పాన్
తాంబూలసేవనం మనదేశంలో కొత్త కాదు. అలాగే పెళ్ళాం మొగుడికి చిలకలు చుట్టి నోట్లో పెట్టడం చాలా రోమాంటిక్ సన్నివేశమని చాలా సినిమాలద్వారా డోకొచ్చేంతగా తెలిపారు. ఇదే సర్వవ్యాపకమైన పాన్. హైదరాబాదులో ఉన్న ఒక పాన్ దుకాణంలో అతి ఖరీదైన పాన్లు (వయాగ్రా పాన్లతో సహా) దొరుకుతాయని ఆమధ్య పేపర్లో పెద్దగా చదివా. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పాన్ (తిన్నా) దొరికినా తూర్పు రాష్ట్రాలలో తిన్నంత ఇంకెక్కడా తినరేమో. పాన్ తినడం పెద్ద సమస్య కాదు కానీ దాన్ని నమిలి ఉమ్ములేసే వాళ్ళతోనే పేద్ద తలనెప్పి. మేం ఇఛ్ఛాపురంలో ఉన్న రోజుల్లో స్కూలు దారిలో రోడ్డుమీదే బస్సులాగేవి. వాటిల్లోనుంచి చూడకుండా ఉమ్ములేసే ప్రయాణీకులవల్ల వాటి పక్కనుండి వెళ్లడం దిన దిన గండంగా ఉండేది. ఆతర్వాత ఒకసారి విజయనగరం రైల్వే స్టేషనులో కిళ్ళీ ఉమ్ములతో ఎర్రబారిన ఒకప్లాట్ ఫాం చూడగానే ఒరిస్సా వెళ్ళే రైళ్ళక్కడనుండే వెళ్తాయని చెప్పగలిగా. అలాగే అదే జనరల్ నాలెడ్జ్ తో భుభనేశ్వర్ లో ఆర్బీఐ బిల్డింగుకి కిళ్ళీ రంగెందుకేసారో కూడా తెలిసేసుకున్నా. నిన్న ఇక్కడి పేపరులో కిళ్ళీనమిక్స్ చదివి కిళ్ళీ గొప్ప తెలుసుకుని హాశ్చర్యపోయానని తెలుసుకున్నా. కొన్ని వివరాలు మీకు కూడా చిలకలు చుట్టి యిస్తా.
ముంబై లోకల్ రైళ్ళమీద పడిన కిళ్ళీమరకలని శుభ్ర పరచడానికి మధ్య రైల్వేవాళ్ళు రూ87 లక్షలు, పశ్చిమరైల్వే వాళ్ళు 57 లక్షలు ఏటా ఖర్చుపెడుతున్నారట. దానికోసం 63000 పని గంటలు వినియోగిస్తున్నారట. తాగడానికి నీళ్ళులేక కోట్లాది ప్రజలు ఇక్కట్లు పడుతోంటే ఇక్కడ ఎన్ని నీళ్ళు వృధా అవుతున్నాయో మీరే ఆలోచించండి. పాన్ తినద్దని అనడంలేదు కానీ నమిలి ఎక్కడపడితే అక్కడ ఉమ్మడం హీరోయిజం కాదని తెలుసుకుంటే ఎంత బాగుంటుందో కదా. పాన్ బనారస్ వాలా అమితాబ్ చేత చెప్పిస్తే! ఇది ఇలాఉంటే, ముంబై మునిసిపల్ కార్పొరేషన్ వాళ్ళు యధేచ్ఛగా ఉమ్ములూ, ఉచ్చలూ పోసేవాళ్ళ నుండి 2007 నుండి సుమారు లక్ష మంది నుండి జుర్మానా గా వసూలు చేసినది 4.27 కోట్లు.
ఈఉమ్ముల బాధకి తట్టుకోలేక ఈమధ్య చాలా భవనాలలో మూలల్లో త్రిమతాల దేవుళ్ళు, మత చిహ్నాలూ ఉన్న టైల్సు పెడుతున్నారు.
చిరాక్
ఒత్తిడీ , దాని వల్ల వచ్చే చిరాకులలో మనుషులు ఎలాంటి అకృత్యమైనా చేసేస్తారని ముంబైలో నిన్న జరిగిన సంఘటన పై స్పందిస్తూ ఒక మానసికనిపుణుడు సెలవిచ్చారు. ఒక తండ్రీకొడుకులు కారులో వెళ్తూ బెస్టు బస్సు సైడివ్వలేదని అలిగి ఆబస్సాపి డ్రైవరుమీద తిరగబడ్డారట. విడతీద్దామని దిగిన ప్రయాణీకులని తమవద్దనున్న గన్నుతో బెదిరించి, జనం మరీ తిరగబడగలరేమోనన్న అనుమానంతో గాలిలో పేల్చి ఆనక పరారైపోయారట. కండక్టర్ కారు నంబరు పోలీసులకి చెప్పగా, వాళ్ళు నేరస్థులని పట్టుకుని జైల్లో పెట్టారు. ఎంత చిరాకైనా మరీ ఇంత అకృత్యమా. పెంపకలోపం ఒకకారణమని నిపుణుడు చెప్పాడు. నాఉద్దేశ్యంలో కష్టపడకుండా డబ్బులూ, సుఖాలూ వస్తే పిల్లలు ఇలా తయారవుతారేమో ననిపిస్తోంది. డబ్బు విలువ తెలియని వాడికిమనుషుల విలువ మాత్రం తెలుస్తుందా.
కొసరు
జ్యూసులు తాగేవాళ్ళు, ఘన పదార్ధాలు తినేవాళ్ళకన్నా ఎక్కువగా లావెక్కుతారని ఇటీవలి పరిశోధన సారాంశం. అలాగే మధ్యాహ్నం లంచి కాకుండా లైట్ గా జ్యూసో గీసో తాగేస్తే బాగా పని చేసుకోవచ్చుగా అని ఒక అమ్మడడిగితే, మా ముంబై తిండి నిపుణురాలు ససేమిరా అలా చేయద్దని లైట్ గా పప్పూ అన్నమో, కూరా రొట్టో తినమని సలహా చెప్పింది. వేసవి కదా అని ఊరికే రసాలు తాగకుండా తినండి- నేను హార్లిక్స్ తాగను తింటాను స్టైలులో. మీకు తెలిసే ఉంటుంది – బెంగాలీలు వాళ్ళ భాషలో ద్రవాలని (ఉదా. చాయ్) కూడా తినడం అనే అంటారు.
ఇంకోసారి ఇంకొన్ని ముచ్చట్లతో …
ప్లాట్ ఫాం ప్రవేశానికి ముందే పాన్ వేసుకున్నవాళ్లను నిరోధించటం అవసరమనిపిస్తోంది. Ticket collector లాగానే Pan examiner ఉంటే మన రైలు ప్లాట్ ఫారాలు శుభ్రంగా ఉండగలవు. ఇంత గంభీరమైన సమస్యను కూడ మీదైన హాస్య ధొరణిలో చెప్పటం బాగుంది.
ReplyDelete>> ...ఈమధ్య చాలా భవనాలలో మూలల్లో త్రిమతాల దేవుళ్ళు, మత చిహ్నాలూ ఉన్న టైల్సు పెడుతున్నారు.
ReplyDeleteఅలాగే మావో, స్టాలిన్ల ఫోటోలు కూడా చేర్చాలి అనుకుంటా... :)) ఫైన్లు వేయడంలో సింగపూర్‌ను చుసి అన్ని దేశాలూ సిగ్గుపడాల్సిందే...!
"అలాగే పెళ్ళాం మొగుడికి చిలకలు చుట్టి నోట్లో పెట్టడం చాలా రోమాంటిక్ సన్నివేశమని చాలా సినిమాలద్వారా డోకొచ్చేంతగా తెలిపారు".ఇది పచ్చినిజమండీ.
ReplyDeleteపాన్ ముచ్చట్లు భలే నచ్చాయి నాకు! ఇక్కడ హైదరాబాదులో నేను కూడా బూర్గుల రామకృష్ణా రావు భవన్, మరికొన్ని ప్రభుత్వ భవనాల్లో మెట్ల పక్కన, గోడ మూలల్లో దేవుడి టైల్స్ పెట్టడం గమనించాను. భలే నవ్వించారు ఎర్రటి ఈ ఎండవేళ!
మీరు ముంబై లో జరిగేవి వూసినవి వ్రాశారు. నేను రాజమండ్రీ లో ఒక ఆరు నెలలనుండి ఉంటున్నాను.ఇక్కడ జనాలని చూస్తే చాలా బాధ వేస్తుంది.ఇక్కడా అక్కడా అని చూడకుండా ఎవరైనా చూస్తారేమో అని అనుకొకుండా రోడ్డు పక్కనే పని కానిచ్చుకోవడమే. ఎంత అసహ్యంగా ఉంటుందో. ఎదో చెత్త తినేయడం, ఆ కాగితాలనీ, ప్లాస్టిక్ చెత్తనీ రోడ్డు మీదే పడేయడం.గోదావరి గట్టు మీద ప్రభుత్వంవారు మంచి ఉద్యానవనాలూ,స్నాన ఘట్టాలూ,కట్టారు.ఆచోట గోదావరి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఇంక డ్రైన్స్ సంగతి చెప్పఖర్లేదు. మ్యున్సిపాలిటీ వారు ఎన్నెన్నో డస్ట్ బిన్స్ పెట్టినా సరే చెత్త అంతా డ్రైన్స్ లో వేయడం లో ఒక అలౌకికానందం అనుభవిస్తారు. మ్యున్సిపల్ వర్కర్స్ ప్రతీ రోజూ రోడ్లు శ్రద్ధగా తుడుస్తారు,డ్రైన్ లు ప్రతీ మూడు రోజులకీ శుభ్ర పరచి టన్నుల కొద్దీ చెత్త తీస్తారు.నిజంగా వాళ్ళని చూస్తే ,ప్రజలు సిగ్గు పడాలి.విధి నిర్వహణ లో వారికి వారే సాటి.
ReplyDeleteనేను ప్రతీ రోజూ గోదావరి గట్టు మీద ఉన్న దేవాలయాలకి వెళ్తూ ఉంటాను. ఒక రోజు పొద్దుటే తిరిగి వస్తూ, ఒక కొబ్బరికాయ కొనుక్కొని, దాని పీచు తీస్తూ,చేతిలొ పట్టుకున్నాను ( ఇంటికి వెళ్ళి డస్ట్ బిన్ లో వెయ్యచ్చు కదా అని), ఇంతలో ఒకావిడ రోడ్డు తుడుస్తూ కనిపించింది. సరే అని ఆవిడ పోగు పెట్టిన చెత్త తో ,నా చేతిలోది పడేశాను. ఆవిడ ఏమందో తెలుసా " ఏం బాబూ, మీది ఈ ఊరు కాదా".నేనడిగాను " ఏమ్మా మీకు ఎలా తెలిసింది " అని,ఆవిడ అన్నారూ" ఈ వూళ్ళో వాళ్ళు మీ అంత బుద్ధిమంతులు లాగ పోగు పెట్టిన చోటు వెయ్యరూ " అని.
మనదేశంలో ఎక్కడ పడితే అక్కడ, చెత్తా-చెదారం పడేసే వాళ్ళందరూ, వేరే దేశానికి వెళితే మాత్రం పరిశుభ్రత ఎంత చక్కగా మెయింటైన్ చేస్తారో!!! అక్కడెక్కడో చేసే బదులు, మన దగ్గర కూడా చేయచ్చు కదా!!
ReplyDelete@ నాగన్న: అవశ్యం
ReplyDelete@HAREFALA : "రోడ్డు పక్కనే పని కానిచ్చుకోవడమే."
నా freinds ని ఎందుకురా అలా చేస్తారు అనడిగితే "చాలా freegaa వుంటుందిరా" అని చెప్పేవాళ్ళు. మళ్ళీ ఈ గాడిదలు దేశభక్తి అన్న topic మీద గంటలు గంటలు లెక్చర్లు దంచుతారు.