబడిగా పిండివంటలతో సరిపెట్టుకుంటున్నాము.మీ వ్యాసం లోని ప్రతీ వాక్యం నన్ను మా ఊరు తీసుకెల్లి ఆ జ్ఞాపకాలలో తిప్పి తీసుకొచ్చింది.నిన్న ఫోను చేస్తే అమ్మ మీరులేక ఎదొ ఒక ముగ్గు పెట్టానంతే అంటే ఎంత బాధ వేసిందో?అన్ని కోల్పోతున్నను అని బాధగా వుంది.మీ అమ్మయి పెట్టిన రధం ముగ్గు చాలా బాగుంది.

  ReplyDelete
 2. మీరు ఎప్పటి హైదరాబాదు గురించి చెబుతున్నారో కాని, ఇప్పుడు ఇక్కడ ముగ్గులు తెగ పెడుతున్నారు. మార్నింగ్ వాక్ కెళ్ళి వస్తోంటే రకరకాల, రంగురంగుల ముగ్గులు కనులవిందు చేస్తున్నాయి. చాలా ఆనందదాయకమైన విషయం.

  ReplyDelete
 3. రథం ముగ్గుపై ఎన్ని కార్టూన్లో! తెలుగు పత్రికలలో. ఈ ముగ్గేస్తూ కొరియా వెళ్ళవచ్చు - విమానం ఖర్చులు మిగుల్తాయి. మీ అమ్మాయి రథం ముగ్గు బాగుంది. మీరు హైదరాబాదులో ఎంతకాలం ఉంటారు? ఇక్కడ తెలుగు బ్లాగరులు కొంతమంది పండుగకు తమ తమ నెలవులకు వెళ్ళియున్నారు.

  ReplyDelete
 4. మీరు చెప్పినవి నిజమే అనిపిస్తుంది...
  నా చిన్నప్పుడు కొన్నేళ్ళు తాతగారి ఇంట్లో ఉన్నప్పుడూ, వారి ఇంటికి వెళ్ళినప్పుడూ నిజంగానే మీరు చెప్పిన విశేషాలన్నీ చూసే అదృష్టం కలిగింది. గొబ్బేమ్మాలు పెట్టి వాటి చుట్టూ నాట్యాలు చేసేవారు. ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దులు అన్నీ గుర్తున్నాయి.

  అంత కాక పోయినా ఇంకా పండుగ వాతావరణం మా ఇంట్లో ఉండటం నా అదృష్టమే.

  మీరు చెప్పినంత కుదరకపోయినా మా అమ్మగారు పొద్దున్నే లేచి, తల స్నానం చేసి అన్ని రకాల పిండి వంటలు తయారు చేసి పూజ చేసి నైవేద్యం పెడతారు. నేను కొద్దిగా లేటుగా లేచినా నేనూ తాలస్నానం చేసి దేవుడికి దండం పెట్టి, పిండి వంటలు ఎంతో చక్కగా ఆస్వాదిస్తాము. కాకపోతే ఇప్పుడు బెంగుళూరులో ఉంటాము కాబట్టి ముగ్గులు గట్రా చూడటానికి మాత్రం అసలే కుదరదు.

  ReplyDelete
 5. ఎంత చక్కగా చెప్పారండి సంక్రాంతి గురించి.ఇలా మన మందరము సంక్రాంతి సంబరాలు చెప్పుకుంటూ రాసుకుంటూ ఉంటే ఆ సంక్రాంతి దిగులు పోతోంది.


  మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

  విహారి.

  ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.