Monday, May 07, 2007

ప్లాటో, స్పినోజా, ఆవెనక నేనే

ప్లాటో, స్పినోజాలు పేరొందిన తత్వవేత్తలని మీకందరికీ తెలిసిందే. వాళ్ళకీ సత్యసాయికీ లంకేమిటని అనుకోవద్దు. వాళ్ళలాగే నేను కూడా ఆలోచిస్తాను(ట), వాళ్ళకున్న నైపుణ్యత నాలో కూడా ఉంది(ట). నాకాలర్ కొద్దిగా పైకెళ్ళడం గమనించగలరు. ఇదేమిటి, నిన్న గోడల్లోంచి దూరడం చదివినప్పటి తలతిరుగుడు ఇంకా తగ్గలేదనుకుంటోంటే, వీడేంటీ, సత్యసాయి = ప్లాటో = స్పినోజా అని కొత్త సమీకరణం ప్రతిపాదిస్తున్నాడేంటి అని కలవరపడుతున్నారా? ఇంకా ఏమనిపిస్తోందీ అని యమలీలసినిమాలో సైకాలజిస్ట్ నగల వ్యాపారినడిగినట్లు అడగాలనిపిస్తోందా?

అంత ఖంగారు పడకండి. ఈకింద నేను చేసిన classic IQ test విశ్లేషణ లో రెండు వాక్యాలు చూడండి.

"..... The timelessness of your vision and the balance between your various skills are what make you a Visionary Philosopher. ............Two philosophers who share the same combination of skills you possess are Plato and Benedict Spinoza."

ఈ టెస్ట్ టికిల్ దాట్ కాం (Tickle) లో ఉంది. చాలా నెలల (సంవత్సరాలేమో కూడా) కింద యాహూ మెయిల్ ఇంటి పుటలో ఒక ప్రకటన చూసా. అందులో ఒక తెలివితేటలకి సంబంధించిన బహుసమాధానపు (multiple choice)ప్రశ్న కన్పించింది. నాకున్న ఆసక్తివల్ల దాన్ని నొక్కి చూస్తే, ఈ పుట తెరుచుకొంది. అప్పటి నుండి ఆ సైట్ లో నున్న రకరకాల టెస్టులు ఓ 35 దాకా చేసాను. నా ఫ్రెండయితే (మా అమ్మాయి) ఒక 100 దా కా చేసింది. ఈ టెస్టులు శరీరం, మనస్సు, ఉద్యోగపర్వం, అభిరుచులు, అతీంద్రియ శక్తుల (ESP) అంచనా, ఇలా అనేక విషయాలలో మన సత్తా, మనకున్న మొగ్గు తేల్చి చెప్తాయి. నేను తీసుకొన్న టెస్టులన్నిటిలోనూ వచ్చిన ఫలితాలు, నాగురించిన నాకున్న అంచనాలతోనే కాక, నాగురించిన నన్నెరిగిన వారి అంచనాలతో కూడా సరిపోలడంబట్టి ఈ టెస్టులు కాస్త సాంకేతికంగా ఉన్నతస్తాయిలోనే ఉన్నాయనిపించింది. మన గురించి మనకే సంపూర్ణంగా అంచనా అందడం కష్టం. అలాంటిది కొన్ని ప్రశ్నలకి మనమిచ్చే సమాధానాలని బట్టి 100% సరియైన అంచనాలు రావడం కష్టం. కాని వీటిలో వచ్చే విశ్లేషణ వల్ల మనకి కొంత ఉపయోగం ఉండచ్చు, మన గురించి మనకి కొంత అవగాహన పెరగచ్చు అని నా కనిపించింది. వీటి ఉపయోగం కాసేపు పక్కన పెడ్తే, టెస్టులు చేయడంలో భలే మజా వస్తుంది. పని వత్తిళ్ల మధ్య కాస్త సేదతీర్చగలిగే గుణం వీటికుంది.

అసలు ఈ పుట గురించి బ్లాగర్లకి (తెలియని వాళ్లకి) పరిచయం చేద్దామని మన త్రివిక్రముడి 'బొట్టు-జ్ఞానం ' టపా చదివినప్పుడు అనిపించింది. దేనికైనా కాలం, ఖర్మం (ఎవరిది?)కలిసిరావాలంటారు కదా. ఇదిగో ఇప్పటికయ్యింది. ఆ టపాలో, రాధిక గారి ప్రశ్న (బొట్టెందుకు పెట్టుకొంటాం?)కి సమాధానం రాస్తూ, మన శరీరంలోని చక్రాలని పరిచయం చేశారు. టికిల్ లో మనలో ఏచక్రం ఉద్దీప్తమై ఉందో చక్రా టెస్టులో కొన్ని ప్రశ్నలకి మనమిచ్చే సమాధానాలద్వారా విశ్లేషించి చెప్తారు. అతి సులభంగా నమోదు చేసుకోవచ్చు. ఇప్పటిదాకా నాకు స్పాములు, ప్రొమోల బెడద రాలేదు.

టికిల్ అంటే కితకిత, చక్కిలిగింత. అది మీకు కూడా కలగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకొంటున్నాను. శుభస్యశీఘ్రం.

తోక చుక్క:
రాధికగారిని ఆమెరికాలో అడిగినట్లే ఇక్కడ కూడా మనదేశంవాళ్ళని అడుగుతారు. ఒకాయన ఒక సరదా సమాధానం చెప్పాడు. పూర్వం ధనుర్విద్య అభ్యసించేవాళ్ళు బొట్టుని గురి కోసమని (bull's eye) వాడేవాళ్ళట! అది ఇప్పుడు ఆచారంగా అయిపోయిందట.
బొట్టుగురించి అడిగితే పర్వాలేదు కాని, మనవాళ్ళు పెట్టే నామాల గురించి అడిగితే సమాధానం చెప్పడం కష్టం.

3 comments:

 1. మీ ఫ్రెండ్ అంటూ మీ అమ్మాయిని అనడం చాలా బాగుంది.
  మీరు తోక చుక్కలో చెప్పిన విషయం ఏకాగ్రత కోసం అన్నదే నేనూ వాళ్ళకి ఇచ్చిన వివరణ కూడా.ధనుర్విద్యవాళ్ళే కాకుండా ధ్యానం లోను కూడా ఏకాగ్రత కోసం బొట్టు పెట్టుకునేవారని చదివాను.ధ్యానం అనేది అన్ని విధ్యల అభ్యాసం లో తప్పని సరిగా వుండేదట.కానీ ఒక్కటే అనుమానం.పూర్వకాలం లో ఇలాంటి విద్యలు అన్ని మగావరికే సొంతం కదా.అలాంటిది మగవారు కాకుండా ఆడవాళ్ళు ఆచారం గా బొట్టు పెట్టుకోవడం ఎప్పటినుండి మారిందో మరి?

  ReplyDelete
 2. అయ్యో.మీకు అందులోని మర్మం అర్ధమవలేదు. నెత్తిమీద ఆపిల్ పెట్టి బాణంతో కొట్టడంలా అన్నమాట- బొట్టు ఆడవాళ్ళే పెట్టుకొంటారు:) మగవాళ్ళు ఆ బొట్టుని గురిచూసి ప్రాక్టీసు చేస్తారన్నమాట. joke-just for fun.

  అవునండి, మాఅమ్మాయి నాకు మంచిస్నేహితురాలు. మేమిద్దరం చాలా విషయాలు పంచుకొంటూంటాం. మంచి సలహాలు చెప్తుంది. మాటల, చేతల మధ్య తేడాపాడాలొస్తే సూటిగా నిజాయితీగా నిలబెట్టేస్తుంది.

  ReplyDelete
 3. నా స్కోరు 131. నేనో విజువల్ మాథమాటీషియన్ని-ట. ఇంకా ఎన్నెన్నో పొగడ్తలు, కితకితలు, టికిళ్లూనూ :) (వీటిలో మీకూ కొన్ని చెందాలి)

  ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.