Monday, May 14, 2007

మంచివాడు మాబాబాయీ..

మాబాబయ్య క్రిందటేడు దేవుడి దయవల్ల మృత్యుముఖంలోంచి బయటపడి, రేపు తన 60 వ జన్మదినోత్సవం (షష్ఠి పూర్తి) జరుపుకొంటున్నాడు. ఆ సందర్భంగా నేను తవ్వుకున్న కొన్ని జ్ఞాపకాలివి.
ఒకరు లేక ఇద్దరు స్కీం వల్ల, అమెరికా వలసల వల్ల, ఇంగ్లీషు వాడకం వల్ల బాబాయి, పిన్ని, మామయ్య, అత్త (I mean uncle and aunty) లాంటి పదాలర్ధం కాకపోయే ప్రమాదం ఉంది. నిఘంటువు చూస్తే పద అర్ధం తెలియచ్చు కాని, తత్వం బోధపడదు. ఇవే కాదు, ఇలాంటి బంధుత్వాలన్నీ కేవలం నిఘంటువుల్లోని పదాలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈవ్యాసం వల్ల వేరేవాళ్ళుకూడా uncle, aunty :-)) ల జ్ఞాపకాలు నెమరువేసుకుంటారని ఆశ.

నాకు 5-6 ఏళ్ళ వయస్సున్నప్పుడు మేం ఇరగవరంలో ఉండేవాళ్ళం. మాఊరి పాలేశ్వరస్వామి గుళ్ళో ఏదైనా పండగ పబ్బాలొస్తే గ్రామఫోను రికార్డులు పెట్టేవారు. అప్పట్లో అది పెద్ద క్రేజ్. ఆరోజుల్లో ఈ పాట (మంచివాడు మాబాబాయి- మామాటే వింటాడోయి) తెగ వినిపించేది. అప్పట్లో నాకు తెలిసినంత వరకు బాబాయంటే మా రాజా బాబాయే. ఈపాట వింటోంటే ఆయనే సీన్లో కనిపించేవాడు. అప్పట్లో మాబాబాయి చదువుకునే వాడో, ఆపేసాడో గుర్తులేదు. మాఊరికి తరచూ వస్తోండేవాడు. ఆయనొస్తే మాపిల్లకాయలకి బోల్డంత సంబరంగా ఉండేది. శని, ఆదివారావారాలయితే మరీని. సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ గలగలలాడుతోండేవాడు. మాకన్నిటికన్నా బాగానచ్చే అంశం పొద్దున్నే లేచేవాడుకాదు. మేంఅందరం తన పక్కలోదూరేవాళ్ళం కాబట్టి మేంకూడా ఆలస్యంగా లేవచ్చని మాఆశ. అయితే మాఅమ్మ ఊరుకునేదా. లేవండి, లేవండంటూ ఆసుఖం తనివితీరా అనుభవించనిచ్చేదికాదు. మేం బాబయ్య లేస్తేలేస్తాం లాంటి మెలికలు పెట్టడానికి ప్రయత్నించేవాళ్ళం. అప్పుడు మాఅమ్మ బాబయ్యని లెమ్మని చెప్పేది. మాఅమ్మ కాపురానికి వచ్చినప్పుడు మాబాబయ్య మట్టలాగులేసుకునేంత చిన్నపిల్లాడట. వెనకాలే తిరుగుతూ, మాలిమిగా ఉండేవాడట. అందుకే తనంటే చాలా యిష్టం అని మాఅమ్మ ఎప్పుడూ చెప్తుంది. చెప్పగానే లేచేస్తే మాబాబయ్యెందుకౌతాడు? లేవకపోగా, రోజూలేచేదేకదా ఒకరోజులేటుగా లేస్తారులే అని మాకు మోరల్ సపోర్టిచ్చేవాడు. అవును మరి, స్కూలున్నప్పుడు ఎలాగూ తప్పదు అని మాకు అనిపించేది. పైగా చదువెందుకు చంకనాకు, గురువెందుకు గుండుగోకు, పదియావులు కాచుకొనిన పాయసమొచ్చున్ అని పద్యం చెప్పేవాడు. మేం దాన్ని కంఠతా పట్టి చెప్తోండేవాళ్ళం. అయినా అమ్మ వదిలేది కాదు. ఉన్నవాళ్ళలో తొందరగా మెత్తబడేది నేనే. అందుకని, ఉబ్బోపాయాలతో మా అమ్మ నన్ను ఎలాగో మంచం దింపేది. తర్వాత, చూడరా నీకన్న చిన్నవాడు లేచేసాడు, అని అన్నయ్యని, ఇద్దరూ లేచేసారు చూడు, నువ్వొక్కడివే ఉండిపోయావని తమ్ముడిని భేదోపాయంతో లేపేసేది. నాకన్న వాళ్ళెక్కువ అనుభవించేస్తున్నారన్న దుగ్ద వాళ్ళు లేవడంతో తగ్గేది.

బాబయ్య మాఊరు తరచూ రావడానికి బలమైన కారణం నాకు మాబాబయ్య వయస్సొచ్చాక అర్ధమైంది. మా పిన్నిది (అప్పటికి కాబోయే) ఆఊరే. మేనమామ కూతురే. టీవీలు, సినిమాలు లేకపోవడంవల్ల మాకు అప్పుడర్ధం కాలేదు కాని, తర్వాతి కాలంలో వచ్చిన పరిజ్ఞానంతో చూసినప్పుడు, వాళ్ళు ప్రేమికులని అర్ధమయ్యింది. తొందరలోనే వాళ్ళకి పెళ్ళయింది. మాబాబయ్య పెళ్ళప్పుడు కనీవినీ ఎరుగనంత వాన. వాయుగుండం. తర్వాతి రోజుల్లో ఎప్పడు పెద్దవర్షం కురిసినా అప్పుడుకురిసిన వర్షాన్ని ప్రమాణంగా చేసి పోల్చేవాళ్ళు.

ఉద్యోగరీత్యా, మార్కెటింగ్, సేల్స్ లలో చాలాకాలం పనిచేసేవాడు. ఊళ్ళు తిరిగి, తిరిగి వస్తోండడం వల్ల ఎక్కడెక్కడి బంధువులనో కలిసి, వార్తలు తెల్పేవాడు. మేం ఇచ్చాపురంలో ఉన్నప్పుడు మాయింటికి వచ్చి మాకు దూరంలో ఉన్నామన్న భావన తొలగించిన అతికొద్ది బంధువుల్లో అతిముఖ్యుడు మా బాబయ్యే. మా అందరికీ నచ్చిన మాబాబయ్య, లైవ్ మెస్సెంజర్. రియల్ టైం సెర్చింజన్. ఇప్పటికీ ఎవరి పేరైనా చెప్తే గూగుల్ బాబాయికన్నా వేగంగా వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు తవ్వగలడు. మా నాన్నగారి తరానికి కొవ్వలి వంశపు లివింగ్ ఫాజిల్.

మా పెద్దనాన్నగారు పోయినప్పుడు, వాళ్ళ పిల్లలని తీసుకువచ్చి తణుకులో ఉమ్మడి కుటుంబం పెట్టారు, మానాన్నగారు,బాబయ్య కలిసి. మా పిన్ని, బాబయ్యలిద్దరూ వాళ్ళవంతు సహకారం అందించడం వల్ల ఉమ్మడి కాపురం ఉద్దేశ్యం సఫలీకృతమైందని నాఅవగాహన. నాకు అప్పటికి కొద్దిగా ఊహ వచ్చింది. మాబాబయ్య ఊళ్ళుతిరగి తిరిగి వచ్చేవాడు. ఉమ్మడిలో సరియైన ప్రైవసీ కూడా ఉండేదికాదు. అయ్యో స్వేచ్ఛ లేదో, సుఖంలేదో అని అరిచి గీపెట్టేంత సావకాశం, సందర్భం ఉండేవి కావో, లేక మన అన్నయ్య పిల్లలకి మనంకాకపోతే ఇంకెవరున్నారన్న బాధ్యత వల్లో బయటికి ధ్వని కాలుష్యం ఎప్పుడూ రాలేదు. ఆఖరికోడలిగా కష్టాలే పడిందో, నిష్ఠూరాలే ఎదుర్కొందో కాని, మా పిన్ని ఈరోజుకి కూడా బాధ్యతల్లో మాబాబయ్య వెంటే. ఇంకా ఆడపడుచులని, పెళ్ళిళ్ళని, పేరంటాలని పూచీపడుతూనే ఉంది. మాచిన్నప్పుడు ఇంటిచాకిరీ ఎలా చేసేదో, ఈరోజుకీ అదే చాకిరీ, మెప్పూ మెహర్బానీల ధ్యాస లేకుండా.

సమస్యలు రాలేదా అంటే, బోలెడన్ని వచ్చాయి. ఉమ్మడిలో సమస్యలు, అపార్ధాలు, అవమానాలు, ఆర్ధిక సమస్యలు, సూటిపోటు మాటలు, ఇలా ఎన్నిటినో మా నాన్న తరంవాళ్ళు ఎదుర్కొన్నారు. డబ్బులు లేకపోవడమే వాళ్ళకి వరమయిందా అనిపించేంత సంతుష్టిగా బతికారనిపిస్తుంది.


తనకి, పిన్నికీ ఆయురారోగ్యాలిమ్మని భగవంతుని ప్రార్ధిస్తూ ...

7 comments:

  1. మీ బాబయి కు,పిన్ని కు ఆయురారోగ్యాలు కలగాలని నేనూ మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాండీ

    ప్రతి ఇంట్లో ఇలా అందరి పిల్లలకు జత గా ఒకళ్ళు ఉంటారండి

    వాళ్ళల్లొ ఏముంటుండో ఏమో,వాళ్ళను ప్రతి రోజూ తలచుకుంటాం

    నాకు ఎప్పుడూ ఆస్చర్యం వేస్తుంది ఎంచక్కా "human resource management "ఎలా నేర్చారా అని

    ReplyDelete
  2. ఇప్పుడు ఒకరినో లేక ఇద్దరినో కనడం వల్ల భవిష్యత్తులో పెద్దన్న, నడిపన్న, చిన్నన్న, పెద్దక్క, చిన్నక్క, నడిపక్క, పెద్ద మామ .. లాంటి పదాలు కూడా కనుమరుగై ప్రమాదముంది.

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  3. మళ్లి మాకు చిన్నతనం గుర్తుకు వచ్చేలా రాసారు. Thanks
    -Rajesh
    http://gannarapu.wordpress.com

    ReplyDelete
  4. నిజమే ఇప్పటి పిల్లలకి సరిగ్గా వరసలు కూడా తెలియవు. ఈ బంధుత్వాల గురించి మీరో, చరసాల గారో, పప్పు నాగరాజు గారో ఓ వ్యాసం రాస్తే బాగుంటుంది. ఇప్పటివారి కోసం కాకపోయినా ముందు తరాల వాళ్ళ కోసం.

    ReplyDelete
  5. ఈ కాలం లో ఎక్కడున్నారండి అలాంటి వాళ్ళూ .అందరమూ బంధుత్వాలకు నీళ్ళొదిలేసి ఎవరి స్వార్ధం తో వాళ్ళం మన మన గూటిలో మనం బ్రతికేస్తున్నామంతే. మీ బాబాయి ,పిన్ని గార్లు ఆయురారోగ్యాలతో నూరేళ్ళూ బ్రతకాలని దేవుడిని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  6. చదువెందుకు అనే పద్యం నవ్వు తెప్పించింది. టపా మధ్య అందమైన సినిమాలా లీనమైపోయాను. బాగుంది.

    ReplyDelete
  7. వ్యాఖ్యల ద్వారానూ, దర్శనమాత్రానా ప్రార్ధనలందించిన అందరికీ కృతజ్ఞ్తతలు.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.