Saturday, October 04, 2008

మతప్రమేయం లేకుండా న్యాయం జరగదా?

నిన్న పేపర్లో వార్త - 4 held, Cop suspended; Centre Acts tough. 40 రోజులక్రితం, అగస్టు 25న కాంధమల్ జిల్లాలో ఒక నన్ ని గ్యాంగ్ రేప్ చేసారు. దానికి స్పందనగా ఇప్పుడు ఓనలుగురిని పట్టుకున్నారట, ఒక పోలీసుని సస్పెండు చేసారట. ప్రధానమంత్రిగారు, హోంమంత్రిగారు తమ ఒరిస్సా ప్రభుత్వానికి తమ అసంతృప్తిని తెలిపారు. తమ ప్రధానమంత్రిగారు ఇటీవల విదేశపర్యటన చేసినప్పుడు, యూరోపియన్ ప్రభుత్వాధినేతలు క్రష్టియన్ల మీద భారతదేశంలో జరుగుతున్న హింస తమ నిరసన వెలిబుచ్చారు. దాంతో బయటి దేశాల్లో మన కి చెడ్డపేరొచ్చిందని బాధపడి పోయారా పెద్దాయన.

వివరాలు చూస్తే, 2000 మంది జనాలు దాడిచేసి ఫాదర్ని కొట్టి నన్ ని ఈడ్చుకెళ్ళి రేప్ చేసారని కధనం. పైగా భారత్ మాతాకీ జై అని నినాదాలతో తీసికెళ్ళారట. మాతా అని అరిచినప్పుడైనా తాము తీసుకెళ్తోన్నది ఒక తల్లినే అన్న స్పృహ వాళ్ళకి కలగక పోవడం విచారకరం. స్త్రీలని గౌరవించే సాంప్రదాయం మనదని గర్వించే వాళ్ళెవరైనా ఉంటే సిగ్గుతో తలదించుకోండి. మనుషులమేనా అని అనుమానం వస్తోంది. ఒక అమాయకురాలు ఇలాంటి దారుణానికి గురవడం నాకు అంత బాధకలిగించలేదు. అయ్యో అనిపించింది. కానీ నిజంగా బాధకలిగించిన విషయమేమిటంటే, ఇంత పెద్దలెవెల్లోకి విషయం వెళ్తే కానీ ఒకబాధితురాలికి న్యాయం జరిగే దిశగా చిన్న అడుగుకూడా పడకపోవడం. ఎంతమంది బాధితుల గోడు విదేశాల అధినేతలకి, తద్వారా మన దేశాధినేతలకి చేరుతుంది? కులమతాలో, ధనమో, పలుకుబడో ఉంటేకానీ కనీసన్యాయం జరగని పరిస్థితిలో మన సామాన్యప్రజలున్నారా? ఇవీ జవాబురావల్సిన ప్రశ్నలు. అంతేకానీ మతాలూ మట్టిగడ్డలూ కాదు.

ఒకసారి మళ్ళీ ఘటన విషయానికొస్తే, పోలీసులున్నారట కానీ వాళ్ళేమీ చేయలేకపోయారట (వార్తా కధనం రుచిగా ఉండడం కోసం - పోలీసులు ఆవిడ అరుపుల్ని పట్టించుకోలేదు, మొహం తిప్పుకున్నారు అని రాసారు). పాపం పోలీసులు పట్టించుకుంటే ఒక సమస్య, పట్టించుకోకపోతే ఇంకో సమస్య. ఎలాగైనా వాళ్ళబతుకులు అరిటాకులే. ఒక చదువుకున్నాయనే ఆమధ్య జరిగిన ముంబై బాంబు పేలుళ్ళ సందర్భంగా ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో రాస్తూ పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని రాసారు. చదవేస్తే ఉన్నమతి పోసినట్లు, ఆధారాలని బట్టి వ్యవహరించకుండా సెక్యులరిజం చూపెట్టుకోవాలంటే పట్టుకున్న ప్రతీ ముస్లింకి ఒక నిర్ణీత నిష్పత్తిలో వేరే మతస్తులని కూడా అరెస్టు చేయాలన్న ధోరణిలో రాసుకుంటూ పోయాడు. పైగా విమానాశ్రయాల్లో ముస్లింల టోపీలెత్తి మరీ పరీక్షించారని బాధపడిపోయాడు. ఆయనకి తెలియదా మతంతో సంబంధం లేకుండా బట్టలిప్పి మరీ పరీక్షిస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు. ఈరకం లౌకికవాదం ఫేషనయి పోయింది. చదువరి టపాకొచ్చిన వ్యాఖ్యలలో ఈరకం వాదాలు కనిపిస్తాయి. హిందువులది తప్పు, గుజరాత్ లో కడుపు చీల్చి చంపారు ..., గణాంకాలూ, అర్ధసత్యాలూ, ఏకపక్షవాదనలు.. అన్నీ. హైదరాబాదు అల్లర్లప్పుడు కూడా ఒకవర్గంవారు ఇలాంటి అకృత్యాలకి పాల్పడ్డారని వినేవాళ్ళం. హింసా ప్రవృత్తి కి కులమతాలతో సంబంధంలేదు. ఒళ్ళుమండితే పరశురాముడైనా హింసకి ఒడంబడుతాడు. పోలీసు వ్యవస్థని దానిమానాన దాన్ని పనిచేయనిస్తే చాలా సమస్యలు మొగ్గదశలోనే పోయుండేవి.

ఇది రాస్తుంటే ఒకవార్త చదివా. బలే మజా వచ్చింది. బీనా (మధ్యప్రదేశ్)లో గైల్వే ఆస్తుల ఆక్రమణదారులచేత ఖాళీ చేయిస్తుంటే అడ్డుపడ్డాడని ఒక పార్లమెంటు సభ్యుడిని చితకబాది హాస్పిటల్లో పాడేసారట. అన్యాయానికి, అక్రమాలకి కొమ్ముకాసేవాళ్ళకి ఇదే సన్మానం చేస్తే చాలా సమస్యలు తగ్గుతాయి.

ఈటపా రాస్తూంటే, ఈరోజు వార్త - ఒరిస్సాలో ఇంకో అమ్మాయిని సామూహికంగా చెరిచారట. ఆఅమ్మాయి క్రీష్టియన్లు నడిపే ఆర్ఫనేజ్ లో ఉంటుందట. ఆర్ఫనేజ్ మీద దాడి చేసినప్పుడు ఈదుష్కార్యం చేసారట. ఎటొచ్చీ ఆఅమ్మాయిని క్రీష్టియన్ అనుకున్నారట కానీ ఫాదర్ మాత్రం ఆఅమ్మాయి హిందువని చెప్పాడు. మళ్ళీ పైన చెప్పినదే తిరిగి చెప్తున్నా. క్రీష్టియనా, హిందువా అని చూడాల్సిన అవసరం ఉందా- మనసాటి ఆడబడుచే కదా వెంటనే దోషుల్ని పట్టుకునే/పట్టించే పని చూడడం మానవ ధర్మం కదా.

అసలు ఏదైనా ఘోరం జరిగనప్పుడు, వీళ్ళు చేసారా, వాళ్ళు చేసారా అన్న మీమాంస పక్కన పెట్టి, తప్పు చేసినవాడిని శిక్షించే మార్గం లేదా. ఉంది కానీ ఎవరీకీ పట్టదు. రోజువారి ఎందరో అమాయకులు రకరకాల అన్యాయాలకీ, అక్రమాలకీ గురవుతున్నారు. దీనికి మూలం తప్పుచేసినవారిని హీరోల్లాగా చిత్రీకరించడం. వాళ్ళకి అసెంబ్లీ, పార్లమెంటుసీట్లివ్వడం, వాళ్ళమీద సినిమాలు తీయడం ఫేషన్. కలకాలం మామూలు మనిషిగా ఉండేకన్నా, మూడునిమిషాలు ముమైత్ ఖాన్ లా వెలగడం మిన్న అన్న భావన జనాలకొచ్చేసింది. మతకలహాలకి మూలం మతాలమధ్య పోటీతత్వం. మొదట్లోనే మతాన్ని దానిమానాన దాన్ని వదిలేస్తే ఇన్ని సమస్యలుండేవి కాదు. ఎప్పుడైతే ఒకమతంవాళ్ళని పాపం అని చంకనెత్తుకున్నారో అప్పటినుండి మనకీ సమస్యలు. లౌకికవాదం అంటే అన్ని మతాలకీ అతీతంగా ఉండాలని. అంతేకానీ తక్కువ జనాభావాళ్ళు ఇష్టులని ప్రవర్తించడంకాదు. అదేంటో ఏంచేసినా ఒకవర్గం వాళ్ళ కొమ్ముకాయడమే సెక్యులరిజం అని చదువుకున్న వాళ్లకి చాలా బలంగా అనిపించడం శోచనీయం. చదవేస్తేఉన్న మతిపోవడమంటే ఇదే. మీఇంట్లోనే ఇద్దరు పిల్లలుంటే, వాళ్ళల్లో ఒకరిని వరుసగా సమర్ధించి చూడండి - మీరు న్యాయంగా తీర్పు చెప్పినా కూడా- నాన్న (అమ్మ) ఎప్పుడూ ఇంతే ఎప్పుడూ తమ్ముడి (అక్క)నే సప్పోర్టు చేస్తాడు అని భావిస్తారు. అన్యాయంగా ఒకరినే సమర్ధించి చూడండి! ఒక కుటుంబం లోనే ఇలాఉంటే, ఊరిజనాలమధ్య అవగాహన, సుసంబంధాలూ ఎంత కష్టం?

తమమతంలో వివక్షకి గురయినప్పుడు మతం మారితే తప్పేమిటి అని చాలామంది వాదిస్తున్నారు. మతం మారిన తర్వాత కొత్తమతంలో వీరికి వివాహాదుల విషయంలో సమాన స్థాయి లభిస్తోందని వీరు భావిస్తోంటే, వీరికన్నా ఉష్ట్రపక్షి బెటరు.

ఇప్పుడైనా ప్రభుత్వం మతాలని పక్కన పెట్టి దేశం ముఖ్యం, మతాలేమైనా మాకు పర్వాలేదు అని పాలిస్తే చాలా సమస్యలు పరిష్కరించబడతాయి. మనుషులమధ్య అడ్డుగోడలు కల్పించే మతాలెందుకు?

4 comments:

  1. నిజంగా పోలీసుల్ని వాళ్ల పనులని వాళ్లని చేసుకోనిచ్చి... ప్రభుత్వం ఏ మతానికి సపోర్ట్ చేయకుండా ఉంటే--- ఇంత చర్చించాల్సిన అవసరం ఉండేది కాదు...
    అదేంటో -- నువ్వు తప్పు చేశావు అని ఎవరైనా అంటే... అంతకుముందు నువ్వు కూడా అదే చేశావు కదా అని వాదిస్తున్నారు తప్ప, అరే నేను చేస్తున్నది తప్పే అని ఆలోచించుకోవాలి అనే స్పృహ ఎవరికీ ఉండడం లేదు...

    ReplyDelete
  2. తప్పులెంచువారు తమ తప్పులెంచరు
    ఉర్వి జనులకెల్ల ఉండు తప్పు.
    విశ్వదాభిరామ వినురవేమ.
    ప్రజలకి న్యాయం చేకూర్చాల్సిన పార్టీలే ప్రాంతియ పార్టీలుగా, మత పరమైన పార్టీలుగా అవతరిస్తున్నప్పుడు న్యాయానికి మరి వేరే న్యాయమెందుకని మత ప్రమేయం తన స్థానం అక్కడ కూడా నిలదొక్కుకొంటోంది.

    ReplyDelete
  3. "మతం మారిన తర్వాత కొత్తమతంలో వీరికి వివాహాదుల విషయంలో సమాన స్థాయి లభిస్తోందని వీరు భావిస్తోంటే, వీరికన్నా ఉష్ట్రపక్షి బెటరు." - సరైన మాట చెప్పారు.

    కవి కోకిల గుర్రం జాషువా కూడా క్రైస్తవంలోని వివక్షను తట్టుకోలేక ఆ మతానికి దూరం జరిగాడని చదివాను."అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండీ, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు." ఇది వికీపీడియాలోది

    ReplyDelete
  4. మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. తప్పు ఎవరు చేసినా తప్పే. అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించడానికి ధనమో, మతమో, నాయకుల మద్దతో కావాల్సి రావడం అత్యంత హేయమయినది.
    మతమార్పిడి మీద మీ అభిప్రాయాలతో ఏకీభవించలేను. యెవడి ఇష్టం వాడిది. ఎవడికి ఏది మంచిదో వాణ్ణే నిర్ణయించుకోనియ్యండి. ఓపిక ఉంటే మీ(మన) మతం ఎందుకు గొప్పదో చెప్పండి (ప్రచారం చేయండి). మీరు చెప్పేది "కాంగ్రేసు వాడు డబ్బులు తింటున్నాడు తెలుగుదేశానికి వోటేయ" మని చంద్రబాబు చెప్పినట్టుంది.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.