Wednesday, October 15, 2008

ఏల బ్లాగింతును?

పర్ణశాల మహేష్ (నేను) అసలెందుకు రాయాలి? అని జూలై లో రాసిన టపా, వేరే టపాలో వ్యాఖ్యలు చదువుతోంటే ఆయనిచ్చిన లంకె ద్వారా ఈవేళ నా కళ్ళబడింది. ఆటపా, దానికి వచ్చిన వ్యాఖ్యలు చూస్తే బ్లాగర్లందరూ ఇంచుమించు ఒకే ప్రేరణ/ ఉద్దేశ్యంతో బ్లాగుతున్నారని అర్ధమయింది. దాంతో జనవరి 2006 పొద్దు లో వచ్చిన నేనెందుకు ‘బ్లాగు’తున్నాను? అన్న వ్యాసం గుర్తొచ్చింది. దాన్లో నేను చివరిచ్చిన పేరడీ పద్యభాగం --

ఏల బ్లాగింతును?
సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల సత్యసాయి ‘బ్లాగించు’ నిటులు
మావిగున్న కొమ్మను మధుమాసవేళ
పల్లవము మెక్కి కోయిల ‘బ్లాగుటేల’?
పరుల తనయించుటకొ? తన ‘బ్లాగు’ కొరకొ
‘బ్లాగు’యొనరింపక బ్రతుకు గడవబోకొ?

వ్యాసం పూర్తిగా చదవాలంటే పొద్దులో నేనెందుకు ‘బ్లాగు’తున్నాను? చదవండి.

Friday, October 10, 2008

కొవ్వలి లక్ష్మీనరసింహారావు

ఈనాడులో వచ్చిన గొల్లపూడి వ్యాసం. మధ్యమధ్యలో గొల్లపూడి చురకలు గమనించండి. గమనిక - కొవ్వలి వారికీ మాకూ , మావాడేనోయ్ అని చెప్పుకునే బంధుత్వం లేదు.

Friday, October 10, 2008 16: 18 hrs IST
http://uni.medhas.org/unicode.php5?file=http%3A%2F%2Fwww.eenadu.net%2Fhtm%2F2vnewfeatureshow.asp%3Fqry=10&reccount=12

వేయి నవలల రచయిత!ఇప్పటి తెలుగువారి సమస్య పిల్లలకి 'తెలుగు' తెలిసేలా చేయడం కొరకరాని సమస్య. కానీ ఏడెనిమిది దశాబ్దాల క్రితం తెలుగు లోగిళ్ళలో- ప్రతి వ్యక్తికీ చదవడాన్నీ విరివిగా ఆలోచించడాన్నీ మప్పి- భాషని వంటగదుల్లోకీ పడకగదుల్లోకీ రైలు కంపార్టుమెంటుల్లోకీ తోలుకొచ్చిన ఉద్యమకారుడొకాయన ఉన్నారు. ఈ తరానికి ఇలాంటి ఆలోచనే అబ్బురంగా కనిపించవచ్చు. ఇంతకీ ఆ ఉద్యమం - వ్యక్తి పేరు - కొవ్వలి. పూర్తిపేరు కొవ్వలి లక్ష్మీనరసింహారావు.


వాళ తెలుగిళ్ళలో తెలుగు పిల్లలకి తెలుగు రాదు. తల్లిదండ్రులూ తెలుగు రాదని బాధపడక ఇంగ్లిషు నేర్పించి గర్వపడటం అలవాటు చేసుకున్నారు. భాష 'రుచి' మరిచిపోయి, వృత్తికి భాష దోహదం చేస్తే చాలుననుకుని సరిపెట్టుకుని చాలా దశాబ్దాలయిపోయింది. అప్పుడే తేలికగా నాలుగైదు తరాల తెలుగువారు 'తెలుగు'ను నష్టపోయారు. భాష పారే సెలయేరు లాంటిది. పారకపోతే నీరు మురిగి మురికికూపం మిగులుతుంది. వాడుకలేని భాష వాడుక అవసరంలేని కారణానే- క్రమంగా చచ్చిపోతుంది. ఆమధ్య ఐక్యరాజ్యసమితి పరిశీలనల్లో కాలగతిలో మాయమయ్యే భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉందన్నారు. ఈ మాట ఆమధ్య ఓ అంతర్జాతీయ తెలుగు సభలో చెప్తే- పెద్దలు భుజాలు తడువుకున్నారు. మధ్యరకంవారు మన తెలుగుకేం భయంలేదని బోరలు విరిచారు. ఆత్మవంచన కూడా ఒక్కొక్కప్పుడు జాతికి సుఖంగా ఉంటుంది.

ఏడెనిమిది దశాబ్దాల నాటి మాట...

బొత్తిగా చదువురాని ఒకావిడ- తన బిడ్డ విసర్జనని మహాభారతం పేజీని చించి ఎత్తడం చూశారు కొవ్వలి లక్ష్మీనరసింహారావు. గుండె తరుక్కుపోయింది. ''నీ చేతిలో ఉన్న ఆ కాగితంలో ఏం ఉందో తెలుసా?'' అని ఆవిణ్ణి అడిగారాయన. తల అడ్డంగా తిప్పిందామె. కొవ్వలి ఆ క్షణంలో రెండే లక్ష్యాలను సిద్ధం చేసుకున్నారు. భాషని ఆకాశమార్గం నుంచి నేలమీదకి దింపాలనీ చదువుమీదకి మనసుపోని ఏ స్త్రీ అయినా చేత పుస్తకం పట్టుకు చదివేటట్టు చేయాలని. ఇది పెద్ద వైజ్ఞానిక విప్లవం. అప్పటికి ఛందస్సు నడుం విరగ్గొట్టే కవులింకా రాలేదు.

తండ్రి ఆయన్ని కోపరేటివ్‌ ట్రైనింగులో పెట్టాలనుకున్నారు. కానీ ఆయన రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో మాయమయ్యారు. కొన్ని వందల పుస్తకాల్ని ఆపోశన పట్టారు. క్రమంగా తను చెప్పాలనుకొన్న వాక్యానికి ఒక రూపాన్ని తెచ్చుకున్నారు. ఒక శైలి రూపుదిద్దుకుంది. అలా అందరికీ అర్థమయ్యేలాగా రాసిన వెుదటి నవల 'పల్లెపడుచు'. 'మాకొద్దీ తెల్లదొరతనం' అని రవి అస్తమించని బ్రిటిష్‌ ప్రభుత్వం మీద తిరగబడిన గరిమెళ్ళ సత్యనారాయణగారు ఆ నవలకి పీఠిక రాశారు. అంతేకాదు, 'దాసీపిల్ల' అనే నవలకి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు ముందుమాట రాశారు. అది కేవలం ప్రారంభం.

రోజుల్లో రాజమండ్రిలో పెద్ద ప్రచురణకర్త శ్రీ కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్స్‌ వారికి ఓ నవలని ప్రచురణకి ఇచ్చారు కొవ్వలి. దాన్ని పరిశీలనార్థం శ్రీపాద కృష్ణమూర్తిగారికి పంపారు వెంకయ్యగారు. ''భాషా ద్రోహంచేసే ఇటువంటి రచనలు వేస్తే వంశక్షయం అవుతుంది'' అని ఆయన హెచ్చరించారు. వెంకయ్యగారు భయపడి ఆ నవలని పక్కనపడేశారు. ఒకరోజు వీరాస్వామి అనే పోస్టుమాన్‌ ఉత్తరాల బంగీ ఇవ్వడానికి వచ్చి, అక్కడ పడి ఉన్న కొవ్వలి నవలని యథాలాపంగా తీసి వెుదటిపేజీలు తిప్పాడు. అంతే, పుస్తకానికి అతుక్కుపోయి, తన ఉద్యోగాన్ని మరిచిపోయి కొన్ని గంటలు- నవల పూర్తయేదాకా అక్కడే ఉండిపోయాడు. వెంకయ్యగారు గుండెదిటవున్న వ్యాపారి. సంప్రదాయపు ఆంక్షని పక్కనపెట్టి, ఓ పామరుడి ఆసక్తికి పట్టంగట్టారు. నవల ప్రచురితమైంది. ఆ నవల పేరు 'ఫ్లవర్‌ గరల్‌'. అదొక వెల్లువ. వెుదటి విడత కాపీలు ఖర్చయిపోయాయి. అప్పుడు కొవ్వలిని పిలిపించారు వెంకయ్యగారు. వంద పుస్తకాల ప్రచురణకి ఒప్పందం చేశారు. ప్రతిఫలం ఎంత? పన్నెండున్నర రూపాయలు. ఇది తక్కువ పైకం అనుకునేవారికి, ఆనాడు ఒక నవల వెల రెండణాలు లేదా పావలా. తర్వాత ఆరణాలు (37 పైసలు) అయింది. ఇది చౌక బేరం కాదు. తెలుగుభాష జనజీవనంలోకి చొచ్చుకువచ్చే ఉద్యమానికి ఇది పట్టాభిషేకం.

రచయిత సంఘజీవి. ప్రయత్నించినా నేలవిడిచి సాము చెయ్యలేడు. జిజ్ఞాసికి సమాజశ్రేయస్సు వ్యసనం. వితంతు వివాహాలూ బాల్యవివాహాలూ కులమత వర్ణాంతర వివాహాలూ- ఒకటేమిటి, నా తరంలో నాలాంటి కుర్రకారు విస్తుపోయి పుస్తకాలకు అతుక్కుపోయి చదువుకొనేటంత విరివిగా పేజీలు నిండాయి. రామవోహనరాయ్‌, వీరేశలింగం వంటి సంస్కర్తలు ఎంచుకున్న విప్లవ ధోరణిని, నేలబారు స్థాయిలో కొవ్వలి పదిమందికీ పంచడం ప్రారంభించాడు. ఆయన రచనలు దావానలంలాగా మూలమూలలనూ చుట్టివేశాయి.

కొవ్వలి స్ఫురద్రూపి. చక్కగా జర్దా కిళ్ళీ వేసుకుని, ఇస్త్రీ మడత కట్టుకుని, జట్కాలో కులాసాగా విహరించే దశ అది. చదివినవారందరూ ఆయనకి అభిమానులే. ముఖ్యంగా ఆడవాళ్ళు. ఆ రోజుల్లో ఎందరో ఆడవాళ్ళు 'హృదయేశ్వరా! మానసచోరా!' అంటూ ప్రేమలేఖలు రాసేవారు. చెలంగారు వీరి పాపులారిటీ మీద చమత్కరించిన మాట... 'ఆ రోజుల్లో- కొవ్వలి తమ కౌగిలిలో లేని ఆడపిల్లలుండేవారు కాదు'. అయితే కొవ్వలికి అదొక్కటే మరిచిపోలేని మహా శుక్రమహాదశ.

ఆయన రచనలకి ప్రచురణకర్తలు పోటీలుపడ్డారు. అయితే ఆయనకు వ్యాపార దృష్టి లేదు. నవలల సర్వహక్కులూ వారికి ఇచ్చేస్తూ వచ్చాడు.

ఎక్కడో పశ్చిమ బెంగాలులో పురూలియాలో ఒకమ్మాయి ఆయన రచనలు చదివింది. ఆమె మనసు ఆయనమీదకి పోయింది. ఆయనకి ఉత్తరం రాసింది. ఆవిడ పేరు లక్ష్మీదేవి. కొవ్వలికీ ఆమెతో పరిచయం పెరిగింది. ఫలితం... పురూలియాలో వారిద్దరికీ పెళ్ళి జరిగింది.

కొవ్వలి అప్పటి ప్రాచుర్యాన్ని చెప్పడానికి మిత్రులు వి.ఏ.కె. రంగారావు (2001లో) మాటలు... 'కొవ్వలి రెండు తరాలకి చదివే అలవాటుని కలుగచేశారు. రాజమండ్రి స్టేషన్లో, 60 ఏళ్ళక్రితం పుస్తకాలొక యాభై చేతపట్టుకుని ప్రతి కంపార్టుమెంటుకీ తిరిగి అమ్మినవ్యక్తి నా కళ్ళకి కట్టినట్టు జ్ఞాపకం. పుస్తకం వెల రూపాయి. పన్నెండణాలు అని బేరమాడితే తగ్గించేవారు. కొన్ని నవలల్లో శృంగారం పాలు ఎక్కువగా ఉంటుందని పెద్దలు మమ్మల్ని చదవనిచ్చేవారు కాదు'.

ఆ రోజుల్లో మడికట్టుకున్న పెద్దలకు ఇద్దరిమీదే ఆంక్ష- కొవ్వలి, చెలం. జాతికి ఒకరు అలవాటునీ ఒకరు ఆలోచననీ ప్రసాదించారు. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన చెలంగారి మాటల్లోనే వినాలి... ''నేను నూజివీడులో ఉండే రోజుల్లో ఒకబ్బాయి నన్ను పలకరించే ధైర్యంలేక దూరంగా నా వెనుక నడుస్తూండేవాడు. చివరికోరోజు నేను ధైర్యంచేసి 'ఏం కావాలి?' అని అడిగాను. అతను అధిక భక్తితో 'నేను బీదవాణ్ణి. మీ పుస్తకం ఒకటిస్తే దాన్ని చదివి తిరిగి మీకు ఇచ్చేస్తాను' అని అడిగాడు. నేను అతణ్ణి ఇంటికి తీసుకెళ్ళి నా పుస్తకం ఒకటి ఇచ్చాను. 'నేను అడిగింది చెలంగారి పుస్తకం కాదండీ, మీరు రాసిన పుస్తకం' అన్నాడు. నేను ఆశ్చర్యపడి చూశాను. 'నేనెవరనుకున్నావు?' అన్నాను. 'మీరు కొవ్వలి నరసింహారావు కాదా' అన్నాడు. 'కాదు. నేను చెలంని' అన్నాను. అతని ముఖంలో ఎంత disappointment!నాకు సాధ్యమైతే కొవ్వలి పుస్తకం ఒకటి కొని ఇచ్చేవాణ్ణి''- అదీ కొవ్వలి.

పుంఖానుపుంఖంగా రచనలు చేస్తున్న కొవ్వలి పేరు మద్రాసుదాకా పాకింది. రాజరాజేశ్వరీ ఫిలింస్‌ అధినేత కడారు నాగభూషణంగారూ వారి సతీమణి కన్నాంబగారూ ఆయనచేత సినిమా రచన చేయించాలని మద్రాసు పిలిపించారు. ఆ విధంగా కొవ్వలి వెుదటిచిత్రం 'తల్లిప్రేమ' రాశారు.

ఆయన రచయితగా నిరంకుశుడు. స్వాభిమానం కలవాడు. ఈ రెండూ సినిమారంగంలో చెల్లని విషయాలు. ఆ బ్యానర్‌కి రెండోచిత్రం 'దక్షయజ్ఞం'. సంభాషణా రచన పూర్తయ్యక నాగభూషణంగారితో చర్చకి కూర్చున్నారు ఓ రాత్రి. దక్షప్రజాపతికి క్లుప్తంగా సంభాషణలు రాశారు. ఆ పాత్రని ఎస్వీ రంగారావు చేస్తున్నారు కనుక మరింత విరివిగా మాటలుండాలన్నారు నిర్మాత. అది పాత్రౌచిత్యం కాదన్నారు రచయిత. మాటామాటా పెరిగింది. ''మేం డబ్బిస్తున్నాం. రాయాలి'' అని నిలదీశారు నాగభూషణం. అప్పుడు తెల్లవారుజామున నాలుగైంది. లేచి ఇంటికొచ్చేశారు కొవ్వలి. ఇంటికంటే రాజమండ్రికి.

ఆయనకి పాతికేళ్ళు వచ్చేసరికి 400 నవలలు ప్రచురితమయ్యాయి. ఆయన రచనలవల్ల ప్రచురణకర్తలు డబ్బు చేసుకున్నారుకానీ రచయితకేమీ మిగల్లేదు. భార్య ఆలోచనాపరురాలు. తామే పుస్తకాలను ప్రచురిస్తే? ఆ విధంగా కొవ్వలి బుక్‌ డిపో పుట్టింది. పుస్తకాల్ని ఎవరు వ్యాపారులకి చేర్చాలి? కొవ్వలే స్వయంగా వెళ్ళాల్సివచ్చేది. రచయితగా కాదు. తాను కొవ్వలికి ప్రతినిధినని చెప్పుకొనేవారు. ఈ సంస్థ నాలుగేళ్ళు నడిచింది. ఆయన వ్యాపారి కాడు. తత్కారణంగా వ్యాపారం అప్పుల్లోపడింది. రుణాలు పెరిగాయి. 1950వ సంవత్సరంలో ఓ రెండువందల రూపాయలు, ఏడాదిన్నర కొడుకునీ ఎత్తుకుని భార్యతో సహా మద్రాసు చేరారు.


సెంట్రల్‌ స్టేషన్‌కి ఎదురుగా రామస్వామి సత్రంలో కుటుంబాన్ని దింపి, మద్రాసులో పరిచయం ఉన్న ఒకే ఒక వ్యక్తి దగ్గరికి బయలుదేరారు. ఆయన రాజరాజేశ్వరీ ఫిలింస్‌లో పనిచేసేనాటికి అక్కడ ప్రొడక్షన్‌ మేనేజరు. పేరు డి.ఎల్‌. నారాయణ. అప్పటికి డి.ఎల్‌. 'దేవదాసు' తీసే ప్రయత్నంలో పురిటినొప్పులు పడుతున్నారు. కొవ్వలిగారిని చూసి కథ ఇస్తే అదే యూనిట్‌తో వెుదలెడతానన్నారు. కథలు కొవ్వలికి కొట్టినపిండి. అప్పుడే రాసిన 'మెత్తని దొంగ' నవలని ఇచ్చారు. అదే యూనిట్‌- అంటే దర్శకుడు వేదాంతం రాఘవయ్య, సంగీతం సుబ్బురామన్‌ ఇత్యాదులతో నిర్మాణం వెుదలైంది. గోవిందరాజుల సుబ్బారావు, రామచంద్ర కాశ్యప తదితరులు తారాగణం. దేవదాసులో ప్రముఖపాత్ర నటించవలసిన సావిత్రి ఇందులో గోవిందరాజులవారి పడుచుపెళ్ళాంగా చిన్న వేషం చేసింది. సినిమా- 'శాంతి'. ఆ సినిమాకి 1500 ఇచ్చారు. డి.ఎల్‌. భార్య పట్టుదలతో భర్తచేత స్థలం కొనిపించింది. డబ్బు లేకపోయినా పరువుగా బతకడానికి తమదంటూ ఓ నిలువ నీడ ఉండాలని. ఆ ఇల్లాలిది ఎంత సంకల్పబలవో- జీవితాంతం ఆ కుటుంబం ఆ పనే చేసింది. అక్కడే బతికింది. వెస్ట్‌ మాంబళంలో లక్ష్మీనారాయణ వీధిలో ఆ స్థలంలో ఓ పాక వేసుకున్నారు.

శాంతి చూసి బి.ఎస్‌.రంగా విక్రమ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థని ప్రారంభించి కొవ్వలి రచనతో 'మా గోపీ' తీశారు. తరవాత కాశీనాథ్‌ ప్రొడక్షన్స్‌వారి 'రామాంజనేయ యుద్ధం' (అమర్‌నాథ్‌, శ్రీరంజని). నిజానికి ఈ కథ రామాయణంలో లేదు. కల్పితం. తాండ్ర సుబ్రహ్మణ్యశాస్త్రి వీధి నాటకం ఆధారంగా సినిమా కథని రూపొందించారు. వారి సినిమాల్లో తొలిసారిగా వెండితెరకి పరిచయమైనవారు - సావిత్రి, కైకాల సత్యనారాయణ, పేకేటి శివరాం, చిన్నపిల్లగా చంద్రకళ.

ఒకపక్క సంతానం పెరుగుతోంది. తొమ్మిదిమంది పిల్లలు పుట్టారు. అందులో అయిదుగురు పోయారు. అవసరానికి ఆదాయం పెంచుకొనే ఆలోచనలేని వ్యక్తి కొవ్వలి. నవలలు మౌలికమైన కృషిగాకాక ఉపాధికి అవసరమయ్యాయి. ఓసారి ఆంధ్రపత్రికలో ఓ సీరియల్‌ 14 వారాలు వచ్చింది. నవలని డి.ఎల్‌. చదివి వెంటనే చిత్రాన్ని ప్రారంభించారు. ఆ సినిమా పేరు 'సిపాయి కూతురు'. ఆ సినిమాకి ఇచ్చిన పైకంతో కొన్న స్థలంలో రెండుగదులు వేసుకున్నారు. ఆ ఇల్లే ఆ కుటుంబానికి ఆద్యంతమూ 'పరువు'ని కాపాడే ముసుగైంది. ఇప్పటికీ జ్ఞాపకాల తోరణంగా మిగిలింది.

దాయానికి మించి అవసరాలు పెరిగిపోయాయి. సంసారం భారమైంది. ఎవరిముందూ చెయ్యిజాచే అలవాటులేని కొవ్వలికి గడ్డురోజులు ప్రారంభమయ్యాయి. ఎవరినీ సినిమా ఛాన్సు అడిగిన పాపానపోలేదు. పిలిస్తే తప్ప, ఏ సంస్థ గడపా తొక్కలేదు. తను రాసే రచనలమీదే పూర్తిగా ఆధారపడవలసి వచ్చింది. ఆ దశలోనే- 1953 డిసెంబరులో కొవ్వలి తండ్రి పోయారు. శవాన్ని తీయడానికి చేతిలో పైకం లేదు. రూపాయి వడ్డీకి వెయ్యి రూపాయలు అప్పుచేసి జరిపించారు. ఆ అప్పు తీర్చడానికి ఆయనకి 15 సంవత్సరాలు పట్టింది.

జీవితం మరొక మలుపు తిరిగింది. ఇది మలుపు కాదు, పెద్ద అగడ్త. దాటలేనంత లోతైనదీ దాటక తప్పనిదీను. పాత మద్రాసులో ఎం.వి.ఎస్‌. సంస్థ పుస్తకాలను ప్రచురించేది. ఉద్యమంగా ప్రారంభమైన రచన ఇప్పుడు ఉపాధి అయింది. అంతేకాదు, పెరిగిన సంసారానికి ఇది బొత్తిగా చాలని ఆదాయమయింది. పుస్తకం రాశాక ప్రచురణకర్త డబ్బు ఇస్తేనే ఇంటికి వెచ్చాలు వచ్చేవి. అవీ చాలీచాలనంత. కళని అవసరానికి కుదించినప్పుడు ఎంతోకొంత రాజీ సహజం. కానీ ఆ రోజుల్లో ఆయన రాసిన చారిత్రక, అపరాధ పరిశోధక రచనలు ఈనాటి హ్యారీపోటర్‌కి ఏమాత్రం తీసిపోనివి. రచయితని ఓ ఇంటి అవసరం ఏమాత్రం ఓడించని దశ అది. ఇంటిల్లపాదీ నవల పూర్తికావడానికి ఆతృతతో - ఆ మాట సరికాదు - ఆకలితో ఎదురుచూసేవారు. నవల పూర్తికాగానే డబ్బూ సరుకులూ వచ్చేవి. కానీ సమృద్ధిగా కాదు. పుస్తకానికీ పుస్తకానికీ మధ్య - ఇంటిల్లపాదీ కడుపులూ నకనకలాడిపోయేవి. అప్పుడు దారేది? ప్రతి రచనకీ 12 కాంప్లిమెంటరీ కాపీలు ఇచ్చేవారు. పుస్తకం మార్కెట్‌ ధర రూపాయి పావలా. కానీ ఆ పన్నెండు పుస్తకాల్ని పట్టుకొని పెద్దకొడుకు పానగల్‌ పార్క్‌, రాజకుమారి థియేటర్‌ పేవ్‌మెంట్‌మీద నిలబడి అమ్మేవాడు. ఎంతకి? ఒక్కొక్కటి 30 పైసలు. 12 పుస్తకాలకీ 3 రూపాయల 60 పైసలు వచ్చేది. దారినపోయే పాఠకులు కరుణిస్తే 4 రూపాయలు దక్కేది. ఆ డబ్బుతో 'పడి'బియ్యం, తండ్రికి పొగాకు, లవంగాలు, కొత్త నవల రచనకు స్కైర్‌ (24) తెల్లకాగితాలు తెచ్చేవాడు. మరో రెండుమూడు రోజులు గడిచేవి. ఇవి కొనగా ఒక రూపాయి మిగిలేది. ఆ రూపాయితో కుటుంబమంతా మరో నవల తయారయ్యేవరకూ బతకాలి. ఎలాగ? పిండిమరల్లో బియ్యం, అపరాలు ఆడేవారు. తెచ్చిన గిన్నెలకు ఎత్తగా చుట్టూ కొంత పిండి చేరేది. ఇది రకరకాల పప్పులు, ఇతర దినుసుల కలగాపులగం. దీన్ని 'వేస్ట్‌ మావ్‌' అనేవారు. సాయంకాలానికి ఆ పిండిని ఎంతోకొంత ధరకి అమ్మేవారు. అది ఇంటి మనుషులకని చెప్పడానికి మనసు ఒప్పేదికాదు. 'ఇంట్లో పశువుకని చెప్పు' అని పరువుకి 'అబద్దం' తెరని కప్పేది తల్లి. ఆ పిండిని తెచ్చాక- జల్లించి, కడిగి, చెత్తని ఏరి, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయముక్కలూ కలిపి, పల్చని నీళ్ళ మజ్జిగతో దోసెలు పోసి అందరికీ పెట్టేది ఇల్లాలు. వచ్చిన అతిథులెవరైనా ఉంటే- పరువుని కాపాడుకోడానికి ఆ కాస్త ఆహారంలోనే వారికి వాటా! అయితే, ఇంట్లో ముగ్గురు పసికందులు. వాళ్ళకి ఈ ఆహారం పడేదికాదు. మరి మార్గాంతరం? కొవ్వలి రెండుమూడు కిరాణా దుకాణాలకి వెళ్ళి బియ్యం నాణ్యాన్ని చూస్తున్నట్టుగా బేరం ఆడి, శాంపిలుగా చిన్నచిన్న పొట్లాలు కట్టించుకుని తెచ్చేవారు. అలా తెచ్చిన నాలుగైదు పిడికిళ్ళ బియ్యాన్ని ఉడికించి పసికందుల కడుపు నింపేదాతల్లి. ఏనాడూ ఇది కావాలనీ ఇదిలేదనీ అడగడం తెలియని లక్ష్మీదేవి ఆమె. మళ్ళీ కొత్త నవల తయారు - మరో నాలుగు రోజులు - పండగ భోజనం.

కొవ్వలి జీవితంలో రెండోదశ రచనలు పేదరికాన్నీ ఆత్మాభిమానాన్నీ కలనేతగా, పడుగుపేకలుగా అల్లిన 'జీవుని వేదన'కి పుట్టిన బిడ్డలు. కానీ ఆనాడు 'భయంకర్‌' అనే కలంపేరుతో రాసిన 'చాటుమనిషి'లాంటి అద్భుతమైన సీరియల్సూ 'విషకన్య'వంటి జానపదాలూ ఇరవైఅయిదు భాగాల 'జగజ్జాణ'- ఈ పేదరికం తెర పరుచుకోకుండా కళ్ళు తెరిచిన సుస్నిగ్ధ మందారాలు.

ఎప్పుడైనా - మరీ అరుదుగా - తప్పనిసరైనప్పుడు - నోరు విడిచి ఇద్దరినే అప్పు అడిగిన సందర్భాలున్నాయి. వారిద్దరూ - ముదిగొండ లింగమూర్తి, బోళ్ళ సుబ్బారావు. ఎంత అప్పు? ఒకటి రెండు రూపాయలు. ఆ డబ్బుతో ఎన్ని దోసెలు! అతిథులకి ఎన్ని సత్కారాలు! సమతుల్యంగా మరొకపక్క ఎంత సాహితీ వ్యవసాయం!

అప్పుడూ తన సెన్సాఫ్‌ హ్యూమర్‌ కోల్పోలేదాయన. తూట్లుపడిన, మాసికలు వేసిన పంచెల్ని కట్టుకుని 'నేను ఏక వస్త్ర ధారుడినే' అనేవారు భార్యతో. ఆ ఇల్లాలు గుండె ఆ సమయంలో ఎంతగా ఛిన్నమయేదో- కొద్దికాలానికే బయటపడింది. ఆయన సినిమా పరిచయాల్ని పురస్కరించుకొని ప్రీవ్యూలకీ ఇతర సభలకీ ఆహ్వానాలు వచ్చేవి. కానీ పరువయిన బట్టలు లేని కారణానే ఇల్లు దాటేవారు కాదు కొవ్వలి.

తలకుమించిన వేదనల కడలిలో తలమునకలై, బిడ్డలకి కడుపారా అన్నమైనా పెట్టుకోలేని తల్లి ఏమౌతుందో మనకు చరిత్ర సాక్ష్యముంది... చార్లీచాప్లిన్‌ తల్లి. అదే లక్ష్మీదేవి విషయంలోనూ జరిగింది. పిల్లల్ని సరిగ్గా పోషించలేని నిర్వీర్యతా, రేపు మీద బొత్తిగా ఆశలు లేని జీవితం ఆమె మనస్థిమితాన్ని ఫణంగా తీసుకున్నాయి. ఆమెకి మతి తప్పింది. ఆఖరి రోజుల్లో - ఆమె 45వ యేటికే - చెప్పరాని అపస్మారంలోకి వెళ్ళిపోయింది. వాస్తవం నుంచి మనస్సు తీసుకునే భయంకరమైన 'పరారి' మతి చలనం. కూతుళ్ళు రాజ్యలక్ష్మి, రత్నలత తల్లికి తల్లియైు సాకేరు. జడవేసి అన్నం తినిపించారు. బట్ట కట్టారు. ఇలాంటి కథలకి ఒక్కచోటే ఆటవిడుపు - మృత్యువు. మరో రెండేళ్ళకి ఆ ఇల్లాలు - తన 48వ ఏట కన్నుమూసింది.

కొవ్వలి? కలం కథలు చెప్పేది. కానీ చుట్టూ ఉన్న జీవితం క్రమంగా తన కలల్ని మట్టుబెట్టేది. అన్ని వేలమంది హృదయాలను ఆర్ద్రం చేయగలిగిన రచయిత హృదయం నిశ్శబ్దంగా విచ్ఛిన్నం కావడం ప్రారంభించింది. ఆ దుఃఖానికీ తన ఆత్మాభిమానం బలమైన తెరవేసి తనకే మిగిల్చింది. కొవ్వలి సహధర్మచారిణి లేని జీవితం - కేవలం రెండేళ్ళే సాగింది. ఆయన రాసిన 1001 నవల పేరు 'కవి భీమన్న'. (అవును, ఆయన వెయ్యి నవలలు రాశారు!) వేములవాడ భీమకవి జీవితం ఆధారంగా రచించిన చారిత్రక నవల అది. చివరి రోజున ద్రాక్షారామ భీమేశ్వరుడిని దర్శించుకున్నారు. మరునాడు (1975 జూన్‌ 8) వేకువజామునే జీవితం నుంచి సెలవు తీసుకున్నారు.


ద్రాసు, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు ఆయన కృషికి యోగ్యతా పత్రాలిచ్చాయి. కానీ తన కూతురుపెళ్ళికి పదివేలు కావాలని ఆయన - నోరువిడిచి - భారత విద్యాశాఖకి పెట్టుకున్న ఆర్జీకి సమాధానంగా నెలకి 50 రూపాయలిచ్చారు.

తెలుగు చదవడాన్ని కొన్ని తరాలకు కొట్టినపిండిగా మార్చడం ఎంతటి ఘనతరమైన విప్లవవో - తెలుగు అక్షరాలు కూడా పిల్లలచేత చదివించలేని దుస్థితిలో ఉన్న మనకి బాగా అర్థమవుతుంది. చచ్చినవారి సమాధుల మీద పువ్వులు వేయడం కేవలం సెంటిమెంటల్‌ రొటీను. మహాత్మాగాంధీకే ఆ తద్దినం తప్పలేదు. అయితే వంశక్షయమని ఈసడించే ఛాందసులనుంచి - తిండీ గుడ్డా పెట్టని ఈ చదువెందుకని తుంగలోతొక్కే దశకి తెలుగు వైభవం ప్రయాణం చేసిన నేపథ్యంలో ఇలాంటి రచయిత జ్ఞాపకం- తెలుగింటి పిల్లలకి రెండు తెలుగు అక్షరాలు నేర్పాలనే ఉత్సాహాన్ని కలిగిస్తే- కొవ్వలి ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతిస్తుంది.

- గొల్లపూడి మారుతీరావు



Wednesday, October 08, 2008

మతాతీతం

మతప్రమేయం లేకుండా న్యాయం జరగదా? అన్న టపా చదివిన, వ్యాఖ్యలు రాసిన వారందరికీ కృతజ్ఞతలు. శ్రవణ్ రాసిన వ్యాఖ్య -

"మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. తప్పు ఎవరు చేసినా తప్పే. అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించడానికి ధనమో, మతమో, నాయకుల మద్దతో కావాల్సి రావడం అత్యంత హేయమయినది. మతమార్పిడి మీద మీ అభిప్రాయాలతో ఏకీభవించలేను. యెవడి ఇష్టం వాడిది. ఎవడికి ఏది మంచిదో వాణ్ణే నిర్ణయించుకోనియ్యండి. ఓపిక ఉంటే మీ(మన) మతం ఎందుకు గొప్పదో చెప్పండి (ప్రచారం చేయండి). మీరు చెప్పేది "కాంగ్రేసు వాడు డబ్బులు తింటున్నాడు తెలుగుదేశానికి వోటేయ" మని చంద్రబాబు చెప్పినట్టుంది."

నాకు తెలిసీ మతం మార్పిడి గురించి నేనేమీ ఎక్కడా నా అభిప్రాయం చెప్పినట్లు లేదు. నిజంగా అన్నిమతాలూ ఒక్కటేనన్న సూక్ష్మం తెలిస్తే మతం మారమని ఎవరూ బలవంతపెట్టరు. బలవంతంగా డబ్బులిచ్చో, భయపెట్టో మతం మార్పిస్తే ఏనాటికైనా ఇప్పుడున్న పరిస్థితి వచ్చేదే. చాలామంది అనుకుంటున్నట్లు యెవరి ఇష్టం బట్టి వాళ్ళు,ఎవడికి ఏది మంచిదో వాళ్ళే నిర్ణయించుకొనే పరిస్థితే ఉండి ఉంటే మన దేశంలో ఓవేయిమంది క్రీష్టియన్లు, ఓ పదిహేనువందల మంది ముస్లింలు ఉండి ఉండేవారు- పార్శీలలాగా.

క్రీష్టియన్లు మన ఆలోచనలని చాలా ప్రభావితం చేసారు. మనం సహగమనాన్ని వదులుకోగలిగామన్నా, వితంతు వివాహలని ప్రోత్సహించగలిగినా, అస్పృశ్యత తప్పని కనీస స్పృహ చాలా మందిలో కలిగించామన్నా వాళ్ళ ప్రభావం ఉంది. అంతమాత్రాన హిందూ మతం చెత్తదీ, వేరే మతాలు గొప్పవీ అయిపోవు. మతమార్పిడి అభ్యుదయం కానీ, అవసరం కానీ అవదు. ఒకరి నుండి ఒకరు నేర్చుకోవలసినది ఉంది క్రైస్తవుల సేవాభావాన్ని, మానవత్వాన్ని బ్రాహ్మల (హిందువుల) మూర్ఖత్వాన్ని శ్రీపాదవారు తమ కథల్లో ఎత్తిచూపారు. ఆరోజుల్లో కూడా ఇంత బాహాటంగా పరమతాన్నిపొగడుతూ రాయడం, జనాలు పట్టించుకోకపోవడం తో ఇప్పడు పెరిగిన అసహనాన్ని పోల్చండి. అది కేవలం ఏకపక్షంగా కేవలం బజరంగదళ్, వీహెచ్ పీ ల వల్ల పెరిగిన అసహనం కాదని తేలికగా చెప్పచ్చు. దీనికి జేయెన్యూ డిగ్రీలో, మెన్సా రేటింగులో అవసరం లేదు. మతోన్మాదం అస్సలవసరం లేదు. వాళ్ళు చేస్తున్న అరాచకాలకి ఇది సమర్ధన కాదు. వాళ్ళు హిందువులు కారు, 80 శాతం జనాభాకి ప్రతినిధులు అసలే కారు. నాకు తెలిసీ హిందూమతంలోని ఏపురాణంలోనూ, ఉపనిషత్తులోనూ ఈరకమైన హింసాత్మకత విధించబడలేదు.

చెప్పే విషయం ఏంటంటే, మతాల మధ్య మార్పిళ్ళ పోటీ మంచిదికాదని. ప్రభుత్వం నిఖార్సుగా మతాతీతం గా వ్యవహరిస్తే ఈసమస్యలు వచ్చుండేవి కావు. షా బానో, ముద్గల్ లాంటి కేసుల్లో సుప్రీం కోర్టు యూనిఫాం సివిల్ కోడ్ ఆవశ్యకత గురించి సూచించినా ఏవో వంకలతో కాలం గడిపేస్తున్న తీరు దేశప్రయోజనలాకి ఏరకంగా ఉపయోగపడుతుంది?

Saturday, October 04, 2008

మతప్రమేయం లేకుండా న్యాయం జరగదా?

నిన్న పేపర్లో వార్త - 4 held, Cop suspended; Centre Acts tough. 40 రోజులక్రితం, అగస్టు 25న కాంధమల్ జిల్లాలో ఒక నన్ ని గ్యాంగ్ రేప్ చేసారు. దానికి స్పందనగా ఇప్పుడు ఓనలుగురిని పట్టుకున్నారట, ఒక పోలీసుని సస్పెండు చేసారట. ప్రధానమంత్రిగారు, హోంమంత్రిగారు తమ ఒరిస్సా ప్రభుత్వానికి తమ అసంతృప్తిని తెలిపారు. తమ ప్రధానమంత్రిగారు ఇటీవల విదేశపర్యటన చేసినప్పుడు, యూరోపియన్ ప్రభుత్వాధినేతలు క్రష్టియన్ల మీద భారతదేశంలో జరుగుతున్న హింస తమ నిరసన వెలిబుచ్చారు. దాంతో బయటి దేశాల్లో మన కి చెడ్డపేరొచ్చిందని బాధపడి పోయారా పెద్దాయన.

వివరాలు చూస్తే, 2000 మంది జనాలు దాడిచేసి ఫాదర్ని కొట్టి నన్ ని ఈడ్చుకెళ్ళి రేప్ చేసారని కధనం. పైగా భారత్ మాతాకీ జై అని నినాదాలతో తీసికెళ్ళారట. మాతా అని అరిచినప్పుడైనా తాము తీసుకెళ్తోన్నది ఒక తల్లినే అన్న స్పృహ వాళ్ళకి కలగక పోవడం విచారకరం. స్త్రీలని గౌరవించే సాంప్రదాయం మనదని గర్వించే వాళ్ళెవరైనా ఉంటే సిగ్గుతో తలదించుకోండి. మనుషులమేనా అని అనుమానం వస్తోంది. ఒక అమాయకురాలు ఇలాంటి దారుణానికి గురవడం నాకు అంత బాధకలిగించలేదు. అయ్యో అనిపించింది. కానీ నిజంగా బాధకలిగించిన విషయమేమిటంటే, ఇంత పెద్దలెవెల్లోకి విషయం వెళ్తే కానీ ఒకబాధితురాలికి న్యాయం జరిగే దిశగా చిన్న అడుగుకూడా పడకపోవడం. ఎంతమంది బాధితుల గోడు విదేశాల అధినేతలకి, తద్వారా మన దేశాధినేతలకి చేరుతుంది? కులమతాలో, ధనమో, పలుకుబడో ఉంటేకానీ కనీసన్యాయం జరగని పరిస్థితిలో మన సామాన్యప్రజలున్నారా? ఇవీ జవాబురావల్సిన ప్రశ్నలు. అంతేకానీ మతాలూ మట్టిగడ్డలూ కాదు.

ఒకసారి మళ్ళీ ఘటన విషయానికొస్తే, పోలీసులున్నారట కానీ వాళ్ళేమీ చేయలేకపోయారట (వార్తా కధనం రుచిగా ఉండడం కోసం - పోలీసులు ఆవిడ అరుపుల్ని పట్టించుకోలేదు, మొహం తిప్పుకున్నారు అని రాసారు). పాపం పోలీసులు పట్టించుకుంటే ఒక సమస్య, పట్టించుకోకపోతే ఇంకో సమస్య. ఎలాగైనా వాళ్ళబతుకులు అరిటాకులే. ఒక చదువుకున్నాయనే ఆమధ్య జరిగిన ముంబై బాంబు పేలుళ్ళ సందర్భంగా ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో రాస్తూ పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని రాసారు. చదవేస్తే ఉన్నమతి పోసినట్లు, ఆధారాలని బట్టి వ్యవహరించకుండా సెక్యులరిజం చూపెట్టుకోవాలంటే పట్టుకున్న ప్రతీ ముస్లింకి ఒక నిర్ణీత నిష్పత్తిలో వేరే మతస్తులని కూడా అరెస్టు చేయాలన్న ధోరణిలో రాసుకుంటూ పోయాడు. పైగా విమానాశ్రయాల్లో ముస్లింల టోపీలెత్తి మరీ పరీక్షించారని బాధపడిపోయాడు. ఆయనకి తెలియదా మతంతో సంబంధం లేకుండా బట్టలిప్పి మరీ పరీక్షిస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు. ఈరకం లౌకికవాదం ఫేషనయి పోయింది. చదువరి టపాకొచ్చిన వ్యాఖ్యలలో ఈరకం వాదాలు కనిపిస్తాయి. హిందువులది తప్పు, గుజరాత్ లో కడుపు చీల్చి చంపారు ..., గణాంకాలూ, అర్ధసత్యాలూ, ఏకపక్షవాదనలు.. అన్నీ. హైదరాబాదు అల్లర్లప్పుడు కూడా ఒకవర్గంవారు ఇలాంటి అకృత్యాలకి పాల్పడ్డారని వినేవాళ్ళం. హింసా ప్రవృత్తి కి కులమతాలతో సంబంధంలేదు. ఒళ్ళుమండితే పరశురాముడైనా హింసకి ఒడంబడుతాడు. పోలీసు వ్యవస్థని దానిమానాన దాన్ని పనిచేయనిస్తే చాలా సమస్యలు మొగ్గదశలోనే పోయుండేవి.

ఇది రాస్తుంటే ఒకవార్త చదివా. బలే మజా వచ్చింది. బీనా (మధ్యప్రదేశ్)లో గైల్వే ఆస్తుల ఆక్రమణదారులచేత ఖాళీ చేయిస్తుంటే అడ్డుపడ్డాడని ఒక పార్లమెంటు సభ్యుడిని చితకబాది హాస్పిటల్లో పాడేసారట. అన్యాయానికి, అక్రమాలకి కొమ్ముకాసేవాళ్ళకి ఇదే సన్మానం చేస్తే చాలా సమస్యలు తగ్గుతాయి.

ఈటపా రాస్తూంటే, ఈరోజు వార్త - ఒరిస్సాలో ఇంకో అమ్మాయిని సామూహికంగా చెరిచారట. ఆఅమ్మాయి క్రీష్టియన్లు నడిపే ఆర్ఫనేజ్ లో ఉంటుందట. ఆర్ఫనేజ్ మీద దాడి చేసినప్పుడు ఈదుష్కార్యం చేసారట. ఎటొచ్చీ ఆఅమ్మాయిని క్రీష్టియన్ అనుకున్నారట కానీ ఫాదర్ మాత్రం ఆఅమ్మాయి హిందువని చెప్పాడు. మళ్ళీ పైన చెప్పినదే తిరిగి చెప్తున్నా. క్రీష్టియనా, హిందువా అని చూడాల్సిన అవసరం ఉందా- మనసాటి ఆడబడుచే కదా వెంటనే దోషుల్ని పట్టుకునే/పట్టించే పని చూడడం మానవ ధర్మం కదా.

అసలు ఏదైనా ఘోరం జరిగనప్పుడు, వీళ్ళు చేసారా, వాళ్ళు చేసారా అన్న మీమాంస పక్కన పెట్టి, తప్పు చేసినవాడిని శిక్షించే మార్గం లేదా. ఉంది కానీ ఎవరీకీ పట్టదు. రోజువారి ఎందరో అమాయకులు రకరకాల అన్యాయాలకీ, అక్రమాలకీ గురవుతున్నారు. దీనికి మూలం తప్పుచేసినవారిని హీరోల్లాగా చిత్రీకరించడం. వాళ్ళకి అసెంబ్లీ, పార్లమెంటుసీట్లివ్వడం, వాళ్ళమీద సినిమాలు తీయడం ఫేషన్. కలకాలం మామూలు మనిషిగా ఉండేకన్నా, మూడునిమిషాలు ముమైత్ ఖాన్ లా వెలగడం మిన్న అన్న భావన జనాలకొచ్చేసింది. మతకలహాలకి మూలం మతాలమధ్య పోటీతత్వం. మొదట్లోనే మతాన్ని దానిమానాన దాన్ని వదిలేస్తే ఇన్ని సమస్యలుండేవి కాదు. ఎప్పుడైతే ఒకమతంవాళ్ళని పాపం అని చంకనెత్తుకున్నారో అప్పటినుండి మనకీ సమస్యలు. లౌకికవాదం అంటే అన్ని మతాలకీ అతీతంగా ఉండాలని. అంతేకానీ తక్కువ జనాభావాళ్ళు ఇష్టులని ప్రవర్తించడంకాదు. అదేంటో ఏంచేసినా ఒకవర్గం వాళ్ళ కొమ్ముకాయడమే సెక్యులరిజం అని చదువుకున్న వాళ్లకి చాలా బలంగా అనిపించడం శోచనీయం. చదవేస్తేఉన్న మతిపోవడమంటే ఇదే. మీఇంట్లోనే ఇద్దరు పిల్లలుంటే, వాళ్ళల్లో ఒకరిని వరుసగా సమర్ధించి చూడండి - మీరు న్యాయంగా తీర్పు చెప్పినా కూడా- నాన్న (అమ్మ) ఎప్పుడూ ఇంతే ఎప్పుడూ తమ్ముడి (అక్క)నే సప్పోర్టు చేస్తాడు అని భావిస్తారు. అన్యాయంగా ఒకరినే సమర్ధించి చూడండి! ఒక కుటుంబం లోనే ఇలాఉంటే, ఊరిజనాలమధ్య అవగాహన, సుసంబంధాలూ ఎంత కష్టం?

తమమతంలో వివక్షకి గురయినప్పుడు మతం మారితే తప్పేమిటి అని చాలామంది వాదిస్తున్నారు. మతం మారిన తర్వాత కొత్తమతంలో వీరికి వివాహాదుల విషయంలో సమాన స్థాయి లభిస్తోందని వీరు భావిస్తోంటే, వీరికన్నా ఉష్ట్రపక్షి బెటరు.

ఇప్పుడైనా ప్రభుత్వం మతాలని పక్కన పెట్టి దేశం ముఖ్యం, మతాలేమైనా మాకు పర్వాలేదు అని పాలిస్తే చాలా సమస్యలు పరిష్కరించబడతాయి. మనుషులమధ్య అడ్డుగోడలు కల్పించే మతాలెందుకు?

Thursday, October 02, 2008

మినీ గడి

ఈనెల గడి ఇంకా రాలేదని కొందరు నిరుత్సాహపడడం గమనించి ఓ మినీ గడి తయారు చేసా. కేవలం బ్లాగు నామాల తో పూరించాల్సిన గడి. కూడళ్ళ జోలికి పోకుండా పూరించడానికి ప్రయత్నించండి. సరియైన సమాధానాలని 29 తో భాగించి వందతో గుణిస్తే వచ్చే సంఖ్య మీ తె.బి.క్యూ. (B.Q.) – Telugu Blog Quotient. మీరు సమాధానాలు పంపండి- తెబీక్యూ నేను చెప్తా. ఈగడిలో కేవలం కొన్ని బ్లాగుల పేర్లనే వాడా. ఇది కేవలం సౌకర్యం కోసమే కానీ బ్లాగుల ప్రతిష్ఠ, వాసి, రాసులతో సంబంధం లేదని మనవి చేసుకుంటున్నా. సాధ్యమైనంతవరకూ ఒళ్ళుదగ్గర పెట్టుకునే ఆధారాలు రాసా- మరీ చప్పగా ఉంటుందని కొద్దిగా పెప్పరేసా, అయినా ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేస్తే తొలగిస్తా. ఈమధ్యకాలంలో జనాల మనోభావాలు తెగదెబ్బతింటున్నాయి కదా. మా చింతలబస్తీలో మొన్న మనోభావాలు దెబ్బతిని కొట్టుకున్నారట కూడా!

ఈ గడిని పొద్దుకు కూడా పంపిస్తున్నా. అక్కడ ఇమడగలిగితే, వారు ప్రచురిస్తారు. అక్కడే మీరు పూరించచ్చు. మినీగడి వర్డు ఫైలు ఈస్నిప్సు డాట్ కాం లో పెట్టా. దింపండి, నింపండి, పంపండి. మీ సౌకర్యార్ధం సోమవారం పొద్దులో వస్తుంది


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27


ఆధారాలు - అడ్డం
1. వేడివేడిగా పదునుగా ఎండగట్టే బ్లాగు
3. సేదతీరుదామని ఈబ్లాగుకొస్తే -రోజుకో టపా గారంటీ కానీ - వేడీ, వాదం తప్పవు- సీతారాములెలా ఉండేవారో పాపం
5. కందం తెలిసిన బ్యూటిఫుల్ బ్లాగు
7. తెలుగు వెనక్కి తూలితే ... ఈచుట్టుపక్కలంతా తెలుగే తెలుగు
8. బ్లాగరే మనిషైతే .. బ్లాగు జంతువవదుకదా
9. శబ్దం. కానీ కృష్ణుడూదేది - ఐదులో పుట్టినది -సముద్రం లోదొరికేది ముందు కలిపితే బ్లాగు పేరు.
10. నిజం బ్లాగు అబద్ధాలు చెప్తోందని నిజాలు చెప్పడానికి ఈబ్లాగు వచ్చింది. నిజాలూ, అబద్ధాలూ కలిసే పోయాయి.
11. ' - - ' లోకానికి స్వాగతం చెప్పే బ్లాగు
12. ఈవిడ మాది అనిచెప్పేది మాదికూడానూ.. అక్కడ ఎక్కడ చూసినా వరే.
14. స్కిల్
16. పేరులో హస్కింగు - టపాల్లో పౌండింగు
18. శాస్త్రిని కాదని ఆయన ఇంటి పేరును వాడుకున్న బ్లాగు
19. ఇన్మై దిల్లని చెప్పే నాన్-టేక్కీల హృదయానికి కూడా హత్తుకునే బ్లాగు - ఒకేపేరుతో రెండు బ్లాగులున్నాయి - ఒకటి 3-డాట్, ఇంకోటి 5-డాట్ బ్లాగు - అవునూ, ఇంతకీ - దిల్మేనా?
21. లెక్కల్లో పూరేమో గానీ, హాస్యంలో ఘుమఘుమలాడే మరిగే నీళ్ళలాంటివాడు
23. పుస్తకాలు చదువుతారా బార్బేరియస్ - ఈవిడ బ్లాగు చదివితే పోలే
24. వంటల బ్లాగు గురూ అని గుర్తు చేసే బ్లాగు
26. ఈ జోకులు మనదేశానివేనట - ఇంకో రెండురోజుల్లో విజయదశమి పెట్టుకుని మీతో అబద్ధమా
27. న్యూనిబ్ - ఓల్డ్సిరా - అందుకే ఎడాపెడా రాతలు

ఆధారాలు - నిలువు
1. గుర్రాలతో నడిచేబండి, ఎన్టీఆర్ తెచ్చిన చైతన్యంతో రానాల బండిగా మారింది. నాటి -నేటి విషయాలందించే తెలుగున్న ప్రతిభావంత బ్లాగు
2. తలకిందులైనా తెలుగు తెలుగే - మిత్రుడు తిన్నంగా ఉంటే చాలుగా
4. కవితల మహా బ్లాగు - కిందనించి పైకి - నాల్గో అక్షరం సరియైన ప్లేసే - మేఘసందేశాలు పంపడం తెలియక పోయినా బ్లాగడం తెలిసిన ముగ్ధ మనోహర బ్లాగు.
6. కింద పెట్టినా పైకి రాగలిగేది - బాదరాయణుడి భిక్ష - ఒక పండితుడి బ్లాగు
10. ప్రథమా విభక్తి ప్రత్యయం తో బహువచనం చేయండి - మంచి స్వరభరితమైన బ్లాగొస్తుంది
13. తెలుగు ఆచార్యుల వారి బ్లాగింటి పేరే సాగదీస్తేఎలా..
15. ఆస్సిన్ ఫోటోలనే భ్రాంతి కలిగించి మభ్యపెట్టే శీర్షిక తో టపా రాసిన బ్లాగ్ట్రావెలర్ - అవుడియా కింగు
17. ' do not put all your eggs in the same basket' అని విని తన కూరల్ని వేర్వేరు బుట్టల్లో సర్దిన బ్లాగా ? ఎక్కడ సర్దినా ఈయన కూరల రుచి అనితర సాధ్యం
20. మంచిరుచైన టపాలందించే జ్ఞానమయ బ్లాగు
22. ఈపిల్లాడు తెలుగు గడుగ్గాయి - తికమక పెట్టేస్తాడు - గ్రామర్ నేర్చుకుంటున్నాడట బడాయి- గజడదబల్ని కచటతపలు చేస్తున్నాడు -గోపాళానికి చెప్తే సరి.
25. మునిసిపాలిటీ బండిలో వేస్తారా - ఇంకా నయం. ఇది కథల బ్లాగండీ బాబూ