Wednesday, March 07, 2007

కొరియా కబుర్లు: తిండీ తిప్పలు -1 (ఇది చదివిన వాళ్లకి రాగిముద్ద పూర్తిగా ఉచితం*)

ఈ మధ్య నేను తపాలేసి చాలా రోజులయ్యిందని గమనించాను. అర్ధ సంవత్సర సెలవలకి దేశంవెళ్ళడం, తిరిగి రావడంలో కొద్దిగా అంతరాయం కలిగినట్లుంది. అంతే కానీ టాపిక్లు అయిపోయి కాదని తెలిసింది. ఎందుకంటే ఈ మధ్య కొన్ని బ్లాగులు చదువుతోంటే నాకు తోచిన విషయాలు వ్రాయాలని చేతులు దురదపెట్టాయి. ఇవి కాక నేను దేశంలో గడిపిన రోజుల విశేషాలు చాలా ఉన్నాయి. కానీ ఈ మధ్య ఏమీ వ్రాయలేకపోయా. వెరసి poverty in plenty. ఈ వాక్యాన్ని తెలుగులో వ్రాద్దామనుకొంటే ఎలా వ్రాయొచ్చో? ఇక విషయానికొస్తే......

తిండీ తిప్పలు అని ద్వంద్వంగా వాడడంలో ఉద్దేశ్యం తిండికోసం తిప్పలు తప్పవనేమో. మమూలుగా తిండి కోసం తిప్పలు పడడం మాటేమో కానీ, భారతీయులు మాత్రం బయట దేశాల్లో ఆయా దేశాల వాళ్ళ తిండి తినలేక తిప్పలు పడడం సామాన్యమైన విషయం. ఇన్నాళ్ళూ మనం గల్ఫ్, యూరోప్, అమెరికాలే ఎక్కువ వెళ్ళడంతో ఆయా ప్రాంతాల్లో మనకు కావలసిన ఆహారపదార్ధాలు బాగానే దొరుకుతున్నాయి. కానీ, కొరియా, జపాను లాంటి దేశాలకు ఇద్దరూ లేక ముగ్గురు పద్ధతిలో జనాలు వెళ్ళడం వల్ల ఈ దేశాల్లో మన తిండి అవసరాలు తీర్చుకోవడం కొద్దిగా కష్టమే. మన దేశంలో మాంసాహారం తినేవాళ్ళు కూడా ఇక్కడి పదార్ధాలు తినలేరు. శాకాహారుల సమస్య ఇంక చెప్పేదేముంది. అసలు వీళ్ళకి శాకాహారం అంటే ఒక పట్టాన అర్ధంకాదు. వీళ్ళ బుద్ధ దేవాలయాల్లోని సన్యాసులు తీసుకొనే ఆహారం శాకాహారమే అయినా మన పద్ధతిలో ఉండదు కదా. మా సారు ఒకరు నేను వచ్చిన కొత్తల్లో నన్ను ఒక సారి రెస్టారెంటుకి లంచికి పిలిచాడు. రాననడం మర్యాద కాదు. అందులోనూ ఆయన కొరియాలో నా బాగోగులు కనిపెట్టుకొని ఉండే పెద్ద మనసున్న మనిషి. ఆయన పేరు కిమ్ యంగ్ చల్. కిమ్ ఇక్కడి సర్వసాధారణ మైన ఇంటిపేరు. సుమారు 50% కి ఉంటుంది. ఈయన మనదేశంలో సుమారు 6 యేళ్ళున్నాడు. ఈయన చాలా విలక్షణమైన మహామనీషి. ఈయన గురించి తర్వాత వేరే తపాలో. ఆయన రెస్టరెంటుకు వెళ్ళగానే కొరియన్ భాష(హంగుమల్ అంటారు)లో ఆర్డరిచ్చేసాడు. తీరా నాప్లేటు చూస్తే రొయ్యల ఫ్రైడ్ రైస్. సార్. నేను ఇది తినలేనంటే, రొయ్యలు వెజిటరియనే కదా అంటాడు. హోటలమ్మకేదో చెప్పాడు. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలియదు, మళ్లీ ఒక ప్లేటులో ఫ్రైడ్ రైస్ పట్తుకొచ్చింది. బహుశ: రొయ్యలేరేసి పట్టుకొచ్చిందేమో. ఫ్రెష్ గా నాకోసం చేసుకొచ్చిందని నమ్మి తిన్నా. తింటున్నానే కానీ దాంట్లో ఏరుచీ లేదు. సారుతో చెప్పి మిరియాల పొడి తెప్పించుకొని మధ్య మధ్యలో కాస్త నాలిక కారం చేసుకొన్నా. తర్వాతెవరో చెప్పారు ఇది కొరియన్ల కనుగుణంగా చేసినదని. ఆతర్వాతి కాలంలో చైనీస్ రెస్టరెంటులోనే వాళ్ళ పద్ధతిలోనే చేసిన ఫ్రైడ్ రైస్ తిన్నా. ఇంతకు ముందుకన్నా నయం. కానీ నోరు చి (త్రివిక్రముడి బావా .. ఛీ లాగా). ఇదే చైనీస్ ఫ్రైడ్ రైస్ ఇండియాలో ఎంత రుచిగా చేస్తారో కదా! అసలు వాడికన్నా కాపీ చేసినవాడే బాగా చేయగలడన్నమాట.
కొరియా వాళ్ళు భోజనప్రియులు. ఎల్ల కాల సర్వావస్థలలోనూ తింటూనే కన్పిస్తారు. కానీ వాళ్ళ శరీరంలోఎక్కడా ఒక గ్రాము కొవ్వు గానీ, కండకానీ ఉండకూడని చోట కన్పించదు. అన్ని వయస్సుల వాళ్ళూ నడక, వ్యాయామం చేస్తూ కనిపిస్తారు, ఆందుకేనేమో బలే సన్నగా, ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఇప్పుడు హైస్కూల్ కెళ్ళే వయసు వాళ్ళల్లో మాత్రం చాలామందికి ' అన్నీ ఎక్కువే'. మరి పిజ్జాలూ, గిజ్జాలూ ఎక్కువ లాగిస్తోంటే లావవ్వరా? కొంత అదృష్టంకూడా అనుకొంటా. ఇక్కడ ఒక అగ్రగామి మోడల్ ఒక అమ్మాయి ఉంది. బకాసురుడి చెల్లెల్లా లాగిస్తుందట. పత్రికల వాళ్ళు ఆవిడ తిండి పుష్టిగురించి వ్రాస్తోనే ఉంటారట. కానీ తిన్న తిండి ఎక్కడికిపోతుందో తెలియదు, ఒంట్లో ఎక్కడా కాస్త కూడా కొవ్వు ఉండకూడని చోట ఉండదుట. ఈ జీన్సుని మన హీరోయిన్లకి అమ్మితే బలే వ్యాపారమవుతుంది. పాపం నయనతార, త్రిషల్లాంటి వాళ్ళు తెగ ఖర్చుపెట్టి విదేశాలకి పోయి లిపోసక్షన్ చేయించుకొని తెగ కష్టపడుతున్నారు.

వీళ్ళ దూరదర్శన్ సీరియళ్ళలో కూడా తిండి దృశ్యాలకి తెగ ప్రాధాన్యతనిస్తారు. ఎపిసోడుకి కనీసం ఒక తిండిసీను. ఇక్కడి బజార్లలో అయితే రెస్తారెంట్ల జోరు చెప్పనఖ్ఖర్లేదు. సాయంత్రం సమయంలో వెళ్తే రకరకాల లైటింగులూ, మ్యూజిక్కులూ, లోపలికి ఆహ్వానిస్తూ అరిచే అరుపులూ- ఆ హడావిడే వేరు. వీళ్ళు మధ్యాహ్నం 12, సాయంత్రం 6 గంటలకి తినేయకపొతే తల్లడిల్లిపోతారు. ఇంట్లో చేసుకోవడం కన్నా హోటల్నించి తెప్పించుకోవడమే ఎక్కువ చేస్తారు. మనం ఎదైనా ఆర్డరిస్తే ఒక 10-15 నిమిషాలలో వేడివేడిగా మనకి తిండి వచ్చేస్తుంది. విపరీతమైన పోటీ వల్ల మంచి సేవ, సరసమైన ధరలకి దొరుకుతుంది. తిండిని ఉష్ణవాహకంకాని పెద్ద బాక్సుల్లో మన బజాజ్ పాల బండ్లు (ఈ మోడల్ పూనాలో ఎక్కువ వాడేవారు కాబట్టి పూనా బళ్ళు అనేవారు) లాంటి స్కూటర్ల మీద రై.. రై.. మని తీసుకువచ్చి సప్లై చేస్తారు. బహుశ: వేడి తగ్గకుండా వేగంగా చేర్చడనికనుకొంటా, వీటిని చాలా వేగంగా నడుపుతోంటారు. చాలా సార్లు ఇవి నడుస్తోన్న మాపక్కనించే దూసుకుపోయి మా గుండెలదరగొట్టేయడంతో వీళ్ళని యమదూతలని వ్యవహరిస్తోంటాం. $4-5 లో లంచి, $10 లోపు 'సోజూ' సహిత డిన్నర్ దొరుకుతుంది. సోజూ (సుర నుండి వచ్చిందంటారా?) వీళ్ళ దేశీ మద్యం. చిన్నాపెద్దా, ఆడామగా, బీదాబిక్కీ తేడాల్లేకుండా తాగే పానీయం. ఒక బాటిల్ ఒక డాలరుంటుంది. మన ఊళ్ళల్లో మనకి కనిపించే దృశ్యాలు- తాగేసి తూలేవాళ్ళు, పడిపోయిన వాళ్ళు, వాళ్ళని లేపి తీసుకొని పోయే వాళ్ళూ, ఇత్యాదులు - ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తోంటాయి. అప్పుడప్పుడు అమ్మాయిల్ని వీపుమీద వేసుకొని మోసుకొని పోయే అబ్బాయిలు కన్పిస్తోనే ఉంటారు. మళ్ళీ తెల్లారేసరికి పన్లోకి ఠంచనుగా వచ్చేస్తారు. తాగితే తప్పేముంది, తాగని నాకొడుకెవ్వడు ఈలోకంలో.. అన్న మన తెలుగు పాటల పదాలు నాకైతే నోట్లో ఆడుతోంటాయి వీళ్ళని చూస్తోంటే.

వీళ్ళ తిండికి ఒక విలక్షణమైన వాసన ఉంటుంది. సముద్రంలో దొరికే పదార్ధాలు తినడం, నువ్వులనూనె వాడడంవల్ల అనుకొంటాను. నేనిక్కడకి వచ్చిన మొదటి వారంలో అయితే బజార్లలో వెళ్తోంటే వికారం వచ్చేది. ఆ తర్వాత ఆ వాసనే తెలియట్లేదు, అలవాటయిపోయి. ఇంకొన్నాళ్ళు పోతే ఆ వాసనలేకపోతే వికారం వస్తుందేమో. ఈ అలవాట్ల మీద ఒక చిన్న పిట్టకథ. ఎప్పుడో ఒక తెలుగు పత్రికలో చదివా. ఒక సినిమా హీరో ని ఒకామ్మాయి పెళ్ళిచేసుకొంటుంది. మొదటి రాత్రి ఆ హీరో ఉలకడూ, పలకడు. తెరమీద అంత శృంగారమొలకపోసే హీరో ఇలా జీరో అయిపొయ్యాడేంటా అని ఆహీరోయిన్ తల్లడిల్లిపోయింది. అసలు ఆహీరోగారి తెరమీది రసికత చూసేకదా నేను ముచ్చటపడి పెళ్ళిచేసుకొన్నది అని తెగ బెంగపడి ఒక డాక్టరుగారిని కలిసింది. ఆరోజు రాత్రి డాక్టర్ చెప్పినట్లే పడగ్గదిలో ఒక టేపురికార్డరు పెట్టి హీరోగారు ప్రవేశించగానే ఆన్ చేసింది. అంతే మన హీరోగారు తన శృంగారనైపుణ్యాన్నంతా రుచిచూపించేసారు. ఇంతకీ రహస్యం తెలిసిందా? ఏంలేదు. టేపురికార్డరు ఆన్ చేయగానే లైట్సాన్, కేమెరా, ఏక్షన్ అన్న మాటలు వచ్చాయి. అవి వినిపించగానే అలవాటుగా మన హీరోగారు తన కర్తవ్యం నిర్వహించేసారు.
మెల్లమెల్లగా నేను కొద్దిగా కాలూ ఏయీ కూడదీసుకొని, ఒక రైస్ కుక్కరు, తర్వాత ఒక మైక్రోవేవు కొనుక్కుని నా వంట నేను చేసుకొని తింటున్నా. నా తిప్పలు నేను పడుతున్నా. అన్నట్లు నాకు వంట చేయడం చాలా ఇష్టం, ఒక అభిరుచి. ఎటొచ్చీ షడ్రుచుల జ్యోతిగారిలాంటి పద్ధతిగా వండే విధానం చెప్పేవారు, అలా వండేవారు నేను వంట చేయడం చూస్తే ముక్కుమీద, తర్వాత తినగలమోలేదో అన్న భయంతో నోటిమీదా వేలేసుకొంటారు. కానీ ఎవరూ భయపడక్కర్లే. ఇక్కడ ఒక తెలుగు కుర్రాడు బయోటెక్నాలజీలో పరిశోధన చేస్తూ, నావంట గత రెండు సంవత్సరాలుగా తరచూ తింటూ కూడా ఈమధ్యనే పి.హెచ్.డి. పట్టా తెచ్చుకొన్నాడు. నేను వంట చేసే విధానం ఆర్ధికశాస్త్ర సుత్రాలని అనుసరించి ఉంటుంది. ఆర్ధిక శాస్త్రంలో ఒక సూత్రం ఉంది. మనం పెట్టే ఖర్చులో వృద్ధి (increment) కన్నా, మనకి వచ్చే ఆదాయంలో వృద్ధి ఎక్కువ లేదా కనీసం సమానంగా ఉంటేనే మనం ఖర్చుపెట్టాలి. ఇక్కడ వంటలో మనం వంటలో గడిపే సమయం విలువలో వృద్ధి, రుచిలో వచ్చే వృద్ధితో సరిచూసి, కొద్దిగా రుచి తగ్గినా బాగా తక్కువ సమయంలో వంట అయిపోతే ఆ పద్ధతిని అనుసరించమని నా సూత్రం. నేను పాటించే పద్ధతిని పైన చెప్పిన తెలుగు కుర్రాడు, 'single step protocol' వర్ణిస్తాడు. సైంటిస్టుకదా, వాళ్ళ భాషలో చెప్పాడు. ఏక మెట్టు పద్ధతి అని తెలుగులో అనొచ్చా?
(సశేషం)


*నిబంధనలు వర్తిస్తాయి

11 comments:

  1. ఇది చదువుతుంటే కొరియాలో నడుచుకుంటూ వెళ్తున్నటనిపించింది. ఇక్కడా మైన్ ల్యాండ్ చైనా అని ఒక రెస్టారంటు వుంది కదా...వాడు కూడా కొన్ని పదార్ధాలు మీరు చెప్పిన వికారమైన హెర్బల్, సీ ఫుడ్ వాసనతోనే చేస్తాడు. మీరన్నట్లు అసలు కంటే కాపీనే బాగుంటుంది :-)

    ReplyDelete
  2. మీరు చెపుతుంటే అంతా చూస్తున్నట్టే వుంది.మీ బ్లాగు అంటే నాకు కొరియా కబుర్లు మాత్రమే గుర్తొస్తాయి.మళ్ళా ఇన్నాళ్ళకి మీ బ్లాగులో అవి చూసేసరికి చాలా అనందం అనిపించింది.అయితే ఇంకొన్నాళ్ళలో ఇండియా కబుర్లు కూడా చెబుతారన్న మాట.

    ReplyDelete
  3. చాలా రోజుల తర్వాత తమ దర్శనం - అందులోను భోజనంతో. చాలా సంతోషం.

    మీ బ్లాగు మంటనక్క ౧.౫ లో సరిగా తెరుచుకోవటం లేదండీ. ఇంటర్నెట్ ఎక్స్-ప్లోరర్ లోనే సరిగా తెరుచుకొంటోది. ఏదైనా ఫాంట్ సమస్య ఉందేమో.

    --నాగరాజు పప్పు

    ReplyDelete
  4. కొరియన్ల ఆహారపు అలవాట్లు చక్కగా వివరించారు.

    ReplyDelete
  5. అన్నట్టు అడగడం మరిచా..నేను పూర్తిగా చదివా...నాకు రాగిముద్ద ఏది?

    ReplyDelete
  6. తిండిగోల లో ఆర్దికసుత్రాలా? బాగుంది, కానిండి, ఇంకా ముందు ముందు ఏమి రుచిచుపించనున్నారో?

    ReplyDelete
  7. "అనెహాసియో" సత్యసాయి గారు! చాన్నాళ్లకి చక్కని టపా అందించినందుకు "కంసమిదా"

    ReplyDelete
  8. చాలా బాగుంది.

    ReplyDelete
  9. మీరనేది నిజమే- వంటకు పట్టే సమయమూ, రుచీ విలోమానుపతంలో ఉంటాయి. ఆ మధ్య కూర మాడ్చినపుడు తెలిసొచ్చింది.:-)

    అన్నట్టు మీ బ్లాగు మంటనక్కలో బాగా కనపడాలంటే.. మీరు జస్టిఫై చెయ్యడం మానెయ్యాలి. (వీవెన్ తయారించిన అన్‌ జస్టిఫై వాడితే బాగానే కనపడుతుంది.) కొన్ని సార్లు 'అన్ జస్ట్' గా ఉంటేనే పని జరుగుతుందండి.

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. నమస్తే సత్యసాయిగారూ, ఈ మధ్య బ్లాగులకూపంలో నుండి కాస్త బయట తిరగడంతో కొన్ని మంచి టపాలను చదవలేకపోయాను. మీరు చాలా బాగా రాస్తున్నారు. కొరియా చప్పిడివంటలు మీరు కలిపే తెలుగు నుడి'కారం'తో రుచినిగొని ఆవురావురుమంటూ తినేలా ఘుమఘుమలాడయి.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.