Sunday, November 09, 2008

ముంబై ముచ్చట్లు : పాత పెన్నుకి కొత్తపాళీ

కొత్తపాళీ గారు కబుర్లు మొదలెట్టాక, నాక్కూడా నా పాళీ మార్చాలని పించింది. చూస్తే ఇంతకుముందు ముంబై ముచ్చట్లు అని శీర్షికతో ఇలా ముంబై కబుర్లు చెప్పాలని అనుకున్నట్లు గుర్తొచ్చింది. అయినా ముంబై ముచ్చట్లేముంటాయి చెప్పడానికి - ఏ నగర చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం - నగరాల చరిత్ర సమస్తం చెత్త, చెదార, కుళ్ళు మయం. 1993 లో ముంబై మొదటిసారిగా వచ్చినప్పుడు, అనుకున్నంత భయంకరంగా లేదు, పర్వాలేదనిపించింది. వర్షాకాలం చూసాకా పబ్లిక్ టాయిలెట్టాఫిండియా అని పించింది. కొన్నాళ్ళున్నాకా, దేశంలో బెస్టు సిటీ అనిపించింది.

ఢిల్లీలో 9 ఏళ్ళున్నాఢిల్లీమీది ఇష్టాన్ని కేవలం కొన్ని రోజలలోనే మరిపించగలిగిందీ నగరం. కారణం ఇక్కడి మనుషులు. వాళ్ళో పధ్ధతి పాడూ ఉన్న వాళ్ళు (ఇప్పుడు కాదు). ఒకాయన ఢిల్లీ, ముంబైలలో ఏది నచ్చిందంటే తడుముకోకుండా ముంబై అని చెప్పా. మామూలుగా ఏదైనా ఎక్కువగా మనదగ్గరుంటే దానికి విలువ ఇవ్వం, కానీ ముంబై జనాలు ఇంత అధిక జనాభా ఉన్నా కూడా సాటిమనుషులకి విలువా, గౌరవం ఇవ్వడం నా అభిప్రాయానికి మూలం అని చెప్పా. ఆయన కూడా నా అభిప్రాయానికి వంతపాడి తను కూడా అదే కారణంగా ముంబైనిష్టపడుతానని చెప్పాడు (మహరాష్ట్రీయుడు కాడు). అందరికీ సమయం తక్కువైనా ఉన్నంతలో పక్కవాడిని పట్టించుకోవడం, అందరికీ హడావుడే కాబట్టి, క్యూ పాటించడం, సహనం, వ్యాపారస్తులు వినియాగదారులకిచ్చే సేవల్లో నాణ్యత ముంబైలో కనిపించేవి. ముంబై జనాలు ఒక్కరే ఉన్నా కూడా క్యూ పాటిస్తారని చమత్కరిస్తోండేవాడిని - వీళ్ళ క్రమశిక్షణకి ముచ్చటేసి. గ్యాంగులు, గూండాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటోంటే మా లాంటి సామాన్య ప్రజలు మా బతుకు మేం బతికేవాళ్ళం.



ఇప్పటి పరిస్థితి చూడండి. ఉత్తరభారతీయులంటే పడని పరిస్థితి. సామాన్య ప్రజలు భయంగా బతికే పరిస్థితి. నగరాల్లో జీవనోపాధులు ఎక్కవని ఇక్కడికి అందరూ చేరుకుంటారు. ఇది సహజం. మరాఠీయా, బీహారీయా అని సంకుచిత చర్చ లేవదీసి కుళ్ళు రాజకీయాలు చేయడం వల్ల అందరికీ నష్టమే. ట్రైబల్ ఇన్స్టింక్ట్ అనిపించడంలేదూ. అయినా మన తెలుగు వాళ్ళకన్నా వీళ్ళే బెటరేమో. మనలా సాటి తెలుగువాళ్ళనే తరిమేద్దామనుకోవడంలేదు.

*************

అసహనం అన్నిచోట్లా చోటుచేసుకోవడం సాధారణమైపోయింది. కుటుంబసభ్యుల మధ్యే సయోధ్య మిధ్యైపోయింది. ఒకావిడ గృహహింస చట్టంకింద మొగుడిమీదా, అత్తగారిమీదా కేసు పెట్టింది. విచారించిన జడ్జి గారు ఈచట్టం కింద అత్తగారు రారని వదిలేసారు. అత్తగారు సంతోషపడి, ఈతీర్పు ద్వారా కోడళ్ళ ఆరళ్ళబారినుండి అత్తలకి రక్షణ కలుగుతుందని ఆశాభావం వ్యక్త పరిచింది. ఇది (విన)చదవగానే స్త్రీవాదులు చిందులు తొక్కుతారేమో. కానీ ఆఅత్తగారి మాటల్లో ప్రస్తుత సమాజపోకడ కనిపిస్తుంది. కోడళ్ళ బారిన పడిన అత్తల (కొండొకచో మామలు) సంఖ్య తక్కువుండదనుకుంటా. ఇక్కడ కోడలా, అత్తా అన్న ప్రశ్న కాదు - పరస్పరావగాహన సమస్య. ఆఫీసులో కొత్తగా జేరిన వాళ్ళ పరిస్థితికీ, కొత్తకోడళ్ళకీ పెద్ద తేడా కనిపించదు నాకైతే. ఏసంబంధంలోనైనా ఒక పీడితుడూ(రాలూ), పీడించే(ది)వాడూ ఉండడం చాలా బాధాకరం.
******
జడ్జి అంటే గుర్తొచ్చింది. ఈమధ్య వాయిదా మీద వాయిదాలు వేస్తుంటే విసిగి పోయిన ఒక చిన్నకారు నేరస్థుడు జడ్జిగారిమీదకి చెప్పు విసిరాడు. కోర్టులంటే ఇంతే - కోర్టుకెళ్ళిన వాడు, కాటికెళ్ళినవాడు సమానమని ఊరికే అన్నారా! అదే సినిమాలో అయితే చిరంజీవి చెప్పు విసరడమే కాకుండా ఓపెద్ద ఉపన్యాసమిస్తాడు. మనమందరం తప్పెట్లు కొట్టి ఈలలేసేస్తాం. ఇక్కడి అర్భకుడి మీద మాత్రం ఉన్న కేసుకి ఇంకో కేసు జోడయింది పాపం.
పునర్మిలామః

3 comments:

  1. నిజమే, మీరన్నట్టు, ముంబయ్యే నయం ఆ హస్తిన కంటే! కొన్ని విషయాలలో చెన్నై కూడ బాగుంటుంది. కాని మన హైదరబాదే దారుణం!

    ReplyDelete
  2. చాలా కాలం తర్వాత చూస్తున్నానండి మిమ్మల్ని.బాగుందండి.

    ReplyDelete
  3. ముంబాయి నాకు నచ్చటానికి ఒక ముఖ్య కారణం పక్షి ప్రేమికులకు మక్కా లాంటి ఊరది. Bombay Natural History Society ఉన్నదీ ఊళ్లోనే. కడప జిల్లా లంక మల్లీశ్వరం అడవులలో అంతరించిపోతున్న Jerdons Courser రక్షణకై, ఈ సొసైటీ వారు ఆంధ్ర ప్రదేష్ ప్రభుత్వం తో పలు చర్చలు జరిపి, అడవి గుండా వెళ్లే తెలుగ గంగ గతిని మార్చి, ప్రపంచంలోనే అరుదైన, మన తెలుగు పక్షి (ఈ పక్షి ఆంధ్ర ప్రదేష్ లో తప్ప మరెక్కడా లేదు - 108 సంవత్సరాల తరువాత BNHS శాస్త్రజ్ఞుడు భరతభూషణ్ కనుగొన్నారు దీన్ని) కి పునర్జీవమిచ్చారు. ఈ సొసైటీ వారు ప్రతి ఆదివారం birdwatching trips వేస్తుంటారు. చక్కటి గ్రంధాలయం, జంతు ప్రదర్శన శాల నడుపుతున్నారు. ఈ సారి మీ ఊరు వచ్చినప్పుడు ఈ సొసైటీ ని మరలా దర్శించాలి.

    ఇంకో కారణం. తెలుగువారికి నచ్చే హిందీ సినిమాలు. చక్కటి పాటల సాహిత్యంతో, మధురమైన సంగీతం తో, ఉన్నత సాంకేతిక విలువలతో తయారయ్యే ఇక్కడి సినిమాలు. లత, ఆష, రఫి ముకేష్, కిషోర్ కుమార్ వంటి ప్రతిభావంతమైన గాయకులు, శంకర్ జైకిషన్, O.P. నయ్యర్ లాంటి ఎందరో సంగీత దర్శకులు తమ పాటలతో ఎందరినో రంజింప చేశారు.

    నచ్చనిది. ఉత్తరాది వారిని, దక్షిణాది వారినీ పరాయి వారినిగా చూసే ఇక్కడి రాజకీయవాదుల సిద్ధాంతం. మహారాష్ట్ర లో తయారయే వస్తువులు భారతదేశమంతా వాడబట్టే , ముంబాయి వాణిజ్య రాజధాని అయ్యిందన్న విషయాన్ని, ఇక్కడి రాజకీయవాదులు విస్మరిస్తున్నారు.
    cbrao
    San Jose, CA.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.