Wednesday, May 30, 2007

పుచ్చి ఇచ్చుకోండి!

ఈ టైటిల్ ఎలా ఉంది? బాగా కుదరలేదు అని అనిపిస్తోందా? అదే నేను చెప్పబోయేది. 'ఇచ్చిపుచ్చుకోండి' అంటే ఉన్న సొగసు 'పుచ్చి ఇచ్చుకోండి' అనడంలో లేదు. అవ్వడానికి రెండూ ఒకే నిర్మాణం కలిగి ఉన్నాయి. పదమే కాక దాని అర్ధంలో కూడా, పుచ్చుకోవడం కన్నా ముందు ఇవ్వడమే సొగసైన, సబబైన పని అని అవగతం అవుతుంది. ఉదాహరణకు, అప్పే తీసుకోండి. మనం ఎవరికీ అప్పు ఇవ్వకుండా వెళ్ళి వసూలు చేయగలమా? కొండొకచో ఇచ్చిన అప్పు చచ్చినా వసూలుచేయలేకపోవడం జరుగుతుంది. మర్యాదైనా, ప్రేమైనా, మరేదైనా సరే, ఇదే సూత్రం. తిట్లూ, విమర్శలూ, లెంపకాయల్లాంటివైతే ఈసూత్రాన్ని అతిగా పాటిస్తాయి. ఇవి ఇచ్చిచూడండి, చక్రవడ్డితో సహా వెనక్కొస్తాయి. మనం ఇవ్వకపోయినా మనకి దొరుకుతున్నాయి ఈరోజుల్లో. అలాంటిది, ఇస్తే తప్పించుకోగలమా?

'తాతకి పోసిన బోలె తరతరాలా' అన్న సామెత కూడా ఈభావననే సూచిస్తుంది. మనం మన తాతకి చేసిన మర్యాద, మన మనవడు మనకి చేస్తాడని సామెతకి అర్ధం. ఇది inter-generation plane లో పనిచేసే give and take సూత్రం. గమనించండి, ఇంగ్లీషువాడు కూడా ముందు గివ్వమనే అన్నాడు. టేకండ్ గివ్వనలేదు.

ఇవ్వడం పొందడంకన్నా ఆనందమిస్తుందన్న విషయాన్ని మీద యండమూరి హోం పేజీలో సంకల్పం అనే కథ చాలా హృద్యంగా చెప్తుంది. ఈకథలో ఒక పాప (అమూల్య) వాళ్ళ స్కూలులో టీచరు 'తీసుకోవడం కన్నా ఇవ్వడంలో ఆనందం ఉంది' అని చెప్పిన విషయం మనసుకు పట్టించుకుని డబ్బులు దాచి అవసరమున్న వేరే వాళ్ళకి ఏదైనా కొనిస్తోంటుంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు టీచరు చెప్పింది పూర్తిగా అర్ధచేసుకుంటుంది. ఇంతలో అమూల్య అన్నయ్యకి మెదడులో కంతి వస్తుంది. నిస్సహాయ పరిస్థితుల్లో వా ళ్ళ నాన్న, 'ఆ లోక జన రక్షకుడి సంకల్పమే వీడ్ని రక్షించగలద'ని అంటాడు. అదివిని తను దాచుకున్న చిల్లర డబ్బులు తీసుకుని 12 రూపాయలకి సంకల్పం కొందామని రకరకాల షాపులు తిరిగి చివరికి ఒకచోట ప్రముఖన్యూరోసర్జన్ దృష్టిలో పడుతుంది. ఆయన అమూల్య అన్నయ్యకి వైద్యం చేసి, ఆమె 12 రూపాయలివ్వబోతే వద్దని, ఇవ్వడంలోని ఆనందాన్ని గ్రహించానని చెప్తాడు. (ఇది మూలకథకి నికృష్ఠ, నీరస సంగ్రహకథనమని గ్రహించగలరు).

మన పూర్వీకులకి ఇవ్వడంలోని ఆనందం తెలుసు అనుకొంటా. దానాలు, ధర్మాలు అని అందుకే పెట్టినట్లున్నారు. మామూలుగా అయితే చెయ్యరని పాపం, పుణ్యం, స్వర్గం, నరకం అని 'రంభా- సలసల కాగే నూనె' పథకాన్ని(ఇంగ్లీషు వాడి కేరెట్టూ-కర్రా పద్ధతి) ప్రవేశపెట్టారు. పైగా తీసుకునే వాడి చెయ్యెప్పుడూ కిందే ఉంటుంది (ఒక్ఖ ముక్కుపొడుం విషయంలో తప్ప) అని తీసుకోవడంలో మర్యాద తక్కువని సూచించారు.

మాచిన్నప్పుడు రోజూ పొద్దున్నా, సాయంత్రం భోజనాల వేళ దాటాకా ఇళ్ళకి బిచ్చగాళ్ళు వస్తోండేవారు. తినగా మిగిలిన పదార్ధాలు తిసుకెళ్తోండెవారు. పనిమనిషులకి కూడా మిగిలిన అన్నం కూరలు ఇస్తోండే వారు. ఫ్రిడ్జులొచ్చాకా జనాలు మురగబెట్టుకుని తింటున్నారే తప్ప, ఎవరికీ పెట్టలేకపోతున్నారు. పెట్టడానికి చేతులు రావట్లేదు. అటు బిచ్చగాళ్ళు, పనిమనుషులు కూడా అన్నాలు తీసుకెళ్ళడానికి సుముఖత చూపడంలేదు. అందుకు ఒక కారణం ఎప్పుడో ఒక బిచ్చగాడో, పనిమనిషో చెప్పారట, ఫ్రిడ్జుల్లో ఒకటి రెండు రోజులు పెట్టి తర్వాత ఇస్తోంటే తొందరగా పాడయిపోతున్నాయి, తినలేకపోతున్నాం అని. అదీ కాక పాతకాలంలో తిండితప్ప వేరే అవసరాలు తక్కువ. ఇప్పుడు, వేరే అవసరాలు ఊరిస్తున్నాయి. ఇప్పుడు చిల్లర కోసం ఎక్కువ అడుక్కొంటున్నారు. అన్నట్లు అడుక్కోవడం అంటే గుర్తొచ్చింది, ఆమధ్య ఒకావిడ అడుక్కోగా వచ్చిన డబ్బులతో అదేదో ఊళ్ళో గుడిలో కావల్సిన సౌకర్యాలు కల్పించిందట. అసలు మనమే వెళ్ళి ఆవిడ దగ్గర కొంత దానగుణం అడుక్కోవాలి.

ఇవ్వగలగడం, ఇవ్వడం అంత సులభం కాదు. ఎపుడైనా, ఇవ్వాలనిపించింతర్వాత కొంత సేపు ఆగి ఛూసారా? మీరు మొదట రూ.1000 ఇవ్వదలుచుకుంటే, ఇచ్చే సమయానికి, అసలు ఇస్తామో లేదో కూడా డౌటే. అందుకే ఇంద్రుడు మారువేషంలో వచ్చి కర్ణుడిని దానమడిగితే, ఆయన, కూడదని తెలిసినా, ఎడంచేత్తోటే ఇచ్చేసాడట - మళ్ళీ కుడి చేతిలోకి మార్చుకొనే లోపల మనసు మారిపోతుందేమోనని.

ఇచ్చి పుచ్చుకోవడం విషయంలో, చిన్నప్పుడు చదువుకున్న తిక్కన భారతం పద్యం ఒకటి నాకెప్పుడూ గుర్తుకొస్తుంది.

ఒరులేయవియొనరించిన
నరవర! అప్రియము తన మనంబునకగు, తా
నొరులకవి సేయకునికియె
పరాయణము పరమధర్మపథములకెల్లన్


(ద్వానా శాస్త్రి గారు, ఆయన సంకలనం చేసిన, 'మంచి పద్యాలు' (విశాలాంధ్ర 1998 ప్రచురణ) పుస్తకంలో వ్రాసిన వ్యాఖ్యానం: ఇతరులు మనని అవమానిస్తే మనకి కోపం వస్తుంది. కానీ మనం ఇతరుల్ని అవమానిస్తాం. ఇతరులు మనకి అన్యాయం చేస్తే నిందిస్తాం. కానీ మనం మాత్రం ఇతరులకి అన్యాయం చేస్తాం. ఈ పద్ధతి కూడదని తిక్కన మహాభారతంలో చెప్పిన పద్యం ఇది)

ఈ పద్యంలో చెప్పిన నియమాన్ని సాధ్యమైనంత వరకూ పాటించడం వల్ల మన దైనందిన జీవితం సాఫీగా గడిచిపోతుందని నా అనుభవం. కొన్ని సందర్భాల్లో ఈ సూత్రం పనిచెయ్యదు సరి కదా మనం ఉల్టా చేయ్యడానికి సిద్ధపడిపోతాం. ఉదాహరణకి, మేం డిగ్రీలో జేరిన కొత్తలో మా సహాధ్యాయి మంచి చురుకుగా ఉంటూ అందరినీ ఒరేయ్, అరేయ్ అనేసి మాట్లాడుతూండే వాడు, అప్పుడే పరిచయమైన వాళ్ళని కూడా, మేం ఏవండీ అని సంబోధిస్తూన్నప్పటికీ. అప్పుడు మేం టేకండు గివ్వు పద్ధతి అవలంబించాలని అర్ధమైంది. అలాగే మెతగ్గా ఉంటూంటే, చాలామంది నెత్తికెక్కుతోండేవాళ్ళు. అప్పుడు బురద పామైనా బుస్సుమంటూంటేనే దానికి గౌరవం అని విని కొద్దిగా నోరుచేసుకోవడం నేర్చుకున్నాం. అదీ ఆత్మరక్షణకే, దాడికి కాదు.

ఇచ్చిపుచ్చుకోవడం, ఇంకా తిక్కన గారు చెప్పిన పరమధర్మాలనూ కొద్దిగా విశ్లేషిస్తే, మనం ఎదుటివారినించి ఆశించేది మనం పాటించాలన్న నియమం కనిపిస్తుంది. కానీ నిజజీవితంలో ఈ నియమానికి తిలోదకాలు ఇచ్చేవాళ్ళని తరచూ చూస్తాం (మనం కూడా అడపా దడపా చేసే ఉంటాం). వాళ్ళు తామనితామే ప్రత్యేకమైన వాళ్ళుగా భావించుకోవడం వల్ల ఇది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా క్యూని పాటించకుండా తమని దాటుకెళ్టే తెగ బాధ పడిపోతారు. కానీ వాళ్ళే చెల్లుబడైన చోట ఎంతమందినైనా దాటుకుంటూ వెళ్ళిపోగలరు.

కొన్ని ప్రత్యేక సందర్భాలలో తప్ప, ఇతరత్రా ఇచ్చిపుచ్చుకొనే (తిరిగి పుచ్చుకోలేని సందర్భంలో కూడా ఇవ్వడం) పద్ధతి సరైనదని, ఈ ప్రపంచం మొత్తం గివె అండ్ టేకె (నటురె, పుటురె గుర్తొచ్చిందా?)పద్ధతిమీద నడుస్తుందని, అందరూ ఆ పద్ధతి పాటిస్తే చాలా సమస్యలు రానే రావని నానమ్మకం.

మనం మారడానికి సమయం కావాలి కాని, ఈవ్యాసం శీర్షిక మార్చడానికి అవసరం లేదుగా. కాబట్టి, ఇక పై ఈవ్యాసం పేరు- 'ఇచ్చి పుచ్చుకోండి'.

7 comments:

  1. చదువుతున్నది ఆదివారం ఈనాడు సంపాదకీయమా అనిపించింది.

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  2. బాగా చెప్పారు. ఇది చదువుతుంటే "మా ఇంటికొస్తే మాకేమి తెస్తారు,మీ ఇంటికొస్తే మాకేమిస్తారు" గుర్తుకొస్తుంది.

    క్యూ లో నిలబడ్డప్పుడు ఇంచుమించు అందరం ఒకలాగే ఆలోచిస్తామనుకుంటా!ముందు వాళ్ళు మనల్ని ముందుకు వెళ్ళనివ్వాలి, వెనక వాళ్ళు మాత్రం ముందుకు రాకూడదు!!మనిషి బుద్ది అంతే!!!

    ReplyDelete
  3. పుచ్చుకోవడం లో ఉన్న మజా ఇవ్వడం లో లేదు. ఎందుకంటే ఈ దునియా నే లాభాపేక్ష మీద నడుస్తుంది. సామాన్య జనాలెవరూ అతీతం కాదు.
    బాగా రాశారు.

    ReplyDelete
  4. అందరికీ కృతజ్ఞతలు. అవును ప్రవీణ్. తీసుకోవడంలో చాలా మజా ఉంది. అందులో పరాయి సొమ్మంటే పరమేశ్వరుడికి (కృష్ణుడికి) కూడా తీపికాబట్టే ఇంట్లో పాడి పంటా ఉన్నా గొల్లభామలింట్లో పాలూ, వెన్నా దొంగిలించేవాడట (ఒక కవి చమత్కారం). అందరూ పుచ్చుకోవాలనుకుంటే, ఇచ్చేవాళ్ళు కరువైపోతారు కదా. అందుకని, మనమే ఒకసారి, ఇస్తూ ఒకసారి పుచ్చుకొంటే బాగుంటుందని కవి(అంటే నా) హృదయం.

    ReplyDelete
  5. ఇలా ఇవ్వడంలో అమెరికా వాళ్ళు (ప్రస్తుతం) మనకంటే చాలా ముందున్నారనిపిస్తుంది. మన కన్నా ముందు వెళ్ళినట్లయితే, ఎవరయినా కానీ తలుపు తెరిచి పట్టుకుంటారు. ఎక్కడ కార్లు ఉన్నా వరుస పద్ధతిని (దాదాపుగా) పాటిస్తారు. దారి, గౌరవం ఇవ్వడం చాలా ఎక్కువ. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు కూడ ఎక్కువ.

    ReplyDelete
  6. ఏమోనబ్బా సత్యసాయి గారూ, ఇచ్చి పుచ్చుకోడం అందరికీ కుదిరేది కాదనుకుంటా.. ఇప్పుడు చూడండి ఈ జాబు రూపంలో మీరు మాకో బహుమతినిచ్చారు, మేం పుచ్చుకున్నాం. వ్యాఖ్య రూపంలో మేం మీకోటిచ్చినా అది పుచ్చుకున్నాక ఇస్తున్నట్టేగా!!:)

    ReplyDelete
  7. చదువరిగారు మీ వ్యాఖ్యకి అందులోని అంతర్లీనమైన మెచ్చుకోలుకి కృతజ్ఞతలు.
    అయ్యా మీరు వ్యాఖ్య 'ఇవ్వ'బట్టే కదా నా కృతజ్ఞతలు 'పుచ్చు'కొన్నారు? నేను టపా 'ఇచ్చా'కే కదా మీ వ్యాఖ్య 'పుచ్చు'కొంట.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.