Wednesday, October 08, 2008

మతాతీతం

మతప్రమేయం లేకుండా న్యాయం జరగదా? అన్న టపా చదివిన, వ్యాఖ్యలు రాసిన వారందరికీ కృతజ్ఞతలు. శ్రవణ్ రాసిన వ్యాఖ్య -

"మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. తప్పు ఎవరు చేసినా తప్పే. అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించడానికి ధనమో, మతమో, నాయకుల మద్దతో కావాల్సి రావడం అత్యంత హేయమయినది. మతమార్పిడి మీద మీ అభిప్రాయాలతో ఏకీభవించలేను. యెవడి ఇష్టం వాడిది. ఎవడికి ఏది మంచిదో వాణ్ణే నిర్ణయించుకోనియ్యండి. ఓపిక ఉంటే మీ(మన) మతం ఎందుకు గొప్పదో చెప్పండి (ప్రచారం చేయండి). మీరు చెప్పేది "కాంగ్రేసు వాడు డబ్బులు తింటున్నాడు తెలుగుదేశానికి వోటేయ" మని చంద్రబాబు చెప్పినట్టుంది."

నాకు తెలిసీ మతం మార్పిడి గురించి నేనేమీ ఎక్కడా నా అభిప్రాయం చెప్పినట్లు లేదు. నిజంగా అన్నిమతాలూ ఒక్కటేనన్న సూక్ష్మం తెలిస్తే మతం మారమని ఎవరూ బలవంతపెట్టరు. బలవంతంగా డబ్బులిచ్చో, భయపెట్టో మతం మార్పిస్తే ఏనాటికైనా ఇప్పుడున్న పరిస్థితి వచ్చేదే. చాలామంది అనుకుంటున్నట్లు యెవరి ఇష్టం బట్టి వాళ్ళు,ఎవడికి ఏది మంచిదో వాళ్ళే నిర్ణయించుకొనే పరిస్థితే ఉండి ఉంటే మన దేశంలో ఓవేయిమంది క్రీష్టియన్లు, ఓ పదిహేనువందల మంది ముస్లింలు ఉండి ఉండేవారు- పార్శీలలాగా.

క్రీష్టియన్లు మన ఆలోచనలని చాలా ప్రభావితం చేసారు. మనం సహగమనాన్ని వదులుకోగలిగామన్నా, వితంతు వివాహలని ప్రోత్సహించగలిగినా, అస్పృశ్యత తప్పని కనీస స్పృహ చాలా మందిలో కలిగించామన్నా వాళ్ళ ప్రభావం ఉంది. అంతమాత్రాన హిందూ మతం చెత్తదీ, వేరే మతాలు గొప్పవీ అయిపోవు. మతమార్పిడి అభ్యుదయం కానీ, అవసరం కానీ అవదు. ఒకరి నుండి ఒకరు నేర్చుకోవలసినది ఉంది క్రైస్తవుల సేవాభావాన్ని, మానవత్వాన్ని బ్రాహ్మల (హిందువుల) మూర్ఖత్వాన్ని శ్రీపాదవారు తమ కథల్లో ఎత్తిచూపారు. ఆరోజుల్లో కూడా ఇంత బాహాటంగా పరమతాన్నిపొగడుతూ రాయడం, జనాలు పట్టించుకోకపోవడం తో ఇప్పడు పెరిగిన అసహనాన్ని పోల్చండి. అది కేవలం ఏకపక్షంగా కేవలం బజరంగదళ్, వీహెచ్ పీ ల వల్ల పెరిగిన అసహనం కాదని తేలికగా చెప్పచ్చు. దీనికి జేయెన్యూ డిగ్రీలో, మెన్సా రేటింగులో అవసరం లేదు. మతోన్మాదం అస్సలవసరం లేదు. వాళ్ళు చేస్తున్న అరాచకాలకి ఇది సమర్ధన కాదు. వాళ్ళు హిందువులు కారు, 80 శాతం జనాభాకి ప్రతినిధులు అసలే కారు. నాకు తెలిసీ హిందూమతంలోని ఏపురాణంలోనూ, ఉపనిషత్తులోనూ ఈరకమైన హింసాత్మకత విధించబడలేదు.

చెప్పే విషయం ఏంటంటే, మతాల మధ్య మార్పిళ్ళ పోటీ మంచిదికాదని. ప్రభుత్వం నిఖార్సుగా మతాతీతం గా వ్యవహరిస్తే ఈసమస్యలు వచ్చుండేవి కావు. షా బానో, ముద్గల్ లాంటి కేసుల్లో సుప్రీం కోర్టు యూనిఫాం సివిల్ కోడ్ ఆవశ్యకత గురించి సూచించినా ఏవో వంకలతో కాలం గడిపేస్తున్న తీరు దేశప్రయోజనలాకి ఏరకంగా ఉపయోగపడుతుంది?

2 comments:

  1. ప్రతిదానికీ అడ్డగోలు వాదన చేసే కొందరు కుహనా మేధావులకి శివ్ అనే వ్యక్తి నిన్న బాగా గడ్డి పెట్టారు.
    శివ్, నిన్న పర్ణశాల బ్లాగులో మీ వాదనలు చూశాం. అద్భుతం. మీ కామెంటుకి రెస్పాన్సుగా మహేష్ RSS గురించీ, PTI గురించీ, హవాలా గురించీ పిచ్చి వాగుడు వాగాడు. దానికి మీరు చెప్పిన సమాధానాలు చూసి అందరికీ పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చి, మేధావి కబుర్లు చెప్పే మహేష్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. మళ్ళీ నోరెత్తకుండా సైలెంటుగా తన కామెంటూ, మీ కామెంటూ డిలీట్ చేశాడు. మిమ్మల్ని అభినందిస్తూ రాసిన నా కామెంటు కూడా డిలీట్ చేశాడు. చర్చలో చాలా ముఖ్యమైన ఈ కామెంట్లు ఎందుకు డిలీట్ చేశావు, నీ అజ్ఞానం బయటపడిందనా అని అడిగితే అలా అడిగిన కామెంట్లు కూడా డిలీట్ చేశాడు. ఇప్పుడు కామెంటు మోడరేషన్ కూడా పెట్టుకున్నాడు. అందరికీ జోస్యం చెప్పే బల్లి కుడితిలో పడిందంటే ఇదే మరి.

    మహేషూ, నీకు దమ్ముంటే డిలీట్ చేసిన కామెంట్లు మళ్ళీ పెట్టి నీ వాదన కొనసాగించు.

    ReplyDelete
  2. మతాతీతం గురించి చాలా బాగా చెప్పారు సర్! ఇది ఏ మతం కాదు మానవత్వం అని తెలియజేసేలా.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.