Tuesday, April 14, 2009

ముంబై ముచ్చట్లు – సింగపూరిండియా, జ్ఞానశూన్యత, పిండొడియాలు

ముచ్చట్లంటే ఒకదానికీ మరోదానికీ సంబంధం ఉండాలని రూలులేదుగా.  అలాగే  టైటిల్ లో కూడా. 

సింగపూరిండియా

నాక్రిందటి టపాకి  స్పందిస్తూ నాగన్న గారు సింగపూర్ వాళ్ళ ఫైన్లేసే విధానాన్ని కొనియాడారు.  మేం ఒకమూడు రోజులు అక్కడ తిరిగాం. మేం విన్నది, అక్కడి మా స్నేహితుడు చెప్పినదీ నా ఒత్తిడిని పెంచేయగా, నేను మా పిల్లలమీద ఒత్తిడి పెంచేసా. ఒకసారి మా అబ్బాయి అతి చిన్న చాక్లేట్ కాగితం ముక్క పడేయగానే చాలా టెన్షన్ పడిపోయా. అలా టెన్షన్ పడుతూ కాస్త దూరం నడవగానే స్వర్గంలో అడుగు పెట్టిన అనుభూతి.  హఠాత్తుగా కిందా మీదా కుడీ ఎడమా అంతా చెత్తే చెత్త.  ఒకరికొకరు  రాసుకుంటూ పూసుకుంటూ జనాలే జనాలు.  అటు చూస్తే రోడ్డుమీద అటూనిటూ అడ్డంగా పరిగెడుతూ మనలా కనిపించే మనుషులు.  మొత్తం మీద అంతా అలవాటైన వాతావరణం.   హాయిగా ఉంది. అకస్మాత్తుగా ఇండియాలో ఉన్న అనుభూతి. చిన్న చాక్లేట్ కాయితం పడేసినందుకు ఇంత జబర్దస్తీగా ఇండియాకి డిపోర్టు చేసేసారా అన్నంత సంభ్రమంలో ఉన్న సమయంలోనే దీన్నే మినీఇండియా అని అంటారు అని మా ఫ్రెండు చెప్పాడు. ఓహొ మేమింతే  ఇలాగే ఉంటాం అన్న తత్వం.  సింగపూర్ వాళ్ళే చేతులెత్తేసారు మనవాళ్ళ ధాటికి.

లాలూతో ఒక జపానీ మీ బీహారివ్వండి 10 ఏళ్ళలో జపాన్ చేస్తాం అన్నాడట. దానికి లాలూ మీ జపానివ్వండి 10 నిమిషాలలో బీహార్ గా చేసేస్తా అని ఠపీమని సమాధానం చెప్పాడట.  

జ్ఞానశూన్యత

ఒకసారి మాసహోద్యాగి ఒకావిడతో అన్ని బాధలకన్నా పన్ను బాధ భరింపలేనిదన్నా.  ఆవిడ ఒప్పుకోలేదు.  నాల్గురోజులతర్వాత ఆవిడకి పన్ను నెప్పి వచ్చి బాధపడగానే నాదగ్గరకి వచ్చి మీరన్నది పచ్చినిజం అని చెప్పి పోయింది.  నోట్లో పన్నైనా, నోట్లు లాక్కునే పన్నైనా ఆబాధ  పడ్డవాళ్ళకే ఎరుక. ఇంటర్మీడియట్ ఆప్రాంతంలో వచ్చిన జ్ఞానదంతాలు అడపా దడపా ఇబ్బంది పెడుతూ ఉండేవి.  ఐదు సంవత్సరాల క్రితం ఒకటి పీకించుకోవాల్సి వచ్చింది. మళ్ళీ నిన్న ఒకటి పీకించుకున్నా.   జ్ఞానం రావడం ఎంత బాధాకరమో చూపించిన నాజ్ఞానదంతాలు, జ్ఞానశూన్యత ఎంత హాయో తెలిపాయి. అసలుకి నా జ్ఞానదంతాల్లో ఏసమస్యా లేదని డాక్టరు చెప్పాడు. ఇంతకుముందు పీకబడిన దంతం వంకరగా పెరిగి ముందుపన్నుమీద ఒత్తిడి కలగచేయడంవల్ల ఇబ్బంది కలిగించిందట. నిన్న పీకిన దంతం ముందున్న దంతాన్ని అంటుకుని ఉందట. ముందు పంటిమీద ఏర్పడిన కేవిటీ (క్షయం) వల్ల నెప్పికలిగిందట. కానీ ఆపన్నుని బాగుచేయాలంటే జ్ఞానదంతాన్ని తీసేయాల్సిందే అని పీకిపారేసారు.  మన జ్ఞానం ఎవరికైనా అంటించదలుచుకుంటే మనకే నష్టం అన్న మాట.  ఏమైతేనేం ప్రస్తుతానికి నేను జ్ఞాన(దంత) శూన్యుడినయ్యా. Ignorance is bliss అన్నాడు కదా తెల్లవాడు. Let me be blissful.

పిండొడియాలు

ఈవేళ మా అమ్మ పిండొడియాలు పెట్టింది.  అదేం గొప్ప అంటారా. స్వగృహా లలో కొనుక్కోవడం తప్ప ఈమధ్య ఎవరైనా ఇలాంటవి ఇంట్లో తయారు చేస్తున్నారా.  ఒక గంటపైగా పిండి, సగ్గుబియ్యం కలుపుతూ ఉడకబెట్టి డాబామీదకి తీసుకెళ్ళి వడియాలుగా వేసి ఎండబెట్టాలి. పిండి ఉడకబెడుతూంటే నేనెళ్ళి కాస్త గంజి ఒక గిన్నెలో పోయించుకున్నా. ఆనిమిషం పాటు కలపక పోవడంవల్ల అడుగంటేసి మాడు వాసనే సేసిందని నామీద అభయోగం వేసింది మా అమ్మ.  తర్వాత అమ్మ, నేను, శ్రావ్య (తనకి ఇలాంటి ఫేమిలీ ఏక్టివిటీసంటే ఇంటరెస్టు) డాబామీదకి వెళ్ళి గుడ్డలు పరిచి గంజిని వడియాలుగా మార్చేం. 

మాచిన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వంతులవారీగా వడియాలు, అప్పడాలు, ఊరగాయలూ పెట్టుకునే వారు. మాయింట్లో అప్పడాలు చేసుకుంటే పక్కవాళ్ళు వచ్చి వత్తేవారు.  అలాగే వాళ్ళెవరింట్లోనైనా అప్పడాల ప్రోగ్రాం ఉంటే అప్పడాలకర్రా, పీటా తీసుకుని మా అమ్మ తయారు. ఎవరింట్లో పదార్ధాలు బాగున్నాయోనన్న అంశంమీద తెలియని పోటీ, గుసగుసలు, చెవులుకొరుక్కోవడాలు మామూలే.

ఒక్కసారిగా మా చిన్నప్పటి జ్ఞాపకాలు నన్నూ, మాఅమ్మనీ చుట్టుముట్టాయి.  వాటితో పాటు కాకులు కూడా.  ముందోకాకి వచ్చింది.  దానికీ ఇదో వింటేజెఫైరని అనిపించిందనుకుంటా కావుకావని ఫ్రెండ్సుని పిలిచేసింది. నిమిషాల్లో చుట్టూ కావులే కావులు. వాటి ఆనందం చూసి మాకానందం వేసింది.  సాయంత్రం వెళ్ళి చూడాలి ఏమైనా మాకోసం వడియాలు మిగిల్చోయో లేక అన్నీ తినేసాయో.

8 comments:

  1. watch....
    http://24gantalu.blogspot.com/
    for latest news about political, cinema in telugu

    ReplyDelete
  2. నోట్లో పన్నైనా, నోట్లు లాక్కునే పన్నైనా ఆబాధ పడ్డవాళ్ళకే ఎరుక.:))

    ఈ వడియాలు ఊరగాయలు వంటివి సంఘటితంగా గుంపుగా చేస్తే భలే సరదాగా ఉంటాయి.మీరెంత మంచివారో అమ్మకి ఇలాంటి పనుల్లో (ఈ రోజుల్లో కూడా) సహాయం చేస్తున్నారు.

    ReplyDelete
  3. నిజమే.. పన్నునొప్పి వస్తే కానీ తెలియదని.. మా బామ్మ గారికి పన్ను నొప్పి వచ్చినప్పుడు బాధపడుతుంటే, అబ్బా ఎందుకు ఇంత బాధ పడుతుంది అనుకునేదాన్ని.. కానీ, తౌర్వాత జ్ఞానదంతం వచ్చినప్పుడు వస్తే కానీ, తెలియలేదు! అందుకే కదా -- తన దాకా వస్తే కానీ తెలియదు :)

    అప్పుడే ఒడియాలు పెట్టేశారా మీరు!!! ఈ వేసవిలో పెట్టాలని, మా బామ్మ - అమ్మ అప్పుడే ప్లాన్స్ వేసుకుంటున్నారు :))

    ReplyDelete
  4. వేసవి-ఆవకాయ-వడియాలు--ఊళ్లల్లో ఇప్పుడంతా అదే సందడి. మా ఊళ్లో అయితే ఎవరైనా కొత్తవాళ్లు వస్తే అక్కడేదో అప్పడాలు వడియాల కుటీర పరిశ్రమ నడుస్తుందేమో అనుకుంటారు, ఆ లెవెల్లో అందరూ కలిసి పెట్టుకుంటుంటారు!
    ఇంతకీ మీకు వడియాలు మిగిలాయా:)

    ReplyDelete
  5. సింగపూరును తలుచుకుంటేనే సంతోషం వేస్తుంది. Singapore is a fine city అనే క్యాప్షనుతో - ఏమేమి చేస్తే ఎంతెంత ఫైనో తెలిపే టీషర్టులు వేసుకొని తిరుగుతుంటారు. :))

    ReplyDelete
  6. nice one!!నేను చాలా enjoy చేశాను

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.