Friday, October 10, 2008

కొవ్వలి లక్ష్మీనరసింహారావు

ఈనాడులో వచ్చిన గొల్లపూడి వ్యాసం. మధ్యమధ్యలో గొల్లపూడి చురకలు గమనించండి. గమనిక - కొవ్వలి వారికీ మాకూ , మావాడేనోయ్ అని చెప్పుకునే బంధుత్వం లేదు.

Friday, October 10, 2008 16: 18 hrs IST
http://uni.medhas.org/unicode.php5?file=http%3A%2F%2Fwww.eenadu.net%2Fhtm%2F2vnewfeatureshow.asp%3Fqry=10&reccount=12

వేయి నవలల రచయిత!ఇప్పటి తెలుగువారి సమస్య పిల్లలకి 'తెలుగు' తెలిసేలా చేయడం కొరకరాని సమస్య. కానీ ఏడెనిమిది దశాబ్దాల క్రితం తెలుగు లోగిళ్ళలో- ప్రతి వ్యక్తికీ చదవడాన్నీ విరివిగా ఆలోచించడాన్నీ మప్పి- భాషని వంటగదుల్లోకీ పడకగదుల్లోకీ రైలు కంపార్టుమెంటుల్లోకీ తోలుకొచ్చిన ఉద్యమకారుడొకాయన ఉన్నారు. ఈ తరానికి ఇలాంటి ఆలోచనే అబ్బురంగా కనిపించవచ్చు. ఇంతకీ ఆ ఉద్యమం - వ్యక్తి పేరు - కొవ్వలి. పూర్తిపేరు కొవ్వలి లక్ష్మీనరసింహారావు.


వాళ తెలుగిళ్ళలో తెలుగు పిల్లలకి తెలుగు రాదు. తల్లిదండ్రులూ తెలుగు రాదని బాధపడక ఇంగ్లిషు నేర్పించి గర్వపడటం అలవాటు చేసుకున్నారు. భాష 'రుచి' మరిచిపోయి, వృత్తికి భాష దోహదం చేస్తే చాలుననుకుని సరిపెట్టుకుని చాలా దశాబ్దాలయిపోయింది. అప్పుడే తేలికగా నాలుగైదు తరాల తెలుగువారు 'తెలుగు'ను నష్టపోయారు. భాష పారే సెలయేరు లాంటిది. పారకపోతే నీరు మురిగి మురికికూపం మిగులుతుంది. వాడుకలేని భాష వాడుక అవసరంలేని కారణానే- క్రమంగా చచ్చిపోతుంది. ఆమధ్య ఐక్యరాజ్యసమితి పరిశీలనల్లో కాలగతిలో మాయమయ్యే భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉందన్నారు. ఈ మాట ఆమధ్య ఓ అంతర్జాతీయ తెలుగు సభలో చెప్తే- పెద్దలు భుజాలు తడువుకున్నారు. మధ్యరకంవారు మన తెలుగుకేం భయంలేదని బోరలు విరిచారు. ఆత్మవంచన కూడా ఒక్కొక్కప్పుడు జాతికి సుఖంగా ఉంటుంది.

ఏడెనిమిది దశాబ్దాల నాటి మాట...

బొత్తిగా చదువురాని ఒకావిడ- తన బిడ్డ విసర్జనని మహాభారతం పేజీని చించి ఎత్తడం చూశారు కొవ్వలి లక్ష్మీనరసింహారావు. గుండె తరుక్కుపోయింది. ''నీ చేతిలో ఉన్న ఆ కాగితంలో ఏం ఉందో తెలుసా?'' అని ఆవిణ్ణి అడిగారాయన. తల అడ్డంగా తిప్పిందామె. కొవ్వలి ఆ క్షణంలో రెండే లక్ష్యాలను సిద్ధం చేసుకున్నారు. భాషని ఆకాశమార్గం నుంచి నేలమీదకి దింపాలనీ చదువుమీదకి మనసుపోని ఏ స్త్రీ అయినా చేత పుస్తకం పట్టుకు చదివేటట్టు చేయాలని. ఇది పెద్ద వైజ్ఞానిక విప్లవం. అప్పటికి ఛందస్సు నడుం విరగ్గొట్టే కవులింకా రాలేదు.

తండ్రి ఆయన్ని కోపరేటివ్‌ ట్రైనింగులో పెట్టాలనుకున్నారు. కానీ ఆయన రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో మాయమయ్యారు. కొన్ని వందల పుస్తకాల్ని ఆపోశన పట్టారు. క్రమంగా తను చెప్పాలనుకొన్న వాక్యానికి ఒక రూపాన్ని తెచ్చుకున్నారు. ఒక శైలి రూపుదిద్దుకుంది. అలా అందరికీ అర్థమయ్యేలాగా రాసిన వెుదటి నవల 'పల్లెపడుచు'. 'మాకొద్దీ తెల్లదొరతనం' అని రవి అస్తమించని బ్రిటిష్‌ ప్రభుత్వం మీద తిరగబడిన గరిమెళ్ళ సత్యనారాయణగారు ఆ నవలకి పీఠిక రాశారు. అంతేకాదు, 'దాసీపిల్ల' అనే నవలకి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు ముందుమాట రాశారు. అది కేవలం ప్రారంభం.

రోజుల్లో రాజమండ్రిలో పెద్ద ప్రచురణకర్త శ్రీ కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్స్‌ వారికి ఓ నవలని ప్రచురణకి ఇచ్చారు కొవ్వలి. దాన్ని పరిశీలనార్థం శ్రీపాద కృష్ణమూర్తిగారికి పంపారు వెంకయ్యగారు. ''భాషా ద్రోహంచేసే ఇటువంటి రచనలు వేస్తే వంశక్షయం అవుతుంది'' అని ఆయన హెచ్చరించారు. వెంకయ్యగారు భయపడి ఆ నవలని పక్కనపడేశారు. ఒకరోజు వీరాస్వామి అనే పోస్టుమాన్‌ ఉత్తరాల బంగీ ఇవ్వడానికి వచ్చి, అక్కడ పడి ఉన్న కొవ్వలి నవలని యథాలాపంగా తీసి వెుదటిపేజీలు తిప్పాడు. అంతే, పుస్తకానికి అతుక్కుపోయి, తన ఉద్యోగాన్ని మరిచిపోయి కొన్ని గంటలు- నవల పూర్తయేదాకా అక్కడే ఉండిపోయాడు. వెంకయ్యగారు గుండెదిటవున్న వ్యాపారి. సంప్రదాయపు ఆంక్షని పక్కనపెట్టి, ఓ పామరుడి ఆసక్తికి పట్టంగట్టారు. నవల ప్రచురితమైంది. ఆ నవల పేరు 'ఫ్లవర్‌ గరల్‌'. అదొక వెల్లువ. వెుదటి విడత కాపీలు ఖర్చయిపోయాయి. అప్పుడు కొవ్వలిని పిలిపించారు వెంకయ్యగారు. వంద పుస్తకాల ప్రచురణకి ఒప్పందం చేశారు. ప్రతిఫలం ఎంత? పన్నెండున్నర రూపాయలు. ఇది తక్కువ పైకం అనుకునేవారికి, ఆనాడు ఒక నవల వెల రెండణాలు లేదా పావలా. తర్వాత ఆరణాలు (37 పైసలు) అయింది. ఇది చౌక బేరం కాదు. తెలుగుభాష జనజీవనంలోకి చొచ్చుకువచ్చే ఉద్యమానికి ఇది పట్టాభిషేకం.

రచయిత సంఘజీవి. ప్రయత్నించినా నేలవిడిచి సాము చెయ్యలేడు. జిజ్ఞాసికి సమాజశ్రేయస్సు వ్యసనం. వితంతు వివాహాలూ బాల్యవివాహాలూ కులమత వర్ణాంతర వివాహాలూ- ఒకటేమిటి, నా తరంలో నాలాంటి కుర్రకారు విస్తుపోయి పుస్తకాలకు అతుక్కుపోయి చదువుకొనేటంత విరివిగా పేజీలు నిండాయి. రామవోహనరాయ్‌, వీరేశలింగం వంటి సంస్కర్తలు ఎంచుకున్న విప్లవ ధోరణిని, నేలబారు స్థాయిలో కొవ్వలి పదిమందికీ పంచడం ప్రారంభించాడు. ఆయన రచనలు దావానలంలాగా మూలమూలలనూ చుట్టివేశాయి.

కొవ్వలి స్ఫురద్రూపి. చక్కగా జర్దా కిళ్ళీ వేసుకుని, ఇస్త్రీ మడత కట్టుకుని, జట్కాలో కులాసాగా విహరించే దశ అది. చదివినవారందరూ ఆయనకి అభిమానులే. ముఖ్యంగా ఆడవాళ్ళు. ఆ రోజుల్లో ఎందరో ఆడవాళ్ళు 'హృదయేశ్వరా! మానసచోరా!' అంటూ ప్రేమలేఖలు రాసేవారు. చెలంగారు వీరి పాపులారిటీ మీద చమత్కరించిన మాట... 'ఆ రోజుల్లో- కొవ్వలి తమ కౌగిలిలో లేని ఆడపిల్లలుండేవారు కాదు'. అయితే కొవ్వలికి అదొక్కటే మరిచిపోలేని మహా శుక్రమహాదశ.

ఆయన రచనలకి ప్రచురణకర్తలు పోటీలుపడ్డారు. అయితే ఆయనకు వ్యాపార దృష్టి లేదు. నవలల సర్వహక్కులూ వారికి ఇచ్చేస్తూ వచ్చాడు.

ఎక్కడో పశ్చిమ బెంగాలులో పురూలియాలో ఒకమ్మాయి ఆయన రచనలు చదివింది. ఆమె మనసు ఆయనమీదకి పోయింది. ఆయనకి ఉత్తరం రాసింది. ఆవిడ పేరు లక్ష్మీదేవి. కొవ్వలికీ ఆమెతో పరిచయం పెరిగింది. ఫలితం... పురూలియాలో వారిద్దరికీ పెళ్ళి జరిగింది.

కొవ్వలి అప్పటి ప్రాచుర్యాన్ని చెప్పడానికి మిత్రులు వి.ఏ.కె. రంగారావు (2001లో) మాటలు... 'కొవ్వలి రెండు తరాలకి చదివే అలవాటుని కలుగచేశారు. రాజమండ్రి స్టేషన్లో, 60 ఏళ్ళక్రితం పుస్తకాలొక యాభై చేతపట్టుకుని ప్రతి కంపార్టుమెంటుకీ తిరిగి అమ్మినవ్యక్తి నా కళ్ళకి కట్టినట్టు జ్ఞాపకం. పుస్తకం వెల రూపాయి. పన్నెండణాలు అని బేరమాడితే తగ్గించేవారు. కొన్ని నవలల్లో శృంగారం పాలు ఎక్కువగా ఉంటుందని పెద్దలు మమ్మల్ని చదవనిచ్చేవారు కాదు'.

ఆ రోజుల్లో మడికట్టుకున్న పెద్దలకు ఇద్దరిమీదే ఆంక్ష- కొవ్వలి, చెలం. జాతికి ఒకరు అలవాటునీ ఒకరు ఆలోచననీ ప్రసాదించారు. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన చెలంగారి మాటల్లోనే వినాలి... ''నేను నూజివీడులో ఉండే రోజుల్లో ఒకబ్బాయి నన్ను పలకరించే ధైర్యంలేక దూరంగా నా వెనుక నడుస్తూండేవాడు. చివరికోరోజు నేను ధైర్యంచేసి 'ఏం కావాలి?' అని అడిగాను. అతను అధిక భక్తితో 'నేను బీదవాణ్ణి. మీ పుస్తకం ఒకటిస్తే దాన్ని చదివి తిరిగి మీకు ఇచ్చేస్తాను' అని అడిగాడు. నేను అతణ్ణి ఇంటికి తీసుకెళ్ళి నా పుస్తకం ఒకటి ఇచ్చాను. 'నేను అడిగింది చెలంగారి పుస్తకం కాదండీ, మీరు రాసిన పుస్తకం' అన్నాడు. నేను ఆశ్చర్యపడి చూశాను. 'నేనెవరనుకున్నావు?' అన్నాను. 'మీరు కొవ్వలి నరసింహారావు కాదా' అన్నాడు. 'కాదు. నేను చెలంని' అన్నాను. అతని ముఖంలో ఎంత disappointment!నాకు సాధ్యమైతే కొవ్వలి పుస్తకం ఒకటి కొని ఇచ్చేవాణ్ణి''- అదీ కొవ్వలి.

పుంఖానుపుంఖంగా రచనలు చేస్తున్న కొవ్వలి పేరు మద్రాసుదాకా పాకింది. రాజరాజేశ్వరీ ఫిలింస్‌ అధినేత కడారు నాగభూషణంగారూ వారి సతీమణి కన్నాంబగారూ ఆయనచేత సినిమా రచన చేయించాలని మద్రాసు పిలిపించారు. ఆ విధంగా కొవ్వలి వెుదటిచిత్రం 'తల్లిప్రేమ' రాశారు.

ఆయన రచయితగా నిరంకుశుడు. స్వాభిమానం కలవాడు. ఈ రెండూ సినిమారంగంలో చెల్లని విషయాలు. ఆ బ్యానర్‌కి రెండోచిత్రం 'దక్షయజ్ఞం'. సంభాషణా రచన పూర్తయ్యక నాగభూషణంగారితో చర్చకి కూర్చున్నారు ఓ రాత్రి. దక్షప్రజాపతికి క్లుప్తంగా సంభాషణలు రాశారు. ఆ పాత్రని ఎస్వీ రంగారావు చేస్తున్నారు కనుక మరింత విరివిగా మాటలుండాలన్నారు నిర్మాత. అది పాత్రౌచిత్యం కాదన్నారు రచయిత. మాటామాటా పెరిగింది. ''మేం డబ్బిస్తున్నాం. రాయాలి'' అని నిలదీశారు నాగభూషణం. అప్పుడు తెల్లవారుజామున నాలుగైంది. లేచి ఇంటికొచ్చేశారు కొవ్వలి. ఇంటికంటే రాజమండ్రికి.

ఆయనకి పాతికేళ్ళు వచ్చేసరికి 400 నవలలు ప్రచురితమయ్యాయి. ఆయన రచనలవల్ల ప్రచురణకర్తలు డబ్బు చేసుకున్నారుకానీ రచయితకేమీ మిగల్లేదు. భార్య ఆలోచనాపరురాలు. తామే పుస్తకాలను ప్రచురిస్తే? ఆ విధంగా కొవ్వలి బుక్‌ డిపో పుట్టింది. పుస్తకాల్ని ఎవరు వ్యాపారులకి చేర్చాలి? కొవ్వలే స్వయంగా వెళ్ళాల్సివచ్చేది. రచయితగా కాదు. తాను కొవ్వలికి ప్రతినిధినని చెప్పుకొనేవారు. ఈ సంస్థ నాలుగేళ్ళు నడిచింది. ఆయన వ్యాపారి కాడు. తత్కారణంగా వ్యాపారం అప్పుల్లోపడింది. రుణాలు పెరిగాయి. 1950వ సంవత్సరంలో ఓ రెండువందల రూపాయలు, ఏడాదిన్నర కొడుకునీ ఎత్తుకుని భార్యతో సహా మద్రాసు చేరారు.


సెంట్రల్‌ స్టేషన్‌కి ఎదురుగా రామస్వామి సత్రంలో కుటుంబాన్ని దింపి, మద్రాసులో పరిచయం ఉన్న ఒకే ఒక వ్యక్తి దగ్గరికి బయలుదేరారు. ఆయన రాజరాజేశ్వరీ ఫిలింస్‌లో పనిచేసేనాటికి అక్కడ ప్రొడక్షన్‌ మేనేజరు. పేరు డి.ఎల్‌. నారాయణ. అప్పటికి డి.ఎల్‌. 'దేవదాసు' తీసే ప్రయత్నంలో పురిటినొప్పులు పడుతున్నారు. కొవ్వలిగారిని చూసి కథ ఇస్తే అదే యూనిట్‌తో వెుదలెడతానన్నారు. కథలు కొవ్వలికి కొట్టినపిండి. అప్పుడే రాసిన 'మెత్తని దొంగ' నవలని ఇచ్చారు. అదే యూనిట్‌- అంటే దర్శకుడు వేదాంతం రాఘవయ్య, సంగీతం సుబ్బురామన్‌ ఇత్యాదులతో నిర్మాణం వెుదలైంది. గోవిందరాజుల సుబ్బారావు, రామచంద్ర కాశ్యప తదితరులు తారాగణం. దేవదాసులో ప్రముఖపాత్ర నటించవలసిన సావిత్రి ఇందులో గోవిందరాజులవారి పడుచుపెళ్ళాంగా చిన్న వేషం చేసింది. సినిమా- 'శాంతి'. ఆ సినిమాకి 1500 ఇచ్చారు. డి.ఎల్‌. భార్య పట్టుదలతో భర్తచేత స్థలం కొనిపించింది. డబ్బు లేకపోయినా పరువుగా బతకడానికి తమదంటూ ఓ నిలువ నీడ ఉండాలని. ఆ ఇల్లాలిది ఎంత సంకల్పబలవో- జీవితాంతం ఆ కుటుంబం ఆ పనే చేసింది. అక్కడే బతికింది. వెస్ట్‌ మాంబళంలో లక్ష్మీనారాయణ వీధిలో ఆ స్థలంలో ఓ పాక వేసుకున్నారు.

శాంతి చూసి బి.ఎస్‌.రంగా విక్రమ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థని ప్రారంభించి కొవ్వలి రచనతో 'మా గోపీ' తీశారు. తరవాత కాశీనాథ్‌ ప్రొడక్షన్స్‌వారి 'రామాంజనేయ యుద్ధం' (అమర్‌నాథ్‌, శ్రీరంజని). నిజానికి ఈ కథ రామాయణంలో లేదు. కల్పితం. తాండ్ర సుబ్రహ్మణ్యశాస్త్రి వీధి నాటకం ఆధారంగా సినిమా కథని రూపొందించారు. వారి సినిమాల్లో తొలిసారిగా వెండితెరకి పరిచయమైనవారు - సావిత్రి, కైకాల సత్యనారాయణ, పేకేటి శివరాం, చిన్నపిల్లగా చంద్రకళ.

ఒకపక్క సంతానం పెరుగుతోంది. తొమ్మిదిమంది పిల్లలు పుట్టారు. అందులో అయిదుగురు పోయారు. అవసరానికి ఆదాయం పెంచుకొనే ఆలోచనలేని వ్యక్తి కొవ్వలి. నవలలు మౌలికమైన కృషిగాకాక ఉపాధికి అవసరమయ్యాయి. ఓసారి ఆంధ్రపత్రికలో ఓ సీరియల్‌ 14 వారాలు వచ్చింది. నవలని డి.ఎల్‌. చదివి వెంటనే చిత్రాన్ని ప్రారంభించారు. ఆ సినిమా పేరు 'సిపాయి కూతురు'. ఆ సినిమాకి ఇచ్చిన పైకంతో కొన్న స్థలంలో రెండుగదులు వేసుకున్నారు. ఆ ఇల్లే ఆ కుటుంబానికి ఆద్యంతమూ 'పరువు'ని కాపాడే ముసుగైంది. ఇప్పటికీ జ్ఞాపకాల తోరణంగా మిగిలింది.

దాయానికి మించి అవసరాలు పెరిగిపోయాయి. సంసారం భారమైంది. ఎవరిముందూ చెయ్యిజాచే అలవాటులేని కొవ్వలికి గడ్డురోజులు ప్రారంభమయ్యాయి. ఎవరినీ సినిమా ఛాన్సు అడిగిన పాపానపోలేదు. పిలిస్తే తప్ప, ఏ సంస్థ గడపా తొక్కలేదు. తను రాసే రచనలమీదే పూర్తిగా ఆధారపడవలసి వచ్చింది. ఆ దశలోనే- 1953 డిసెంబరులో కొవ్వలి తండ్రి పోయారు. శవాన్ని తీయడానికి చేతిలో పైకం లేదు. రూపాయి వడ్డీకి వెయ్యి రూపాయలు అప్పుచేసి జరిపించారు. ఆ అప్పు తీర్చడానికి ఆయనకి 15 సంవత్సరాలు పట్టింది.

జీవితం మరొక మలుపు తిరిగింది. ఇది మలుపు కాదు, పెద్ద అగడ్త. దాటలేనంత లోతైనదీ దాటక తప్పనిదీను. పాత మద్రాసులో ఎం.వి.ఎస్‌. సంస్థ పుస్తకాలను ప్రచురించేది. ఉద్యమంగా ప్రారంభమైన రచన ఇప్పుడు ఉపాధి అయింది. అంతేకాదు, పెరిగిన సంసారానికి ఇది బొత్తిగా చాలని ఆదాయమయింది. పుస్తకం రాశాక ప్రచురణకర్త డబ్బు ఇస్తేనే ఇంటికి వెచ్చాలు వచ్చేవి. అవీ చాలీచాలనంత. కళని అవసరానికి కుదించినప్పుడు ఎంతోకొంత రాజీ సహజం. కానీ ఆ రోజుల్లో ఆయన రాసిన చారిత్రక, అపరాధ పరిశోధక రచనలు ఈనాటి హ్యారీపోటర్‌కి ఏమాత్రం తీసిపోనివి. రచయితని ఓ ఇంటి అవసరం ఏమాత్రం ఓడించని దశ అది. ఇంటిల్లపాదీ నవల పూర్తికావడానికి ఆతృతతో - ఆ మాట సరికాదు - ఆకలితో ఎదురుచూసేవారు. నవల పూర్తికాగానే డబ్బూ సరుకులూ వచ్చేవి. కానీ సమృద్ధిగా కాదు. పుస్తకానికీ పుస్తకానికీ మధ్య - ఇంటిల్లపాదీ కడుపులూ నకనకలాడిపోయేవి. అప్పుడు దారేది? ప్రతి రచనకీ 12 కాంప్లిమెంటరీ కాపీలు ఇచ్చేవారు. పుస్తకం మార్కెట్‌ ధర రూపాయి పావలా. కానీ ఆ పన్నెండు పుస్తకాల్ని పట్టుకొని పెద్దకొడుకు పానగల్‌ పార్క్‌, రాజకుమారి థియేటర్‌ పేవ్‌మెంట్‌మీద నిలబడి అమ్మేవాడు. ఎంతకి? ఒక్కొక్కటి 30 పైసలు. 12 పుస్తకాలకీ 3 రూపాయల 60 పైసలు వచ్చేది. దారినపోయే పాఠకులు కరుణిస్తే 4 రూపాయలు దక్కేది. ఆ డబ్బుతో 'పడి'బియ్యం, తండ్రికి పొగాకు, లవంగాలు, కొత్త నవల రచనకు స్కైర్‌ (24) తెల్లకాగితాలు తెచ్చేవాడు. మరో రెండుమూడు రోజులు గడిచేవి. ఇవి కొనగా ఒక రూపాయి మిగిలేది. ఆ రూపాయితో కుటుంబమంతా మరో నవల తయారయ్యేవరకూ బతకాలి. ఎలాగ? పిండిమరల్లో బియ్యం, అపరాలు ఆడేవారు. తెచ్చిన గిన్నెలకు ఎత్తగా చుట్టూ కొంత పిండి చేరేది. ఇది రకరకాల పప్పులు, ఇతర దినుసుల కలగాపులగం. దీన్ని 'వేస్ట్‌ మావ్‌' అనేవారు. సాయంకాలానికి ఆ పిండిని ఎంతోకొంత ధరకి అమ్మేవారు. అది ఇంటి మనుషులకని చెప్పడానికి మనసు ఒప్పేదికాదు. 'ఇంట్లో పశువుకని చెప్పు' అని పరువుకి 'అబద్దం' తెరని కప్పేది తల్లి. ఆ పిండిని తెచ్చాక- జల్లించి, కడిగి, చెత్తని ఏరి, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయముక్కలూ కలిపి, పల్చని నీళ్ళ మజ్జిగతో దోసెలు పోసి అందరికీ పెట్టేది ఇల్లాలు. వచ్చిన అతిథులెవరైనా ఉంటే- పరువుని కాపాడుకోడానికి ఆ కాస్త ఆహారంలోనే వారికి వాటా! అయితే, ఇంట్లో ముగ్గురు పసికందులు. వాళ్ళకి ఈ ఆహారం పడేదికాదు. మరి మార్గాంతరం? కొవ్వలి రెండుమూడు కిరాణా దుకాణాలకి వెళ్ళి బియ్యం నాణ్యాన్ని చూస్తున్నట్టుగా బేరం ఆడి, శాంపిలుగా చిన్నచిన్న పొట్లాలు కట్టించుకుని తెచ్చేవారు. అలా తెచ్చిన నాలుగైదు పిడికిళ్ళ బియ్యాన్ని ఉడికించి పసికందుల కడుపు నింపేదాతల్లి. ఏనాడూ ఇది కావాలనీ ఇదిలేదనీ అడగడం తెలియని లక్ష్మీదేవి ఆమె. మళ్ళీ కొత్త నవల తయారు - మరో నాలుగు రోజులు - పండగ భోజనం.

కొవ్వలి జీవితంలో రెండోదశ రచనలు పేదరికాన్నీ ఆత్మాభిమానాన్నీ కలనేతగా, పడుగుపేకలుగా అల్లిన 'జీవుని వేదన'కి పుట్టిన బిడ్డలు. కానీ ఆనాడు 'భయంకర్‌' అనే కలంపేరుతో రాసిన 'చాటుమనిషి'లాంటి అద్భుతమైన సీరియల్సూ 'విషకన్య'వంటి జానపదాలూ ఇరవైఅయిదు భాగాల 'జగజ్జాణ'- ఈ పేదరికం తెర పరుచుకోకుండా కళ్ళు తెరిచిన సుస్నిగ్ధ మందారాలు.

ఎప్పుడైనా - మరీ అరుదుగా - తప్పనిసరైనప్పుడు - నోరు విడిచి ఇద్దరినే అప్పు అడిగిన సందర్భాలున్నాయి. వారిద్దరూ - ముదిగొండ లింగమూర్తి, బోళ్ళ సుబ్బారావు. ఎంత అప్పు? ఒకటి రెండు రూపాయలు. ఆ డబ్బుతో ఎన్ని దోసెలు! అతిథులకి ఎన్ని సత్కారాలు! సమతుల్యంగా మరొకపక్క ఎంత సాహితీ వ్యవసాయం!

అప్పుడూ తన సెన్సాఫ్‌ హ్యూమర్‌ కోల్పోలేదాయన. తూట్లుపడిన, మాసికలు వేసిన పంచెల్ని కట్టుకుని 'నేను ఏక వస్త్ర ధారుడినే' అనేవారు భార్యతో. ఆ ఇల్లాలు గుండె ఆ సమయంలో ఎంతగా ఛిన్నమయేదో- కొద్దికాలానికే బయటపడింది. ఆయన సినిమా పరిచయాల్ని పురస్కరించుకొని ప్రీవ్యూలకీ ఇతర సభలకీ ఆహ్వానాలు వచ్చేవి. కానీ పరువయిన బట్టలు లేని కారణానే ఇల్లు దాటేవారు కాదు కొవ్వలి.

తలకుమించిన వేదనల కడలిలో తలమునకలై, బిడ్డలకి కడుపారా అన్నమైనా పెట్టుకోలేని తల్లి ఏమౌతుందో మనకు చరిత్ర సాక్ష్యముంది... చార్లీచాప్లిన్‌ తల్లి. అదే లక్ష్మీదేవి విషయంలోనూ జరిగింది. పిల్లల్ని సరిగ్గా పోషించలేని నిర్వీర్యతా, రేపు మీద బొత్తిగా ఆశలు లేని జీవితం ఆమె మనస్థిమితాన్ని ఫణంగా తీసుకున్నాయి. ఆమెకి మతి తప్పింది. ఆఖరి రోజుల్లో - ఆమె 45వ యేటికే - చెప్పరాని అపస్మారంలోకి వెళ్ళిపోయింది. వాస్తవం నుంచి మనస్సు తీసుకునే భయంకరమైన 'పరారి' మతి చలనం. కూతుళ్ళు రాజ్యలక్ష్మి, రత్నలత తల్లికి తల్లియైు సాకేరు. జడవేసి అన్నం తినిపించారు. బట్ట కట్టారు. ఇలాంటి కథలకి ఒక్కచోటే ఆటవిడుపు - మృత్యువు. మరో రెండేళ్ళకి ఆ ఇల్లాలు - తన 48వ ఏట కన్నుమూసింది.

కొవ్వలి? కలం కథలు చెప్పేది. కానీ చుట్టూ ఉన్న జీవితం క్రమంగా తన కలల్ని మట్టుబెట్టేది. అన్ని వేలమంది హృదయాలను ఆర్ద్రం చేయగలిగిన రచయిత హృదయం నిశ్శబ్దంగా విచ్ఛిన్నం కావడం ప్రారంభించింది. ఆ దుఃఖానికీ తన ఆత్మాభిమానం బలమైన తెరవేసి తనకే మిగిల్చింది. కొవ్వలి సహధర్మచారిణి లేని జీవితం - కేవలం రెండేళ్ళే సాగింది. ఆయన రాసిన 1001 నవల పేరు 'కవి భీమన్న'. (అవును, ఆయన వెయ్యి నవలలు రాశారు!) వేములవాడ భీమకవి జీవితం ఆధారంగా రచించిన చారిత్రక నవల అది. చివరి రోజున ద్రాక్షారామ భీమేశ్వరుడిని దర్శించుకున్నారు. మరునాడు (1975 జూన్‌ 8) వేకువజామునే జీవితం నుంచి సెలవు తీసుకున్నారు.


ద్రాసు, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు ఆయన కృషికి యోగ్యతా పత్రాలిచ్చాయి. కానీ తన కూతురుపెళ్ళికి పదివేలు కావాలని ఆయన - నోరువిడిచి - భారత విద్యాశాఖకి పెట్టుకున్న ఆర్జీకి సమాధానంగా నెలకి 50 రూపాయలిచ్చారు.

తెలుగు చదవడాన్ని కొన్ని తరాలకు కొట్టినపిండిగా మార్చడం ఎంతటి ఘనతరమైన విప్లవవో - తెలుగు అక్షరాలు కూడా పిల్లలచేత చదివించలేని దుస్థితిలో ఉన్న మనకి బాగా అర్థమవుతుంది. చచ్చినవారి సమాధుల మీద పువ్వులు వేయడం కేవలం సెంటిమెంటల్‌ రొటీను. మహాత్మాగాంధీకే ఆ తద్దినం తప్పలేదు. అయితే వంశక్షయమని ఈసడించే ఛాందసులనుంచి - తిండీ గుడ్డా పెట్టని ఈ చదువెందుకని తుంగలోతొక్కే దశకి తెలుగు వైభవం ప్రయాణం చేసిన నేపథ్యంలో ఇలాంటి రచయిత జ్ఞాపకం- తెలుగింటి పిల్లలకి రెండు తెలుగు అక్షరాలు నేర్పాలనే ఉత్సాహాన్ని కలిగిస్తే- కొవ్వలి ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతిస్తుంది.

- గొల్లపూడి మారుతీరావు12 comments:

 1. తెలుగు భాష ని బ్రతికించుకోవటమే ఆయనకి మనమివ్వగల సరైన నివాళి

  ReplyDelete
 2. వెయ్యి నవలలు రాసిన ఆ రచయిత తెలుగువాడు కావడం మన అదృష్టం. ఆయన దురదృష్టం. ఆయన పుస్తకానికి పీఠిక రాసిన గరిమెళ్ళ సత్యనారాయణ గారు కూడా అంతటి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించారట!

  ReplyDelete
 3. ఎంత దారుణమైన వాస్తవం
  ఎంత భయంకరమైన దారిద్ర్యం
  ఎంత ఉన్మత్త నాటక లీల
  సాహిత్యం సాహిత్యం కోసమే తప్ప జీవిక కోసం కాదనీ, కనీసం ఆత్మాభిధనుల కేమాత్రం జీవికనీయజాలదనటానికి ఎంతటి గొప్ప సజీవ ఉదహరణ.

  ఇలాంటి దయనీయ పరిస్థితులలో సమాజం పాత్ర ఏమిటి?

  మనోలోకంలో పులకరింతలు పొంది రససిద్ది అనే ఆనందాన్ని పొందిన చదువరులు చేయవలసిన భాధ్యతేమిటి?

  ఎన్ని ప్రశ్నలు ఏవీ సమాధానాలు.

  ReplyDelete
 4. చదువుతున్నంత సేపు మనోఫలకంలో ఎన్నో ప్రశ్నలు. ఏమని సమాధానం ఇవ్వగలము. ఉమాశంకర్ గారన్నట్టు మన తెలుగుని కాపాడుకోవడమే ఆయనకు మనమివ్వగల సరి ఐన నివాళి. చదివిన ప్రతి ఒక్కరిని ఆలొచింపచేసేలా ఉన్న ఈ వ్యాసాన్ని మా అందరికి అందించినందుకు కృతజ్ఙ్యతలు. కర్తవ్యం బోధించే ఇటువంటి వ్యాసాలు నేడు ఎంతైన అవసరం ఉంది.

  ReplyDelete
 5. బంతి, పూబంతి, చామంతి కొన్ని పుస్తకాల పేర్లు. స్త్రీలు, పైట చాటున, యువకులు బొడ్లో దాచుకుని, పెద్దలకు కనపడకుండా, చీకటి మూలల్లో, లాంతరు వెలుగులో కూర్చుని చదివేవారట.

  పెద్దలు, పరుపులకింద, దిళ్ళ కింద దాచుకుని మరీ చదివేవారు.

  కొన్ని కుటుంబాలలో ఆ పుస్తకాలమీద నిషేధం ఉండేది.

  "భయంకర్" పుస్తకాలు ౮౦ ల్లో కూడ చూసిన గుర్తు.

  తెలుగు భాషా వ్యాప్తికోసం శృంగారం రంగరించి వ్రాయడం ఎంతవరకు అభిలషణీయం?

  ఇక్కడ చెప్పుకునే కొవ్వలి రోజలలో పుస్తకాలని తూకానికి అమ్మేవారంటే ఎంత మంది నమ్ముతారు. అవును. ఆ రోజుల్లో, సి.వి కృష్ణ బుక్ డిపో, ఎన్. వి. గోపాల్ అండ్ కం, వీరాస్వామి అండ్ సన్స్, కాళహస్తి తమ్మయ్య (?) అండ్ సన్స్ ప్రచురణలన్ని తుకాలకే అమ్మేవారు.

  అదే ఎమ్.వి.ఎస్ పబ్లికేషన్స్ , మధుబాబు మొదటి మొదటి పుస్తకాన్ని ప్రచురించింది.

  రోడ్డు మీద పంపుల, కార్పరేషన్ నీళ్ళతో కడుపులు నింపుకుని జీవితాన్ని గడిపిన వారున్నారు నాటి మద్రాసులో!

  కడుపులో తెముల్తోంది, అంత దాఋణంగా వారి లేమిని వర్ణించాలా గొల్లపూడి?

  ReplyDelete
 6. ఈ కాలంలో అక్షరబద్ధమౌతున్న శృంగారంతో పోలిస్తే కొవ్వలివారి శృంగారం ఒక ముక్కులోకి రాదేమో ! అప్పటికి అదే "బాపురే" అనిపించి ఉండొచ్చు.

  చరిత్రలో సాహిత్యకారులు సుఖపడింది ఎప్పుడు ? జీవితంలో విజేతలు అవాలంటే అనేక రకాలుగా క్రమశిక్షణ ఉండాలి. సృజనాత్మక జీవులకి క్రమశిక్షణ తక్కువ. వారు జీవితంలో ఎలా విజేతలు కాగలరు ? నాకొక విషయం మీద టపా రాయాలనిపిస్తే అర్ధరాత్రి నిద్ర మానుకుని మఱీ రాస్తాను. నా కంటే సృజనాత్మకులైనవారిలో సహజంగా నా కంటే ఎక్కువ క్రమశిక్షణా రాహిత్యం కూడా ఉంటుందని నేనర్థం చేసుకోగలను.

  ఎంతమంది త్యాగఫలమో ఈ తెలుగు భాషాసాహిత్యాలు ! ఈ ప్రభుత్వానికి, ఈ డబ్బుపిచ్చి-మధ్యతరగతికీ చీమకుట్టినట్లయినా ఉందా ?

  ReplyDelete
 7. ఏ సంపుటమో సరిగా గుర్తులేదు, పానుగంటివారు తమ సాక్షి వ్యాసాల్లో రాసిన "కవుల కష్టములు" అనే ఉపన్యాసాన్ని చదవండి, ఒకసారి తీఱిక చేసుకుని.

  ReplyDelete
 8. సత్యసాయిగారూ ! మఱొక మాట. మీకూ, ఆయనకూ ఎక్కడో బీరకాయపీచు ఉండకపోదు. ఒకే యింటి పేరున్న వాళ్ళలో 24 శాతం రక్తం సరిపోలుతుందని ఈ మధ్య శాస్త్రవేత్తలు కనుగొన్నారట.

  ReplyDelete
 9. తాడేపల్లి గారు, మీరు చెప్పినది నిజం - అయినా లక్ష్మీ సరస్వతులొక్క చోట ఉండడం కష్టం కదా.
  కొవ్వలి నరసింహారావుగారికి మాముత్తాతగారు కజిన్ వరసని విన్నా. తర్వాత తరాలు బాగా దూరమై పోయాయి.

  ReplyDelete
 10. మీరు చెప్పిన ఉపన్యాసం శీర్షిక "కవి". అభినందన (న్యూ స్టూడెంట్స్ వారి ప్రచురణ) సాక్షి మూడవ సంపుటంలోది.. పుట ౧౫.

  ReplyDelete
 11. abba!manasunu piMDEsE vaastavaalanu kaLLaku kaTTinaTlu chuupiMchina vyaasaM.
  eMdarO mahanIyulu,aa rOjulalO tamaku unna vaMdannara ekaraalanu (saadhaaraNaMgaa 150 ekaraalu madhya taragati vaaLLu kaligi uMDE vaaru)karpuuramulaa karigiMchi vEsina chaaritraka saMGaTanalu .........
  vaari tyaaga phalaalE I naaTi telugu Baasha uniki.

  ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.