Sunday, June 17, 2007

ఇలా అయితే బ్లాగడం కష్టం...

చావా కిరణ్ తన ఇటీవలి వుయ్ వాంట్ బ్లాగ్ హాలిడే ఫ్రం యువర్ బ్లాగ్ :) లో కూడలి బ్లాగువ్రాసే సమయాన్ని మింగేస్తోందని తెలుగులో తెగ బాధ పడిపోయాడు. అయ్యలారా! నాసమస్యలు, దీంతోపాటు, ఇంకా ఉన్నాయి.
రాద్దామని వచ్చి జస్ట్ ఫర్ ఫైవ్ మినిట్స్ అని కూడలి చదవడం మొదలెడతానా? అలా, అలా సెకన్లు, నిమిషాలు, గంటలు, జాములు... గడిచిపోతాయి. ఆనక కర్తవ్యం గుర్తొచ్చి వ్రాయడం మొదలెడ్తా. అప్పుడు సినిమాలోలాగా నాలోంచి ఒక సత్యసాయొస్తాడు. తెలుగు సినిమా పరిజ్ఞానం ఉందికాబట్టి ఎవరు నువ్వు అని అడగి టైం వేస్టు చేయకుండా, వాడికి హుహుహా ....అని వికటాట్టహాసాలు చేసే ఛాన్సివ్వకుండా - కం టు ది పాయింటనేస్తా. అసలు వాడి పాయింటేమిటో తెలియకపోతే కదా! అయినా అంతరాత్మ ముఖతః ప్రబోధం అన్నారు కదా అని వింటా. వాడు, వాడి డ్యూటీ ప్రకారం, ఇప్పటికే చాలా టైం వేస్టుచేసేసావు, రోజూ ఇదేతంతు. ఇలాఅయితే ఎలా అని గదమాయిస్తాడు. చేయాల్సిన పనులు అలా వెనక బడిపోతోంటే, పన్లు లూజింగు టైం లూజ్ ప్రయారిటీ అని సర్దేసుకుని, అయినా కలికాలం కాకపోతే, ఈఅంతరాత్మలు సినిమాలలోంచి నిజజీవితాలలోకి వచ్చి ఇలా ఇబ్బంది పెట్టడం ఏమిటని కాస్త బాధపడి, అలాగే ఇంకాపేస్తాలే అంటూనే బ్లాగు వ్రాయడం కంటిన్యూ చేస్తా. వ్యసనం అలాంటిది మరి.

అలా వ్రాసి పబ్లిష్ చేసి, ఒకటికి రెండుసార్లు వీపు చరుచుకుంటూ చదువుకుని, తర్వాతి ఐదు నిమిషాల్లో కూడలిలో కనిపిస్తోందో లేదోనని పదిసార్లు, ఆతర్వాతి ఇరవై నిమిషాల్లో ఎవరైనా వ్యాఖ్యలు రాసారేమో చూద్దామని ముప్పైసార్లు బ్లాగ్జంక్షన్ చుట్టూ చక్కర్లు కొడుతూంటే ఓ గంట గడిచిపోతుంది. ఇలా అయితే అంతరాత్మ క్షోభపడకుండా ఎలా ఉంటుంది?

ఇంత కష్టపడి వ్రాసి కూడలిలో పెట్టేసరికి ఎక్కడినుండి వస్తాయో టపాలు టపటపా వచ్చేస్తున్నాయి, నాటపాని కిందకెక్కడికో పాతాళానికి తొక్కేస్తూ. ఒక్కోసారి, ఒకేరోజులో పేజీలోంచే గల్లంతయ్యే అవకాశం కూడా ఉంది. వీవెన్ జాలిపడి 75 టపాలు చూపెట్టబట్టి గుడ్డిలో మెల్లగా ఉంది పరిస్థితి.

ఇంకో సమస్యేమిటంటే, ఒక విషయం మీద వ్రాద్దామని కూర్చుంటా కదా, కూడలిలో టపాలు చదివే సరికి ఎవరో వ్రాసిన టపా నచ్చడమో, నచ్చక పోవడమో జరుగుతుంది. అక్కడితో వ్రాద్దామనుకున్న విషయం మరుగున పడి ఏదో కొత్త విషయంమీద టపా తయారవుతుంది. పైన ఉటంకించిన కిరణ్ టపా చదివి అనుకున్న విషయం పక్కన పెట్టి ప్రస్తుతటపా మొదలెట్టా. ఆనక లలితగారి టపా చదివాక, ఈటపాని డ్రాఫ్టులో పెట్టి, వేరే టపా వ్రాసా. ఇలాంటి సందర్భాల్లో కూడలి జాం అవడం కూడా మనమంచికేనని గ్రహించి, అది జాం అయితే బాగుండునని విఘ్నేశ్వరుడిని ప్రార్ధించి టపాలు వ్రాస్తూంటా. బాధే సౌఖ్యమని భావన రానివ్వడమంటే ఇదేనేమో!

ఇదివరకు వ్రాసేవాళ్ళు తక్కువగా ఉండడంతో మనబ్లాగులుచదివే వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. నాలాంటి ఆముదపు వృక్షాలకి కూడా కాస్త పాఠకులుండేవాళ్ళు. ఇప్పుడు బ్లాగర్లెక్కువయిపోవడమూ, లబ్ధప్రతిష్ఠులూ, హేమాహేమీలూ బ్లాగర్లయిపోవడమూతో తలసరి చదువరుల సంఖ్య తగ్గి పోయింది.

ఇలా చెప్పుకుంటూ పోతే బ్లాగేవాళ్ళకి ఎన్నో సమస్యలు. వీటికి ఒక పరిష్కారం- రేషనింగు. ఇంకేమైనా తడితే చెప్పండి. బ్లాగేజనా రేషనోభవన్తు.

15 comments:

  1. ఏమిటో అందరిదీ ఒకటే బాధ.టపాలు చదవడానికే సమయం అయిపోతుంది.ఇంక కామెంట్లు రాయడానికి టైము వుండట్లేదు.ఆదివారం ఆడవాళ్ళకు సెలవులాగ ఒక రోజు బ్లాగులకు కూడా సెలవిస్తె మన టపాలను రాసుకుంటాం కదా.

    ReplyDelete
  2. బ్లాగరలందరిది అదే బాధ. మనం రాసే సంగతి అటు ఉంచండి, అసలు బ్లాగులు మొత్తం చదవటానికే సమయం సరిపోవటం లేదు.
    ఎవరికి వాళ్ళం రేషనింగ్ పెట్టుకోవాలా?
    అసలు కూడలికే ఒకరోజు సెలవు ఇస్తే సరి, కాకపోతే మరుసటి రోజు ట్రాఫిక్ జాం అవుతుందేమో. వీవెను గారూ ఏమంటారు?

    ReplyDelete
  3. మనమే కాస్త నిగ్రహించుకుని ముందు మన టపాలు రాసుకుని తర్వాత కూడలి తెరవాలి.ఇంతకంటే మార్గం లేదు. ఆదివారం నిద్రలాంటివి మానుకుని తీరిగ్గా అన్ని బ్లాగులు చదవాలి లేకుంటే కొన్ని మంచి టపాలు మిస్ అవుతాము.నేను మీలానే తిప్పలు పడి ఈ మార్గానెన్నుకున్నా.వ్యాఖ్యలు ఎలాగూ మన మెయిల్ కి వస్తాయి కదా.

    ReplyDelete
  4. కూడళ్లలో తిరగడంవల్ల కలిగే దుష్ప్రభావాలకు ఇప్పటికే కొన్నిసార్లు గురయ్యాక, మనసును రాయి చేసుకొని ఒక వారం రోజుల పాటు కూడళ్లవైపు పోకూడదని ఇప్పుడే ఒక కఠిననిర్ణయాన్ని తీసుకున్నా. జస్టిస్ చౌదరి లాంటివారికి కూడా ఈ పరిస్థితి రాలేదేమో. "బ్లాగులకూ బ్లాగర్లకు జరిగిన ఈ సమరంలో ... రాతలకూ చేతలకూ జరిగిన సంగ్రామంలో... " అహ్!!

    ReplyDelete
  5. ఇంకో నాలుగు కూడళ్ళు పెట్టాలి. సాహిత్యం, ఆరోగ్యం, సినిమాలు ఇట్లా ఒక 4 to 5 సబ్జెక్ట్స్ కి ఒకటి.
    మన బ్లాగ్ కేటగరీని బట్టి మన పోస్టు సంబంధిత కూడలిలో కనిపిస్తుంది.
    అప్పుడు "ఏమి చదవాలి? ఏది వద్దు?" అన్నదానికి కొంత వరకూ మనకు ఛాయిస్ దొరుకుతుంది.

    కాకపోతే కేటగిరీలు పెరిగే కొద్దీ ఈ సొల్యూషన్ పనికిరాదు. ఫీసిబిలిటీ ప్రాబ్లం.

    ReplyDelete
  6. బ్లాగులు కొత్తగా మొదలెడుతున్న వారు వారానికి ఒక్క బ్లాగే రాయాలని షరతు విధించాలి. లేదా కూడలి లాంటివి ఒక్కోరి బ్లాగు వారంలో ఒక్కంటినేచూపించి మిగతావారికీఅవకాసం కల్పించాలి.
    పాత బ్లాగరులు ప్రత్యేక సంఘంగా తయారయి దీనిమీద పోరాటం సలపాలి.

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  7. ఇంకా నయం రిజర్వేషన్లు పెట్టాలి అన్నారు కాదు. మన బ్లాగుకర్తలు పెరుగుతున్నందుకు మనకు చదవటం కష్టమవ్వచ్చు కాని అసలు కూడలి ముఖ్య ఉద్దేశ్యం అదే కదా...తెలుగు లో బ్లాగు లు పెంచాలని.బ్లాగు లు పెరుగుతున్న కొద్దీ శ్రేణులు / తరగతులు పెరగడమో, లేక బ్లాగవులు తమ తమ ప్రియ బ్లాగ పుంగవులు రాతలను పుట సంకేతాలు (బుక్ మార్క్స్) పెట్టుకుంటారు. ఒక్క సారి ఆంగ్ల బ్లాగులకు కూడలి ఉంటే ఎంత కంగాళి గా ఉంటుందో ఊహించండి.
    మనం (బ్లాగాయణులం) ఎదుగుతున్నాం, రాశి లోను, వాసి లోను. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి, కూడలి లోను, సొంత బ్లాగు ల లోను.
    లేదంటే కూడలి చుట్టూ ఒక రింగు రోడ్డు వేయించాలసి వస్తుంది.

    ReplyDelete
  8. యశస్వి (అదే SSV, పేరు ఇలా మార్చినందుకు క్షమించండి- బాగుందని సరదాగా-వద్దని చెప్తే మానేస్తా)గారు విషయాన్ని గంభీరంగా తీసుకుని రిజర్వేషన్ ఐడియా నాటారు. అవును, అణచి వేతకి గురవుతున్న పాత బ్లాగర్లకి 90% రిజర్వేషన్ అడగచ్చేమో. :)))

    ReplyDelete
  9. यशॊ यस्य स: इति यशस्वि కాబట్టి అది నాకు వర్తించదు సాయి గారు. I am fine with SSV :)

    ReplyDelete
  10. వాస్తవానికి మీది బ్లాగర్లందరి బాధే. కూడలి అంతా చదివి స్ఫూర్తి పొంది వ్రాస్తేనే తృప్తిగా వుంటుంది.

    ReplyDelete
  11. బ్లాగులో ఒక జాబు రాయాలంటే తెలుగు వికీపీడియాలో ఓ 10 దిద్దుబాట్లు చెయ్యాలనీ, లేకపోతే కూడళ్ళలో చోటు దక్కదని తీర్మానిద్దాం! దాంతో మనకు పుణ్యమూ (వికీలో రాసినందుగ్గాను), పురుషార్థమూను (బ్లాగ్వ్యసనాన్ని కొనసాగించినందుకు)!

    -ఔనౌను సత్యసాయి గారూ, వాళ్ళకి పుణ్యం మాత్రమే దక్కుతుంది. తప్పదు మరి, పెద్దలలా రాసారు, దేవుడూ అలాగే రాసాడు!

    ReplyDelete
  12. ఏంటింది? ఇది సరదా చర్చా లేక సరదా నుండి సీరియెస్ అయిన చర్చా? అందరూ తెలుగు లో రాయాలి అని ఒక పక్క ప్రయత్నిస్తున్నప్పుడు వస్తున్న వాటిని చూసి సంతోషించక రేషనింగ్ ఏంటబ్బా :-)

    ఈ బ్లాగులు ప్రస్తుతానికి "ఇరుక్కున్నోడికి పీక్కోలేనంత" గా అయిపోయాయి :-)

    కొన్నాళ్ళ పాటు పోనివ్వండి. కాలమే కొత్త పోకడలకు నాంది పలుకుంతుంది. మనము చెయ్యగలిగేదేమీ లేదు. బ్లాగులు బాగా ముదరనివ్వండి.

    సత్య సాయి గారు,

    బ్లాగులు బాగానే పెరిగాయి. కళ్ళు బ్లాగుల వెంట పరిగెడడానికి సమయం చాలటం లేదు. ఇక కామెంట్లకు దిక్కెక్కడ. ఒక్కొసారి హెడ్డింగ్ బాలేక పోతే ఆ టపా ను వాసన కూడా చూడరు(ము).
    ఇలాగే బ్లాగుల మీదే ఓ పది బ్లాగేయండి :-) అప్పుడు హాయిగా వుంటుంది. ఈ మధ్య కొంత మంది టపా సమయాన్ని కాస్త ముందుకి జరిపి కూడా రాస్తున్నారేమో నని "కాపాలికుడు" గుహ లోనుండి అరుస్తున్నాడు.:-) అందరూ తెలివి మీరి పోయారు.

    -- విహారి
    http://vihaari.blogspot.com

    ReplyDelete
  13. >పాత బ్లాగరులు ప్రత్యేక సంఘంగా తయారయి దీనిమీద >పోరాటం సలపాలి.

    nE@M raDiii
    :)

    charcha saradaanE

    ReplyDelete
  14. హహ్హహ్హా... అవును నిజం! పరిష్కారం ఏమిటి మాస్టారూ? పాతోళ్ళం ఒక సొంత కూడలి పెట్టుకుందామా :) ?

    ReplyDelete
  15. రేషనింగులు, రిజర్వేషన్లంటే బహుచిరాకు నాకు...టపాలను డిగ్గుతే..సమయాన్ని బట్టి ముఖ్య ముఖ్యమైన టపాలు చదివెయ్యొచ్చు...దిగ్గటం అందరూ కాస్త భాధ్యతా పూర్వకంగా చేస్తే చాలు

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.