Monday, December 25, 2006

దొంగా? దొరా?

దొరికితే దొంగ, దొరకకపోతే దొర అని సాధారణంగా అంటో ఉంటారు. ఈమధ్య కాలంలో మన పెద్దలు చెప్పిన ఇలాంటి నానుడులన్నీ తారుమారైపోతున్నాయి. ఇప్పుడు దొరికినా దొరల్లాగే ఎలాగో ఒకలాగా చలామణీ అయిపోతున్నారు. కొంతమంది దొంగలు, ఎవరైనా వాళ్ళని పట్టించితే, జనాల జాలి ఏదోరకంగా పొంది, ప్రచార మాధ్యమాలని తెలివిగా వాడుకొని, పట్టించిన వాళ్ళే చెడ్డవాళ్ళన్న అభిప్రాయం ప్రజలలో కలిగించి పబ్బం గడుపుకొంటున్నారు. పైగా తెగ అమాయకత్వం నటించి, 'అయ్యో. దీన్ని దొంగతనం అంటారా? నాకు తెలియదే! తెలిస్తే ఇలా చేస్తానా. నేనింత మంది లాయర్లనీ, నిపుణులనీ నా లావాదేవీలలో ఉపయోగించుకొంటున్నా. ఒక్కళ్ళూ చెప్పలేదే!' అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు ప్రజల నాడి. కులమో, మతమో, అవతల వాళ్ళ పట్ల్ల విముఖతో, ఏదో ఒక బలహీనత ప్రజల్ని సరియైన పంథాలో ఆలోచించకుండా చేస్తుందని.
ఉదాహరణ ఇవ్వగలరా? జవాబు ............................... (పూరించండి)

ఇంకో రకం దొంగలున్నారు. వాళ్ళు వాళ్ళ దొంగతనాలని కప్పి పుచ్చేందుకు, వేరే వాళ్ళ దొంగతనాల్ని బయట పెట్టడానికి ఏదో మంత్రాంగం చేస్తోఉంటారు. కొండొకచో, వాళ్ళు చేసిన ఏదో చిల్లర దొంగతనాన్ని ఒప్పేసుకొని, వేరే దొంగలు కూడా బయట పడాలనీ గొడవ చేస్తో ఉంటారు. దీనికి కూడా ఉదాహరణలు కోకొల్లలు. జవాబు................

మూడోరకం దొంగలు. వీళ్ళు ప్రస్తుతం చిల్లర దొంగలు. భవిష్యత్తులో గజదొంగతనం చేయడానికి తయారయ్యేవాళ్ళు. పాపం, ఇప్పటిదాకా సరైన అవకాశాలు రాక, పతివ్రతల్లాగా మిగిలిపోయారు. వీళ్ళు జనాలని మిగిలిన వాళ్ళని (తస్మదీయుల్ని) బూచుల్లాగా చూపించి, తమ ప్రాబల్యం పెంచుకోవడానికి ఎలాంటి అబద్ధమైనా అడేయగలరు. ఇలాంటి ఒక దళిత నాయకుడు, ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు. ఇంతలో బయట ఎక్కడో దీపావళి టపాకాయలు పేలాయి. వెంటనే, ఆ నాయకుడు, 'చూసారా! ఈ కాంగ్రేసు వాళ్ళు. దళితుల నోరు నొక్కడనికి బాంబులు పెట్టారు' అని అన్నాడు. పాపం, సభకి వచ్చినవాళ్ళు ప్రాణభీతితో కకావికలం అవడంవల్ల, కొంతమంది తొక్కిసలాటలో చనిపోయారు. ఎవరి ప్ర్రాణమైనాసరే చాలా విలువైనది. ఇలాంటి వాళ్ళ చర్యలని ఎవరూ ఖండించలేదు, ఖండించరు. ఒక మనిషిగా పుట్టినందుకు, ఇలాంటి వాళ్ళని, మన స్వంత వాళ్లయినా సరే, ఖండించండి. మీచుట్టూ ఉన్న ప్రజలు ఇలాంటి వాళ్ళని విని మోసపోకుండా చైతన్య వంతుల్ని చేయండి. లేకపోతే ఎవరి కోసమైతే తాము పాటుపడుతున్నామని చెబుతున్నారో, ఆ జాతికే ముప్పు తేగల ధీమంతులు ఇలాటి నాయకులు. కొంతమంది తెరాస నాయకులు, దళిత వాదులు, స్త్రీవాదులు కూడా బాధిత ప్రజల్ని చైతన్య వంతులుగా చేసి వారి హక్కులని సాధించుకొనే దిశలో కాక, వారికి బాధ్యతరాహిత్యాన్ని, ఉద్రేకాన్ని నేర్పి, తమ నాయకత్వం కోసమే పాటుపడుతున్నారు. సరైన ఆలోచన, స్వయంప్రతిపత్తి, సాధికరత దిశగా వీళ్ళని నడపటంలేదు. జవాబు...................


ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది, ఈ బ్లాగు, మన రాష్త్ర రాజకీయుల్ని, రామోజీ రావుని ఉద్దేశించి వ్రాసినది అని. ఇప్పుడు ఖాళీలని సులభంగా పూర్తిచేయచ్చు. ఎందుకంటే ఉదాహరణలు కోకొల్లలు.

ము.మం., రా.రా. ల వివాదం గురించి పత్రికల వాళ్ళు, రాజకీయులూ తెగ వ్రాస్తున్నారు. మన బ్లాగర్లు కూడా కొంతమంది బ్లాగులు వ్రాసారు. మరికొంత అనేకమంది చదివారు. అందులో కొంతమంది చర్చించారు. మొత్తం మీద ఈమధ్యకాలంలో రసవత్తరమైన నాటకీయ పరిణామం ఈ వివాదం. ఇందులో ప్రజలు (పట్టించుకొన్నవాళ్ళు) రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం ఈనాడును, రామోజీ రావును సమర్ధిస్తే, ఇంకొక వర్గం ముఖ్యమంత్రి వర్గాన్ని సమర్ధించింది. పాపం, కాంగ్రేసు వాళ్ళు మిగిలిన పార్టిలవారికీ, కొన్ని పత్రికల వారికీ శత్రువర్గంలో ఉన్నారు. కాబట్టి, వాళ్ల చర్యల్లోని మంచివి కూడా మసగేసిపోయాయి. అసలుకి, మన రాజకీయుల్లో కాంగ్రేసు రక్తం లేనివాళ్ళు ఎవరైనాఉన్నారా? 'జనని కాంగిరేసు సకల పార్టీలకును' అన్న ఆర్యోక్తి మనం మరచిపోకూడదు. డి.ఎన్.ఏ. పరీక్షలు చేసుకోండి, కావాలంటే. కాబట్టి, ఏపార్టీ వాళ్ళు చెప్పినా వినండి, ఆలోచించండి వాళ్ళ మాటలు, చేష్టల వెనుక రహస్య ఉద్దేశ్యం ఏమిటో. వేరేవాళ్ళకి తెలపండి. అది చాలా పుణ్య కార్యం.

రా.రా.- ము.మం. వివాదం లో మూడు పక్షాలున్నాయి. అందరూ రెండు పక్షాల్లో సర్దుకొన్నారు. మూడవ పక్షం ఖాళీగ ఉంది. అదే సత్య(నిజం) పక్షం. ఎవరిది తప్పుఅని అలోచించేకన్నా, ఏమిటి తప్పు అని అలోచించడం మంచిది కదా. మార్గదర్శి విషయం తీసుకోండి. అవతలి పక్షం కాంగ్రేసుకదా అని రారా ని సమర్ధించకండి. ఒక నిమిషం అలోచించండి. చార్మినార్ బ్యాంక్, కృషి బ్యాంకులు మార్గదర్శి చేసిన లాంటి లావాదేవీలవల్లే ఎంతమంది జీవితాలని తారుమారు చేసాయో. పైగా, ఇన్ని వ్యాపార లావాదేవీలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఈనాడు గ్రూపుకి ఇంత చిన్న లా పాయింటు తెలియకపోవడం నేరం కాదూ? ఎన్ని చిట్‍ఫండు కంపేనీలు దివాలా తీసి ప్రజల్ని ఇక్కట్ల పాలు చేయలేదు? మన దేశంలో బ్యాంకింగు కాని ఇతర ఆర్ధికరంగ చట్టాలు కాని పొదుపు దారుల ను కాపాడడమే ముఖ్యోద్దేశముగా రూపొందించబడ్డాయి. ఇది ఇంటర్మీడియేట్ చదివినవాళ్ళక్కూడా తెలుసు. ఘనత వహించిన ఈనాడు గ్రూపుకు తెలియదా? సంస్థలు తమ లావాదేవీలు అబాధ్యతగా నిర్వహించకుండా చట్టం కొన్ని నిబంధనలు విధించింది. చమత్కరం చూడండి. రిజర్వ్ బ్యాంకు రంగం లోకి వచ్చి, మార్గదర్శి చేసినది తప్పు అని చెబితే, కొంత మంది విజ్ఞులు ఇప్పటిదాకా ఏంచేస్తోందీ రిజర్వు‍బ్యాంకంటూ నిప్పులు చెరగుతున్నారు. అయ్యా, విజ్ఞులారా. 'దొంగతనం చేసినవాడిది తప్పుకాదు, వాడిని పట్టుకోని వాడిదే' అని ముచ్చటగా వాదిస్తున్నారు. మన చదువులు, తెలివితేటలు మన ఆత్మవంచనకా? 'లావాదేవీలు చట్టపరంగా చేయవయ్యా, లేక పోతే ప్రజలు కష్టపడతారు. నీవంటి దిగ్గజం రూల్సు తెలియవే అంటే ఎలా? మన రాష్ట్రం లోని వ్యాపారవేత్తలకి ఆదర్శంగా నిలవాలి కాని' అని దూరదృష్టితో చిన్న సలహా చెబితే సొగసుగా ఉండదూ? మన విజ్ఞానానికి వన్నె రాదూ?

నా దృష్టిలో రారా తప్పు రూల్సు పాటించడం, పాటించకపోవడం కాదు. ఈనాటి ఈ సమస్య, ఇప్పటిది కాదు. చాలా దశాబ్దాలనుండి ఈనాడు, ప్రభుత్వ పార్టీ (ఆరొజుల్లో కాంగ్రేసే) మధ్య సమస్యలు తెలిసినవే. పత్రిక లో ప్రభుత్వ వ్యతిరేకత చూపడం వల్ల ప్రభుత్వ ప్రకటనలు ఈనాడు కి ఇవ్వకపోవడం మామూలయ్యింది. తర్వాత రామారావు కాలంలో ఈనాడు ప్రభుత్వ బాకా పత్రిక అయిపోయింది. విలువలకోసం ప్రభుత్వవ్యతిరేకత చూపుతోంది అనుకొన్న చాలామందిమి ఏవిలువలకోసం అన్న మీమాంసలో పడిపోయాం. అతి బాకా వల్ల ఒక దశలో ఈనాడు సర్కులేషను చాలా పడిపోయింది. దాంతో, కొంత ధోరణి మార్చుకొని ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా కొద్దిగా చేసేది, వ్యాపార దృష్టితో మాత్రమే సుమా!

ఒక వార్తా పత్రిక అనేది, మిగిలిన వ్యాపారాల్లాంటిదేనా? మనకి నచ్చిన వాళ్ళని మంచిగానూ, కిట్టని వాళ్లని చెత్తగానూ చూపించి 'కింగ్‍మేకర్' గా వ్యవహరించడం సబబా? వార్తా పత్రిక ప్రజలకి అభిప్రాయాలను ఏర్పారచుకోవడానికి సహాయపడే వార్తలందించాలా, లేక పత్రికాధిపతి ఇష్టాఇష్టాలే ప్రజలమీదికి తిమ్మిని బమ్మి చేసైనా సరే రుద్దాలా?

నా దృష్ట్లిలో పత్రికలు, అధికార యంత్రాంగం ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తేనే వాళ్ళ ఉనికికి సార్ధకత, వాళ్ళమీద ప్రజలు పెట్టుకొన్న నమ్మకానికి నీరాజనం. అది వాళ్ళ కనీస బాధ్యత. అది విస్మరిస్తే, వారికి శత్రువులు చాలామంది తయారవుతారు. ప్రజల శాపాలు తగులుతాయి.

ఈనాడు చేస్తున్న మంచిపని నిష్పక్షపాతంగా కొనసాగించాలి. ఎన్నో స్కాములు, అన్యాయాలు వెలికితీసి ప్రజల్ని కాపాడుతోంది. ఈనాడు తెలుగు ప్రజలకి చేసిన అత్యత్తమ సేవ చెప్పమంటే, పత్రిక మొదలుపెట్టిన తొలి రోజుల్లోనే, చాలా ధైర్యంతో సెక్సుసైన్సు మీద సమరం గారిచే ప్రత్యేకంగా వ్యాసాలు వ్రాయించి ప్రజలని విద్యావంతుల్ని చేయడం అని చెబుతాను. కాని ఈనాడు తన గ్రూపు ప్రయోజనాలు మాత్రమే కాకుండా తనని నమ్ముకొన్న తెలుగు ప్రజల ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకొని నడిపితే, జనాల చేతుల్లోనే కాకుండా హృదయాలలో కూడా ఉంటుంది. లేక పోతే నిజం చెప్పినా కూడా, పక్షపాత పత్రికలే అలాగే వ్రాస్తారు అని అనుమానిస్తారు. 'ది హిందూ' ఎప్పుడైనా పక్షపాతం గా వ్రాయడం చూసారా? దానిలో వార్తలు, వార్తలు గానూ, అభిప్రాయాలు, అభిప్రాయాలు గానూ వ్రాస్తారు. పత్రికాధిపతులు పాఠకుల నెత్తిమీద కూర్చొని బ్రైన్వాష్ చేయరు. అందుకే ఆ పత్రిక పేరు చెబితే ఒక రకమైన గౌరవం కలుగుతుంది.

ఇక రెండో పక్షం. ఎన్నికలయ్యాకా ముఖ్యమంత్రి పదవికోసం కాంగీయులు పోటీ పడినప్పుడు, ప్రజలందరూ కూడా న్యాయంగా రా.రె. అవ్వాలని భావించారు. అంత ఆశలు కల్పించారూ, డిగ్నిటీ ప్రదర్శించారూ ఆయన. గిల్లికజ్జాలు, కీచులాటలూ కాకుండా, మన రాష్ట్రం ముందుకుపోవడానికి వేరే ఏదైనా చేయాలని ఎప్పటికైనా ఆయనకి తోచాలని ప్రార్ధిస్తున్నాను. ప్రజలు చూస్తున్నారు, మనం అనుకొన్నంత తెలివితక్కువ వాళ్ళు కారని రాజకీయులందరూ తొందరగా తెలుసుకొనే రోజు తొందరగా వస్తుందని ఆశ. పార్టీలకి కాక వ్యక్తులకి ఓటు వేస్తే బహుశ: మనకి విముక్తేమో?

సర్వేజనా: సుఖినోభవన్తు

4 comments:

  1. మీరు చెబుతున్నది ఏ కాలం నాటి హిందూ గురించి ? ఇప్పటి హిందూ కాంగ్రెస్‌పార్టీకి పచ్చి బాకా పత్రిక. అదొక్కటే కాదు పచ్చి హిందూమత వ్యతిరేక నాస్తిక లెఫ్టిస్టు తీవ్రవాద భావజాలాల ప్రచారాన్ని నెత్తికెత్తుకున్న పత్రిక. నాకు హిందూ పేరు చెబితే అసహ్యమే తప్ప గౌరవం కలగడం మానేసి చాలా సంవత్సరాలవుతోంది.

    ReplyDelete
  2. "పార్టీలకి కాక వ్యక్తులకి ఓటు వేస్తే బహుశ: మనకి విముక్తేమో?" ఔనేమో, ఆ వ్యక్తులు మనకున్న ఏవో రెండుమూడు పార్టీలలోకి కలిసిపోకపోతే.

    ReplyDelete
  3. miiru ceppina remdu rakaala domgala udaaharanaloa naaku C.M gare kanipistunnaru.anni cesesi avuna,...naaku teleedu ani ceppadam aayanaki eppatinumdo alavaate kada.ippudu aayana tealukuttina domga kuudaa...

    ReplyDelete
  4. సాయి గారూ,
    ఎక్కువ మంది ఎత్తిచూపుతున్న రా.రె తప్పే కాకుండా రా.రా తప్పు కూడా స్పష్టంగా ఎత్తి చూపారు. ఖచ్చితంగా ము.మం X రా.రా ల వ్యవహారంలో ఇరుపక్షాల తప్పూ వుంది. ఆయన తెలియక భూములు ఆక్రమించాము ఇప్పుడు తప్పు తెలుసుకొని ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాను అంటే ఈయన తెలియక డిపాసిట్లు తీసుకున్నాము ఇప్పుడు ఆపేశాము అని ఈయన అంటున్నాడు.
    ఈనాడు తను నమ్మిన పక్షము వహిస్తుంది అన్నది నిజమే అయినా (ముందు అన్నగారూ ఆ తర్వాత తమ్ముడు గారు) కనీసం అది ధర్మంగా నడుచుకుంటున్నట్లు చూపించడానికైనా తాపత్రయపడుతుంది. కానీ కాంగిరేసు (ఆమాట కొస్తే అన్ని రాజకీయ పక్షాలు) కనీసం అలాంటి నమ్మకాన్నైనా కలిగించడానికి ప్రయత్నించక, నీవూ తప్పు చేశావు గనుక నన్ను అనొద్దు అంటుంది. అదీగాక వీడెవ్వడు నన్ను ప్రశ్నించడానికి ...అంటూ కక్ష సాధింపు దోరణి కనపరుస్తోంది. దీనివల్ల రా.రా ది తప్పే అయినా ప్రజల సానుభూతి రా.రా వైపే మొగ్గుతోంది.
    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.